వడ్రంగి పిట్ట – వయ్యారి కొంగ

0
6

[dropcap]హా[/dropcap]రిక స్కూల్ బస్సులో నలభైమంది పిల్లలు విహారయాత్రకని బయలుదేరారు. వారితో పాటు ఇద్దరు ఉపాధ్యాయులు కూడా వున్నారు. బస్సుకు ఎదురుగా ఒక గేదె పరుగెత్తుకొచ్చింది. డ్రైవర్ గేదెను తప్పించటానికి సడన్ బ్రేక్ వేయగానే కొంత మంది పిల్లలు సీట్లోనే ఎగిరెగిరి పడ్డారు.

“ఏంటంకుల్ మమ్మల్ని పడేస్తావా ఏంటి? అన్నాడు సురేష్ అనే పిల్లవాడు.

“నేనేం పడెయ్యనయ్యా. మీరే సీట్లో కూర్చుని సెలవలనీ, కొత్త చొటు చూడబోతున్నమన్న సంబరంలో తుళ్లి తుళ్లి పడుతున్నారు. మీ అరుపులతో, కేకలతో, నా చెవులు హోరెత్తిపోతున్నాయి. ఇవ్వాళ మన సార్ లెవరూ మిమ్మల్ని ఏమీ అనటం లేదు. మీ ఇష్టానికి మిమ్మల్ని విడిచిపెట్టేశారు” అన్నాడు డ్రైవర్ నవ్వుతూ.

“మనం వెళ్ళేది విహార యాత్రకు. పిల్లకాయలు బాగా సరదాగా వున్నారు. పోనీలే అని వదిలేశాం” అన్నారు మాష్టారుగార్లు.

మళ్లీ అంతలోనే ఒక మాస్టారుగారు “హాయ్ పిల్లలూ ఇప్పటి దాకా బాగా గోల చేశారు. ఇంక ఆపేసెయ్యాలి. మీరు కొంత మంది జట్లు జట్లుగా చేరి అంత్యాక్షరి ఆడండి. మరి కొంత మంది పొడుపు కథలు వేయండి. మరో జట్టు వాళ్లు మీ కొచ్చిన తెలుగు పద్యాలు పాడండి. మేమూ వింటాం” అని సలహా ఇచ్చారు.

ఆ మాట చెప్పీ చెప్పటంతో కొంత మంది పిల్లలు ఒక జట్టుగా చేరి అంత్యాక్షరి మొదలు పెట్టారు.

“నేను చిన్న పాట పాడతానండీ” అన్నాడు నిరంజన్ హఠాత్తుగా లేచి నిలబడి.

“సరే పాడు, నిలబడొద్దు. పడిపోతావు కూర్చునే పాడు. పెద్దగా పాడు, అందరికీ వినపడుతుంది” అన్నారు మాస్టారు.

“ఇది బి.వి.నరసింహరావుగారు వ్రాసినదండీ. మా అమ్మ నేర్పింది” అంటూ నిరంజన్ మొదలు పెట్టాడు.

“అల్లరి చేసే పిల్లలు చల్లని తొలకరి జల్లులు
పిల్లలకే అల్లరి తెలుసు
పిల్లలదే మల్లెల మనసూ
అల్లరినీ రంజించుట తెలుసు….. ఆ….ఆ….”

అని పాడి నవ్వు మొదలు పెట్డాడు.

“ఏయ్ నిరంజన్ భలే పాడావు. అల్లరి చేయటం మా హక్కు. మమ్మల్ని ఏమీ అనవద్దని భలే చెప్పావుగా” అంటూ మాస్టారు గూడా నవ్వారు.

పిల్లలందరూ చప్పట్లు కొట్టారు.

“నేనూ ఒకటి పాడతాను మాస్టారూ” అంటూ సీత బిగ్గరగా అన్నది.

“సరే సరే నువ్వూ కూర్చునే పాడు” అన్నారు మాస్టారుగారు.

“నాకూ మా నానమ్మ నేర్పింది మాష్టారు అంటూ సీత మొదలెట్టింది.

“అనగనగా ఒక కోతి
కోతికున్నది మూతి
మూతికున్నది ముక్కు
ముక్కు ముక్కు టిక్కు
డీడీడీడీ డిక్కు….”

అంటూ తనే పెద్దగా నవ్వింది. సీతతో పాటు అందరూ నవ్వారు. నవ్వులతో కేరింతలతో కపటంలేని మనస్సులతో ఎంతో సంతోషంగా వున్నారు ఈ పిల్లలు అనుకున్నారు మాస్టారుగారు.

వీళ్ల నవ్వుల మధ్యే బస్సు ఉప్పలపాడు చేరింది. ముందుగా ఒక మాస్టారుగారు దారి తీశారు. వారి వెనకాల పిల్లలు. పిల్లలందరి వెనకాల మరో మాస్టారుగారు నడుస్తున్నారు.

“బస్సును రోడ్డుకు ఒక వారగా ఆపి నువ్వురా యాదగిరీ” అని బస్సు డ్రైవరుకు చెప్పి వీళ్లు బయలుదేరారు.

అది ఉప్పలపాడు అనే ఊరు. గుంటూరుకు దగ్గరగా వున్నది. ఆ ఊరిలో మంచి నీటి కోసం ఒక పెద్ద చెరువును తవ్వుకున్నారు. ఆ మంచి నీటిని ఆ ఊరి ప్రజలు వాడుకునేవారు. అలాంటి చెఱువులోకి విదేశీ పక్షులు వచ్చి వాలటం ప్రారంభించాయి. గుంపులు గుంపులుగా వందలూ, వేలూ వచ్చాయి. ఆ ఊరి వారు వాటిని వెళ్లగొట్టకుండా అక్కడే నుండనిచ్చారు. మన దేశంలో ఎండలు తగ్గగానే వాతావరణం చల్లబడుతుంది. అలాంటి చల్లని వాతావరణంలో హాయిగా వుండటానికి కజికిస్తాన్, నైజీరియా, సైబీరియా, బర్మా, శ్రీలంక, దేశాల నుండి ఇవి వస్తాయి. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా అవి ఉప్పలపాడు చెఱువుకు వచ్చాయి, రోజూ ఎంతో మంది వచ్చి వాటిని చూసి వెడుతున్నారు. ఈ రోజు హరిక స్కూల్ పిల్లలు కూడా వీటిని చూడాలనే వచ్చారు.

రోడ్డు మీంచి కొంచం దూరం లోపలికి నడిచి వీళ్లంతా ఆ చెరువు దగ్గరకు చేరుకున్నారు. కాస్త దూరంలోనే చెఱువులోనున్న, చెఱువు గట్టలో నున్న చెట్ల మీద చేరి గుంపులు గుంపులుగా వాలి వున్న తెల్లని కొంగలు కనపడుతున్నాయి.

‘అబ్బ ఎన్ని కొంగలు. ఎంత తెల్లగా మెరిసిపోతున్నాయి’ అనుకుంటూ పిల్లలు దగ్గరగా నడిచారు.

“జాగ్రత్త పిల్లలూ, ఒకళ్లనొకళ్లు నెట్టుకోవద్దు. జాగ్రత్తగా నడవండి. చుశారా ఈ పక్షుల్ని అవి ఖండాలు దాటుకుని వేల మైళ్లు ప్రయాణం చేసి ఇక్కడకు వచ్చాయి. వీటిల్లో ఏడెనిమి రకాల పక్షులున్నాయి. మన ఎదురుగా వున్న చెట్టు మీద వాలిన వాటిని చూశారా వాటిని కూడ బాతులు అంటారు” అని చెప్పారు మాస్టారు.

“బాగా అందంగా వున్నాయి కదా మాస్టారూ” అన్నాడు ఒక పిల్లవాడు.

“అవును. అదుగో ఈ వైపువున్న చెట్టు మీద వున్నవాటిని చూడండి. వాటిని నత్త గుల్ల కొంగలు అని అంటారు. జాగ్రత్తగా చూడండి” అని చెప్పారు మాస్టారుగారు.

“అంత తెల్లగా ఎలా మెరిసిపోతాయి మాస్టారూ మనం రెండు పూట్లా స్నానాలు చేసినా అంతగా మెరిసిపోం. ఇటు వైపున చెట్టు మీద వున్న వాటిని ఏమంటారు మాస్టారూ?” అనడిగింది సీత.

“అవా, అవి ఆకారానికి కాస్త బిన్నంగావున్నా బాగా అందంగా వుంటాయి. వాటిని చిన్న స్వాతి కొంగలు అని అంటారు. వాటి పక్కనే వున్న వాటిని తెడ్డు ముక్కు కొంగలు అని అంటారు. ఎందుకంటే వాటి ముక్కులు తెడ్డులాగా వున్నది కాబట్టి” అంటూ వివరంగా చెప్పారు మాస్టారుగారు.

“అబ్బ ఎన్ని రకాల, ఎన్నన్ని పక్షులు” అనుకుంటూ కొంత మంది పిల్లలు చెఱువు గట్టుకు ఇంకా చివరి వరకూ వెళ్లారు. వాళ్లను చూసి ఒక మాస్టారుగారు గబగబా వీళ్ల దగ్గరగా వచ్చారు.

“మీ దుంపదెగ. ఏంటి కాలికందికీ అలా నడిచి వెడుతున్నారు. దూరంగానే చూడాలి” అన్నారు.

“ఇవన్నీ మన కొంగలు కంటే చాలా పెద్దగావున్నాయి. ముక్కులు కాళ్లు కూడా వేరేగా వున్నాయి. ఇవన్నీ ఎప్పుడూ ఇక్కడే వుంటాయా మాస్టారూ?” అనడిగారు.

“అవి చాలా తెలివిగలవి. వాళ్ల ప్రాంతంలో ఎండలు పెరగ్గానే మన దేశానికి వచ్చాయి. చల్లగా హాయిగా వుంటాయి. చేపల్నీ, పురుగుల్నీ వేటాడి తింటాయి. గుడ్లు పెట్టే దశకు చేరుకుంటాయి. నెమ్మదిగా మన దేశాలలో ఎండలు పెరగటం మొదలవుతాయి, తాము వచ్చిన దారిని గుర్తుపెట్టుకుని చక్కగా మళ్లీ తమ ప్రాతానికి చేరుకుంటాయి” అని చెప్పారు.

“అమ్మా ఎంత తెలివిగలవి మాస్టారూ అటు చూడండీ. ఆ చెట్టు కొమ్మనిండా వేరే రకం కొంగలు. ఆ చెట్టు కాండం మీద ఒక తమాషా పిట్ట వాలి వున్నది. అదీ ఎంత బావున్నది” అన్నాడు నిరంజన్.

మాస్టారు అటు చూస్తూ “ఆ చెట్టు కొమ్మ మీద వున్నవి శబరి కొంగలు. చెట్టు కాండం మీద వాలి వున్నదేమో వడ్రంగి పిట్ట. ష్… పెద్దగా అరవకండి అది ఎగిరిపోతుంది” అన్నారు మాస్టారు.

“కొంగల్లో కూడా ఎన్ని రకాలో. ఇక్కడ ఇంకేమైనా వున్నాయా మాస్టారు?”

“ఎందుకు లేవు నీటి కాకులు, తెల్ల కంకణాలు, క్యాటిల్ కొంగలు, ఇలాంటి రకాలు వున్నాయి, ఇంకా కొన్ని రకాలు కూడా వుంటాయి. వడ్రంగి పిట్ట కా పేరు ఎలా వచ్చిందో తెలుసా? అన్నారు మాస్టారు.

“చెప్పండి మాస్టారూ. అసలు పిట్టే తమాషాగా ముద్దుగా వుంది” అన్నాడు నిరంజన్.

“వడ్రంగి కొట్టినట్లుగా చెక్కను కొడుతుందని దానికి వడ్రంగి పిట్ట అనీ, పోలీసు టోపిలో కుచ్చు మాదిరిగా ఎర్రని మబ్బు దీని నెత్తి మీద వుందని పోలీసు పిట్ట అనీ అంటారు” అని చెప్తూ మాస్టారూ సైగ చేసి పిలిస్తే మరి కొంత మంది పిల్లలు నిశ్శబ్దంగా వచ్చి చూసెళ్లారు.

ఇంతలో చెట్టు కాండం మీద టిక్ టిక్ మని శబ్దం వినిపడింది. ఆ చెట్టు మీద కూర్చున్న శబరి కొంగ నోరు విప్పి “ఏయ్ పిట్టా ఎందుకు ఆ చెట్టు మీద అలా మోగిస్తున్నావు?” అన్నది.

“నా యిష్టం నా ఆహరం కోసం నేను నా పని చేసుకుటున్నాను. నేను నీలాగా పోడుగాటి ముక్కు నీళ్లలో ముంచి అందిన చేపన, వానపామున గబుక్కున నోట్ల వేసుకోను. కష్టపడి ఆహారం సంపాయించుకుంటాను. ఏ చెట్టు బెరడు లోపలైనా చీమలు, చిన్న చిన్న కీటకాలు వుంటే ఆ బెరడును నా ముక్కుతో పొడి పొడి చేసి ఆ తర్వాత అడుగునున్న కీటకాల్ని తిని నా ఆకలిని తీర్చుకుంటాను. ఎక్కోడో దేశాల నుంచి ఇక్కడికొచ్చావు. నీకీ సంగతులన్నీ కొత్త. మా దేశపు కొంగలకయితే నా సంగతి బాగా తెలుసు. అవయితే తాము పట్టిన చిన్న చిన్న వానపాముల్నీ, పురుగుల్నీ నాకూ కొంచం పెట్టేవి. అదిగో నువ్వు కూర్చున్న కొమ్మకున్న పంగలో చూడు. బాదంకాయ నొక దానిని కోసుకొచ్చి దాచి పెట్టాను. తర్వాత నెమ్మదిగా ఎప్పుడో బాదం కాయను పగల కొట్టి పప్పును తింటాను. ఇలా ఎంతో కష్టపడి నా ఆహారాన్ని నేనే సంపాదించుకుంటాను” అన్నది గర్వంగా.

“ఏయ్ కొంగలూ ఆ కొమ్మ మీద జాగ్రత్తగా కూర్చోండి. పట్టు దప్పితే కింద బడతే ఒళ్లంతా గాయాలవుతాయి. పైగా కింద పడగానే ఎవరైనా చూస్తే శుభ్రంగా తమ జోలెలో వేసుకెళతారు” అంటూ జాగ్రత్తలు చెప్పింది వడ్రంగి పిట్ట.

“మేం బాగానే కూర్చున్నాం పిట్టా. నువ్వే చెట్టు కాండం మీద ఏ ఆధారం లేకుండీ నిలబడ్డావు. నిన్ను అలా చూస్తుంటే మాకు భయమేస్తోంది” అన్నాయి కొంగలు.

“ఏం భయపడక్కర లేదు. మీ అందరి లాగా కాకుండా నా కాలి రెండు ముందుకూ రెండు వెనక్కు వుంటాయి. అలా వుండేటప్పటికి నాకు బాగా పట్టు కుదురుతుంది. ఇంకా మీ తోక ఈకలు ఊరికే తెల్లగా అందంగా సుతారంగా వుంటాయి. కాని నా తోక ఈకకున్న ఈన చాలా బలంగా వుంటుంది. మీ వంట్లో ఎముక వున్నంత గట్టిగా అన్నమాట. ఆ ఈన కంటుకుని వున్న తూలికల చివర్లు బాగా వదునుగా వుంటాయి, దాని సహాయంతో నేను చక్కగా నిలబడి ఎంత గట్టి చెట్టు కాండాన్ని కూడా పొడి చేసి తొఱ్ఱ చేసుకుని దూరిపోగలను. అదే నా ఇల్లు. నన్ను గురించి మీకే భయమూ అఖ్ఖరలేదు. మీకు పురుగురూ, అవీ పట్టుకోవడానికి మీ ముక్కు ఒకటే ఆధారం. నేను నా నాలుక చాచి మరీ పట్టుకుంటాను. నా నాలుకకు ప్రత్యేకమైన కొక్కాలు వుంటాయి. ఆ కొక్కాలు, పురుగును ఎటూ పొనీయకుండా పట్టేసుకుంటాయి. నేనోమో గట్టుక్కు మిగేస్తాను. మీరు ఎక్కడి నుంచో వచ్చారని నా సంగతులన్నీ ఇంత వివరంగా చెప్పాను” అన్నది వడ్రంగి పిట్ట.

“నిజం నిజం నిన్ను గురించి చాలా సంగతలు తెలుసుకున్నాం. బఱ్ఱు పిట్టా నువ్వు తుఱ్ఱుమని ఎగిరిపోకు. ఇక్కడే ఈ చెట్టు తొఱ్ఱలోనే వుండు. మనం స్నేహంగా వుందాం” అన్నాయి కొంగలు.

“అలాగే మనం పట్టుకున్న ఆహారం అందరం కలిసి పంచుకుందాం” అన్నది వడ్రంగి పిట్ట.

పిల్లలు చాలా మంది నిశ్శబ్దంగా వుండి ఆ వడ్రంగి పిట్టను చూసెళ్లారు. వాళ్లకు కూడా మాస్టారుగారు వివరంగా చెప్పారు. వడ్రంగిలాగే ఈ పిట్ట కూడా కర్రలను పొట్టు పొట్టులాగా చేయిగలదని దీనికా పేరు వచ్చింది. పైగా తాను కొట్టి పొసిన చెక్కపొట్టును భద్రంగా ఏరి తను గూడుగా చేసుకున్న తొఱ్ఱలో పరుచుకుంటుంది అని చప్పారు.

కొంగలూ వడ్రంగి పిట్టా మాటల్లో పడి పిల్లల రాకపోకలను, వాళ్ల శబ్దాన్ని ఏం పట్టించుకోలేదు. అక్కడి నుండి ఎగిరిపోకుండా అకడే వుండి పిల్లలకు చక్కగా కనపడ్డాయి.

“చెఱువుకు ఆ పక్కనున్న గట్టు మీద ఏమేమి వున్నాయి చెఱువులో వున్న చెట్టు మీద మద్దుల మీద వున్నవి ఏం పక్షులు. చెఱువులో వున్న సిమంటు దిమ్మల మీద వాలినవి ఏం పక్షులు?” అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు.

“అన్నీ ఇవే. ఇంకా కొన్ని రోజుల్లో మరి కొన్ని రకాలు రావచ్చు. ఇక పదండి పోదాం. క్లాస్ రూముల్లో కన్నా ఇలా ఆరుబయటి కొచ్చేటప్పటికి బాగా సంతషోంగా వుంది మీకు అవునా?” అన్నారు మాస్టారుగారు.

“అవునవును మాస్టారు మళ్లీ మళ్లీ ఇలాగే వద్దాం” అన్నారు పిల్లలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here