వైద్య ఆరోగ్య విజ్ఞాన రచనలు

0
16

[డా. కందేపి రాణీప్రసాద్ రచించిన ‘వైద్య ఆరోగ్య విజ్ఞాన రచనలు’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

మనో విశ్లేషణ సిద్ధాంతకర్త సిగ్మండ్ ఫ్రాయిడ్ “పసివాడు పెద్దయ్యాక అతడు తీర్చిదిద్దబడే తీరు అతని బాల్యం మీద ఆధారపడి ఉంటుంది” అని నిర్వచించాడు. అంటే బాల్యంలో పడిన పునాది మీదే వారి వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది. ఈ ఆలోచనా సరళిలో బాల్యానికి విశేషమైన ప్రాముఖ్యాన్నిచ్చి బాల్యంలోనే మంచి అలవాట్లు అలవడాలని వాటిని పాటలుగా, పద్యాలుగా రూపొందించారు మన పూర్వీకులు.

ఆయుర్వేద శాస్త్రంలో బాలతంత్రం లేదా కౌమార భృత్యం అని ఒక ప్రత్యేక విభాగమున్నది. బిడ్డలను కాపాడేందుకు తగిన ఉపచారాలను బోధించేదాన్ని ‘కౌమార భృత్యం’ అంటారు. ఇందులో వైద్య నిపుణులు శిశువుల శరీర రక్షణ, దేహ పోషణ మరియు బాలల కొచ్చే ప్రత్యేకమైన వ్యాధులు, వాటికి తీసుకోవాల్సిన చికిత్సల గురించి వివరించారు. వాగ్భటుడు శైశవదశను గురించి అష్టాంగ హృదయమనే గ్రంథంలో చక్కగా వివరించారు. భేలుడు ‘భేల సంహిత’ అనే గ్రంథంలో కౌమార భృత్యం గురించి వివరించారు. మన పూర్వ జానపద సాహిత్యంలోని కొన్ని పాటలలో వైద్యపరమైన విషయాలున్నాయని కూడా తెలుస్తున్నది.

‘కాళ్ళగజ్జా కంకాళమ్మా, వేపా చెక్కా వెలగా మొగ్గా’ అనే పాటలో కాళ్ళకు వచ్చే గజ్జి జబ్బుకు మందు ఎలా వేసుకోవాలో చెప్పబడింది. వేపచెక్క, మోదుగమండలు, పాదరసం, నిమ్మరసం, వాయింటాకు, చాగమట్ట ఇవన్నీ కుమ్మరి చట్టిలో కలిపి కాళ్ళ కొచ్చిన కర్పాణికి రాస్తే తగ్గుతుందని ఇందులో చెప్పడం జరిగింది.

అలాగే ఆంధ్రదేశంలో పసిపిల్లలకు ఉగ్గుపెడుతూ ‘జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం, గుర్రాలు తిన్న గుగ్గిళ్ళరిగి, ఏనుగులు తిన్న వెలక్కాయలరిగి, అర్జునుడు తిన్న అరటిపళ్ళరిగి, భీముడు తిన్న పిండి వంటలరిగి’ అంటూ పాటలు పాడతారు. దీని వెనక ఒక కథ ఉన్నది. వాతాపి అనేవాడు ఒక రాక్షసుడు, అతడు కామరూపుడై ఆహారం ద్వారా బ్రాహ్మణుల కడుపులోకి జొరబడి, వాళ్ళ పొట్టలు చీల్చుకొని మరలు బయటికొచ్చేవాడు. తమ కష్టాలను అగస్త్య మహర్షితో మొరపెట్టుకోగా, అగస్త్యుడు భోజనం చేసి ‘జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం’ అంటూ ఆ రాక్షసుడ్ని జీర్ణం చేసేశాడు.

‘వానా వానా వల్లప్పా’ పాటలో కాలు విరిగితే దానికేమి మందు? అని చెల్లెలు అడుగుతుంది. దానికి సమాధానంగా వల్లప్ప వేపాకు, పసుపు, వెల్లుల్లిపాయ, నూనెల మడ్డి ఇవన్ని కలిపి ఆవర్తిత తైలంగా తయారుచేసి పూటకొకసారి రాస్తే కాలు అతుక్కుంటుందని చెప్తాడు. అలాగే ‘ఒప్పుల కుప్పా ఒయ్యారి భామా’ అనే పాటలో చాయ మినప పప్పు, కొద్దిగా మెంతిపిండి తగినంత తాటిబెల్లం నెయ్యి కలిపి తింటే నడుములు గట్టి పడతాయనీ బాలికల కోసమై రచించారు. ‘చిప్ప చిప్ప గోళ్ళు సింగరయ్య గోళ్ళు, మాతాత గోళ్ళు, మాదాపు రాళ్ళు’ అనే పాటలో పిప్పిగోళ్ళ నివారణకు తిప్ప హారాది లేపనముల గురించి చెప్పబడింది. ‘ఎంతో ఎత్తు మరిగినావు ఏమిసేతురా! ఇంతుల చేతి కాకలకు ఎంతో కందేవు’ అనే పాటలో పిల్లలను అతిగా ఎత్తుకోవడం వలన ‘నిక్కాక’ అనే రోగాలు వస్తాయనీ, ఊరికే పిల్లలను ఎత్తుకుని తిరగకుండా వారిని బాగా ఆడుకోనివ్వాలని తెలియ చేశారు. ఇంకా సరస్వతీ ఆకు, తెల్ల ఆవాలు, వస, సుగంధ పాల, చెంగల్వ కోష్టు, సైంధవం, పిప్పళ్ళు వీటన్నింటినీ నూరి నేతితో కలిపి ఇస్తే శిశువుకు మేధ వాక్శక్తి అభివృద్ధి చెందుతాయి.

ఇలా ప్రాచీన బాలసాహిత్యంలో ఎన్నో నిగూఢమైన ఆరోగ్య రహస్యాలు పాటలుగా పద్యాలుగా చెప్పబడ్డాయి. బాల్య స్థితిలో ఉన్నపుడే ఏం చెప్పినా వారి మనసుకు హత్తుకుంటాయి. శరీరారోగ్యం, మందులు, జాగ్రత్తలు, చికిత్సలు వంటివి జనంలో విస్తృతంగా వ్యాపించాలంటే పిల్లలకు పాటలు పద్యాలు ద్వారా చెప్పించటం, గృహిణులకు సంప్రదాయాలుగా చేసి పాటింపజేయించటం, వారిరువురకు ఇంటి యజమానులు సహాయం చేయటం అవసరం. ఇది ఆంధ్రుల గృహ జీవన విధానంలో ఒక రకమైన కళాప్రక్రియ.

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత దేశాభివృద్ధి జరగాలంటే అక్షరాస్యత, ఆరోగ్యాలపై శ్రద్ధ పెట్టాలని మేధావులు భావించారు. అప్పుడే ఆరోగ్యానికి సంబంధించిన పుస్తకాలు ఎక్కువగా ప్రచురించి పౌరుల్లో ముఖ్యంగా మహిళల్లో చైతన్యం తీసుకురావాలని ప్రయత్నించారు.

ఒక మహిళ చైతన్యవంతమయితే ఇల్లంతా చైతన్యవంతమవుతందన్న విషయం అందరికీ తెలిసినదే కదా! దీనికోసం అప్పటి విద్యాధికులు మౌఖిక ఉపన్యాసాల ద్వారా ప్రసంగాల ద్వారా ఎన్నో విషయాలను విడమరచి చెప్పేవారు. అయితే ఒక్క పుస్తకం లక్షల మంది మెదళ్ళలో కదలిక కలిగిస్తుందన్న విషయం గుర్తుంచుకొని  పుస్తకాలు ముద్రించటమనే విషయాన్ని ఉద్యమంగా చేపట్టారు.

బంగాళాదుంపలు తింటే వాతం, బీరకాయ తింటే జలుబు, మరో కూరగాయ తింటే కఫం ఇలా ఒక్కో కూరగాయకు ఒక్కో పేరు పెట్టి సరియైన ఆహారం తీసుకోక పరిశుభ్రత పాటించక ఎన్నో వ్యాధుల బారిన పడేవారు. వ్యాధులు సంభవించినప్పుడు కూడా వాటికి సరైన ఔషధాన్ని సేవించక పాత పద్ధతులనే అనుసరిస్తూ మృత్యువాత పడేవారు. అందులోనూ మహిళలూ పిల్లలూ ఎక్కువగా జీవితాన్ని కోల్పోయేవారు. అసలు పుట్టిన పిల్లల్లో ఏ కొద్దిమందో బతికేవారు. అందుకే ‘బాలరిష్టాలు’ అనే పదం పుట్టుకొచ్చింది అప్పట్లో. అందువలన స్త్రీలు గర్భిణిగా ఉండగానే సరియైన పౌష్టికాహారం తీసుకోవడం, పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఎన్నో పుస్తకాలు రాయబడ్డాయి. గ్రహణం పట్టిన సమయంలో స్త్రీలు బయట తిరిగితే పిల్లలకు ‘గ్రహణం మొర్రి’ వస్తుందని ఆ కాలంలో ప్రజలు చాలా బలంగా నమ్మేవారు. గ్రామదేవతలు ఆగ్రహించిన కారణంగానే ఆటలమ్మ, దాగర, మశూచి వంటి జబ్బులు వస్తాయనీ నమ్మేవారు. ఇలాంటి మూఢనమ్మకాల నివారణ కొరకే వైద్య ఆరోగ్యానికి సంబంధిచి అనేక సత్యాలు వెలుగులోకి తీసుకురావడానికి ఎంతో కృషి జరిగింది.

‘ఆరోగ్యమే మహాభాగ్యం’, ‘ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు’ అనే మాటలు అక్షర సత్యాలన్న విషయం అందరికీ తెలిసిందే. అసలు ఆరోగ్యం అంటే ఏమిటి? ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఆరోగ్యానికి, ఆహారానికి గల సంబంధం ఏమిటి? అనే రకరకాల ప్రశ్నలు వేసుకొని వాటికి సమాధానాలను పుస్తకాలుగా తీసుకురావాలని ఆకాంక్షించారు. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్న పేరుతో 1998లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శ్రామిక విద్యాపీఠం తరపున ప్రభుత్వం పుస్తకాన్ని ప్రచురించింది. గర్భిణి స్త్రీలు, నూతన శిశువుల గురించిన ప్రాథమిక సమాచారాన్నందిస్తుందీ పుస్తకం. అన్నింటి కన్నా ముఖ్యంగా పిల్లలతో తల్లిదండ్రులు ప్రవర్తించవలసిన తీరు గురించి విశదీకరించారు. ప్రతి విషయాన్ని హేతుబద్ధంగా చూడటం పిల్లలకు చాలా అవసరమైన విషయం. పిల్లల్లో అభద్రతా భావం పెరగటం, ఆత్మన్యూనతకు గురవటం వంటి మానసిక సమస్యల గురించి కూడా ఈనాడు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

గోవిందరాజు చక్రధర్ రాసిన ‘సుఖజీవనం’ అనే పుస్తకంలో తిరునాళ్ళలో తిని దొరికే రంగురంగుల ఆహార పదార్థాల వలన వచ్చే వాంతులు విరోచనాల గురించి వివరించబడింది. వేడి మిరపకాయల బజ్జీలు, జిలేబీలు లొట్టలేసుకుంటూ తర్వాత తీరిగ్గా జబ్బులొచ్చాయని బాధపడటం చూస్తూనే ఉంటాం. ఈగలు దోమలు ముసిరిన ఆహారపదార్థాలను తినటం వలన అంటు వ్యాధులు వస్తాయన్న విషయం చక్కగా రాయబడిందీ పుస్తకంలో.

బాల విజ్ఞాన శాస్త్రం పేరుతో 1977వ సంవత్సరంలో గిడుగు వెంకట రామ్మూర్తి ‘మనకు ఏమి కావాలి’ అనే పుస్తకాన్ని రచించారు. పరిశుభ్రమైన ఆహారం తినకపోతే నులిపురుగులు, ఏలిక పాములు కడుపులోకి చేరి ఏ విధంగా నష్టం కలిగిస్తాయో, పిల్లలకు అర్థమయే రీతిలో వివరించారు. ఆహారం గురించీ, గాలిలో ఉండే వాయువుల ఇల్లూ, బట్టా శుభ్రం గురించీ, కసరత్తుల వలన శరీరానికి గల ఉపయోగం గురించీ విపులంగా రాశారు.

‘అంటువ్యాధులు-జాగ్రత్తలు’ అనే పుస్తకంలో అంటువ్యాధులు ఎలా వస్తాయి? వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించీ జి.వి.జి నరసింహారావు రాశారు. వీరు ఆరోగ్య రక్షణ-పౌష్టికాహారం అనే మరో పుస్తకంలో కూరగాయాల్లో ఉండే పోషకాలు, విటమిన్లు, మినరల్సు గురించి వివరించారు.

శ్రీనివాసరావు రాసిన ‘సుందరమందిరం’ అనే పుస్తకంలో ఎముకలు-కీళ్ళు, కండరాలు, రక్త ప్రసరణం, శ్వాసకార్యం, ఆహారం – శరీర పోషణం వంటి అనేక శీర్షికల ద్వారా విద్యార్థులకవసరమైన సమాచారాన్ని చక్కగా అందించారు. ఈ రచయితే రాసిన మరో పుస్తకం ‘ఏం తినాలి? ఎందుకు తినాలి’. ఈ పుస్తకంలో ఏ ఆహారం తింటే ఏ ఫలితం కలుగుతుందో చెప్పటం వలన పిల్లలు దీనివైపు త్వరగా దృష్టి సారించే అవకాశం ఉంది. కె.ఎస్.రెడ్డిగారు రాసిన ‘మన ఆహారం’ అనే పుస్తకంలో ఆహారోత్పత్తి-విస్తరణ, ఆహార పదార్థాల రవాణా, ఆహార పదార్థాల నిల్వ, ఆహారం-శరీర పోషణ వంటి విషయాల గురించి చర్చించారు.

విభావసు రాసిన ‘మనిషి కథ’ పుస్తకంలో ఎక్స్‌రేలు ఎలా తీస్తారు, వాటి వలన జరిగే పనులు ఉపయోగాల గురించి తెలియజేయబడింది. వీరే రాసిన ‘మెడిసిన్ కథ’ అనే మరో పుస్తకంలో ఎండలకు తట్టుకోలేకపోయినప్పుడు, ఖర్జూరం, సబ్జా గింజలు నానబెట్టిన నీళ్ళు మరియు మజ్జిగ తాగటం వలన ఎలాంటి ఫలితం కలుగుతుందో వివరించారు.

‘ప్రథమ చికిత్స’ అనే పుస్తకాన్ని డా॥ వి. బ్రహ్మారెడ్డిగారు వెలువరించారు. 34 రకాల ప్రమాదాలలో అవలంబించాల్సిన ప్రాథమిక చికిత్సల గురించి చక్కగా వివరించారు. ఈ రచయితే రాసిన ‘మీరు మీ ఆరోగ్య సంరక్షణ’ అనే పుస్తకంలో సాధారణంగా వచ్చే నూటాయాభైరకాల జబ్బుల విషయంలో ప్రాథమిక పరిజ్ఞానాన్ని అందించారు. ‘అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స’ అనే పుస్తకాన్ని 1999లో డా॥జితిన్ కుమార్ రచించారు. కాలిలో గుచ్చుకున్న ముల్లును తీసివేయడం దగ్గర్నుంచి, క్రూర మృగాల దాడి దాకా అవసరమైన ప్రథమ చికిత్సల గురించి ఇందులో వివరించారు.

మానవుడు ఎలా జన్మించాడు? ఎలా పరిణామం చెందాడు? ఎలా నాగరికతను సంపాదించాడు? అనే విలువైన విషయాలను విద్యార్థులకు సులభంగా అర్ధమయేలా ‘మనిషి కథ’ అనే పుస్తకంలో డా॥ రావూరి భరద్వాజ విపులీకరించారు. నీళ్ళలో నుంచే మొదటగా జీవం పుట్టిందన్న విషయాన్ని సులభ శైలిలో విశదీకరించారు.

‘ఆరోగ్య బోధిని’ అనే పుస్తకాన్ని రావూరి సంజీవరావు రచించారు. గ్రామీణులకు తగిన ఆరోగ్య సలహాలు, చిట్కా వైద్యాలు చెపుతూ అనేక కథలను అందించారు. ‘డయాబెటీస్‌తో ఆరోగ్యంగా జీవించడం ఎలా?’ అనే పుస్తకాన్ని డా॥ టి.ఎమ్. బషీర్ రచించారు. ఈ పుస్తక అనుబంధమైన ‘మన ఆహారం’లో ఏయే కూరగాయలలో ఏఏ విటమిన్లు, ఖనిజాలు, పిండి పదార్థాలు ఉన్నాయో వివరించారు. కందేపి రాణీప్రసాద్ రాసిన ‘సైన్స్ వరల్డ్’ పుస్తకంలో తల్లిపాల విశిష్టత మరియు థైరాయిడ్ గ్రంధి గురించి, క్యాన్సర్, కాలా అజార్, గియార్డియాసిస్ మొదలైన జబ్బుల గురించి వివరించారు.

వైద్య ఆరోగ్య శాస్త్ర గ్రంథాల్లో అనువాదాలు ఎక్కువగా వచ్చాయి. డా జతిన్ అనువదించిన ‘మీ శరీరం’, ఎస్. మురళీధరరావు అనువదించిన ‘సూక్ష్మజీవులు – మానవుని స్నేహితులు మరియు విరోధులు’, చల్లా రాధాకృష్ణశర్మ అనువదించిన ‘కడుపులో గారడి’, అద్దేపలి వివేకానంద దేవి గారి ‘మన శరీర నిర్మాణం’ పోలు శేషగిరి రావు అనువదించిన ‘మనిషి కథ’ మొదలైనవి. శరీరపు సంచి, ఈ ఎర్రటి రక్తం, కంటి శుక్లం-ఆపరేషన్, మధుమేహం, మలబద్ధకం, ఫిషర్, మొలలు, హిస్టిరెక్టమీ, వంటి శరీరానికి సంబంధించిన జబ్బులు వాటి నివారణల గురించిన పుస్తకాలు తెలుగులోకి ఎన్నో అనువదించబడ్డాయి. ఇంకా ‘బాలుడు అంటే ఏమిటి? బాలిక అంటే ఏమిటి’? అంటువ్యాధులు-నివారణోపాయాలు వంటి అనువాదాలు కూడా వెలువడ్డాయి.

మొక్కపాటి సుమతి రాసిన ‘ఆరోగ్యమే మహాభాగ్యం’, నండూరి రామమోహనరావు రాసిన ‘నరావతారం’ డా॥ ఆలూరి విజయలక్ష్మి రాసిన ‘మన దేహం’ కథ, ఎ.వి.యస్ రామారావు రాసిన ‘పాపను ఎలా పెంచాలి’ పవనశ్రీ రాసిన ‘శరీరావయవాలు వాటి పనులు’, జి.వెంకటేశ్వర్లు రాసిన ‘జ్ఞాపక శక్తికి మార్గాలు’ వంటి ఎన్నో వైద్య ఆరోగ్య గ్రంథాలు వెలువడ్డాయి. ప్రస్తుతం దినవార పత్రికలన్నీ ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో విలువైన విషయాలను ప్రచురిస్తున్నాయి. ఇంకా ఎక్కువగా వెలువడాలి.

మనిషి ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏ పనైనా చేయగలిగేది ఏ కార్యాన్నైనా సాధించగలిగేది. కాబట్టి శాస్త్ర ప్రచార ఉద్యమంలో వైద్య ఆరోగ్య విజ్ఞానానికే అగ్రతాంబూలమివ్వాలని భావిస్తున్నాను. అందులోనూ బాల్యంలోనే ఆరోగ్య విషయాల పట్ల అవగాహన కల్పించటం చాలా అవసరం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here