వైకుంఠపాళి-13

0
8

[dropcap]వా[/dropcap]చ్‌మన్ కళ్ళు మెరిసాయి. “షుక్రియా సాబ్” కృతజ్ఞతగా వంగుతూ అన్నాడు.

కారు స్టార్ట్ చేస్తూ సతీష్ చంద్ర అనుకున్నాడు – ‘ఆ రాజశేఖరం ఇలా ఇనాము లివ్వకపోతే వీడు తప్పకుండా వాడి కారుని డామేజ్ చేస్తాడు. ఏదైనా అలవాటు పడిన తర్వాత మానడం కష్టం!’. అలా అనుకున్నాకా అతని మనసుకి కాస్త సాంత్వన లభించినట్లయింది.

డ్రైవ్ చేస్తుంటే రోడ్డు కనిపించడం లేదు. కళ్ళల్లో వుబికిన నీరు వల్లే అనుకుని, కళ్ళు బాగా తుడుచుకున్నాడు. ఎంత తుడుచుకున్నా మసగ్గానే వుంది. అప్పుడు తెలిసింది బైట వాన పడ్తోందని!

కారు ఆపేసి క్రిందకి దిగాడు. మొహం మీదుగా నీళ్ళు కారిపోతున్నాయి. చుట్టూ జనం తిరుగున్నారు. అందరిలో నిలబడి హాయిగా, తృప్తిగా ఏడ్చాడు. ఎవరికీ అనుమానం రాలేదు. వాన నీళ్ళతో బాటు కన్నీళ్ళు కూడా కలిసి చెంపల మీద నుండి జారిపోతున్నాయి, పెదవులకి కొద్దిగా వుప్పుగా తగుల్తూ. బహుశా అతని తల్లి పోయినప్పుడు కాస్త ఏడ్చి వుంటాడు. ఆ తర్వాత ఇప్పుడు అతను ఇంతగా ఏడ్చింది! ప్రేమ ఇచ్చే సుఖం కన్నా అది పోగొట్టుకున్నప్పుడు పొందే బాధ పదింతలు ఎక్కువ!

“ఎంతసేపలా వానలో తడుస్తూ నిలబడ్తారు? వచ్చి కారెక్కండి” అని వినిపించి పక్కకి చూసాడు.

వందన అతని వైపు సానుభూతిగా చూస్తూ కనిపించింది.

అతను ఆమె చెప్పినట్లే చేసాడు.

వందన డ్రైవ్ చేస్తూ “నే చెప్పలేదూ…” అంది.

సతీష్ చంద్ర ఆమె భుజం మీద తల ఆన్చాడు. అతడికా నిముషంలో ఎవరు కనిపించినా తన బాధని బహిర్గతం చెయ్యాలని వుంది.

“ఇలా భుజం కోసం వెదకడమే మీరు చేసిన తప్పు!” వందన కంఠం గంభీరంగా వుంది.

తను కాస్త సిగ్గుపడి సర్దుకుని కూర్చున్నాడు.

“అద్దెకి దొరికే భుజాలు అలాగే వుంటాయి. అంతకన్నా ఇంట్లో కాస్త ఈగో తగ్గించుకుని నాకు ఇది కావాలీ… ఇలా కావాలీ అని చెప్పగలగితే ఇంత కష్టం వుండేది కాదు!” అంది.

ఆమె దెప్పుతోందని అతను కాస్త వుక్రోషంగా చూసాడు.

వందన కళ్ళల్లో కూడా నీళ్ళు. చెంప మీద నుండి జారుతున్నాయి. “నేను ఇలాంటి పరిస్థితిలో వుండి, మనసు గాయపడి, మోసపోయి మీ దగ్గరకొస్తే… ఇలా మాత్రం చేసేవారు కాదు. నాలుగు మాటలనీ, వీలైతే విడాకులిచ్చీ వదిలించుకునేవారు. కానీ… నేను అలా చెయ్యను. మిమ్మల్ని మామూలు మనిషిని చేసుకొంటాను. అలా ఓ పది రోజులు… ఎటైనా తిరిగొద్దాం. కులూ మనాలీ వెళ్దామా?” అడిగింది.

అతను మాట్లాడకుండా ఆమెనే చూస్తూ కూర్చున్నాడు.

“నౌ ఇట్స్ టైమ్ ఫర్ లిటిల్ సతీష్‌స్ ఎరైవల్… ఆ ప్రయత్నం మొదలుపెడదాం” అని నవ్వింది.

సతీష్ చంద్ర గిల్టీగా చూసాడు. వందన దంతపు బొమ్మలా మెరిసిపోతోంది. ఆమె అందం ఆ నిమిషంలో ఇంకా వెయ్యి రెట్లు పెరిగిపోయినట్లుగా అనిపిస్తోంది.

ఆమె పక్కకి తిరిగి అతని బుగ్గ మీద ముద్దు పెట్టింది.

“ప్రతి భార్యా తన మొగుడు ఇలాంటి అవసరాల కోసం గడప దాటకుండా చూసుకుంటే చాలు… అదే స్త్రీ అభ్యుదయం… సంక్షేమం… పెద్ద పెద్ద నినాదాలూ, సంఘాలూ అనవసరం” అన్న నందిని మాటలు ఆమె మస్తిష్కంలో మెదిలాయి. జరిగిన దాంట్లో తన తప్పిందం ఎంతో ఆమెకి అర్థమయింది. నందినిని ప్రేమగా ఓదారుస్తున్న శశిధర్  కూడా గుర్తొచ్చాడు!

సతీష్ చంద్ర చాలా రోజులకి వందనని ఎలాంటి గిల్టీ ఫీలింగ్ లేకుండా ధైర్యంగా తాకగలిగాడు!

***

“అదోలా వున్నారేం?” అడిగింది లక్ష్మి.

వాసుదేవరావు వులిక్కిపడి భార్యను చూసాడు.

లక్ష్మి ముఖం చాలా ప్రశాంతంగా, పవిత్రతకి మారుపేరులా అమాయకంగా వుంది. ఆమె ఒడిలో బాబు అప్పుడే వస్తున్న ముద్దు ముద్దు మాటలు చిలుకలా వల్లె వేస్తున్నాడు.

వాసుదేవరావు కుర్చీ లోంచి లేచొచ్చి క్రింద లక్ష్మి పక్కగా కూర్చున్నాడు. “ఎకాడమీ ఎవార్డు కమిటీలో నన్నూ ఒక జడ్జిని చేసారు” అన్నాడు.

“మీరు ఒకప్పటి అవార్డు గ్రహీత కదా!  మీకూ ఒక వ్యాపకంగా వుంటుంది. కంగ్రాట్స్” బాబు వంటికి పఫ్‌తో పౌడర్ రాస్తూ అంది.

“మాళవిక మనింటికి వచ్చి వెళ్ళింది” తల దించుకుని అన్నాడు.

లక్ష్మి ఆ పేరు వినగానే నిటారుగా అయినట్లు, అతని ముఖంలోకి చూసింది.

“ఏదో సన్మానం… నాకు పర్స్ ప్రెజెంటేషన్ అని మాట్లాడింది” మాటలు కూడబలుక్కుంటూ అన్నాడు.

“మంచిదే!” బాబుని భుజాన వేసుకుని లేస్తూ అంది.

“ఆ విషయం ఒప్పుకున్నానని చెప్పడం కాదు… ఆమె ఇంటికి వచ్చి వెళ్ళిందని నీకు తెలియజేయాలని చెప్తున్నాను” అన్నాడు.

లక్ష్మి అతనివైపు సూటిగా చూస్తూ “మీరు మొదట చెప్పిన విషయానికీ, రెండోసారి చెప్పిన విషయానికీ లింక్ వుందా?” అంది.

అతను తల వూపాడు.

“సాహిత్య ఎకాడమీ అవార్డు పొందిన రచయితగా, ఒక ఎడిటర్‍గా, సాహిత్యం అనే రంగంలో మీరు చాలా ఏళ్ళు కృషి చేసారు. మీ జీవితంలో ఎందరో రచయితల్నీ, రచయితలుగా చెలామణీ అవుతున్న వాళ్ళనీ చూసి వుంటారు. మీకు నిజమైన సాహిత్యం అంటే తెలియదని కాదు! అవసరం కొద్దీ అన్యాయంగా ప్రవర్తించారు. ఇప్పుడు కూడా ఏది చెయ్యచ్చో, చెయ్యకూడదో నిర్ణయించుకోలేని అసమర్థులు కారు మీరు!” అని లోపలికి వెళ్ళిపోయింది.

వాసుదేవరావు ఆలోచనగా చూసాడు.

***

మాళవిక రామనాధాన్ని రెండు మూడు సార్లు కలిసింది. ప్రతీసారి అతను ఒకే మాట చెప్పాడు. “ఐ యామ్ హేపీ… నిన్ను కూడా నేను హేపీ చేస్తాను” అని.

ఆమె ఆనందానికి అవధులు లేవు.

కృష్ణమూర్తి ఏదో పని మీద విజయవాడ వెళ్తూ వుంటే రెండు రోజులు అతనికి కంపెనీ యిచ్చింది. అతనూ తృప్తి పడ్డాడు.

రాజశేఖరం సతీష్ చంద్రలా ఇవన్నీ పెద్దగా పట్టించుకునేవాడు కాదు. సినిమా మనిషి. ఇలాంటివన్నీ మామూలే! డబ్బు తప్ప ఇంకే పట్టించుకోని సినీ జనం మధ్యన వుండి వుండి పండిపోయినవాడు.

“ముసలాళ్ళని ఎలా లైన్‍లో పెట్టావు? పడి చచ్చిపోతున్నారు పాపం” అని జోక్ చేసేవాడు.

మాళవిక నవ్వేసేది.

ఒకసారి వాసుదేవరావుని కలిసింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here