వైకుంఠపురం వేంకటేశ్వరస్వామి ఆలయ దర్శనం

0
13

[ఇటీవల తెనాలి సమీపంలోని వైకుంఠపురం వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి ఆ అనుభవాలను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

‘కలౌ వేంకట నాయకః’ అన్న సూక్తిని నిజం చేస్తూ ఆ వేంకట రమణమూర్తి అన్ని చోట్లలో వెలసి భక్తాళిని రక్షిస్తున్నాడు. తెనాలి పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్నదే వైకుంఠపురం. అనుకోకుండా స్వామి వారి దర్శన భాగ్యం లభించింది భవదీయునికి.

తెనాలి దగ్గర కొలకలూరు గ్రామంలో ‘తెలుగు కళాసమితి, విశాఖ’ వారు బహుమతి ప్రదాన, సత్కార సభను నిర్వహించి, నాటికల పోటీలో విజేతలను సన్మానించారు. బహుమతి గ్రహీతలతో నేను ఒకడిని. 18 మే 2024, రాత్రి సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి, 19 ఉదయం 5.30 ని॥కు తెనాలిలో దిగాను. నిర్వాహకులు స్టేషన్ రోడ్‌లో, శ్రీ బృందావన్ రెసిడెన్సీలో, నాకూ నా మిత్రుడు డా. జెట్టి యల్లమందుకు ఎ.సి. రూం బుక్ చేశారు.

ఏ సభకు వెళ్లినా, చుట్టుపక్కల పుణ్య క్షేత్రాలను దర్శించడం మాకు రివాజు. పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించిన తలసాని కృష్ణప్రసాద్ గారిని, తెనాలిలో దర్శనీయ దేవాలయాలు ఏవైనా ఉంటే చెప్పమని అడిగాము. కేవలం 3 కిలోమీటర్ల దూరంలో, చినరావూరులో, వైకుంఠపురం ఉందనీ, శ్రీ వేంకటేశ్వరుడు, నాగేశ్వర స్వామి అక్కడ వెలిశారని ఆయన చెప్పారు. స్నానం చేసి, ఆటోలో గుడికి బయలుదేరాము. చాలా పెద్ద దేవస్థానం. ప్రవేశద్వారం కళాత్మకమైన ఆర్చి. మొదట మూల విరాట్టును దర్శించుకున్నాము.

స్వామివారు పదడుగుల ఎత్తున, నల్ల రాతి శిలపై చెక్కబడి ఉన్నారు. ఆ రోజు ఎందుకో మరి, నిరాభరణుడై కేవలం తులసి మాలాలంకృతుడై ఉన్నాడు స్వామి. ఇరువైపుల ఉపాలయాల్లో అమ్మవార్లు పద్మావతీదేవి, భూదేవి కొలువై ఉన్నారు.

ద్వారకా తిరుమలను వలె, ఈ క్షేత్రాన్ని కూడా ‘చిన్న తిరుపతి’ అని వ్యవహరిస్తారు. సుమారు నలభై సంవత్సరాల క్రితం, ఒక పుట్టపై శయనించి ఉన్న వేంకటేశ్వరునికి దేవాలయ నిర్మాణం జరిగింది. చుట్టుపక్కల గ్రామాల రైతులందరూ, తమ మొదటి పంట వరిని తెచ్చి, పరమాన్నం వండి, దేవునికి నివేదన చేస్తారు.

‘తెనాలి’ అనే పదానికి మూలం ‘తీన్‌నాల్’ అనే హిందీ పదమట. మూడు కాలువల నగరం ప్యారిస్ నగరంలో వలె మూడు కాలువలు ఉండటం వలన దీనిని ‘ఆంధ్రా ప్యారిస్’ అని పిలుస్తారు. ఇందులో ఒకటి పడవల కాలువ. మిగతావి రెండూ సాగునీటి కాలువలు.

తెనాలి కళలకు కాణాచి. కాంచనమాల, కొంగర జగ్గయ్య, గుమ్మడి, జమున, శారద, కృష్ణ, ఎ.వి.ఎస్ వంటి ప్రముఖ నటుల స్వస్థలం ఇది. చాలా పురాతన పట్టణం.

వైకుంఠపురం దేవస్థాన సంస్థాపకులు తుళ్లురు సుబ్బరాయుడు గారి కుమారుడు బాల నర సింహారావు గౌడ్. ఈయన స్వామివారికి పరమ భక్తుడు. స్వామివారు ఆయనకు స్వప్నమున సాక్షాత్కరించి, ఈ స్థలం పరమ పవిత్రమైనదని, ‘సతాం పర్యటనేనైన తీర్థీభూత భవంతీ హి’ అని సెలవిచ్చారు. ఎందరో సత్పురుషులు దీనిని దర్శించడం వల్ల ఇది తీర్థమైనదని దాని అర్థం. వారి పుణ్యాతిశయమున ఈ క్షేత్రము పునీతమైనది. ఇక్కడి జలము సమస్త పాప సంతాపహారి, సర్వవ్యాధి నివారకమని స్వామి చెప్పారు. ఈ స్థలము తనకు ప్రేమ పాత్రము కాబట్టి, తానిచట వెలసినానని, నాగేశ్వ ర రూపమున భక్తులకు సాక్షాత్కారమిచ్చెదనని, ఇచ్చట తనకొక ఆలయమును నిర్మింపవలయునని ఆనతిచ్చినాడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, బాలా నరసింహ గౌడుకు. ఆయన పరమానంద భరితుడై ఆలయ నిర్మాణము చేసినాడు. స్వామివారు తమ మహిమలను ఎన్నింటినో నిదర్శనముగ చూపినాడు. సర్పరూప ధారిగా, ఛత్రీభూత ఫణీంద్రునిగా ఉండటం ఈ క్షేత్రంలో విశేషం. ఎన్నో అనూహ్యమైన, అసంభవమైన అద్భుతాలు స్వామి కరుణతో జరిగాయని చెబుతారు.

‘మూకం కరోతి వాచాలం
పంగుం లంఘయతి వేగిరం’

జన్మతః మూగవాడు మాట్లాడగలిగినాడని, కుంటివాడు తన వైకల్యాన్ని పోగొట్టుకొని, పరిగెత్తినాడనీ ఈ శ్లోక భాగ భావం. అట్లే, గుడ్డివాడు దృష్టిని, నిస్సంతు సంతానమును, దీర్ఘ రోగి పూర్ణ ఆరోగ్యమును, పరమ నాస్తికుడు అస్తికతను, స్వామి కరుణచే పొందినట్లు నిదర్శనములున్నాయి. ఆలయం లోపల కుడ్యములపై బహుముఖ శిల్ప చిత్రాతిచిత్ర, శిల్పములు, నారాయణుని కథలను ప్రతిబింబిస్తాయి.

ప్రధాన దేవాలయం ఎదుటనే నాగేశ్వర స్వామి దేవాలయం ఉంది. అక్కడ పెద్ద పాము పుట్ట ఉంది. దాని చుట్టూ, నాగ ప్రతిమలను ప్రతిష్ఠించినారు. వాటిని భక్తలు పాలతో స్వయంగా అభిషేకించుకోవచ్చు.

పుట్ట అగ్రభాగంలో, వేంకటేశ్వర స్వామి మూడడుగుల విగ్రహం ఉంది. పైన శేషఫణి గొడుగుగా ఉన్నాడు. రెండూ ఏకశిలా నిర్మితాలు. నల్లరాతితో చేయబడి నయన మనోహరంగా ఉన్నాయి.

దేవాలయ ఆవరణలోనే చెట్టుక్రింద నాగేశ్వరస్వామి షణ్ముఖుడు (ఆరు పడగలు) గా వెలసినాడు.

ఒక వైపు ఆదివరాహస్వామివారు ఒక ఉపాలయంలో వెలసినారు.

ధ్వజస్తంభం, అంబరచుంబితమై, ఇత్తడి తొడుగుతో సూర్యకాంతిలో శోభిస్తున్నది. గాలికి అగ్రభాగాన ఉన్న చిరుగంటలు శ్రవణపేయంగా ధ్వనిస్తున్నాయి. మా మిత్రుడు యల్లమంద నాతో అన్నాడు.

“మిత్రమా! ఈ గంటల చప్పుడు వింటుంటే నాకు ‘ఆముక్త మాల్యద’ లోని పద్యం గుర్తుకు వస్తూంది.”

“గుర్తుకు రాకపోతే ఆశ్చర్యపడాలి మిత్రమా! చెప్పు మరి!”

మా యల్లమంద మంచి పాటగాడు. ‘తెలుగు పద్య కవితా సదస్సు’ ఉత్తరాంధ్ర కార్యదర్శి. ‘మధురవచస్వి’ బిరుదాంకితుడు. గొంతు విప్పి, ‘బిళహరి’ రాగంలో పద్యాన్ని మధురంగా ఆలపించాడు.

చం:
‘మలయపుగాలి రేలు వనమాలి విమానపతాక ఘల్లుమం
చులియ బసిండి మువ్వగమి నొక్కొకమాటు గదల్ప, నుల్కి మి
న్నలము తదీయ హేమవరణాంచల చంపకశాఖలందు బ
క్షులు రొదసేయ, వేగెనని కూడుదురల్కలు దీఱి దంపతుల్’

“శభాష్ జెట్టీ! పద్యపఠనంలో నీవు గట్టి!” అని నా స్నేహితుడిని అభినందించాను. ఆ పద్యభావం..

మలయపుగాలి అంటే దక్షిణపు గాలి. దాని ప్రభావాన్ని రాయలవారు హృద్యంగా వివరిస్తున్నారు. నారికేళపాకంలో అత్యంత ప్రౌఢమైన కవిత్వాన్ని రాసే ఆ తెలుగుకన్నడ రేడు, కదళీపాకంలో వ్రాసిన పద్యమిది. దక్షిణం నుంచి వీచేగాలి, వనమాలి గుడి ముందున్న ధ్వజస్తంభం మీది మువ్వల సమూహాన్ని కదిలించిందట. దాని అలికిడికి చెట్లకొమ్మలపై ఉన్నపక్షులు కువకువమని రొద చేశాయి. తెల్లవారుతూన్నట్లుందని, భార్యాభర్తలు లేచి, ముందు రోజు వచ్చిన అలుకలు తీరి, కలుసుకొన్నారట. దాంపత్య శృంగారమును ఒక తెమ్మెర ఎలా సాధించిందో చూడండి.

 

అక్కడ నుండి గోశాలకు వెళ్ళాము. దాదాపు పది పన్నెండు గోవులు ఒక ఆవరణలో ఉన్నాయి. ఒక నల్లని అవు నా దగ్గరకు వచ్చి నిలబడింది. దాని గంగడోలును నిమిరాను. ఒక చోట భక్తులు వదలిన రెండు అరటిపళ్లను ఆ గోమాతకు అందించాను.

ఆలయం బయట స్వామి వారి ప్రసాద వితరణ జరుగుతున్నది. చిన్నచిన్న విస్తరాకు దొన్నెల్లో, నేయి ఓడుతున్న, చాలా వేడిగా ఉన్న సేమియా హల్వా పెట్టారు. అది అత్యంత మధురం. ఊదుకుంటూ తిన్నాం. చేతి వేళ్ల జిడ్డు, కొళాయి దగ్గర నీటితో కలిగినా వదలలేదు. ఒక మంటపంలో పెద్ద పెద్ద నల్లని కుండలను ఇసుకలో నిలబెట్టి, చల్లని మంచినీరు భక్తులకు అందిస్తున్నారు.

తర్వాత స్వామి వారి కల్యాణం జరిగే పెద్ద మంటపం లోకి వెళ్లాము. చుట్టూ కళాత్మకమైన స్తంభాలతో, పైకప్పు విశాల అష్టదళపద్మంతో శోభిస్తూ ఉన్నది. స్వామివారి కళ్యాణమూర్తులను దర్శించుకున్నాము.

గాలిగోపురం ముందు ముఖ మంటపంలో ప్రముఖ వాగ్గేయకారుల విగ్రహాలు కొలువుదీరి ఉన్నాయి. శ్యామశాస్త్రి, త్యాగయ్య, అన్నమయ్య, నారాయణతీర్థ, రామదాసు మొదలగువారు సజీవశిల్పాకృతులుగా ఉన్నారు.

  

బయట ఆవరణలో ఆంజనేయ, గరుత్మంత విగ్రహాలు సమున్నతంగా ఉన్నాయి. వెనుకవైపు పచ్చని చెట్లు, కొండలు దర్శనమిచ్చాయి.

 

భక్తితో గూడిన గుండెలతో దేవస్థానం నుండి బయటకువచ్చి, బృందావన్ రెసిడెన్సీ చేరుకున్నాము.

‘వినా వేంకటేశం ననాథో ననాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి!’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here