వైర భక్తి!

0
10

[dropcap]సా[/dropcap]గరుడు: ఆపద ముంచుకొస్తోంది లంకేశ్వరా హెచ్చరిక, హెచ్చరిక,!నన్ను శుష్కింపజేసి,నిన్ను మట్టుపెట్టేసే ప్రభంజనం తరుముకొస్తోంది!

రావణ: ఏమిటయ్యా,ఏమిటి ఆ హడావిడి, ఆ తత్తరపాటు!ప్రాణాపాయం ఏదో వచ్చినట్టు ఏమిటా పరుగు!!

ఈ దశాస్యుడి మిత్రుడికి, నా బాహుదండ పరిరక్షితుడైన వనస్పతికి,మహాసముద్రుడికి, నీకా ఆపద!

                    లేక

సువిశాలమై,పెను అగడ్తయై, నా లంకా నగరానికి

చొరరాని దుర్భేద్యత కల్పించిన నువ్వు ఉండగా,ఆపద లంకకా?!

అయినా, రవి ఆకాశ వీధిన మామూలుగా ప్రకాశిస్తున్నాడు, గాలి యథావిధిగా వీస్తోంది!

చంద్ర హాస ఖడ్గం నా చేయి పట్టు వీడలేదు, ఆ రాముడేమీ ధనుస్సు ఎక్కుపెట్టి నీ ముందర లేడు, ఇంక భయం దేనికయ్యా, చెప్పు!!

ఏ భయమూ, ఇద్దరికీ లేదు, ముందు శాంతించు!  ఆసనం గ్రహించు, ఆ, ఇప్పుడు చెప్పు సంగతి ఏమిటో!

రాముడు తరలి వస్తున్నాడా, రానీవయ్య, అసలే ఆలస్య మయింది. ఆ వెన్నంటి నడిచే సౌమిత్రిని, కపిరాజు సుగ్రీవుని ఆ వానర సేననూ అందరికీ దారి ఇచ్చి, వదలవయ్య సాగరా! నా జీవిత కాల నిరీక్షణ ఫలం దొరికే సమయం ఆసన్నమయి నట్లున్నది!!

ఎంత తాత్సారం వహించాడయ్యా నా పట్ల, ఎప్పటి  మాట, ఆ వైకుంఠంలో కాదూ చేశాడు వాగ్దానం, నన్ను మళ్లీ తన దగ్గరకు పిలిపించుకుంటానని!! అది నెరవేరే ఘడియలు వచ్చినట్లున్నాయి. రానీయవయ్యా మిత్రమా, రానీయ్!!

ఈ వార్త చెవుల సోకిందో లేదో, రెండు భుజాలు ఎగిరెగిరి పడుతున్నాయి కదటయ్యా, పరాక్రమంతో నా స్వామిని మెప్పించాలని!!

నీకేం తెలుసు అర్ణవా, నే నీ ప్రభు సన్నిధి కోసమే, ఎంతటి ద్రోహానికి తలబడ్డానో!! ఆయనకు ప్రాణప్రదమైన సీతనే అపహరించి తెచ్చాను.

పని అవటం ముఖ్యం,మా జాతి విధానంలో! అంతే అదే చేశాను.

అంతిమ లక్ష్యం సాధింటానికి, ఏ మెట్లైనా ఎక్కవచ్చునన్నది మా రాక్షస నైజం! అనుకున్నది దక్కాల్సిందే, చంపనైనా చంపుతాం, చావనైనా చస్తాం!

చస్తాం అని, మాట వరసకు అనటమే కానీ, మమ్మల్ని ఎదిరించి నిలిచే ధీరుడెవ్వడయ్యా, సాగరా, ముల్లోకాల్లో!!

సీత కోసం చెట్టు పుట్టా పట్టుకొని వగచాడట,దీన మానవుడి లాగా!! మరి నన్ను మరిస్తే, నేనూరుకుంటానా,

ఆయనను రప్పించుకునే హక్కు నాకూ ఉన్నది. ఆయన ఇచ్చిన వాగ్దానం, పెన్నిధానంగా నమ్మి వేచియున్నవాడిని.

ఆ మాత్రం స్వతంత్రించక పోతే మా రాక్షస రాజసం చిన్నపోదూ!!

చివరకు ఆ జటాయువు చెపితే తెలిసిందిట, ఇది నా ఘన కార్యమని!! అబ్బ, పట్టలేను సముద్రా! నా ఆనందం,

సీత నా దగ్గర ఉందని తెలియగానే, నోరారా, బిగ్గరగా “రావణా “, అని అరచాడట నా పేరు!! కోపంతోటో, తాపంతోటో, నా పేరు ఉచ్చరింపజేసి, నేను గుర్తుండేట్టు చేసుకున్నాను. ప్రస్తుతానికి అదే నా సంతోషం!!

నాకేమి సంతోషమయ్యా, ఆ మునుల యజ్ఞాలు భంగం చేయటం, వారి ఆశ్రమాలు కూల్చటమున్నూ!!

ఆ జానకి నపహరించే పనికి కూడా ఒడిగట్టానంటే నయినా తెలుసుకోవచ్చు కదటయ్య ఇదంతా ఎందుకు చేస్తున్నానో!! ఇంత నిర్దయ దేనికయ్యా నమ్ముకున్న దాస జనం మీద?!

తీసుకొచ్చానే గాని, ఏ కాని పనైనా తలపులోకి కూడా రానీలేదే! అశోకవనంలో పూవులాగా చూశానే దూరాన ఉండి! పైగా బ్రహ్మాదులే ఆరాధించి, అప్సర స్త్రీలు కొలిచే దేవీ సమాన ఐన దానివి అని అందరి ముందు కీర్తించానే!!!

అసలు ఆమె కదలికలో, కూర్చునే తీరులో, సర్వ విధాలా ఆ రాముడి పట్ల నమ్మకం, సాగరం దాటి వచ్చి, తనను రక్షిస్తాడని ధీమానే కనిపించేదయా ఎంత సేపటికీ! ఆశ్చర్యం కలిగించే మాట ఇంకొకటి, అంభోనిధీ! మిత్రుడివి కాబట్టి నీతో పంచుకోవచ్చులే అని చెప్తున్నాను.

అదేమిటయ్యా, ఆమె ప్రతి కవళికలో, కదలికలో రాముడి వైనం తోస్తుంది, నాకు! అది నా భ్రమా?, నా స్వామి పట్ల నా అనుబంధమా, లేక వారిద్దరి అన్యోన్యత ఆ రకంగా ప్రతిఫలిస్తోందా తేల్చుకోలేనయ్యా, ఈ నాటికి నేను!!

ఇంక నేను కీడు తలచటమేమిటి ఆమెకు! నా ప్రభుని రప్పించాలనే లక్ష్య సాధనలో ఆమె ఒక పాత్ర అంతే!!

కానీ ఇంత చేసినా ఈ రావణ మనోగతం అర్థం చేసుకొని రాడేమయ్యా, సరిద్వల్లభా!!

శివధనుర్భంగం అయిన నాడే అనుమానించాను, ఇంతటి కార్యము, నారాయణుడు తప్ప అన్యులు చేయలేరని!! భ్రృగురాముణ్ణి వంచిన నాడే తెలిసిపోయింది,ఆ దక్షత నా విభుడిదే అని.

కానీ నా పట్ల మాత్రం ఎంత ఉపేక్ష!

అందుకే, ఎట్లాగయినా దృష్టి మళ్ళించాలని ఈ సీతాపహరణ అకృత్యానికి కూడా పూనుకున్నాను.

మంచితనమంతా తనకే దక్కనీయవయ్యా, ఎట్లాగో పది తలలతో మోస్తున్నాను, ఈ లోకకంటకుడన్న చెడ్డ పేరుని!

నాకు పోయేదేమిటి ఇప్పుడు! నా స్వామి దర్శనం అయితే అదే చాలునయ్యా నదీపతీ!!

వరాలు అడిగేటప్పుడు వీళ్ళదేముందిలే అనుకున్నాను కానీ, చూశావుటయ్యా ఈ మనుష్య జాతి రాజనీతి!!

లోక భీతితో నేను కిమ్మనకుండా ఉండాలా?! ఆయనేమొ వాగ్దాన భంగం చేసినా దేవుడా!  ఏమి విడ్డూరపు న్యాయం ఇదీ?!

అయినా ఉన్న మాట చెపుతా వినవయ్యా కడలిరాయా! ఆ పైన వైకుంఠంలో ఉండేటపుడు ఈయన ఇట్లా ఉండేవాడు కానేకాదు, బహు సరళ స్వభావి అప్పుడు! పైగా అపుడన్న మాట ఏమిటో తెలుసా, యజమానిగా దాసుల తప్పుకి తనకు బాధ్యత ఉన్నదని! మరి అదే నిజమైతే, తాను యే శిక్షలూ అనుభవించ నక్కరలేదు, కనీసం ఆడిన మాట నిలబెట్టు కోవటానికైనా రావాలి కదా, నన్ను ఆదుకోవటం, అటుంచి!

ఈ అలసత్వాలు, మాయలు, భూమ్మీదకు దిగిం తరువాతే నయ్యా అంతకు ముందు లేవు, మా స్వామికి, ససేమిరా!!

ఇంకొక మాట, ఆయన మూసేశాడు దారులన్నీ, కానీ నేను అన్నీ తెరచే కదటయ్యా ఉంచాను!! అందరికీ కనిపించే ఆకాశ మార్గానే కదా తన సతిని తీసుకెళ్ళాను, రహస్యం ఏముంది ఇందులో!! రావచ్చు కదా వెంటనే!!

భక్తుణ్ణే! ఆయన దర్శనం కోసం అలమటిస్తున్న వాడినే నేను! నిజమే, ఒప్పుకుంటాను! కానీ దీనతతో వేడుకొమ్మంటే  ఎట్లా  పొసుగుతుందీ, సహజ లక్షణాలను విడవటం అంత తేలికటయ్యా?!

ఇదేమన్నా, రాయి రప్పాతో వ్యవహారమా, నాతులతో కోతులతోనా! జగదేక ప్రతాపి రావణుడితో!! కాళ్ళ బేరానికి దిగే ప్రసక్తే లేదు!!

ఇదంతా సరేనయ్యా నేస్తమా! నువ్వు చూశావు కదా రాముణ్ణి, ఎట్లా ఉన్నాడు చెప్పవయ్యా! భార్య వియోగంతో క్రుంగి నీరసించి ఉన్నాడా?!  ఈ రావణ వధకై  శరసంధాన సంసిధ్ధుడై కనపడ్డాడా, ఎట్లా ఉన్నాడు?!

విన్నానులే, ఆ రాముడి చేతిలో మారీచుడు చావు తప్పి కన్ను లొట్ట పోయిన వైనం; మా శూర్పణఖ ముక్కూ చెవులూ పోగొట్టుకొని వచ్చి చెప్పిన  కథనం ,అన్నీనూ!!

కుర్ర తేజస్సుతో ఆ విశ్వామిత్రుడి యాగ రక్షణ, బిర్ర బిగిసి నిశ్చేష్టులై చూస్తు కూర్చున్న రాజలోకం ముందే

హర చాపాన్ని విరవటం,ఆ వాలి నొక్క కోలతో కూల్చటం,అన్నీ విన్నానయ్యా నేను కూడా !! అన్నిటి కంటే

మగసిరి గల పని చేశాడయ్యా,అదే పట్టుపుట్టాల లోంచి మారి క్షణంలో నార బట్టలు కట్టి అడవి దారి బట్టి దిట్టతనం చూపించిన తీరు!!

అయినా మీరు చూసిన ఆ శ్యామమోహన రాముణ్ణి చూసే అదృష్టం నాకు లేదయ్యా ఉదధి సుందరా! కోపం తెప్పించి, కయ్యానికి పిలిచాను గా, ఇక నేను చూడకలిగేది, సంగర రౌద్ర మూర్తినే!!

ఆ రకంగానయినా, తృప్తేనయ్యా, ఇంక వేచియుండ లేను, ఇప్పటికే, యుగాలు గడిచిపోయినట్లుంది నాకు!!

ఇంత వరకు వచ్చిన తరువాత ఇక ఏ బిభీషకలకు తావు లేదు తోయధీ! ఇక మా ఇద్దరి కలయిక రణరంగంలోనే,

త్రిజగజ్జేత రావణుని కత్తి వాదర త్తళత్తళలోనే  మేము మొహాలు చూసుకునేది!!

నువ్వు ధన్యుడివయ్యా సింధు శ్రేష్టా! స్వామితో నీకు పెక్కు విధాల అనుబంధం!  మత్స్య కూర్మ అవతారాలలో

నీలో కాదటయ్య స్వామి ఓలలాడిందీ!! పైగా నువ్వు ఆయనకు హాయి కూర్చే శయ్యవు కూడా!

ఏది ఏమైనా, రారా రాజీవ నయనా అని ముద్దాడిన ఆ తండ్రి కన్నా, ప్రేమార గోరు ముద్దలు పెట్టిన తల్లి కన్నా,

చెట్టపట్టాలు వేసుకొని కాననలకు సైతము అనుగమించిన సీత కన్నా, నీతో ఉన్న సంబంధము కన్నా నాదే గట్టిది, ఆయనతో!  యుగయుగాల ఆత్మ సంబంధియైన బాంధవ్యమయ్యా, ఆ లోకాభిరాముడితో!

మీ అందరికీ లంకె వేసింది ఆయన అయితే, నా ప్రత్యేకత ఏమిటంటే, ఆయనకే ఒక అపూర్వమైన బంధము వేయటం!! ఇది ఇప్పటిదీ, అప్పటిది కాదయ్యా,అనాది బంధం మాది,అంత కాలములో కూడా మాయని అమేయానుబంధం!!

ఆ రకంగా వైదేహీ హరణం చేసి నాకు మంచే చేసుకున్నాను. లేకపోతే నా లెక్క ఆయనంతట ఆయన ఎన్నటికి సరి చూసేవాడో!! అసలే భువనమెల్లా గృహమ్మైన త్రిభువన వల్లభుడు! సహస్రానేక కార్య నిర్వహణా వ్యగ్రుడు!!

ఏం,ఆయనకు మాత్రం కొత్త ఏమిటి ఈ యుధ్ధాలు,రాక్షస సంహారాలు!! హిరణ్యాక్షుణ్ణి మట్టు బెట్టలేదా, కనక

కశిపుణ్ణి చీరలేదా, వరాహ న్రృసింహావతారాలలెత్తి మరీ!! ఈ వేళకు నాకు దక్కుతోంది నా శౌర్య ప్రదర్శనా భాగ్యం!!

ఇదీ పురుషోత్తముడితో పోరు,చంద్రహాసమా!  విజృంభించాలి, అమరాధిపాదులతో చేసింది కేళీవిలాసమే అనుకో! ఇదే అసలు నీ పాటవం చూపాల్సిన  అదను!హెచ్చరిక నీకిదె, పట్టిన వీరవ్రత సాఫల్యత దక్కే సమయం వచ్చింది, రణ కౌశల విస్త్రృత ప్రదర్శనం చేయాలి! రాఘవుడికి నీ సంగర పాండితియె, లోచన సంతర్పణ!!

గరుడుడు లేడు, పాంచజన్యం లేదు, రావణుడితో యుధ్ధానికి వస్తున్నాడు, ఎంతటి ఆత్మ స్రత్యయమో, లేక అంతటి క్రోధ రూప కారుణ్యమో ఈ రాముడిది!!!

వద్దురా రఘువంశ కీర్తీ, ఏ ఆయుధాలు దాల్చకుండా, కైలాసమే కదలించి, శివుని మెప్పించిన ఇరవది చేతుల జోదు యీ దశ కంథరుడితో కయ్యమా!!

వలదురా ప్రభో! యీ రావణుడి చేత స్వాత్మహననము చేయించవలదురా!! నాది వైరమో, ప్రేమో  తెలియదు, కానీ ఈ విన్నపాలు మన్నించరా దేవా!!

కదన రంగంలోకి కాలు మోపితే, కనిపించేది విజయమో వీర భోజ్య నాకమో!! ఇది నిశ్చయం,ఈ సవనాంతములో మిగిలేది, ఒక్కరే!!

అది నేనని నా అహం హుంకరిస్తోంది!!

అది నా స్వామి యని నా ఆత్మ రస గీత మాలపిస్తోంది. శాశ్వతమైన దాని గెలుపు పై అనుమానం ఏముంది?!

రెంటిలో ఏది యైన నేను విజయినే!! ఇటు అయితే వీర మరణం! లేకపోతే…….. ఉహు, వాచా చెప్పలేను!.

నా స్వామి అజేయుడు! అప్రమేయుడు! అనిరుధ్ధుడు!!

ఏది ఏమైనా, ఈ రావణుడికిది,ఏక క్రియా ద్వ్యర్ధకరీ!!

నా నిరీక్షణ ఫలించబోతోంది,నా స్వామి స్వయంగా తానే నన్ను వెదుకుతు నా దగ్గరకు వస్తున్నాడు! ఇది యొక అపూర్వ సన్నివేశం! వైరి చేతిలో అంతమైనా ఆనందమే అనుకోగల్గిన ఆశ్చర్య గర్భిత కాలఘట్టం!

అంబుధీ,ఆప్తమిత్రమా! వెళ్ళి మంచి ముత్యాలతో రంగవల్లుల దీర్చి,నింగినంటు తరగల సింహపీఠి నిచ్చి,

కౌస్తుభాన్ని మించే మేల్రత్నాలతో ఎదురేగి తోడ్కొని రావయ్యా, ఆ రఘువీర చక్రవర్తిని లంకకు!!

వైర భావంతో కయ్యం చేసినా, నెయ్యపు నా చంద్రహాస ఝళిపింపులతో స్వామి హ్రృదయ కవాట గ్రంథులను విప్పి, ఆ ఏకాంతంలో నా సాదర ఆహ్వానంతో పాటు సభక్తిక విన్నపాలు,నీరాజనాలు సమర్పించుకుంటాననీ చెప్పవయ్యా!,

ఇక అక్కడే మనకు పునస్సమాగమం, సౌహ్రృదశేఖరా, ఓ సాగరా!

ఇదే నీకు మా అభయం, ఇక నిష్క్రమింతము, స్వస్తి!!!

******

(1940 లలో వచ్చిన కాటూరి వేంకటేశ్వరరావు గారి, “పౌలస్త్య హ్రృదయం” అనే లఘు పద్యకావ్య ఆధారంతో, ప్రేరణతో, స్వేచ్ఛగా వ్రాసిన సంవాద/స్వగత రూప స్వతంత్ర వచన రచన)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here