వల

0
8

[dropcap]”ఊ[/dropcap]ళ్ళో ఎన్నేళ్ళ బట్టో నమ్మకంగా నగలు చేసి ఇచ్చే కంసాలి నా వరహాల దండకు బంగారం తూకం వేసి తీసుకెళ్ళగానే అతడింట్లో దొంగలుపడాలా? ఆ బంగారమంతా దోచుకుపోవాలా? ఆ కంసాలేమో నలభై కాసుల బంగారం ప్రెసిడెంటుగారికి నేనెలా అప్పజెప్పేది? అప్పజెప్పకపోతే ఆయన బతకనివ్వడని భయపడి సెనైడ్ మింగి చావాలా? నా మొఖానే పొద్దు పొడవాలా? నష్టాలూ, కష్టాలూ అన్నీ నాకే రావాలా?” అంటూ ప్రెసిడెంట్ భార్య ఈ రోజు కూడా శోకాలు పెడుతున్నది.

“నాకు పెద్దపెద్ద వాళ్ళు ఎందరో తెలుసు అని ఎప్పుడూ గొప్పలు చెప్పుకుంటారుగా. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మీ కొడుకును ఇప్పటివరకూ జైల్లో నుంచి, బయటకు తీసుకురావటం చేతకాలేదు” అంటూ సాధించిపోసే కోడలి సాధింపులూ అన్నీ వింటూ జీవచ్చవంలా పడివున్నాడు ఒకప్పటి మాజీ ప్రెసిడెంటు. తన వాలు కుర్చీలో పడుకుని గతాన్ని నెమరు వేసుకుంటుంటే వెనుకటి రోజుల్లో తను చేసిన దుర్మార్గపు పనులూ, ఛండాలపు మాటలు అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొస్తున్నాయి. మనసు బాధతో కకావికలం అయిపోతున్నది.

ప్రెసిడెంటుగా పనిచేసిన లలితా, రవీ, ఇంకా ఇప్పటికీ ఈ ఊళ్ళోనే వుంటున్న మిలిట్రీ అతని భార్యా, కొడుకూ అందరూ మాటిమాటికీ గుర్తుకురాసాగారు.

బిల్ కలెక్టరు ఉద్యోగం ఖాళీ అయినప్పుడు తనెన్ని నాటకాలు ఆడాడో ఈ రోజు మాటిమాటికీ కళ్ళముందుకు వచ్చి పశ్చాత్తాపపడసాగాడు.

“నమస్కారమండి ప్రెసిడెంటుగారూ!”

“ఆ…ఆ… కూర్చో…. ఏం పనిమీద వచ్చావు?”

“మీ పంచాయితీ ఆఫీసులో బిల్ కలెక్టరు ఉద్యోగమున్నదని తెలిసింది. బిల్ కలెక్టర్లకు, మీరే ఉద్యోగాలివ్వొచ్చు అంట గదా? మాదీ పక్క ఊరే. నేను డిగ్రీ పూర్తి చేసి మూడేళ్ళయింది. చిన్న చిన్న పనులు చేసి కాలం నెట్టుకొస్తున్నాను. నేను చేయగల పొలం పనులుంటే వాటికీ వెళుతున్నాను. రెండేళ్ళనుండీ పంటలు సరిగా లేకపోయేసరికి మా నాన్న కౌలు చెల్లించటానికే ఇబ్బందిపడుతున్నాడు. ఇటు నాకా సరైన ఉద్యోగమూ రాలేదు. మా తమ్ముడూ, చెల్లెలు చదువుకుంటున్నారు. రెండు పాడి గేదెల్ని మేపుకుని, వాటి పాలమ్ముకుంటూ కాలం గడుపుతున్నాం”

“తప్పేదేముంది? ఎట్లాగో ఒకలాగా కాలం గడపాలిగా. మీకంటే ఇంకా మరే ఆధారం లేని కుటుంబాలు కూడా ఊళ్ళలో వుంటున్నాయి”

“మీరే నామీద దయ చూడాలండీ. నా సర్టిఫికేట్లు తెచ్చాను. చూపించమంటారా?”

“చూడొచ్చులే. తొందరేముంది? ఈ ఉద్యోగానికి డిగ్రీ వాళ్ళే కావాలని లేదు. ఇంకా తక్కువ చదువుకున్న వాళ్ళైనా పనికొస్తారనుకుంటున్నాను. నాలుగురోజులు పోయాక మళ్ళా ఒకసారి వచ్చి కనపడి గుర్తు చేసెళ్ళు” అంటూ నువ్విక వెళ్ళొచ్చు అన్నట్లుగా చూశాడు.

మరోసారి నమస్కారం పెట్టి రవికుమార్ అక్కడనుండి వచ్చేశాడు. “ఈ ప్రెసిడెంటుగారు కనీసం సర్టిఫికేట్లన్నా చూడలేదు. నాలుగురోజులున్నాక మళ్ళీ వస్తాననుకుంటూ ఆ రోజుకు సైకిలెక్కి తన ఊరి దారి పట్టాడు.

“నమస్కారమండీ. మళ్ళీ మీకొకసారి కనపడిపోదామని వచ్చాను”

“నువ్వా? నీ పేరేమన్నావు? కూర్చో. కిందటి నెల్లోనే మా బిల్ కలెక్టరు రిటైరయ్యాడు. ఈ నెలనుంచీ ఇంటిపన్నులన్నీ వసూలు చెయ్యాలి. మాకు బిల్ కలెక్టరు అవసరముంది. ఈ ఉద్యోగం కావాలనే ఓ ఇద్దరు కుర్రాళ్ళు మా ఊరివాళ్ళే వున్నారు. ఊరివాళ్ళను కాదని బయటివాళ్ళకు ఉద్యోగమిస్తే నాకు చాలా ఆక్షేపణలొస్తాయి. ఇదిప్పుడిప్పుడే పర్మనెంట్ కాదు. అయినా దీనికి చాలా డిమాండ్ వున్నది. అందుకేగా నువ్వూ వచ్చి అడుగుతున్నావు. పైగా నా ఒక్కడితో అయ్యేపని కాదు. అవతల గుంటూరు లోని ఆఫీసు చుట్టూ తిరగాలి. శాంక్షన్ చేయించాలి. చానా తతంగముంటుందిలే”

“ఈ బిల్ కలెక్టరు పోస్టు పర్మనెంటు కావటానికి టైమ్ పడుతుందని నాకు తెలుసండీ. కాని ఉద్యోగంలో అంటూ చేరితే గవర్నమెంట్ కొన్నేళ్ళకయినా పర్మనెంట్ చేస్తుందని నమ్మకమున్నదండీ. కష్టపడక తప్పదు కదండీ? ఆఫీసులో మీ పలుకుబడితో నాకీ ఉద్యోగం శాంక్షన్ చేయిస్తారని నమ్ముతున్నానండీ.”

“అవునవును. కొన్నాళ్ళు ఓపిక పడితే పర్మనెంటు అవుతుంది. జీతమూ వస్తుంది. రిటైరయ్యేదాకా ఉద్యోగం చేస్తారు. మధ్యలో ప్రమోషన్లు వుంటాయి. రిటైరయ్యాక పెన్షనూ పుచ్చుకుంటారు. అంతా లాభమే. మేం మాత్రం ఐదేళ్ళు పూర్తికాగానే ప్రెసిడెంటు కుర్చీని వదిలిపెట్టాలి. ఏ లాభమూ వుండదు. కనీసం ఉద్యోగం ఇప్పించాడన్న కృతజ్ఞతా మీకుండదు”

“అయ్యో! అలా అనకండి. నేనలాంటి వాణ్ణి కాదు. మీరు నాకుద్యోగం ఇస్తే జీవితాంతం ఆ ఉపకారం మర్చిపోను. నేనే కాదు. మా కుటుంబమూ మర్చిపోదు. ఒకరకంగా మీరు నా కుటుంబాన్ని నిలబెట్టినట్లే అవుతుంది”

“సరేనయ్యా చూద్దాంలే. ముందు మా ఊళ్ళో వాళ్ళ విషయం తేల్చుకోవాలి. మరో నాలుగురోజుల పోయాక కనపడు చూద్దాం” అంటూ లేచి నిలబడ్డాడు.

***

“ఏరా? ఎల్లి కనపడి వచ్చావా? ఆయనేమన్నాడు?”

“కనపడొచ్చాను నాన్నా. ఆయన ఎటూ తేల్చడం లేదు. మా ఊళ్ళోనే ఇద్దరున్నారు వాళ్ళ సంగతి ముందు ఆలోచించాలంటున్నాడు.”

“ఈసారి మనబ్బాయితోపాటు నువ్వూ తోడు ఎల్లవయ్యా. బతిమాలుకో. అవసరం మనది. అవసరానికి వసుదేవుడంతటి వాడే గాడిదకాళ్ళు పట్టుకున్నాడని మా నాయనమ్మ ఎప్పుడూ చెప్పేది. పోనీ ఒక పని చేస్తే? ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళతో చెప్పించాలేమో? అట్టా అడిగించుకుని కాని కొంతమంది సహాయం చెయ్యరు.”

“నాకాయన వాలకం చూస్తే అలాగే వుందమ్మా. ఎవరితో చెప్పించాలో మాత్రం నాకూ అర్థం కావడం లేదు.”

“ఒరేయ్ రవీ! మన ఊరి ప్రెసిడెంటు లలితమ్మ దగ్గరకు సాయంకాలం వెళ్దాం. నాకంటే వయసులో చిన్నదైనా, తనకి విషయాలు బాగా తెలుస్తాయి. మనకేదైనా దారి చెప్పుద్దేమో చూద్దాం. పైగా లలితమ్మ కష్టం, సుఖం తెలిసిన మనిషి.”

“అలాగే వెళ్దామమ్మా”

***

“ఏం పిన్నీ! ఏంటి ఇలా వచ్చారు? నీతో పాటు రవినీ తీసుకొచ్చావు. రండి కూర్చోండి”

“నీతో పని బడి వచ్చాం లలితమ్మా. నీ తమ్ముడు రవి ఉద్యోగం కోసం పక్కూరి ప్రెసిడెంటు గారి దగ్గరకు వెళ్ళి అడిగాడట. ఆయనెటూ తేల్చడం లేదు. ఇస్తాననీ చెప్పడూ, ఇవ్వననీ చెప్పడు. ఏం చేయాలో తోచక నీ దగ్గరకొచ్చాం”

“మన దగ్గర ఇప్పుడు ఏ అవకాశమూ లేదు. అలా వుంటే గనక నేను ఈ కుర్చీలో వుండగానే రవికి ఏదైనా సాయం చేసేదాన్ని. మన పక్కూరి ప్రెసిడెంటు ఏదీ త్వరగా తేల్చడు. పైగా ఊళ్ళోవాళ్ళే ఉన్నప్పుడు వాళ్ళకివ్వటానికే అవకాశముంటుంది.”

“ఆ సంగతి కూడా తేల్చి చెప్పడం లేదక్కా! ఎవరైనా పెద్దవాళ్ళ చేత చెప్పించుకోవాలనీ, ఇంకో నాలుగుసార్లు నన్ను తన చుట్టూ తిప్పుకోవాలన్నట్లుగా ఆయన వ్యవహారమున్నది. నువ్వేదైనా సలహా ఇస్తావని అమ్మా, నేనూ నీ దగ్గరకొచ్చామక్కా”

“మన మాట వింటాడనుకుంటే ఎవరైనా చెప్పటానికిష్టపడతారు. నేను గ్రామపంచాయితీల ప్రెసిడెంట్ల యూనియన్‍కు అధ్యక్షురాలినైనా నా మాట కూడ ఆయనకేం లెక్కుండదు. సరే, నేనొక లెటర్ వ్రాసిస్తాను. మన సమితి ప్రెసిడెంట్ గారి దగ్గరకెళ్ళి ఆయన్ను కలిసి, ఉత్తరమిచ్చి సహాయం చేయమని అడుగు. ఆయన చెప్తే ఏమైనా వింటాడేమో చూద్దాం” అంటూ ఉత్తరం వ్రాసిచ్చింది. “తర్వాత ఏ సంగతీ నాకొచ్చి చెప్పు రవీ” అంది.

“అలాగేనక్కా”.

***

“ఏమయ్యా రవీ! మాటవరసకు నాలుగురోజులంటే ఆ లోపునే ప్రయత్నాలు మొదలుపెట్టుకుని మరీ వచ్చావు. మీ ఊరి ప్రెసిడెంటమ్మ తనే ఫోన్ చేసి ఒకసారి మాట్లాడొచ్చు. నీకుద్యోగం ఇమ్మని నన్నడకుండా, సమితి ప్రెసిడెంటుకు చెప్పి ఆయన చేత ఫోన్ చేయించింది. తను ప్రెసిడెంట్ల యూనియన్ నాయకురాలుగా తను ఫోన్ చేస్తే ప్రెస్టేజీకి భంగం అనుకుందా? ఆవిడేమో మేజర్ పంచాయితీ ప్రెసెడెంటు, నేనేమో మైనర్ పంచాయితీ ప్రెసిడెంటును. మేజర్ పంచాయితీలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆమెకు తోడుంటాడు. మా మైనర్ పంచాయితీకుండడు. పెత్తనమంతా నాదే. నేనూ తక్కువవాడినేం కాదు. ఆడాళ్ల కోటాలో ఆవిడ ప్రెసిడెంటయింది. మా ప్రెసిడెంట్లకు బుద్ధిలేక ఆవిడకు ఓటు వేసి ప్రెసిడెంటును చేశారు. దాంతో ఆవిడక్కాస్త గీర వచ్చిందిలే. ‘ఈ మగాళ్లందరూ దద్దమ్మలు. నేనొక్కదాన్నే మొనగత్తెననుకుంటుం’దా ఏంటి?”

“అయ్యో ప్రెసిడెంటు గారూ! లలితక్క అట్లా గీరబోయే మనిషి కాదండీ. ఊళ్ళో ఎవరికే అవసరమొచ్చినా ముందు నిలబడుతుందండీ. అక్క మా ఊరి ప్రెసిడెంటయ్యాక మా ఊరి కళే మారిపోయిందండి. వెలిగే వీధి లైట్లతో, డ్రైనేజీ లేకుండా శుభ్రమైన వాతావరణం వచ్చిందండీ. పచ్చగడ్డి, చెరువుల్లో చేపల పాటలూ పంచాయితీ తరపున సక్రమంగా చేస్తున్నదండీ. ఊళ్ళో ఎన్ని మొక్కలు నాటించి పోషణ చేయిస్తున్నదనుకున్నారు! పొలాలకెళ్ళటానికి కూడా రోడ్డూ, కరెంటు పెట్టించిందండీ”

“ఇక ఆపవయ్యా. ఊళ్ళోనూ, బయటా ఎట్లా పొగిడించుకోవాలో ఆవిడగారికి బాగా తెలుసులే. నువ్వూ ఆ మాయలో పడిపోయావు. ఆ ఉద్యోగం సంగతి నేనింకా ఏం తేల్చుకోలేదు. మరో పదిరోజులు పోయాక చూద్దాంలే”

***

“ఏం రవీ? ఏంటిలా పంచాయితీ ఆఫీసుకొచ్చావు? ఉద్యోగం సంగతి ఏమన్నా తేలేటట్లు ఉన్నదా?”

“నువ్వు ఉత్తరం వ్రాసివ్వబట్టి సమితి ప్రెసిడెంటుగారు ఫోన్ చేసారట. కాని ఈయన ఇంకా నాన్చుతున్నాడు. మీ ఊరి ప్రెసిడెంట్ గారి చేత అడిగించకుండా వేరేవాళ్ల చేత ఫోన్ చేయించడమేంటని మాట్లాడుతున్నాడు”

“నన్నైతే లెక్కచేయడనిపించింది. అందుకే వారిని ఫోన్ చేసి చెప్పమని రిక్వెస్ట్ చేశాను. దానికిలా రియాక్ట్ అయ్యాడా? సరే ఇంకేదన్నా మార్గముందేమో చూస్తానులే”

***

“ఏం అప్పారావు? ఈ మధ్య ఉళ్ళో నువ్వు కనపడటం లేదు. ఏదైనా ఉద్యోగమొస్తే వెళ్ళావేమో అనుకుంటున్నాను.”

“లేదు ప్రెసిడెంటుగారూ! గుంటూర్లో ఒక ట్యుటోరియల్ కాలేజీలో పాఠాలు చెప్తున్నాను. ఆ కాలేజీ హాస్టల్లోనే వుంటున్నాను. మనూరి పంచాయితీ ఆఫీసులో బిల్ కలెక్టరు ఉద్యోగం ఖాళీగా వున్నది. నువ్వొచ్చి ప్రయత్నం చేయమని మా అమ్మ ఉత్తరం వ్రాస్తే మిమ్మల్ని కలుసుకుందామని వచ్చాను. మీరెలాగైనా నాకీ ఉద్యోగం వచ్చేటట్లు చూడండి. మీరు ఉద్యోగమిస్తే ఇక్కడే వుండి అటు పంచాయితీని, ఇటు మా అమ్మను కనిపెట్టుకుని మీకు నమ్మిన బంటుగా వుంటాను.”

“ఈ ప్రెసిడెంటు కుర్చీలో నేనెన్నాళ్లు ఉంటానయ్యా? రెండేళ్ళు అయ్యేపోయింది. మరో మూడేళ్ళు. ఎన్నాళ్ళు పడుతుంది? నీకు ఉద్యోగం అంటూ వస్తే కొన్నాళ్ళకు గవర్నమెంటు పర్మనెంటు చేస్తుంది. నెల నెలా జీతం వస్తుంది నీకు. అప్పుడప్పుడూ ట్రాన్స్‌ఫర్లు వుంటాయేమో కాని దాంతోపాటు ప్రమోషన్లు వుంటాయి. బిల్ కలెక్టరువు కాస్త సీనియర్ గుమస్తాగానూ, ఆ తర్వాత పంచాయితీ ఆఫీసరుగానూ మారతావు. రిటైరయ్యాక పెన్షనూ పుచ్చుకుంటావు. మాదేముంది? ఈ మూడేళ్ళుపోతే పాత ప్రెసిడెంట్‍నవుతాను. మమ్మల్నెవరూ గుర్తుపెట్టుకోరు. అంతకుమించి నాకొరిగేది ఏమీ వుండదు”

“అయ్యో! ఎంతమాటండీ? మీ వలన సహాయం పొంది ఎలా మర్చిపోతాం? నా చర్మంతో మీకు చెప్పులు కుట్టించి ఇచ్చినా మీ ఋణం తీరదు. మీరు నాకీ సహాయం చేస్తే, మా అమ్మ నెత్తినా, నా నెత్తినా పాలుపోసినట్లే.”

“పక్కూరి కుర్రాడొకడు అదేపనిగా తిరిగిపోతున్నాడు. పెద్దపెద్ద వాళ్ళ చేత ఫోనులు గూడా చేయిస్తున్నాడు. నిన్ను చూస్తే జాలేస్తుంది. దూరపు చుట్టాలు ఈ ఊళ్ళో వున్నారని మీ నాన్న పాపం మిలిట్రీ నుండి వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు. నాలుగేళ్ళయినా గడవకుండానే చచ్చిపోయె”

“అవునండీ నేను టెన్త్ క్లాసులో వుండగానే నాన్నగారు పోయారు. అమ్మే కష్టపడి డీగ్రీ దాకా చదువు చెప్పించింది. తొందరగా నాకేదైనా ఉద్యోగమొస్తే అమ్మను సుఖపెట్టాలని ఆశపడుతున్నాను. మీరు దయతలిస్తే నేనూ, మా అమ్మ, నిశ్చింతగా బతుకుతామండీ”

“సరే చూద్దాంలే. మాటిమాటికి ఇక్కడకు రావడానికి ఆ ట్యుటోరియల్ కాలేజీ వాళ్ళు పంపరేమో. ఒకవారం పోయాక మీ అమ్మనొచ్చి ఒకసారి కనపడి గుర్తుచెయ్యమను. పంచాయితీ ఆఫీసులో నలుగురూ వుంటారనుకుంటే మా ఇంటికైనా సరే వచ్చి కనపడమను. నేను పనుల్లో పడి మర్చిపోతాననే కారణంతో ఈ మాటంటున్నాను. సరే వెళ్ళిరా”

“అమ్మా! నన్ను ట్యూటోరియల్ కాలేజీకి శెలవుపెట్టి రావద్దని ప్రెసిడెంటు గారు చెప్పారు. ఒక వారం ఆగి నిన్ను పంచాయితీకి కాని, ఇంటిక్కాని వచ్చి గుర్తు చేయమన్నారు. చూడబోతే కాస్త అర్థం చేసుకునే మనిషిలాగానే వున్నాడు”

“ఏమోరా అప్పారావ్! ఆ దేముడు దయతలిస్తే బాగుండును. ఈయన రూపంలోనైనా మనకు సాయం అందితే అదే పదివేలు. దూరపు చుట్టాలున్నారు. వాతావరణం బాగుంటుందని మీ నాన్న ఈ ఊరు కాని ఊరు వచ్చి ఇల్లు కట్టారు. ఆయన పోవటంతోనే చుట్టాలు మొహం చాటేశారు. సొంత గూడు ఉందని నువ్వూ, నేను ఇక్కడ తలదాచుకుంటున్నాం. తప్పేదేముంది నాయినా! పంచాయితీ ఆఫీసులో, అయితే నలుగురూ మొగవాళ్ళుంటారు. వాళ్ళ ఇంటికే పోతాన్లే. ఇంట్లో వాళ్ళ ఆడాళ్ళుంటారుగా వాళ్ళ ద్వారా అయినా గుర్తు చేస్తాను. నువ్వు గుంటూరెల్లిపో”

***

“అమ్మా! ప్రెసిడెంటుగారున్నారా?”

“వచ్చే టైమయింది. లోపలకొచ్చి కూర్చోండి”

వాకిట్లో మోటార్ సైకిల్ ఆగిన శబ్దం వినపడింది. అమె భుజాలచుట్టూ కప్పుకున్న కొంగును మరోసారి సరిచేసుకుని సర్దుకుని కూర్చున్నది. ఒక పావుగంట గడిచింది. ఆమె కూర్చున్న వరండాలోకెవరూ రాలేదు. లోపల్నుండి మాత్రం మాటలు వినిపిస్తున్నాయి. మరో ఇరవై నిమిషాల తరువాత తడి చెయ్యి తుడుచుకుంటూ ఏభైఏళ్ళ వయసున్న ఒకాయన వరండాలోకొచ్చాడు. లుంగీ, బనియన్‌తో వున్నాడు. భుజం మీద తుండుగుడ్డ వేలాడుతున్నది.

‘ఈయనే ప్రెసిడెంటా? ఏమో? ఈయనే అయితే పక్కగుమ్మంలోనుంచి లోపలి కెళ్ళాడేమో? భోజనం చేసి వస్తున్నట్లున్నాడు’ అనుకున్నదామె.

“పనేంటో చెప్పండమ్మా. ప్రెసిడెంటుగారు కావాలన్నారుగా” అన్నది లోపలినుంచి వచ్చినామె.

తడబడుతూ లేచి నుంచుని “నమస్కారమండీ” అంటూనే “అప్పారావు మా అబ్బాయండీ, కనపడిపోదామని వచ్చాను” అన్నది.

“అప్పారావు మీ అబ్బాయా! ఉద్యోగమివ్వమని వచ్చాడు”

“అవునండీ. మీరు దయతలిస్తే నా కొడుకు ఉద్యోగస్తుడవుతాడు. మా కష్టాలు తీరతాయి”

“ఆ ఉద్యోగానికి చాలా ఒత్తిడి ఉన్నది. పెద్దపెద్ద వాళ్ళ రికమండేషన్లు తీసుకుని వస్తున్నారు.”

“మాకెవరి అండా, దండా లేదండీ. డబ్బులు పెట్టి ఉద్యోగాలు కొనుక్కునే స్థితిలో మేం లేమండీ. తండ్రిలేని పిల్లవాడు. మీరు పెద్దమనసు చేసుకుని మా వాడికా ఉద్యోగమిస్తే జీవితాంతం మీ పేరు చెప్పుకుని బతుకుతాడు. వాళ్ళ నాన్న కావాలని ఈ ఊరు వచ్చినందుకు ప్రతిఫలం దక్కిందని సంతోషపడతాం”

“మీరు సంతోషపడతారు. సంతృప్తిపడతారు. సరే, అసలు ఊరివాళ్ళనొదిలేసి ఎక్కడినుంచో వచ్చిన వాళ్ళను అందలం ఎక్కించాడని నన్ను నలుగురూ నానా మాటలూ అంటారు. నేనవన్నీ చూసుకోవాలిగా”

“అవుననుకోండి. కాకపోతే మా పరిస్థితిని బట్టి దయచూడమని మాత్రమే బతిమాలుకుంటున్నామండీ”

“మీ ఆయన మిలిట్రీలో వున్నప్పుడు ఒంటరిగా కొడుకును పెట్టుకును వుండి వుంటావు. మళ్ళా మీ ఆయన బయటికొచ్చేసిన కొద్ది రోజులకే మిమ్మల్ని వదిలేసి తనదారిన తను బోయె. ఎప్పుడూ ఒంటరి బ్రతుకు అయిపొయె. ఏంటో కొంతమంది జీవితాలు ఇట్లా మోడుల్లా అయిపోతాయి”

“ఏం చెయ్యనండీ? ఎప్పుడో నేను చేసుకున్న పాపం. అది ఇట్టా కట్టి కుడుపుతున్నది. మళ్ళీ నన్నెప్పుడు వచ్చి కలవమంటారు?”

“ఏదో తంటాలుపడదాం. ఒకవారం పోయాక కనబడు” అంటూ లోనికి వెళ్ళిపోయాడు.

ప్రెసిడెంటుకు మరోసారి నమస్కరించి ఆమె వీధి వాకిలి గుండా వెలుపలికొచ్చేసింది.

ప్రక్కూరి నుంచి ఉద్యోగం కావాలని వచ్చిన రవి వాళ్ళ ఊరి ప్రెసిడెంటు లలిత చేత ఫోన్ చేయిస్తాడేమోనని ఎదురుచూస్తున్నాడు. ఆవిడసలే రూల్స్ మనిషి. ఏది మాట్లాడినా, ఏది చేసినా రూల్ ప్రకారం పోవాలి అంటుంది. పంచాయితీ ప్రెసిడెంట్ల మీటింగులకెళ్ళినప్పుడు ఆ లలితను దగ్గరగా చూస్తున్నాడు. మనిషి మహా కొరకంచు అనుకుంటాడు తను. గ్రామాలకు ఏదో మంచి చేయాలని తెగ ఆరాటం చూపిస్తది. అంతా బూటకం. నలుగురిలో తెలివిగలది, మంచిది అనిపించుకోవటానికి ఈ ఆర్భాటమంతా. మా ఆడంగి రేకులన్నీ దానికే ఓటేసి తననే ప్రెసిడెంట్ల యూనియన్ అధ్యక్షురాలిగా చేశారని మరీ బడాయిపోతుంది. ఎప్పుడన్నా మీటింగుల కెళ్ళినప్పుడు ‘పక్కూరేగా బండిమీద దింపుతాను రండి’ అంటే ‘వద్దు. మీరెళ్ళిపొండి నా ఏర్పాటు నాకుంది’ అంటూ ఎవడో కుర్రాడి బండెక్కి వెళ్ళిపోతుంది. దాని కళ్ళకు ముసలాళ్ళు కనపడరేమో? చేతనైనంత వరకు అందరికీ సాయం చేయాలని ఆరిందా కబుర్లు చెప్తుందిగా. మరి తనూరి కుర్రాడికి ఉద్యోగమివ్వమని స్వయంగా వచ్చి అడగలేదు. కనీసం ఫోన్ అయినా చెయ్యలేదు. దానిచేత ఒకటి రెండుసార్లు అడిగించుకోవాలన్న తన కోర్కె తీరటం లేదు అనుకున్నాడు.

ఆ ప్రెసిడెంటు ఆంతర్యం లలితకర్థమైంది. ఏదో విధంగా తనని రప్పించుకుని, తనచేత గట్టిగా అడిగించుకోవాలనో, బతిమాలించుకోవాలనే పట్టుదలలో వున్నాడు. అసలే తనంటే ముందునుంచీ అక్కసుగా వున్నాడు. ఆడది మా మగాళ్ళ ముందు ఇదేపాటిది అన్న చులకన భావం ఆ మనిషికి బాగా వున్నది. వెకిలి స్వభావమున్న రోత మనిషి కూడాను. అది గమనించే తను సమితి ప్రెసిడెంటుగారి చేత ఫోన్ చేయించింది. రవి తమ ఊరివాడు, దూరపు బంధువు. అతనికిప్పుడు ఉద్యోగం చాలా అవసరం. తనే స్వయంగా వెళ్ళి కలిసి మాట్టాడటం లేదని రవీ అతని కుటుంబసభ్యులు ఆందోళన పడుతున్నరు. ఆ ప్రెసిడెంట్‍తో వ్యవహారం తేలికగా వుండదని వీళ్ళకు తెలియదు. ‘నీ కాండిడేట్‍కు ఉద్యోగమిస్తే నాకేంటి ప్రతిఫలం’ అనేయగలడు. సరైన దోవగలవాడైతే అవసరపడ్డప్పుడు తనూ సాయపడగలదు. ఆ అడ్డగోలు మనిషితో వ్యవహారం సాఫీగా వుండదు అన్న ఆలోచనలో పడింది లలిత.

***

“వచ్చినావిడ ఎవరండీ? మనూళ్ళోనే వుంటుందట. ఎప్పుడూ చూసిన గుర్తే లేదు. ఏం పనిమీద వచ్చింది?”

“తన కొడుకు అప్పారావుకు బిల్ కలెక్టరు ఉద్యోగమివ్వమని అడగటానికి వొచ్చింది. మొగుడు మిలిట్రీలో పనిచేశాడు. మన ఊరి మొగదలలో కొత్తిళ్ళ దగ్గర చోటుకొని ఇల్లు కట్టాడు. ఆ తర్వాత నాలుగేళ్ళకే చనిపోయాడు. ఇప్పుడావిడ కొడుకుతో కలిసి వుంటున్నది. ఒంటరి మనిషి. ఖాళీగానే ఇంటిపట్టునే వుండే మనిషి. నీకేదైనా మనిషి సాయం కావలసి వచ్చినప్పుడు కబురుపెట్టు. వచ్చి చేసి పెడుతుంది.”

“అయ్యో! సాటి మనిషి. పనులు ఎలా చెప్తామండీ? ఆవిడేమన్నా చిన్నపిల్లా?”

“అంత మొహమాటం పనికిరాదు. ఉద్యోగం కావాలని మన వాకిట్లోకి వచ్చిన తర్వాత, గోరోజనాలు పోతే ఎలా కుదురుతుంది? మనం ఏం చెప్తే అది చెయ్యాల్సిందే”

“అప్పారావుకు ఉద్యోగం వేయిస్తారా?”

“చూద్దాం. అదంతా త్వరగా తేలే విషయం కాదు”

***

ఒకవారం పోయాక అప్పారావు తల్లి మళ్ళీ వచ్చింది.

“తమరు కనబడమన్నారని వచ్చానండీ ప్రెసిడెంటుగారూ”

“పనేంటి? ఓ మీ అప్పారావుకు ఉద్యోగం కావాలంటున్నారు కదూ. దానికైతే చాలా పోటీ ఉంది. ఈ ఉద్యోగమిప్పిస్తే నాకేదో పెద్ద బహుమతే ఇస్తామని చెప్తున్నా ఇంటి చుట్టూ తిరిగిపోతున్నారు. నా లాభం నేను చూసుకోవాలిగా. ఈ ప్రెసిడెంట్ కుర్చీలో ఉంటే మనకంతా ఖర్చే. మా చేతి చమురు వదలటమే కాని పైసా రాబడీ వుండదు. ఉద్యోగం అంటే అలా కాదుగా. రిటైరయ్యేదాకా నెలనెలా బిళ్ళ కుడుముల్లాగా రూపాయిలు ప్రోగు చేసుకోవటమూ, ఆ తర్వాత బతికినంత కాలమూ పెన్షన్ పుచ్చుకోవటమూ. ఇంత లాభం తెచ్చిపెట్టే పనిని ఎవరైనా ఉచితంగా ఎలా చేయించుకుంటారు? విశ్వాసంగానైనా ఉందామనుకుంటారుగా” అంటూ ఆమె వంక పరిశీలనగా చూడసాగాడు.

అప్పారావు తల్లి ముఖం ఆ మాటలు విని వెలవెలా పోయింది. ఉద్యోగమిస్తే దానికి బదులుగా ఏం ఉపకారం చేస్తానని చెప్పాలా అని ఆలోచించింది. ఆమెకేం తట్టలేదు.

“మా అబ్బాయితో ఆలోచించి చెప్తానులెండి”

“నువ్వు సొంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోలేవా ఏంటి? బదులు తీర్చుకోవాలన్న ఉద్దేశ్యం ఉండాలన్నా మనసుంటే మార్గం దొరుకుతుంది. మీ అబ్బాయికి చెప్పాల్సిన పనేమీ లేదు. నీ మాట నీ కొడుకు కాదంటాడా ఏమిటి? కొన్ని మీ అబ్బాయికి చెప్పకుండా చెయ్యొచ్చు” అన్నాడు నెమ్మదిగా.

ఆమె అటూ ఇటూ దిక్కులు చూసింది. ఇంట్లో వాళ్ళంతా లోపల ఎక్కడో వున్నట్లున్నారు. చటుక్కున లేచి నిలబడి “మళ్ళా వచ్చి కనపడతాలెండి” అంటూ పెద్దపులిని చూసి భయపడే లేడికూనలాగా తడబడే అడుగుల్తో లేచి వచ్చింది.

వెళ్ళే ఆమెవంక చూస్తూ పడక్కుర్చీలో జేరగిలబడి పడుకున్నాడు అతను.

***

లలిత ఆరాలు తీసుకున్నది. ఆ ప్రెసిడెంట్ ఉద్దేశమేమిటి? ఆ బిల్ కలెక్టరు ఉద్యోగం ఎవరికివ్వజూపుతున్నాడు. ఏమేం షరతులు పెడుతున్నాడో తెలుసుకున్నది. నెమ్మదిగా విషయం బయటికొచ్చింది. వాళ్ళ ఊరు కుర్రాడి దగ్గరే యాభై వేలు తీసుకున్నాడు. అతడికే ఖాయపరిచాడు. రేపోమాపో అతడు డ్యూటీలో జాయిన్ అవుతాడని గట్టిగా తెలిసింది. ఆ విషయం బయటకు చెప్పకుండా తన చేత అడిగించుకోవడానికీ, ఆమె అడిగినా నేను చెయ్యలేదని బీరాలు చెప్పుకోడానికి ప్లాన్ వేశాడు. ‘నువ్వంటే నాకేం లెక్కలేదు అని నా ముందు కాలరెగరేసి తిరుగుదామని ఆలోచించాడ’నుకున్నది. ఇంతలో వరండాలోకి ఎవరో వచ్చినట్లు అలికిడి అయ్యి హాల్లో నుంచి వరండాలోకి వచ్చింది.

తమ ఊరి ఆమె, మరొకామెను తీసుకొచ్చింది. వచ్చినావిడ లలితను చూస్తూనే “నమస్కారమమ్మా” అన్నది.

***

“లలితా! ఈవిడది మన పక్క ఊరే. తనూ తన కొడుకూ వుంటారు. వాళ్ళ ఊరి పంచాయితీలో బిల్ కలెక్టర్ ఉద్యోగం ఖాళీగా ఉందని తెలిసి ప్రెసిడెంటు గారి దగ్గర కెళ్ళి అడిగారట. అసలు ప్రెసిడెంట్లే ఆ ఉద్యోగం ఇవ్వొచ్చా! నిన్నడిగితే విషయం తెలుస్తుందని నీ దగ్గరకొచ్చాం. మా అత్తగారికి బంధువులవుతారు. నిన్ను కలుసుకుని మాట్లాడితే వివరాలు తెలుస్తాయని ఎవరో చెప్తే మనూరు వచ్చింది”

“అవునండీ. విషయం మీరైతే స్పష్టంగా చెప్తారని విన్నాను. నేనూ నా కొడుకు అప్పారావు వెళ్ళి అడిగాం. ఆయన అంతనా, పొంతనా లేని సమాధానాలు చెప్తున్నారు. దిక్కుతోచక మీ దగ్గరకొచ్చాను”

“ఉద్యోగం ఇవ్వాలంటే ప్రెసిడెంట్లు కూడా పై అధికారులకు తెలియజేసి పర్మిషన్ తెప్పించుకోవాలి. పై ఆఫీసుల్లోనే శాంక్షన్ చేయించుకోవాలి. కాకపోతే ఊరి ప్రెసిడెంటు ద్వారా ఆ అప్లికేషను వెడుతుంది. తోటి ప్రెసిడెంటు మీద నేను అభాండాలు వెయ్యకూడదు. నేనూ మా ఊరి కుర్రాడి కోసం ఎంక్వైరీ తీయించాను. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఆ ఉద్యోగాన్ని లంచం తీసుకుని మీ ఊరి అతనికి ఖాయపరిచాడు. మిగతా వాళ్ళను వేడుగ్గా తన చుట్టూ తిప్పుకోవాలనీ, తన భేషజాన్ని చూపించాలనీ తాపత్రయపడుతున్నాడు. నా ఉద్దేశమైతే మీరు మరోసారి అక్కడకు వెళ్ళే అవసరం లేదు.”

“విషయం సాంతం అర్థమయీ, కాకుండా నాలో నేనే మల్లగుల్లాలు పడుతున్నానండీ. వేరేవాళ్ళకు ఖాయపరచిన సంగతి బయటపడనీయకుండా చాలా నాటకాలాడుతున్నాడు. మీరీ విషయం చెప్పి నాకు చాలా ఉపకారం చేశారమ్మా. వెళ్ళోస్తాను” అంటూ మరోసారి నమస్కరించి లేచొచ్చింది.

“‘పయోముఖ విష కుంభం’ అంటే ఆ ప్రెసిడెంటుకు చక్కగా సరిపోతుంది” అనుకున్నది అప్పారావు తల్లి.

‘ఇంకెప్పుడూ ఆ ఛాయలకు పోకూడదు, ఇలా ఇంకెంతమందికి మాయమాటలు చెప్తాడో ఆ ప్రెసిడెంటు’ అనుకున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here