వాళ్ళిద్దరూ..

0
7

[box type=’note’ fontsize=’16’] విడాకులు తీసుకుందామనుకున్న దంపతులు అభిప్రాయ బేధాలను తొలగించుకుని కలిసి జీవించడానికి కారణమేంటో కొక్కెరగడ్డ వెంకట లక్ష్మణరావు కథ “వాళ్ళిద్దరూ…” చెబుతుంది. [/box]

[dropcap]హో[/dropcap]రున గాలి.. జోరుగా వర్షం..!

ఊహించని ప్రకృతి ప్రకోపానికి భయభ్రాంతులైన జనం.. ఎక్కడివారక్కడే సర్దుకున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని ఎదిరించలేక.. వెనక్కు తగ్గారు.

అతను మాత్రం వెనక్కు తగ్గలేదు. వెళ్ళాలి.. ముందుకు వెళ్ళాలి. వెళ్ళి తీరాలని తీర్మానించుకుని బైక్ స్టార్ట్ చేశాడు.

బలంగా పైనుండి పడుతున్న వాన చినుకులు బలవంతుడు వదిలిన బాణాల్లా అతని శరీరానికి తగులుతున్నా.. అతడు లెక్కచేయలేదు. అంత కంటే బలంగా యాక్సిలేటర్ రెయిజ్ చేస్తున్నాడు.

కొంత దూరం అలా వెళ్ళేసరికి ఒకామె “లిఫ్ట్” అంటూ చేయి అడ్డంగా చాపింది.

ఆమె కూడా వర్షంలో తడిసి ముద్దయ్యింది.

చుక్కల చీరలో.. తడిసిన కురులను ముడుచుకుంటూ.. చీర కొంగును ముడి వేసి బలంగా పిండుకుని.. అతనితో “థ్యాంక్స్” అంటూ అతని వెనుక కూర్చుంది.

బ్రేక్ వేసినప్పుడు, స్పీడ్ బ్రేకర్ అడ్డొచ్చినప్పుడూ అతనికి ఆమె తగలకుండా ఉండాలని, వాళ్ళిద్దరి మధ్యగా హ్యండ్‌బ్యాగ్‌ను ఎడంగా పెట్టింది.

వర్షాన్ని చూసి బయటకు రాలేక జనం వెనక్కుతగ్గారు. కాని ఈ ఇద్దరూ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వెళ్ళడంతో, కొంత సేపటికి వర్షమే వెనక్కు తగ్గింది.

ఎడమవైపు అద్దంలో ఆమె కనబడింది.

ఫేస్ సీరియస్‌గా ఉంది.

“కొంచెం నవ్వొచ్చుగా!” ఆమెకు వినబడకుండా మెల్లగా అన్నాడతను.

కానీ గాలి అతని మాటను ఆమె చెవికి చేరవేసింది.

“కడుపులో ‘కసి’ పెంచుకుని మీలా నవ్వడం మాకు చేతకాదు లెండి!” ఆమె అంది.

“ఏ మాట మాట్లాడినా డొంకతిరుగుడుగా అర్థం చేసుకుంటావ్ కనుకనే గొడవలన్నీ!” అతను అంటున్నాడు.

“అవునండీ.. మాకు సరిగ్గా అర్థం చేసుకోవడం రాదు.. మాటలు పెంచకండి. లిఫ్ట్ ఇచ్చినందుకు మరొక్కసారి థ్యాంక్స్” ఆమె అంది.

“థ్యాంక్స్ నేను చెప్పమనలేదు.”

“ముక్కు మొహం తెలియని వాళ్ళు లిఫ్ట్ ఇస్తే.. నేనిలాగే థ్యాంక్స్ చెబుతాను” సెటైర్ వేసిందామె!

“నువ్వు మారలేదు.”

“అవును మారలేదు. విడిపోయే ముందు కలిసి విడిపోతున్నాం.. విధి విచిత్రమైనది. ఏమండి.. లాయర్‌గారు ఆలస్యం అయితే మరో చోటుకు వెళ్ళిపోతారు” సీరియస్‌గా అందామె.

అతడు యాక్సిలేటర్ రెయిజ్ చేశాడు. అంత కంటే వేగంగా అతని ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి.

***

“నందనీ! నేనొక్కసారి చెబితే.. నిర్ణయం మారదు.. మార్చుకోను! అది ఫైనల్. మీ పేరెంట్స్‌కు నువ్వు ఏకైక కూతురువే! కాదనను. కానీ మీ నాన్నగారు చనిపోయినందుకు.. ఏ దిక్కు లేని మీ అమ్మను మనింట్లోకి ఆహ్వానిస్తే.. అంగీకరించేది లేదు. సెలవు రోజుల్లో అప్పుడప్పుడు అమ్మను చూడటానికెళ్ళు.. నీ నెల జీతంలో సగం ఇవ్వు.. కాదనను.. కానీ శాశ్వతంగా ఆవిడ మనతో పాటే ఉంటానంటే..”

నందిని భర్త కేసి బాధగా చూసింది!

“ఆపండి..! మావయ్యగారు పోయాకా ఎక్కడో పల్లెటూళ్ళో ఉంటున్న అత్తయ్యగారిని మనతో తీసుకువచ్చినప్పుడు.. ఈ మాట అనలేదే?”

“కొడుకుగా అది నా బాధ్యత” చెప్పాడు కిషోర్.

“మరి.. కూతురైనా కొడుకైనా.. మా అమ్మ కూడా నా బాధ్యతే కదా! ఈ జీవితం వాళ్ళిచ్చారు. ఇప్పుడు నాన్న లేరు. అమ్మను చూడటం నా కర్తవ్యం..”

“ఇదే నీ నిర్ణయమా?”

“అవును.. అవును.. అవును..” నందిని కరాఖండీగా చెప్పింది.

“జాబ్ చేస్తున్నావ్‌గా! పొగరు” కిషోర్ అన్నాడు.

“కాదండీ, బాధ్యత” నందిని అంది.

“భర్తని బాధ పెట్టడం బాధ్యత అనిపించుకోదు.”

“భార్యను అర్థం చేసుకోనివాడు కూడా భర్త అనిపించుకో(లే)డు.”

కొంత సేపు మౌనం వాళ్ళిద్దరి మధ్య!

మౌనభంగం కావిస్తూ నందిని కిషోర్ తల్లికి ఫోన్ చేస్తోంది.

“అమ్మకెందుకు ఫోన్ చేయడం?”

“మన సమస్యకు పరిష్కారం చెబుతారని!”

“అమ్మ తీర్థయాత్రల్లో ఉంది..”

“మనిషి దూరంగా ఉన్నా.. మాట వినబడితే.. చాలండీ..!”

నందిని ‘అత్తయ్యాగారం’టూ మాట్లాడుతోంది. కొంతసేపటికి కిషోర్ అంటున్నాడు.

“వారం రోజుల్లో మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది!”

“ఎలా?” నందిని ఆశ్చర్యపోతూ అంది..

“మన విడాకుల రూపంలో!” కిషోర్ అన్నాడు. నందిని నిర్ఘాంతపోయింది.

“కిషోర్.. ఇది ఫోనల్ డెసిషనా?” నందిని అడిగింది..

“నేనొక్కసారి అనుకుంటే నా నిర్ణయం మారదు. ఫైనల్” ఖండితంగా చెప్పాడు కిషోర్.

***

“లాయర్‌గారిల్లు వచ్చింది” నందిని అనడంతో కిషోర్ తన ఆలోచనలకూ డ్రైవ్ చేస్తూన్న బైక్‌కీ ఒకేసారి బ్రేక్ వేశాడు.

టేబుల్‌కు అటూ ఇటూ నందిని కిషోర్‌లు మధ్యలో లాయర్‌గారు కూర్చొన్నారు.

“ఒక్కసారి ఆలోచించండి! విడిపోయేందుకు కాదు కలిసుండేందుకు..” లాయర్ గారు నచ్చచెబుతున్నారు.

“మా అమ్మ నాతో ఉండేందుకు ఒప్పుకుంటేనే!” నందిని తగ్గి అంది.

“వీల్లేదు..” కిషోర్ మాత్రం తగ్గలేదు.

“కిషోర్, నందిని తగ్గింది.. ఒప్పుకో..” లాయర్ అంటూంటే

“ఎక్కడ తగ్గింది సార్.. తన పట్టుదల వాళ్ళమ్మ విషయంలోనే.. అదే చెప్పింది” నందిని కేసి కోపంగా చూస్తూ అన్నాడు కిషోర్.

లాయర్ లాభం లేదనుకుని పేపర్స్ ఇద్దిరికీ ఇచ్చి సైన్ చేయమన్నాడు.

సైన్ చేసేటంతలో ఇద్దరి ఫోన్లూ ఒకేసారి రింగైనాయి. కొంత సేపు గడిచింది.

***

ఇప్పుడిద్దరూ ఒకే బైక్‌పై వెడుతున్నారు. విడిపోయి కాదు కలిసి. పైన వర్షము లేదు. వాళ్ళిద్దరి మధ్య హ్యాండ్ బ్యాగూ లేదు.

కిషోర్ అడిగాడు  “నందినీ నికెవరు ఫోన్ చేశారు?”

“ముందు మీరు చెప్పండి!” నందిని అంది.

“లేడీస్ ఫస్ట్!”

“లేదు! నేను మీ వెనుక కూర్చున్నా! కనుక ముందు మీరే చెప్పండి!”

“అమ్మ చేసింది! అత్తయ్యగారిని కూడా మనింటికి తీసుకురా! అని నన్ను మందలిస్తూ అంది.”

ఇప్పుడు నందిని వంతొచ్చింది. “నా ఫ్రెండ్ డాక్టర్ నీరజ. ‘నేను ప్రెగ్నెంట్’ అని రిపోర్ట్ వచ్చిందని చెప్పింది” అంది!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here