వంశోద్ధారకుడు

0
10

[dropcap]ఉ[/dropcap]దయం ఆరుగంటల ప్రాంతం. లక్ష్మీనిలయంలోని రెండవ అంతస్తులో గల విశాలమయిన పూజామందిరంలో, జనార్ధనరావు, వైదేహి దంపతులు వేంకటేశ్వరస్వామికి మేలుకొలుపు పాడుతున్నారు. క్రింది అంతస్తులో, ఇడ్లీ, సాంబారు తయారుచేస్తున్న వంటమనిషి కాంతమ్మకు, పనిమనిషి సీతాలు, ఆనపకాయ, మునగకాడ ముక్కలు కోస్తూ, సాయబడుతోంది. అదే అంతస్తులోని లాండ్రీరూములో, ఎల్లాజీ అయ్యగారివి, అబ్బాయిగారివి ఆ రోజు ధరించవలసిన దుస్తులు ఇస్త్రీ చేస్తున్నాడు. మూడవ అంతస్తులో జిమ్ము, మీనీ థియేటరు గల గదులను అచ్చయ్య శుభ్రం చేస్తున్నాడు. ఇద్దరు మాలీలు, ఒకరు బంగళా ముందుభాగంలోను, మరొకరు బంగళా వెనుక భాగంలోను పనిలో నిమగ్నమయి ఉన్నారు. బంగళా వెనుక భాగంలో గల టెన్నీసు కోర్టులో జనార్ధనరావు, వైదేహీల ఏకైక సంతానం పవనకుమారు, కోడలు ఆకృతి, రెండు సెట్లు టెన్నీసు ఆడి, ముచ్చెమటలు పోయడంతో, దగ్గరలో అమర్చబడియున్న రెండు లానుకుర్చీలలో కూలబడ్డారు. అది గమనించిన భద్రయ్య, త్వరగా వారిరువురుకు చెరో తెల్లని మడత తువ్వాలూ అందించి, సమీపంలో నున్న స్విమ్మింగుపూలు ఆవరణను శుభ్రంచేయడానికి వెళ్ళేడు. క్రొద్దిసేపట్లో, సీతాలు అప్పుడే తీసిన పండ్లరసం, రెండు వెండిగ్లాసులలో నింపి, ఒక వెండి ట్రేలో వాటినమర్చి, జాగ్రత్తగా కుర్చీలలోనున్న దంపతులకు అందించింది.

ప్రస్తుతం సువిశాలమయిన లక్ష్మీనివాసంలో నివసిస్తున్న జనార్ధనరావు, ఒక సామాన్య రీటైలు బట్టల వ్యాపారిగా జీవితాన్ని ప్రారంభించేడు. అదృష్టదేవత వరించడంతో, ఇంతింతై, వటుడింతైవలె, ఈనాడు వైదేహీ టెక్స్టైల్సు, మరియు వైదేహీ గార్మెంట్స్ ఫేక్టరీల అధిపతి అయ్యేడు. ఉదార స్వభావుడు. దైవభక్తి గలవాడు. అతని భార్య వైదేహి, దగ్గర బంధువుల కుటుంబానికి చెందినది. చదువు అంతంతమాత్రమే అయినా, సంస్కారం అత్యున్నతం. ఆ దంపతులకు ఏకైక సంతానం, పవనకుమారు. తల్లిదండ్రుల అడుగుజాడలలో పెరిగినవాడు. అహ్మదాబాదులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ డిజైన్ నుండి, M. Des. (Textiles & Garments) పట్టా పొందేడు.

జనార్ధనరావుగారి కోడలు ఆకృతి, S.P. R. Paper mills అధిపతి; సూర్యప్రకాశరావుగారి ద్వితీయ కుమార్తె; అందాలరాశి. ఢిల్లీ స్కూల్ అఫ్ ఎకనామిక్స్ నుండి ఆర్థికశాస్త్రంలో M. A. పట్టా అందుకొంది. చాలా తెలివయినది. ఆత్మవిశ్వాసం, పట్టుదల, గల మనిషి. సూర్యప్రకాశరావుగారి సతీమణి అరుణ, M.A. పాసయింది. నిగర్వి. సమాజసేవపై మక్కువ ఎక్కువ. సూర్యప్రకాశరావు దంపతుల తొలి సంతానం పద్మజ, వృత్తిరీత్యా గైనకాలజిస్టు. ఆమె భర్త సాఫ్ట్‌వేర్ ఇంజినీరు. ఆ ఇరువురు, వారి ఇరువురి పిల్లలతో అమెరికాలో ఉంటున్నారు. సూర్యప్రకాశరావుగారి మూడవ సంతానం, శ్రీనివాస్, I.I.T. రూర్కీలో B. Tech. (pulp& Paper) ప్రోగ్రాము ఆఖరి సంవత్సరంలో ఉన్నాడు.

అత్తవారింట అడుగుపెట్టిన కొద్ది రోజులకే, ఆకృతి, మామగారి ఆధిపత్యంలో నడుస్తున్న రెండు కంపెనీల ఆర్థిక విషయాలు త్వరగా అవగాహన చేసుకొంది.

Inventory control, accounts receivables మీద తనదయిన ముద్ర వేసి, కంపెనీలను మరింత లాభాల బాటలో పెట్టింది. అటు, పవన్ సృష్టించిన సరిక్రొత్త డిజైనులతో తయారయిన రడీమేడు దుస్తులు యువతను బాగా ఆకర్షించడంతో, కంపెనీ యొక్క మార్కెట్ షేరు గణనీయంగా పెరిగింది. యువ దంపతులు, ప్రత్యేకంగా ఆకృతి, కంపెనీల వ్యవహారాలలో కనబరుస్తున్న శ్రద్ధాసక్తులతో, సూర్యప్రకాశరావు దంపతులకు కంపెనీల భవిష్యత్తుపై ఒక దృఢమయిన నమ్మకం ఏర్పడింది.

ఆ రోజు ఉదయం నుండీ లక్ష్మీనిలయం సందడిగా ఉంది. విష్ణు, లలితా సహస్రనామ పారాయణలతో , బంగళా అంతటా ఒక పవిత్ర వాతావరణం ఏర్పడింది. ఎనిమిది గంటల ప్రాంతంలో, శ్రీ సీతారామాంజనేయ ఆలయంలోని ప్రధాన అర్చకులు, సుబ్రమణ్య శర్మ గారు, తమ ఇరువురి శిష్యుల సహాయంతో పవన్, ఆకృతిల చేత నిష్ఠగా, సత్యనారాయణ వ్రతం చేయించేరు. బంగళా ఒక పండగ సందడితో కళకళలాడుతోంది. దీనంతటికీ కారణం, ఆరోజు పవన్, ఆకృతిల పెళ్లిరోజు. వారికి పెళ్లయి నాలుగు సంవత్సరాలయింది. గతంలో లాగే, ఆ రోజు, రెండు ఫేక్టరీలలోని సిబ్బందికి, ఒక్కొక్కరికి వెయ్యిన్నొక్క రూపాయిలు, ఒక మిఠాయి పొట్లం పంచిపెట్టేరు. బంగళాలోని పనివారకు, అదనంగా కొత్త దుస్తులు కూడా బహూకరించేరు. విందు భోజనాలనంతరం, యువదంపతులు శర్మగారికి సాష్టాంగనమస్కారం చేసి, అతిత్వరలో వంశోద్ధారకుడు కలగాలని దీవెనలందుకొన్నారు.

ఆనాటి రాత్రి, సుగంధ పరిమళాలతో ఘుమఘుమలాడుతూ, శోభనపు రాత్రిని స్మరింపజేస్తూ అలంకరింపబడ్డ తమ శయనామందిరంలో, పవన్, ఆకృతులు హంసతూలికాతల్పము వంటి పాన్పుపై, పవళించి ఉన్నారు. ఆకృతిని, పవన్ బాహువులతో బంధించి, వీలయినంత దగ్గరగా తన గుండెలకు హద్దుకొని, ఆప్యాయంగా బుగ్గలు నిమురుతూ, “క్రిందటి జన్మలో నేను చేసిన పుణ్యాల ఫలితమేమో, ఈ జన్మలో దేముడు నిన్ను నాకు ప్రసాదించేడు.” అన్నాడు.

“మరీ సెంటిమెంటల్ అయిపోతున్నావు.” ఊహాలోకాల్లో విహరిస్తున్న ప్రియుని, తలపైనున్న దట్టమయిన కేశసంపదలోనికి, తన మృదువైన చేతి వ్రేళ్ళను సున్నితముగా పోనిస్తూ, చిరునవ్వుతో పలికె ప్రియురాలు.

“నీకు తెలుసా. అమ్మ, నాన్నగారు, ఎన్నోసార్లు; నువ్వు లక్ష్మీదేవి లాగ, మా ఇంట్లో అడుగు పెట్టినప్పటినుండి, మన కంపెనీలు, ఇదివరకటిగన్నా రెట్టింపు లాభాలతో, మార్కెట్లో లీడ్ చేస్తున్నాయని చెప్పుకొంటూ, మురిసిపోతున్నారు.” ప్రేయసిని, మరింత దగ్గరగా తీసుకొని, పవనకుమారు ఆప్యాయంగా బదులు పలికేడు.

“అది, వాళ్ళగొప్పతనం. నీవంటి భర్త, నీ పేరెంట్స్ వంటి అత్తమామలు దొరకడం నా అదృష్టం. మా వాళ్లందరికీ నేను అదే చెబుతూంటాను.” మగని ముఖానికి, తన ముఖం, మరీ చేరువ జేసి, తేనెపలుకులు పలికింది, ఆకృతి.

వారిద్దరి ప్రేమ సంభాషణ కొంత ముందుకు సాగేక, ఆకృతి తలను ఆప్యాయంగా రెండు చేతులతో, దగ్గరగా తీసుకొని, కళ్ళలో కళ్ళు కలుపుతూ, “ఆకృతీ, నాకొక వేల్యుబుల్ గిఫ్ట్ కావాలి; ఇస్తావా.” అని మృదుమధురంగా, చిరునవ్వుతో అడిగేడు, పవన్.

“నేను ఇవ్వగలిగినది అయితే, తప్పక ఇస్తాను.”

“ఆ గిఫ్ట్, నువ్వే ఇవ్వగలవ్.”

“ఏమిటో, అది చెప్పు.”

“విను, చెప్తాను. ఇంతవరకు మన మేరీడ్ లైఫ్ ఎంజోయ్ చేసేం. నువ్వు కోరినట్లే, పిల్లలు కలగకుండా జాగ్రత్తపడ్డాం… (కొద్ది క్షణాలు ఆగి) ఇహ దానికి ఫులుస్టాప్ పెడదాం.” అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే.

ప్రియుని చేతులనుండి, తలను విడిపించుకొని, దూరంగా జరిగింది.

పవన్ ప్రియురాలి మనోభావనలు అర్థం చేసుకొనే ప్రయత్నంలో లేడు. తన ఊహాలోకంలో కలలు కంటున్న పవన్, “అమ్మ, నాన్నగారు, వేయికళ్లతో ఎదురుచూస్తున్న, వంశోద్ధారకుడు, నాకు కావాలి…” అని ఇంకా ఏవో చెప్పుకుపోతూ ఉండేవాడు. కొద్ది క్షణాలలో కలలనుండి మేల్కొని, ముణుకులపై తల దించుకొని, క్రిందకు చూస్తున్న, ప్రియురాలిని గమనించేడు. ఆమె ముఖాన్ని రెండు చేతులతో మీదకు ఎత్తి, “సిగ్గు పడుతున్నావా.” అని ముఖంలోకి ముఖం పెట్టి ఆప్యాయంగా అడిగేడు. ఆకృతిలో ఎట్టి స్పందనా లేకపోడం గమనించేడు.

“ఏమిటయింది.” అని ఆత్రుతతో అడిగేడు, పవన్.

ఆకృతి ముభావంగానే ఉంది.

ఆ ముభావానికి కారణమేమిటో తెలియక, “ఏమిటో, నీ సమాధానం చెప్పు, ఆకృతీ.” అని గుచ్చి గుచ్చి అడిగేడు, పవన్.

“నాకు… తల్లి… కావాలనే… కోరిక లేదు.” అని అతి మెల్లగా స్పందించింది.

ఆకృతి మాటలు అర్థం కాక, కొయ్యబారిపోయేడు, పవన్. క్షణంలో సద్దుకొన్నాడు. ఆ మాటలలో నిజం లేదనుకొన్నాడు.

“జోక్ చేస్తున్నావు కదూ.” అని ఆకృతి ముఖాన్ని తన రెండు అరచేతులలోనికి ఆప్యాయంగా తీసుకొని, కళ్ళలోకి సూటిగా చూస్తూ, అడిగేడు.

“లేదు పవన్; సీరియసుగానే చెప్తున్నాను.”

“ఏదయినా హెల్త్ ప్రోబ్లేమా. ఏమిటో అది చెప్పు. ఇండియాలో కాకపొతే, ట్రీట్మెంటుకు అమెరికా వెళదాం. నో ప్రోబ్లెం.” అని ధైర్యం చెప్పేడు.

“అటువంటి ప్రోబ్లెం ఏదీ లేదు.”

“అయితే మరి ఏమిటి నీ ప్రోబ్లెం.”

“పవన్, పిల్లలని పెంచడంలో మా అక్క పడ్డ తంటాలన్నీ చూసేను. Honestly speaking, నాకు ఆ ఓపిక లేదు, పవన్.”

“అదేమీ పెద్ద సమస్య కాదు, ఆకృతీ. ఆయాలిని, ట్రైన్డ్ నర్సులని, ఎంప్లొయ్ చేసుకొందాం. వాళ్ళు జాగ్రత్తగా చూసుకొంటారు. అలా అయితే మరి నీకు సమస్య ఉండదుగా.”

“పవన్, అదొక్కటే సమస్య కాదు.”

“ఇంకా ఏమిటి నీ సమస్యలు.” కొద్దిపాటి చిరాకుతో అడిగేడు.

“పవన్, కడుపులో పిల్లడు పెరుగుతున్న తొమ్మిది నెలలూ, రకరకాల ఇబ్బందులు పడాలి. నేను చూసేను, అవి. పవన్, మరేమీ అనుకోకు. నాకు, ఆ ఇబ్బందులు పడే ధైర్యం లేదు.”

“నువ్వు చెప్తున్నది, నాకు అర్థం కావడం లేదు. ప్రపంచంలో ఆడవాళ్లు పిల్లలని కనడం లేదా. వారెవ్వరికీ లేని బాధ నీకేమిటి వస్తుంది. పిల్లలు పుట్టడానికి, మన దేశంలో ఆడవాళ్లు, ఎన్నో నోములు, వ్రతాలూ చేస్తూ ఉంటారు. నువ్వు చాలా వింతగా మాట్లాడుతున్నావ్.” అని తన అసంతృప్తిని తెలియబరుస్తూ, “ఇంత ముఖ్యమయిన విషయం, పెళ్ళికి ముందు నాకు ఎందుకు చెప్పలేదు. ఈ విషయం మీ వాళ్లకు తెలుసా.” అని నిలదీసి అడిగేడు, కోపంతో.

“నన్ను క్షమించు, పవన్. ఈ విషయం మా వాళ్లకి తెలీదు.” అని భర్త అరచేతులను, తన అరచేతులతో పట్టుకొని, క్షమా భిక్ష కోరింది.

“నీ నిర్ణయం కారణంగా, మా కుటుంబం ఎంత బాధపడతారో ఆలోచించుకో. నీకు తెలిసిన విషయమే. మా తాతగారికి, మా నాన్నగారు ఏకైక సంతానం. మా తల్లిదండ్రులకూ, నేను ఏకైక సంతానం. మనకు పిల్లలు లేకపోతే, మా వంశం నిర్వంశం అవుతుంది. నీ నిర్ణయం వలన, మా కుటుంబానికి ఎంత క్షోభ కలుగుతుందో, బాగా ఆలోచించుకో. చదువుకొన్నదానివి.” అని ఆకృతిని చేరువుగా తీసుకొని, ఆప్యాయంగా బోధపరిచే ప్రయత్నం చేసేడు, పవన్.

ఆకృతిలో చలనం లేదు. నోట మాట లేదు.

“పోనీ, ఒక రిక్వెస్టు…ఒకే…ఒకరు చాలు. ఆడ అయినా, మగ అయినా ఫరవా లేదు. ప్లీజ్. నీ నిర్ణయం మార్చుకో.” అని ప్రాధేయబడ్డాడు.

కొద్ది క్షణాల పిమ్మట, ఆకృతి పెదిమలు కదిలేయి.

“నన్ను క్షమించు, పవన్. మనకు సంతానమే కదా కావలిసినది. ఎవరినయినా దత్తత చేసుకోవచ్చు కదా.” వినయంగా సలహా ఇచ్చింది.

“అంతేగాని, నీ నిర్ణయం మార్చుకోవన్నమాట.” కోపోద్రేకాలతో స్వరం బాగా పెంచి అడిగేడు.

అవును అన్నట్టుగా, మౌనం వహించింది, ఆకృతి.

పవన్ మనసులో, నిరాశ, నిస్పృహ, కోపం, ఆవేశం, అన్నీ కమ్ముకు వచ్చేయి. వాటినన్నింటినీ దిగమ్రింగుకొని, “మేమంతా తెలివితక్కువవాళ్ళం. మా లక్ష్మీనిలయంలోకి లక్ష్మీ దేవి లాగ అడుగు పెట్టేవు, అని సంబరబడ్డాం. కాని, కలలో కూడా ఊహించ లేకపోయాం.” అని చీదరించుకొంటూ, మంచం నుండి దూరంగా వెళ్లి, సోఫాలో తల పట్టుకొని కూలబడ్డాడు.

ఆకృతి, దగ్గరగా రాబోతూ ఉంటే, “నన్నిలా వదిలేయ్. నా దగ్గరకు రాకు.” కోపంతో గట్టిగా చెప్పేడు, పవన్.

ఆనంద ఉల్లాసాలతో ప్రారంభమయిన రాత్రి, కాళరాత్రిగా ముగిసింది.

ఊహించని పరిణామాలు, కొడుకు ద్వారా తెలుసుకొని, జనార్ధనరావు వైదేహీలు, నిర్ఘాంతబోయేరు. కోడలి మనసును మార్చడానికి, విశ్వప్రయత్నాలు చేసేరు. ప్రయత్నాలన్నీ నిరాశని మిగిల్చేయి. సంతానం కోసం, పవన్ మరో వివాహం చేసుకొన్నా, తనకు అభ్యంతరం లేదని, ఆకృతి వినయంగా చెప్పింది. దంపతులిద్దరూ దిక్కు తోచని స్థితిలో బడ్డారు. వెంటనే, ఆకృతి తల్లిదండ్రులకు, విషయం వివరంగా తెలియబరిచేరు. ఆకృతికి తగు విధంగా నచ్చచెప్పి, మనసు మార్చుకొనేటట్లు చేయమని, వేడుకొన్నారు.

సూర్యప్రకాశరావు, అరుణలు, తమ కూతురు ఆకృతి నిర్ణయం పట్ల, ఆవేదన పొందేరు. తమ కూతురు కారణంగా, ఒక కుటుంబం నిర్వంశం కాగలదని, మనోవ్యథ చెందేరు. అది ఎంతమాత్రమూ జరగకూడదని నిశ్చయించుకొన్నారు. హుటాహుటిన, నిర్విరామముగా ఏడు గంటలు కారులో ప్రయాణము చేసి, లక్ష్మీ నిలయం చేరుకొన్నారు. చేరుకొన్న తక్షణం, కూతురును ఏకాంతంగా కలసి, సర్వ విధాలా నచ్చచెప్ప ప్రయత్నించేరు. తన నిర్ణయం వలన, కుటుంబానికి మాయని మచ్చ వస్తుందని చెప్పేరు. నలుగురూ నడిచే బాటలోనే నడవమని, నెత్తీ నోరూ బాదుకుని మరీ చెప్పేరు. అన్ని ప్రయత్నాలూ విఫలమయ్యేయి. ఆకృతి, నిర్ణయాన్ని మార్చుకోలేదు. అది గమనించి, “నీ నిర్ణయం అదే అయితే, విను; ఈ క్షణం నుండి, నీకు మాకు, ఎటువంటి సంబంధమూ లేదు. నువ్వు మాకు లేవనే అనికొంటాం.” అని, కన్న కూతురును తూలనాడేరు. జనార్ధనరావు దంపతులకు అనేక క్షమాపణలు చెప్పుకొని, సూర్యప్రకాశరావు దంపతులు, గృహోన్ముఖులయ్యేరు.

పవన్, స్విమ్మింగ్ పూల్ ప్రక్కన కూర్చొని, ఏదో దీర్ఘాలోచనలో ఉన్నాడు. ఆదిత్యుడు అస్తమిస్తున్నాడు. నలుప్రక్కలనుండీ చీకటి అలుముకొంటోంది. ఆ అంధకారాన్ని ఛేదించుకొని, మరునాడు సూర్యభగవానుడు ప్రపంచానికి వెలుగు ప్రసాదిస్తాడు కాని తన జీవితంలో మరల తెల్లవారే సూచనలు లేవని, మదిలో కుమిలిపోతున్నాడు, పవన్. కొద్ది సేపటికి, తల్లి వైదేహి, నిరాశలోనున్న కుమారుని చెంత చేరింది. పవన్ అది గమనించి, “దేముడు మనకి ఇంత శిక్ష ఎందుకు వేసేడమ్మా.” అని కంట తడి పెట్టుకొంటూ, తల్లి భుజం మీద వాలిపోయేడు.

వైదేహి తన దుఃఖాన్ని దిగమ్రింగుకొంటూ, “నాయనా, మనం సర్వ ప్రయత్నాలూ చేసేం. లాభం లేకపోయింది. కని, పెంచి, పెద్ద చేసిన తల్లిదండ్రుల మాట కూడా వినలేదు. మన ఖర్మ. జరిగినదేదో జరిగిపోయింది. ఎంత విచారించినా లాభం లేదు. అంచేత, ఆలోచించి ముందడుగు వెయ్యడం మంచిది.” అని కొడుకు తల నిమురుతూ, అంది.

“అడుగు ముందుకు ఎక్కడ వెయ్యడమమ్మా. కనిపిస్తున్నది అంతా అగాధం.”

“పరిస్థితుల్ని బాగా అర్థం చేసుకో నాయనా… నువ్వు మరో పెళ్లి చేసుకొంటే, తనకు అభ్యంతరం లేదంది. అంచేత అదే ఇప్పుడు మనం ఆలోచించాలి.”

“తను అంది గాని, నాకది ఇష్టం లేదమ్మా.”

“శాంతంగా ఆలోచించు నాయనా. అది సంతోషంగా ఇష్టపడి చెయ్యడం కాదు. పరిస్థితులకు తల వంచాలి నాయనా.”

“అమ్మా, నాలుగు సంవత్సరాలనుండి ఆకృతిని మనసారా ప్రేమించేనమ్మా. తనే నా సర్వస్వమూ అనుకొన్నాను. మరో అమ్మాయిని అలా చూసుకోలేనమ్మా. అవసరానికి పెళ్ళాడి, నటనలు చెయ్యడం, మోసం చేసినట్లు అవుతుందమ్మా. వంశోద్ధారకుడి కోసం, మరో అమ్మాయి జీవితంతో ఆడుకోడం తప్పమ్మా. క్రిందటి జన్మలో, ఏ పాపం చేసేనో; భగవంతుడు ఈ జన్మలో ఇంత శిక్ష వేసేడు. తెలిసి తెలిసి, క్షమించరాని తప్పు చెయ్యనమ్మా.”

“మీ నాన్నగారికి, ఎవరినీ దత్తత చేసుకోవడం ఇష్టం లేదు నాయనా. అనాథ శరణాలయం నుండి ఒకరిని తెచ్చుకొని, దత్తత చేసుకోవడం కన్నా, ఆస్తినంతటిని ఆ శరణాలయానికి ధార పోస్తే, అనేకమంది అనాథలకు మేలు చేస్తుందని, ఆయన అభిప్రాయం. అందుచేత, నాయనా, రెండవ పెళ్లి ఒక్కటే, మనం చెయ్య గలిగినది. మాకూ, అంత ఇష్టమయినది కాదు. కానీ, ఏం చెయ్యగలం. జాగ్రత్తగా ఆలోచించు నాయనా.”

“నన్ను క్షమించు, అమ్మా. మీ మనసులోని బాధ అర్థం చేసుకోగలను. నన్ను కూడా అర్థం చేసుకోండి అమ్మా.”

“సరే నాయనా. ప్రొద్దు బాగా పోయింది. ఇంట్లోకి పద.”

బరువయిన గుండెలతో, అంధకారపు ఛాయలలో, తల్లీ కొడుకులు ఇంట్లోకి వెళ్ళేరు.

సుఖసంతోషాలకు నిలయమై, నిత్యమూ కళకళలాడుతుండే, లక్ష్మీ నిలయంలో, నిత్యం నిశ్శబ్ద వాతావరణం చోటు చేసుకొంది. పనులన్నీ యాంత్రికంగా జరుగుతున్నాయి. పవన్, ఉదయాన్నే ఫేక్టరీకి వెళ్లి, రాత్రి బాగా ప్రొద్దు పోయేక, బంగళా చేరుకొంటున్నాడు. రాత్రి పడక గెస్టు రూములో. ఆకృతి, బంగళా దాటి బయటకు పోవడం లేదు. జనార్ధనరావు దంపతులు, సంభవించిన క్లిష్ట పరిస్థితి నుండి బయట బడడానికి, సలహా కోసం, కాశీలోని తమ గురువుగారిని సంప్రదించడానికి వెళ్ళేరు.

ఒక వారం గడిచింది. ఒక రోజు, ఆకృతి పేరున, కొరియర్ ద్వారా ఉత్తరం వచ్చింది. ఆకృతి, అది అందుకొని, ఫ్రమ్ ఎడ్రసు చూసింది. అక్క పద్మజ నుండి.

ఆకృతి, ఉత్తరం చదవడం ప్రారంభించింది.

ప్రియమయిన చెల్లీ,

నిన్న రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో, అమ్మ నాకు ఫోను చేసింది. మీ ఊరు నుండి, అప్పుడే చేరుకొన్నారుట. ఆపుకోలేని దుఃఖంతో విషయమంతా చెప్పింది. నేను నమ్మలేక పోయేను. నాకు నోట మాట రాలేదు. చెల్లీ, నువ్వు బాగా చదువుకొన్నదానివి; తెలివయిన దానివి కూడాను. మన అమ్మ, నాన్నల పెంపకంలో పెరిగినదానివి. నీకు, ఇటువంటి ఘోరమయిన ఆలోచన ఎలా వచ్చిందో బోధపడడం లేదు. నేను, పిల్లలను కనీ పెంచడంలో, నానా అవస్థలు పడ్డానని, అది చూసి, నువ్వు ఈ నిర్ణయం తీసుకొన్నావని, పవన్‌తో చెప్పేవుట. నేను ఏ అవస్థలూ పడలేదు. దేముడిచ్చిన వరం అనుకొని సంతోషించేను. నీ మనసులో ఉన్న దురాలోచన కప్పిపుచ్చడానికి, అలా చెప్పేవు. అమ్మ గుచ్చిగుచ్చి అడిగితే అసలు కారణం బయట పెట్టేవు. గర్భిణీ స్త్రీలు, కార్టూను బొమ్మలలాగా కనిపిస్తారు అన్నావుట. అంచేత, పిల్లలిని కనడం ఇష్టం లేదని, అమ్మతో చెప్పేవుట. ఆకృతీ, నీ తెలివితక్కువతనానికి, నాకు జాలి వేస్తోంది. నిజమయిన అందము, అంటే నీకు తెలిసినట్టు లేదు. కవులు వర్ణించినట్లు, సంపెంగ పువ్వు వంటి ముక్కు, దొండపండు వంటి పెదిమెలు, కలువరేకుల వంటి కళ్ళు, పిడికెటిలో అణిగేటువంటి నడుము ఉన్న నిన్ను చూసిన వాళ్ళు నువ్వు అందకత్తెవని తప్పక అనుకొంటారు. కానీ, ఆ అందం జీవితాంతం ఉండదు. వయసుతో బాటు, అదీ మారిపోతుంది. శాశ్వతం కాదు. నిర్మలమయిన మనసు, ఉన్నతమయిన ఆలోచనలు, మనిషికి శాశ్వతమయిన అందాన్ని ఇస్తాయి. సమాజం, అటువంటి వాళ్ళని గౌరవిస్తుంది. ఇవాళ, నీ అందం చూసి మురిసిపోయిన వాళ్ళే, వయసు మళ్లితే, నీ వైపు చూడనయినా చూడరు. ఈనాడు కూడా, నువ్వు ఎంత అందకత్తెవి అయినా, నీ మూర్ఖపు ఆలోచన తెలిస్తే, నలుగురూ నిన్ను అసహ్యించుకొంటారు. ఆకృతీ, నిన్న రాత్రి అమ్మ మాట్లాడుతూ, ఏమిటందో తెలుసా; ‘దాని అందం, రెండు కుటుంబాలికి శాపంగా మారుతుందని కలలో కూడా ఊహించలేదు. దానికి బదులు, ఓ కుంటిదో గుడ్డిదో, పుట్టి ఉన్నా, ఇంత క్షోభ, అవమానం, అనుభవించి ఉండేవాళ్ళము కాము.’ ఆలోచించుకో; కన్న తల్లికి, అటువంటి ఆలోచన వచ్చిందీ అంటే, నీ ఆలోచన ఎంత నీచమయినదో తెలుసుకో.

చెల్లీ, కొన్ని వందల డెలివరీ కేసులు చేసి, చూసేను. అప్పటివరకు, పురిటి నొప్పులతో విలవిలలాడుతూ, ముచ్చెమటల కార్చుకొన్న, గర్భిణీ స్త్రీలు, ప్రసవించిన బిడ్డను చూసిన మరుక్షణం, ఆ బాధంతా మరచిపోయి, చెప్పలేనంత సంతోషం పొందుతారు. అంతేకాదు; కన్నవారికి, అత్తవారికే కాకుండా, బంధువులకు, స్నేహితులకు కూడా ఆనందాన్ని, పంచిపెడతారు. అటువంటి, అరుదయిన అవకాశం, కేవలం మాతృమూర్తికే, దేముడు ప్రసాదించేడు. అటువంటి అవకాశాన్ని, చేజేతులా జారవిడుచుకోకమ్మా. ఈ తెల్లవారుఝామున, రూర్కీ నుండి, తమ్ముడు శ్రీనివాస్ ఫోన్ చేసేడు. ఈ వార్త విని వాడు, ఎంతో ఆందోళన పడుతున్నాడమ్మా. దీని మూలాన్న, అమ్మా నాన్నల, ఆరోగ్యం ఏమవుతుందో అని, భయపడుతున్నాడు. వారం రోజుల్లో, వాడి ఫైనల్స్ ప్రారంభమవుతాయట. అయినా, ఈ సమయంలో, అమ్మా నాన్నలకు తోడుగా ఉండాలని, మన ఊరికి, వెంటనే బయలుదేరి వెళుతున్నాడు. మరో గంటలో, నేనూ బయలుదేరి వెళుతున్నాను.

చెల్లీ, నీ శ్రేయస్సు, నీవాళ్లందరి శ్రేయస్సు కోరి, నీ నిర్ణయం మార్చుకో అమ్మా. నీకు సన్మార్గం చూపాలని, ఆ ఏడుకొండలవాడిని ప్రార్థిస్తున్నాను.

ఆశీర్వచనములతో,

నీ అక్క , పద్మజ.

కాలచక్రం ముందుకు పోతున్నా, ఆకృతి నిర్ణయం, ఎక్కడిది అక్కడే ఉంది.

లక్ష్మీ నిలయంలో, కొన్ని మార్పులు శాశ్వతంగా చోటు చేసుకొన్నాయి. ఫేక్టరీలో, కావలిసిన కనీస సదుపాయాలు అమర్చుకొని, పవన్, శాశ్వతంగా అక్కడే నివసించసాగేడు. జనార్ధనరావు దంపతుల నివాసం, కాశీకే పరిమితమయింది. రోజూ విశ్వనాధుని పూజిస్తూ, యాత్రికులకు వీలయినంత ఉచిత వసతి, భోజన సౌకర్యాలు అందజేస్తూ, వైరాగ్య జీవితం గడుపుతున్నారు. లక్ష్మీ నిలయం, ఆకృతీ నిలయమై, పూర్వపు శోభకు, వికృతిగా మారింది.

ఆకృతి, ఎల్లప్పుడూ ఏదో దీర్ఘాలోచనతో, ఏకాంతంగా కాలం గడుపుతోంది. అలా, సుమారుగా ఓ సంవత్సర కాలం గడిచింది. ఒక రోజు ఉదయం, మేడ మెట్లు ఎక్కుతూ, ఆకృతి, అకస్మాత్తుగా వచ్చిన ఛాతీ లోని నొప్పితో, మెట్ల మీద కూలబడిపోయింది. అది గమనించిన సీతాలు, దగ్గరలోనే ఉన్న పని వారి సాయంతో, దగ్గరలో నున్న సోఫాలో ఆకృతిని పరుండబెట్టి, త్వరగా ఓ గ్లాసుడు నీళ్లు తెచ్చి, “అమ్మగారూ, అమ్మగారూ.” అంటూ, ఆకృతి నోటికి అందించింది. ఆకృతి నోరు తెరువ లేదు. సీతాలు, ఆకృతి నోరు తెరిచి, నీళ్లు త్రాగించడానికి ప్రయత్నించింది. ఫలితం శూన్యమయింది. సీతాలు, పరిస్థితి అర్థం చేసుకొంది. ఆందోళనతో, పవన్‌కి ఫోన్ చేసి, పరిస్థితి చెప్పింది. తక్షణం బంగళాకు రమ్మని వేడుకొంది. పవన్ వెంటనే డాక్టరుకు ఫోన్ చేసేడు. వీలయినంత వేగరం బంగళాకు వెళ్లి ఆకృతికి వైద్యం చెయ్యమన్నాడు. తనూ, వెంటనే బంగళాకు బయలుదేరేడు. డాక్టరు చేరిన కొద్ది నిమిషాలలో బంగళా చేరుకొన్నాడు. ఆకృతిని పరీక్షించి, “పవన్ గారూ, I am sorry. She is no more. It was a massive heart attack.” అని చెప్పి, తన సంతాపం తెలియజేసి వెనుదిరిగేడు.

పవన్ ఒక్కసారిగా దుఃఖంలో మునిగిపోయేడు. ఆకృతి ముఖంపై ముఖం పెట్టి, కంట తడి పెట్టుకొన్నాడు. సీతాలుతో బాటు పనివారందరూ, ఓదార్ప ప్రయత్నించేరు. కాశీలోని జనార్ధనరావు దంపతులకు, విషాద వార్త చేరింది. వారు చాలా దుఃఖించేరు. తనయునికి ధైర్యం చెప్పేరు. తాము బయలుదేరి వస్తున్నామని తెలియజేసేరు. ఆకృతి మరి లేదన్న విషాద వార్త, సూర్యప్రకాశరావు గారి కుటుంబాన్ని కృంగదీసింది. కూతురు అంతిమ యాత్రకు, ప్రకాశరావు గారు లక్ష్మీ నిలయం చేరుకొన్నారు. ఆకృతి భౌతిక శరీరానికి, శాస్త్రోక్తంగా దహన సంస్కారాలు జరిగేయి. తదుపరి అంత్యక్రియలకు, జనార్ధనరావు దంపతులు, పవన్, కాశీ చేరుకొన్నారు.

కాశీలో, ఆకృతి అంత్యక్రియలు జరుగుతున్నాయి. అది ఆఖరి రోజు. పవన్, గంగానదిలో స్నానం చేస్తున్నాడు. నదికి ఎగువ భాగంలో అకస్మాత్తుగా వరదలు సంభవించేయి. కాశీ ప్రాంతంలో, గంగానదిలోనికి, విరిగిన చెట్లూ చేమలూ కొట్టుకు వస్తున్నాయి. రెండు మూడు, మృత కళేబరాలు వాటిని అనుసరించేయి.

అంత్యక్రియలు చేయిస్తున్న బ్రాహ్మడు, పవన్, నదిలో ముణుకుల లోతులో నిలబడి ఉన్నారు. బ్రాహ్మడు, ఏవో వల్లిస్తున్నాడు. ఆయన చెప్పినప్పుడు, పవన్ నదిలోనికి వంగి, దోసిలితో గంగాజలం తీసుకొని, మళ్ళీ నదిలోనికి జారవిడుస్తున్నాడు. నది ఒడ్డున ఉన్న, జనార్ధనరావు దంపతులు, కొందరు జనం, వరద రాబోతున్నదని, పవనును, బ్రాహ్మణుని, కేకలు వేస్తూ, తొందరగా ఒడ్డు చేరుకోమని హెచ్చరికలు చేసేరు. పవన్, ఆఖరిసారిగా గంగానదిలోనికి వంగి నిలబడుతూ ఉంటే, అతని చేతులలోనికి, కొన్ని మాసాల పసికందు, చేరుకొంది. వెంటనే, పవన్ తన భుజాలపై నున్న తువ్వాలుతో, ఆ పసికందును కప్పి, గుండెకు హద్దుకొంటూ, తొందరగా ఒడ్డు చేరుకొన్నాడు. ఏమి జరిగినదో తోచక, ఎవరి బిడ్డ, అని నలు ప్రక్కలా చూసేడు. తల్లి వైదేహి, ఆ పసికందును అందుకొంది. ఆ మగ బిడ్డను, తన ఒడిలోనికి తీసుకొంది. తన చీర కొంగుతో పిల్లాడిని వెచ్చగా కప్పింది. ఆ పసిబిడ్డ తల్లిదండ్రుల ఆచూకీ కొరకు, సర్వ ప్రయత్నాలూ చేసేరు. ఫలించలేదు. ఆ బిడ్డను, అనాథ శరణాలయంలో చేర్పిద్దామనుకొన్నారు. గురువుగారి సలహా అడిగేరు.

“ఇంత జనం స్నానాలు చేస్తూండగా, పవన్ చేతిలోనికే, ఈ శిశువు ఎందుకు చేరింది. మగ శిశువు; మెడలో త్రాడుకు, ఆంజనేయస్వామి విగ్రహం, చిన్నది కట్టి ఉంది; అంటే, శిశువు హిందువు అని కూడా తెలుస్తోంది. అన్ని విధాలా, మీకు అనుకూలమయిన వంశోద్ధారకుని, గంగమ్మ తల్లి, మీకు అందించింది. సంతోషంగా స్వీకరించండి.” అని గురువుగారు హితవు పలికేరు. జనార్ధనరావు దంపతులు, పవన్ పలుమార్లు ఆలోచించుకొని, గురువుగారి సలహాతో ఏకీభవించేరు.

కాశీలో, గంగమ్మతల్లి అందించిన శిశువుని, లక్ష్మీ నిలయం లోనికి, గృహప్రవేశం చేయించడానికి, సుముహూర్తం నిశ్చయమయింది. జనార్ధనరావుగారు, ఒడిలో శిశువుతో వైదేహి, పవన కుమారు, బంగళా సెక్యూరిటీ గేటు వద్ద, కారులోనుండి దిగేరు. సీతారామాంజనేయ ఆలయం, ప్రధాన అర్చకులు, సుబ్రమణ్య శాస్త్రి గారి భార్య లలితాంబ, ఆ నలుగురికి దిష్టి తీసేరు. ‘శతమానం భవతు’ ఆశీర్వచనాలు వల్లె వేస్తున్న, వేద పండితుల వెనుక, మంగళ వాయిద్యాలతో, మామిడి కొమ్మలు, పువ్వులతో అలంకరింపబడ్డ సింహద్వారం చేరుకొన్నారు. లలితాంబ, వారికి మంగళహారతితో ఆహ్వానం పలికింది. శిశువుతోబాటు, ఆ ముగ్గురూ, నేరుగా పూజామందిరం చేరుకొన్నారు., తమ సుబ్రమణ్య శాస్త్రి గారు, శిష్యవర్గంతోబాటు, వినాయక పూజ, సత్యనారాయణ వ్రతం, వెంకటేశ్వర దీపారాధన, జరిపించేరు. గంగమ్మతల్లి ప్రసాదించిన శిశువునకు, ‘గంగాప్రసాదు’ అని నామకరణం చేయించేరు. వంశోద్ధారకుని ప్రవేశముతో, లక్ష్మీ నిలయం కళకళలాడుతూ, మళ్ళీ ఆనంద నిలయమయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here