వందే గురు పరంపరామ్-4

0
12

[శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు నిర్వహిస్తున్న ‘వందే గురు పరంపరామ్’ అన్న శీర్షికని దారావాహికగా అందిస్తున్నాము. ఈ నెల – ఉపాధ్యాయ దంపతులు తులసినాథంగారు, పుష్పగారిని పరిచయం చేస్తున్నారు రచయిత్రి.]

[dropcap]గు[/dropcap]రువు గురించి మన పురాణేతిహాసాలు చాలా చక్కగా చెపుతాయి.

సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో గోస్వామి తులసీదాసుగారు ఒక దోహాలో ఇలా అంటారు.

सात समंदर की मसि करौ?

लेखनी सब बनराइ ।

धरती सब कागद करौ?

तऊ गुरु गुण लिखा न जाइ।

అందరికీ తెలిసిన అర్థమే చిన్నప్పుడు మన పాఠ్యాంశంలో తప్పనిసరిగా తులసీదాస్, కబీర్ దాస్ దోహాలు మనం చదువుకున్నాము.

సప్త సముద్రాలలోని నీరు సిరాగా చేసి, కలముగా వనములలోని అన్ని చెట్లను, ఈ భూమి అంతటినీ కాగితముగా చేసినప్పటికీ గురువు యొక్క గుణాలను వ్రాయలేము.

కొంతమంది గురువులు గురు స్థానం అలంకరించి ఎంతో మందికి మార్గదర్శకులు అవుతారు. కానీ వారి గొప్పతనాన్ని వారు అంగీకరించరు. వాళ్లని ఎక్కడా? ఎక్కడా? అని వెతుకుతూంటే ఎప్పుడూ పిల్లల్లో పిల్లలుగా కలిసిపోతూ ఉంటారు.

వారి జీవన విధానం కూడా మామూలు మనుషులకు అర్థం కాదు. అటువంటి కోవకే చెందినవారు ఈనాటి మన గురువులు శ్రీ తులసినాథం నాయుడుగారు వారి శ్రీమతి పుష్పగారు.

శ్రీ తులసినాథం నాయుడుగారు
శ్రీమతి పుష్పగారు

వారి జీవితం చాలా సాధారణంగా ప్రారంభమైంది.

పైనేని తులసినాథం నాయుడు గారి తల్లి మునెమ్మకి 96 సంవత్సరాలు. తండ్రి కీ.శే. పైనేని చిన్న బుచ్చి నాయుడు

మునెమ్మ గారు
తండ్రి కీ.శే. పైనేని చిన్న బుచ్చి నాయుడు

తులసినాథం నాయుడు గారు తేది 19-06-1969 నాడు ఆరిమాకుల పల్లె శ్రీరంగరాజు మండలం, చిత్తూరుజిల్లా, ఆంధ్రప్రదేశ్‌లో జన్మించారు.

కుటుంబ నేపథ్యం:

భారతదేశంలోని అనేక గ్రామీణ ప్రాంతాలలో కుటుంబాలలాగే వారిది కూడా ఉమ్మడి వ్యవసాయ కుటుంబం. తండ్రి వ్యవసాయం చేసేవారు. ‘మట్టిలో మాణిక్యాలు’ అని మన పెద్దలు అంటూ ఉంటారు కదా! అలాగే వీరికి ముగ్గురు అక్కలు, ఒక అన్నగారు పైనేని విజయేంద్ర నాయుడు ఉన్నారు. అందరూ ఇప్పటికీ వ్యవసాయదారులే. పల్లెటూరి జీవితం.

పైనేని విజయేంద్ర నాయుడు
ఉమ్మడి కుటుంబం

పెదనాన్న బుచ్చి నాయుడుగారు ఆర్మీలో పని చేసేవారు. నాన్న వ్యవసాయం చూసుకునేవారు.

తులసినాథంగారు కూడా చిన్నప్పుడు ప్రాథమిక స్థాయిలో పశువులను మేపుకోవడం వ్యవసాయ పనులలో సహాయం చేయడం మొదలైనవి చేసేవారు.

చిన్నప్పటి నుండి కూడా తెలుగు పట్ల అభిమానం ఉండేది.

ఎందుకంటే ఆ ఊరిలో 30/40 రోజులు విశేషంగా పండుగలు సమయంలో శ్రీరామ నవరాత్రులు, దేవి నవరాత్రులు, గ్రామదేవత పండుగలు సందర్భంగా భారత, భాగవత, రామాయణాలు వీధి నాటకాలుగా, హరికథలుగా చెప్పించేవారు. అవి వింటూ పెరిగారు.

ఆవులనూ, దూడలనూ అడవులలో మేపడానికి వెళ్లేటపుడు నోటికి వచ్చిన పాటలూ, పద్యాలూ పాడి వారందరికీ వినిపించడం అనేది ఒక మంచి అనుభవంగా చెప్పుకోవచ్చు.

అప్పుడు కాలక్షేపానికి పాడుకున్న తెలుగు పద్యాలు, పాటలూ వారిలో తెలుగుభాష పట్ల విపరీతమైన అభిమానాన్ని, అనురక్తినీ పెంచాయి.

తులసినాథంగారి 8 సంవత్సరాల వయసులో వీరి నాన్నగారు స్వర్గస్థులయారు. వీరి మేనమామగారు బొడపాటి మునస్వామి నాయుడు గారు వ్యవసాయంతో పాటు కుటుంబ సంరక్షణ బాధ్యత కూడా స్వీకరించారు.

వరి, చెరకు, వేరుసెనగ మొదలైన వ్యవసాయ, వాణిజ్య పంటలను పండించేవారు. ముఖ్యంగా చెరకును బెల్లంగా ఆడడానికి ఊరిలోనే గానుగలు ఉండేవి.

పిల్లల మంచి భవిష్యత్తుకు చదువే మూలాధారం అని నమ్మిన ఆర్మీలో పనిచేసిన పెదనాన్న వీరి చదువు బాధ్యత తీసుకుని, చదివించారు.

ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి కాగానే హైస్కూల్ చదువు కోసం కొత్తపల్లిమిట్టలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేర్చారు.

పలమనేరు ప్రాంతమంతా కూడా తమిళనాడు ప్రభావం ఎక్కువగా ఉండేది. హైస్కూల్ చదువులో తెలుగు బోధించే సుబ్రమణ్యం పిళ్ళై అయ్యంగారు ఎంతో శ్రద్ధగా చెప్తూ ఉండేవారు. వారి బోధనా విధానము వీరిని ఎంతో ఆకర్షించింది. టెన్త్ క్లాస్‌లో స్కూల్ ఫస్ట్ వచ్చారు.

తర్వాత చిత్తూరు దగ్గర ఆరు కిలోమీటర్ల దూరంలోగల కార్వేటి నగరంలో ఇంటర్మీడియట్ చదువు కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరారు. గ్రూప్ H.E.C. హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ సబ్జెక్టులుగా చదివారు.

జూనియర్ కళాశాలలో కూడా సుబ్రహ్మణ్యం ఆచారిగారు తెలుగు చక్కగా బోధించడం వారి బోధనా విధానం ఎంతో ఉత్తేజితులను చేసింది. తెలుగు భాషోన్ముఖులను చేసింది. భవిష్యత్తులో ఒక మంచి ఉపాధ్యాయునికి ఉండవలసిన లక్షణాలను విద్యార్థి దశలోనే అలవర్చుకోగలిగారు.

డిగ్రీలో కూడా అవే సబ్జెక్టులు తీసుకోవడం జరిగింది.

వీరి కుటుంబం అంతా నిరక్షరాస్యులు కావడంతో చదువుకున్న మొదటి తరం ప్రతినిధిగా ఉన్నతస్థాయి చేరాలనే లక్ష్యంతో అతడే స్వయంకృషితో స్వయంగా వార్తాపత్రికలు చదివి విషయాలు తెలుసుకుని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పోటీ పరీక్షలు రాశారు.

తరువాత అన్నామలై యూనివర్సిటీలో దూరవిద్య ద్వారా బి.ఇ.డి. చేసారు. తెలుగుభాషపై గల అభిమానంతో కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయం ద్వారా ఎం.ఏ. తెలుగు పట్టా పొందారు.

1997 సం. వీరి జీవితంలో ఒక గొప్ప మలుపు. ఆ రోజులలో పెద్దలు కుదిర్చిన వివాహాలే జరుగుతూ ఉండేవి వీరు కూడా అంతే! 1997 సం. డిసెంబర్ నెలలో పెద్దలు కుదిర్చిన పుష్పగారితో వివాహబంధం ఏర్పడింది.

తులసినాథంగారి అత్త మామలు సావిత్రమ్మ, రంగస్వామి నాయుడు గారు.

గ్రామీణ వాతావరణం కావడం వలన పుష్పగారి తల్లిదండ్రులు ఆడపిల్లల చదువు పట్ల అంతగా ఉత్సాహం చూపేవారు కాదు. ఆమె ఉత్సాహంగా చదువుకోవడం, మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందడం చూసి, డిగ్రీ వరకు చదివించాలని అనుకున్నారు.

ఆమె ఇంటర్మీడియట్ పూర్తికాగానే డిగ్రీ చేసారు. తరువాత ఎల్.ఎల్.బి. చదవాలి అనుకున్నారు.

కానీ.. వివాహానికి అది ఒక ప్రతిబంధకము అని భావించిన ఆమె తల్లిదండ్రులు బి.ఇ.డి చేయించారు.

కారణజన్ముడు:

అడవిలోని ఉసిరికాయ, సముద్రంలోని ఉప్పుగల్లు కలిసి చక్కని ఊరగాయ తయారైనట్లుగా న్యాయశాస్త్రం చదువుదామనుకున్న పుష్ప గారు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో సెలెక్ట్ అయిన తులసినాథంగారు వీరిరువురు వివాహబంధంతో ఒకటయ్యారు.

ఒక బంగారు భవిష్యత్తు వీరిరువురి చేతులమీదుగా అందవలసిన తెలుగువారి కోసం, తెలుగు విద్యార్థుల కోసం వీరు పుట్టినట్లుగా ఒకేమాట, ఒకే లక్ష్యంతో ఉండేవారు.

1998 సం. డి.ఎస్సీ. ఇరువురూ రాయగా ఇరువురూ సెలెక్ట్ అయి, ఒకేసారి ఉద్యోగం వచ్చింది. ఎంతో ఇష్టంగా ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు.

పుష్పగారు జిల్లాలో తృతీయ ర్యాంకు సాధించినప్పటికీ ఒకే చోట ఉద్యోగం చేయాలి అనే ఆశయంతో ఒకే పాఠశాలలో చేరి, ఏడు సంవత్సరములు ఒకే స్కూల్లో జంటగా పనిచేశారు.

అప్పుడు తెలియకుండానే భగవదనుగ్రహంతో వీరికి మాతృభాష పట్లా, పిల్లలు పట్లా, విపరీతమైన ప్రేమాభిమానాలు కలిగాయి.

ఒకే నాణానికి ఉన్న బొమ్మ బొరుసులాగా ఇరువురు ప్రాథమిక స్థాయిలో పిల్లలను ఈ ఏడేళ్లలో భాష పట్ల, సంస్కృతి పట్ల, విలువల పట్ల అమితమైన ఆసక్తిని అనురక్తిని పెంచుకునేటట్లుగా చేశారు.

ఉపాధ్యాయులుగా పనిచేసిన ఊర్లు శాంతిపురం మండలంలో అబకల దొడ్డి, డొంకుమానుపల్లె గంగవరం మండలంలో చౌడిరెడ్డిపల్లె, కంచిరెడ్డిపల్లె.

ఈ కాలంలోనే తులసినాథం గారు 2007 సం. నుండి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ యూనియన్ వారి అధికారిక మాసపత్రిక ‘ఉపాధ్యాయ’ మ్యాగజైన్ ఎడిటర్‌గా చేరారు.

2009 లో గంగవరం మండలం బదిలీపై వెళ్ళారు.

బోర్డర్లో గల తమిళనాడు గ్రామాలకు వెళ్లి అక్కడి నుంచి వార్తలు సేకరించి పత్రికలో వేసేవారు. ఎంతో కష్టమైన సంపాదకత్వ పదవిని క్రియాశీలకంగా, స్పర్థలకు తావు ఇవ్వకుండా ఎంతో చక్కగా నిర్వహించారు. ఈ విధంగా ఎంతో నిబద్ధతతో 17 సంవత్సరములు పనిచేశారు.

బోధనా విధానము:

పాఠ్యపుస్తకంలో ఉన్నది అప్పజెప్పినట్లు కాకుండా సొంతంగా సాంఘికశాస్త్ర పాఠాలను విద్యార్థులకు ఇష్టాన్ని పెంచేటట్లుగా, ఆకర్షణీయంగా చెప్పేవారు.

వీరి యొక్క బోధనా విధానాలు నచ్చి, ఆ గ్రామంలో ఉన్న బడి ఈడు పిల్లలందరూ ఈ ప్రభుత్వ పాఠశాలలోనే చేరేవారు.

ప్రభుత్వం ఉపాధ్యాయుల కోసం ఏర్పాటు చేసిన అనేక నూతన పథకాలు, వాటిలో శిక్షణలు పొందేవారు. కానీ రిసోర్స్ పర్సన్‌గా కాకుండా ఒక శిక్షకునిగా వెళ్లి తాను నేర్చుకున్నది తిరిగి పాఠశాలకు వచ్చి తరగతి గదిలో అవలంబించేవారు.

ప్రాథమిక స్థాయిలో మాతృభాష మీద పట్టు ఉంటే విద్యార్థులకు మిగిలిన పాఠ్యాంశాల మీద ఆసక్తి కలుగుతుందని నమ్మారు. అందుకే పద్యాలు రాగయుక్తంగా చెబుతూ, పిల్లలను కూడా అలాగా తయారు చేయాలని భావించి, వారికి పద్యాల పుస్తకాలు ఉచితంగా ఇచ్చేవారు.

శ్రీమతి పుష్పగారు కూడా విద్యకు సరియైన పునాదులు ప్రాథమికస్థాయిలోనే వేయబడాలని భావించారు. అందువలన వారికి మూసకట్టు విధానంలో కాకుండా నూతన విధానంలో తెలుగు, లెక్కలు, పరిసరాల విజ్ఞానంతో పాటు ఆంగ్లబోధన కూడా ప్రారంభించారు.

పీర్ గ్రూప్ లెర్నింగ్, డిస్కషన్ మెథడ్, గ్రూప్ మెథడ్ మొదలైన అనేక విధానాలను తరగతి గదిలో అనుసరించేవారు.

తులసినాథంగారు విద్యార్థినీ విద్యార్థులకు ఉత్తరాలు రాయడం అనే అలవాటు చేయటానికి పాఠశాలల్లో ‘తపాలాపెట్టె’ను ఉంచారు. తెలుగు భాషా నైపుణ్యాలు పెరగడానికి కమ్యూనికేషన్స్ స్కిల్స్ పెరగడానికి ఈ పెట్టె ఉపయోగపడేది. ప్రతిరోజు సాయంత్రం ఉత్తరాలన్నీ కలిపేసి, ఉత్తరాలను చదివించేవారు.

అక్షరదోషాలు, వాక్య నిర్మాణం విరామచిహ్నాలు వీటిపై అవగాహన ఏర్పడిన తర్వాత భాష మీద పట్టు వస్తుంది.

అదే విధంగా పాఠశాలలో ఏర్పాటుచేసిన ‘నిజాయితీ పెట్టె

 

ఇది విద్యార్థులలో నిజాయితీని పెంచడమే కాకుండా దీనికి కొంత రూపాంతరం చేయించడం వలన గణితం పట్ల కూడా మంచి అవగాహన ఏర్పడింది.

పుష్పగారు, తులసినాథంగారు ఇప్పుడు వేరే గ్రామాల్లో పనిచేస్తున్నారు.

2002 సం. పుష్పగారు వేరే గ్రామంలో పని చేస్తున్నప్పుడు ఆమెకు డిప్యూటేషన్ వేశారు. ఆ సమయంలో అక్కడ పిల్లలు, ఆ వాతావరణం, ఆ ప్రాంతం కొత్త వారిలో మార్పుతేవడానికి ఆమె చాలా కష్టపడవలసి వచ్చింది.

ప్రధాన కారణం అక్కడి పిల్లలను ఊరిలో వారి తల్లిదండ్రులు లేదా అత్తమామలు దగ్గర ఉంచేసి తల్లిదండ్రులు బెంగళూరు మొదలగు పట్టణాలకు పనులకోసం, జీవనోపాధి కోసం వలస వెళ్లిపోతూ ఉండేవారు. వారిని ‘పూసల దాసరులు’ అంటారు.

వారికోసం ప్రత్యేకంగా ‘ఆల్టర్నేటివ్ స్కూల్’ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. స్కూలుకి భవనము కూడా లేదు. మధ్యాహ్న భోజనపథకం ఉండేది. ఆ భోజనం కోసమే పిల్లలు వస్తూ ఉండేవారు.

అత్యంత నిరక్షరాస్యులైన ఆ పిల్లల కోసం చాలా ఎక్కువ శ్రద్ధ వహించవలసి వచ్చింది. శ్రమకు ఫలితం లభించి, విద్యార్థులు ఉన్నతికి చేరినప్పుడు తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా ఆనందించేవారు ఉపాధ్యాయులు మాత్రమే అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు.

ఎందుకంటే తల్లిదండ్రులు అందుబాటులో లేకపోవడం వలన వారికి పరీక్ష ఫీజులు కూడా వీరే కట్టేవారు. విద్యార్థులు కూడా ఎంతో శ్రద్ధగా చదువుకొని, పరీక్షలు పాస్ అయి ఉన్నత స్థితికి చేరారు.

పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం పెట్టిన ఆ ఏజెన్సీ వారి పిల్లవాడు అగ్రికల్చర్ బీఎస్సీ చదివాడు. ఈ పాఠశాల విద్యార్థులు కూడా బ్యాంకు ఉద్యోగాలు, పోలీస్ ఉద్యోగాలు మొదలైన ఉద్యోగాలలో చేరి అప్పుడప్పుడు పలకరించడానికి వస్తూ ఉంటారు.

ఇప్పుడు ఆ ఊరి స్వరూపమే మారిపోయింది.

పలమనేరుకి రెండు కిలోమీటర్ల దూరంలో గల నల్లకుంట్లపల్లి స్కూల్లో ముస్లిం పిల్లలు ఎక్కువగా ఉన్నారు. వారికి తెలుగుభాషపై అభిరుచి కలిగించడం, దాని ప్రాధాన్యత చెప్పడం అనేది కొంచెం కష్టమైనది.

“జిల్లాలో విద్యాశాఖకు సంబంధించిన మానిటరింగ్ అధికారులు పాఠశాలలకు అప్పుడప్పుడైనా వచ్చి విద్యార్థుల యొక్క పరిణతిని, వారి ప్రావీణ్యాన్ని, భాషా నైపుణ్యాన్ని చూసినట్లయితే విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా ఆనందిస్తారు.” అని సూచన చేస్తున్నారు శ్రీమతి పుష్పగారు వీరు మండలస్థాయిలో, జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా సన్మానాలు పొందారు.

ఉగాది పురస్కారం అందిస్తున్న అప్పటి జిల్లా కలెక్టర్ శ్రీ ప్రద్యుమ్న గారు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ పాండురంగ స్వామి గారు.
మతి పుష్ప గారు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా జిల్లా కలెక్టర్ చేత సన్మానింపబడుతున్నారు

తెలుగుసాహిత్య సాంస్కృతిక సమితి ఆవిర్భావం

సాహిత్యం సమాజాన్ని ప్రభావితం చేసి చిరకాలం నిలిచేందుకు అవసరమైన పద్య, గద్య కావ్యాలను ఆవిష్కరణ చేయడం, ప్రాంతాలకే ప్రత్యేకమైన కొన్ని రకాల కళలను అంతరించిపోకుండా చూడడం అనేటటువంటి రెండు లక్ష్యాలతో శ్రీ తులసినాథం నాయుడుగారు ‘తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి’ సంస్థను 2012లో స్థాపించారు.

శ్రీమతి పుష్ప కార్యదర్శినిగా శ్రీ తులసినాథంనాయుడుగారు అధ్యక్షులుగా ఆ సమితికి రెండు కళ్ళుగా వ్యవహరిస్తున్నారు.

నిజం చెప్పాలంటే వివాహమైన 16 సం.లకు వీరి ఇరువురి మనసులలో నుండి ఉద్భవించిన వీరి మానస పుత్రికయే తెలుగు సాహిత్య సాంస్కృతిక సంస్థ.

పేరుకు తగినట్లుగా దానిని అన్ని రంగాలలో అభివృద్ధిని చెందేటట్లుగా తీర్చిదిద్దడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు.

కానీ తులసినాథం నాయుడుగారు అనేక కార్యక్రమాలను అవిరామంగా నిర్వహిస్తూ ఉంటారు. ‘తెలుగు సూర్యుడు’గా పేరు పొందిన సి.పి.బ్రౌన్ జయంతి వేడుకలైనా, అవధానాలైనా, పుస్తకావిష్కరణలైనా, బాలబాలికల కోసం నిర్వహించే ఏ కార్యక్రమాలైనా, తెలుగు భాషాభిమానులు గర్వంగా తలచుకునే మహనీయుల జయంతి వర్ధంతులు, వేసవిలో పిల్లలకు శిక్షణ, తెలుగు భాషలో వివిధపోటీలు మాతృభాషా దినోత్సవాలు, భాషకు సంబంధించిన ఏ కార్యక్రమం జరపాలన్నా దానికి సరి అయిన వేదిక తెలుగు సాహిత్య సాంస్కృతిక సంస్థ మాత్రమే! అని పలువురు కొనియాడుతారు.

విజయం తెలుగు బిడ్డలదే!

తమిళనాడుకు చెందిన కోయంబత్తూరు ఈషా ప్రోగ్రాం 40 పాఠశాలలలో ప్రవేశపెట్టారు.

వీరు తమ పాఠశాలలోని పిల్లలకు ఆ శిక్షణ అవసరం లేదని ధైర్యంగా చెప్పారు ఎందుకంటే “ఈ పాఠశాల విద్యార్థులు తెలుగులో మంచి పట్టు సాధించారు. దాని ద్వారా గణితము, ఆంగ్లము మొదలైన విషయాల పట్ల మంచి నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు” అని ధైర్యంగా నిలబడి ఉపాధ్యాయులు చెప్పగలిగారు. తల్లిదండ్రులను ఒప్పించగలిగారు ఆ విధంగా ఆ పథకాన్ని తీసుకోని ఏకైక పాఠశాల వీరిదే కావడం గమనార్హం.

తాము నమ్మిన సిద్ధాంతం కోసం పోరాటానికైనా సిద్ధపడ్డారు. ఎందుకంటే కాన్వెంట్ మోడల్‌గా ఆంగ్ల మాధ్యమ విధానములో బోధించడానికి వీరు కొంత వ్యతిరేకత చూపించారు. ప్రభుత్వమూ, పత్రికలవారూ, తల్లిదండ్రులను కూడా సమాధానపరచగలిగారు. వారి పాఠశాలలోని పిల్లల నైపుణ్యాలను చూసి తల్లిదండ్రులు కూడా వీరి బాటనే అనుసరించారు.

తెలుగు వారికే సొంతమైన తెలుగు పద్యాన్ని చిరంజీవిని చేయాలని చిన్నారులను ఎంచుకొని వారికి పద్య పఠనంలో ఎవరూ సాటి రాలేనట్టుగా తీర్చిదిద్దుతున్నారు.

ఈ సమితి యొక్క మరొక ముఖ్య లక్ష్యం విద్యార్థులకు తెలుగు భాషను అందుబాటులోనికి తీసుకురావడం.

అంటే పిల్లలకు పద్యాలు, కథలు, సాహిత్యం-సంస్కృతి, నేర్పించినట్లయితే విలువలు పెరిగి, మేధాశక్తి పెంపొంది, ఉన్నత స్థాయి చేరడానికి దోహదమవుతుంది. అంతేకాకుండా ఎక్కడైనా సరే పోటీలు జరుగుతాయి అంటే నిర్భయంగా వెళ్లి తాము నేర్చుకున్నది చెప్పగలుగుతున్నారు అంటే అందుకు అవసరమైన పునాది ప్రాథమిక పాఠశాల స్థాయిలో పడడమే కారణం.

దీపావళి సంబరాలకు సంప్రదాయ వస్త్రధారణ

అందుకోసం పుస్తకాలను ముద్రించి విద్యార్థులకు ఉచితంగా అందించి విద్యార్థుల్లో విలువలను పెంచడానికి వీరు చేస్తున్న కృషి అనిర్వచనీయం. వీరి బాటలో వీరికి సహాయకారులుగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు సమాజంలోని ప్రతి ఒక్కరు పాఠశాలలలోని ఉపాధ్యాయులు, అధికార వర్గంలోని ప్రముఖులందరూ, అదేవిధంగా మీడియా వారు కూడా అనేక విధములుగా వీరికి చేయూతను అందిస్తున్నారు.

1998లో ఒకేసారి ఉద్యోగంలో చేరిన ఈ భార్యాభర్తలిద్దరూ ఆదర్శ దంపతులుగా అర్ధనారీశ్వర స్వరూపంగా తాము ఇన్ని సంవత్సరాలుగా సంపాదించిన జీతాన్ని వెచ్చించి పలమనేరుకి దగ్గరలోని సాయినగర్‌లో 30 లక్షల విలువైన స్థలంలో 20 లక్షలు వెచ్చించి ‘తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి’ కోసం కార్యక్రమాల నిర్వహణ కోసం కళామందిరాన్ని 2022 లో నిర్మించారు.

దీపావళి సంబరాలకు సంప్రదాయ వస్త్రధారణ

పలమనేరు కేంద్రంగా తెలుగు భాష కోసం కృషిచేస్తూ, రాష్ట్రస్థాయిలో ఎంతోమంది విద్యార్థులకు ఉపాధ్యాయులకు మార్గదర్శకాన్ని చూపించారు.

కళామందిరంలో నిత్యము సాహితీగోష్ఠులు, కవి సమ్మేళనాలు, చర్చలు, సత్కారాలు, సన్మానాలు, నిత్య కళ్యాణం-పచ్చతోరణంగా అలనాటి సాహితీ సమరాంగణా సార్వభౌమునిగా పిలుచుకునే శ్రీకృష్ణదేవరాయల ‘భువన విజయాన్ని’ తలపుకు తెస్తుంది. “కళామందిరంలో జరిగే సభలను చూడాలని, వినాలని, పాల్గొనాలని, పలువురి ప్రశంసలు అందుకోవాలని, సన్మానింపబడాలని కోరుకోని సాహిత్యవేత్త ఉండరు.” అని చెప్పడం అతిశయోక్తి కాదు.

వీరికి రెండు లక్ష్యాలు

ఒకటి తెలుగు భాషా సంస్కృతి కాపాడడం మొదటి లక్ష్యం కాగా తెలుగు భాషను విద్యార్థులకు అందించడం అనేది రెండవ లక్ష్యం.

దీనికోసం సొంత నిధులతో 108 నీతి పద్యాలను సేకరించి, వాటి భావాన్ని వివరిస్తూ చిన్న పుస్తకంగా ప్రచురణ చేసి, విద్యార్థులకు ఉచితంగా అందించారు.

ప్రతులను లక్షన్నర కాపీలు ముద్రించి రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు పంపిణీ చేశారు. చేస్తున్నారు. విద్యార్థులకు పోటీలను నిర్వహించి పెద్దబాలశిక్ష పుస్తకాలను, బాలల భారతం, రామాయణం,  భాగవతం వంటి గ్రంథాలను పిల్లలకు బహుమతులుగా అందజేశారు.

వీరు విద్యార్థులకు అందజేసిన పుస్తకాలలో అక్బర్-బీర్బల్ కథలు, తెనాలి రామకృష్ణుడి కథలు, పంచతంత్ర కథలు, హరికిషన్ కథలు, బొమ్మల భారతం, రామాయణం, భాగవతం, నాయకుల జీవిత చరిత్రలు, శాస్త్రవేత్తల జీవిత పుస్తకాలు, నజీరుద్దీన్ కథలు, తెలుగు వెలుగు నీతి కథలు, మొదలైన 30 వేలకు పైగా పుస్తకాలను అనేక సందర్భాలలో విద్యార్థులకు పంచిపెట్టారు. పెద్దబాలశిక్ష పుస్తకాలను సుమారు 5000 దాకా పాఠశాలలకు పంచిపెట్టారు.

జ్ఞానదీపాలు పేరుతో పాఠశాలల్లో, ప్రార్థనల్లో, చెప్పడానికి సూక్తులు, సామెతలు, పద్యాలతో 2000 పుస్తకాలను ముద్రించి పాఠశాలలకు పంచిపెట్టారు. వీటితోపాటు తులసి ఆకులు, తులసి పుష్పాలు, తులసి రసాలు, తెలుగు తోరణం వంటి 5000 పుస్తకాలను పంచిపెట్టారు. మొత్తంగా లక్షా 50 వేలు పైగా పుస్తకాలను పంచిపెట్టి రాష్ట్రస్థాయిలో గుర్తింపును పొందారు. ఇంకొక 50 వేల పుస్తకాలను ముద్రించి పంచి పెట్టేందుకు కృషి చేస్తున్నారు.

తెలుగు పద్యానికి పెద్దపీట వేస్తూ సంవత్సరానికి మూడు సార్లు పద్యాల పోటీల నిర్వహణ చేస్తూ 100 పద్యాలు చెప్పిన వారికి వెయ్యి రూపాయలు బహుమానం ప్రకటించి, సభావేదికలో అందజేయడం వీరికి తెలుగుభాష పట్లగల అభిమానానికి నిదర్శనం.

తెలుగుభాషాపోటీల నిర్వహణలో వేలాదిమంది పిల్లలకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు, పుస్తకాలు బహుమతులుగా అందజేస్తున్నారు. వేలాదిమంది కవులను, రచయితలను, భాషాభిమానులను, సంఘసేవకులను గుర్తించి సందర్భానుసారంగా వారికి సన్మానాలు చేశారు.

వీరు తెలుగు భాషకు చేస్తున్న కృషికి రాష్ట్రస్థాయిలోనే కాక జాతీయస్థాయిలోనూ పలు సన్మానాలు, సత్కారాలు, బిరుదులు అందుకున్నారు.

శ్రీమతి పుష్పగారు ఇలా అంటారు “మాతృభాష అయిన తెలుగును మరువరాదు. తెలుగుభాషపై పట్టు ఉంటే మిగిలిన భాషల్లోనూ రాణించవచ్చు. నేటి యువత మన సంస్కృతి సంప్రదాయాలపై మక్కువను చూపడానికి కృషి చేస్తున్న తన భర్తకు అండగా నిలవాలని కోరుతున్నారు. తెలుగు భాషాభివృద్ధి కోసం ఆమె కూడా తన వంతు సహాయంగా శారీరక, ఆర్థిక, మానసిక వనరులను అందిస్తున్నారు.

25 సంవత్సరాల బోధనానుభవముతో వారి కృషి ఎలాంటి ఫలాలను ఇచ్చిందో చూద్దామా?

2024 అక్టోబర్ నాటికి ఈ సంస్థ పుష్కర కాలాన్ని అధిగమించింది. అందువలన ఈ ఉత్సవాలను పుష్కరోత్సవం పేరుతో నిర్వహించాలని ఈ దంపతులు ఇరువురూ నిర్ణయించుకుని 12 మంది ఉపాధ్యాయులకు పురస్కారాలు, వందకు పైగా పద్యాలు చెప్పగలిగే విద్యార్థులకు ఎంతమంది అయితే అంత మందికి బహుమానాలు ఇవ్వడానికి ప్రకటనలు ఇచ్చారు.

వేడుక ఏ రోజు జరుగుతుందో ఆ రోజు సన్మానాలు, బహుమతులు ఇవ్వడం సులభమే! కానీ అందుకు తగిన వారిని ఎంపిక చేసి, దానికి ముందు జరిగేటటువంటి ఈ బృహత్ కార్యక్రమాన్ని జరపడానికి చక్కని ప్రణాళికను వేసుకుని ఇరువురూ నిర్వహించడం అనేది ముదావహం.

మాతృభాష నేర్చుకుంటే అన్ని కళలూ అలవోకగా అలవడుతాయని రుజువు చేస్తున్నారు.

గంగవరం మండలం కీలపట్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు.

కొందరు విద్యార్థులను పరిశీలిద్దాము.

నాలుగో తరగతి విద్యార్థి పూర్ణచంద్ర 150 పద్యాలను అలవోకగా చెప్తూ అనేక కథలను ధారాళంగా అందరికీ వినిపిస్తూ పలు పోటీల్లో పాల్గొని అనేక పతకాలను సొంతం చేసుకున్నాడు.

అదే పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న జ్యోతిర్మయి వంద నీతి పద్యాలను అలవోకగా చెప్తుంది. తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి నిర్వహించిన రాష్ట్రస్థాయి పద్యాల పోటీలో అనేక బహుమతులను గెలుచుకుంది.

భానుప్రియ 100కు పైగా వేమన పద్యాలను టక్కున చెప్తుంది పాటలు పాడడం నృత్యం చేయడంలో దిట్ట. బడిలో ఏ కార్యక్రమాలు నిర్వహించినా పోటీలలో బహుమతులు తనవే!

అలాగే కథలు చెప్పడం హాబీగా చేసుకుంది మూడో తరగతి చదువుతున్న తన్మయి. ఈ చిన్నారి శతాధిక కథలను అలవోకగా చెబుతుంది. భవిష్యత్తులో రామాయణ మహాభారత, భాగవతాలను కంఠోపాఠం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది.

అలాగే సోమల మండలం సరస్వతీపురం ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న సాహిత్య అలవోకగా 3 శతకాల పద్యాలు చెప్తారు. వేమన, సుమతి, బద్దెన శతకాలలోని పద్యాలు తడుముకోకుండా చెప్పడమే కాకుండా నిత్యపారాయణ శ్లోకాలు కూడా చెప్తారు. అంతేకాదు పద్యాలు, శ్లోకాలు, చిత్రలేఖనం, యోగ పోటీలలో అనేక బహుమతులు గెలుచుకున్నారు .

వీరి విద్యార్థులను చూసి అందరూ ఇలా అంటారు వీళ్లు ‘పిల్లలు కాదు పిడుగులు

పిల్లలలో పసిపిల్లలుగా వారితో ఒదిగిపోయిన తీరు ఆ సందర్భంలో తీసిన చిత్రాలను చూస్తున్నప్పుడు తులసీ పుష్పం ఎక్కడుందో వెతుక్కోవాలి.

బిరుదులు పురస్కారాలు

  • తెలుగు భాషా బంధు
  • బాల బంధు
  • బాల సాహితీ బంధు

తెలుగుభాషాసేవారత్న మొదలైన బిరుదులను అనేక సంస్థలు అందించాయి.

కడప జానుమద్ది హనుమశాస్త్రి శత జయంతి సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి శ్రీకృష్ణ మోహన్ గారు మరియు పూర్వ అధికార భాషాసంఘం అధ్యక్షులు అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ గారు ‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీత డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య గారు, కళాపీఠం సభ్యులు ఈ దంపతులను సన్మానించారు.

2009 సంవత్సరంలో హైదరాబాదులోని త్యాగరాయ గాన సభలో కిరణ్ సాంస్కృతిక సమాఖ్య వారు ప్రతిభా మూర్తి పురస్కారం అందించిన సందర్భంగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా పురస్కారం అందుకున్న దృశ్యం

జిల్లా కలెక్టర్ చేతులమీదుగా తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషా పురస్కారాన్ని అందుకున్న ఈ దంపతుల జీతం జీవితం బాలల అభివృద్ధి కోసం ఆశ-శ్వాస తెలుగు భాషాభివృద్దికే అంకితం చేస్తున్నారు.

ప్రస్తుతం తులసినాథంగారు కీలపట్ల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిగా పుష్పగారు నల్లకుట్లపల్లెలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు.

నేటి కంప్యూటర్ యుగంలో సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగవుతున్న తరుణంలో అంతరించిపోయే భాషలలో తెలుగు ఉందని యునెస్కో వారి ప్రకటన ప్రకారం, మన తెలుగు భాషే కనుమరుగవుతోంది మృతభాష కాబోతోంది అని మేధావులందరూ భయపడే తరుణంలో మన తెలుగు పండుగలు, సాహిత్యం సంప్రదాయాల పరిరక్షణకు పుస్తకాలను ముద్రించి విద్యార్థులకు ఉచితంగా అందించి విద్యార్థుల్లో విలువలను పెంచడానికి శ్రీమతి పుష్ప తులసీనాథంగారు చేస్తున్న కృషి ఎందరికో అనుసరణీయం.

తులసీపుష్పనాథం తెలుగు నాదమై నినదిస్తోంది.

‘జగమంత కుటుంబం మాది.’

🙏 🙏 🙏 🙏.

***

(మళ్ళీ నెల మరో గురువు పరిచయం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here