వందేమాతరం-9

0
6

[box type=’note’ fontsize=’16’] భారత స్వాతంత్ర్యపోరాటం గురించి, పలు వైజ్ఞానికాంశాల గురించి నేటి బాలబాలికలకు ధారావాహికంగా అందిస్తున్నారు డా. నాగేశ్వరరావు బెల్లంకొండ. [/box]

[dropcap]బ్రి[/dropcap]టీష్ వారికి వ్యతిరేకంగా పోరాడినందున పాలెగాళ్లను బందిపోట్లుగా చిత్రీకరించారు. నిజాం నవాబు బ్రిటీష్ గవర్నర్ జనరల్ ‘వెల్లస్లీ’ ప్రవేశపెట్టిన ‘సైన్య సహాకార’ పద్ధతికి తల ఒగ్గి సంధి షరతుల్లో భాగంగా రాయలసీమను 1800 సంవత్సరంలో ఆంగ్లేయులకు దారాదత్తం చేసిన ఫలితంగా, సీమ ఎర్రబడింది. 80 పాలెగాళ్లు 33వేలమంది సైనికులు కలిగిన బ్రిటీష్ వారిని ముప్పతిప్పలు పెట్టారు.

క్రీ.శ. 1801 నుండి 1806 వరకు చిత్తూరు పాలెగాళ్లు బ్రిటీష్ వారికి ఎదురొడ్డి నిలబడ్డారు. ఈ పోరాటంలో, ‘ముద్దు రామప్పనాయుడు’ (పాలయాకిరి)ని కల్లియబండ అడవులలో 1804లో బ్రిటీష్ వారు ఉరితీసారు. అనంతరం వరుసగా బంగారుపాలెం పాలెగార్ ‘కుమారు’ని, చారగళ్లుపాలెగారిని ఉరితీసారు. నారగల్లు పాలెగార్ కుమార వెంకటప్పనాయుడు, మిగిలిన పాలెగాళ్లను తమ ఆధీనంలోనికి బ్రిటీష్ పాలకులు తెచ్చుకున్నారు. 1760లో హైదర్ అలీ కాలంనుండి బ్రిటీష్ వారి వరకు 40 సంవత్సరాలు పాలెగాళ్ల అణిచివేత జరిగింది.

1842లో ఉయ్యలవాడ నరసింహారెడ్డి బ్రిటీష్ వారి చేతిలో మరణించాడు. 1805 నుండి 1847 వరకు ఈనాటి కడప జిల్లా జమ్మలమడుగు నుండి కర్నూలు జిల్లా కోయిలకుంట్లవరకు ఉన్నప్రాంతాన్ని చెంచులు, రెడ్లు అయిన పాలెగాళ్లే పాలించారు.

మన రాష్ట్రానికి సంబంధించిన పోరాటం గురించి చెప్పుకోవాలి ,

స్వాతంత్ర్యానికి పూర్వం, తెలంగాణాలో ఎందరో స్వాతంత్ర్యం కొరకు పోరాడారు. రజాకార్లు, నిజాం పోలీసుల దురాగతాలతో నాటి ప్రజలు వణికిపొతున్న సమయంలో రజ్వి, పుచ్చలపల్లి సుందరయ్య, డా.గురుకుల మిత్రాగారు, తులసి సోమేశ్వరరావు, ఆరుట్ల కమలాదేవి, ఐలమ్మ, మసూమా బేగం, ఉమ్మెత్తుల కేశవరావు, ఎన్.కే.రావు. ఎం.ఎల్.నరసింహారావు, కాటం లక్ష్మినారాయణ, గుండూరి కిషన్ రావు, జహందర్ అప్సర్, జ్ఞానకుమారి హెడ్డా, దొడ్డి కొమరయ్య, బద్రుల్ హసన్, భండారు చంద్రమౌళీశ్వరరావు, తోటపల్లి సుబ్రహ్మణ్యం, నఫీష్, ఆయేషాబేగం, పఠాన్ తుర్రేబాజ్ ఖాన్, పవారు నారాయణరావు, ఫక్రుల్ హజియాహసన్, బత్తిన మొగలయ్య, మాడపాటి రామచంద్రరావు, మీర్ గోహల్ అలీఖాన్, మౌల్వి సయ్యద్ అల్లాఉద్దీన్, బచ్చు వెంకటేశ్వర గుప్త, శ్రీధర్ ధర్మవీర వామన్నాయక్, సురభి వెంకటశేషశర్మ, బొజ్జం నరసింహులు,శ్యామసుందర్ వంటి వేలమంది సాయుధపోరాటం చేసారు.

అలా లక్షలమంది ప్రాణాల బలిదానం జరిగిన తరువాత…

1948 జూన్ లోపు భారతదేశానికి స్వాతంత్ర్యం ఇస్తామని నాటి బ్రిటీష్ ప్రధాని ‘క్లెమెంట్ అట్లి’ ప్రకటించారు.

అప్పటికే భారతదేశంలో 560 రాచకుటుంబాలు ఉన్నాయి.

భారతదేశపు చివరి గవర్నర్ ‘లార్డ్ మౌంట్‌బ్యాటన్’, బ్రిటీష్ రాజు జార్జి 6 వ చక్రవర్తి ‘ఆల్ బర్ట్ ఫెడ్రిక్ ఆర్ధర్ జార్జి’ 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్ర్యం ప్రకటించారు.

సర్దార్ వల్లభాయి పటేల్ సాహసంతో,నిజాం ప్రభుత్వం 1948 సెప్టెంబర్‌లో భారతదేశంలో విలీనం అయింది.

సర్దార్ వల్లభాయిపటేల్ 1950 డిసెంబర్ 15న మరణించారు.

***

బాలలు ఇప్పుడు మనం వందేమాతరం కథ తెలుసుకుందాం!

పూజారయ్య గుడి ముందుభాగంలో పడుకున్నాడు. చంద్రయ్య, సుగుణమ్మ శివయ్యలకు ఆ రాత్రి  సమావేశమయ్యారు.

“చంద్రన్నా రెండు తూటాలు, ఒక పట్టా కత్తి మన దగ్గర ఉన్న ఆయుధాలు. వీటితో దాదాపు రెండు వందలమంది సైనికులను ఎదుర్కోవాలి. కష్టమైన కార్యం, అన్నా నువ్వు తప్పించుకు వెళ్లు” అన్నాడు శివయ్య.

“అవును పెద్దయ్యా, ఈ యుధ్ధం ప్రారంభించింది మేము, ఇది మాతోనే అంతం కావాలి” అంది సుగుణమ్మ.

“మీరు నా బిడ్డలు లాంటోళ్లు, దేశం కోసం మీరు పోరాడుతుంటే నేను వెన్నుచూపాలా, అరవై ఏళ్ల వయసులో నాకు నా భారతమాత కోసం పోరాడి ప్రాణాలు వదిలే అవకాశం వచ్చింది, మరణం కూడా తృప్తికరంగా ఉండాలనుకునే తెలుగు బిడ్డను నేను. వెనుక అడుగు వేసే ప్రసక్తే లేదు. తెల్లవారుతూనే నువ్వు మెచ్చుకునే పని చేస్తాను చూడు” అని దూరంగా వెళ్ళి  పైపంచ పరుచుకు పడుకున్నాడు.

తెల్లావారుఝూమున నిద్రలేచిన శివయ్యకు వేగుచుక్క కనిపించింది.

పక్కనే ఉండే సుగుణమ్మ, కొంత దూరంలో ఉన్న చంద్రన్న కనిపించలేదు. మసక వెలుతురులో ఆ ప్రాంతమంతా వారికోసం గాలించాడు శివయ్య.

ఫెళఫెళలాడుతూ బ్రిటీష్ సైనిక అధికారుల గుడారాలు రెండూ, కొద్దిపాటి తేడాలో పేలిపోయాయి.

చంద్రన్న, సుగుణమ్మ చెరొక తూటాతో ఆ రెండు గుడారాలతో పాటు వారు బలి అయ్యరని గ్రహించిన శివయ్య మనసు క్షణకాలం మూగవోయింది. ఎంతో పోరాటం చేసి అయిన వారందరిని పోగొట్టుకుని ఒంటరిగా మిగిలిన తన కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటూ, తనకు కొద్దిదూరంలో అలికిడి కావడంతో తలతిప్పిచూసాడు.

కలెక్టర్ అప్పుడే శివయ్య ఉన్న ప్రాంతానికి చేరుకుని తన తుపాకి శివయ్యకు ఎక్కు పెడుతున్నాడు.

ఉద్రేకంతో ఊగిపోతున్న శివయ్య చేతిలోని పట్టాకత్తితో కలెక్టర్ తల తెగవేసాడు. అప్పటికే కలెక్టర్ తుపాకినుండి వెలువడిన బులెట్ శివయ్య గుండెను ఛేదించుకుని వెలుపలకు వెళ్లింది. చివరిసారిగా శివయ్య నోటి నుండి వెలువడిన ‘వందేమాతరం’ కేక ఆ కొండల్లో ప్రతిధ్వనించింది.

జరిగిన పోరాటానికి నేనే సాక్ష్యం అంటూ తూరుపున సూర్యుడు ఉదయించాడు.

(సమాప్తం)

అంకితం:

మన దేశ స్వాతంత్ర్య పోరాటంలో అశువులు బాసిన మహనీయులకు, పోరాటం జరిపిని వారందరిని పేరు, పేరునా స్మరిస్తూ, పాదాభివందనాలు చేసుకుంటూ ఈ నా రచన ‘వందేమాతరం’ బాలల దేశభక్తి నవల అంకితం చేస్తున్నాను.

డా. బెల్లంకొండ నాగేశ్వరరావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here