అందరూ తెలుసుకోవాల్సిన గాథ ‘వన్నూరమ్మ’

0
9

[dropcap]భా[/dropcap]రతదేశంలో అణువణువూ అద్భుతమైన గాథలు చెప్తాయి. ప్రతి కణం ఒక కథ చెప్తుంది. ప్రతి వృక్షం సంఘటనలకు మౌన సాక్ష్యం చెప్తుంది. ఇక్కడ మట్టిలో దాగి ఉన్న వీరుల గాథలెన్నో.

కాలక్రమేణా గతాన్ని మరచి, వర్తమానంలో బ్రతకటం విడచి, తెలియని భవిష్యత్తు వైపు సర్వం విడచి పరుగెత్తుతున్నాం. అలాంటి సమయంలో బొమ్మిశెట్టి రమేష్ అందించిన ‘వన్నూరమ్మ’ లాంటి పుస్తకాలు ఒకసారి వెన్నుతట్టి ఆపుతాయి. పరుగు ఆపి గతాన్ని పరిశీలించి వర్తమానాన్ని గమనించమంటాయి. అక్షరరూపంలో లేకుండా మౌఖికంగా ప్రసారమవుతూ ప్రజల మనస్సులలో మౌనంగా ఒదిగి ఉన్న అనేకానేక గాథలలో ‘వన్నూరమ్మ’ గాథ ఒకటి.

చరిత్ర రచయితలు సాధారణంగా మౌఖిక గాథలను కల్పనలనీ, అతిశయోక్తులనీ కొట్టేస్తారు. అలాంటి గాథలనేకం మరుగున పడిపోయాయి. మరపుకు గురయ్యాయి. ఇలాంటి పరిస్థితులలో బొమ్మిశెట్టి రమేష్, చిన్నప్పుడు విన్న వన్నూరమ్మ గాథను నిరూపించాలని కంకణం కట్టుకుని వివరాలు సేకరించి, చరిత్రకారులు చేయాల్సిన పనులు చేసి ఈ పుస్తకం వెలువరించటం అభినందనీయమైన విషయం.

నిజానికి ఇలాంటి చరిత్రను నిర్ధారించి, అందరికీ అందించేందుకు ప్రభుత్వోద్యోగులున్నా, వారికి ఇలాంటిది ఒక ఉద్యోగ విధి మాత్రమే. అందుకే ఆసక్తి కల వ్యక్తులు పూనుకుని ఇలాంటి గాథలను సజీవంగా అందించకపోతే ఇంకొన్నాళ్ళకి ఎల్లప్పటికీ అందకుండా కాలగర్భంలో కలసిపోతాయి అనేక అద్భుతమైన చారిత్రక సత్యాలు.

బొమ్మిశెట్టి రమేష్ బాబు ‘వన్నూరమ్మ’ కథను, ఆమె కార్యక్షేత్రానికి సంబంధించిన విశేషాలను, ఆమెతో పరిచయం ఉన్న చారిత్రక వ్యక్తుల విశేషాలను సమగ్రంగా, ఫోటోలతో, పూర్తి వివరాలతో అందించారు. ఆమె గురించి సేకరించిన సమాచారాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు. అయితే వన్నూరమ్మ కథను ఒక పద్ధతి ప్రకారం చెప్పక మధ్యలో కోటల వివరాలు, క్షేత్రాల వివరాలు, ఇతర గాథలను విపులంగా వివరిస్తూండటంతో కొన్ని సందర్భాలలో అసలు కథ వెనక్కిపోయింది. దాంతో ఒక క్రమంలో వన్నూరమ్మ జీవితం, ఆమె సాధించిన కార్యాలు, పోరాటాలు, విజయాలు,  మరణం వంటి విషయాలు అదవు. వీటి కోసం సమాచారం నడుమ వెతుక్కోవాల్సి ఉంటుంది.

అలాగని ఈ పుస్తకంలోని విషయాలు సేకరించటంలో, అందించటంలో రచయిత శ్రమను కానీ, పుస్తకం విలువను కానీ తక్కువ చేయలేము. ఎంతో గొప్ప శ్రమపడి చక్కని సత్యాలను అందించిన రచయితకు అభినందనలు తెలపటమే కాదు, విస్మృతిలో పడిన ఒక వీర మహిళ గాథను తెర పైకి తెచ్చినందుకు కృతజ్ఞతలు తెలపాల్సి ఉంటుంది. అయితే, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి వంటి రచయిత తోడుగా ఉండగా, సేకరించిన సమాచారాన్ని ఒక పద్ధతి ప్రకారం అందించటంలో ఆయన సహాయం తీసుకుని ఉంటే పుస్తకం మరింత ఆకర్షణీయం అయి ఉండేది.

అందరూ తెలుసుకోవాల్సిన గాథ వన్నూరమ్మది.

***

వన్నూరమ్మ

(ఎదురులేని పాలెగత్తె)

సంపాదకులు: బొమ్మిశెట్టి రమేష్

పేజీలు: 164

వెల: ₹ 250

ప్రతులకు:

డో.నెం. 14/1037

తెగిపోయిన గండి దగ్గర,

కడప రోడ్డు, మైదుకూరు 5/6/72

Ph: 9848373736, 9502860860

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here