ఇల్లు సీక్వెల్ పోయెమ్ – వంటింట్లో ఆమె కథల పుస్తకం!

1
11

[శ్రీమతి గీతాంజలి రచించిన ‘ఇల్లు సీక్వెల్ పోయెమ్ – వంటింట్లో ఆమె కథల పుస్తకం!’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఇం[/dropcap]ట్లో ఒక జాగాని సృష్టించుకుని..
ఆమె కథనో కవితో రాయడం మొదలెడుతుందా..
రెండో కప్పు చాయ్ అని అరుస్తాడతడు.
కథ వేలు విరుగుతుంది.
ఆమె మళ్ళీ కూర్చుంటుంది.
నాలుగు వాక్యాలు రాస్తుందో లేదో..
టిఫిన్ ఏంటో ఈ పూట.. గాల్లో తేలుతూ అతగాడి ఆరా!
బ్రేక్‌ఫాస్ట్ కోసం.. రాస్తున్న కథలో
పాత్రల్ని కొంచెం ఆగండని బ్రతిమిలాడుకొని.. బ్రేక్ అవుతుంది.
ఇక ఆమె కథ ఇడ్లి.. దోశ.. లేదా అతడు తాగే రాగి జావ అవుతుంది
ఆమె కలం జావ కారిపోతుంది.
కాగితం.. కలం విసుక్కుంటాయి.
సరే.. ఇకనైనా అనుకుంటూ ఆమె కలం పడుతుందా..
ఖాళీ లంచ్ కంచం వంటింటి
అలమర దిగి దొర్లుకుంటూ
ఆమె ముందుకొచ్చి ఆకలేస్తుంది అన్నం పెట్టు
అని ఇంటి మగాడిలా రంకెలేస్తుంది.
పుస్తకం జాలిగా ఇంకేం రాస్తావూ వంటింట్లోకి పో.. పొమ్మంటుంది!
సాయంత్రపు అతిథుల కోసం చాయ్ కప్పులు, ఫలహారపు ప్లేట్లు
ఆమె చుట్టూ గింగిరాలు తిరుగుతూనే ఉంటాయి.
లివింగ్ రూమ్ అతని క్రికెట్ కేరింతలతో..
కిచెన్ రూమ్ ఆమె పుస్తకం, కలంతో చేసే
రహస్య దుఃఖ సంభాషణతో..
కొత్త భాషొకటి ఆవిష్కరించబడుతుంది.
ఆమె రాతల పుస్తకం, కలం ఆమె మీద అలిగి,
నోటికి సీలు బిగించుకొని ముడుచుక్కూర్చుంటాయి.
ఆమె కథలో స్రీ పాత్రలు..
ముందు నువ్వు విముక్తి చెందు
అంటూ ఆమెని వెక్కిరిస్తూ ఉంటాయి.
***
రాత్రి డిన్నర్‌కి డైనింగ్ హాల్..
హారర్ సంగీతాన్ని మౌనంగా మెరిపిస్తుంది.
ఆమె మండే గుండెని, కన్నీరించే కళ్లను
పసుపు కారాలంటిన చీర కొంగు దయగా తుడుస్తుంది.
***
రోజంతా వాళ్ల దేహాల్లోని
అన్నపు సంచీలను నింపుతూనే ఉంటుందా..
ఆమె ఖాళీ కాగితాలు మాత్రం అక్షర భిక్ష
వేయమని దీనంగా జోలె చాస్తాయి.
మూసిన కలం లోపల రాయని అక్షరాలు
ఊపిరాడక గిలగిల్లడుతుంటాయి.
టిఫినూ.. లంచ్, డిన్నర్ల అరుపుల మధ్య
ఆమె తన కవితా వాక్యాలనే మర్చిపోతుంది!
ఇక కాగితాలు, కలమూ విసిగిపోయి
ఎగురుతూ వంటింటి పొయ్యరుగు మీదకి
ఎక్కి కూర్చుంటాయి
ఇక ఇక్కడే కథలు రాసుకో అని ఆదేశిస్తాయి!
పోపుల డబ్బా పక్కనే కథల పుస్తకం దీనంగా కూర్చుంటుంది.
***
ఇక ఆమె రాతలకి మిగుల్చుకున్న
రాత్రుళ్ళని కూడా ఇంటి అవసరాలు దోచుకుంటాయి.
రాత్రుళ్ళు అందరూ నిదురపోయాక
ఇన్ని మిణుగురుల్ని ముందేసుకుని
నిదుర కన్నులతో రాసుకుంటుంది.
చంద్రుడు.. పొద్దున్నే లేవాలిక నిద్రపో అని కసురుతాడు.
సూర్యుడు.. ఇంటి ఇల్లాలివి ఆలస్యంగా లేస్తే ఊరుకోను
అని మగ గొంతేసుకుని హుంకరిస్తాడు .
సూర్య చంద్రుల మధ్య మిగిలిన
ఆ కొద్ది చీకటి వెలుగుల కాలాన్ని కాస్తా మొగుడు మింగేస్తాడు!
రాయాల్సిన కథలతో వేడెక్కిన ఆమె మెదడు చిట్లి
ఇంటినిండా ఎగిరే అక్షరాల్ని
అందుకుని ఆమె దాచుకుంటూ ఉంటుంది!
***
ఇక రోజులు.. నెలలు.. సంవత్సరాలు
అతని వంటిల్లు.. ఆమె కథలు రాసే వేళ్ళను విరిచి..
దేహాన్ని వంటింటి బర్నర్ మీద కాలుస్తూ ఉంటుంది.
అక్షరాలు అందని ఆమె కథల పుస్తకం
కాగితాలతో రెపరెపలాడుతూ తల బాదుకుంటుంది.
దుఃఖాన్ని ఆపుకోలేక ఆమె కలాన్ని విరిచి పడేస్తుంది చాలాసార్లు!
కలం మొండిది.. మళ్ళీ మొలిచి ఆమె వేళ్ళ మధ్య అతుక్కుంటుంది.
కలాన్ని, వంటింటిని వదుల్చుకోలేక
ఆమె మండి పోతూ ఉంటుందా..
మరోపక్క ప్రపంచ సాహిత్యాన్ని తీరిగ్గా చదువుతున్న
మగ కళ్ళ ఇంటి యజమాని మాత్రం
ఇల్లంతా బార్బిక్యూడ్ చికెన్ సువాసన
అనుకుని శ్వాస ఎగబీలుస్తూ పరవశిస్తూ ఉండడాన్ని
ఆమె కథల పుస్తకం చూస్తూనే ఉంటుంది.
కలం రాస్తూనే ఉంటుంది.
ఆమె నుంచి కలాన్ని, కాలాన్ని దోచుకున్న అతను
వేదిక మీద సమానత్వపు రంకెలతో ఊగిపోతూ ఉంటాడు.
ఆ రచయిత్రిల్లాలు.,
ఏం చేస్తుందిక?
కుకింగ్ రేంజ్‌నే.. రైటింగ్ టేబుల్‌గా మార్చి..
దివా రాత్రుళ్లలో
రహస్యంగా తోడుకొని దాచుకున్న క్షణాలలోనే..
తన రాయలేనితనాన్నే కవిత్వంగా రాస్తూ
జెండాని ఎగరేస్తూనే ఉంటుంది!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here