వరాలు-2

0
8

[శ్రీమతి మల్లాప్రగడ బాలాత్రిపుర సుందరి రచించిన ‘వరాలు’ అనే పెద్ద కథని పాఠకులకు అందిస్తున్నాము. ఇది రెండవ భాగం. మొదటి భాగం ఇక్కడ.]

[dropcap]“నా[/dropcap]తో వద్దువుగాని వుండవే వరాలూ” అమ్మ అంది.

“ఊహూ నేను శీనూ వాళ్ళతోనే వెళ్తా గుడికి”

శీను, కిట్టూ, పద్మ అందరూ గుడికెళ్ళడానికి తమారయేరు. గుడి అంటే ఎంతో ఇష్టం వరాలుకు. రాములువారి గుడి అది. ఎంతో పెద్ద ఆవరణ. పెద్ద గోపురం. పెద్ద ధ్వజస్తంభం. ఆ ధ్వజస్తంభం చివరివరకు చూడాలంటే వరాలుకి ఎంతో సరదా. రెండు చేతులూ నడుముపై ఆనించి తల బాగా పైకెత్తి చూస్తుంటే ఆ ధ్వజస్తంభం చివరన ఎండలో మెరిసే బంగారు రంగు ఎంతో బాగుంటుంది వరాలుకు. “బ్రహ్మోత్సవాలప్పుడు ఆ ధ్వజస్తంభం చివరనే జెండా కట్టేరుట” శీను చెప్పేడు. ఆ జెండా చూసి దేవతలు బ్రహ్మోత్సవాలు చూడ్డానికొస్తారట. వరాలు నమ్మలేదు. తన కెప్పుడు ఆ ఉత్సవాల్లో మనుషులే కనబడ్డారు కాని దేవతలెవరూ కనబడలేదు. అదే అంటే “దేవతలెలావుంటారో నీకేం తెల్సు” అని శీను గేలిచేసేడు. తనకెందుకు తెలీదు. ఎన్ని సినిమాల్లో చూడలేదు? ధగధగలాడే కిరీటాలు పెట్టుకుని, నగలేసుకుని, చొక్కా లేకుండా పట్టు పంచె మాత్రం కట్టుకుని మబ్బుల్లో కూడా నడిచేస్తూ వుంటారు. కాదుట – అసలు దేవతలు ఎవరికీ అంటే మనుషులకి కనబడరుట. స్వర్గంలో ఆకాశంలో వుంటారుట. అసలేమిటో అన్నీ విచిత్రాలే! బళ్ళో ఎగరేసే మూడురంగుల జెండాయే తెలుసు తనకి. అంతవరకూ, శీను చెప్పేవరకు ఈ జెండా గురించి తెలీనే తెలీదు తనకి.

అదేకాదు గుళ్ళో వుండే పెద్ద గంటకూడా ఒక అద్భుతమే వరాలుకి. ఎంత పెద్ద గంటో! దానికో లావుతాడు కట్టి వుంటుంది. దర్శనానికి వదిలేముందు ఆ గంట తాడు పట్టుకుని లాగుతుంటే అది ఠంగ్ ఠంగ్ మని మ్రోగుతుంటుంది. వరాలు రెండు చెవులూ మూసుకున్నా వినబడుతూనే వుంటుంది. ఆ గంట మ్రోగినప్పుడే దేవుడికి నైవేద్యం పెడ్తారుట. ఆ తర్వాత దర్శనం. దర్శనంకి ఎప్పడు వదుల్తారా అని ఎదురుచూస్తూ వుంటుంది వరాలు గంట మ్రోగుతున్నంత సేపూ. అది ‘ప్రసాదం భక్తిలే’ అని వెక్కిరిస్తాడు కిట్టూ. కాని వాడు మాత్రం లొట్టలేస్తూ తింటాడు కదా ప్రసాదం. రోజూ మిరియం పొంగలి ఇస్తారు. ఎంత బావుంటుందో! ప్రసాదం పెట్టే పూజారి వరాలుని చూడగానే నవ్వుతూ “ఏం ప్రసాదం భక్తురాలా, వచ్చేవా” అని పలకరిస్తాడు. వరాలుకు కోపమొచ్చినా వెంటనే తగ్గిపోతుంది. మిగిలిన వాళ్ళకన్నా తనకి ఎక్కువ ప్రసాదం పెడ్తారుగా అందుకని.

ఆ గంట పక్కనే పెద్ద సాన వుంటుంది. ఎంత పెద్ద సానో! రెండు చేతులూ బారచాచినా, సాన సగం వరకే ముట్టుకోగలదు వరాలు. దానిపై దేవుడికి గంధం తీస్తారు. శ్రీరామనవమి రోజు ఇచ్చే పానకం, వడపప్పుతో బాటు ఆ గంధం కూడా ఇస్తారు. అది మెడ క్రింద రాసుకుంటే ఎంతో చల్లగా వుంటుంది. ఇంట్లో కూడా ఎండాకాలం అమ్మ చిన్న సానపై గంధం అరగదీసి పొట్టకి, మెడకి, వీపుకి రాసేది చలవ చేస్తుందని, చెమటకాయలు రావని. అమ్మ అలా రాస్తుంటే వరాలుకి ఎంతో హాయిగా వుంటుంది.

బ్రహ్మోత్సవాలప్పుడు గుడంతా భలేగా వుంటంది. పెద్ద పందిరి వేసి స్తంభాలకి పెద్ద పెద్ద బొమ్మలు కడ్తారు. రాక్షసుల బొమ్మలు చూస్తే కొంచెం భయంగా వున్నా వాటి నోట్లో చేయి పెట్టి, వాటి కోరలు తాకడం గొప్పగా వుండేది వరాలుకి. దేవుడికి ‘ఊంజల సేవ’ కూడా వుండేది. దేవుడి ఊయల నిజం వుయ్యాలలా వుండదు. రమణి అక్కవాళ్ళింట్లో తాము ఊగే వుయ్యాలలా అస్సలు వుండదు. తనకి కాళ్ళు నేలకానవు కాని, పద్దునో రమణి అక్కో ఎవరో ఒకళ్ళు వూపే వాళ్ళు. ఎంత స్పీడుగా వూపితే అంత బాగుండేది వరాలుకి. గలగలా నవ్వుతూ కళ్ళు గట్టిగా మూసుకుని ‘ఇంకా స్పీడు ఇంకా స్పీడు’ అనేది. పైకి, కిందికి మళ్ళీ పైకీ, వెనక్కి వెళ్తుంటే వస్తుంటే ఎంతో మజాగా వుండేది.

ప్చ్ పాపం దేవుడికి అలా ఎవరూ వూపరు. మెల్లిగా వూపుతారు. తనతో కూడా అమ్మ ఒకసారి ఊపించింది కదా! ‘పాపం దేవుడు’ అన్పించింది వరాలుకి.

***

“ఉషక్కా నాకు త్వరగా జడెయ్యి. నేను, శీను ఈరోజు సినిమాకెళ్తున్నాము” తొందరపెట్టింది వరాలు.

ముందురోజే పెద్దన్నయ్య ఊరినుంచి వచ్చేడు. అందరికీ డబ్బులిచ్చేడు సినిమా కెళ్ళండని. అప్పుడు ఆ వూర్లో రెండే టాకీసులు. ఒకటి కొంచెం బావుంటుంది. రెండోది మరీ డబ్బా రేకులది. దేనికెళ్ళినా నేల టికెట్టుకే వెళ్ళేది ఎప్పుడూ. ఎప్పుడైనా కామేశ్వర్రావు మామయ్య వస్తే ఫ్రీగా సోఫాల్లో కూచుని సినిమా చూసేవారు. మావయ్య ఏదో ఫిలిం కంపెనీలో పనిట. సినిమా డబ్బాలు పట్టుకుని ఊరూరూ తిరుగుతాడట. వరాలువాళ్ళ వూరు వచ్చినప్పుడు వాళ్ళింట్లోనే దిగుతాడు. నెలరోజులో ఇంకా ఎక్కువ రోజులో వుంటాడు. ఆ సినిమా ఆ వూళ్లో ఆడినన్ని రోజులూ వుంటాడు. అప్పుడు ఒకటి రెండు వారాలయ్యాక ఆ సినిమాకి వరాలు వాళ్ళని ఫ్రీగా తీసికెళ్ళేవాడు. అలా ‘రోజులు మారాయి’, ‘శ్రీ కృష్ణలీలలు’ ఎన్నిసార్లు చూసిందో వరాలు. ఏదీ చివరి వరకూ చూడలేదు. నిద్ర వచ్చేసేది. సోఫాలోనే నిద్రపోయేది. మావయ్య ఎత్తుకుని తీసుకుని ఇంటికి తెచ్చేవాడు. ఇంటికొచ్చేప్పటికి మెలకువ వచ్చేసేది. ‘రేపు నిద్రపోకూడదు’ అని ప్రతిరోజూ అనుకునేది వరాలు.

తయారై టాకీసు చేరేప్పటికి ఉస్సురన్నాడు శీను. మగవాళ్ళ దగ్గిర ఇంత పొడుగు క్యూ. ఆడవాళ్ళకి తక్కువేకాని ఒక్కళ్ళకి ఒక్కటే టికెట్టు. వరాలుకి దొరికిపోయింది. శీను ఇంకా క్యూలో వున్నాడు. శీనుకి దొరుకుతుందో లేదో టికెట్టు అని గాభరా. అప్పుడు వచ్చేడు ఒకబ్బాయి. శీను కన్నా కొంచెం పొడుగ్గా వున్నాడు. ‘టికెట్టు కావాలా’ అంటూ. భయపడి ‘శీనూ’ అని పిలిచింది వరాలు. శీను క్యూలోంచి ‘ఏంటి’ అని అరిచేడు. ‘టికెట్టు కావాలా’ అంటూ టికెట్టు చూపించేడా అబ్బాయి. శాము క్యూలోంచి బయటకొచ్చేడు. ‘నేను టికెట్టు తీసుకున్నాను. సినిమా చూడట్లేదు. నీకు కావాలంటే ఇచ్చేస్తాను’ అన్నాడా అబ్బాయి. సంతోషంగా ఆ అబ్బాయి చేతిలో డబ్బులు పెట్టి టికెట్టు తీసుకున్నాడు శీను.

ఆడవాళ్ల గేటు, మగవాళ్ళ గేటు వేర్వేరు. శీనూ అటూ, వరాలు ఇటూ నడిచేరు. వరాలు ఇంకా గేటు చేరనే లేదు. శీను పరిగెట్టుకుంటూ వచ్చాడు. ‘ఏడీ, వాడేడీ?’ అంటూ రొప్పతున్నాడు. మళ్ళీ భయమేసింది వరాలుకి. మోసం చేసేడట ఆ అబ్బాయి. మేట్నీ టికెట్టు చింపిన ముక్కలు రెండూ తెలీకుండా చక్కగా అతికించి శీనుకి అమ్మేడు. గేటుదగ్గిర అబ్బాయి లోపలికి పంపకుండా శీనుని వెనెక్కి పంపేసేడుట. ‘నీవు లోపలికి వెళ్ళి కూచో నేనిప్పడే వస్తాను’ అని ఆ అబ్బాయిని వెతుక్కుంటూ వెళ్ళేడు శీను.

బిక్కుబిక్కు మంటూ లోపలికెళ్ళి కూర్చుంది వరాలు. నేలక్లాసు మొగవాళ్ళకి, ఆడవాళ్ళకి వేరు వేరు. మధ్యలో చిన్న గోడ. గోడముందు మగవాళ్ళ గేటువేపు చూస్తూనే వుంది వరాలు ‘శీను ఇంకా రాలేదేమిటి’ అనుకుంటూ. లైట్లన్నీ అర్పేసేరు. గేటుపై ఎగ్జిట్ మాత్రం ఇంగ్లీషులో మెరుస్తూ వుంది. వరాలుకి గాభరాగా వుంది. న్యూస్ రీలు మొదలు పెట్టేసేరు. తెరవేపు చూడాలన్పించడంలేదు. సినిమా సరదా అంతా పోయింది. గేటువేపే నక్కి నక్కి చూస్తోంది వరాలు.

అదిగో వాడే, వచ్చేసేడు! చీకట్లో కూడా వాడి ఎర్రగళ్ళ చొక్కా పోల్చేసుకుంది వరాలు. వాడి క్రాఫు కూడా పోల్చేసుకుంది. వరాలుని వెతుక్కుంటూ అందరి కాళ్ళు తొక్కుతూ అందరితో కసిరించుకుంటూ వచ్చాడు శీను. వరాలు పక్కనే గోడకటు పక్క కూర్చున్నాడు. వాడు దొరికేడుట. వాడి దగ్గర డబ్బులు లాక్కుని టికెట్టు కొనుక్కుని వచ్చేడుట. సినిమా చూడగలుస్తున్న ఆనందం మెరుస్తోంది శీను కళ్ళల్లో.

‘వీడికన్నా వాడు అంతలావు, ఎత్తు. ఎలా వాడి దగ్గర్నించి డబ్బులు రాబట్టగలిగేడా’ అనుకుంది వరాలు. అడిగేంతలో సినిమా మొదలైపోయింది. గోడకటు వేపు నుంచి శీను, ఇటువేపు నించి వరాలు – పూర్తిగా లీనమైపోయి హేపీగా సినిమా చూడసాగేరు.

***

రోజూ లైబ్రరీకి వెళ్ళడం బాగా అలవాటు, ఇష్టం వరాలుకి. అందరూ చదవడం వచ్చాక పుస్తకాలు, పేపర్లు చదువుకోడానికి లైబ్రరీకి వెళ్తారు. కానీ వరాలు మాత్రం చదవడం ఏమాత్రం రానప్పటినుంచీ పెద్ద వాళ్ళతో లైబ్రరీకి వెళ్ళి బొమ్మలు చూస్తూ కూచునేది. అది ప్రభుత్వ గ్రంథాలయం. వరాలుకు దాన్ని చూస్తుంటే భలేగా వుండేది. ముందొక పెద్ద హాలు – అక్కడ పెద్ద పెద్ద అద్దాల బీరువాలు గోడకి వుండేవి. వాటిల్లో పుస్తకాలుండేవి. మధ్యలో పెద్ద పెద్ద టేబిళ్లు, వాటి చుట్టూ కుర్చీలు. టేబిళ్ళపై పేపర్లు, పత్రికలూ అన్నీ వుండేవి. అంతా నిశ్శబ్దంగా వుండేది. ఎవ్వరూ మాట్లాడేవాళ్ళు కాదు. పుస్తకాలో, పేపరో చదువుకుని వెళ్ళిపోయేవారు. ఎవ్వరూ మాట్లాడకపోవడం నచ్చేదికాదు వరాలుకి. తనెప్పుడైనా మాట్లాడపోయినా లైబ్రరీ తాత ‘ఉష్’ అనేవాడు వేలు నోటిపై వుంచి బళ్ళో టీచర్లా.

పెద్ద హాలు వెనక చిన్న గది. అందులో చిన్న పిల్లల పుస్తకాలుండేవి. అక్కడుండేవాడు ఈ లైబ్రరీ తాత. తనేమో ‘పుస్తకాల తాత’ అనేది. తాతేమో తన్ని ‘మురుకు పాపా’ అని పిలిచేది. అమ్మ ‘సాయంత్రం మురుకు కొనుక్కో’ అని కాణీ ఇస్తే మురుకు కొనుక్కుని లైబ్రరీకి వెళ్ళి, మురుకు తింటూ పుస్తకాల్లో బొమ్మలు చూసేది వరాలు. అందుకే తాత ముద్దుగా ‘మురుకు పాపా’ అని పిలిచేవాడు. చదవడం వచ్చేసాక ఎన్ని పుస్తకాలు చదివిందో ఆ లైబ్రరీలో. బాలల బొమ్మల భారతం, భాగవతం, రామాయణం, బీర్బల్ కథలు, తెనాలి రామలింగడి కథలు, హాతింతాయ్ కథలు, సింద్ బాద్ కథలు, అరేబియన్ నైట్స్, ఇంకా ఎన్నో పుస్తకాలు. ప్రతినెలా ‘చందమామ’ తప్పక చదివేది. ‘చందమామ’ ఆ రోజు వస్తుందంటే, ముందుగా లైబ్రరీ తెరవక ముందే వెళ్ళి కూచునేది. పుస్తకాలు చదువుతుంటే టైమే తెలిసేది కాదు. లైబ్రరీ మూసేస్తారంటే బాధగా వుండేది. లేచి రాబుద్ది పుట్టేది కాదు. తాత ‘రేపు ఆ పుస్తకం నీకే ఇస్తాగా!’ అని హామీ ఇచ్చిన తర్వాత అయిష్టంగానే లేచి వెళ్ళేది.

***

ఆవేళ ఆదివారం అయినా, వరాలు ఆటలకు పోకుండా కూర్చుని బుద్ధిగా నోటు పుస్తకాలకి, టెక్స్టు పుస్తకాలకి అట్టలువేస్తూ, లేబిల్స్ అంటిస్తూ కూర్చునివుంది. మర్నాడే స్కూళ్ళో ఇన్ స్పెక్షన్. టీచర్ చెప్పింది, పుస్తకాలన్నీ నీట్ గా వుండాలని.

వారం రోజుల్నించి సైన్స్ డ్రాయింగులూ, సోషల్ స్టడీస్ మేప్‌లు, అన్నీ రంగుల్లో వేసి నింపి పెద్ద పెద్ద డ్రాయింగ్ షీట్లలో వాటిని క్లాస్ రూం గోడల కంటించారు. రంగు రంగుల కాగితాలతో తోరణాలతో క్లాస్ రూం అలంకరించారు. ఇపుడు తను చదువుతున్నది గవర్నమెంటు గర్ల్స్ హైస్కూల్. అంతకు ముందు చదివింది చిన్న స్కూలు. ఎనిమిది క్లాసులవరకే అక్కడ వుందని తొమ్మిదోక్లాసులో మునిసిపల్ స్కూలుకి మారింది. ఇది చాలా పెద్ద స్కూలు. ఆరునుంచి పదకొండు – అంటే ఎస్.ఎస్.ఎల్.సి. వరకూ వుంది ఇక్కడ. ఒక్కో క్లాసులో ఎ,బి,సి,డి అని నాలుగు సెక్షన్లు. ప్రతి క్లాసుకి ఒక క్లాస్ రూమ్, హెడ్ మిస్ట్రెస్ రూమ్, టీచర్స్ రూమ్, ఒక చిన్న లేబ్ కూడా వుంది. గ్రౌండయితే ఎంత పెద్దదో – వరాలుకు గ్రౌండు భలే నచ్చింది. గేమ్స్ పిరీడ్‌లో అక్కడ త్రోబాల్, బాస్కెట్ బాల్, టెన్నీకాట్ అన్నీ ఆడుకోవచ్చు. ఇంకా పరుగులు కుందుళ్ళు – ఇలాటి ఆటలు కూడా ఆడుకోవచ్చు. ప్రతిరోజూ సాయంత్రం స్కూల్ అయిపోయాక ఆ గ్రౌండ్లోనే డ్రిల్లు. ఉదయం ఆ గ్రౌండ్లోనే ప్రేయరు.

అంతా నచ్చింది కాని, ఒక్కటే చిక్కు వచ్చింది. ఇంతవరకు చదివిన స్కూల్లో హిందీ లేదు. ఇక్కడేమో ఆరోక్లాసు నుంచీ హిందీ వుంది. తొమ్మిదో తరగతంటే మరి పెద్ద పెద్ద పాఠాలు, పద్యాలు, వ్యాసాలు అన్నీ వున్నాయి. తను చేరి రెండునెలలే అయింది. హిందీ టీచర్ దగ్గిర ట్యూషన్ కూడా వెళ్తోంది. ట్యూషన్ అంటే డబ్బులిచ్చి కాదు. ఆవిడకు ఖాళీ వున్నప్పుడల్లా కొంచెం కొంచెం నేర్పుతోంది. ‘ఏం ఫరవాలేదు. మూడునెలల పరీక్షలప్పటికి పాసయిపోయేట్లుగా వచ్చేస్తుందిలే’ అని ధైర్యం చెప్పింది కూడా.

ఇంతలోనే ఈ ఇన్‌స్పెక్షన్. అయితే ఒకటి – ఏదయినా, రెండు మూడు సార్లు చదివితే కంఠతా వచ్చేస్తుంది వరాలుకి. అలాగే హిందీలో పద్యాలు, ప్రశ్నలకి జవాబులూ అన్నీ కంఠతా పట్టేసింది. రాయడమే రాలేదు ఇంకా. కానీ పరీక్షలయితే రాయాలికాని ఇన్‌స్పెక్షన్‌కి నోటికి వస్తే చాలు కదా! లెక్కలు తప్ప ఇంకేవీ రాయమని అడగరు. నోటితోనే చెప్పిస్తారు. లెక్కలొకటీ బోర్డు మీద చేయమంటారు. అట్టలు వేసిన పుస్తకాలన్నీ సంచిలో సర్దేసుకుని ఆటలాడుకోటానికి వెళ్ళిపోయింది వరాలు. ఇన్‌స్పెక్టర్లు వచ్చేరు వెళ్ళేరు. వరాలుకి అంతా తమాషాగా వుంది. ప్రేయర్ అయి క్లాస్‌కి వెళ్ళగానే ఇంగ్లీషు టీచర్ – ఆవిడే వరాలు క్లాస్ టీచర్ – వచ్చి బాగా చదివే తెలివైన పిల్లలందరినీ క్లాసులో అక్కడ అక్కడ కూర్చోపెట్టింది. మామూలుగా అయితే మొదటి వరసలోనివారు బాగా చదువుతారు. ఫస్టు, సెకండు – అలా వస్తున్న వాళ్ళు కూర్చుంటారు. ఇప్పుడేమో ఆఖరి బెంచీలో కూడా కూర్చో బెట్టింది టీచర్. ఎందుకంటేనట – జయలక్ష్మి చెప్పింది – ఇన్‌స్పెక్టరు అక్కడా, అక్కడా పిల్లల్ని లేపి ప్రశ్నలడిగితే వాళ్ళు జవాబులు బాగా చెప్తే ‘టీచర్ బాగా చెప్తోంది క్లాసులో’ అని టీచర్ని మెచ్చుకుని మంచి రిపోర్ట్ రాస్తాడట. తమ ప్రోగ్రస్ రిపోర్టుల్లాగే టీచర్లకి రిపోర్టులుంటాయన్నమాట. జయలక్ష్మి చెప్పినట్టే జరిగింది. అంతా తమాషాగా, ఆశ్చర్యంగా అనిపించింది వరాలుకి.

***

‘కాంపోజిట్ మేథ్సు’ తీసుకోవడమా లేక ‘జనరల్ మేథ్సు’ – ఏదీ తెగడంలేదు వరాలుకి. గంటనుంచీ ఆలోచిస్తోంది. సర్లే బడికి టైమైపోతోందని బడికి బయల్దేరింది. కాంపోజిట్ అయితే గొప్ప తెలివైన వాళ్ళందరూ అదే తీసుకుంటారుట. తెలివి తక్కువ వాళ్ళు, మొద్దులు జనరల్ మేథ్స్‌కి వెళ్తారుట – జయలక్ష్మి చెప్పింది. “నీకేం! నీవు ఇంటెలిజెంటువు కదా! నీకెప్పుడూ ఫస్టు, సెకండు మార్కులొస్తాయికదా. కాంపోజిట్ హయిగా తీసుకోవచ్చు” అని కూడా అంది. కాని కాంపోజిట్, జనరల్ కన్నా కష్టం. దానికి టీచర్ కూడా లేరు. అంటే కాంపోజిట్ మేథ్స్‌కి టీచరు లేరు. పాత టీచర్ రిటైరై పోతే, కొత్త టీచర్‌ని వేయలేదు ఇంకా. ‘గవర్నమెంటు స్కూల్ కదా. ఇప్పట్లో ఎవర్ని వేస్తారులే’ అన్నారు నాన్న కూడా. ఆలోచనల్లోనే స్కూల్ వచ్చేసింది. పరిగెట్టుకుంటూ వరాలు దగ్గరికి వచ్చేరు జయలక్ష్మి, జానకి, మంజుల, కస్తూరి.

“మేమందరం కాంపోజిట్ తీసుకుంటున్నాం. నువ్వూ అదే తీసుకోవాలి మరి.”

తన ప్రమేయం లేకుండా వాళ్లే నిర్ణయించేసేరు. వాళ్ళు నలుగురూ వరాలుకి మంచి స్నేహితులు. కలిసే తిరుగుతుంటారు ఎప్పుడూ. తీసేసుకుంది కాని పోను పోనూ ఎందుకు తీసుకున్నామురా భగవంతుడా అనిపించసాగింది వరాలుకి. అర్థమెటిక్, జామెట్రీ ఫరవాలేదుకాని ఆల్‌జిబ్రా నిజంగానే ఎంతో గాభరాగా వుండేది. థీరమ్స్ ఒక పట్టాన అర్థమయేవి కావు. ‘ఈ సంవత్సరం పబ్లిక్ పరీక్ష కూడాను. ఎలాగురా’ అనుకునేది. భాస్కరన్న భరోసా ఇచ్చేడప్పుడు – ‘నేను రోజూ అరగంట చెప్తాను లేవే’ అని.

భాస్కరన్నయ్య అప్పుడే ఇంజనీరింగ్ చదువుతున్నాడు. భలే తెలివైనవాడు. స్కూల్లో పియూసిలో అంతా కూడా వాడికి లెక్కల్లో నూటికి నూరే ఎప్పుడూను. సరే, పుస్తకాలు పట్టుకుని భాస్కరన్నయ్య దగ్గరకెళ్ళింది. “ఎంతవరకొచ్చు నీకు?” అడిగేడు. ఏంటొచ్చు తనకి! ‘ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ యీజ్ ఈక్వల్ టూ ఏస్క్వేర్ ప్లస్ బిస్క్కేర్ ప్లస్ టూ ఏబి’ దాటలేదు తన నాలెడ్జి. “ఏంటీ ఆ పరధ్యానం? చెప్తోంది బుర్రలోకెక్కుతోందా?” తలమీద మెల్లిగా మొట్టేడు భాస్కరన్నయ్య. అంతే చివ్వున రోషం ముంచుకొచ్చింది వరాలుకి. ‘నీవేం నాకు లెక్కలు చెప్పఖ్ఖర్లేదు పో’ అంటూ లేచి రివ్వున పారిపోయింది.

***

‘ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్

ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సమథింగ్ ఈజ్ లాస్ట్

ఇఫ్ కేరక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రితింగ్ ఈజ్ లాస్ట్..’

కంఠతా పడ్తోంది వరాలు స్కూల్లో. ఇంగ్లీషు ఎలక్యూషన్ కాంపిటీషన్. ‘సొసైటీ – స్టూడెంట్స్ రెస్పాన్సిబిలిటీ’ అనే టాపిక్‌పై మాట్లాడాలి. నాన్న దగ్గిర కూచుని మంచి వ్యాసం రాయించుకుంది. ఇంతవరకు అన్నీ తెలుగులోనే పొటీల్లో పాల్గొంది. ఇదే మొదటిసారి ఇంగ్లీషులో పాల్గొనడం. రాయడమైతే ఫరవాలేదు. కంఠతా పట్టి, పరీక్షల్లో దించినట్లు రాసేయొచ్చు. అందరి ముందు మాట్లాడాలంటే కొంచెం భయంగానే వుంది వరాలుకి. తెలుగులో అయితే మాట్లాడ్డం ఎంతో సులువు. పాయింట్లు రాసుకుంటే చాలు. మన భాషే కదా చక్కగా మాట్లాడేస్తుంది వరాలు. ఇంగ్లీషు మొత్తం కంఠతా పెట్టాలి. తీరా స్టేజి ఎక్కాక, ఎలా అవుతుందో ఏమో! వరాలు గాభరాకు తగ్గట్లు అలాగే అయింది. పి. వరలక్ష్మి అని పేరు పిలవగానే, ఒళ్ళంతా చెమటలు. అడుగు ముందుకి పడలేదు. ఎలాగో స్టేజి ఎక్కింది. ఎందుకలా అందరూ తన్నే చూస్తున్నారు? అరిచేతులు, కాళ్ళు వణకుతున్నాయి. గొంతు తడారిపోయింది వరాలుకు. ఎలాగో గొంతు పెగుల్చుకుని మొదలు పెట్టింది.

“రెస్పెక్టడ్ మేడమ్ టీచర్స్ అండ్ డియర్ ఫ్రెండ్స్” అంటూ, ‘ఇఫ్ కేరక్టర్ యీజ్ లాస్ట్ ఎవ్వరితింగ్ యీజ్ లాస్ట్’ వరకు బాగానే సాగింది. అక్కడే బుర్రలో ఏదో అడ్డుపడింది. ఎవరో హాచ్ అని తుమ్మేరు – అంతే! బ్రేక్ పడిపోయింది. ఎంతకూ తర్వాతి వాక్యం గుర్తుకు రావడంలేదు. మొదటి నుంచీ మనసులో మళ్ళీ అనుకున్నా రావడం లేదు. “సారీ. నేను చివర్లో మళ్ళీ మాట్లాడుతాను” అని చెప్పి తలవొంచుకుని స్టేజి దిగింది వరాలు. ఎందరు ఎలా నవ్వుతున్నారో చూడాలన్పించాక, చూడ్డానికి సిగ్గేసి తలెత్తలేదు వరాలు. చివర్లో మళ్ళీ మాట్లాడ్డానికి అవకాశం ఇచ్చేరు. దడదడ అప్పచెప్పేసింది కాని ప్రైజు రాలేదు.

***

“వద్దే తల్లీ! నా మాట వినవే వరాలూ! రేపే మూడోస్నానం ఆటలమ్మ పోసి. రేపే పోటీకి వెళ్తానంటే ఎలాగే? గాలీ, ధూళీ సోకితే మళ్ళీ తిరగబెటడ్తుందే అమ్మా!” అమ్మ బతిమాలుతోంది.

వరాలుకి దిగులుగా, నిరాశగావుంది. రెండు నెలల క్రిందనుంచీ ప్రాక్టీసు చేసింది, ఈ డ్యాన్స్ పోటీలో ప్రైజ్ తెచ్చుకోవాలని. ‘హిందీ ప్రచార సభ’ వాళ్ళు అన్నిచోట్లా, ఆల్ ఇండియా లెవల్లో రకరకాల పోటీలు పెడ్తున్నారు. అందులో ‘సోలో డ్యాన్స్’ పోటీకి స్కూల్ తరఫున తనని సెలక్టు చేసేరు. స్కూల్లో యానివర్సరీ అయినా, ఇండిపెండెన్స్ డే అయినా, రిపబ్లిక్ డే అయినా దేనికైనా డ్యాన్స్ అంటే టీచర్స్‌కి వరాలే గుర్తుకువస్తుంది. అంత బాగా డ్యాన్స్ చేసేది వరాలు. రోజూ స్కూల్ అయిపోయాక గంట ప్రాక్టీసు. హిందీ పాట “అధాహై చంద్రమా, రాత్ ఆధీ..” అని రికార్డు పెట్టటమేమిటి, దానికనుగుణంగా సినిమాలోలాగే నెత్తిమీద కుండలుపెట్టుకుని కొన్ని స్టెప్పులు కూడా ప్రాక్టీస్ చేసింది. స్కూల్లో టీచర్స్, హెడ్ మిస్ట్రెస్ అందరూ కూడా చాలా బాగా చేస్తోందని మెచ్చుకున్నారు. తప్పకుండా ప్రైజు కొట్టుకు రాగలనని నమ్మకం కూడా వచ్చేసింది వరాలుకి. ఇంతలో ఈ అవాంతరం – పదిరోజుల క్రింతం ‘ఆటలమ్మ’పోసింది. పెద్దగా ఏం లేదు. అయినా అమ్మ స్కూల్‌కి పంపలేదు. పోన్లే బాగా ప్రాక్టీస్ చేసింది కదా నేరుగా పోటీకి వెళ్ళిపోవచ్చనుకుంది వరాలు. మూడో స్నానం రోజే పోటీకి వెళ్ళకూడదని అమ్మ, వెళ్ళాలని వరాలు.

నాన్న దేవుడిలా రక్షించారు. “మూడోస్నానం, రెండోస్నానం అనే చాదస్తాలకి పోకు. దానికి పూర్తికి తగ్గిపోయింది కదా! వెళ్ళనీ దాన్ని” అని ఆర్డరు వేసేరు. ఒప్పుకుంది అమ్మ చేసేది లేక. కాని కండిషన్లు పెట్టింది. పద్మక్కని తోడుగా తీసికెళ్ళాలట. అక్కడే పార్టీలాంటివి వుంటే ఏం తినకూడదట. నీళ్ళుకూడా తాగకూడదట. ఇంటినుంచి కాచిన నీళ్ళు పట్టుకెళ్ళమంది. అన్నిటికీ వప్పేసుకుంది వరాలు. ‘తన్ని పంపిస్తున్నది అదే పదివేలు’ అనే సంతోషంతో వుబ్బి తబ్బిబ్బైపోతోంది వరాలు. కొద్దిగా నీరసంగానే వున్నా అదేమీ తెలీడం లేదు వరాలుకి. వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లుగా వుంది. పార్టీలో మాత్రం పద్మక్క వేయికళ్ళతో కాపలాగా వుంది. ఏం తిననివ్వలేదు. తను మాత్రం శుభ్రంగా అన్నీ తింది. గులాబ్ జామ్, ఐస్క్రీమ్ అన్నీను. అప్పడు మాత్రం వరాలుకి నోరూరిపోయింది. ఏం తినొద్దన్న అమ్మమీద కన్నా, శుభ్రంగా తిన్న పద్మక్క మీద కొంచెం కోపంకూడా వచ్చింది. స్టేజి ఎక్కే వరకూ ఆ ఉడుకుమోత్తనం మనసులో అలాగే వుంది. స్టేజి ఎక్కగానే అన్నీ మరిచిపోయింది. నీరసం, ఉడుకుమోత్తనం, కోపం ఏదీలేదు. హాయిగా డ్యాన్స్ చేసేసింది. అందరూ చప్పట్లు కొట్టేరు. ఫస్టు ప్రయిజ్ కూడా వచ్చింది. తన మెడలో వేసిన వెండి మెడల్ అమ్మకు చూపిస్తే నవ్వుతూ, “పద పద. దిష్టి తీయాలి” అని అమ్మ అంటుంటే ఎంతో ఆనందంగా అనిపించింది వరాలుకి.

ఆవేళ నుంచే పబ్లిక్ పరీక్షలు – ఎస్.ఎస్.ఎల్.సి. పరీక్షలు. వరాలు పొద్దున్నే లేచి స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని పరీక్షకు వెళ్ళడానికి తయారయింది. ముందురోజే, కింద వత్తుకి పెట్టుకునే పేడ్, రెండు పెన్నులు, పెన్సిలు, రబ్బరు, బ్లేడు, స్కేలు, హాల్ టికెట్టు అన్నీ బేగులో సర్ది వుంచుకుంది. మొదటి పరీక్ష ఇంగ్లీషు. చాలామందికి ఇంగ్లీషు అంటే భయం. వరాలుకి భయమే లేదు. అన్నీ వచ్చు. ఎస్సేలు, పోయమ్స్, వాటి సమ్మరీలు, స్పెల్లింగ్స్ – అన్నీ కంఠతా వచ్చు. నిద్రలో లేపి అడిగినా గడగడా చెప్పేస్తుంది, బరబరా రాసేస్తుంది – అంత బాగా వచ్చు. గ్రామర్ కూడా ఫరవాలేదు బాగానే వచ్చు. హెడ్ మిస్ట్రెస్ గ్రామర్ గురించి స్కూల్ అయిపోయక స్పెషల్ క్లాసులు తీసుకుని అందరికీ గ్రామర్‌లో మంచి ట్రైనింగ్ ఇచ్చింది.

పదిన్నర గంటలకి పరీక్ష. పదిగంటలకల్లా అక్కడ వుండాలి. నాన్నేమో మళ్ళీ రాహుకాలం, వర్జ్యం వచ్చేస్తాయని ఎనిమిదిన్నరకే బయల్దేరి వెళ్ళిపోమన్నారు. పరీక్ష సెంటరు మునిసిపల్ బోయ్స్ హై స్కూల్. తమ స్కూల్ అంత దగ్గిర కాకపోయినా దూరమేమీకాదు. పదినిమిషాల్లో నడిచి వెళ్ళిపోవచ్చు. శీను స్కూల్ వరకు వచ్చాడు కాని తన్ని దిగబెట్టి, “బాగా రాయవే” అని చెప్పి వెళ్ళిపోయేడు.

ఇంకా ఎవరూ రాలేదు. చాలా పెద్ద ఆవరణ అది. అక్కడక్కడా అయిదారు బిల్డింగులు – మధ్యలో పెద్ద పెద్ద చెట్లు. వాటిక్రింద రాలిన ఆకులు. బిల్డింగులన్నీ పాతవే. వెళ్ళి ఒక చెట్టు క్రింద కూర్చుంది వరాలు. ఏఏ నెంబర్లు ఏ రూముల్లోవో తెలిపే బోర్డు కూడా ఇంకా పెట్టలేదు. అసలెవరూ ఇంకా రాలేదు. ఎక్కడో ఆఫీసు రూములో మాత్రం కొంచెం మనుషులున్న అలికిడి. వరాలుకు భయంగాలేదు కాని విసుగ్గా వుంది. ఇంకా ఎంతసేపు ఇలా కూర్చోవాలో! తొమ్మిదిన్నర తర్వాత వచ్చుంటే బాగుండేది. ఏదైనా కథల పుస్తకం తెచ్చుకునుంటే అయినా సరిపోయేది. కాలక్షేపం అయ్యేది. మళ్ళీ వెంటనే ‘ఛా! తప్పు. ఇంకో రెండు గంటల్లో పబ్లిక్ పరీక్ష. క్లాసు పుస్తకాలుకాక కథల పుస్తకాలు చదవడమేంటి’ అనుకుంది. కాని, క్లాసు పుస్తకాల్లో చదివేందుకు ఇంకేముంది? అన్నీ చదివేసింది కదా!

మెల్లిగా, తొమ్మదిన్నర నుంచీ పిల్లలు రావడం మొదలైంది. వచ్చిన వాళ్ళందరూ వెంటనే పుస్తకాలు తెరిచి హడావిడిగా చదివేసుకుంటున్నారు. పక్కవాళ్ళని బిట్లు అడిగేస్తున్నారు. ‘ఏ రూములో నీ నెంబరు?’ అని పలకరించుకుంటున్నారు. వాతావరణమంతా సందడిగా వున్నా, టెన్షన్ గా కూడ వుంది. వరాలు ‘ఎప్పుడు బెల్ కొడ్తారా’ అని ఎదురుచూస్తోంది. బెల్ మ్రోగగానే హమ్మయ్య అని లేచి పరీక్ష హాల్లోకి నడిచింది వరాలు.

***

“గోవిందా, గోవిందా” అంటూ గోవింద నామస్మరణ చేస్తూ అలిపిరి నుంచి మెట్లక్కడం మొదలుపెట్టేరు. వరాలు కూడా వాళ్ళతో గొంతు కూడా కదిపింది. అదే మొదటి సారి వరాలు నడిచి కొండనెక్కడం. అందరికీ వేసవి సెలవులు. పరీక్షలయిపోయేయి. పరీక్షల్లో పాసవాలని మొక్కుకోడానికి, సరదాగానూ వుంటుందని కొండ ట్రిప్పు ప్లాన్ చేసేరు – పద్మ, కిట్టూ, శీనూ, వాళ్ళ స్నేహితులందరూ కలసి. పుణ్యం, పురుషార్థం కూడానన్నమాట. నడిచే కొండనెక్కుదామని అనుకున్నారు. ఎండెక్కకుండా కొండపైకి చేరిపోవాలంటే తెల్లవారు ఝామునే లేచి బయల్దేరాలని నిర్ణయించుకున్నారు. తెల్లవారు ఝామున లేవడం కష్టమే వరాలుకి. కాని నడిచి కొండ ఎక్కడం అనే థ్రిల్ ఆ కష్టాన్ని ఎదుర్కోనేలా చేసింది. అసలందరూ వరాలుని ‘నీవు నడవలేవు’ అని తప్పించేయాలని చూసేరు. ‘నేనేం చిన్నపిల్లని కాను నడవగలను. వచ్చే సంవత్సరమే కాలేజీలో కూడా చేరతాను’ అని పట్టు పట్టింది. పోనీ బస్సులో రమ్మని బతిమాలేరు. ఊహూ.. ససేమిరా వినలేదు వరాలు. తినడానికి అమ్మ పూరీలు, కూర, పులిహోర, దద్ధోజనం ఇచ్చింది. పద్మ ఫ్రెండు రమణి వాళ్ళింట్లో ఇడ్లీలు, దోసెలు అమ్ముతారు. తను అవీ తెచ్చింది. కాస్సేపు కాస్సేపు ఒక్కొక్కళ్ళు వాటిని మోయాలని ఒప్పందం చేసుకున్నారు.

అందరూ కలసి ఎక్కడం మొదలుపెట్టేరు. “గాలిగోపురం వరకే మెట్లు. అంతవరకే కొంచెం కష్టం. ఆ తర్వాత మామూలు నడకేను” ధైర్యం చెప్పేడు శీను. వరాలు హుషారుగా, గబగబ ఎక్కుతోంది. “అలాకాదు. మెట్లక్కాలంటే ఎప్పుడైనా క్రాస్‌గా ఎక్కాలి. అప్పుడే నెప్పులు తెలీవు” పెద్దరికంగా సలహా ఇచ్చేడు కిట్టూ.

ఈపక్కా, ఆపక్కా కొండలు.. బండలు.. వాటినల్లుకున్న తీగలు, పొదలు, మొక్కలు. చెట్లు – వాటిమీద రంగు రంగుల పువ్వులు. అక్కడక్కడా ఎక్కడినుంచో వస్తున్న కొండ నీళ్ళు బండలమీదుగా జారుతూ, తుప్పరలు నడిచే వాళ్ళమీద జల్లుతూ, చల్లగాలి కూడా చెమట పట్టిన ఒంటిని తడుముతుంటే ఎంతో హాయిగా వుంది. కళ్ళకి అందంగా, మనసుకి ఎంతో ఆహ్లాదంగా వుంది. హుషారుగా ఎక్కుతున్న వరాలుకి మెల్ల మెల్లగా అలసట తెలియసాగింది. స్పీడు తగ్గిపోయింది. ఆయాసంగా వుంది. గెంతుతూ ఎక్కడ మటుంచి మోకాళ్ళు పట్టుకుని నెమ్మదిగా ఎక్కడం మొదలయ్యింది. మొదట పాతిక ముప్పై మెట్లయినా గబగబా ఎక్కేసిన వరాలు, ఇప్పుడు మూడు నాలుగు మెట్లకే ఆగి అలుపు తీర్చుకుంటోంది. పోను పోను, మెట్లు మరీ నిలువుగా, ఎత్తుగా వుంటున్నాయి. తలెత్తి చూస్తే ఇంకా అల్లంత ఎత్తున వుంది గాలిగోపురం. ‘అమ్మో! ఇంకా అంత ఎత్తు ఎక్కాలి’ అన్పించింది.

‘అరగంటలో ఎక్కేయవచ్చు. నేను పోయిన సారైతే ఇరవై నిమిషాల్లోనే గాలి గోపురం చేరుకునేసాను’ – బయల్దేరినప్పుడు, ఒకళ్ళని మించి ఒకళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలే అని అప్పుడు అర్థమయింది వరాలుకి. మిగిలిన వాళ్ళు నెమ్మదించారు. కాని వరాలు అంత ఇబ్బంది పడటం లేదు. ముందుగా వెళ్ళిపోయిన వాళ్ళు వరాలు గురించి అక్కడక్కడా ఆగడంతో వాళ్ళకి కాస్త విశ్రాంతి కూడా దొరుకుతోంది. ఆఖరికి గోవిందుడు కరుణించేడు. ఆఖరి మెట్టు ఎక్కి గోపురంలోకి వెళ్తూ, ‘అమ్మయ్య’ అని ఆగి గుండెల నిండా గాలిపీల్చుకుంది వరాలు.

గాలిగోపురంలోకి చేరగానే ఫౌంటెన్ లోంచి చిమ్మినట్లుగా జివ్వున వీస్తోంది గాలి. అలసట అంతా ఎగిరిపోయి హాయిగా వుంది వరాలుకి. కూర్చోబోతూ చూసింది – దేవస్థానం వాళ్ళు పెట్టిన కొళాయి. మరిన్ని ప్రాణాలు లేచివచ్చాయి వరాలుకి. చివ్వున లేచి వెళ్ళి కొళాయి తిప్పి, దోసిలి పట్టి గబగబ నీళ్ళు తాగింది. కడుపునిండా తాగింది. కొండనీరు తియ్యగా, చల్లగా ఎంతో రుచిగా వుంది.

“ఆగు వరాలూ, అప్పుడే నీళ్ళు తాగకు. కాస్సేపాగు!” అనే శీను మాటలేవీ వినిపించలేదు వరాలుకు. రిలాక్సింగా గోపురంలోపల అరుగు మీద కూర్చుంది. అయిదు నిమిషాలే! అంతలో మొదలైంది కడుపులో తిప్పు, వికారం, తెలీని గాభరా. ఏంటో అర్ధమయేలోపునే అయిపోయింది వాంతి. ‘బొళుక్ బొళుక్’ మని తాగిన నీరంతా వచ్చేసింది. వంట్లో సత్తువంతా తీసేసినట్లయింది. అందరూ పరుగెత్తుకొచ్చేరు.

“నే చెప్తుంటే విన్పించుకోలేదు. వెంటనే నీళ్లు తాగకూడదు. ఖాళీ కడుపు, పైగా అలసట. అందుకే అలా అయింది”. శీను మాటలకి ఇంకా గందరగోళ పడిపోయింది వరాలు.

“ఊరుకో శీనూ, దాన్ని గాభరాపెట్టకు. ఏం కాదు. కాస్సేపటికి సర్దుకుంటుంది. ఇంద ఈ పుల్ల పిప్పరమెంటు బుగ్గలో పెట్టుకుని చప్పరించు” ఇస్తూ ధైర్యం చెప్పింది అందరిలోకి పెద్దయిన రమణి. కొంతసేపటికి తేరుకుంది వరాలు. ‘పదండి నడుద్దా’మంటూ లేచింది. “ఫరవాలేదా కాస్సేపాగుదామా?” అడిగేరు అందరూ.

“ఏం ఫరవాలేదు పిల్లలూ.. ఆ దేవుడే నడిపించేస్తాడు” అంతసేపూ, అంతా చూస్తూ చుట్టూ మూగిన తక్కిన బాటసారులు ధైర్యం చెప్పేరు. మనసులోనే దేవుడికి దండం పెట్టుకుని తేలిగ్గా అడుగులు వేస్తూ నడక మొదలెట్టింది వరాలు. పక్కనే శీనూ, కిట్టూ, పద్దూ ఇంకా స్నేహితులు అందరూనూ.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here