వరాలు-3

0
11

[శ్రీమతి మల్లాప్రగడ బాలాత్రిపుర సుందరి రచించిన ‘వరాలు’ అనే పెద్ద కథని పాఠకులకు అందిస్తున్నాము. ఇది మూడవ, చివరి భాగం. మొదటి భాగం ఇక్కడ. రెండవ భాగం ఇక్కడ. ]

[dropcap]“ఇం[/dropcap]కా ఈ శీనూ రాడేం? సినిమాకి వెళ్దామని చెప్పేడు. టైమవుతోంది. ఇంకా ఊడిపడడు. తనేమో రెడీ అయికూర్చుంది.” వాచ్ చూసుకుంది వరాలు. చిన్న గుండ్రటి డయల్, నల్లటి స్ట్రాప్ – తన తెల్లని చేతిపై ముద్దుగా, అందంగా వుంది. కమలక్క ప్రెజెంట్ చేసింది ఆ వాచ్ తను ఎస్.ఎస్.ఎల్.సి. పాస్ అయినప్పుడు.

తన ఎస్.ఎస్.ఎల్.సి. రిజల్ట్స్ వచ్చిన రోజు తనకి బాగా గుర్తుంది. అప్పడు తను కమలక్క దగ్గిరవుంది. కమలక్క పని చేస్తున్న ఆ వూరు పల్లె కాదుకాని – పట్నమూ కాదు. పేపరు తెమ్మని ప్యూన్‌కి చెప్పింది కమలక్క. వెళ్ళి, అరగంట తర్వాత వుట్టి చేతులతో వచ్చేడు పేపరు దొరకలేదంటూ. అవును దేశమంతా విషాదంలో మునిగిపోయిన సమయమది. ఆ ముందురోజే అందరి గుండెల్లో ఆశలదీపంలా వెలిగిన ప్రియతమ నాయకుడు ప్రధానమంత్రి గుండెపోటుతో మరణించారు. ఆయనకు అందరూ అర్పించే నివాళులు, శ్రద్ధాంజలులు, అంతిమయాత్ర గురించిన విశేషాలు – ఇంకా అన్నీ తెలుసుకోవాలంటే, సామాన్య ప్రజలకి పేపరొక్కటే మార్గం. రేడియో అంటే అది డబ్బున్న వాళ్ళ లగ్జరీ కదా! తెలిసినవాళ్ళ ఇళ్ళల్లో ఎక్కడైనా ప్రయత్నించమని మళ్ళీ ప్యూన్‌ని తరిమింది అక్క.

ఎలాగైతేనేం రెండు గంటల తర్వాత విజయవంతంగా పేపరుతో తిరిగొచ్చేడు. ఈలోగా కమలక్క ఆత్రుత చూస్తుంటే తనకి వింతగా వుంది. పరీక్ష రాసింది తను కదా! అక్క కెందుకింత గాభరా రిజల్ట్స్ గురించి అని. పైగా ‘నేనింత గాభరా పడుతుంటే, నీవంత నిమ్మళంగా వున్నావేంటి?’ అని తనని అడుగుతుంది. ఏం చెప్పాలో తెలీలేదు తనకి. ‘బాగా రాసేను కదక్కా తప్పకుండా పాసవుతాను కదా’ అని మాత్రం అంది.

పేపరు తీసుకుని తన దగ్గిరున్న లిస్టు తెచ్చుకుని, మొదటి నంబరు నుంచి చూస్తోంటే మళ్ళీ తిట్లు – ‘నీ నంబరు మొదట చూసుకోక, అందరివీ చూస్తావేంటి మొదట’ అని. తనపట్లే కాదు, అందరు చెల్లెళ్ళు, తమ్ముళ్ళపట్ల తనకి అన్ని విషయాల్లోనీ అంతే టెన్షను, యాంగ్జయిటీను. తనే పేపరు లాక్కుని చూసి ‘పాసయ్యావే వరాలూ’ అంది. అప్పుడు కమలక్క ముఖంలో సంతోషం చూస్తుంటే తను పాసయ్యాననే సంతోషంకన్నా ఎక్కువ ఆనందంగా, సంబరంగా అనిపించింది తనకి. అప్పడు ఇచ్చింది ఈ వాచీ. ఆ తర్వాత మార్కులొచ్చేక చూసుకుంటే – తను స్కూల్ సెకండు వచ్చింది. తన ఫ్రెండ్ జయలక్ష్మి ఫస్టు వచ్చింది..

ఆలోచనలకి బ్రేక్ పడింది.

“ఏయ్ వరాలూ రెడీయేనా. పదపద ఆలస్యమయిపోయింది సినిమాకు” అంటూ వచ్చిన శీనూ మాటలకు, “ఎక్కడికెళ్ళిపోయావు? నేను నీ గురించి ఎంతసేపటి నుంచో చూస్తున్నాను” అంది.

ఇంతలో లోపల్నించి అమ్మ అరుపులు. “ఇదుగో, ఇంకో అరగంటలో గ్రహణం విడుస్తుంది. స్నానంచేసి, నే చేసే వుప్మా తినేసి వెళ్ళండి” అంటూ.

‘అబ్బా, ఈ ఆలస్యమొకటా! మళ్ళీ అయిదన్నరకి విడుస్తుంది గ్రహణం. ఆ తర్వాత మొదట అమ్మ స్నానం. ఎందుకంటే స్నానం చేసి, టిఫిన్ తయారు చేయాలి కదా అందుకని. ఆ తర్వాత తమిద్దరి స్నానాలు, తయారవడాలు. అప్పుడు వెళ్ళడం. ఈలోగా సినిమా మొదలు పెట్టేస్తారేమో? తనకేమో న్యూస్ రీల్ దగ్గర్నించీ చూడాలనుంటుంది.’ ఉస్సురుమంది వరాలు.

‘అమ్మనైనా ఒప్పించేయవచ్చు. కాని, నాన్న ఒప్పకోడే అస్సలు. ఎలాగా?’ ఆలోచిస్తూ అన్నాడు శీను.

“టైమ్ మార్చేస్తే పోలా” అన్నాడు వెంటనే. అనడమేంటి హాల్లోవున్న పెద్దగడియారం, చిన్న అలారం వాచీ రెండింటినీ అరగంట ముందుకు పెట్టేసాడు.

“అమ్మా, అయిదున్నరయి పోయింది. నేను, వరాలు స్నానాలు చేసేస్తున్నాం. టిఫిన్ అఖ్ఖర్లేదు. ఎక్కడైనా తింటాం” అని అమ్మకి చెప్పేడు.

“పద, ‘టామ్ సాయర్’ స్నానం కానిచ్చీయ్! పోదాం త్వరగా” అని తనని తొందరపెట్టేడు.

ఎలాగైతేనేం, ఇంటినించి బయటపడి హాలుదగ్గరికి చేరేసరికి ఇంకా సినిమా మొదలవలేదు. కాని, ఎంత జనమో! పెద్ద తిరణాలలా వుంది అక్కడ. మొదటిరోజు ఆరోజే మరి. కాని శీను ఎడ్వాన్స్‌గా టికెట్లు తెచ్చేసేడు కాబట్టి, జనం చూసి భయపడలేదు వరాలు. ఇద్దరూ వెళ్ళి తమ నెంబర్లు చూసుకుని సీట్లలో కూర్చున్నారు.

‘అమ్మయ్య ఇంకా మొదలవలేదు సినిమా ఇంకా ఎంత టైముందో మొదలవడానికి’ వాచ్ చూసుకుంది వరాలు. ‘డంగ్’ మంది గుండె. చేతికి వాచ్ లేదు. ఏమైంది? “ఒరే శీనూ! నా వాచీ లేదురా!” గాభరాగా అంది.

“ఏంటీ, అసలు పెట్టుకొచ్చేవా?” అడిగేడు శీను.

“పెట్టుకొచ్చేనురా. నాకు బాగా గుర్తుంది.”

“అయితే ఎక్కడన్నా పడిపోయిందేమో చూద్దాం పద.”

ముందు సీటు క్రింద వెతికేరు. లేదు. లేచి అలాగే చూసుకుంటూ అంటే – వెతుకుతూ నన్నమాట. బయటకొచ్చేరు. కొత్త వాచీ, ఇంకా కొత్త సరదా తీరనేలేదు. అసలు పెట్టుకోనేలేదు ఎక్కువసార్లు. పియుసిలో చేరేకా – రోజూ పెట్టుకో. ఈలోగా దాచుకో – అన్నారు నాన్న. తనే ఈవేళ సినిమాకొస్తోంది కదా అని పెట్టుకొచ్చింది.

వంగి వెతుకుతున్నాడు శీను. “ఏమయింది? ఏంటి పోయింది?” ఎవరో టికెట్టు దొరకని వాళ్ళు కాబోలు అడిగేరు.

“ఏంలేదు. వాచ్ పోయింది.”

“అరె సినిమా కూడా మొదలపోయినట్లుంది. ఇంకే దొరుకుతుంది? వెళ్ళండి, సినిమా అన్నా చూడండి” అన్నారు ఇంకెవరో.

ఏడుపొస్తోంది వరాలుకి. “ఏం ఫరవాలేదు. న్యూస్ రీల్ వేస్తారు కదా” ఇంకా వెదుకుతూ అన్నాడు శీనూ. “మొదటిరోజు, ఎక్కువ ఆటలు కదా! న్యూస్ రీల్ వుండదు. స్లైడ్స్ అయిపోగానే సినిమా మొదలెట్టేస్తారు. మొదలెట్టేసినట్లే వున్నారు” ఇంకెవరో అన్నారు. కాలక్షేపంగా మాట్లాడుతున్న వాళ్ళనందరినీ తరిమేయాల్నుంది వరాలుకి.

“చూడండి! మీరెలాగూ సినిమా చూడలేరు. మీ టికెట్లు వేస్టు కాకుండా మాకిచ్చేయండి. డబ్బులిచ్చేస్తాం.” వెనక వెనకే తిరుగుతూ నసపెడ్తున్న ఇద్దరు కాలేజి స్టూడెంట్సు. వాళ్ళ పీక పిసికేయాలన్పించింది వరాలుకి. శీను ఆలోచించేడు. “సరే తీసుకోండి.” వాళ్ళ చేతిలో రెండు టిక్కెట్లు పెట్టాడు. వాళ్ళు శీను చేతిలో డబ్బులు పడేసి పరిగెట్టారు, “పదరా, అప్పడే పదినిముషాలైపోయింది మెదలెట్టేసి” అంటూ. మరికాసేపు వెతికేడు శీను. జనం కూడా బాగా పలచబడ్డారు. వెతకడానికి వీలుగావుంది. ఆవరణ అంతా చూసేడు. ఎక్కడాలేదు.

“ఇదుగో అబ్బాయ్! ఇక్కడే కింద పడిపోయిందనుకున్నా, ఇంతవరకూ అక్కడే కూచుని వుంటుందా? ఆ వాచ్ ఎవడో తీసేసి వుంటాడు” చెప్పేడు ఒక పెద్దమనిషి, ఇంక వెతకడం వేస్ట్ అన్నట్లు. శీనూకి అలాగే అన్పించింది.

“ఇంక దొరకదు లేవే! పోయింది అంతే! పద, పోదాం” అన్నాడు. బెంగగా చూసింది వరాలు. మెల్లిగా శీనూతో నడుస్తోంది. నీరసంగా, నిస్త్రాణగా వుంది మనసు, శరీరం రెండునూ.

“ఆకలేస్తోంది కదా వరాలూ! నాకూ వేస్తోంది. ఇక్కడే భీమాస్‌లో టిఫిన్ తినేసి వెళ్దామేంటి?” సడెన్‌గా అన్నాడు శీను. నిజమే, గ్రహణం వల్ల పొద్దున్న చాలా త్వరగా భోజనాలు పెట్టేసింది అమ్మ. ఆ తర్వాత ఏం తినలేదు. సినిమా సంబంరంలో ఆకలే తెలీలేదు. కాని ఇప్పుడు బాగా ఆకలివేస్తోంది నిజమే కాని, వాచీ పోయిన బెంగలో ఏం తినాలని అన్పించడంలేదు వరాలుకి. పైగా ‘వాచీ పోయి తనేడుస్తుంటే, పార్టీ చేసుకుందాం అంటున్నాడు శీనూ’ అనే ఉక్రోషం కూడా వచ్చింది.

“కాదే తల్లీ! పోయిన వాచీ ఎలాగూ పోయింది. టికెట్లు డబ్బు కూడా వెనక్కొచ్చేసింది కదా. త్వరగా ఇంటికెళ్ళిపోతే ‘ఏం? అప్పుడే ఎలా వచీసేరు’ అని అడుగుతారు. ముఖ్యంగా నాన్న అడుగుతారు. వాచీ పోయిందని నాన్నకి చెప్తే తిడ్తారేమో. ఆకలేస్తోంది. టిఫిన్ తిని నెమ్మదిగా గడిపి సినిమా వదిలే వేళకు వెళ్దాం. అమ్మకి నెమ్మదిగా రేపు చెప్తాం. నాన్నకి అస్సలు చెప్పొద్దు.” అనునయించేడు శీను.

అవును నాన్నతో చెప్పాలంటే భయమే మరి! అసలు సినిమాకు వెళ్తాం అని చెప్పాలంటేనే భయం. ఈ రోజు గ్రహణం కూడా. ‘ఎందుకురా ఈ రోజు వెళ్ళడం’ అని కూడా అన్నారు మరి. మెల్లగా హోటల్లోకి కదిలారు శీనూ, వరాలు. కడుపునిండేక దిగులు కూడా తగ్గినట్లనిపించింది వరాలుకి. ‘వాచీ పోతే ప్రపంచమే మునిగిపోయినట్లు ఎందుకలా దిగులుపడింది’ అనుకుంది. వాచ్ పోయినట్లు అమ్మకి, పద్దూకి, కిట్టూకి తప్ప ఎవ్వరికి తెలీనీయొద్దు ప్రస్తుతానికి. ముఖ్యంగా నాన్నకి – అని ఇద్దరూ నిర్ణయం తీసుకున్నారు.

***

ఉషక్క వెనకాలే గేటులోంచి లోపలికి నడిచింది వరాలు. కళ్ళెత్తి చూస్తే, పెద్ద కోటలా వుంది కాలేజి బిల్డింగ్. ముందు పెద్ద పెద్ద లాన్సు. వాటిలో అక్కడక్కడా విరగపూసిన గులాబీ మొక్కలు. ఎర్రగులాబి, తెల్లగులాబి, పసుపు గులాబి – ఎన్ని రకాలో! చాలా చాలా బావుంది వరాలుకి. ‘ఈ కాలేజీలోనే తను చదవబోతోంది’ అనుకుంటే కించిత్ గర్వంగా కూడా అనిపించింది. లాన్లో అక్కడక్కడా కూర్చుని మాట్లాడుకుంటున్న అమ్మాయిలని చూస్తే ‘పోదురూ! నేనూ కొన్ని రోజులలో, ఇక్కడ ఇలాగే స్నేహితులతో కూర్చుని మాట్లాడుతుంటాను. మీ గొప్పేమిటి?’ అనాలన్పించింది.

ఆవేళ నుంచీ ‘పియుసి’లో జాయిన్ అవబోయే వాళ్ళకి ప్రిన్సిపాల్‌తో ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ అనేది ఒట్టి ఫార్మాలటీ అంతే. మార్కులని బట్టి సీట్లు ఇచ్చేస్తారు. ప్రిన్సిపాల్‌ని కలసి ఎస్.ఎస్.ఎల్.సి. సర్టిఫికెట్ ఇంకా మిగతా మెరిట్ సర్టిఫికెట్లన్నీ చూపించి, పీజు కట్టేయడం. ఆ రోజు అంతే.

“ఏంటలా ఆలోచిస్తూ నిలబడిపోయేవు? పద పద!” ఉషక్క మాటలతో ఈ లోకంలోకి వచ్చింది వరాలు. మెట్లెక్కి, చాలా పెద్ద పోర్టికోలాంటిది దాటి కాలేజీ లోపలికి వచ్చింది వరాలు. ఇదివరకు ఉషక్కతో కలిసి ‘కాలేజీ డే’ అని వచ్చింది కాని కాలేజీని ఇంత బాగా చూడలేదు. లోపల మూడు వింగ్స్‌గా విస్తరించి వుంది కాలేజి. నాలుగు ఫ్లోర్లు. గ్రౌండ్ ఫ్లోర్ లోనే ప్రిన్సిపాల్ రూము, ఆఫీసు, లైబ్రరీ వగైరా వగైరా అన్నీ వున్నాయి. రెండువైపులా కారిడార్ చివర పెద్ద పెద్ద క్లాస్ రూమ్స్. వాటికానుకుని లేబరేటరీస్. అక్కడ్నించి అంతే కనబడుతోంది వరాలుకి.

ప్రిన్సిపాల్ రూమ్ ముందు వేసిన బెంచీల్లో కూర్చున్నారు వరాలు, ఉషక్క. ప్యూన్ ఒక్కొక్కళ్ళ పేర్లూ పిలుస్తూ వుంటే వాళ్ళు లోపలికి వెళ్ళి పది నిమిషాల్లో వచ్చేస్తున్నారు. “వరలక్ష్మీ” పిలిచేడు ప్యూన్. సర్టిఫికేట్లు అన్నీ పట్టుకుని లోపలికి వెళ్ళింది వరాలు. ఉషక్క కూడా వెళ్ళింది.

“గుడ్ మార్నింగ్ మేడమ్!” విష్ చేసింది ఉషక్క. వరాలూ ఏదో గొణిగింది మెల్లగా. “గుడ్ మార్నింగ్” అంటూ నవ్వుతూ చూసింది ప్రిన్సిపాల్. చాలా సౌమ్యంగా, అందంగా, హుందాగా వుంది ప్రిన్సిపాల్. జరీ అంచు చీరె కట్టుకుని జుత్తు ముడివేసుకుని ఓ పక్కన గులాబి పువ్వు పెట్టుకుంది.

“ఏ ఉషా! నీ చెల్లెలా ఈ అమ్మాయి?” నవ్వుతూ అడిగింది. ఉషక్క డ్యాన్సులు చేయడం, పాటలు పాడ్డం, అన్ని కాలేజి ఫంక్షన్లలో పాలుపంచుకోవడంతో – స్టూడెంటే అయినా ప్రిన్సిపాల్‌తో చనువుంది మరి.

“అవును మేడం. బైపిసిలో, పియుసిలో చేరుతోంది.”

“ఏం, మేథ్స్ తీసుకోవచ్చుగా?” అప్పటికే తన ముందుంచిన సర్టిఫికెట్లు చూస్తూ అంది ప్రిన్సిపాల్. ప్రిన్సిపాల్ మేథ్స్ ఎమ్.ఎ. అట. ఆడపిల్లలు సాధారణంగా మేథ్స్ తీసుకోరని బాధపడిపోతుంటుందట. అంతకు ముందే ఉషక్క చెప్పింది.

“నాకు మేథ్స్ అంత బాగా రాదు మేడమ్” కొంచెం ధైర్యంగానే జవాబిచ్చింది వరాలు. ‘అసలు తనకి బైపిసి అయితే ఇష్టంలేదు. ఆర్ట్సు చదవాలనుకుంది. కాని భాస్కరన్నయ్యే పట్టు పట్టి బైపిసి తీసుకోమని అప్లై చేయించేడు. తను డాక్టర్ చదవాలట. తను ఛస్తే డాక్టరు అవదు’ – వరాలు ఆలోచనలకి బ్రేక్ పడింది, ఉషక్క చేయి పట్టి గుంజడంతో.

“ఓకే! ఫీజ్ కట్టి జాయిన్ అయిపో” సంతకం పెట్టి అప్లికేషన్ ఇచ్చేస్తూ అంది ప్రిన్సిపాల్. గాల్లో తేలిపోతూ ఇంటికొచ్చింది వరాలు.

***

బస్టాపులో నిలబడి కాలేజ్ బస్సుకోసం ఎదురు చూస్తోంది వరాలు. అసలే మొదటి రోజు. రాత్రయితే సరిగా నిద్రే పట్టలేదు. రేపు కాలేజీలో ఎలా వుంటుందా అనే హుషారు, గాభరా, ఉత్సుకత – అన్నీ కలగలిసిన ఆలోచనల్తో, ఎప్పుడూ నాన్న ఏడు గంటల వార్తలు రేడియోలో గట్టిగా పెడ్తే తిట్టుకుంటూ లేచే వరాలు, ఆ రోజు కొత్త కాలేజి హుషారులో ఆరుగంటలకే లేచిపోయి, తయారయి, అమ్మ మాటపై పక్కనే గుడికెళ్ళి దండం పెట్టుకుని వచ్చి ఒక ఖాళీ నోటుబుక్కు, పెన్ను, చిన్న పర్సు పట్టుకుని బస్టాపు కొచ్చేసింది త్వరగా. టిఫిన్ కూడా సరిగ్గా తినలేదు. “బాక్సు పట్టుకెళ్ళవే” అంటే “మొదటి రోజే కదమ్మా! బాక్సెందుకు?” అని వచ్చేసింది.

వరాలు త్వరగా వచ్చేసిందని బస్సు వచ్చేస్తుందా. యుగాలు గడిచాక వచ్చింది బస్సు. తనతోపాటు ఆ స్టాపులోనే ఇంకో నలుగురు ఎక్కేరు కాని వాళ్ళు కొంచెం పెద్దగా వున్నారు. ‘పి.యు.సి. అయివుండరు. ఏ బి.ఏ.నో బి.ఎస్సినో అయి వుంటారు’ – ఆలోచిస్తూ బస్సెక్కిన వరాలు కూర్చునే లోపునే బస్సు కదిలింది. తూలిపడబోయి పైన రాడ్ పట్టుకుని నిలదొక్కుకుంది. పక్కనే సీట్లో అమ్మాయి ‘కూర్చో’ అన్నట్లు చూసింది. ముందు కిటికీ సీట్లు ఖాళీ వున్నాయి. కిటికీ పక్కన కూర్చోవాలన్పించింది కాని, కదులుతున్న బస్సులో నడవలేక పక్కసీట్లోనే కూలబడింది వరాలు. కాస్త స్తిమితపడ్డాక చుట్టూ చూసింది. తన పక్కనే కిటికీవేపు కూర్చున్న అమ్మాయి వేపు ఓరగా చూసింది. తనకన్నా పెద్దగానే వుంది లంగా, ఓణీలో రెండుజడలు వేసుకుని. తనకి రెండుజడలే కాని ఆ అమ్మాయి పక్కన తను పిట్టలా సన్నగా, చిన్నగా వుంది.

“ఆర్య్యూ ఇన్ పియుసి?” అడిగిందా అమ్మాయి ఇంగ్లీషులో. చాలా స్టైల్గా వుంది ఉచ్చారణ అంతాను. బిత్తరపోయింది వరాలు. మెల్లిగా అవునన్నట్లు తలవూపింది.

“విచ్ గ్రూప్, విచ్ సెక్షన్?” ఇంగ్లీషులో మాట్లాడ్డం బాగా అలవాటులా వుంది ఆ అమ్మాయికి. తనకి ఇంగ్లీషులో మంచి మార్కులే వచ్చేయి కాని అదంతా బట్టీ మహత్మ్యం. ఇంగ్లీషులో చిన్న వాక్యం కూడా కూడదీసుకోకుండా మాట్లాడలేదు. అయినా బడాయి కాని, బస్సులో కూడా ఇంగ్లీషులోనే మాట్లాడాలా! ‘పియుసీ’కే పెద్ద ప్రొఫెసరయినట్లు ఫోజు. తెలుగులో చక్కగా మాట్లాడొచ్చుకదా. తన లోపాన్ని – ఇన్ ఫిరియారిటీని కప్పిపుచ్చుకునే ప్రయత్నం వరాలులో.

“బైపిసి, ‘ఎ’ సెక్షన్” పొడారిపోతున్న గొంతును పెగుల్చుకుని అంది వరాలు.

“ఓ! అయామ్ రమ. అయామ్ ఆల్సో ఇన్ ‘ఎ’ సెక్షన్ బైపిసీ. సో వియ్ ఆర్ ఫ్రెండ్స్ సీ” నవ్వుతూ అంది ఆ అమ్మాయి.         “మై నేమీజ్ వరాలు – వరలక్ష్మి.” ఎలాగో పదాలు కూడగట్టుకుని అంది వరాలు. క్లాసులో కూడా వరాలు పక్కనే కూర్చుంది రమ. స్కూల్లో స్నేహితులందరికి టీచర్ గా వ్యవహరించే వరాలు, రమ దగ్గర ఎందుకో ముడుచుకుపోతోంది. ‘ఛ ఇలా వుండకూడదు. ధైర్యంగా వుండాలి. ఇంగ్లీషులో మాటాలాడలేకపోవడం నేరం కాదు కదా! ఇకపైన తను ఇంగ్లీషు న్యూస్ పేపరు చదివి, తన ఇంగ్లీషు ఇంప్రూవ్ చేసుకోవాలి. అంతేగాని, ఇలా అయిపోకూడదు’. తనకి తానే చెప్పుకున్నాక రమ వైపు నవ్వుతూ చూడగలిగింది.

“ఏ స్కూల్లో చదివేవు నీవు?” తెలుగులోనే అడిగింది వరాలు.

“సారీ, ఐ కాంట్ అండర్‌స్టాండ్ తెలుగు. అయామ్ ఫ్రమ్ తమిళనాడు. మై మదర్ టంగ్ ఈజ్ తమిళ్” అంది రమ. అప్పుడర్థమయింది వరాలుకి తనెందుకు ఇంగ్లీషులో మాట్లాడిందో. పాపం! అనవసరంగా డాబు, దర్పం, ఫోజు అనుకుంది తను. అప్పడే వరాలు రమకి మనసా వాచా కర్మణా మంచి స్నేహితురాలయిపోయింది. రమకి తెలుగు నేర్పి రమ దగ్గిర తమిళ్ ఇంకా ఇంగ్లీషు మాట్లాడ్డం నేర్చుకోవాలి అని నిశ్చయించేసుకుంది ఆ క్షణంలోనే. అదే మాట వచ్చీరాని ఇంగ్లీషులో రమకి చెప్పింది. “ష్యూర్!” అంటూ నవ్వుతూ చేతిలో చేయి కలిపింది రమ.

***

బిక్కు బిక్కు మంటూ లేబ్ లోకి నడిచింది వరాలు. చాలా పెద్ద లాబ్ అది. ఆవేళ ఫిజిక్స్ ప్రాక్టికల్స్ మొదట క్లాసు. అంత వరకు స్కూల్లో ఒకటే లేబ్ – ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా బయాలజీ అయినా ఒకటే. రూమ్ కాస్త పెద్ద రూమ్ అంతే. ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ – వేటికి వాటికే వేరు వేరు లేబరేటరీలు. వాటిలో పెద్ద పెద్ద టేబుల్స్. వాటిపై ఫిజిక్స్ అయితే వాటికి సంబంధించినవి, కెమిస్ట్రీ అయితే బీకర్లు, వాచ్ గ్లాస్‌లు, బున్సన్ బర్నర్లు, జువాలజీ అయితే మైక్రోస్కోపులు, డిసెక్షనుకి కావల్సిన హంగులు, బోటనీలోనూ మైక్రోస్కోపులు, స్లైడ్సు అలా వున్నాయి.

ఆ రోజు ఫిజిక్స్ లేబ్ లోకి ఏదో మాయాగృహంలోకి వెళ్తున్నంత భయంగా వెళ్ళింది వరాలు. ఇక్కడ లెక్చరర్స్ టీచర్లలా కానేకాదు. టకటకమని వచ్చేసి ‘గుడ్ మార్నింగ్ గర్ల్స్’ అంటూ ఇంగ్లీషులో దడ్ దడ్ మని చెప్పేసి వెళ్ళిపోతుంటారు. ఒక్క ముక్క అర్థం అవటంలేదు వరాలుకి. ఆరోజు ఫిజిక్స్ లేబ్ లోనూ అదే అయింది. సింపిల్ బేలన్స్ ఫై ఏవో ప్రయోగం గురించి ఇంగ్లీషులో రెండు నిమిషాల్లో టకటకా చెప్పేసి ‘డూ ఇట్’ అని వెళ్ళిపోయింది లెక్చరర్. ఏం చేయాలో తోచట్లేదు వరాలుకి. ఎదురుగా నలుచదరపు అద్దాల కేసులో చిన్న త్రాసు ముందున్న చిన్న స్విచ్ క్రిందకు నొక్కితే ఆ బేలన్స్ పైకిలేస్తోంది. పైకి నొక్కితే క్రిందకు దిగుతోంది. అదొక్కటే కనిపెట్టగలిగింది వరాలు. స్కూల్లో ఇలా కాదు ప్రాక్టికల్స్ అంటే టీచర్ చేస్తున్నది చూసేయడం – సినిమా చూసినట్లుగా. తర్వాత టెక్స్టు బుక్ నుంచి రికార్డు నోట్సులోకి – ఎయిమ్, ప్రోసీజర్, రిజల్ట్ – అంటూ దించేయడం అంతే. ఇక్కడలా కాదు. మనమే చేసి రిజల్ట్స్ రికార్డు చేసి, కేలుక్యులేట్ చేసి లెక్చరర్‌కి చూపించాలి. ఏదో మాయా ప్రపంచంలోకి వచ్చి పడ్డట్లుంది వరాలుకి. భయంగా, దుఃఖంగా, బెంగగా ఎలాగో వుంది వరాలుకి.

“వై ఆర్యూ సిట్టింగ్ లైక్ దట్? హేవ్ యూ ఫినిష్డ్ యువర్ ప్రాక్టికల్? లెట్ మి సీ!” లెక్చరర్ వచ్చి వరాలు భుజంపైన చేయి వేసింది.

అసలే ఆవిడది భారీ ఆకారం, మాట ధాటి! ఆపై ఇంగ్లీషు. లోపల సుళ్ళు తిరుగుతున్న ఏడుపు కట్టలు తెంచుకుంది. కళ్ళలోంచి నీరుకారిపోతుంటే తుడుచుకోవడం కూడా లేకుండా, అలాగే నిలబడిపోయింది వరాలు.

“అరే! వై ఆర్యూ క్రయింగ్? నేనే మన్లేదే నిన్ను!” చెప్పింది. “అర్థం కాలేదా? ఫర్వాలేదు, వచ్చే వారం ప్రాక్టికల్ క్లాసులో చేద్దువుగానిలే! నేను మళ్ళీ చెప్తానుగా.”

ఎందరినో చూసిన అనుభవంలో వరాలు సమస్య అర్థం చేసుకున్న లెక్చరర్ అనునయంగా మాట్లాడింది. ‘అమ్మయ్య వీళ్ళూ తమ స్కూల్లో టీచర్లలాంటివాళ్ళే నన్నమాట. అనవసరంగా భయపడింది తను. ఛా! తనకేమవుతోంది. అక్కడా చదువే, ఇక్కడా చదువే. అక్కడ వాళ్ళు గురువులే. ఇక్కడా అంతే. తేడా అల్లా భాషలోనూ, బిల్డింగ్ లోనూ. అంతే! తను ఇంకెప్పుడు ఇలా డీలా పడిపోకూడదు.’ తనకి తనే ధైర్యం తెచ్చుకుంది వరాలు. మనస్సు నెమ్మదించింది. పొద్దుటినించీ రమతో కలసి కేంపస్ అంతా తిరుగుతూనే వుంది వరాలు. సరిగ్గా మూడు నెలలక్రితం ఇలాగే కేంపస్ అంతా కలయతిరిగింది. ఈ రోజు మనసులో ఆనందం పొంగిపొర్లుతోంది. ఏదో తెలీని హుషారు గుండెలోంచి వుబికి వుబికి వస్తోంది. అణువణువులో అందమైన హాయి తుళ్ళి తుళ్ళి పడుతోంది!

***

ఆ రోజు – మూడు నెలల క్రితం ఇదే కేంపస్. దిగులుగా, బెంగగా ప్రతి చెట్టునీ, రాయినీ, క్లాస్ రూములనీ, బెంచీలని తాకి తాకి పలకరించి ‘మరిక సెలవు’ అంటూ వీడ్కోలు తీసుకుంటూ, తిరిగింది. ఆ రోజే ఫేర్ వెల్. మర్నాటి నుంచి ప్రిపరేషన్ హాలీడేస్. ఆ తర్వాత పరీక్షలు. ఆ తర్వాత .. ఆ తర్వాత… అంతే అయిపోయింది విద్యార్థినీ దశ!

ఎన్నెన్ని ఆనందాలు, అనుభూతులు, అల్లరులు, ఆటపాటలు – ఏడేళ్ళ కాలేజీ జీవితం ఏడు అడుగుల నడకలా చకచకా గడిచిపోయింది. తను, రమ, లలిత, పద్మ ఇంకా శేషు, ప్రేమ అందరూ ఒక్కటిగా ఒక్కటై తిరిగారు. ఎక్కడ చూసినా తామే అన్నట్లు వున్నారు. అందరి దగ్గర ‘అల్లరి పిల్లలమ్మా’ అని అపురూపంగా అనిపించుకున్నారే కాని ‘అబ్బ ఏంటి వీళ్ళు’ అని ఎప్పడూ చిరాకు పాలవలేదు. ఎంతగా అల్లరి చేస్తారో అంతగా అన్నింట్లో ముందుంటారు. పైగా ‘చక్కగా చదువుకుంటారు. మంచి మార్కులూ తెచ్చుకుంటారు’ అనిపించుకున్నారు.

తమని చూసి కుళ్ళుకున్న వాళ్ళూ లేకపోలేదు. విడదీయాలని ప్రయత్నించి, విఫలమై విసుగు పడ్డారే తప్ప ఏం సాధించలేక పోయారు. తిట్టుకున్నా, ఆడుకున్నా, తగువులాడుకున్నా – ఒక్కటై సాగారు తప్ప, విడిపోలేదు.

‘ఇంక మరి అలా వుండలేం. అయిపోయింది అందమైన కాలం’ అనుకుంటుంటే బెంగతో ఏడుపొచ్చింది తనకు ఆ రోజు. చాలా ముందుగానే వచ్చేసి తాము కలసి తిరిగిన ప్రతిచోటూ ఒక్కతే పిచ్చిదానిలా తిరిగింది. తనూ, రమా కూర్చుని కబుర్లు చెప్పుకునే చోటు – తురాయి చెట్టుకింద, ఆ బండ మధ్యన చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం – `ఇక్కడ ఇక మీదట ఇంకెవరో కూర్చుంటారు’ అనుకుంటుంటే తనూ, రమా ఇద్దరం ఫెయిలయిపోయి మళ్ళీ చదివితే బాగుణ్ణు అనిపించింది. అంత దిగుల్లోనూ పిచ్చి ఆలోచనకి నవ్వొచ్చింది.

కేంటీన్ చూస్తుంటే ఒక మంచి వర్షపు రోజు సంగతి గుర్తుకొచ్చింది. క్లాసెస్ కేన్సిల్ చేసేరు ఆ రోజు. చాలా పెద్దవాన. తనూ, రమా తప్ప మిగిలిన వాళ్ళంతా హాస్టల్లో వుంటారు. ఇంటికెలాగూ వెళ్ళలేరని హాస్టల్‌కి లాక్కెళ్ళారు తమిద్దరినీ. కబుర్లు చెప్పకుంటుంటే తనకన్పించింది ‘ఈ ముసురులో – వేడి వేడి కాఫీ, బజ్జీలు వుంటే’ అని. అంతే! ‘చలో కేంటీన్’ అని గొడుగు తీసుకుని బయల్దేరిపోయేరు. ఒక్క పిట్టలేరు కేంపస్లో. కేంటీన్లో కూడా కేవలం కేంటిన్ వాళ్ళు మాత్రం వున్నారు.

‘స్టవ్వే వెలిగించలేదంటే’ అని అంటున్నా, వినిపించుకోక కిచెన్ లోకే వెళ్ళిపోయి అల్లరి చేసి, వాళ్ళతో బజ్జీలు చేయించేరు. పాలు మరగబెట్టించేరు. వాళ్ళు నవ్వుతూ చేసేరే కాని విసుక్కోలేదు. వేడి వేడి బజ్జీలు కాఫీతో, కబుర్లు, నవ్వులు నంచుకుంటుంటే – అబ్బో అదో కొత్త ప్రపంచం. ఈ ప్రపంచంతో ఏ మాత్రం సంబంధంలేని మరో ప్రపంచం.

తిరిగి వస్తుంటే తమ డిపార్ట్‌మెంట్ లెక్చరర్స్ ఇద్దరు ఎదురయ్యేరు గొడుగులతో. ‘వాటే బ్యూటిఫుల్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్’ అంటే, టీచర్స్ అనుకుని నవ్వుకున్నారందరూ.

‘మళ్ళీ ఆ రోజులు వస్తాయి. నిరుడు కురిసిన హిమసమూహాలే అవి అన్నీ! అవి కరిగి, కన్నీళ్ళై కారుతాయే కాని మళ్ళీరావు కదా’ అనిపించింది వరాలుకి. కాని ఆ రోజు బెంగకి, ఈ రోజు తుళ్ళింతకి మధ్య మూడునెలలే. పరీక్షలయిపోయేయి.

రామ్ వచ్చాడు – తనతో నేరుగా మాట్లాడటానికి. ఇన్నాళ్ళూ స్నేహితులుగా వున్న తాము ఇకపై ‘పెళ్ళి’ అనే సూత్రంలో ఇంకా దగ్గిరవుదామని అనుకున్న తరుణంలో, నేరుగా అదే అడగడానికొచ్చాడు రామ్!

‘ఇలా కేంపస్ చూపించవా!’ అనడిగితే కలసి వచ్చారిద్దరూ. తను గ్రాడ్యుయేషన్ చేసిన విమెన్స్ కాలేజ్ చూపించింది. పి.జి. చేసిన యూనివర్సిటీ కేంపస్ అంతా తిప్పి చూపించింది. కేంటీన్లో కాస్సేపు కూర్చున్నారు. తను, రమ ఎప్పుడూ కూర్చుని కబుర్లాడుకునే చింత చెట్టు చూపించింది. ఫేర్‌వెల్ నాటి బెంగ ఈ రోజు లేదు ఎందుకో మరి? ముందున్న జీవితంలోని ఆనందం ఆలోచనల్లో ఆ దిగులు కొట్టుకుపోయిందేమో మరి!

రామ్ తక్కువ మాట్లాడుతున్నాడు. తనే ఎక్కువగా వాగుతోంది. తిరిగి తిరిగి లైబ్రరీ ముందుకొచ్చేరు.

“ఇక్కడ కాస్సేపు కూర్చుందామా” లాన్స్ వేపు నడుస్తూ అడిగేడు రామ్. లైబ్రరీలో మూడు రోజులుగా ఏదో సెమినార్ జరుగుతోంది. అందుకని ఫౌంటెన్స్ అన్నీ తెరిచినట్లున్నారు. అవి అన్ని వేపులకి నీళ్ళు విరజిమ్ముతూ తిరుగుతున్నాయి. లాన్స్ అంతా తడితడిగా, వాతావరణమంతా చల్లగా, ఆహ్లాదంగా వుంది. సంధ్య చీకట్లు మెల్లగా కమ్మకుంటున్నాయి. ఆకాశం గోధూళి వర్ణంలో రాగరంజితమై వుంది. ఇద్దరూ లాన్స్ లో పక్కపక్కగా కూర్చున్నారు. వరాలు నోటికి బ్రేకులేదు. అలా వాగుతూనే వుంది.

కాలేజీ స్నేహితులు, చదువు, స్కూల్ స్నేహితులు, ఇంట్లో – అమ్మ, నాన్న, శీను ఇంకా అందరి గురించి తన పాతికేళ్ళ జీవితం – పరిచయం చేస్తోంది. ఆ కొద్ది సమయంలోనే రామ్ ముందు మాట్లాడ్తూ మాట్లాడ్తూ, సడెన్‌గా తలెత్తి చూసింది. ఠక్కుమని మాట్లాడ్డం ఆగిపోయింది నవ్వుతున్న రామ్‌ని చూడగానే.

రామ్ పెదవులు నవ్వుతున్నాయి. కళ్ళు అల్లరిగా చూస్తున్నాయి. ఆ అల్లరి వెనక వాత్సల్యం కన్పించింది వరాలుకి. ఎందుకో వున్నట్లుండి, అమ్మ, నాన్న, శీను, కిట్టు, పద్మ, భాస్కరన్నయ్య, ఉషక్క, కమలక్క, పెద్దన్నయ్య, పెద్దక్క – అందరూ మనసులో మెదిలేరు. మనసు నిండుగా అయినట్లన్పించింది.

ఇతనితోటి జీవితంలో తను తనుగానే వుంటుంది. ఎప్పటికీ ఇలాగే వుంటుంది. మారిపోదు. తనలోని ఈ వెచ్చదనం ఇలాగే ఎప్పడూ తాజాగా వుంటుంది. తనవన్నీ అనవసర భయాలన్పించింది.

ఏదో భరోసా! నిశ్చలత, హాయి. దూరంగా కొండపైన లైట్లు వెలిగేయి. మలుపులు మెలికలుగా సాగుతున్న కొండదారిలోని లైట్లు – గాలిగోపురం చుట్టూ వెలుగుతున్న లైట్లు – ఎంతో అందంగా వుంది. ఆ ప్రకాశం వరాలు కళ్లల్లో కూడా ఎంతో అందంగా ఆహ్లాదంగా మెరుస్తోంది.

లేచి, నిలబడి రామ్ చేతిలో చేయి కలిపి నడవసాగింది వరాలు.

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here