వసంత లోగిలి-5

0
11

[శ్రీమతి బంటుపల్లి శ్రీదేవి రచించిన ‘వసంత లోగిలి’ అనే నవలను ధారావాహికగా అందిస్తున్నాము.]

[తన మామగారి హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ పని మీద మద్రాసు వస్తుంది శారద. స్నేహితురాలు నిత్య ఇంట్లో దిగుతుంది. మామగారి విషయంలో అబద్ధం చెప్పించమని అడిగి, స్నేహితురాలితో తిట్లు తింటుంది. ఆపరేషన్ చేయించలేని తమ అశక్తతకి బాధపడుతుంది. శారదలోని సంఘర్షణని గమనిస్తూనే ఉంటుంది నిత్య. శారదకి ధైర్యం చెప్పి, ఆ సమస్యని తనకి వదిలేయమంటుంది నిత్య. శారద మామగారు సూర్యనారాయణగారిని తన మామయ్య, డా. రఘునందన్ వద్దకు తీసుకువెళ్తుంది నిత్య. శారదనీ, సూర్యనారాయణగారిని ఆయనకు పరిచయం చేసి సమస్యను వివరిస్తుంది. రఘునందన్ కొన్ని వైద్య పరీక్షలు చేయించి ఆపరేషన్ ఒక నెల రోజుల్లో చేయించాలని చెప్తాడు. హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించకపోతే, ఆయన లైఫ్ కొన్ని నెలలు మాత్రమేననీ, చేయిస్తే మరో పాతికేళ్ళు జీవించగలరని చెప్తాడు. ఎంత ఖర్చయినా ఫరవాలేదు, తాను చూసుకుంటాననీ, ఆపరేషన్‍కి అన్నీ సిద్ధం చేయమని చెప్తుంది నిత్య. శారద కృతజ్ఞతలు చెబితే, అవసరం లేదని, తాను అప్పుగా ఇస్తున్నానని, తీర్చే పద్ధతి కూడా తానే చెప్తానని అంటుంది. సూర్యనారాయణగారి అనుభవం తన బృహత్ ప్రణాళికకి ఉపకరిస్తుందని చెబుతుంది నిత్య. ఆపరేషన్ సంగతి మీ వారికి చెప్పు అనటంతో, పక్కకి వెళ్ళి భర్తకి ఫోన్ చేస్తుంది. ఆపరేషన్‍కి అయ్యే సుమారు ఇరవై లక్షలు నిత్య ఎందుకు భరిస్తానంటోందో శారద భర్త సునీల్‍కి అర్థం కాదు. మన ఇల్లు సొంతం చేసుకోవాలనుకుంటుందా అని అంటాడు. అతని సందేహాలని కొట్టిపారేస్తుంది శారద. పదిహేను రోజుల్లో ఆపరేషన్‍కి అన్నీ సిద్ధం చేస్తారు డా. రఘునందన్. సర్జరీ టైమ్‍కి వస్తాడు సునీల్. ఆపరేషన్ విజయవంతమవుతుంది. తనకి ఎక్కువ రోజులు సెలవు లేదంటూ తిరుగుప్రయాణమవుతాడు సునీల్. ఎంత ఖర్చయిందని నిత్యని అడగబోతుంటే, భర్తని ఆపి, బయటకు తీసుకువస్తుంది. సునీల్ మళ్ళీ సందేహం వ్యక్తం చేస్తే నిత్యకి డబ్బుతో పనిలేదని అంటూ, నిత్య గతం గురించి భర్తకి చెప్పడం మొదలుపెడుతుంది శారద. ఇక చదవండి.]

[dropcap]“ని[/dropcap]త్య అంటే ఒక ‘ఆశయం’.. తను తన కోసం బతకదు.. ఒక ఆశయం కోసం బతుకుతుంది.. ఆ ఆశయమే తనని ముందుకు నడిపిస్తుంది.. తన జీవితం నేటి తరానికి ఒక ఒక సందేశం. పడి లేచే కెరటం ఎంత శక్తివంతమైనదో, ఎంత శక్తివంతంగా తిరిగి ముందుకు వెళ్తుందో.. అటువంటి బలమైన కెరటం నిత్య. నాకు తెలిసిన నిత్య – ఎవరు? ఏమా కదా! తనెవరో.. నీకు, నీతో పాటు ఈ సమాజానికి తెలియాల్సిందే. చెబుతా విను..” అంది శారద.

“తల్లి తండ్రులతో ఎంతో సంతోషంగా, ఆనందంగా గడుపుతున్న నిత్య జీవితంలో ఒక బ్లాక్‌హోల్ ఉంది.

అవి వైజాగ్‌లో నేను హైస్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్న రోజులు.. చురుకైన కళ్ళతో సన్నగా కాస్తా పొడుగుగా చూడగానే ఒక అందమైన చందమామని చూస్తున్నట్లు అనిపించే నిత్య కొత్తగా మా స్కూల్‌లో చేరింది. కొత్తగా వచ్చిన పిల్ల చుట్టూ అందరూ చేరి తనతో స్నేహం చెయ్యడానికి ఉర్రూతలూగుతున్నారు మా క్లాస్‌లో పిల్లలు.. నాకు కూడా నిజానికి ఆ అమ్మాయితో మాట్లాడాలని ఉంది.. కాని కాస్త బెట్టు.. కొత్తగా వచ్చింది కదా! అంత పొగరేంటి?.. తనే నా దగ్గరకి రావచ్చుగా అని నేను అనుకునేదాన్ని.. ఎంత మాత్రం తనే నా దగ్గరకి రావాలి అని తనకి దూరం గా ఉండిపోయాను ఒక వారం రోజులు.

చందమామ కథలు, రామాయణ, మహాభారత కథలు.. పెద్ద బాలశిక్ష లాంటి పుస్తకాలు తప్ప ఏ రోజు క్లాస్ పుస్తకాలు చదివేది కాదు నిత్య. కాని క్లాస్‍లో ఏ ప్రశ్న అడిగినా టకీమని సమాధానం చెప్పేది.. దాన్ని బట్టి నిత్య ఏకసంథాగ్రహి అని మా టీచర్స్ అనేవారు.. తను వచ్చిన దగ్గర నుంచి క్లాస్ ఫస్ట్ నిత్యదే.. మెల్లిగా నాకు నిత్య అంటే ఆకర్షణ పెరిగి నాకు నేనే తనకు దగ్గర అయ్యాను.. అలా చిగురించిన మా స్నేహం కొన్నాళ్ళకి మేమిద్దరం మంచి మిత్రులమయ్యేలా చేసింది.

అలా మా స్నేహం దిన దిన ప్రవర్ధమానమై.. మేము ఇంటర్‌లో ఒకే గ్రూప్ తీసుకునేలా చేసింది, ఒకే కాలేజ్‌లో చేరాం. అలాగే డిగ్రీ కూడా ఒకే దగ్గర చదివి మంచి మిత్రులమైపోయాం.. తను ఎక్కడ ఉంటే అక్కడ సందడి, ఏది మాట్లాడినా కొత్తగా, సరికొత్తగా ఉండేది.. తను మాట్లాడి వెళ్ళిపోయాక ఆ సబ్జక్ట్ గురించి ఆలోచించని వారుండరు. అలా మాట్లాడుతుంది నిత్య.. ఒక రకంగా చెప్పాలంటే నిత్య మంచి వక్త అని చెప్పాలి.. తను ఏది మాట్లాడినా ధారాళoగా మాట్లాడుతుంది, విపులంగా మాట్లాడుతుంది. అంత చిన్న వయసులో అంత గొప్పగా ఎలా ఆలోచిస్తోంది అని అనుకునేవాళ్ళం.. ఈ పిల్లని కన్నవాళ్ళు ఎంత గొప్పవారో అయి ఉంటారు అనుకునే వాళ్ళం కొంతమంది. మేము డిగ్రీ చివరి పరీక్ష రోజు ఇద్దరం కలిసాం.. కలిసి పరీక్ష హాలుకి వెళ్ళాం.. అదే మా చివరి కలయిక.. తరువాత ఏమైందో.. తెలియరాలేదు.

నిత్య శక్తి సామర్థ్యాలు ఎంతో నాకు తెలుసు.. ఒకేసారి డ్రాయింగ్, ఆటలు, పాటలు, సంగీతం, నృత్యం వంటి వాటిలో నైపుణ్యాలు సంపాదించుకున్న నిత్య దేనికదే ముఖ్యమైన విద్య అంటూ.. ప్రతీ విద్యని శ్రద్దగా నేర్చుకుంటుంది.. దీని కోసం చదువుని, చదువు కోసం దీన్ని తక్కువ చెయ్యటం నిత్యకి తెలియదు.. సెలవులు వచ్చాయి, ఆ సెలవుల్లో ఏమేమి చెయ్యాలో.. ముందే ప్లాన్ చేసుకుంటుంది నిత్య.. చాల పెద్ద పెద్ద చదువులు చదవాలని కోరిక నిత్యది.. నాకు ఆ అవకాశమే లేదు.. డిగ్రీ పరీక్షలు రాసిన నాకు పెళ్లి సంబంధాలు రావటం.. పోవటం లోనే మునిగి తేలుతున్నాను.

నిత్య హఠాత్తుగా మాయమైన సంగతి నాకు తెలిసి..

ఇంటికి వెళ్లి తన గురించి తెలుసుకోవాలని అనుకున్నా.. అనుకున్నట్టుగానే ఇంటికి వెళ్లి చూస్తే తాళం వేసి ఉంది.. ఏమి చెయ్యాలో అర్థం కాలేదు

అలా.. రెండో రోజు.. అలా మూడో రోజు.. తనింటికి వెళ్లి చూసేదాన్ని. నిత్య ఇంటికి తాళం వేసి ఉంది.

‘ఏదైనా అర్జెంటు పని పడి ఉంటుంది.. ఇంట్లో ఎవరు లేరు కదా! ఏమి జరిగి ఉంటుంది?’ అని నాలో నేను మథనపడుతూ వచ్చేస్తున్న నాకు ఎదిరింటి ఆవిడ వచ్చి ‘నిత్య వాళ్ళ కోసమే వచ్చావా!..’ అని అడిగింది.

‘అవును’ అన్నాను.

‘మొన్న అర్ధరాత్రి ఒక కారు వచ్చి ఇంటి ముందు ఆగింది.. ఆ కార్‌లో వెళ్లారు.. ఎక్కడికో ఏమిటో తెలీదు..’ అంది.

ఎవరికైనా బాగాలేదేమో!.. అందుకే వెళ్ళాల్సి వచ్చిందేమో! ఈ రోజుల్లోలా ఫోన్ సదుపాయం లేదు.. ఎక్కడికి వెళ్లిందో తెలుసుకోవడానికి. చూసి చూసి నేను ఇంటికి వచ్చేసాను.

ఆ తరువాత తన నుంచి నాకు ఎటువంటి కాంటాక్ట్ లేదు.

ఒక రోజు పేపర్లో ఒక వార్త.. గుండెను పిండేసే వార్త.

కార్ ఆక్సిడెంట్‌లో నిత్య, వారి తల్లి తండ్రులు..

నా కాళ్ళు చేతులు ఆడలేదు. స్వప్నిక బహుదూర్, సుదీర్ వర్మ, నిత్య వర్మ.. ఆ ఏక్సిడెంట్ గురించి పేపర్లో వేసారు.. మద్రాస్ హైవేలో ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి కారు ఏక్సిడెంట్‌కి గురైనట్టు పేపర్లో రాసారు. వాళ్ళ ముగ్గురి ఫోటోలు వేసారు.

ఇదేంటి నిత్య వాళ్ళ అమ్మ సుమిత్ర కదా, స్వప్నిక బహుదూర్ అంటారేమిటి? ఫోటో వాళ్ళ అమ్మదే. బహుశా పేరు తప్పుగా రాసి ఉంటారులే అనుకున్నా.

ఆ తరువాత వారం.. వాళ్ళు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని ఇంకో వార్త వచ్చింది.

నిత్య.. నా ప్రాణానికి ప్రాణం.. ఇక తను లేదు అన్న నిజం నేను జీర్ణించుకోలేకపోయాను.. నాకు చాలా పెద్ద లోటు.. వారం రోజులు నేను తేరుకోలేకపోయాను.. ఒక మంచి స్నేహితురాలిని ఇచ్చి.. తీసుకుపోయాడు.. చాలా అన్యాయం చేసాడు నాకా దేవుడు, అని చాలా రోజుల పాటు ఏడ్చాను. తనలాంటి తెలివైన అమ్మాయిని పోగొట్టుకున్నందుకు మా కాలేజ్ యాజమాన్యం సంతాప సభ నిర్వహించింది. తన కుటుంబం మొత్తం చనిపోయింది.. ఎక్కడా ఆనవాళ్ళు కూడా లేవు.. ఏక్సిడెంట్ జరిగిందా! చేసారా! ఇలా రకరకాల మాటలు మాట్లాడుకుంటున్నారు చాలామంది.. రకరకాల ఊహాగానాలు రాస్తున్నారు పేపర్ వాళ్ళు.

ఆ మరుసటి రోజునుంచి వారి గురించి ప్రతిరోజూ వార్తలే.

వాళ్ళు ఎవరో ఏమిటో అప్పుడు తెలిసింది నాకు.

బహుదూర్ వంశపు యువరాణి స్వప్నికా బహుదూర్ కూతురు, తిలక్ నందిని బహుదూర్‌ల ముద్దుల మనవరాలు మా నిత్య.

రాజవంశంలో పుట్టిన ఒక వజ్రం. కాని, అష్టైశ్వర్యాలు ఉన్నా వాటి మద్య పెరగలేదు..

సాధారణ మద్య తరగతిలో నాలా, నీలా పెరిగిన అమ్మాయి. ఇంకా చెప్పాలంటే, రహస్యంగా పెరిగింది.

నిత్య అమ్మ స్వప్నికా బహుదూర్.. రాజవంశంలో పుట్టి, ఒక సాధారణ కుటుంబంలో అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అందుకు ఫలితంగా రాజరికాన్ని, హోదాని, ఆస్తులని అంతస్తులని ‘తృణప్రాయం’గా వదిలేసుకుని ప్రేమించిన సుధీర్ వర్మతో బతకడానికి వచ్చేసింది అని నిత్య కుటుంబం, పూర్వపరాలు టి.వి.లో చెబుతుంటే విన్నాను.

నిత్య ఒక్కర్తే కూతురు. తండ్రి ఆశ్రమంలో ఒక చిరుద్యోగి. అయినా నిత్య అడిగినవన్నీ ఇస్తూ బాగానే పెంచారు. తన తల్లి ఒక రాజవంశస్తురాలని తనకు గాని, మాకు గాని తెలియనే తెలియదు. తల్లి తండ్రులతో ఎంతో సంతోషంగా, అతి సామాన్యంగా, ఆనందంగా గడుపుతున్న నిత్య కుటుంబం ఆక్సిడెంట్ జరగడంతో నేను ప్రాణానికి ప్రాణంగా అభిమానించే అమూల్యమైన ఒక స్నేహితురాలని కోల్పోయాను అని బాధపడని రోజు లేదు.

ఆ తరువాత నాకు మీతో పెళ్లి జరిగిపోయింది.. అదే వైజాగ్‌లో నా కొత్త కాపురం.. ప్రతి రోజు గుర్తుకు వచ్చే నిత్య మెల్లిగా నా ఆలోచనల నుంచి నా మనసులోనుంచి దూరం అవుతూ ఒక తీయని జ్ఞాపకంగా మిగిలిపోయింది.

నా పెళ్లి అయిన ఎనిమిదేళ్ళ తరువాత ఒక రోజు.. ఎందుకనో నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. ల్యాండ్‌లైన్‌కి ఒక ఫోన్ వచ్చింది.. అదేంటో చిత్రంగా నేనే లిఫ్ట్ చేసాను ఆ రోజు..

ఆ ఫోన్‌లో విచిత్రంగా నిత్య..

‘శారదా.. నేను నిత్యని’ అన్న అవతలి గొంతు నాకు బాగా పరిచయం ఉన్న గొంతే.. నాకు కాసేపు గుర్తు రాలేదు.

‘నిత్యా’ అన్నాను భయంగా..

‘ఆ.. నేనే నిత్యని’ అంది అవతల గొంతు.

ఆశ్చర్యపోయాను ఒక్కసారిగా.. అసలు ఇది కలా! నిజమా! అన్న భ్రమలో ఉన్నాను.

‘శారదా నువ్వు విన్నది నా గొంతే, నేను నీ స్నేహితురాలు నిత్యనే’ అంది.

‘నువ్వు చనిపోలేదా!’ అన్నాను..

‘నేనా!.. చనిపోలేదు బతికే ఉన్నాను.. ఒకసారి ఇంటికి రాగలవా!’ అంది.

ఇది నిజమా! కొంపదీసి నిత్య దెయ్యమై నాకు ఫోన్ చేసిందా! అని మనసులో ఏదో భయం.. అంతలోనే నేను చనిపోలేదని చెప్పిందిగా.. వెళ్తాను అని నాలో నేనే గట్టిగా అనుకున్నాను.

ఎన్నో ఏళ్ళు తరువాత నా స్నేహితురాల్ని చూస్తున్నాను.. చనిపోయింది అని అనుకుంటున్న నా స్నేహితురాలు బ్రతికి వచ్చి నాతో మాట్లాడుతుంది.. ఇది.. నిజంగా నిజమో! కాదో తేలాలంటే నేను వెళ్లి తీరాల్సిందే అని పరుగు పరుగున వెళ్లాను.

నిజంగా నిజమే.. ఇంటి ముందు పడవ లాంటి ఒక పెద్ద కారు.. ఇంట్లో కుర్చీలో హుందాగా కూర్చున్న నిత్య. తనని అలా చూస్తూ ఉండిపోయాను..

దగ్గరకి వచ్చి రెండు చేతులు చాచింది కౌగిలి కోసం.. కాని నేను ఇంకా అలా నిల్చునే ఉన్నాను. నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ..

‘నేను.. నేను దెయ్యాన్ని కాదు శారద.. మనిషినే.. నేను నీ స్నేహితురాల్నే’ అని నన్ను తన కౌగిలిలో బందించిన క్షణం ఇంకా నాకు గుర్తుంది. అప్పుడు నేను నమ్మాను తను మనిషి అని, నా ప్రాణ స్నేహితురాలు నిత్య అని.

మేమిద్దరం ప్రేమికుల్లా ఒకరి కౌగిలిలో ఒకరం అలా ఓ పది నిమిషాలు ఉండిపోయాం.. ఆ తరువాత తేరుకుని ఇద్దరం కుశల ప్రశ్నలు వేసుకుంటూ గడిపాం.

ఆ రోజు పరీక్ష తరువాత ఏమైంది.. ఎటు వెళ్ళింది.. లాంటి విషయాలు అడగాలని ఉంది.. కాని ఎలా అడగాలి అని కాస్తా మొహమాటపడ్డాను.

ఏదైతే అది అయిందిలే అని.. ‘మీ అమ్మ.. నాన్న..’ అని అనగానే తన ముఖంలో సంతోషం ఒక్కసారిగా మాయమైంది.

‘ఆ రోజు పరీక్ష రాసిన తరువాత ఏమైపోయావు.. ఎక్కడికి వెళ్ళావ్? అసలు నువ్వు ఎలా బతికి..’ అన్నాను.

‘చెబుతా.. అంతా చెబుతా..’ అంటూ జరిగిన విషయాలన్నీ నాతో చెప్పడం మొదలుపెట్టింది నిత్య.. కాదు కాదు నిత్యా బహుదూర్.”

***

“ఆ రోజు పరీక్ష రాసి ఇంటికి వెళ్లాను.. అమ్మ ఏడుస్తోంది.. నాన్న ఊరుకోబెడుతున్నారు..

“ఏమి జరిగింది” అని అడుగుతున్న నన్ను పట్టుకుని అమ్మ ఇంకా ఇంకా ఏడుస్తోంది. ఎందుకో?

పరీక్ష అయ్యిపోయిన సంతోషంలో ఉన్నా.. పెద్ద పెద్ద చదువులు చదవాలి. గొప్పదానివి కావాలి. ఈ సమాజానికి నువ్వు ఉపయోగపడాలి.. అని రోజు చెప్పే నాన్న మాట నేను నిలబెట్టాలి అనుకుంటూ ఆనందంగా ఇంటికి వెళ్ళాను. అమ్మ ఎందుకు ఏడుస్తోందో అర్థం కాలేదు ఏమైంది నాన్న.. “ఏమైనా సమస్యా” అన్నాను.

నాన్న మౌనంగా ఉన్నారు.. అలాగే బ్యాగ్ తీసి కొన్ని బట్టలు సర్దుతున్నారు..

“నాన్నా! మిమ్మల్నే.. ఎందుకు అలా ఉన్నారు? అమ్మ ఎందుకు ఏడుస్తోంది? చెప్పండి అంటే మౌనం దాల్చారే౦టి?”

“నిత్యా నీకు.. నీకు ఒక విషయం చెప్పాలి.. ఒక ‘నిజం’ చెప్పాలి” అన్నారు నాన్న గంభీరంగా.

“నాన్నా.. అమ్మ ఎందుకు ఏడుస్తుందో చెప్పమంటే.. నిజం చెప్పాలి అంటారేంటి?” అన్నాను

అప్పుడు చెప్పారు. “మీ తాతయ్య, అమ్మమ్మ చనిపోయారు” అన్నారు మెల్లిగా ..

“తాతయ్య అమ్మమ్మ.. వాళ్ళెక్కడున్నారు?.. అసలు వాళ్ళ గురించి ఎప్పుడు వినలేదు నేను.. చిత్రంగా సీన్ లోకి ఇప్పుడు రావటం ఏంటి? ఎప్పుడు అడిగినా – నేను, మీ అమ్మ అనాథలం మాకెవరు లేరు అనేవారు, మీ ఇద్దరూ. ఇప్పుడు ఈ తాత అమ్మమ్మ ఎక్కడి నుంచి వచ్చారు” అడిగాను

నాన్న నా బుజం మీద చెయ్యి ఆనించి కూర్చోబెట్టి.. “ఇప్పుడు మనం మద్రాస్ వెళ్ళాల్సి ఉంటుంది, వీళ్ళే మీ తాత అమ్మమ్మలు” అన్నారు టి.వి ఆన్ చేసి చూపిస్తూ.

ఎవరో రాజ కుటుంబీకుల పాస్‌ఫోర్ట్ సైజ్ ఫోటోలు. వాటి కింద తిలక్ బహుదూర్, నందిని బహుదూర్ పేర్లు రాసి ఉన్నాయి.

“వీళ్ళా! మా తాత అమ్మమ్మలు” అన్నాను ఆశ్చర్యంగా..

“దీని వెనుక చాలా పెద్ద కథ ఉంది..” అన్నారు.

“మిగిలిన విషయాలు మనం దారిలో మాట్లాడుకుందాం పద” అంటూ అప్పటికే ఇంటి ముందు ఆగిన కార్‌లో మెల్లిగా అమ్మని, నన్ను ఎక్కించి కూర్చోబెట్టారు.. తాళం వేసి వచ్చి నా పక్కన కూర్చున్నారు.

నాకు మతి పోయింది.. నేను డిగ్రీ పరీక్షలు పూర్తీ చేసాను.. ఇంత పెద్ద దాన్నైనా, ఇప్పటి వరకు నాకు అమ్మ నాన్నతో పాటు తాత అమ్మమ్మ ఉన్నారన్న విషయం కూడా తెలీదు.. ఇలా కూడా ఉంటుందా! అసలు ఇది కథా!నిజమా! ఆశ్చర్యంగా అనిపించింది నాకు.

నాన్న నాకు తను చూసిన సినిమా స్టోరి చెబుతున్నారా! అనిపించింది కాసేపు.

కాసేపు మా మద్య మౌనం రాజ్యమేలింది .. అమ్మ శూన్యంలోకి చూస్తోంది.. నేను తేరుకుని,

“నాన్నా! ఏమి జరుగుతోంది” అన్నాను..

“ఇప్పుడు మా గతం నువ్వు తెలుసుకోవాల్సిన టైం వచ్చింది” అంటూ నాన్న ఇలా చెప్పడం మొదలు పెట్టారు శారదా” అంది నిత్య.

“నీ వెనుక ఇంత సస్పెన్స్ ఉందని అనుకోలేదు నిత్యా! చెప్పు చెప్పు” అన్నాను

“గతంలో మా జీవితాల్లో జరిగిన సంఘటనలు.. అంటే మా గతం..” అంటూ మొదలు పెట్టారు నాన్న. చెవులు రిక్కించి వింటున్నా.. నాన్న చెబుతుంటే..” అంటూ కొన్ని క్షణాలు ఆపింది నిత్య.

“చెప్పు నిత్యా.. మీ అమ్మా నాన్న గతం ఏంటి? గతంలో ఏమి జరిగింది చెప్పు .. నాన్న నీకు ఏమి చెప్పారు?” అని ఆత్రుతగా అడిగాను నేను నిత్యని.

“చెబుతా! డియర్.. నీకు చెప్పకపోతే ఎవరికి చెబుతాను?” అంటూ వాళ్ళ నాన్న సుధీర్ వర్మ- వాళ్ళ అమ్మ స్వప్నిక లకు సంబందించిన గతం, వాళ్ళ నాన్న చెప్పిన గతం నాతో చెప్పసాగింది నిత్య.

చెవులు రిక్కించి తను చెప్పిన విషయాలను ఆసక్తిగా విన్నాను.

అసలు నిత్య ఎవరనుకున్నావ్ సునీల్? తను.. తను.. ఒక రాజ కుమార్తె,” అంటూ భర్తకి చెప్పడం కొనసాగించింది శారద.

~

“మద్రాస్‍లో .. అది తిలక్ బహుదూర్ ఆస్థానం.. అదొక పెద్ద రాజవంశం.. రాచరికాలకు ఉద్వాసన పలికి చాలా కాలమే అయినా.. తిలక్ బహుదూర్ హోదాలో ఎటువంటి మార్పు లేదు.. అదే హోదా.. అదే ఠీవి కనపడేది. తిలక్ బహుదూర్ భార్య నందిని.. ఆమె ఆహ్వానం అందితే అది అదృష్టం.. వెళ్ళిన ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించి, సాదరంగా ఆహ్వానించి ఎంతో వాత్సల్యంతో మర్యాద చేసేది. చేతికి చిక్కినది ఇచ్చి పంపేది.. కడు పేదవాడైనా గడప తొక్కితే చాలు ఒడి నిండాల్సిందే.. ఆమె దాన గుణం చెప్పుకోని వారు ఉండరు.. అంత గొప్ప భర్తకి అంత గొప్ప భార్యని అందించిన ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పాల్సిందే.

పెద్ద పెద్ద వాళ్ళు రావటం, విందులు, వినోదాలు, హంగులు ఆర్బాటాలు లాంటివి కొనసాగుతూ ఉండేవి. అలాంటి తిలక్ బహుదూర్ గారి ఏకైక వారసురాలు ‘స్వప్నిక బహుదూర్’. కూతుర్ని తన ఒడిలోనే పెంచుతూ.. ఆలనాపాలనా చూడడానికి మంది మార్బలం ఉన్నా.. సాదా సీదా గృహిణిలా.. చక్కని కథలు చెబుతూ పెంచింది నందిని. ఇక ఆ ఇంట స్వప్నిక బహుదూర్, ఆడింది ఆట, పాడింది పాటగా ఉండేది. ఆమె.. ఎవరో కాదు.. మీ అమ్మ” అని ఆగాడు సుదీర్ వర్మ.

“ఆ.. ఆ.. అమ్మా” అని నోరు తెరిచి తన వంక చూస్తున్న నిత్యని అలాగే చూస్తూ.. “అవును నిత్యా మీ అమ్మే ఆ స్వప్నిక బహుదూర్” అన్నాడు.

“ఏంటి నాన్నా? అమ్మ పేరు సుమిత్ర కదా! స్వప్నిక బహుదూర్ అంటున్నావేంటి? అసలు నువ్వు అమ్మమ్మా తాతయ్య గురుంచి చెబుతున్నావా! రాజవంశం చరిత్ర చెబుతున్నావా!” అన్నాను.

పేలవంగా నవ్వుతూ..”అమ్మ గతం.. అమ్మతో నాకున్న గతం చెబుతున్నా విను” అన్నాడు నాన్న సుధీర్ వర్మ.

“సరే చెప్పు నాన్నా” అన్నాను.

“తిలక్ బహుదూర్‌కి పాలనాధికారాలు లేకపోయినా.. రాచరికపు ఛాయలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. అడిగిన వారికి అడిగినంత పెట్టే ఔదార్యం, కళల పట్ల ప్రేమ, పెద్దలంటే వల్లమాలిన అభిమానం అతని రక్తం లోనే ఉంది. అవి కొనసాగుతూ ఉండేవి. తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తిపాస్తులు ఉన్న తిలక్ బహుదూర్‌కి ఒకే ఒక్క బలహీనత. అది మీ అమ్మ స్వప్నిక బహుదూర్.

ఎందుకంటే గత రెండు తరాలలో ఆడపిల్ల పుట్టుక లేని వంశం. అమ్మ ముందు రెండు తరాలు ఆడపిల్లలే లేని వంశం. అందువల్ల అల్లారుముద్దుగా పెంచారు అమ్మని.”

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here