వసంత లోగిలి-6

0
16

[శ్రీమతి బంటుపల్లి శ్రీదేవి రచించిన ‘వసంత లోగిలి’ అనే నవలను ధారావాహికగా అందిస్తున్నాము.]

[తన భర్తకి నిత్య గతం గురించి చెబుతూంటుంది శారద. నిత్య మామూలు మనిషి కాదని, నిత్య అంటే ఓ ఆశయమని, పడి లేచే కెరటమని చెప్తుంది. వైజాగ్‍లో తను ఆరో క్లాసు చదువుతున్నప్పుడు తమ బడిలోనే, తమ క్లాసులోనే నిత్య కొత్తగా వచ్చి చేరిందని చెప్తుంది. తమ క్లాసులోని అందరూ పిల్లలు ఆ కొత్తమ్మాయితో స్నేహం చేయడానికి ఉత్సాహం చూపించారనీ, కానీ తాను మాత్రం ఓ వారం రోజులు నిత్యని పట్టించుకోలేదని చెప్తుంది. నిత్య – చందమామ కథలు, రామాయణ, మహాభారత కథలు.. పెద్ద బాలశిక్ష లాంటి పుస్తకాలు తప్ప ఏ రోజు క్లాస్ పుస్తకాలు చదివేది కాదనీ, అయినా క్లాస్‍లో ఏ ప్రశ్న అడిగినా టకీమని సమాధానం చెప్పేదని చెప్తుంది శారద. దాన్ని బట్టి నిత్య ఏకసంథాగ్రహి అనే టీచర్లు అనేవారని అంటుంది. మెల్లిగా నిత్య అంటే ఇష్టం పెరిగి, తనకి దగ్గరయ్యాననీ, తమ స్నేహం రోజురోజుకీ పెరిగిందనీ, ఇంటర్‍లో ఒకే గ్రూప్ తీసుకునేలా చేసిందని చెబుతుంది. అలాగే డిగ్రీ కూడా ఒకే కాలేజీలో చదివామనీ, నిత్య మంచి వక్త అనీ, తన మాటలతో అందరినీ ఆకట్టుకునేదని చెప్తుంది. డిగ్రీలో చివరి పరీక్ష వ్రాసిన తరువాత, నిత్య మాయమై పోయిందనీ, మళ్ళీ ఎన్నడూ కలవలేదని, ఈ లోపు తమ వివాహం జరిగిపోయిందని భర్తకి చెబుతుంది శారద. నిత్య వాళ్ళింటికి వెళ్ళి బోగట్టా చేసినా, ఏ సమాచారమూ లభించలేదని, ఓరోజున నిత్య వాళ్ళింటికి వెళితే, ఎదురింటావిడ – ఏదో కారు వచ్చిందనీ, అందరూ దానిలో వెళ్ళిపోయారనీ చెప్తుంది. కొన్ని రోజుల తరువాత, పేపర్లో నిత్య, ఆమె తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారని చదివి బాధపడ్డానని చెప్తుంది శారద. అయితే పేపర్లో నిత్య తల్లి పేరు స్వప్నిక బహుదూర్ అని ఉండడం శారదకి ఆశ్చర్యం కలిగిస్తుంది. తనకి తెలిసినంత వరకు నిత్య తల్లి పేరు సుమిత్ర. మర్నాడు వారు చనిపోయారన్న వార్త వస్తుంది. మంచి స్నేహితురాలిని పోగొట్టుకున్నానని బాధపడుతుంది శారద. ఆ తర్వాత టీవీలో చూపించిన వివరాల ప్రకారం నిత్య వాళ్ళది రాజవంశమనీ, నిత్య బహుదూర్ వంశపు యువరాణి స్వప్నికా బహుదూర్ కూతురనీ, తిలక్ నందిని బహుదూర్‌ల ముద్దుల మనవరాలని తెలిసిందని చెప్తుంది శారద. స్నప్నిక బహాదూర్ – హోదాని, ఆస్తులని అంతస్తులని  వదిలేసి తాను ప్రేమించిన సుధీర్ వర్మను పెళ్ళి చేసుకుని వచ్చేసిందని తెలిసిందని చెప్తుంది. తమ పెళ్ళయ్యాక, 8 ఏళ్ళ తరువాత, తాను పుట్టింటికి వచ్చాననీ, ఓ రోజు అనుకోకుండా తనకు ఓ ఫోన్ వచ్చందని చెప్తుంది. అవతలి వైపు నుంచి నిత్య మాట్లాడిందని, తాను చనిపోలేదని బతికే ఉన్నానని చెప్పిందని అంటుంది శారద. తరువాత తాను నిత్యని వాళ్ళింట్లో కలిసాననీ, నిత్య తన అమ్మానాన్నల గురించి చాలా వివరాలు చెప్పిందని అంటుంది. తన తల్లి స్వప్నిక గురించి, తన తండ్రి సుధీర్ వర్మ చెప్పిన విషయాలను తన నేస్తం శారదకి చెబుతుంది నిత్య. పరీక్షలు రాసి తాను కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి అమ్మ ఏడుస్తుంటే, నాన్న ఓదారుస్తున్నారని – విషయం ఏంటని అడిగితే, తన అమ్మమ్మ, తాతయ్యలు చనిపోయారని తెలిసిందనీ, తాము బయల్దేరి వెళ్ళాలని అంటారు. నిత్య అమ్మమ్మ, తాతయ్యల గురించి సుధీర్ వర్మ నిత్యకి చెప్పిన విషయాలని – నిత్య తనకి చెప్తే, ఆ వివరాలని తన భర్తకి చెబుతుంది శారద. ఇక చదవండి.]

[dropcap]“నే[/dropcap]ను ఐదో క్లాస్ చదువుతున్న రోజులవి. మా నాన్నని తిలక్ బహుదూర్ గారి కోటలో లెక్కలు రాసే పనికి మా తాత కుదిర్చాడు. అలా నాన్నతో నేను రోజు వెళ్ళేవాడిని. ఆ కోటలో పిల్లలతో ఆడుకునే వాడిని.

ఆ ఆస్థానంలో తిలక్ బహుదూర్ గారి సవతి సోదరి భర్తని కోల్పోయిన బాధతో తన పదేళ్ళ బిడ్డతో తిలక్ బహుదూర్ వద్దకు చేరింది. ఆమె పేరు అంజన.. ఆమె బిడ్డ పేరు ధనుంజయ్.

అంజన గారిని, ఆమె బిడ్డని ఎంతో ఆదరంగా చూసేవారు తిలక్ బహుదూర్, నందిని గార్లు.

కాని సవతి తల్లి బిడ్డ కావడంతో తిలక్, నందినిల మద్య సయోద్యని దెబ్బ కొట్టాలని అంజన విశ్వ ప్రయత్నం చేసేవారు. ఎప్పుడూ ఎంతో అన్యోన్యంగా ఉండే తిలక్ నందినల మద్య చిన్న చిన్న గొడవలు రావడం మొదలైనప్పటికీ అవి తాత్కాలికమే అయ్యేవి.

నేను, ధనుంజయ్ ఒకే వయసువాళ్ళం సుమారుగా. అమ్మ మాకంటే ఒక ఏడాది చిన్నది. నేను ఆ కోటలో నా వయసు పిల్లలతో ఆడుకునే వాడిని. అలాగే ధనుంజయ్ వచ్చాక తనతో కూడా ఆడుకునే వాడిని. చదువు సంద్యలు గాని, పెద్ద వాళ్ళ పట్ల మర్యాద కాని కొరవడిన ధనుంజయ్‌ని కాస్తా అప్పుడప్పుడు తిలక్ గారు గమనిస్తుండేవారు. కాని అంజన గారి ముఖం చూసి.. తండ్రి లేని బిడ్డ కదా! అని పెద్దగా దెబ్బలాడలేకపోయేవారు.

ఒక రోజు మేమంతా ఆడుకుంటున్నాం. ఆ ఆటలో ధనుంజయ్ ఓడిపోయాడు. ఆ కసితో, కోపంతో మమ్మల్ని చితకబాదేసాడు. ‘సుదీర్ వర్మా నిన్ను చంపేస్తా!’ అని నా మీద మీదకి వచ్చాడు. అది చూసి మా నాన్న ధనుంజయ్‌ని రెండు చేతులతో ఆపి, ఇది మర్యాద కాదని, ఓడిపోయినప్పుడు ఒప్పుకోవాలని చెప్పడానికి ప్రయత్నం చేసిన నాన్న మీద చెయ్యి చేసుకున్నాడు. అది చూసిన తిలక్ బహుదూర్.. తన తీక్షణమైన చూపులతో ధనుంజయ్‌ని హెచ్చరించటం అంజన గారికి నచ్చలేదు. కాని కాస్తా కొడుకుని అదుపులో ఉంచమని ఆమెకి తిలక్ గారు చెప్పారు. ఆ రోజు నుంచి నేను వెళ్ళిన ప్రతీసారి నన్ను ఆడుకోనీకుండా అడ్డుకునే ప్రయత్నం చేసేది. రానివ్వకుండా అడ్డుపడేది. అయినా నాన్న నన్ను తీసుకుని వెళ్ళేవాడు.

నా వయసు పిల్లలందరికీ కోటలో రాజగురువు మార్తాండ వచ్చి అప్పుడప్పుడు కథలు చెపుతూ ఉండేవారు. అలా ఓ రోజు కథలు చెబుతుండగా.. అక్కడికి స్వప్నికని తీసుకుని వచ్చారు నందిని గారు.

ఆ తరువాత నుంచి నేను పిల్లలందరితో పాటు కథలు వింటాను అని మారాం చేసి మా వద్దకి స్వప్నిక రోజూ వచ్చేది. వస్తూనే నా పక్కన కూర్చుని మార్తాండ గారి కథలు వినేది స్వప్నిక.

స్వప్నికకి చాలా సందేహాలు వచ్చేవి. రాజగురువు మార్తాండ గారిని అడిగి తన సందేహాలు తీర్చుకునేది. తెలివైన స్వప్నికని మార్తాండ గారు చాలా పొగిడేవారు. ఆ గుంపులో ఉన్న ఇద్దరి ముగ్గురితో పాటు నన్ను కూడా అప్పుడప్పుడు పొగిడేవారు. కాని అది ధనుంజయ్‌కి నచ్చేది కాదు.

మార్తాండ గారి పాఠాలను, కథలను శ్రద్దగా వినే స్వప్నిక చాలా మొండిది.

ఒక రోజు, ‘నేను ధనుంజయ్ దగ్గర కూర్చోను’ అని తెగేసి చెప్పింది. అది చాలా అవమానంగా ఫీల్ అయ్యాడు ధనుంజయ్. అలా వారి మద్య వైరం చిలికి చిలికి గాలి వాన అయింది. వాళ్ళిద్దరి మద్య వైరం ముదిరింది. నా పక్కన కూర్చుంటావా! లేదా అని కళ్ళు ఉరిమి చూసేవాడు.. భయపడుతూ నా పక్కన వచ్చి కూర్చునేది.. అది తనకు నచ్చేది కాదు.. కొన్నిసార్లు మా గ్రూప్‌లో ధనుంజయ్ ఉంటే వచ్చేది కాదు. ఇలా వాళ్ళిద్దరి మద్య దూరం ఉండేది.

పిల్లలందరూ పెద్దవాళ్ళమైపోయి యుక్త వయస్సుకి వచ్చాం. స్వప్నిక ధనుంజయ్‌ల మద్య వైరం కూడా పెరుగుతూ వచ్చింది. నేను మార్తాండ గారు చెప్పిన వేదాలు వల్లె వెయ్యటం బాగానే నేర్చుకున్నాను. నాతో పాటు స్వప్నిక పోటీ పడేది. అది ధనుంజయ్‌కి నచ్చేది కాదు. ‘వాడితో ఎందుకు పోటీ, నాతో పోటీ పడు’ అని చెప్పిన ధనుంజయ్‌తో ‘నువ్వు నాకు పోటీనే కాదు’ అని తీసి పారేసింది స్వప్నిక. ‘నాతో పోటీ పడకపోయినా పరవాలేదు కాని, వాడితో నీకు పోటీ ఏంటి?’ అన్నాడు ధనుంజయ్. ‘సుదీర్ వర్మ తో పోటీ పడటం నాకు ఇష్టం’ అంది స్వప్నిక. దానితో ధనుంజయ్ కోపం నషాళానికి ఎక్కింది.

‘చూస్తూ ఉండు స్వప్నిక.. నేను నీకు మొగుడినవుతా.. నిన్ను పెళ్లి చేసుకుంటా.. నా వశం చేసుకుంటా’ అంటూ కోటలో పెద్దగా అరుస్తూ విర్రవీగాడు. అది విన్న నందిని అమ్మగారు చాల భయపడ్డారు. అప్పటి నుంచి స్వప్నికని మాతో పాటు మార్తాండ గురువు గారి వద్దకు కూడా రానిచ్చేవారు కాదు. స్వప్నిక ఎంత అల్లరి పెట్టినా నందిని అమ్మగారు పంపేవారు కాదు.

‘చూసావా! ఒక్క మాటతో స్వప్నికని కోటలో నుంచి బయటకు రాకుండా చేసాను’ అని విర్రవీగేవాడు ధనుంజయ్.

స్వప్నికకి చాలా పట్టుదల ఎక్కువ. ‘నాన్నగారూ! అమ్మ నన్ను బయటకు పోనీయటం లేదు. పిల్లలందరితో కలసి ఉండనీయటం లేదు. ఇది నాకు నచ్చటం లేదు’ అని వాదించేది.

‘పిల్లను అలా బంధించి ఉంచటం మంచిది కాదు. రాచరికపు ఛాయల నుంచి మనం బయటపడాలి నందిని. అందులోనే మనం ఉండిపోకూడదు. అందులోనే మగ్గిపోకూడదు. మన బిడ్డనైనా ఈ అర్థం లేని రాచరికపు ఆంక్షల నుంచి బయటపడేయాలి. ఇలా పెరగటం నాకు ఇష్టం లేదు. సామాన్యులతో సమానంగా నా బిడ్డ పెరగాలి. ఈ రాజరికపు ఆంక్షలు మనతో పాటు బిడ్డ భవిష్యత్తుని నాశనం చెయ్యకూడదు నందిని’ అనేవారు తిలక్ బహుదూర్.

‘దానికి చాలా సమయం పడుతుంది. మనమే మన హోదాని, మన రాచరికపు సంప్రదాయాలని ఇంకా పెంచి పోషిస్తున్నాం. రాచరిక వ్యవస్థ పోయి చాలా ఏళ్ళు అయింది. కాని, ఇంకా ఈ కోటలోనే మగ్గిపోతున్నాం.. వీటిని వదిలి ఉండలేక, అనుభవించలేక, జీవితాన్ని గెలవలేకపోతున్నాం. కాని మనం ప్రయత్నమైతే చెయ్యాలి’ అంది నందిని.

‘ఇలా స్వేచ్ఛాపథంలో మన బిడ్డ నడవాలంటే, ఒక నిర్ణయం తీసుకోవాలి. త్వరలో తీసుకుంటాను నందిని. మన బిడ్డ స్వేచ్చకి, తన భవిష్యత్తుకి ఆటంకం కలిగించే ఏ రాజరికపు గుర్తులు ఉండకూడదు, ఎటువంటి ఆంక్షలు ఉండకూడదు’ అన్నారు తిలక్ బహుదూర్.

‘మీరు ఏమి చెయ్యబోతున్నారు? ఏ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు? ఆ నిర్ణయం వల్ల మన స్వప్నిక ఆనందంగా ఉండగలదా!.. అసలు మీరు ఏం చెయ్యబోతున్నారు.. కాస్త నాతో చెప్పండి’ అని ఆత్రుతగా అడిగింది నందిని.

‘ఇప్పుడు కాదు నందిని, తన పద్దెనిమిది వత్సరాల పుట్టిన రోజు త్వరలో వస్తోంది. ఆ రోజు ఒక నిర్ణయాన్ని చెబుతాను’ అని లోపలకి వెళ్ళిపోయారు తిలక్ బహుదూర్.

‘పద్దెనిమిదివ వత్సరమా!.. అప్పుడేనా!.. నా కూతురు స్వప్నికకి అప్పుడే పదిహేడు నిండిపోయాయా!’ అని ఆందోళన పడింది నందిని. ఆ ఆందోళన వెనుక మనకు తెలియని విచారంతో కూడిన విషాదం కూడా ఉందని ఎవరికి తెలుసు?.

***

ఎదురు చూసిన పుట్టిన రోజు వచ్చింది..

భళ్ళున తెల్లారింది.. స్వప్నిక పుట్టిన రోజు వేడుక అంటే కోటలో అందరికి అదొక పండగ లాంటిదే.. పూజలు, వ్రతాలు, దానాలు, ధర్మాలు ఇలాంటి కార్యక్రమాలతో మొదలవుతుంది, విందులు, వినోదాలతో ముగుస్తుంది.

‘అమ్మా! స్వప్నికా! స్వప్నికా.. తెల్లవారింది లేమ్మా! పుట్టిన రోజు పూట ఇంత నిద్రా!.. లేమ్మా.. లేచి స్నానం చేసి రెడీ అయి హాల్ లోకి రా’ అంటూ కేకేసింది నందిని.

లోపల నుంచి సమాధానం లేదు.

‘ఏంటి వదినా ఇంకా స్వప్నిక లేవలేదా!.. నేను రెడీ చేసి తీసుకువస్తా!.. మీరు వెళ్ళండి వదినా..’ అంటూ స్వప్నిక తలుపు వద్ద నిల్చొని, ‘స్వప్నికా! స్వప్నికా! లేమ్మా! పంతులు గారు వచ్చినట్టున్నారు.. రా తల్లీ’ అని కేకేసింది అంజన ముద్దుగా.

‘నీకు గుర్తుందిగా! ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో’ అంటూ తల్లి చెవిలో ధనుంజయ్ గొణుగుతూ బయటకు పోయాడు. ఏదో ఒకటి చెప్పి అన్నయ్య వదినలను ఒప్పించి స్వప్నికని తన కొడుక్కి భార్యని చెయ్యాలని మనసులో గట్టిగా అనుకుంది అంజన.

కొడుకు ధనుంజయ్ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంది అంజన.

‘అమ్మా! స్వప్నిక నాది.. నేను పెళ్లి చేసుకోవాలి, ఎలా ఒప్పిస్తావో! ఏమో! నీ ఇష్టం.. నాకు నాకు.. చాలా చాలా ఇష్టం స్వప్నిక అంటే.. తనని ఎలాగైనా ఒప్పించాలి. అలాగే మామయ్య, అత్తతో కూడా మాట్లాడు ఈ విషయం. ఎందుకంటే, ఈ రోజుతో 17 సంవత్సరాలు నిండిపోయి 18వ సంవత్సరం వస్తుంది.. బహుశా మామయ్యా అత్తయ్యకు కూడా నన్ను అల్లుడుని చేసుకోవడం ఇష్టమే. ఎందుకంటే, ఆ రోజు.. ఆ రోజు… నీకు మొగుడినవుతా, నిన్ను పెళ్లి చేసుకుంటా.. నా వశం చేసుకుంటా అని స్వప్నికతో అన్న రోజు నుంచి స్వప్నికని కోట బయటకు కూడా పంపడం లేదు గమనించావా! అంటే, నా మాటకు విలువ ఇచ్చినట్టే కదా!.. అందుకే చెబుతున్నా.. బహుదూర్ తిలక్ వంశానికి నేనే వారసుడను’ అంటూ మీసం మేలేస్తున్న కొడుకుని చూసి ఉబ్బి తబ్బిబ్బైంది అంజన.

కొడుకు తెలివి తేటలకు మురిసిపోయిన ఆ తల్లి స్వప్నికని స్వప్ని, స్వప్ని అంటూ మరింత ముద్దుగా పిలుస్తోంది కాని లోపల నుంచి సమాధానం మాత్రం రావటం లేదు.

హాల్లో పంతుళ్ళతో పూజలకి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

‘స్వప్నిక రెడీ అయిందా!’ అంటూ అటుగా వెళ్లే బహుదూర్ తిలక్ గారి మాటకి బదులుగా ‘లేదన్నయ్యా! గంట నుంచి పిలుస్తున్నా లోపల నుంచి సమాధానం లేదు.. లోపల ఏదైనా అఘాయిత్యం?’ అన్నఅంజన మాట పూర్తి కాకుండానే,

‘ఛ.. నోరు మూసుకో అంజనా’ అంటూ తలుపుల్ని తెరిపించి చూసి హతాశులైపోయారు ఎందుకంటే, ..చిత్రంగా ఆ గదిలో స్వప్నిక లేదు.

మంచం మీద ఒక ఉత్తరం.. దర్శనం ఇచ్చింది.

‘ప్రియమైన అమ్మానాన్నలకు మీ ముద్దుల తనయ స్వప్నికా బహుదూర్ నమస్కరించి రాయునది..

నాన్నగారూ.. ఇది నా పద్దెనిమిదవ పుట్టిన రోజు.. ఈ రోజు మీకు అమ్మకి ఎంత ప్రత్యేకమో నాకు తెలుసు. రెండు తరాల తరువాత మూడో తరంలో పుట్టిన ఏకైక వారసురాలిని. బహుదూర్ వంశపు ముద్దు బిడ్డని. మీ ఒడిలో ఓలలాడాలని, అమ్మ ఒడిలో సేద దీరాలని ఎంత అనిపించినా!.. మిమ్మల్ని వదిలి వెళ్ళక తప్పని పరిస్థితి నాది. బహుశా ఇప్పుడు గాని నేను బయటపడని పక్షంలో ఎన్నటికీ నేను బయట పడలేను. ఆకాశంలో పక్షిలా స్వేచ్ఛగా ఎగరాలని ఉంది, చెరువులో చేపలా బలంగా నా కాళ్ళతో నేను ఈ ఒడ్డునుంచి ఆ ఒడ్డుకి ఈదాలని ఉంది నాన్నగారూ. రాచరికపు ముసుగు తీసి బయట తిరగలేని పరిస్థితి మీది. మీ ఆలోచనలలోను, మీ మనసుల్లోను ఆధునికత కనిపిస్తోంది, కాని మీ ఆచరణలో నాకు ఎక్కడా కనిపించటం లేదు. ఈ కోటలో ఉంటే నా ఆశల సౌధం కూలిపోయి నన్ను నేను పోగొట్టుకుంటానేమో! అని భయం వేస్తోంది. బహుదూర్ వంశపు వాసనలతో పెరిగి, నాది అనే ఉనికిని నాకు లేకుండా, ఈ అస్తిత్వంలో బతకడం నాకు బొత్తిగా నచ్చటం లేదు నాన్నగారూ.

ఈ కోటలో ప్రతి మూల రాచరికపు ఆనవాళ్ళే. ఎటు చూసినా డాబు, దర్పమే దర్శనమిస్తున్నాయి. ప్రపంచం పరిగెడుతోంది నాన్నగారూ.. రాచరికపు ఇనుప ఊచల్లో ఇరుక్కుపోయి మీ ఆశయాలను చంపుకుని బతికేస్తున్న మీ ప్రేమకి, మీకు నేను ఎక్కడ బందీ అయిపోతానో అని నాలో భయం పుట్టుకొచ్చింది. ఎంత కాదనుకున్నా.. నా ప్రతి పుట్టినరోజు కోటలో ఘనంగా జరుపాలని మీరు, అమ్మ ఎంతగా కోరుకుంటారో నాకు తెలుసు. నాకు స్వేచ్ఛ ఇవ్వాలి, రాచరికపు నీడలు నాపై పడకూడదు – అంటూనే అందులో కూరుకుపోతున్న మీ పరిస్థితి చూసి బాధగా కూడా ఉంది నాన్నగారూ. కోట బురుజులు నా ఆశలపై నీళ్ళు జల్లుతున్నాయి, నిలువెత్తు రాజప్రాకారాలు నన్ను నా భవిష్యత్తుని శాసిస్తున్నాయి. నాకు అందమైన, ఆనందమైన జీవితం ఇవ్వాలని ఉన్నా ఇవ్వలేని పరిస్థితి, మీ దుస్థితి నాకు అర్థం అవుతోంది. మీ పూర్వీకుల బంధనాలు మిమ్మల్ని వీడటం లేదు, మీ రాచరికపు దర్పం అక్కడ నుంచి మిమ్మల్ని కదలనివ్వటం లేదు అని ఈ మద్యనే నాకు అర్థం అయింది.

ఈ మధ్య ప్రతి విషయంలో అమ్మని తప్పు పడుతున్నారు, చిన్న విషయానికే అమ్మపై కోపగించుకుంటున్నారు. మీరు ఇదివరకులా అమ్మతో ఉండటం లేదు నాన్నగారూ. అది నాకు ఆసలు నచ్చలేదు. అమ్మని ప్రేమించని మీరు నా ఆశలను, ఆశయాలను ప్రేమిస్తారని ఎలా అనుకోను? నా అభిప్రాయాలను గౌరవిస్తారని ఎలా అనుకోను? వీటి వెనుక ఏదో సంఘర్షణ ఉంది అని నాకు అర్థమైంది. మరేదో అభద్రతాభావం మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది. గత కొంత కాలంగా మీలో మీరు మథనపడుతున్నారు, కనిపించని శత్రువు ఏదో మీపై దాడి చేస్తోంది. మీతో మీరే పోరాటం చేస్తున్నారు. బయటకు వ్యక్తపరచలేని దుస్థితిలో ఉన్నారు. అలా అక్కడ ఉండి మిమ్మల్ని నేను చూడలేకపోతున్నాను. ఏమీ చెయ్యలేక పోతున్నాను. అలాగని నా మనసుకి ముసుగేసుకొని ఉండలేకపోతున్నా. స్వేచ్ఛా వాయువులను మనసారా పీల్చాలని ఉన్న తృష్ణను చంపుకోలేకున్నా! మీరు అడుగడుగునా వేసే పూల పానుపుపై నడిస్తే ఎత్తుపల్లాలు తెలియడం లేదు నాకు. మీరు అమ్మ నాపై చూపించే వాత్సల్యం నన్ను ఉక్కిరి బిక్కిరి చేసి, నా జీవితంలో ప్రేమ రాహిత్యంతో పరిచయమే లేకుండా అయిపోతోందేమో నాన్నగారూ. అందుకే మిమ్మల్ని వదిలిపోతున్నా! మీరు నా కోసం వెతికి మీ కాలాన్ని వృథా చేసుకోవద్దు. మిమ్మల్ని వదిలి, మీ కోటను వదిలి వెళ్ళిపోయిన నేను మీ రాచరికానికి మచ్చ తెచ్చాను అనుకుంటే మీరిద్దరూ నన్ను క్షమించండి.

ఇట్లు ప్రేమతో

స్వప్నికా బహుదూర్’

ఉత్తరం చదివిన తిలక్ బహుదూర్ కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరిగాయి. ఛాతిని ఎవరో నొక్కి పెడుతున్నట్లు బాధతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు తిలక్ బహుదూర్.

‘వదినా! ఎంత పని జరిగిపోయింది.. దానికి మనసెలా వచ్చింది’ అంటూ హాల్‌లో ఉన్న వదిన దగ్గరకి వచ్చి లబోదిబోమన్న అంజనని చూసి ‘ఏమైంది?’.. అని అడిగింది నందిని.

సమాధానంగా ఉత్తరం చూపిస్తూ.. అందులో విషయాన్ని వివరించింది అంజన.

రాజగురువు మార్తాండ గారికి తిలక్ బహుదూర్ గారి పరిస్థితి చెప్పడంతో అందరూ అటుగా పరుగులు తీసారు.

పరిస్థితి చూసి నోట మాట రాని నందిని కూలబడిపోయింది. ‘ఏంటి ఇలా జరిగింది, ఎందుకిలా జరుగుతోంది, రెండు తరాల తరువాత పుట్టిన ఆడబిడ్డ.. ఇలా చేసిందేంటి?’ అని తల్లి మనసు తల్లడిల్లిపోయింది. మౌనంగా రోదించింది.

స్వప్నిక కోట వదిలిపోయింది అన్న వార్త ఊరు, వాడ, ఏకమై కోడై కూస్తోంది.

‘నా వలలో చిక్కల్సిన చేప చేజారిపోయి౦దే!’ అని ఉగ్రుడైపోయి ఎగిరెగిరి పడుతున్నాడు ధనుంజయ్.. అంతే కాదు.. కోటలో ఉన్న కొంతమందికి ‘స్వప్నికని వెతికి తీసుకురండి’ అని పురమాయిస్తున్నాడు.. అక్కడికేదో రాజ ప్రసాదాన్ని రక్షించాల్సిన యువరాజు తానే అన్నట్టుగా హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నాడు.

రాచరికం పోయి రెండున్నర తరాలు దాటింది.. రాజులు పోయి, రోజులు మారిపోయి గత చరిత్ర ఆనవాళ్ళు మెల్లిగా కాలచక్రంలో పడి నలిగిపోయాయి.

‘అలా ఉండేదట, అని పెద్ద వాళ్ళు చెబితే వినటమే కాని, చూడడానికి ఏమి మిగిలింది? కోట బురుజులు.. విశాలమైన ఈ ప్రాంగణాలు, గోడలకు వేళ్ళాడుతున్నన ఫోటోలలో బంధించిన పూర్వీకుల వైభోగం తప్ప ఏమి మిగిలింది ఈ తరానికి?.. మనసు పాడు చేసుకోకండి తిలక్ బహుదూర్ గారు’ అని ఛందోబద్ధంగా ఊరడిస్తున్న పెద్దాయన రాజగురువు మార్తాండ గారి మాటలకు అదోలా చూసాడు తిలక్ బహుదూర్.”

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here