వసంత లోగిలి-7

0
13

[శ్రీమతి బంటుపల్లి శ్రీదేవి రచించిన ‘వసంత లోగిలి’ అనే నవలను ధారావాహికగా అందిస్తున్నాము.]

[నిత్య తనకి చెప్పిన వివరాలని తన భర్తకి చెబుతూంటుంది శారద. ఆస్థానంలో లెక్కలు రాసే ఉద్యోగి కొడుకు సుధీర్ వర్మ. నిత్య తండ్రి. అతను నిత్యకి తన గత జీవితం గురించి చెప్తుంటాడు. చిన్నప్పుడు తండ్రితో తానూ కోటకి వెళ్ళి, అక్కడి పిల్లలతో ఆడుకునేవాడినని చెప్తాడు. తిలక్ బహదూర్ గారి సోదరి అంజన భర్తని కోల్పోయి, కొడుకు ధనుంజయ్‍తో సహా అన్నగారి దగ్గరకి వచ్చేస్తుంది. దుందుడుకు స్వభావం గల ధనుంజయ్ అందరితోనూ గొడవలు పడుతూండేవాడు. ఒకరోజు ఆటలో ఓడిపోయిన ధనుంజయ్ సుధీర్ వర్మను చంపేస్తానంటూ మీదకి వస్తే, అతని తండ్రి అడ్డుకుంటారు. అప్పుడు ధనుంజయ్, సుధీర్ తండ్రిని కొడతాడు. అది చూసిన తిలక్ బహాదూర్ ధనుంజయ్‍ని తీవ్రంగా మందలిస్తారు. అది అంజనకి నచ్చదు. సుధీర్‍ని కోట లోకి రానీయకుండా చూడాలని ప్రయత్నించి విఫలమవుతుంది. రాజగురువు మార్తాండ పిల్లలందరినీ కథలు చెప్పేవాడు. ఒకరోజు అక్కడికి స్వప్నికను తీసుకువస్తుంది ఆమె తల్లి నందిని. అది అలవాటయి, రోజూ కథలు వినడానికి వచ్చేది స్వప్నిక. సుధీర్ పక్కనే కూర్చునేది. ఆమెకి ఎన్నో సందేహాలు కలిగేవి. అవన్నీ మార్తాండగారిని అడిగి తీర్చుకునేది. స్వప్నిక సుధీర్‍తో స్నేహంగా ఉండడం ధనుంజయ్‍కి నచ్చేది కాదు. పిల్లలంతా పెద్దవాళ్ళవుతారు. స్వప్నిక ధనుంజయ్‌ల మద్య వైరం కూడా పెరుగుతుంది. మార్తాండ నేర్పుతున్న విద్యలలో సుధీర్ రాణిస్తాడు. ఓ రోజు స్వప్నికతో వాగ్వాదం జరిగి, తాను ఆమెను పెళ్ళి చేసుకుని తీరుతానని అందరి ముందూ గట్టిగా అరుస్తూ చెప్తాడు ధనుంజయ్. అది విన్న నందిని, స్వప్నికను బయటకు పంపటం మానుకుంటుంది. పిల్లను అలా బంధించి ఉంచటం మంచిది కాదు. రాచరికపు ఛాయల నుంచి మనం బయటపడాలని తిలక్ బహాదూర్ అనేవారు. అందుకు సమయం రాలేదని నందిని అంటుంది. రాబోయే స్వప్నిక 18వ జన్మదినం రోజున ఆమె భవిష్యత్తుకు మార్గం వేసే తన నిర్ణయాన్ని చెబుతానంటాడు తిలక్ బహాదూర్. అందరూ ఎదురు చూసిన పుట్టినరోజు రానే వస్తుంది. నందిని వెళ్ళి స్వప్నిక గది తలుపు తట్టి, నిద్ర లేచి బయటకు రమ్మని పిలుస్తుంది. కానీ బదులు రాదు. అంజన కూడా ప్రయత్నిస్తుంది. కానీ జవాబు లేదు. తిలక్ బహాదూర్ ఆ గది తలుపులని బలవంతంగా తెరిపించి చూస్తే, లోపల స్వప్నిక ఉండదు. తాను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నట్టు ఒక లేఖ ఉంటుంది. అది చదివిన ఆమె తల్లిదండ్రులు దుఃఖంలో కూరుకుపోతారు. స్వప్నిక కోట వదిలిపోయింది అన్న వార్త అందరికీ తెలిసిపోతుంది. ధనుంజయ్ కోట బాధ్యత అంతా తనదే అన్న స్థాయిలో హడావిడి చేస్తాడు. మార్తాండ తిలక్ బహాదూర్‍ని ఊరడించే ప్రయత్నం చేస్తాడు. ఇక చదవండి.]

[dropcap]పే[/dropcap]లవంగా నవ్వుతూ.. “నా గారాలపట్టి, నా వంశాంకురం నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది.. తరాల శాపం నా ముద్దుల తనయను దారి మళ్ళించింది.. ఈ ఎడబాటు భరించడం చాలా కష్టంగా ఉంది మార్తాండా, ఏంటి మార్తాండా ఇది?.. ఎందుకిలా జరుగుతోంది” అన్నారు తిలక్ బహుదూర్.

“విధి బలీయమైనది తిలక్ బహుదూర్.. ఎంతటి వాడైనా ‘విధి’ని ఓడించడం సాధ్య౦ కాదు సుమా!” అంటూ స్వాంతన వాక్యాలతో సముదాయిస్తున్నారు మార్తాండ.

“నా ఆశలు, ఆశయాలు అడుగంటి పోయాయి, నా కలలు కల్లలైపోయాయి.. నా ప్రాణానికి ప్రాణం నన్ను వదిలి ఎలా వెళ్ళింది? కాసింతైనా మా గురించి ఆలోచించకుండా అలా ఎలా వెళ్ళిపోయింది” అంటూ రోదిస్తోంది నందిని.

అదే అదునుగా తన కొడుకు ధనుంజయ్‌కి దక్కాల్సిన స్వప్నిక దక్కలేదన్న కసితో “అందర్నీ ఈ కోటలోకి రానివ్వద్దని ఎన్నో సార్లు అన్నా, వదినలకు చెప్పి చూశాను. తరాలు మారినా రాచరికం రాచరికమే కదా!, ఆధునిక పోకడలు అంటూ, ప్రపంచం గురించి తెలుసుకోవాలంటూ.. కోట బయటకు పోనిచ్చారు. ..కోటని, కన్న తల్లి తండ్రులను వదిలేసి, బహుదూర్ వంశపు పరువు తీసింది. బిడ్డ ఎవరి మీద మోజు బడ్డదో- ఏమో! రెండో కంటికి చిక్కకుండా ఉడాయించింది” అని అంటున్న అంజన వైపు అదోలా చూసింది నందిని.

‘మనసులో అనుకోవాల్సిన మాటలు, బయటకు అనేసానేంటి?’ బాధలో ఉన్న వదినమ్మ విన్నదని గమనించి నోరు కరుచుకుంది అంజన.

“మన చుట్టుపక్కల గ్రామాలన్నీ వెతికి చూసాం.. కాని ఎక్కడా జాడ లేదు.. పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చి వస్తున్నాం, వాళ్ళు కూడా గాలిస్తున్నారు.. రెండు రోజులైంది.. ఏమై పోయిందో ఏమో! అర్థం కావట్లేదు అంటూ చెబుతున్నారు వెతకడానికి వెళ్లి వచ్చిన కొంత మంది వ్యక్తులు” అంది అంజన.

‘నేను మనువాడాలనుకున్న స్వప్నిక ఇలా ఎలా చేసింది? ఎందుకు చేసింది?ఈ కోటని ఆస్తుల్ని వదిలి పోవాలని ఎలా అనిపించింది?ఈ స్వప్నికకి’, అనుకుంటూ.. ‘ఏమి జరిగినా మన మంచికే.. స్వప్నిక కూడా లేదు కాబట్టి, తిలక్ మామకి, నందిని అత్తకి, నేనే దిక్కు. స్వప్నిక ఎంత వెతికినా దొరకకుండా ఉంటే బాగుణ్ణు కానీ, కొద్దిగా ఎక్కడో వెలితి, స్వప్నిక కూడా నాదైతే ఎంతో బాగుండు కదా’ అనుకున్నాడు ధనుంజయ్ మనసులో. ‘స్వప్నిక చాలా పెంకిఘటం, తను నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. బయటకు పోయి మంచి పనే చేసింది.. ఇక రాకూడదు తను.. ఈ కోటలో అడుగుపెట్టకూడదు, అత్తా మామకి నేనే దిక్కవ్వాలి.. ఈ ఆస్తిని నేనే అనుభవించాలి’ అని మనసులో ఆనంద పడుతున్నాడు ధనుంజయ్.

“స్వప్నిక.. ఈ రాజసాన్ని, సామ్రాజ్యాన్ని వదిలి ఎక్కడికిపోయి ఉంటుంది, ఎంత వెతికినా దొరకడం లేదేంటి బహుదూర్ మామా?” అన్నాడు ధనుంజయ్.

“అదే అర్థం కావటం లేదు ధనుంజయ్” అన్నాడు బహుదూర్.

ఆనంద డోలికల్లో ఊరేగుతున్న ధనుంజయ్‌కి అర్థం కాని ప్రశ్న, స్వప్నిక ఎందుకు వెళ్లి పోయింది? ఎలా వెళ్ళిపోయింది?.. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తల్లి తండ్రులను శోక సముద్రoలో వదిలేసి అంత ప్రశాంతంగా ఎలా వెళ్ళిపోయింది? అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇలాంటి ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అదే మాట తల్లి అంజనతో అన్నాడు కొడుకు ధనుంజయ్.

“కొంపదీసి మన ప్లాన్ గాని స్వప్నికకి తెలీదు కదా!.. అవసరమైతే తిలక్ బహుదూర్‍ని, నందిని అత్తని ఒక రూమ్‌లో బంధించి.. స్వప్నిక మెడలో తాళి కడతా! అని మనం చర్చించుకున్న విషయం తెలిసి పారిపోలేదు కదా, అమ్మా” అన్నాడు ధనుంజయ్ .

“అదేరా! నాకు అర్థం కావటం లేదు. పాపం మా అన్నయ్య, వదినలు స్వప్నిక వెళ్ళినప్పటి నుంచి పచ్చి మంచి నీళ్ళు కూడా తాగలేదు. కూతురు కోసం బెంగ పెట్టుకున్నారు” అంది అంజన.. “అయినా! మన ఆలోచన ఏంటో వాళ్లకి ఎలా తెలుస్తుంది?” ..మళ్ళీ అంది అంజన తేరుకుని.

“ఈ కోటలో మార్తాండ గురువు గారు తప్ప మిగిలిన వాళ్ళు అంతా మనం చెప్పినట్లే ఆడుతారు.. ఆ మార్తాండ గురువు మాత్రం మామయ్య చెప్పు చేతల్లో ఉంటాడు. మిగిలిన వాళ్ళని మెల్లిగా నేను బుట్టలో వేసుకున్నాను” అన్నాడు ధనుంజయ్. కాని లాభం ఏముంది.. స్వప్నిక లేదు..

“అయితేనేం? ఇక ఆస్తులు ఎలా మన పేరుమీద రాసుకోవాలో ఆలోచించాలి, ఓ పథకం రచించాలి.. అసలు ఏమేమి ఆస్తులు.. ఎక్కడెక్కడున్నాయో సమాచారం రాబట్టాలి.. అప్పుడు ఒక ప్రణాళిక వెయ్యాలి.. పథకం ప్రకారం పని జరగాలి” అంది అంజన

“అదే ఆలోచిస్తున్నా అమ్మా! ఇప్పుడు మనకు పని ఇంకా సులభతరం కావచ్చు.. ఇదివరకు స్వప్నిక ఉండేది. తనతో పాటు ఆస్తులు పొందాలనుకున్నాం.. కాని ఇప్పుడు తను లేదు. కాబట్టి, తన ఆస్తిపాస్తులన్నీ మామ తిలక్ బహుదూర్ నాకే ఇస్తాడు.. ఇక ఇవ్వక తప్పదు.. అత్తా, మామ బతికేది ఇంకా కొన్ని నాళ్ళే. అదీ మనం బతకనిస్తే! వీళ్ళని ఈ ప్రపంచానికి తెలియకుండా మట్టుపెట్టాలి” అన్నాడు ధనుంజయ్.  “ముందు గుట్టు తెలుసుకునే మార్గం చూడాలి ధనుంజయ్.. తరువాత అలోచించి చూద్దాం” అంది అంజన.

“అమ్మా! స్వప్నిక ఎప్పుడైనా వస్తే?..”

“అసలు దానిని రానీయకూడదురా ధనుంజయ్” అంది తల్లి సంజన.

“హ.. హ.. హా.. అందుకే స్వప్నిక ఎక్కడికెళ్ళింది, ఏమైంది.. తన జాడ తెలుసుకోవాలి. మట్టు పెట్టాలి. అదే పనిలో ఉన్నా అమ్మా!.. మన ఊరిలో నా పాత స్నేహితుల ‘టీం’ కి ఆ పని అప్పజెప్పా.. వాళ్ళు అదే పనిలో ఉన్నారు. అది కూడా మన నుంచి తప్పించుకోలేదులే” అన్నాడు ధనుంజయ్. “ఒక వేళ స్వప్నిక చిక్కితే, నాతో పెళ్ళికి ఒప్పుకోవాలి. అప్పుడు ఆస్తి మొత్తం నాది అవుతుంది. దానికి ఒప్పుకోకపోతే, ఈ లోకంలోనే లేకుండా చెయ్యాలి అమ్మా!” అన్నాడు ధనుంజయ్.

“అమ్మా! తిలక్ మామ, నందిని అత్తయ్యల దగ్గరే నువ్వు ఉండి, స్వప్నిక జాడ గురించి ఎవరైనా ఏదైనా చెబితే నాకు తెలియ జేయ్యు” అని, తల్లి అంజనకి పురమాయించాడు ధనుంజయ్.

“అయ్యో నీ గారాలపట్టి ఎక్కడికి పోయింది, ఏమైపోయింది వదినా” అంటూ వల్లమాలిన జాలి జూపిస్తూ.. వచ్చి పోయేవారిని ఒక కంట కనిపెడుతూ అక్కడే తచ్చాడుతోంది అంజన.

కోటలో ధనుంజయ్, అంజనల మద్య జరుగుతున్న ప్రతి చర్చని, వాళ్ళ ప్రవర్తనని గమనిస్తూ ఉన్నారు మార్తాండ.

***

అడవుల మద్య ఉన్న ఆశ్రమంలో.. వేదమంత్రాల సాక్షిగా సుధీర్ – స్వప్నికల వివాహం సాదాసీదాగా జరిగిపోయింది. అక్కడ పిల్లలకు వేదాలు చెబుతూ, ఈ ప్రపంచానికి దూరంగా సుధీర్ – స్వప్నికలు కాలక్షేపం చేస్తున్నారు. ‘ఎంతో ప్రేమగా పెంచుకున్న అమ్మానాన్నలకు దూరంగా ఉన్నాను, ఎందుకో తెలీదు! నన్ను సహధర్మచారిణిగా చేసుకున్న సుధీర్ వర్మకి దగ్గరగా ఉన్నా, ఎందుకో తెలీదు! నాకు సుధీర్ వర్మకి పెళ్లి ఒక కలలా ఉంది. ఒకరంటే ఒకరికి ఇష్టం.. కాని పెళ్లి చేసుకునేంత ఇష్టం ఉందా! ఏమో. ఆ ప్రశ్నకి సమాధానమే లేదు నా దగ్గర. ఇదా నా జీవితం? ఈ ప్రపంచాన్ని చూడాలనుకున్నాను, రాజసం వదిలెయ్యాలని అనుకున్నాను, సామాన్యురాలిలా బతకాలనుకున్నాను. సమాజం పరిగెడుతోంది.. దాని వెంట పరిగెట్టాలని ఆశపడ్డాను.. కాని ఇక్కడ.. ఇలా దొంగలా బతకాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఇంతలా బాధ పడుతూ, బతకునీడుస్తూ.. కోట, ఆ రాచరికపు గురుతులు వాటితో పాటు నా ప్రాణమైన అమ్మానాన్నలను వదిలేసి ఉండాల్సి వస్తుందని నేను అనుకోలేదు. కాని, ఎందుకు ఇలా జరిగింది’ అని మథనపడుతోంది సుమిత్ర పేరుతో చలామణి అవుతున్నస్వప్నిక.

“అసలు.. అసలు నా పుట్టిన రోజు.. ముందు ఏమి జరిగింది సుధీర్” అని అడిగింది సుమిత్ర.

“అదే నాకు అర్థం కాలేదు స్వప్నికా.. కాదు కాదు.. సుమిత్రా..” అన్నాడు సుధీర్.

“నీ పుట్టిన రోజుకి వారం ముందే.. నీ 18వ పుట్టిన రోజు వేడుక బాగా జరగాలని, మీ కుటుంబమంతా క్షేమంగా ఉండాలని మా నాన్నగారు చాలా సేపు పూజలు, వ్రతాలు చేసారు.

ఎందుకింత ప్రత్యేకంగా చేస్తున్నారో నాకు అర్థం కాలేదు.. కాని నీ పుట్టిన రోజుకి ముందు రోజు రాత్రి నువ్వు మా ఇంట్లో ఉన్నావు తెలుసా! కాని, ఒంటి మీద తెలివి లేకుండా ఉన్నావు.. మత్తులో ఉన్నావు. ‘ఏమి జరిగింది స్వప్నికకి’ అని అడిగిన నాకు నాన్నగారు వెళ్తూ వెళ్తూ.. ‘ఇక్కడ స్వప్నిక ఉంది అన్న విషయం ఎవ్వరికీ తెలియరాదు.. ఇది ప్రభువు ఆజ్ఞ.. మూడో కంటికి తెలియకూడదు.. నువ్వు ఇంట్లోనే ఉండు.. ఎవ్వరికీ అనుమానం రాకూడదు.. మూడు రోజులు గడిచిన తరువాత విషయం చెబుతాను’ అని బయటకు వెళ్ళిపోయారు.

కాని ధనుంజయ మనుషులు ఊరు, వాడ నీ కోసం గాలిస్తున్నారు అని నాకు తెలిసింది.. నాతో నువ్వు ఉంటావని గ్రహించినట్టున్నారు, నా కోసం మనుషులను పంపారు. అది తెలిసిన మా నాన్న ఆ మనుషుల ముందే.. ‘సుధీర్ వర్మ.. నీకు గాని స్వప్నిక ఏమైనా చెప్పిందా!.. ఎక్కడికి వెళ్లిందో తెలియటం లేదు’ అని నన్ను పిలిచి అడగడమే కాకుండా.. ‘నువ్వు కూడా స్వప్నిక ఎక్కడికి వెళ్ళిందో కాస్తా వెతికి పెట్టే పనిలో ఉండు’ అన్నారు.. దానితో నామీద అనుమానం రాలేదు వాళ్ళకి.

పోనీ నిన్ను అడుగుదామంటే నీకు తెలివి రాలేదు.. నాలుగవ రోజు అర్ధరాత్రి.. నగరం నిద్ర పోతున్న వేళ.. మనల్ని అక్కడ నుంచి వేరే చోటుకు తరలించారు.. బహుశా ఈ అడవుల్లో ఉన్న ఆశ్రమానికే మనల్ని తెచ్చినట్టు ఉన్నారు. కాని మనల్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఈ ఆశ్రమ పెద్దతో మా నాన్న ఏదో మాట్లాడారు.. కాని ఏంటి అనేది నాకు తెలియదు.

అక్కడ నుంచి వచ్చి.. నా పక్కనే కూర్చున్న నాన్న ఓ మాట నాకు చెప్పారు.. అది నేను జీర్ణించుకోలేని విషయం.. అదేంటి అంటే మనిద్దరి వివాహం.

‘స్వప్నిక (సుమిత్ర) రాజకుమార్తె, భోగ భాగ్యాల మద్య పెరిగిన పిల్ల.. తనని నేను వివాహం చేసుకోవడమేంటి? మీకు మతి గాని పోలేదు కదా!’ అన్నాను. ‘అయినా ఈ విషయం స్వప్నికకి తెలుసా!’ అన్నాను.. అందుకు నాన్నగారు ఏమి చెప్పారో తెలుసా! సుధీర్ – స్వప్నిక ల వివాహ౦ అవశ్యం.. అది జరగాలి అంతే. కొన్నిటికి కారణాలు ఉండవు.. పోను పోను మీకే తెలుస్తుంది.. ప్రస్తుతం ఆ విషయాలు తెలుసుకోవలసిన వయసు రాలేదు’ అన్నారు” చెప్పాడు సుధీర్.

“అయితే నాతో వివాహం జరగుతోందని నీకూ తెలియదా సుధీర్” అంది స్వప్నిక.

“తెలియదు స్వప్నికా.. నీకు కూడా తెలీదా?” అన్నాడు సుధీర్

“ఉహు.. నాకు కూడా తెలీదు” అంది స్వప్నిక.

“కొన్ని రోజుల క్రితం నాన్నగారు అమ్మ.. మనిద్దరి స్నేహం గురించి అడిగారు.. సుధీర్ వర్మ చాలా మంచివాడు అని చెప్పాను.. బాధ్యత గల వ్యక్తి అని చెప్పాను”

“అటువంటి వ్యక్తి, నీ పక్కన ఉంటే.. బాగుంటుంది కదా అన్నారు నాన్నగారు.”

“ఆ.. అవును అన్నాను”

 “అటువంటి వ్యక్తి.. మన పక్కనే ఎందుకు? ..తననే మన అల్లుడిగా ప్రకటిద్దాం, మన పక్కకి తెచ్చుకుందాం అంది అమ్మ”

“ఇదంతా తమాషా సంభాషణలా.. మా మధ్య జరిగింది.. నీ మీద ప్రేమ ఉంది అని గాని, ప్రేమిస్తున్నా అని గాని నేను చెప్పలేదు. వ్యక్తిగా నీపై ఉన్న గౌరవాన్ని వ్యక్తపరిచాను అంతే.” అంది స్వప్నిక

“జీవితంలో వచ్చిన ప్రతి మార్పుని ఆహ్వానించాలి. ఆ మార్పుని మనకి అనుకూలంగా మార్చుకోవాలి.. అదే జీవితం. ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా దాన్ని ఆస్వాదించు, అంతా మంచే జరుగుతుంది అని నాన్నగారు అన్నారు. ఇవన్నీ ఇప్పుడు నాకెందుకు చెబుతున్నారో నాకు అర్థం కాలేదు. ఇంతలో నా పుట్టిన రోజు రావడం.. ఇలా దొంగలా ఊరు, వాడ వదిలి రావడం.. ఎవరూ లేకుండా, చివరికి మన మద్య ‘ప్రేమ’ కూడా లేకుండా వివాహం జరగడం విచిత్రంగా ఉంది సుధీర్” అంది స్వప్నిక.

“అసలు.. అసలు ఈ అజ్ఞాతవాసం ఇంకా ఎన్నాళ్ళు? స్వప్నిక.. సుమిత్రగా ఎందుకు ఉండాలి? ..ఎవరూ లేకుండా మన పెళ్లి ఇక్కడ జరగడమేమిటి? అసలు మన ప్రాంతానికి దూరంగా మనం ఎందుకు ఉంటున్నాం ఇక్కడ?” అని అడుగుతున్న స్వప్నికతో..

“నువ్వు సుమిత్ర గానే ఉండాలి.. మనం ఇక్కడ రహస్యంగా ఉంటున్నాం.. మన వివరాలు ఎవరికీ తెలియరాదు.. సుమిత్రా” అన్నాడు సుధీర్ వర్మ.

“మన మధ్య ప్రేమే లేదంటావా స్వప్నికా” అంటున్న సుధీర్ వైపు మౌనంగా చూస్తూ ఉండిపోయింది స్వప్నిక.

‘నువ్వు మౌనంగా ఉంటే ఏమనుకోవాలి ప్రేమ ఉందానా! లేదనా!’ అని మనసులో అనుకున్నాడు.. మౌనం అర్ధాంగీకారం కూడా అని మనసుకి సర్ది చెప్పుకున్నాడు.

అన్నట్టు “ఈ రోజు రాత్రి మార్తాండ గారు మనల్ని కలవడానికి రాబోతున్నారు.. వారితో మాట్లాడితే చాలా విషయాలు తెలుస్తాయి.. ఇది రహస్య సమావేశం.. ఈ సమావేశంలో నువ్వు, నేను, రాజగురువు మార్తాండ మాత్రమే ఉండబోతున్నాం.. ఈ విషయం ఎవ్వరికీ చెప్పవద్దు” అని చెప్పాడు సుధీర్ వర్మ.

“సరే” అని తల ఊపింది సుమిత్ర.

తన మదిలో మెదులుతున్న చాలా ప్రశ్నలకు సమాధానాలు కావాలి.. మార్తాండని అడిగి తీరాలి అని గట్టిగా అనుకుంది సుమిత్ర.. సాయంత్రం ఎప్పుడు అవుతుందా! అని ఎదురు చూస్తోంది సుమిత్ర.

మార్తాండ వారికి స్వప్నిక అంటే అమితమైన ఇష్టం. తిలక్ బహుదూర్, నందినిలంటే ఎనలేని అభిమానం. ఎంతో గౌరవం. ఒక రకంగా ఆ కుటుంబానికి మంచి సేవకుడు.. పైగా ఇష్టుడు.. ఆ కుటుంబంలో జరిగే ప్రతి ముఖ్యమైన పని వెనుక మార్తాండ హస్తం ఉండాల్సిందే.. అతని చెవిలో పడనీకుండా ఏ పని తిలక్ బహుదూర్ చెయ్యరు. వాళ్ళ మద్య సాన్నిహిత్యం అంత గొప్పది అని చెప్పాలి. అంతే కాదు తరతరాలుగా మార్తాండ కుటుంబంలో తాత తండ్రులు, తిలక్ బహదూర్ తాత తండ్రుల ఆస్థానంలో ఉండేవారు.. ప్రస్తుత కాలంలో రాజ్యాలు, రాజులు, రాచరికాలకు ‘చెల్లు చీటీ’ ప్రకటించడంతో గత వైభవ ఆనవాళ్ళు మరుగున పడిపోయాయి. ప్రస్తుత ప్రభుత్వాలకు, ఆనాటి రాజులతో, వారి అభిప్రాయాలతో పనే లేకపోయే. దాంతో రాచరికపు ముసుగు తియ్యకుండా కొందరు, దాన్ని విదిలించుకుని కొందరు, బతుకునీడుస్తున్నారు. పొట్ట కూటికోసం తలో దిక్కు వెళ్ళిపోయి తమ బతుకేదో తాము బతకాలి అన్నట్టు చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు.. తిలక్ బహుదూర్ కోటలో తరతరాలుగా సాన్నిహిత్యం కలిగిన మార్తాండ మాత్రం ఎక్కడికీ పోకుండా తిలక్ బహుదూర్‌ని అంటి పెట్టుకునే ఉన్నారు. తన కుటుంబంలో అందరూ భుక్తి కోసం దూర ప్రాంతాలకి వెళ్ళిపోయినా తను మాత్రం ఇక్కడే ఉండిపోయాడు.

మార్తాండ, తిలక్ బహుదూర్ వంశంతో సాన్నిహిత్యం ఉండడమే కాకుండా.. బహుదూర్‌కి కష్టమొచ్చినా, సుఖమొచ్చినా అంతరంగిక సలహాదారునిగానే కొనసాగుతున్నాడు. కాకపోతే ఈ విషయం బహుదూర్, మార్తాండకి తప్ప ఎవరికీ పెద్దగా తెలియదు. అలా తెలిసేలా ప్రవర్తించకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు ఇద్దరూ.

ఈ రోజు స్వప్నిక, సుధీర్ వర్మలతో ‘రహస్య సమావేశం’ జరపడడానికి ఆశ్రమానికి వస్తున్నాడు మార్తాండ.. ఇది చాల కీలకమైన సమావేశం.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here