వాశిష్ఠము- దేశభక్తి

0
8

[box type=’note’ fontsize=’16’] దేశం అంటే ఏమిటో, ఎవరు నిజమైన దేశభక్తుడో, దేశభక్తిని పెంపొందించడమంటే ఏమిటో ఈ కథలో వివరిస్తున్నారు జొన్నలగడ్డ సౌదామిని. [/box]

[dropcap]వ[/dropcap]శిష్ఠ మహర్షి ఆశ్రమం ప్రశాంతంగా ఉంది. మహర్షి కళ్ళు మూసుకుని తపస్సు చేసుకుంటున్నాడు. ఇంతలో “జయము జయము మహారాజుకి, జయము జయము మన దేశానికి” అంటూ ఒక పతాకాన్ని పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చాడు పరాశరుడు.

“ఇదెక్కడిదిరా” అన్నాడు మహర్షి

“బయట అందరూ జయము జయము అని అరుచుకుంటూ పోతున్నారు. వాళ్ళలో ఒకడు ఇది నాకు ఇచ్చాడు” అని ఆ పతాకాన్ని గొప్పగా చూపించాడు పిల్లవాడు.

“ఎందుకు ఇదంతా” అన్నాడు మహర్షి.

పిల్లవాడు మొహం వేలవేసి “తెలీదు” అన్నాడు.

పక్కనున్న శిష్యుడు, అప్పయ్య దీక్షితులు “పక్కనున్న దేశం రాజు దండయాత్రకి వస్తున్నాడని వార్త వచ్చింది. అందుకని ప్రజలలో దేశభక్తిని పెంపొందించటానికి ఇలా ప్రజలలో సభలూ, సమావేశాలూ, గ్రామ యాత్రలూ మనరాజు చేయిస్తున్నాడు.” అన్నాడు.

“దేశభక్తి అంటే ఏమిటి తాతయ్యా” అన్నాడు పరాశరుడు.

“ముందర దేశం అంటే ఏమిటో చెప్పు” అన్నాడు మహర్షి.

“మన దేశం అంటే గంగానదికీ గోదావరికీ మధ్యన ఉన్న ప్రదేశం.”

“దేశం అంటే ఉత్త ప్రదేశమా?”

పిల్లవాడు బిక్కమొహం వేశాడు. పక్కనే ఉన్న అప్పయ్య దీక్షితులు అందుకున్నాడు.

“కాదు, కాదు. అందులో ఉన్న ప్రజలూ, వాళ్ళ ఆచార వ్యవహారాలూ, ఆ ప్రదేశంలో ఉన్న అన్నీ కలిపితే దేశం అవుతుంది”.

“ఓహో, అలాగా, మామూలుగా భక్తి అనేది ఒక వ్యక్తి మీదో, వస్తువు మీదో ఉంటుంది. మరి అలాంటి పెద్ద వైశాల్యం ఉన్న ప్రదేశమూ, ప్రజలూ, వారి వ్యవహారాలూ అన్నీ కలిపి దేశం అయితే మరి దేని మీద ఉంటుంది భక్తి? ప్రదేశం మీదా? ప్రజల మీదా? వాళ్ళ విషయాల మీదా?. “

“అన్నిటినీ కలిపిన దాని మీద”

“అంటే, ప్రదేశాన్నీ, ప్రజలనీ, వాళ్ళ విషయాలనీ కలిపి నువ్వు భావించావు, దానికి దేశం అని పేరు పెట్టావు. మంచిదే, దాని ప్రయోజనం?”

“ఆ దేశంలో ఉన్న ప్రజల ఆర్థిక, సామాజిక పురోగతి”

“అంటే, వేరే దేశాల నుండి వచ్చేవీ స్వదేశంలో తయారయ్యేవీ అయిన వస్తువుల మీదా, మనుషుల మీదా పన్నులు వేయటం, ఆ డబ్బులతో దేశంలో రకరకాల పనులు చేయటం. అంతేనా”

“కొంతవరకు అలాగే జరుగుతుంది.”

“మన ఇల్లు బావుండటం కోసం పక్కింటిని చెడగొట్టినట్టు, ఈ దేశం బావుండాలని మిగతా దేశాలని చెడగొట్టటం, ఇది అంతేనా? ఈ ప్రపంచం అంతా ఒకే కుటుంబం అనే వేద ఋషుల భావనకి ఈ దేశ భావన వ్యతిరేకం కాదూ? నేను బావుండాలి అనుకోవటం వేరు, నేనే బావుండాలి అనుకోవటం అన్యాయం కాదూ?

“కానీ ఇవ్వాళ్ళ జరుగుతోంది అది”

“ఇవాళ్ళ ఏమి జరుగుతోంది అనేది అప్రధానం. ధర్మంగా ఏమి జరగాలి అనేది ప్రధానం. వసుధైవ కుటుంబకం అనే మహత్తర వైదిక భావనకి దేశభావన వ్యతిరేకమా కాదా అనేది విచారిస్తున్నాం మనం.”

“మరి రాజులు ఉండటం కూడా వేదమే చెప్పింది కదా?”

“అవును, ప్రపంచం అంతా ఒకటే కుటుంబం అని అందరూ ఆలోచిస్తే దేశాలూ అక్కర్లేదు, పాలకులూ అక్కర్లేదు. కానీ అరిషడ్వర్గాల మాయలో పడి స్వార్ధ బుద్ధితో కొట్టుకుంటారేమోనని ప్రపంచంలో ధర్మం నిలబెట్టే బాధ్యత పాలకులది అని ఋషులు చెప్పింది నిజమే. దూరాల వల్లా, సమయాభావం వల్లా ధర్మానికి ఏవిధంగా ఇబ్బంది రాకూడదని ఋషులు ప్రపంచాన్ని, దేశాలు అని విభజించి కొంత మందిని ఆ దేశాలకి పాలకులుగా చేశారు. ఆ దేశాలు అనేవి ఒక ఆధ్యాత్మికత కేంద్రంగా ఉండి స్వార్ధం లేకుండా సకల జనాలకీ ఉపయోగంగా పనిచేసే వ్యవస్థలు అయితే, అన్ని చోట్లా, అన్ని వేళలా ధర్మం నిలబడుతుంది అని ఆ ఋషులు చేసిన ఆలోచనలు వమ్మైనాయి. ఆధ్యాత్మికత అసలే పోయింది. సకల జన ఉపయోగం చచ్చిపోయింది. పాలించటం అనేది బాధ్యత అని మరచిపోయి, అది అధికారం అని అనుకునే దౌర్భాగ్యం దాపురించింది. ధర్మమూ, దాన్నినిలబెట్టటమూ పోయి, దేశము అనేది పాలకుల సొంత ఆస్తి అయ్యింది. ఆ దేశాలని విస్తరించాలని చేసే యుద్ధాలూ, వాటికోసం జనాల మీద పన్నులూ, ఎవరూ వాటిని వ్యతిరేకించకుండా కుటిల, అవినీతి పన్నాగాలూ, ఎంత ఘోరం? ఎంత అన్యాయం? ఇప్పుడు మిగిలింది ఎందుకూ పనికిరాని శవం లాంటి వ్యవస్థ మాత్రమే.”

“ఇంతకంటే ప్రజలే పాలకులని ఎన్నుకునే గణ రాజ్యాలు మంచివేమో?”

“అధికారం అనేది బాధ్యత అన్నది పాలకుల భావన కానప్పుడు అన్ని చోట్లా అన్యాయమే జరుగుతుంది. గణ రాజ్యాలలో ఎక్కువ మంది పాలకులు ఉండటం వల్ల ఇంకా ఎక్కువ అవినీతి, మోసమూ జరుగుతుంది. రాజు దుర్మార్గుడైతే ఒకడే ప్రజలని దోస్తాడు. గణ రాజ్యాలలో ఎక్కువ మంది దోస్తారు.”

“మరి ఏమి చెయ్యటం?”

“మొదట, ప్రపంచం అంతా ఆత్మ స్వరూపం కాబట్టి ప్రపంచం అంతా ఒకటే కుటుంబం అని అందరూ ఆలోచించాలి. వ్యవహారంలో, సర్వ ప్రపంచమూ ధర్మాన్ని ఆశ్రయించి ఉంటుంది కాబట్టి, తను ధర్మం ఆచరిస్తూ, తన చుట్టూఉన్న అందరూ ధర్మం ఆచరించేట్టు చూడాలి. తను పుట్టిన దేశంలో పాలకులూ, ప్రజలు ధర్మాన్ని వదిలి ప్రవర్తిస్తుంటే, వాళ్ళని మార్చటానికి వీలైనంత ప్రయత్నించాలి.. దేశభక్తి అంటే దేశపాలకులూ, ప్రజలూ ఏది పలికితే దాన్ని సమర్ధించటం కాదు. దేశ భక్తి అంటే, దేశం, పాలకులూ, ప్రజలూ అంతా ధర్మబద్ధమై నడవడానికి తన ప్రయత్నం తాను సంపూర్ణంగా చేయటం. ఒక దేశంలో పాలకులు ప్రజలని అధర్మ మార్గాలకి ప్రేరేపిస్తే, ఎక్కువమంది ప్రజలు దాన్నే అనుసరిస్తే ఆ అధర్మ మార్గాలని అనుసరించటం అనేది దేశభక్తి కాదు, కానేరదు. అప్పటికి తాను చేసేది, పాలకులకీ, ప్రజలకీ, దేశానికీ కొంత నష్టం కలిగించేదైనా వివేకవంతుడు ఎప్పుడూ క్షణికంగా వచ్చే లాభనష్టాలని వదిలి ధర్మ మార్గాన్నే అనుసరిస్తాడు. ఎందుకంటే ధర్మమే తనకీ, ప్రజలకీ, పాలకులకీ, దేశానికీ ఎక్కువ కాలం సహాయకారీ, లాభదాయీ అవుతుంది. ధర్మమే సర్వ ప్రపంచాన్ని నిలబెడుతోందని మరవద్దు.

“ఇదంతా ఎవరుచేస్తారు?”

“చేస్తారు కాదు చేయాలి. ఎవరికి ధర్మ రక్షణా, సమాజ రక్షణా బాధ్యతలుగా ఇవ్వబడ్డాయో, వాళ్ళు దక్షులు అయి, ఈ బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు చెయ్యలేకపోతే, వేరెవరైనా పూనుకుని ఈ బాధ్యత తీసుకోవాలి. ఎవరూ ఈ బాధ్యత సరిగా నిర్వర్తించక, పెద్దచేపలు చిన్న చేపలని తిన్నట్టు జరిగితే, ప్రజలే పాలకులని దింపేసి కొత్త వాళ్ళని గద్దెని ఎక్కించిన ఘట్టాలు కోకొల్లలు.

“మరి దేశ పాలకులూ,ప్రజలూ అధర్మపరులై తన ప్రాణమ్మీదకి వస్తే?”

“ఎప్పుడైతే దేశంలో అధర్మం పూర్తిగా పెరిగి తన జీవితానికీ, జీవనానికీ ప్రమాదమైతే, ఆ అధర్మ పరమైన దేశాన్ని విడిచి, ఎక్కడ ధర్మం నిలబెట్టబడుతోందో ఆ దేశానికి వెళ్ళి అక్కడే ఉండాలి. దాని వల్ల తన దేశభక్తికేమీ భంగం లేదు.”

“మీరు చెప్పేది అసలు జనాల ఆలోచనలోనే లేదు. మరి నిజమైన దేశభక్తుడు ఎవరు”

“సత్యం అనేది ఇతరుల ఆలోచనల మీద ఆధారపడి ఉండదు. సర్వ జీవ సమత్వం అనేది అత్యుత్తమ దేశభక్తి. అలా వున్నవాడు ప్రపంచమానవుడు. వాడు దేశకాలాదులు దాటినవాడు. తరవాత, తాను ధర్మంగా ఉంటూ, తన చుట్టూ, తన దేశం అంతా ధర్మంగా ఉండటానికి తన ప్రయత్నం తాను చేస్తాడో, వాడు ఉత్తమ దేశభక్తుడు. వాడు, సైనికుడు కానీ, రైతు కానీ, ఆచార్యుడు కానీ, కమ్మరి కానీ, రాజు కానీ, కుమ్మరి కానీ, ఎవరైనా సరే. తరవాత దేశంలో చెయ్యాల్సిన పనుల కోసమో, దేశంలో మార్చాల్సిన మార్పుల కోసమో, వాటిని నమ్మి పనిచేస్తూ, ఇతరులని కూడ పనిచేయమని ప్రసంగాలు చేసేవారూ, వారి మాటలు నమ్మి ఆ పనుల కోసం హృదయ పూర్వకంగా పనిచేసేవారూ, వారు మామూలు దేశభక్తులు. ఎవరైతే దేశభక్తి అని మాటలు మాత్రమే చెబుతారో, ఎవరైతే దేశభక్తి అని చెప్పి ప్రజలను మోసం చేస్తారో, ఎవరైతే దేశభక్తి ముసుగులో అధర్మాలు చేస్తూ ధనం సంపాదిస్తారో, వారు రాక్షస సములు.”

“తాతయ్యా, మళ్ళీ నాకేమీ అర్థం కాలేదు”

“నాకు అర్థమైంది, కానీ దీన్ని జనాలకి ఎట్లా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను” అన్నాడు అప్పయ్య దీక్షితులు గారు.

“దాని గురించి చింత వద్దు. తగిన దేశ కాలాల్లో ఆ పని చేయటానికి తగిన వాళ్ళు వస్తారు” అని మహర్షి చిరునవ్వుతో ముగించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here