వాస్తవముల్ వివరింప దగున్

1
10

[dropcap]న[/dropcap]వారు మంచాన్ని నిలబెట్టే నాలుగు దుంగకోళ్ళలా మొత్తం నలుగురు స్నేహితులు వాళ్ళు. “స్నేహమే ప్రాణంరా!” అని యేదో సినిమాలో యెస్వీఆర్ పాడిన్నట్టు చదువుకునే రోజుల్నుంచి అన్నిటినీ పంచుకు తిరిగిన వాళ్లు. బంధాన్ని పెంచుకు తిరిగిన వాళ్ళు. అదేదో పూర్వజన్మ సుకృతంలా, వేరు వేరు కాలేజీల్లో చేరి, వేరు వేరు డిగ్రీలు అందిపుచ్చుకున్నా, నదులు సముద్రం వేపు దేక్కుంటూ వెళ్ళినట్టు ఒకే ప్రభుత్వ కార్యాలయంలో పకడ్బందీగా ఉద్యోగాలు సంపాదించుకున్న ఉద్దండ మిత్రులు నలుగురూ. అంతటితో ఆగిందా వాళ్ల సాహచర్యంలోని చిక్కదనం! లేదు. భూమి గుండ్రంగా ఉంటుందన్న భౌగోళిక సూత్రాన్ని దృఢపరుస్తూ కేబుల్ వైర్లు పెనవేసుకున్నట్లుగా ఒకే చోట ఆఫీసునుండి హౌసింగ్ లోను తీసుకొని ఇరుగుపొరుగుగా అపార్టుమెంట్లు బుక్ చేసుకొని వాళ్ల కుటుంబాలను సహితం తమ స్నేహపందిరి దాపున చేర్చారు. సామూహిక స్నేహానికి నికార్సైన నిర్వచనం పలికారు. సెలవు దినాలొస్తే చాలు, నలుగురుకీ పండగ దినాలుగా పరిఢివిల్లుతాయి. కలసికట్టుగా ఒకరింట్లో మరొకరు ప్రోగయి కాలగమనానికి మంగళ వాద్యాలతో స్వాగతం పలుకుతారు. ఇక యిటు చూస్తే-పువ్వున్న చోట తావి ఉండేతీరుతుంది కదా! వాళ్ల భార్యామణులు కూడా ఒకరితో ఒకరు ఆత్మీయంగా దగ్గరయి హాయిగొలిపే స్నేహపు జల్లుల్ని ఆస్వాదిస్తున్నవాళ్ళే – ఎప్పుడైనా పంపిణీ వ్యవస్ధలో గడ్డు పరిస్ధితి యేర్పడితే సిలిండరు సమయానికి అందకుపోతే, ఇంట్లో ఉప్పో పప్పో నిండుకుండిపోతే – చాలామంది ఇల్లాండ్లలా అల్లల్లాడి పోరు. అవలీలగా వస్తుమార్పిడి చేసుకుని గట్టు దాటి పని పూర్తిచేసుకుంటారు. ఆపన్న సమయంలో కూడా అదేరీతిన ఒకరి నొకరు ఆదుకుంటారు. అంతే కాక, ఖర్చునూ శ్రమనూ పొదుపు చేసుకునే పద్దతిన ముఖ్యమైన నోములూ వ్రతాలూ చేసుకోవలసి వచ్చినప్పుడు అందరూ కలగలసి జరుపుకుంటారు. గృహ వాతావరణాన్ని పరిమళభరితం చేసుకుంటారు.

ఐతే – అందరూ అన్నివేళలా ఆశించినట్టు కాలం ఎల్లప్పుడూ ఒకే రితిన నల్లేరుపై నడకలా సాగిపోదుకదా! అలాగ్గాని సాగిపోతే జీవన గతి తర్కానికి ఆస్కారమెలా ఉంటుంది? ఎవరి కన్ను పడిందో-లేక కాలానికి సహితం కన్నుకుట్టిందేమో మరి – మధులతల్లా పెనవేసుకొని మనుగడ సాగిస్తూన్న మిత్రుల మధ్య కలకలం చెలరేగింది. అది గమనించిన చుట్టు ప్రక్కల ఫ్లాటు వాళ్ళూ, తోటి సెక్షన్ ల సహోద్యోగులూ ‘ఇది తొమ్మిదవ వింతలా ఉందే!’ అన్నట్టు విస్తుపోయారు. అయితే స్నేహబంధం బెడిసికొట్ట నారంభించడం రామకృష్ణ ఆదిశేషుల మధ్యనే ఆరంభమైంది. వ్యవహారం ఎంతగా బిర్రుబిగుసుకుందంటే – ఆదిశేషు తన యింట్లో వాళ్ళకు కచ్చితమైన ఆదేశాలు జారీచేసాడు; ఇకపై ఎవ్వరూ రామకృష్ణ వాళ్ల యింటివేపు వెళ్లడం గాని, వాళ్ళను పలకరించడం గాని ససేమిరా చేయకూడదని సైనిక శంఖం పూరింఛాడు. భార్య కృష్ణవేణి కూడా అతడి ఆదేశాలను దృఢ నిశ్చయంతో పాటించడానికి ఒప్పుకుంది. పిల్లల్ని సహితం తప్పీజారీ అటువెళ్లకుండా అదుపులో ఉంచింది. ఇప్పుడు ఆదిశేషుని ఎదుర్కుకుంటూన్న ప్రశ్న ఒక్కటే–రామకృష్ణ నిజంగానే తన చిన్ననాటి నేస్తమేనా! తమ స్నేహం నిజంగానే చిన్ననాటిదైతే, ఇంతలా ఎండిన కట్టెలా బిర్రబిగువుగా ఎలా మారిపోతాడు! అంతెత్తు తృణీకార వైఖరితో ఎలా ప్రవర్తిస్తాడు? విషయాన్నిఎంత తరచి, తరచి చూసినా-అనూహ్యమైన రామకృష్ణ ప్రవర్తన అతడికి అంతుచిక్కడం లేదు. ఇకపోతే – రామకృష్ణ తనను మాత్రమేనా తన చిత్ర విచిత్రమైన హావభావాలతో ఖంగుతినిపించాడు; దాదాపు తోటి మిత్రులందరనీ అదే విధంగా-విత్ రీజన్ ఆర్ విదౌట్ రీజన్ అంటారే-ఆ రీతిన పనిగట్టుగొని మరీ అలక్ష్యం చేసాడు; యింకా చేస్తూనే ఉన్నాడు. తమనందరినీ దూరంగా నెట్టుతూ-వాళ్ళకెప్పుడు ఏ వ్యవహారం ఎదురుచ్చినా అదేదో ముక్కూ మొహం ఎరగని మూడో మనిషిలా జారుకోవడం అలవాటు చేసుకున్నాడు యూస్ లెస్ ఫెలో. మొన్నమొన్నటికి వేదమూర్తి సంగతేమైంది? వాడి అక్కయ్య కూతురు పెళ్ళి సంబంధానికని బావగారిని స్వయంగా వెంటబెట్టుకొని వెళ్ళి, రామకృష్ణను ఆహ్వానించాడు. అదేదో అర్జంటు పనిపైన పొరుగూరెళ్ళాలంటూ భార్యను కూతురిని మాత్రం పంపించి సీను నుండి తప్పుకున్నాడు. బావగారి ముందు వేదమూర్తికి తలకొట్టేసినంత పనయింది. ఇప్పుడు తన విషయంలో యేం చేసాడు? అందరి సున్నిత భావాలనూ, ముఖ్యంగా అతణ్ణి నోరారా చిన్నాయనా అని పిలిచి అభిమానించే నిర్మల నిశ్చితార్థానికి సహితం రాకుండా పంగనామం పెట్టి కనుమరుగయాడు. ఇంటిల్లి పాదినీ మనస్తాపానికి గురిచేసాడు. అదలా ఉంచితే – పోయిన ఆదివారం కపాలీశ్వర్ కొడుకు పుట్టిన రోజుని సంబరంగా జరుపుకుంటున్నప్పుడు, ముందస్తు భోగట్టా అందుకుని కూడా ఇతగాడు ఊళ్ళో కనిపించకుండా వలస పక్షిలా మాయమయాడు. మొత్తానికి మిత్రులందరి చూపులోనూ రామకృష్ణ, దుర్యోధనుడంతటి అహంభావిలా మారాడు. కాని, ఈ ఒక్క విషయంలో రామకృష్ణను దుర్యో ధనడితో పోల్చడం ఏమాత్రమా సబబనిపించుకోదు. ఎందుకంటే-దుర్యోధనుడు తన స్నేహితుడు కర్ణుడి కోసం సర్వమూ ధారబోయడానికి ముందుకొచ్చిన స్నేహశీలుడు. ఈ కపట స్నేహితుడేమో చిన్నప్పటి మిత్రుల యిండ్ల జరిగే చిన్నపాటి శుభ కార్యాలకు కూడా రాకుండా డుమ్మా కొట్టేస్తున్నాడు. కళ్ళబడకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఎట్టకేలకు ముగ్గురు మిత్రులూ ఓ పూట తీరుబడిగా ఆలోచించి చూస్తే వాళ్ళ అవగాహనకు అందిన అంశం ఏమంటే-రామకృష్ణ ఏదో మనసులో పెట్టుకొని ఇంకేదో అవకతవకగా తలపోస్తూ తమను కావాలనే పరాభవానికి లోనుచేస్తున్నాడని; అదంతా ఒక పథక రచన ప్రకారమే సాగిస్తున్నాడని. మొన్న తమకంటే ముందుగా సెలక్షన్ గ్రేడ్ సూపర్‌వైజరీ పోస్టు అందుకున్నాడుగా! ఆ ఊపున కూడా అతడు కౌరవ రారాజుగా మారి ఉంటాడు. అయితే, ఇక్కడ మాటకు మాట చెప్పుకోవాలేగాని, రామకృష్ణ భార్య కిరణ్మయి మాత్రం ఆ నలుగురి బంధాల మధ్యా యేర్పడ్డ పగుళ్లను చాసి బాధాతప్తురాలయింది. అనారోగ్యం వల్ల, ముఖ్యంగా రక్తలేమి వ్యాధి వల్ల యేర్పడ్డ శారీరావస్ధను కూడా లక్ష్యపెట్టకుండా అవసరం ఉన్నా లేకపోయినా అందరి యిండ్లకూ వెళ్ళి రావడం మాత్రం మానలేదు. స్కూలుకి వెళ్ళి వచ్చేటప్పు అపార్టుమెంటు ప్రాంగణంలో ఆటలాడుకునేటప్పుడు వాళ్ళ పిల్లలు ఎదురయినప్పుడు ప్రేమగా వాళ్ళ చేతుల్లో ఏదైనా పెట్టి గాని వెళ్ళేది కాదు. నాలుగు కుటుంబాల మధ్యా మునుపులా స్నేహపు జల్లులు చిందకపోయినా సద్భావం మాత్రం చెదరకుండా ఉండాలని తాపత్రయపడేది. అయినా సరే-కిరణ్మయి వాళ్ళ వద్ద పరాభవం యెదుర్కోక తప్పలేదు. ఒకరోజు – ఋతుపవనాలు తెచ్చిన ఆకస్మిక మార్పు వల్ల యేర్పడ్డ అనారోగ్య పరిస్ధితిని కూడా ఖాతరు చేయకుండా మూలన కూర్చున్న ఆదిశేషు రెండో కూతురు విమలను చూసి రావడానికి వెళ్లింది. ఆ పిల్లను పలకరించి ఆశీర్వదించి వచ్చేటప్పుడు ఆడాళ్ళందరూ అక్కడ గుమికూడి కూర్చొని ఉన్నారే గాని, ఎవ్వరూ లేచి వచ్చి ఆమెను పలకరించి పాపాన పోలేదు. ఆనాడు అలా ఎదురైన విముఖత్వం వల్ల ఆమె క్రుంగుబాటుకి లోనై ఉబ్బసం మరింత ఎక్కువై తేరుకోలేని స్థితికి చేరుకుంది. అప్పుడప్పుడే కాలేజీనుండి వచ్చిన వైశాలి, తల్లి పరిస్ధితి గమనించి ఆఫీసు నుండి తండ్రిని పిలవలసి వచ్చింది. కూతురి ద్వారా జరిగింది విని ఒకే ఒక మాటతో ముగించాడు- “వాడికీ వాడి పెళ్ళానికీ ఈమధ్య బాగా తిక్క పట్టుకున్నట్లుంది!”

ఆకురాలు కాలం ప్రవేశించింది. చెట్ల బోదెలు మొగ్గలూడిన మొండి రెమ్మల్లా బోసిగా తయారవుతున్నాయి.   ఆ రోజు ఉదయమే డోర్ బెల్ మ్రోగడం విని గడ్డం గీసుకుంటూన్న ఆదిశేషు షేవింగు సెట్టుని వాష్ బేసిన్ పైన ఉంచి ‘ఇంత పెందలకడే వచ్చి యింటి కప్పుని అదరగొడ్తుందెవరబ్బా!’ అనుకుంటూ తలుపు తీసాడు. గుమ్మం వద్ద నిల్చున్న వేదమూర్తినీ కఫాలీశ్వరరావునీ కళ్ళప్పగించి చూస్తూ “ఏవిట్రోయ్! మహా మంత్రవాదుల్లా ఇంతప్రొద్దుటే వచ్చేసారు-” అంటూ ఇద్దర్నీ లోపలకు రానిచ్చి తలుపు మూయబోయాడు. అప్పుడు కఫాలీశ్వరరావు “తలుపు మూయకురా ఆదీ!” అన్నాడు గట్టిగా. “ఎందుకూ! మీ భార్యామణులు కూడా వెనుకనే వస్తున్నారేంవిటి?”

“కాదు.మన రామకృష్ణుడు వస్తున్నాడు.”

“మన రామకృష్ణుడా! వాడెవడు? అటువంటి వాడొకడున్నట్టు నాకు గుర్తుకు రావడం లేదబ్బా!”

“ఛ!అలాగనకురా ఆదీ. నరుడి కన్ను పడితే నల్లరాయి కూడా పగులుతుందంటారే – మన సాహచర్యంపైన ఎవరి కన్నో పడ్డట్లుందిరా ఆదీ! అందుకే మన స్నేహం ఇలా తగలడింది. లేకపోతే వాడు మాత్రమే మంద నుండి వేరుపడ్డ గొర్రెలా తొలగి పోవడమేమిటి!” వేదమూర్తి నిర్వేదంగా అన్నాడు. ఆ మాటతో ఆదిశేషు ముఖం మారిపోయింది. “చాలించరా నీ వెంగళప్ప ప్రసంగం!వాడు నన్నే కాదు, నిన్ను కూడా అవమానించాడన్నది మర్చిపోకు. ఆ మాటకు వస్తే, నన్ను మాత్రమేనా-మీ అందరి ముఖాలకూ మసిపూసాడన్నది మర్చిపోకు.”

“అది సరేరా! మరి ఒకటి రెండు పేచీలతో తీరిపోయేదా మన నేస్తం. ఆఫ్టరాల్-బై గోన్స్ బి బై గోన్సే కదరా”

“అది నీకు చెల్లుతుంది. నా విషయంలో మాత్రం అదెన్నటికీ తీరేది కాదురా వేదా! ఇప్పటికి వాడితో మనకున్న బందం అంతా గతజల సేతుబంధనమేరా! ఇప్పుడు నేనొకటి చెప్తే మీరు నొచ్చుకోరు కదా!”

నొచ్చుకోమన్నట్లు తలలడ్డంగా ఆడించారు మిత్రులు.

”రేపో మాపో మనమెవరమైనా కళ్ళుమూసినా వాడు మన శవాన్ని కూడా —” అతడా వాక్యాన్ని పూర్తి చేసే లోపే రామకృష్ణ లోపలకు దూసుకువచ్చాడు. ఆదిశేషు నిరుత్తురుడై చూస్తూండి పోయాడు. రామకృష్ణ నిజంగానే వచ్చేసాడన్నమాట! ఇంతజరిగిన తరవాత అతడు యింటి గుమ్మం మళ్ళీ ఎక్కుతాడను కోలేదు ఆదిశేషు.

“మనం లోపలకెళ్లి మాట్లాడుకుందామా!” బిజినెస్ వ్యవహార ధోరణిలో అడిగాడు రామకృష్ణ.

“ఎందుకంట?”

“ఇంకెందుకంట-అందరమూ కలసి బృందగానం చేద్దామని! స్టుపిడ్‌లా మాట్లాడకు” అంటూ లోపలకు నడిచాడు రామకృష్ణ. ఇక మరు మాట లేకుండా ఆదిశేషు అతణ్ణి అనుసరించాడు. అందరూ మాష్టర్ బెడ్ రూములో చేతికందిన కుర్చీలూ స్టూలూ లాక్కుని కూర్చున్నారు. కొత్తగా మొదటిసారి కలుసుకున్నట్టు ఒకరి ముఖం ఒకరు చూసుకోసాగారు. అంతలో కృష్ణవేణి తెచ్చిచ్చిన మంచినీళ్లు తాగడం పూర్తిచేసారు. స్పందన మొదట రామకృష్ణ నుండే ఆరంభమైంది- “ఈ మధ్య నాలో యేర్పడ్డ మార్పు వల్ల మీలో కొందరు మనస్తాపానికి లోనయుంటారని నాకు తెలుసు. అందులో ఆదిశేషు మరింత ఎక్కువగా అప్‌సెట్ అయుంటాడని కూడా నాకు తెలుసు. కాని నేను మీకెవ్వరికీ సారీ చెప్పను. ఎప్పటికీ చెప్పబోను కూడా. ఎందుకో తెలుసా? నేనీనాడు ఇంతలా స్తబ్దుగా తాకితే ముడుచుకు పోయే సిగ్గాకులా తయారయానంటే-దానికి ముగ్గురు కారకులు. ఆ ముగ్గురు మరెవ్వరో కాదు. అది మీరే!”

“మేమా!” ముగ్గురూ ముక్త కంఠంతో అరిచినంత పనిచేసారు.కాని రామకృష్ణ లక్ష్యపెట్టలేదు.

“అవును ముమ్మాటికీ మీరే! మీ ముగ్గురే! ఎన్నిసారులు చెప్పినా ఒక్కరైనా నామాట వినిపించుకున్నారా! అంత అతిగా నా పట్ల ఫీల్ అవటం ఇబ్బందికరమని-అదొక విధమైన మనోవికారానికి దారితీస్తుందని చెప్పలేదూ! మీ అతి ఛాదస్తాలతో నన్నురాచి రంపానపెట్టారు. అందరి ముందూ నన్నొక గ్రహాంతర వాసిని చేసి కూర్చోబెట్టారు” రామకృష్ణ కాస్తంత ఆగి, మరొకసారి కృష్ణవేణికి చెప్పి నీళ్ళు తెప్పించుకొని తాగాడు.

“నా గొంతులోని ధ్వనిని కాదు, నా మనసులోని ఆర్తనాదాన్ని వినాలి, విని అర్ధం చేసుకోవాలి. ఒక్కొక్క సంఘటనా మీ సమ్ముఖానికి సవినయంగా తెస్తేగాని మీ ఛాదస్తపు బుర్రలకు విషయం తట్టదు మరి.         ఒక రోజు వేదమూర్తి యేంచేసాడు? నాలుగో వీధిలో ఉంటూన్న వాళ్ళ బంధువులమ్మాయికి పుట్టిన రోజని నన్ను బయల్దేరదీసాడు. ఆశీర్వదించి రావడం వల్ల మనకు పోయేదేమీ లేదుగా అనుకుంటూ-చిన్న గిఫ్టు ప్యాకెట్టు కూడా కొనుక్కొని అనారోగ్యంతో ఉన్న మా ఆవిణ్ణి కూడా వెంటబెట్టుకొచ్చాను, ఆరుబయట గాలి కిరణ్మయికి కాస్తంత తెరపినిస్తుందని. తీరా అక్కడ కొచ్చిచూస్తే మన బ్రాంచాఫీసరుగారు కూడా అక్కడున్నారు. ఆయనను చూసి నేను కాస్తంత ఎడంగా తొలగి నిల్చున్నాను మర్యాద పూర్వకంగా. అప్పుడు వేదమూర్తేమి చేసాడు? సమయం సందర్భం చూడకుండా నన్నుమాత్రం ఆ అమ్మాయి దగ్గరకు తీసుకెళ్ళి ఆ పిల్లచేత నా కాళ్ళకు నమస్కారం చేయించాడు. అంటే-నాకు అగ్రతాంబూలం ఇప్పించాడన్న మాట. అది మన బ్రాంచాఫీసరుకు కంటగింపుగా మారింది. ప్రొటోకల్ ఆఫీసులోనే కాదు, బయట కూడా యెదురు చూసే రకం ఆయనది. దాని ఫలితం-నా ఫైలు సబ్‌మిషన్లో చిన్నచిన్న తప్పులు ఎత్తి చూపుతూ రెండు అడ్వర్సు మెమోలు ఇప్పించాడు. అంతటితో ఆగితే సరే-రేపు నా సి.ఆర్‌లో చేయిపెట్టి కెలికితే నా పని గోవిందా కదా! ఇదంతా ఎందుకు జరిగింది? మీ ఛాధస్తపు బుధ్ధుల వల్ల. మీ హ్రస్వ దృష్టిలో నేనొక పుణ్యపురుషుణ్ణి. తతిమ్మా వాళ్ళందరూ మామూలు బేవార్సు గాళ్ళు. అతి ఏదైనా సరే ప్రమాదకరమే కదా! అందుకే ఇటువంటి దృక్పథం నా పట్ల చూపించకండని మీ గడ్డాలు పట్టుకుని పలుమార్లు బ్రతిమిలాడాను. మీరెవ్వరూ నా గోడు వినలేదు. మీ అందరి చూపులోనూ నేనెందుకింత పెద్దమనిషినయానో నాకు తెలుసు. నేను చాలా మందిలా చిల్లర ఆశలకు లోను కాను. చిల్లరకు చేతులు చాచను. నా రెండుచేతులూ ఎప్పుడూ శుభ్రంగా ఉంటాయి. కాని నావరకు నేనెప్పుడైనా పురుషులలో ఉత్తమ పురుషుడినని చెప్పుకున్నానా! నాకు బలహీనతలే లేవని చాటుకున్నానా!”

అప్పుడు ఆదిశేషు కలుగజేసుకున్నాడు “ఇందులో మేం చేసిన పొరపాటేముందిరా రామా! నీ నిజాయితీని గుర్తించి గౌరవం ఇప్పించాం. ఆ బ్రాంచాఫీసరు తిక్కగా ప్రవర్తిస్తే, దానికి మేమేం చేసేది!”

అది విని రామకృష్ణ నిట్టుర్పు విడిచాడు. “అలా చేసి నా గుండెలపైన బరువుని పెంచారు. నాకు మతి స్ధిమితం లేకుండా చేసారు. అది తరవాతి విషయం – ముందు నేను చెప్పబోయేది ముగించనివ్వండి. ఇకపోతే నాకెదురైన రెండవ సంఘటన-మన కాలనీ చుట్టూతా కోతి మూకలు తచ్చాడుతుంటాయి. వాటికి ఆకలి మంటలు రేగినప్పుడల్లా చెట్లెక్కి కొమ్మలపై నుండి దూకి తలుపులు తెరుచుకొని ఉన్న అపార్టుమెంటుల్లోకి చొరబడి నోటికిందిన దినుసులన్నిటినీ కవ్వుకుపోతాయి, కాని, అవెప్పుడూ మా అపార్టుమెంటులోకి మాత్రం జొరబడలేదు. ఈ చిన్నపాటి విషయాన్ని మీరు అండపిండ బ్రహ్మాండం చేసి పారేసారు. నేను పరమ ఆంజనేయ భక్తుణ్ణి కాబట్టి, కుండలినీ శక్తిని ఉద్దేపింపగల ఉపాసకుణ్ణి కాబట్టి-కోతులేవీ నా జోలికి రాలేదని, యికపైన కూడా రాబోవని ప్రచారం ఆరంభించారు. నేను నిజంగానే ఆంజనేయ స్వామి భక్తుణ్ణే. కాని కోతిమూకల్ని చూపుల తూటాలతో తరిమి కొట్టగల శక్తిమంతుణ్ణా! మీ ఛాదస్తపు ప్రచార ఫలితంగా నాకు మరొక యిబ్బంది వచ్చి పడింది. ఆఫీసులో ఎక్కడెక్కడ సన్మాన సభలో వీడ్కోలు సభలో పూజలో జరిగితే – యెంత వద్దన్నావినకుండా నన్ను పిలుచుకుపోతున్నారు. నా చేత హారతులు గట్రా ఇవ్వముంటున్నారు. ఇది మీ వల్ల వచ్చిన బెడదే కాదా! ఇటువంటి బెడదల్ని ఎన్నాళ్ళని సహిస్తూ ఉండగలను!”

“మా ఛాదస్తం వల్ల మేం అలా అపోహపడ్డామే అనుకో. ఇంతకీ మీ యింట్లోకి మాత్రం కోతిమూకలు రాకుండా ఉండటానికి కారణం?” ముగ్గురూ ఒకేసారి అడిగారు.

రామకృష్ణ తలఅడ్డంగా ఆడించాడు. “ఈ ప్రశ్న ముందే అడగవలసింది. ఇందులో పెద్ద మిస్టరీ యేమీ లేదు. రెండవ అంతస్థులో ఉన్న మా అపార్టుమెంటు ముందున్న చెట్టుపైన ఒకటీ రెండూ కాదు, ఏకంగా ఆరు తేనె గూడులున్నాయి. ఆ చెట్టుపైకి గాని ఎక్కితే వాటి పిర్రలూ మూతులూ యేమవుతాయో వాటికి బాగా తెలుసు”

ముగ్గురు మిత్రులూ తెల్లబోయి చూసారు. గది తలుపు దగ్గర నిల్చున్నకృష్ణవేణీ నిర్మలా పక్కున నవ్వేసారు. అప్పుడు వాళ్ల ఉనికి గమనించిన రామకృష్ణ అటు తిరిగి నవ్వు తెచ్చిపెట్టుకున్న ముఖంతో అన్నాడు- “టీ ఓ గంట తరవాత తీసుకొద్దువు గాని. మేం కొన్ని ముఖ్యమైన ఆఫీసు వ్యవహారాలు మాట్లాడుకోవాలి. ఒక గంట తరవాత వస్తావా కృష్ణవేణీ!” ఆ మాటతో అలాగే అంటూ తలలూపి తల్లీ కూతుళ్ళిద్దరూ అక్కణ్ణించి కదలి వెళ్లిపోయారు.

రామకృష్ణ చెప్పసాగాడు- “ఆఖరి దశకు వస్తున్నాను. చెవులు రిక్కించి కాదు- మనసు బార్లా విప్పి వినండి. ఎవరి అవసరాలు వాళ్ళకుంటాయి. వాటిని బయటకు చెప్పుకొని తిరగాల్సిన అవసరం లేదు. నన్ను చూడటానికి ఎన్‌ఫోర్సుమెంటు సీనియర్ అసిస్టెంటు సుగుణ తరచుగా వస్తూ ఉండేది. ఎందుకని?”

“ఇంకెందుకని – ఆమె తరచుగా శాఖాపరమైన పరీక్షలు వ్రాసేది. రూల్సు విషయంలో చాలా మంది క్యాండిడేట్సు లాగే నిన్ను డౌట్సు అడగటానికి వచ్చేది. మీరిద్దరూ క్యాంటీనులో కూడా డిస్కస్ చేస్తుండేవాళ్లు. ఆమె భర్త ఆస్త్రేలియాలో–“

“కాదు. అది కాదు విషయం. కొన్నేళ్లుగా తనతో కలసి ఉండని ఆమె భర్త నుండి విడాకులు ఎప్పుడో తీసుకుందామె. నాలుగు సంవత్సరాలుగా ఆమె సింగల్ గానే ఉంటుంది. ఆమె ఆ విషయాన్ని పైకి పొక్కనివ్వకుండా, ఆఫీసుకి కూడా తెలియ జేయకుండా దాచి ఉంచింది. అప్పట్నించి సుగుణ పరీక్షల గురించి కాదు వచ్చేది; తన జీవతం గురించి చెప్పుకోవడానికి నా వద్దకు వచ్చేది. అలా మేమిద్దరమూ దగ్గరయాం. అభిప్రాయాలు కుదరడం కంటే, అవసరాలు ఒక్కటైతే మనుషులు మరింత యెక్కువగా దగ్గరవుతారంటారు. మా మధ్య వ్యవహారం, ఈ ఉపమానానికి మంచి ఉదాహరణ. మనసు విప్పి చెప్పాలంటే నా అవసరం ఆమెకెంత ఉందో నాకు పూర్తిగా తెలియదు గాని, ఇప్పుడు ఆమె అవసరమే నాకెక్కువుంది. నా ఆలోచన ప్రకారమే ఆమె కడపకు బదలీ చేసుకొని వెళ్ళింది; నాకు ప్రమోషన్ వచ్చే సమయమని – మా దగ్గరితనం కార్యాలయ వాతావరణానికి భంగపాటుగా ఉండకూడదని. మొన్న మా అబ్బాయి ఎమ్.ఎస్. చేయడానికి స్టేట్సుకి ఎలా వెళ్ళగలిగాడని; లాస్ ఏంజిల్సులో ఉంటూన్న వాళ్ళ పెద్దన్నయ్య సహకారంతోనే. ఇప్పుడు వాడుంటున్నది, వాళ్ల పెద్దన్నయ్య యింట్లోనే. ఇవన్నీ తెలుసుకోకుండా నన్ను మీరందరూ రేనాటి చోళరాజు పుణ్యకుమారుడి నామాన్ని నాకు సార్ధకం చేసేసారు. ఎంత వద్దన్నా వినకుండా నన్ను పదే పదే పనికిరాని పొగడ్తలతో నింపి చెప్పలేనంతగా మొహమాట పెడ్తూ నాలో నిప్పుకణిక వంటి అపరాధ భావాన్ని రగిల్చారు – ఇంకా రగుల్చుతూనే ఉన్నారు. అందుకే మీకు మేల్కొల్పు పలకడానికే నేనింతగా రియాక్టు కావలసి వచ్చింది. అలా చేస్తున్నప్పుడు నాకు నిజంగా బాధేసిందిరా. కాని నాకు వేరే మార్గం కనిపించలేదురా!”

అంతవరకూ మంత్రముగ్ధుల్లా చెవులు రిక్కించి వింటూ కూర్చున్న ముగ్గరు మిత్రులూ ఒక్కసారిగా గొంతెత్తారు- “మరి కిరణ్మయికిదంతా తెలియదంటావా రామకృష్ణా!”

“ఎందుకు తెలియదు? నెలకొకసారి యింటికొచ్చి వెళ్తుందిగా సుగుణ. అలా వచ్చినప్పుడల్లా కిరణ్మయిని ఆమే మెడికల్ స్పెషలిస్టుల దగ్గరికి తీసుకెళ్ళి మెడికల్ టెస్టులు చేయించుకొస్తుంది. తన కారులోనే కిరణ్మయినీ మా అమ్మాయినీ గుళ్ళూ గోపురాలూ తిప్పుకొస్తుంది. ఇంతకంటే ఋజువేమి కావాలి; కిరణ్యయికి చాలానే తెలుసని? నేను ముందే చెప్పాను దాపరికం లేకుండా. మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ వాళ్ల అసరాలు వాళ్ళకుంటాయని. మొన్న జరిగిన నిశ్చితార్ధానికి రాలేక పోయినందుకు నిర్మలకు సారీ చెప్పి వెళ్ళి పోతాను. మీకు మాత్రం సారీ చెప్పను. ఓకే!” అంటూ రామకృష్ణ లేచాడు.

అప్పుడు ఆదిశేషు కూడా లేచి అతడికి అడ్డంగా వెళ్ళి, నిల్చున్నాడు- “అలాగే-మాకు సారీ చెప్పనవసరం లేదు గాని, నువ్వు సుగుణతో సంపర్కం పెట్టుకొని సహజీవనం సాగిస్తుండటం వల్ల, నువ్వొక ప్రమాదకరమైన పరిస్ధితిని ఎదుర్కొవలసి వస్తుందిరోయ్. ఇది ముందు తెలుకో!” అన్నాడు.

అతడాగి, యేమిటన్నట్టు తిరిగి చూసాడు. “రేపు పెళ్ళీడుకి వచ్చిన వైశాలికి సంబంధం కుదరడం కష్టమవుతుంది. అలాగ్గాని జరిగితే కిరణ్మయికి గుండె పగులుతుంది.”

అప్పుడు రామకృష్ణ మిత్రుల వేపు తేరిపార చూసి నిదానంగా బదులిచ్చాడు – “వైశాలికి పోయిన వారమే పెండ్లి సంబంధం కుదిరింది.”

“కుదిరిందా! ఎప్పుడు?ఎక్కడ? మాకు ఒక్కమాటా చెప్పలేదే!” విస్తుపోయి చూసారు మిత్రులు ముగ్గురూ.

“ఇందులో నా పాలు గాని, మా ఆవిడ ప్రయత్నం గాని అంతగా లేదు. సుగుణే స్వయంగా ఆ సంబంధం కుదిర్చింది. అబ్బాయిది కూడా కడపే. స్వయాన సుగుణకు మేనళ్ళుడే! వచ్చే నెల మొదటి వారం నిశ్చితార్ధం. మీరందరూ మీ ఆడాళ్లతో సహా వచ్చి ముందుండి యేర్పాట్లన్నీ చూస్తారు. కిరణ్మయి ఆరోగ్య పరిస్ధితి గురించి మీకు తెలిసిందేగా! మొన్న మొన్ననే తెలిసింది, గుండెలో బ్లాక్స్ యేర్పడ్డాయట. కనీసం రెండు స్టెంటులైనా వేయాలి. వైశాలి నిశ్చితార్థం అయిన తరవాత ఆస్పత్రిలో అడ్మట్ చేయాలి. మన పోతనా మాత్యుడంటాడు- ‘వారి జాక్షులందు వైవాహికములందు – బ్రాణ విత్త మానభంగమందు-జకిత గోకు లాగ్రజన్మ రక్షణమందు -బొంకవచ్చు నఘము పొందఁదధిప!’ నా విషయంలో నేను బహుశ: ఒక మెట్టు పైకే వెళ్ళిపోయి నట్టున్నాను. నా జీవితాన్నే నేను బొంకుల మయంగా చేసుకుంటున్నానేమో! నా స్వార్థం కోసం – స్వకార్యాన్ని స్వామి కార్యంగా మార్చి అనైతికంగా తయారవుతున్నానేమో! ఐ మే హేవ్ టు ఫేసిట్” అదే చివరి మాటగా ముగించి, రామకృష్ణ హాలు వేపు వెళ్ళి పోయాడు.

ఆ ముగ్గురు మాత్రం ఇంకా అలాగే, ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ శిలా ప్రతిమల్లా అక్కడే ఉండిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here