వాయిదాల వేలంలో గాంధీ!

0
11

[dropcap]గాం[/dropcap]ధీ పేరుతో కతికేవాళ్ళూ
గాంధీ పేరుతో బ్రతికేవాళ్ళూ
ఎంత స్వార్థపరులైనారంటే
గాంధీజీ వాయిదాలపై వేలం!

గాంధీని హత్యచేసిన చోట
స్రవించిన రక్తపు మట్టి
వేలం వేయబడినప్పుడు
రాజ్ ఘాట్లో రాష్ట్ర పిత
రెండోసారి మరణించివుంటాడు…
గాంధీ చనిపోతూ అన్నది ‘హే రామ్’
అతని రక్తంతో తడిసిన మట్టికి
వేలంలో పదివేల పౌండ్ల మూల్యం!

***

ఏ గుండ్రని కళ్ళద్దాలతో గాంధీ
ఆంగ్లేయుల్ని తీక్షణంగా చూస్తూ
వారి గుండెల్లో దడ పుట్టించాడో
వేలంలో ఆ గుండ్రటి అద్దాల కళ్ళజోడు
పలికింది ముప్ఫయినాలుగువేల పౌండ్లు!

తోడుగా వేలం వేయబడింది
గాంధీగారి రాట్నం ‘చర్ ఖా’ –
అతని గర్వించదగ్గ కొడుకులు
‘చర్’ అంటే తిరుగాడుతూ
‘ఖా’ అంటే తినేసారు!

మహాత్ముని ప్రియసంతానమా
మేము మీ గౌరవభావాన్ని గమనించాం
ఏ ప్రార్థన తో దేశవిముక్తి జరిగిందో
ఆ ప్రార్థనా పుస్తకాన్ని సైతం అమ్మేసారు !

భారతదేశమెప్పుడూ భారతదేశమే…
పశ్చిమతత్వాన్ని విడిచిపెట్టాలి
మనం మన పురోగతి పేరుతో
గతించిన తండ్రి వస్త్రభూషణాలు
ఇంకా అమ్ముకోవడం ప్రారంభించలేదు!

పశ్చిమంలో వ్యక్తి కేవలం ఒక వస్తువు
గతించగానే అతని వస్తువులు అమ్మేస్తారు
మనం మన స్వర్గీయ తండ్రి ఫోటో
గోడకు తగిలించి దండ వేస్తాం
తర్వాత దీపం వెలిగించి పెడతాం
ఆకలితో చనిపోయినా ఫర్వాలేదు
తండ్రి నేర్పిన మాటలనే పలుకుతాం
తండ్రి మాటా పాటా వల్లె వేస్తాం
తండ్రి వేలం పాటకు ఏర్పాటు చెయ్యం!

***

మనం భావనలతో ముడిపడినవాళ్ళం
స్పందనలతో అందర్నీ అలరిస్తాం
మనం కోట్ల కుంభకోణాలతో
దేశాన్ని దోచుకుతినేయవచ్చు
కానీ కేవలం యాభైవేల పౌండ్ల ఖర్చుతో
రాష్ట్ర పిత రక్తబిందువులతో
చిక్కబడ్డ మట్టిని మాత్రం
ఒక పవిత్ర జ్ఞాపక శకలంగా
భారతదేశంలో పదిలపరచుకోలేం…
ఇది విషాదభరిత విషయం
ఇది భారత విషాద విశేషం!
~


హిందీ మూలం: పద్మశ్రీ డాక్టర్ సురేంద్ర దుబె
అను: గుండాన జోగారావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here