వేదామృతం

0
5

[dropcap]శం[/dropcap]కరానంద పూర్వాశ్రమంలో విశ్వనారాయణ అనే పేరు గల అవధూత. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే! శివకేశవులు ఒకరేనని నమ్మి, ఆరాధించగా జన్మించిన కుమారుడే విశ్వనారాయణ.

“శ్రీ ఆది శంకరాచార్యుల మాదిరిగా నేను కూడా వివాహం చేసుకొనను. ప్రస్తుతం శత్రుదేశముల నుండీ అశాంతి, అనేక క్రిమిసంబంధిత వ్యాధులతో ప్రజలు అష్టకష్టములు పడుతున్నారు. ధర్మసంస్థాపన కోసం, అనాథల సేవకై శ్రీ ఆది శంకరాచార్యుల వలే నేను కూడా నావంతు కృషిచేస్తాను” అని కొడుకు చెప్పటంతో, తల్లిదండ్రులకు ఒక పెద్ద సమస్యే ఎదురయ్యింది.

“కానీ, దేశ సంక్షేమం కోసం నీవు ఒక సన్యాసిగా మారవలసిన పనిలేదు. సన్యాసాశ్రమంలో కన్నా, గృహస్థు ఆశ్రమంలోనే సుఖదుఃఖములు సమపాళ్ళలో ఉంటాయి. నీవు లౌకిక ప్రపంచంలో కోరికలతో జీవిస్తూ కూడా, సమాజ శ్రేయస్సు కొరకై సేవ చేయవచ్చును” అని తల్లిదండ్రులు ఉపదేశించిన జీవిత సత్యములను అర్థం చేసుకోవటానికి విశ్వనారాయణకు దాదాపు ముప్పై సంవత్సరాలు పట్టింది.

కాలగమనంలో భార్య రాజరాజేశ్వరి సహకారంలో ఇద్దరి అమ్మాయిల వివాహాలు చేసి తన బాధ్యతను పూర్తి చేసుకున్నాడు విశ్వనారాయణ. కానీ అతని మనసు మాత్రం ఇంకా తెలియని అసంతృప్తితో ఉంది. అందుకోసమే అతను శంకరానందగా మారిపోయాడు.

“అసలు దేవుడే లేడు! దేవతలు అంతకన్నా లేరు!! ఒకవేళ ఉంటే మాకు ప్రత్యక్షంగా చూపించవయ్యా!” అని వాదించే వారితో అనేక చర్చలు, సభలు నిర్వహించాడు శంకరానంద. ద్వైతం, అద్వైతం రెండూ ఒకటేననీ, అవి స్త్రీ పురుష రూపాలుగా ఉన్నాయని నిర్వచించాడు.

అలాగే దేవుడు కూడా ఒకడే అయినప్పటికీ, ధర్మసంస్థాపనార్థం వివిధ అవతారములెత్తినట్లు వాఖ్యానించాడు తర్క, మీమాంస, వాదనలలో శంకరానంద.

కనిపించే సూర్యుడు దేవుడే. సేవ చేసేవాడు దేవుడు. ఇతరులకు సహాయం చేసే వాళ్ళందరూ దేవుళ్ళే. అనగా ధర్మాచరణ జీవనం ద్వారానే మానవుడు దైవంగా మారతాడన్న శంకరానంద ప్రవచనాలు ఆబాల గోపాలాన్ని ఆకర్షించాయి.

శంకరానంద తన ఆశ్రమానికి వచ్చేవారిని కారుల్లో రావద్దని పిలుపునిచ్చాడు. ఎందుకంటే పార్కింగ్‌కి చోటు లేదని. ఆశ్రమంలో కరెంట్ కూడా లేదు. వచ్చేవారికి విశనకర్రలు ఇస్తున్నారు. రాత్రిళ్లు చిమ్నీలు, లాంతర్లు మాత్రమే ఉపయోగిస్తున్నారు.

“నేను కరెంట్‌కు, ఏపికి వ్యతిరేకం కానే కాదు. కానీ, మనం ఈ రకంగా కూడా కొన్ని రోజులు ఈ ఆశ్రమంలో గడిపితే మనకు అనేక అద్భుతమైన నూతన ఆవిష్కరణలు స్ఫురిస్తాయన్నదే నా సందేశం.

మీకున్న సమస్యలను వేదికపైకి వచ్చి చెప్పవచ్చు. వాటిని పరిష్కరించేవారు కూడా మీలోనే ఉన్నారన్నది సత్యం. ఇక్కడ నా యొక్క పాత్ర కేవలం పోస్ట్‌మన్ పాత్ర లాంటిదే.”

ఆశ్రమంలో శంకరానంద ప్రసంగం ఆసక్తికరంగా కొనసాగుతోంది….

“ఒకప్పుడు మనమంతా అడివి మనుషులమే! ఆకలికి కందమూలాలు, ఫలాలు భుజించాం. వ్యాధులు వస్తే వివిధ ఆకుల పసర్ల, వేపనాలతో ప్రకృతి వైద్యం చేసుకున్నాం.

దాదాపు అన్ని రకాల మొండి వ్యాధులకూ ఆయుర్వేదంలో మందులు ఉన్నాయి. అసలు ప్రపంచమంతా ముందుగా ఆయుర్వేదంతోనే మందులు తయారుచేసింది. కానీ వాటికి ఇంగ్లీషు పేర్లు పెట్టారు. వనమూలికలే సకల వైద్యములకు మూలాధారం.

ఉదాహరణకు నిమ్మరసం, వేపాకు, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, గానుగ చిగుళ్ళు, తిప్పతీగ, వాము మొదలైనవి దివ్యౌషధాలు.

మన ఆయుర్వేదం ఎంత గొప్పదో అలాగే అల్లోపతీ, హోమియోపతులు కూడా గొప్పవే! ఒకరిని మెచ్చుకోవటానికి ఇంకొకరిని దూషించనక్కరలేదు.

కడుపు నొప్పి మరియు అజీర్తితో బాధపడే కుక్క ‘పచ్చగడ్డి’ తిని తనకు తానుగా వైద్యం చేసుకుంటోంది. అది ఆయుర్వేదమే కదా! అందుకే పూర్వం భరద్వాజ, చరక, హరిత మరియూ కాశ్యప మొదలగు మునులు, రుషులు, యోగులు తమకు తామే వైద్యం, శస్త్రచికిత్సలు కూడా చేసుకునేవారు.

అలాగే మనం కూడా వైద్యులుగా మారి, ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. కరోనాను తరిమికొట్టాలంటే వ్యక్తిగత పరిశుభ్రత 40శాతం, మంచి ఆహారపు అలవాట్లు 30శాతం, వ్యాధికి సరైన ఔషధం 30 శాతం మాత్రమే అని గ్రహించండి” అని చెప్పిన శంకరానంద అద్భుత ప్రసంగానికి ఆశ్రమమంతా చప్పట్లతో మారు మ్రోగిపోయింది.

పచ్చకామెర్లకూ, కరోనా మొదలైన వ్యాధులకు శంకరానంద ఇస్తున్న సహజ సిద్ధమైన ఆయుర్వేదం మందులు తీసుకున్న రోగులు సంపూర్ణ ఆరోగ్యవంతులైనారు. ఇప్పుడు మన శంకరానందగారి ఆయుర్వేదం మందులు విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి.

మన జీవన విధానమే ఆయుర్వేదం. ఆయుర్వేద వైద్యమే వేదామృతం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here