వీరనారి కిత్తూరు రాణి చెన్నమ్మ

2
5

[box type=’note’ fontsize=’16’] ది అక్టోబరు 23వ తేదీ రాణి చెన్నమ్మ జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు  పుట్టి నాగలక్ష్మి. [/box] 

[dropcap]బ్రి[/dropcap]టీష్ ఈస్టిండియా కంపెనీ మన దేశాన్ని పరిపాలించిన కాలంలో సంస్థానాధీశులు, రాజులు, రాణులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. కొంతమంది సర్దుకుపోయారు. కానీ అకళంక దేశభక్తులు తిరుగుబాట్లు, యుద్ధాలు చేసి అమరులయ్యారు. ఈ విధంగా కంపెనీ ప్రభుత్వాన్నిఎదిరించి యుద్ధం చేసిన రాణులలో పేరెన్నికగన్నవారు కిత్తూరు రాణి చెన్నమ్మ.

1778వ సంవత్సరం అక్టోబరు 23వ తేదీన బెల్గాం సమీపంలోని కాకతిలో జన్మించారు చెన్నమ్మ. ఈమె తండ్రి ధూళప్ప. ఈమె బాల్యం నుండి విలువిద్య, గుర్రపుస్వారి, కత్తి పోరాటం వంటి యుద్ధ విద్యలను అభ్యసించారు. స్వయంగా యుద్ధం చేయగల అనుభవాన్నీ సంపాదించారు.

ఈమెకు కిత్తూరు రాజు ‘మల్లసర్జన’తో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు జన్మించాదు. కాని కొద్ది కాలంలోనే మరణించాడు. ఈ దంపతులు శివలింగ రుద్రప్పను దత్తత చేసుకున్నారు. మల్లసర్జన మరణించిన తర్వాత దత్తపుత్రుడు శివలింగ రుద్రప్ప ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం ప్రకారం సుమారు 1,70,000 రూపాయలను కంపెనీ ప్రభుత్వానికి చెల్లించాలి. రుద్రప్పకు సంతానం కలగలేదు.

ఆ తరువాత శివలింగ రుద్రప్ప ఒక కుర్రవాడిని దత్తత చేసుకున్నాడు. అతని పేరు శివలింగప్ప. అయితే ఆనాటి కంపెనీ సంస్కరణల ప్రకారం ధార్వాడ కలెక్టర్ థాకరే ఈ దత్తతను గుర్తించలేదు. శివలింగ రుద్రప్ప మరణించిన తరువాత తన ప్రతినిధిని కిత్తూరు రాజ్య పరిపరిపాలకుడిగా నియమించాడు.

అప్పటివరకు మౌనం వహించిన చెన్నమ్మ మౌనం విడనాడారు. తన దత్తత మనవడు శివలింగప్పకు రాజ్యాధికారాన్ని ఇప్పించమని కంపెనీ ప్రభుత్వాన్ని కోరారు. కానీ కంపెనీ పాలకులు ఈ విజ్ఞప్తిని తిరస్కరించారు.

చెన్నమ్మ రాణి వీరనారి చెన్నమ్మగా అవతారమెత్తారు. 1824 అక్టోబరు 21వ తేదీన కోట మీదకు దండెత్తిన కలెక్టర్‌ను ఎదిరించారు. ఈమెకు సాయం చేయడం కోసం సైన్యాధిపతి గురుసిద్ధప్ప పూనుకున్నారు. ఇద్దరూ కలిసి కంపెనీ సైన్యాన్ని ఎదిరించారు. ఈ యుద్ధంలో కలెక్టర్ మరణించడం గొప్ప విశేషం. కంపెనీ అధికారులు చెన్నమ్మకు బందీలయ్యారు. దేశద్రోహులైన వీరప్ప, మల్లప్పలను హతమార్చారు.

చేసేది లేక కంపెనీ అధికారులు చెన్నమ్మతో సంధి చేసుకున్నారు. తమ అధికారులను విడిపించుకున్నారు. అప్పుడు చూపించారు – వారి కుటిల, కుతంత్ర దుష్టనీతిని. సైన్యాన్ని కూడగట్టుకుని కిత్తూరు మీదకి మళ్ళీ దండెత్తారు. ఈసారి సైనిక పద్ధతులను మార్చి కిత్తూరును వశపరుచుకునేందుకు పక్కాగా ప్రణాళికను తయారు చేశారు.

ఆయుధ సంపత్తిని, సైన్యాన్ని సమకూర్చుకుని కిత్తూరు మీదకి దండెత్తారు. మర ఫిరంగులతో కోటగోడలను బ్రద్దలు కొట్టారు. చెన్నమ్మ చాలా వీరోచితంగా పోరాడారు. కాని బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ సైన్యం ధాటికి నిలవలేకపోయారు. కొన్ని రోజుల పోరాటం తరువాత 1824 డిసెంబర్ 5వ తేదీన కోడలితో సహా ఆంగ్ల సైన్యానికి బందీలయ్యారు. వారు ఆమెను 4 సంవత్సరాల పాటు ‘బైలహోంగల్’లో బంధించారు. 4 సంవత్సరాలు బందీగా ఉన్న చెన్నమ్మ 1829 ఫిబ్రవరి 2వ తేదీన స్వర్గస్థులయ్యారు.

ఈ విధంగా బాల్యంలోనే యుద్ధ విద్యలు నేర్చి, కిత్తూరు రాణిగా సేవలందించి, రాణి చెన్నమ్మగా ఆంగ్లేయులను ఎదిరించి పోరాడి గెలిచి – మలి పోరాటంలో ఓడి బందీ అయిన ఈమె దేశభక్తి ఎన్నతగినది.

పురుషులు కూడా బ్రిటీష్‌వారికి లొంగిపోయిన 19వ శతాబ్ది తొలి దశాబ్దాలలోనే/తన సైన్యంతో బ్రిటీష్ కలెక్టర్‌ని హతమార్చిన సైన్యానికి నాయకత్వం వహించడం/ ధీరురాలిగా పోరాటం జరపడం అపురూపం, అసామాన్యం, అద్భుతమైన చారిత్రక విశేషం…

తప్పనిసరియై బందీ కావడం బాధాకరమే అయినా కిత్తూరు రాణి చెన్నమ్మ వీరనారి అనడం అతిశయోక్తి కాదు.

ఈమె జయంతి సందర్భంగా ఈ నివాళి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here