[dropcap]రా[/dropcap]కాసి కరోనా… నువ్వు చైనాలో పుట్టి
ప్రపంచ నిర్మూలనమే ధ్యేయంగా చేసుకొని
స్వైర విహారం చేస్తూ కర్కశ హృదయంతో
మనుష్య జాతిని మింగేస్తూ వికటాట్టహాసంతో
ప్రపంచం యావత్తును తిరిగేస్తున్నావ్
నియంతలా మానవాళిపై పగ బూని
పేద ధనికులన్న తేడాలు లేకుండా
అధికారులనుండి అన్నదాతలవరకూ
కార్మికుడి నుండి వలస కూలీలవరకూ
అందరినీ నీ కబంధ హస్తాల్లో చిక్కించుకొని
ప్రాణాలనెన్నో పొట్టన పెట్టుకొంటున్నావ్
నీదైన శైలిలో అటు తిరిగి ఇటు తిరిగి
నా భరత భూమి మీద కన్ను వేశావు
నీకు దయాదాక్షీణ్యాలన్నవి లేవా?
నువ్వంత కర్కశ హృదయం గలదానవా?
అందుకే….
ఓ మహమ్మారి కరోనా… నిన్ను వదిలే ప్రసక్తే లేదు
మానవ జాతి మనుగడకు అంతం పలకాలంటూ
విష కోరలతో కొరడాను ఝుళిపించి విర్రవీగే రక్కసీ
ఈ పుడమిని చీకటిమయం చేయాలనుకొనే నీకు
ఇదే మా హెచ్చరిక….
నీ క్రూరమైన కోరిక తీరదు నీ పన్నాగాలిక సాగవు
నిన్ను తరిమికొట్టే రోజులు సమీపంలోనే వున్నాయ్
ఈ ప్రపంచ శాస్త్రవేత్తలు నిన్ను ధూళిగా మార్చి
ఆ కడలిలో కలిపే రోజులు దగ్గరలోనే వున్నాయ్
అందుకే…
ఆగిపోయిన జన జీవనాన్ని మళ్ళీ సాఫిగా సాగనీ
రేపటి సూర్యోదయాన్ని మమ్మల్ని స్వేచ్ఛగా చూడనీ
స్వచ్ఛమైన గాలిని పీల్చుకొంటూ ప్రపంచాన్ని చూడనీ
వెళ్ళిపో కరోనా… ఈ ప్రపంచాన్ని వదలి వెంటనే వెళ్ళిపో!