వెళ్ళిపోయావు కదరా!

2
6

[dropcap]అ[/dropcap]దేమిట్రా
అలా చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయావు

అప్పడెప్పుడో అప్పుపెట్టిన గోలీకాయల్ని
అమాంతంగా ఇచ్చేయమని అడుగుతాననా
ఆరు నెలల క్రితం నీవు బాకీపడ్డ సినిమా
ఇప్పుడే చూపించమని బలవంతపెడతాననా

క్షణంకాలం కాలు నిలవనీయకుండా
మాటల పూవులు విసురుతూ
నలువైపులా నవ్వుల జల్లులు కరిపించేవాడివి
అదేమిట్రా…
అలా కట్టెలా కాళ్ళుజాపుకు పడుకుని
మౌనం మందు మస్తుగా మింగేసి
మాతో ఏడుపురాగం పాడిస్తున్నావా

బాధతో కన్నులు చెమ్మగిల్లితేనే
కళ్ళు తుడిచి ఊరడించేవాడివి
ఇపుడింత కఠినంగా మారావేంట్రా
చెంపల జారుతున్న కన్నీళ్ళు చూసికూడా
కదలకుండా కళ్ళుమూసుకుని పడుకున్నావు

ఉప్పుమూటగా చిన్నప్పటి ఆటల్లో
ఉషారుగా మోసిన్నాడు బరువనిపించావుగాని
భుజాలమీద నలుగురం ఇపుడు మోస్తుంటే
భరించలేని బాధని గుండెల్లో దింపేస్తూ
మోయలేనంత బరువు భుజాన మోపేస్తున్నావురా

కలిసి ఆడిన ఆటల్లో కిందపడిన
నీ వంటిమీది దుమ్ము దులిపి,
అంటిన మట్టి అంతా కలిసి తుడిచేస్తుంటే
దర్జాగా నిలబడి వినోదంగా చూసేవాడివి

మరి అదే చేతుల్తో
ఆరడుగుల గోతిలో
అడుగంటా నిన్ను పడుకోబెట్టి
అడుగు అడుగూ మట్టివేసి పూడుస్తూ
అందరం కలిసి నిన్ను మట్టి కలిపేస్తుంటే
ఎక్కడ కూర్చుని, ఏ వినోదం చూస్తున్నావురా
ఎందుకింతటి విషాదం మాకందించావురా

నీతో గడిపిన, కలిసి తిరిగిన
గతం జ్ఞాపకాలన్నీ గమ్మత్తుగా ఉండేవి
గుర్తుకొచ్చినప్పుడల్లా గిలిగింతలు పెట్టేవి
కానీ
‘వెళ్ళిపోయావు’ అనే ఈ జ్ఞాపకం మాత్రం
ఎందుకో నచ్చటంలేదు, అయినా అది
ఎంత వద్దన్నా వెంట ఉంటానంటోంది
విడువకుండా…. మా వెంటుంటానంటోంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here