వెలుగు బాట

0
7

[dropcap]జీ[/dropcap]వితం పెట్టే పరీక్షలు నెగ్గాలంటే.. కేవలం పాఠ్య పుస్తకాలు మాత్రమే చదివితే సరిపోదు.. కొన్ని అనుభావాలు, బాధాకరమైన సంఘటనలు ఎదుర్కోవడం ఎంతో అవసరమని ఇటీవలే తెలిసింది. ఇంతకాలం కాలేజ్ లైఫ్, అమ్మానాన్నలు పంపే డబ్బులతో ఆనందంగా గడిచిన రోజులు ఒక్కసారిగా తారుమారవడం అప్పటి వరకు నేను కన్న కలలు ఒక్కసారిగా కుప్పకూలాయి.

నా చదువు అయిపోవడంతో ఇంటి నుండి ఒంటరిగా బయటకు రావడం జరిగింది. పెద్దవాళ్ళు చేతి ఖర్చులకని ఇచ్చిన రెండు వేల రూపాయలు అయిపోయాయి. అయిపోయి రెండు రోజులవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలలో అప్పుడే నెల రోజులు గడిచిపోయాయి. అప్పటి వరకూ నాతో వున్న స్నేహితులు మెల్లగా దూరం అవసాగారు. నేనేమైనా డబ్బులు అప్పుగా అడుగుతాననుకున్నారేమో !

కాని ఒకరిద్దరు మాత్రం “నీకేమైనా డబ్బులు అవసరమైతే అడగరా. మేమున్నాం నీ వెంట.. డోంట్ వర్రీ!” అంటూ భరోసా నిచ్చారు. ఆ మాత్రం మాట భరోసాకే కళ్ళలో నీళ్ళోచ్చాయి నాకు. కాని వాళ్ళని డబ్బులు అడగకుండా ఎలాగైనా ఏదో ఒక పనిలో వెంటనే చేరిపోవాలనుకున్నాను, కానీ అదే ఎలాగో అర్థం కాలేదు.

హోటల్ లో కూర్చున్నాను. టీ త్రాగి న్యూస్ పేపర్ చదువుతున్నాను. అప్పటికే ఒకటికి రెండుసార్లు ఉద్యోగావకాశాలు కాలం తిరగేశాను. ఫలితం మాత్రం నిరాశాజనకం. డిగ్రీ.. అదీ యాబై శాతం మార్కులతో పాస్ అయిన నా క్వాలిఫికేషన్‌కి సంబంధించిన జాబ్స్ ఏమీ కానరాలేదు.

ఈ సువిశాల, సుందర మహానగరంలో నా భవిష్యత్ ఎలా ఉంటుందో.. తలుచుకుంటుంటే నా కళ్ళ ముందు దిగులు మేఘాలు కమ్ముకున్నాయి. అమ్మ, నాన్న గుర్తొచ్చారు. వాళ్ళ నా అభ్యున్నతిని ఎంతగా ఆశించారో తలుచుకుంటుంటే.. వాళ్ళ కోరికలకి నేను కనీసం ఊహామాత్రంగా నైనా సమీపంగా లేనేమో !

ఈ నెల రోజుల్లో ఒక్క జాబ్‌కి కూడా అవకాశం రాలేదు. ఏవో నా వృథా ప్రయాస తప్ప సాధించిందేమీ లేదు.

* * *

ఓ రోజు హోటల్ లో కూర్చుని పేపర్ చదువుతున్నాను. సమయం గమనించుకో లేదు.. కాని ఓ అరగంట అయివుంటుంది. హోటల్ యజమాని నా దగ్గరకి వచ్చాడు. దాదాపు యాభై ఐదేళ్ల వుంటాయేమో..తెల్లని జుట్టు, చక్కని పంచకట్టుతో వున్నాడు, పసిడి వర్ణంలో వున్న షర్ట్.. బాగా బలంగా, లావుకు తగ్గ ఎత్తుతో వున్నాడు. తమిళియన్..కాని బాగానే తెలుగు మాట్లాడతాడు. నన్ను ఎప్పుడో ఒకటి రెండు సార్లు పలకరించిన జ్ఞాపకం. అదీ కౌంటర్ దగ్గర. నేడు ఇలా నా దగ్గరకు రావడం ఆశ్చర్యం అనిపించింది.

కాలాన్ని వృథా చేయడం ఇష్టముండమేదో.. గల్లా పెట్టెకి లాక్ చేసి తనే స్వయంగా కష్టమర్‌కి వడ్డించడం చాలా సార్లు చూసాను. నాకెప్పుడూ వడ్డించలేదు.. బహుశా నేను కాస్త ఆలస్యమైనా తినే వెళతాననేమో!

“రోజూ చూస్తున్నా.. అలా ఎంతసేపు పేపర్ చదువుతావు? అందులో వుండేవి అంత ముఖ్య విషయాలా?” అడిగాడు. 

నేనేమి మాట్లాడకుండా పేపర్ ఫోల్డ్ చేసి పక్కన పెడుతూ.. ‘నా కష్టాలు ఈ పెద్దాయనకేం తెలుసులే’ అనుకున్నాను. లోపలే సన్నగా నవ్వుకుని ముందుకు కదిలాను.

‘ఈ తమిళాయనకి తెలుగు చదవడం రాదు కదా.. అందుకే నేను ఇంతలా పేపర్ చదవడం ఆయనకు ఆశ్చర్యం కలిగించి వుండవచ్చు’ అనుకున్నాను. నేను ఈ హోటల్‌కి రావడాని‌కి కారణం కేవలం రుచికరమైన ఇడ్లీ, సాంబార్ మాత్రమే కాదు.. ఈ హోటల్‌కి వచ్చే వాళ్ళు కేవలం టిఫిన్ మాత్రమే చేసి పనులకి హడావుడిగా వెళ్ళిపోతుంటారు. పేపర్ చదివే సమయం మాత్రం చాలా తక్కువ మందికి ఉంటుంది.

అదే టీ స్టాల్ దగ్గర టిఫిన్ దొరికినా..పిచ్చాపాటి కోసం,వచ్చే పోయే వాళ్ళని చూడడం కోసం.. న్యూస్ పేపర్ చదవడం కోసం వచ్చే వాళ్ళ వల్ల డిస్ట్రబెన్స్.. అందుకే ఇక్కడికి రావడానికే ఇష్టపడతాను. 

“ఊంకల్ పెయార్ ఎన్న?”

అర్థం కానట్లుగా చూశాను.

తల మీద మెల్లగా చరుచుకుని ..”నీ పేరేంటి?” అడిగాడతను.

“శ్రావణ్” చెప్పాను..ఎందుకన్నట్లుగా చూస్తూ..

“నాన్ తాన వేలై చేస్తవా?”

“అంటే?” అడిగాను నేను .

“అరే యెన్ మకన్( అరే..చిన్నోడా), నా దగ్గర పని చేస్తావా?” వివరంగా అడిగాడు ఈసారి.

“పనేంటి?” అడిగాను.

“అరే పిల్లోడా.. చూస్తే చదువుకున్న వాడిలా ఉన్నావు. నా దగ్గర వున్న మిషన్ నువ్వు టైప్ చేసి బిల్ కస్టమర్‌కి ఇవ్వు నేను డబ్బులు తీసుకుంటాను. దాని వల్ల నాకు నీరం అదే కాలం మిగులుతుంది. అందుకు నీకు పనం(డబ్బులు)ఎంతో కొంత ఇస్తాన్లే. సరేనా?” అడిగాడతను.

అతడి పేరు దయాళన్. హోటల్ ప్రొప్రైటర్ అతడు. ఇదే లాంటి మరో హోటల్ కూడా వుందట అతడికి సిటీలో!

“రెండు రోజులాగి చేరతా” అన్నానేను, కనీసం తిండికి లోటు ఉండదని. ఫ్రెండ్స్ మరో నెల రోజులు డబ్బులు ఇవ్వకుండా రూం లో వుండే అవకాశం ఇచ్చి ఆదుకున్నారు. కాని అత్తెసరు మార్కు లతో డిగ్రీ పూర్తి చేసిన నాకు జాబ్ మాత్రం చూపించలేకపోయారు.

“రెండు రోజులు ఎందుకు అప్ప.. సమయం వేస్ట్.” అంటూ తనకి ఇష్టమైన మురుగన్ ముందు నిలబడి కొద్దిసేపు ప్రార్థన చేసి నా నుదుటిపై ఎర్రని బొట్టు, విభూది పెట్టి సీట్లో కూర్చోబెట్టాడు.

అప్పుడు సమయం ఉదయం ఆరున్నర.. కస్టమర్స్‌తో హోటల్ రష్‌గా వుంది. నేను మిషన్‌ని కళ్ళకద్దుకుని దయాళన్ చెప్పిన సూచనలు పాటిస్తూ బిల్స్ తయారు చేయసాగాను.

దయాళన్ గారు కౌంటర్లో బిజీగా వుంటూనే అప్పుడప్పుడూ లేచి పనివాళ్ళకి పని పురమాయిస్తూ, కష్టమర్స్‌ని అభిమానంగా పలకరిస్తూ సంబరంగా పని చేయసాగాడు.

నేను పనిలో చేరడంతో ఆయనకి కాస్త సమయం వెసులుబాటు అయ్యిందేమో.. కూల్‌గా కూడా కనిపించాడు.

సాంబార్ వాసన మాత్రం ఆయన వేసిన అగరుబత్తీల సుపరిమళాలతో కలిసి ముక్కుపుటాలను తాకుతూ హాయిగా అనిపిస్తుంది.

నేనలా హోటల్ లో చేయడం.. నా కంటే మా మిత్రులకి బాగా కలిసొచ్చింది.

వాళ్ళు సంబరంగా హోటల్‌కి వచ్చి ఇష్టమైన టిఫిన్స్ వేడి వేడిగా తిని నన్ను పలకరిస్తూ వెళ్ళసాగారు.

* * * 

దయాళన్ గారి అబ్బాయి నిక్కు మాత్రం నన్ను చాలా తక్కువగా పలకరిస్తుండేవాడు. అతడు పదోతరగతి దగ్గరలో ఉన్న స్కూల్‌లో చదువుతున్నాడు. వాడు పదవ తరగతి ఫస్ట్ క్లాస్‌లో పాసైన రోజు దయాళన్ గారు మా అందరికి స్పెషల్ గా పాయసం తనే స్వయంగా తయారు చేసి తినిపించాడు. పాయసం సూపర్ టేస్ట్‌గా వుంది. అందరం ఆయన వంట తీరు తెగ మెచ్చుకున్నాం.

నేను ఈ హడావిడిలో పడి ఇంటికి వెళ్ళాలనే సంగతి మర్చిపోయాను. ఈ ఆరు నెలల కాలంలో ఇరవై వేల వరకు దాచుకోగలిగాను. రూంలో దాచుకున్న నా డబ్బులు చూసుకుని సంబరంగా నవ్వుకున్నాను. ఇంటికి వెళ్ళాలనిపించింది.

‘అమ్మ నాన్న వాళ్ళు ఎలా ఉన్నారో! నా ఒక్క గానొక చెల్లి ‘మానస’ రూపం కళ్లముందు కదిలింది. తమ్ముడు ఇంటర్మీడియట్ ఎలా చదువుతున్నాడో’..అనుకున్నాను.

అప్పట్లో ఫోన్ చేయాలంటే కేవలం ల్యాండ్ లైన్‌కే కాల్ చేయాలి. తమ్ముడు ఫస్ట్ ఇయర్ పూర్తి చేసి సెకండ్ ఇయర్‌కి వెళుతున్నాడు. అప్పుడప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్న.. ఏదో వెలితి! ‘ఏదైనా ప్రత్యక్షంగా కలుసుకుని మాట్లాడితే ఆ ఆనందమే వేరప్ప’ అనుకున్నాను.

* * *

‘రేపు వెళ్ళగానే నాలుగు రోజుల సెలవు అడగాలి’ అనుకున్నాను. రాత్రి హాయిగా నిద్ర పట్టింది.

ఉదయం నేను వెళ్ళే సరికి హోటల్ దగ్గర కోలాహలంగా ఉంది. అప్పుడు సమయం సరిగ్గా ఆరు గంటలు.

‘ఏమై వుంటుందా!?’ అనుకున్నాను.

దయాళన్ గారు కంగారుగా కనిపించారు.

అప్పటికే ఆయన హోటల్ అంతా కలియదిరిగినట్లు తెలుస్తుంది. ఏదో వెతుకుతున్నట్లు అనిపించి.. “ఏమైంది సార్?”అడిగాను ఆతృతగా..

“అరే అబ్బీ.. గల్లా పెట్టెలో రాత్రి ఇరవై వేలు పెట్టాను. అవి కనిపించడం లేదు. వేసిన తాళం వేసినట్లే వుంది. డబ్బులు ఏమయ్యాయో అర్థం కావడం లేదు. రోజూ అయితే నాతో డబ్బులు పట్టుకెళ్ళే వాడిని. ఎందుకో రాత్రి ఇక్కడే పెట్టి వెళ్ళాను.” అన్నాడు.

నాకు ఒక్కసారిగా భయం వేసింది. “నువ్వేమైనా తీసావా?” అని అడగడనుకున్నాను.

నేనలా అలోచనలో ఉండగా అదే ప్రశ్న వేశాడు.

“లేదు” అన్నానేను .

“నిక్కు నువ్వు ఇద్దరం కలిసి రాత్రి సినిమాకి వెళ్ళారంటకదా?”

సమాధానం ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఏమైనా నిజమే చెప్పాను.

“అవును” అన్నాను.

“తాళం నా దగ్గర.. లేదంటే నిక్కు దగ్గర మాత్రమే మరో కీ ఉంటుంది.వాడు డబ్బులు తీయలేదంటున్నాడు.” ఈసారి రెట్టించి నట్లుగా అడిగాడు .

ఆ సమాధానం లోనే వుంది ప్రశ్న..”నువ్వు డబ్బులు కాజేశావా?”

మా రూంలో ఉంటున్న మదన్ అదే సమయానికి అక్కడికి వచ్చాడు.

“రాత్రి నీ దగ్గర ఇరవై వేల రూపాయలు వున్నాయని చెప్పావు కదరా? ఒకేసారి నీ వద్ద అంత డబ్బులు ఎలా వచ్చాయి రా?” నా వైపు అనుమానంగా చూస్తూ అడిగాడు.

“అవి నా కష్టార్జితం..” అన్నాను నేను.

ఇంత గొడవ జరుగుతున్నా ఇంట్లో వున్న నిక్కు డాబా పై ఉండి చూస్తున్నాడే కాని.. కిందే వున్న హోటల్ దగ్గరకి వచ్చి.. నాకు సపోర్ట్‌గా మాట్లాడలేదు.

రాత్రి ఇద్దరం కలిసి సెకండ్ షో కి వెళ్లి వచ్చామని మాత్రం ఇంట్లో చెప్పాడట.

జీవితం పెట్టే పరీక్షలు నెగ్గాలంటే.. కేవలం పాఠ్య పుస్తకాలు మాత్రమే చదివితే సరిపోదు.. కొన్ని అనుభవాలు, బాధాకరమైన సంఘటనలు ఎదుర్కోవడం ఎంతో అవసరమని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. అసహనంగా అక్కడి నుండి కదలబోయాను.

“ఏరా?” గట్టిగా గర్జిస్తూ చొక్కా పట్టుకున్నాడు డయాళన్.

“నేనే తప్పు చేయలేదు” విసురుగా చెప్పాను.

మరింత గట్టిగా చొక్కా పట్టుకుని.. ” మరి నీ దగ్గర ఇరవై వేలెలా వచ్చాయి?డబ్బులు కాజేశావు కదా? దొంగ …” అరవంలో బూతులు తిట్టబోతుంటే..

“దయాళన్ సార్ మంచిగా మాట్లాడండి..”

“ఏంట్రా నీతో మంచిగా మాట్లాడేది..” 

డబ్బులు పోయాయన్న కోపం ఓ వైపు..మరొక ప్రక్క మదన్ చెప్పిన మాటలు కలగలిపి.. “పోలీసుల్ని పిలుస్తానుండు ..వాళ్ళే తేలుస్తారు ” అంటూ ల్యాండ్ లైన్ ఫోన్ వైపు నడుస్తుంటే..

ఒంటరిగా నిలబడ్డాను.కళ్ళలో దాగిన కన్నీరు ఏ క్షణమైనా..నన్నెవరైనా పలకరిస్తే కారడానికి.. సిద్ధంగా వున్నాయి.

అప్పుడు జరిగింది అనూహ్యంగా ఓ సంఘటన.

గబగబా పరిగెత్తుకుంటూ వచ్చిన నిక్కు తండ్రి ముందు నిలబడ్డాడు. అప్పుడే ల్యాండ్ లైన్ ఫోన్ ఆగకుండా మ్రోగుతుంది. ఫోన్ ఎత్తాడు దయాళన్. రెండు నిమిషాలు మాట్లాడాడు.

“అప్పా..”అన్నాడు నిక్కు.

కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు దయాళన్. జరుగుతున్నదేంటో నాకు అర్థం కాలేదు. ఊపిరి బిగబట్టి చూస్తున్నాను. పోలీసులు రంగప్రవేశం చేస్తారేమో.. ఎలా సమాధానాలు చెప్పాలో రిహార్సల్ వేసుకుంటున్నాను. ఎదురుగా వున్న మురుగన్ చిత్రం వైపు చూస్తున్నాను.

“అప్ప! తప్పంతా నాదే. రాత్రి నేను,శ్రావణ్ ఇద్దరం కలసి ఇంటికి వచ్చాము. నన్ను ఇంటి దగ్గర దించి శ్రావణ్ తన సైకిల్ పై రూంకి వెళ్ళాడు. మన హోటల్‌లో పని చేస్తున్న రంగయ్య వాళ్ళ అమ్మాయికి నిన్న సాయంత్రం నుండి ఆరోగ్యం బాగోలేదట. పదవ తరగతి చదివిన ఆ అమ్మాయి నా క్లాస్మేట్. ఆ అమ్మాయిని హాస్పిటల్‌లో చేర్చారట. అందుకు ఇరవై వేలు వాళ్ళు వెంటనే కట్టమన్నారు. రాత్రి నేను మన ఇంటికి వచ్చాక మళ్ళీ హాస్పిటల్ కి వెళ్ళి డబ్బులు ఇచ్చి వచ్చాను. నేను చేసింది.. తప్పే. ఇందులో శ్రావణ్ తప్పేమీ లేదు. అసలు ఈ సంగతి అతనికి తెలియదు.” గబగబా చెప్పేస్తున్నాడు అతడు.

దయాళన్ అంటున్నాడు.. “మన రంగయ్య వాళ్ళ అమ్మాయికి ఆపరేషన్ జరిగిందట. ఇప్పుడు వచ్చిన ఫోన్ అదే.. సమయానికి డబ్బులు ఇచ్చి ఆదుకున్నందుకు వేవేల కృతజ్ఞతలు చెప్పాడు. అతడు డబ్బులు నేనే పంపాను అనుకుంటున్నాడు. నిక్కు.. నువ్వు చేసింది మంచి పనేరా! కాని నాకు రాత్రే చెప్పి ఉండాల్సింది. అనవసరంగా శ్రవణ్‌పై నింద మోపాను…..” అంటూ నా దగ్గరకు వచ్చి క్షమించమని వేడుకుంటుంటే.. చిరునవ్వులతో మురుగన్ స్వామి నా వైపే చూస్తున్నాడు …!

* * *

ఆ సంఘటన జరిగిన కొంత కాలం తరువాత.. దయాళన్ వాళ్ల ఫ్యామిలీ తమిళనాడు వెళ్ళిపోయారు. దయాళన్ వాళ్ల అమ్మ ఆరోగ్యం బాగోలేక పోతే.. తను వాళ్ళ వూరైన మధురై వదిలి రాలేనని చేబితే.. కన్నతల్లి కోసం స్వంత పట్టణం తిరుగు ప్రయాణమై వెళ్ళిపోయాడు దాయాళన్ ఫ్యామిలీతో కలసి! ఇదీ శ్రావణ్ అనే నా కథ!

* * *

ఇప్పుడు అదే చోట ‘సురుచి’ పేరుతో హోటల్ నడుస్తుంది.. తన గురువుగారు నేర్పిన మెళుకువలను ఆకళింపు చేసుకున్న శ్రావణ్ ఆ హోటల్‌ని విజయవంతంగా నడిపిస్తూ..మరో నాలుగు బ్రాంచ్‌లు ‘సురుచి వెజ్’ పేరుతో ప్రారంభించి.. ఆర్థికంగా ఉన్నతుడై.. ఎందరికో ఉపాధి కల్పిస్తూ.. చేతనైనంతలో సమాజానికి సేవ చేస్తూ.. ఆదర్శ యువకుడిగా నవతరానికి స్ఫూర్తిగా నిలిచాడు. – రచయిత.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here