యువభారతి వారి ‘వేమన్న వేదం’ – పరిచయం

0
12

[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారా ఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే సంవత్సరం విజయదశమి వరకూ సాగుతుంది.]

వేమన్న వేదం

[dropcap]మ[/dropcap]ట్టిలో పుట్టి మహోన్నత శిఖరాలనందుకున్న మానవతామూర్తి వేమన. సామాన్యులకు సైతం అందుబాటులో ఉన్న వేదం. ఆధునిక వేదం. తెలుగు వేదం. ‘విశ్వదాభిరామ వినుర వేమ..’ అని తనకు తాను చెప్పుకున్నట్లు మకుటంలో ఉన్నా, మనం అందరూ తెలుసుకోవలసిన వేదం. కార్యాచరణకు మార్గనిర్దేశనం చేసిన వేదం. సమాజ శ్రేయస్సు కోరిన వేదం.

లోకంలోని నిత్యసత్యాలను పద్యాల రూపంలో ప్రకటించినవాడు వేమన. వర్ణవ్యవస్థను వ్యతిరేకించిన వాడు, మూఢనమ్మకాలను నిరసించినవాడు, దురాచారాలను ఖండించినవాడు – వేమన. నిజమైన జీవిత తత్త్వాన్ని, ఆధునిక గృహస్థ ధర్మాలను తెలిపినవాడు, జీవిత పరమార్థాన్ని తెలియజేసినవాడు వేమన. వ్యక్తిత్వ వికాస మర్మాలను విదితం చేసి, ఆర్థిక వ్యవస్థలోని మూల సూత్రాలపై ఆకళింపు కలుగజేసి, ఐకమత్యాన్ని ప్రబోధించినవాడు వేమన. ఉన్నతులను, అల్పులను సమీక్షించినవాడు వేమన, నీతిని బోధించి, సద్గుణాలను వ్యక్త పరచినవాడు వేమన.

ఆయన మనుషుల మధ్య తిరుగుతూనే, మానవ జీవిత సత్యాలను నిత్యాన్వేషణశీలంతో దర్శించి, విమర్శించి, మథించి, ఆ అన్వేషణలో అందివచ్చిన అనుభవాలను ఆటవెలదులలో అలవోకగా లోకానికి అందించిన మహనీయుడు.

‘విశ్వదాభిరామ వినురవేమ’ అన్న మకుటంతో ఉన్నా ఆయన పద్యం కనీసం ఒక్కటైనా రాని తెలుగువాడు ఉండడు. భక్తి మాధుర్యానికి పోతన్న వాక్కు, సూక్తి సారళ్యానికి వేమన్న వాక్కు, తెలుగువారి ముఖమందిరాల్లో గౌరవ ప్రతిపత్తులను సంపాదించుకున్నాయి. అందుకే వేమనపద్యాలలో కనీసం ఒక్క పాదం అయినా తన సంభాషణలో ప్రయోగించకుండా, తెలుగువాడు మాట్లాడలేడు.

వేమన్న సూక్తులు వేనకు వేలున్నాయి. అందులోనుండి 40 సూక్తాలను ఎన్నుకున్నారు ఆరుద్ర గారు. వాటిని ఒక సమన్వయ సూత్రాన్ని అనుసరించి, అనుసంధానం చేశారు. వేమన్న సాధనలు, ఆయన వాక్యాలలో వినిపించే సమసమాజ నిర్మాణ ప్రబోధాలు. ప్రబోధాల్లో ప్రతిబింబించవలసిన చిత్త శుద్ధి, ఆచరణలో అలవాటవవలసిన వివేక సిద్ధి, గార్హస్థ్య జీవితంలో కానవచ్చే అనురాగ లబ్ధి, మనిషిలో నిలిచి ఉన్న దేవుడూ, మనసులో నిండియున్న మమత, అనర్హులైన అధికారుల పాలనంలో ప్రజలు పడే పాట్లూ – ఇలా ఎన్నో అంశాలను అందంగా అతికినట్లు వరుసగా వివరించారు.

సజాతీయ భావాలు కలిగిన చాటువులను ఆయా పద్యాల వ్యాఖ్యానాలలో రసార్ద్రంగా ఉటంకిస్తూ సాగిన ఆరుద్రగారి వ్యాఖ్యానం – వేమన తత్త్వానికి ఆయన పట్టిన వాఙ్మ య దర్పణం.

ఈ యువభారతి ప్రచురణ ‘వేమన్న వేదం’ ఐదుసార్లు పునర్ముద్రణకు నోచుకున్నదంటే, తెలుగు ప్రజలు ఈ పుస్తకాన్ని ఎంత ఆదరించారో తెలుస్తుంది.

క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.

https://archive.org/details/vemana-book/page/1/mode/2up

లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here