వేంపల్లి రెడ్డి నాగరాజు నాలుగు మినీ కథలు-12

0
12

వేంపల్లి రెడ్డి నాగరాజు గారు రచించిన వైవిధ్యమైన నాలుగు మినీ కథలను అందిస్తున్నాము.

1. కూలి సొమ్ము

“అయ్యా, మీ ఇంట్లో ఏదైనా పనివుంటే చెప్పండయ్యా, కూలిసొమ్ము నాలుగు నూర్లు ఇప్పిస్తే సాలు, రోజంతా చేస్తాను” ఇంటి ముందు నిలుచుని ఎవరితోనో కాల్‌లో బిజీగా ఉన్న చంద్రశేఖరాన్ని అడిగాడు నలభై ఏళ్ల వయసున్న వ్యక్తి.

“నీకేమైనా తెలివి ఉందా, ఎవరూ ఇళ్లల్లో నుండి అస్సలు బయటకు రావద్దని ప్రభుత్వం పదేపదే నెత్తీ, నోరూ బాదుకొని చెబుతున్నా మళ్లీ పని కావాలంటూ వచ్చావ్” ఆ వ్యక్తిపై కోపంతో చిందులు తొక్కాడు చంద్రశేఖరం నోటి కున్న మాస్కును సరిచేసుకుంటూ.

“మాది పక్కనే ఉన్న పల్లె సామీ, రోజూ కూలీ పనులు చేసుకునేటోన్ని, అదేందో మాయదారి రోగం వస్తోందని నాలుగు రోజుల నుండి పనులు లేవు, ఇంట్లో అంతా పస్తులు ఉండాం, ఈరోజు ఎట్లైనా కూలిసొమ్ము సంపాదించుకోవల్ల” చెప్పాడా వ్యక్తి.

“చెబుతుండేది నీక్కాదూ, ఆ రోగం సోకిందంటే అంతే సంగతులు, త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపో” హెచ్చరిస్తున్నట్లుగా అన్నాడు చంద్రశేఖరం.

“ఈరోజు ‘లెక్క’ సంపాదించుకోకుండా ఇంటికి పోలేను సామీ” దీనంగా అన్నాడా వ్యక్తి.

గవర్నమెంటు మీకు ఇంకో నాలుగు రోజుల్లో ఉచితంగా రేషన్, నగదు ఇస్తుందట కదా” అడిగాడు చంద్రశేఖర్.

“ఈరోజు ‘లెక్క’తో చానా అవసరం సామీ” అన్నాడావ్యక్తి.

“ఎంతగా చెప్పినా మరీ మొండిగా మాట్లాడుతున్నావే, ప్రపంచాన్నే గడగడలాడిస్తోన్న ఆ రోగం పేరు కరోనా, అది వస్తే అస్సలు బతకరు”చెప్పాడు చంద్రశేఖరం కళ్ళెర్ర జేసి కోపంగా.

“నువ్వు చెప్పేది నిజమే దొరా, నా సావు సంగతి పక్కన పెడితే ఈ రోజన్నా కూలి సొమ్ము సంపాదించుకోకపోతే తల్లి పాలు లేక డబ్బాపోతపాల తోనే సాక్కుంటున్న నా నెలల కొడుకు ఆకలికి తట్టుకోలేక బతకడయ్యా” దండం పెడుతూ ఆ వ్యక్తి చెబుతున్న మాటలు ఒక్కటి కూడా వినిపించలేదు విసురుగా ఇంట్లోకి పోతున్న చంద్రశేఖరానికి.

2. ముందుచూపు

“ఎలా జరిగిందండీ? మీ పదవీ విరమణ సన్మాన సభ” రాత్రిపది గంటల సమయంలో రిటైర్మెంట్ ఫంక్షన్ నుండీ ఇంటికి తిరిగివచ్చిన భర్తను అడిగింది తాయారమ్మ.

“చాలా బాగా జరిగింది, కనీసం ఈ రోజైనా నిన్ను వెంటబెట్టుకుని రాలేదెందుకని చాలామంది నిష్ఠూరం చేశారు” చెప్పాడు నారాయణ రావు.

“ఇంతకూ ఏం బహుమతులు ఇచ్చారేమిటి?” భర్తను కుతూహలంగా అడిగింది తాయారమ్మ.

“అన్నీ ఇందులోనే ఉన్నాయి చూడు” చేతిలోని బ్యాగును భార్యకు అందించాడు నారాయణరావు.

“ఇక రేపటి నుంచి ఆఫీసుకి వెళ్ళవలసిన పని లేదు కాబట్టి కాస్తంత ఆలస్యంగా నిద్ర లేచినా ఇబ్బంది లేదు కదా?” అంది తాయారమ్మ.

“మనకు రావాల్సిన గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్ లాంటి వాటి కోసం దరఖాస్తు చేసుకోవడానికి మరో వారం రోజులు వెళ్ళి రావలసి ఉంటుంది” చెప్పాడు నారాయణ రావు.

“బెనిఫిట్స్ అన్నీ కలిపి ఎంత రావచ్చండీ” ఆసక్తిగా అడిగింది తాయారమ్మ భర్తను.

“మనం తీసుకున్న లోన్లు పోనూ ఇరవైలక్షలు రావచ్చనుకుంటున్నా”జవాబిచ్చాడు నారాయణరావు.

“సొమ్ము మొత్తం చేతికి వచ్చాక పిల్లలు ఇద్దరినీ పిలిచి చెరిసగం ఇచ్చేయండి, ఒకరికి తక్కువ మరొకరికి ఎక్కువ కాకుండా” భర్తకు సలహా ఇస్తున్నట్లుగా అంది తాయారమ్మ.

“నువ్వు చెబుతున్నట్లుగా వాళ్లకు ఒక్క పైసా కూడా అస్సలు ఇవ్వను” విషయం చెప్పాడు నారాయణరావు.

“ఎందుకలా?”భర్త సమాధానానికి విస్తుపోతూ అడిగింది తాయారమ్మ.

“ఆ సొమ్ము మన పేరుతోనే బ్యాంకులో ‘ఫిక్స్‌డ్’ చేయాలనుకుంటున్నా, అలా అయితే కనీసం దాని కోసమైనా కాళ్లు చేతులు ఆడని రోజుల్లో పిల్లలు నిన్ను నన్ను చూసుకుంటారని ‘ముందుచూపు’తో” భార్యకు కారణం చెప్పాడు నారాయణరావు, తనకంటే సరిగ్గా ఏడాది ముందు రిటైర్డ్ అయి వచ్చిన బెనిఫిట్స్ అన్నీ పిల్లలకు ముందే పంచేసి, ఆ తరువాత ఎవరూ పట్టించుకోక అనాథగా మారిన తన ఒకప్పటి కొలీగ్ చలపతిరావు కళ్ళముందు మెదులుతుండగా…

3. మిగులుబాటు

“మా చంటిదానికి రెండు రోజుల నుండి జొరం కాస్తాండాదమ్మా, ఆసుపత్రికి పోవల్ల, నూర్రూపాయల ‘లెక్క’ ఇప్పించండమ్మా” పనిమనిషి రంగి ప్రాధేయపడుతున్నట్లుగా అడిగింది సావిత్రమ్మను.

“ఊళ్ళో ధర్మాసుపత్రి ఉంది కదటే” సలహా ఇస్తున్నట్లుగా అంది సావిత్రమ్మ.

“పోయినా అమ్మగారూ, డాక్టర్ లేడు” చెప్పింది రంగి.

“క్రితం వారం కూడా రెండు వందలు తీసుకున్నావు కదే, గుర్తుందో లేదో” అంది సావిత్రమ్మ.

“గుర్తుంది లేమ్మా, నెలాఖరులో నాకు ఇవ్వాల్సిన జీతంలో పట్టుకుందువు గానీ” అంది రంగి.

“అవన్నీ తర్వాత మాట్లాడుకుందాంలే రంగీ, ముందు నీ అవసరం గడవనీ” అంది సావిత్రమ్మ రెండు వందరూపాయల నోట్లను రంగికి అందిస్తూ.

“మీరెంత మంచివారమ్మా” కృతజ్ఞత ధ్వనించింది రంగి గొంతులో.

“సరే గానీ, నీకు గవర్నమెంట్ స్టోర్‌లో ప్రతి నెలా బియ్యం ఇస్తారట కదా”వాకబు చేస్తున్నట్లుగా అంది సావిత్రమ్మ.

“అవునమ్మా, మా కార్డుకు ఇరవై కేజీల బియ్యం ఇస్తారు” జవాబిచ్చింది రంగి.

“ఈసారి నాకు ఓ పది కేజీలు తెచ్చి ఇవ్వవే” చెప్పింది సావిత్రమ్మ.

“అయ్యో, అవి మీరు వండుకునే అంత గొప్పగా ఉండవు అమ్మగారూ” అంది రంగి.

“అన్నం వండుకోవడానికి కాదులేవే, ఇడ్లీలు, దోసెలు వంటి టిఫిన్లు చెయ్యడానికి వాడుకుంటా గానీ, నువ్వేం ఊరికే ఇవ్వకులే, కిలోకు ఓ ఐదు రూపాయల చొప్పున లెక్కకట్టుకో” బజారులో కిలో పాతికకు తక్కువ కాని బియ్యాన్ని కేవలం అతి తక్కువ ధరకే సంపాదిస్తూ వుండగా తనకు ఎంతమాత్రం ‘మిగులుబాటు’ అవుతుందో మనసులోనే లెక్క వేసుకుంటూ అంది సావిత్రమ్మ.

4. భవిష్యత్తు

“అదేంటమ్మా, అలా అంటావు చనిపోయిన వ్యక్తికి దశదిన కర్మకాండలు జరుపకుంటే నలుగురు ఏమనుకుంటారు” రెండు రోజుల క్రితమే మృతి చెందిన భర్తను తలచుకొని కుమిలిపోతున్న సులోచనను అడిగాడు ఆమె బాబాయ్ వెంకట్రామయ్య.

“కర్మకాండలు చేసినంత మాత్రాన పోయిన మనిషి తిరిగి వస్తాడా బాబాయ్?” ఎదురు ప్రశ్న వేసింది సులోచన వెక్కుతూనే.

“రాకున్నా శాస్త్ర ప్రకారం చేయాల్సినవి తప్పదు కదా” ఒప్పిస్తున్నట్లుగా అన్నాడు వెంకట్రామయ్య.

“అయితే మీ సంతృప్తి కోసం ఈసారి ఎవరైనా కాశీకి వెళ్తుంటే పిండ ప్రదానం చేయిస్తాన్లే బాబాయ్, ఉన్న సొమ్ముతో పాటు, అప్పులు చేసి ఆయన కోసం ఆసుపత్రులకు ఖర్చు చేసిన సంగతి మీకూ తెలుసు కదా” తన నిస్సహాయతను వెలిబుచ్చింది సులోచన.

“నీ సమస్య డబ్బు గురించే అయితే ఆ సంగతి మాకు వదిలేయ్ సులోచనా, తలా ఓ చెయ్యి వేస్తాంగానీ” అన్నాడు వెంకట్రామయ్య పెద్దరికంతో.

“దశ దినకర్మ రోజున అయ్యే మొత్తం ఖర్చులో సగం నేను భరిస్తా” చెప్పాడు అక్కడే ఉన్న సులోచనకు మేనమామ వరసైన భూషణం.

“ఆ రోజున భోజనాలకు, పురోహితుడి ఖర్చు నేను ఇస్తా” చెప్పాడు సులోచన పెదనాన్న కొడుకు.

“నా వంతుగా నేనూ ఓ పది వేలు ఇస్తా” అన్నాడు వెంకట్రామయ్య తన వంతు సాయం ప్రకటిస్తూ.

“ఈ కార్యం కోసం మీరు ఎంతో ముందుకు వచ్చినందుకు చాలా సంతోషం బాబాయ్, కానీ నాది కూడా ఓ మాట వింటారా?” అభ్యర్థిస్తున్నట్లుగా అంది సులోచన.

“చెప్పమ్మా, ఏమిటో?” ప్రశ్నించాడు వెంకట్రామయ్య.

“శాస్త్రం, సంప్రదాయాల పేరుతో మీరు చేస్తామంటున్న సాయం మొత్తాన్నీ నాచేతికి ఇస్తే ఇంటి ముందర చిన్న దుకాణం పెట్టుకొని పిల్లలను పోషించుకుంటా బాబాయ్” చెప్పింది సులోచన వాళ్ళు చేయబోయే సహాయంలో తన భవిష్యత్తును వూహించుకుంటూ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here