వేంపల్లి రెడ్డి నాగరాజు నాలుగు మినీ కథలు-15

0
8

[dropcap]వేం[/dropcap]పల్లి రెడ్డి నాగరాజు గారు రచించిన వైవిధ్యమైన నాలుగు మినీ కథలను అందిస్తున్నాము.

1. అవసరం

“నాన్నా, మీతో ఓ చిన్న విషయం గురించి మాట్లాడాలి” అన్నాడు కుమార్ తన తండ్రితో.

“దేని గురించి?” కొడుకును అడిగాడు యాభై ఏళ్ల శివరావు.

“మన పల్లెలో ఓ ఎకరా పొలం కొనాలని చంద్రం మామయ్యతో అన్నారట, నిజమేనా?” అడిగాడు కుమార్.

“ఔను, నిజమే” బదులిచ్చాడు శివరావు.

“పొలం కొనడానికి డబ్బులు ఎక్కడివి?” మళ్లీ అడిగాడు కుమార్ తండ్రిని.

“ప్రావిడెంట్ ఫండ్ లోను పెట్టాలనుకుంటున్నా”చెప్పాడు శివరావు.

“అప్పు చేసి మరీ పొలం కొనడం ఎందుకు నాన్నా?, రిటైరయ్యాక పల్లెకు వెళ్లి వ్యవసాయం చేస్తారా?” ప్రశ్నించాడు కుమార్.

“నేను వ్యవసాయం చెయ్యడం గురించి కాదు, పొలాన్ని ఎవరికైనా కౌలుకు ఇద్దామని” అన్నాడు శివరావు.

“వ్యవసాయం గిట్టుబాటు కాక పల్లెల్లోని చాలామంది రైతులే తమ పొలాలను తెగ నమ్ముకుని పట్నాలకు చేరిపోతున్నారు” అసహనం ధ్వనించింది కుమార్ గొంతులో.

“పల్లెలో మనకంటూ సొంతంగా కొంతైనా జాగా లేకుంటే ఎలా?, రేపు మనం పోయాక కనీసం మనల్ని పూడ్చిపెట్టి ఖననం చేసి ఆ మనిషి జ్ఞాపకంగా సమాధి కట్టించుకునేందుకైనా కొంత స్థలం అవసరమే కదా” అన్నాడు శివరావు రెండేళ్ల క్రితం చనిపోయిన తన భార్యను పూడ్చేందుకు స్థలం లేక, పట్నంలో ఎలక్ట్రిక్ క్రిమేటర్‌కు అప్పజెప్పి, వాళ్ళు ఇచ్చిన గుప్పెడు బూడిద తెచ్చుకోవడం గుర్తుకువచ్చి బాధతో.

2. జవాబు

“పిల్లలూ, ఈవాళ ఆకస్మిక తనిఖీ కోసం మన స్కూలుకు విచ్చేసిన జిల్లా విద్యాశాఖాధికారి గారు, మీరంతా పరీక్షలకు ఎలా తయారయ్యారో తెలుసుకోవాలనుకుంటున్నారు” పదవ తరగతి లోని పిల్లలందరికీ డి.ఇ.ఓ.ను పరిచయం చేస్తూ చెప్పాడు ఓ హైస్కూల్ హెడ్మాస్టర్.

“సరేసార్ అలాగే” పిల్లలంతా ఒకేసారి చెప్పారు ముక్తకంఠంతో.

“బాబూ, నీ పేరేంటి?”ముందువరుసలో కూర్చుని వున్న ఓ విద్యార్థిని ప్రశ్నించాడు డి.ఇ.ఓ.

“రమేష్ సార్” లేచి నిల్చొని వినయంగా బదులిచ్చాడా విద్యార్థి.

“పరీక్షలకు ఎలా ప్రిపేర్ అయ్యావు?” అడిగాడు డీ.ఇ.ఓ.

“చాలా బాగా ప్రిపేర్ అయ్యాను సార్” చెప్పాడా అబ్బాయి.

“ఈ పిరియడ్లో మీకు ఏ పాఠం జరుగుతోంది?” మరో విద్యార్థిని లేపి అడిగాడు డి.ఇ.ఓ.

“సాంఘిక శాస్త్రంలో నదులు వాటి పుట్టుక, అవి ప్రవహించే ప్రాంతాల గురించి రివిజన్ జరుగుతోంది సార్” జవాబిచ్చాడు విద్యార్థి.

“జీవనదులు అంటే ఏమిటో తెలుసా?” ఆ అబ్బాయిని మళ్లీ అడిగాడు డీ.ఇ.ఓ.

“ఎప్పుడూ తడి ఆరకుండా నిరంతరం ప్రవహించే వాటిని జీవనదులు అంటారు సార్” చెప్పాడు విద్యార్థి.

“జీవనదికి ఓ ఉదాహరణ చెప్పగలవా?” చివరి బెంచీలోని విద్యార్థిని అడిగాడు డీ.ఇ.ఓ.

“మా రాయలసీమ ప్రాంతంలోని రైతు కళ్ళు సార్” నాలుగేళ్లుగా సరిగా వర్షాలు కురవక కరువు దెబ్బతో పట్నంలో కూలీగా మారిన ఆ రైతు కొడుకు చెప్పిన జవాబు విని చెంప మీద ఎవరో చెళ్ళున బాదినట్లు అనిపించగా నోటమాట రాక మ్రాన్పడిపోయారు గోదావరి జిల్లాల నుండి ఇటీవలనే బదిలీపై కొత్తగా వచ్చిన జిల్లా విద్యాశాఖ అధికారి.

3. ఆరాటం

“డాక్టర్ గారూ, మీరే ఎలాగైనా మా నాన్నగారిని కాపాడాలి” రాత్రి పది గంటల సమయంలో డెబ్భై ఏళ్ల తన తండ్రికి గుండెపోటు రావడంతో ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ నరేంద్రను అభ్యర్థించాడు సుగుణాకర్.

“రెండు వాల్వులూ పూర్తిగా మూసుకుపోయాయి, వీలైనంత తొందరగా ఆపరేషన్ చేయకుంటే బ్రతకడం చాలా కష్టం” ఓ అరగంట తర్వాత తన ముందున్న టెస్ట్ రిపోర్ట్స్ పరిశీలిస్తూ చెప్పాడు డాక్టర్.

“అలాగే కానివ్వండి సార్, వీలైనంత త్వరగా” తొందరపెడుతూ అన్నాడు సుగుణాకర్.

“ఆపరేషన్‌కు సుమారుగా యాభైవేల వరకూ ఖర్చు కావచ్చు” చెప్పాడు డాక్టర్.

“ఆయన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి సార్, హెల్త్ కార్డు ఉంది” బదులిచ్చాడు సుగుణాకర్.

“సరే అయితే, ఆపరేషన్ రేపు చేసేద్దాం” చెప్పాడు డాక్టర్.

ఓ రెండు రోజుల తర్వాత….

“పెద్దాయనా, నీ ఆపరేషన్ సక్సెస్, నీకు మరో పదేళ్ళ దాకా ఏ సమస్యా ఉండదు” చెప్పాడు డాక్టర్ నరేంద్ర చిరునవ్వు నవ్వుతూ.

“అంతా మీ చేతి చలవ సార్” డాక్టర్ హస్తవాసిని పొగుడుతూ అన్నాడు సుగుణాకర్ .

“ఈ వయసులో కూడా రిస్కు తీసుకొని ఆపరేషన్ చేయించేందుకు సిద్దపడి మీ నాన్నగారిని ఎలాగైనా కాపాడుకోవాలనే నీ ప్రేమ, ఆయనపై నీకు గల ఆరాటమే ఆయన్ను బతికించిందయ్యా” మెచ్చుకోలుగా అన్నాడు డాక్టర్.

“వాడి ప్రేమ, ఆరాటం అంతా రిటైర్డ్ ఉద్యోగిగా ప్రతినెలా నాకు వచ్చే పాతిక వేల రూపాయల పెన్షన్ మీదే తప్ప నామీద ఎంతమాత్రం కాదు సార్” బెడ్ మీద ముసలాయన గొణుగుతున్నట్లుగా అంటున్న మాటలేవీ వినిపించలేదు బయటకు దారితీస్తున్న డాక్టర్‌కు.

4. గురవింద నీతి

“సార్ వ్యాపారం కూడా సరిగా జరగడం లేదు, దయచేసి మరొక్కసారి ఆలోచించండి” దీనంగా బ్రతిమాలాడు షాపువాడు.

“నువ్వు ఎన్ని చెప్పినా నా ‘డ్యూటీ’ విషయంలో నేను ఏమీ చేయలేనయ్యా, నీ మీద కేసు ఖచ్చితంగా రిజిస్టర్ చేయాల్సిందే” హూంకరిస్తూ అన్నాడు లేబర్ ఆఫీసర్ భాస్కర్ రావు.

“ఇది మొదటి తప్పుగా భావించి వదిలేయండి సార్, పిల్లలు గలవాడిని, కోర్టుల చుట్టూ తిరగలేను, వాళ్లు వేసే వేల రూపాయల ఫైన్ కట్టుకోలేను” మరోసారి అభ్యర్థించాడు షాపు వాడు.

“పద్దెనిమిదేళ్లలోపు పిల్లలను పనిలోకి పెట్టుకోవడం చట్టరీత్యా నేరం అనే సంగతి నీకు తెలుసుకదా, స్కూలుకు వెళుతున్న పన్నెండేళ్ళు కూడా నిండని ఈ కుర్రాడిని ఎందుకు పనిలో పెట్టుకున్నావ్, వాడి అందమైన భవిష్యత్తును నాశనం చేసే హక్కు, అధికారం నీకు ఎవరు ఇచ్చారు?” మరోసారి గద్దించి నిలదీశాడు భాస్కర్ రావు.

“షాప్‌కు రెగ్యులర్ వర్కర్‌గా వచ్చే వాళ్ల నాన్నకు నాలుగు రోజుల నుండి జ్వరం సార్, పనిలోకి రాకుంటే ఇల్లు గడవదని కొడుకును పంపించాడు, ఇంకెప్పుడూ ఇలా జరగనివ్వను” భాస్కర్ రావు కాళ్ళావేళ్ళా పడ్డాడు షాపువాడు.

అదే రోజు మధ్యాహ్నం…

“లలితా, బాగా ఆకలిగా వుంది, త్వరగా వడ్డించేయ్” భార్యను కేకేశాడు భాస్కర్ రావు ఇంటికి వస్తూనే.

“ఆరోగ్యం బాగాలేక పనిమనిషి రానందున, వంట ఇంకా పూర్తి కాలేదండీ, మరో గంట సేపు పడుతుంది” భర్తకు చెప్పింది లలిత.

“పనిమనిషి తను రాకున్నా, తన కూతురినైనా పంపి ఉండొచ్చుగా” కోపంగా అన్నాడు భాస్కర్ రావు.

“ఆ అమ్మాయి పదో తరగతి పరీక్షలు రాస్తోందటండీ, రావడం ఎలా కుదురుతుంది?” అంది లలిత.

“కూతురును చదివించి ఉద్యోగాలు చేయించాలటనా, వూళ్ళేలించాలటనా, అవన్నీ మనకెందుకు, రేపటినుండి ఎవరో ఒకరు సక్రమంగా పనిలోకి రాకుంటే పూర్తిగా మానుకోమని చెప్పు, వేరేవాళ్లను మాట్లాడుకుందాం” నిప్పుతొక్కిన కోతిలా అయ్యాడు డ్యూటీ విషయంలో స్ట్రిక్ట్ అని చెప్పుకునే భాస్కర్ రావు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here