వేంపల్లి రెడ్డి నాగరాజు నాలుగు మినీ కథలు-20

0
8

[dropcap]వేం[/dropcap]పల్లి రెడ్డి నాగరాజు గారు రచించిన వైవిధ్యమైన నాలుగు మినీ కథలను అందిస్తున్నాము.

1. మ్యూజియం బొమ్మ

2040 వ సంవత్సరం సెప్టెంబర్ నెల చివరివారం…

“నందూ, క్వార్టర్లీ పరీక్షలు వచ్చే వారం నుండే అన్నావు, ఎలా చదువుతున్నావు? సాయంత్రం స్కూలు నుండీ ఇంటికి వచ్చిన కొడుకును అడిగాడు వెంకట్.

“బాగా ప్రిపేర్ అవుతున్నా నాన్నా” చెప్పాడు నందు.

“పరీక్షలు పూర్తయ్యాక మీ అమ్మమ్మ వాళ్ళ వూరు వెళదాంలే” చెప్పాడు వెంకట్ కొడుక్కి.

“నాన్నా, ఈ దశరా శెలవుల్లో స్కూలు తరపున పిల్లలందరినీ ఓ నాలుగు రోజులు పిక్నిక్ తీసుకెళతారట, నేనూ వెళతా నాన్నా” అభ్యర్థించాడు నందు తండ్రిని.

“నువ్వు ఇదివరకే హైదరాబాద్‌లో అన్నీ చూసేసావుగా, మళ్ళీ వెళ్ళడం ఎందుకు?”అడిగాడు వెంకట్.

“అక్కడి మ్యూజియంలో ఈసారి సరిక్రొత్తగా ఓ ‘స్పెషల్ ఐటం’ పెట్టారట నాన్నా, అదేంటో ముందుగా చెప్పలేదుగానీ ప్రత్యేకంగా దాన్ని చూపించడానికే తీసుకెళుతున్నారట, నన్నూ పంపు” అడిగాడు నందు.

“సరే, అలాగే వెడుదువులే” చెప్పాడు వెంకట్.

సరిగ్గా మూడు వారాల తర్వాత…..

“నందూ, ఎలా జరిగింది నీ పిక్నిక్, ఏదో స్పెషల్ ఐటం చూపించారా? ఇంతకూ ఏంటది?” ఇంటికి వచ్చిన కొడుకును ఆసక్తిగా అడిగాడు వెంకట్.

“ఒంటిమీద చొక్కా లేదు, శరీరం అంతా బురద మట్టి, చిరుగుల పంచె, ఆకాశం వైపు నిరాశగా చూస్తూ బాగా లోతుకు పీక్కుపోయిన కళ్ళు, మాసిన గడ్డం, లొక్కి దవడలు, అడుగంటుకుపోయిన కడుపుతో వున్న మన లాంటి ఓ మనిషి బొమ్మను పెట్టి చుట్టూ ఏవో కొన్ని పాత వస్తువులు పెట్టారు నాన్నా, ఆ బొమ్మ దగ్గర ‘రైతు’ అని బోర్డు పెట్టివుంది, మిగతా ప్రాంతాల నుండీ వచ్చిన వేలాదిమంది పిల్లలంతా కూడా ఆ బొమ్మనే అదే పనిగా విచిత్రంగా చూస్తున్నారు” తండ్రికి చెప్పాడు నందు ఆశ్చర్యంగా కళ్ళింతలు చేసుకుని.

(రోజురోజుకూ దిగజారిపోతున్న రైతు ‘బ్రతుకు’ను చూసి తట్టుకోలేక నిరసనగా…..).

2. తనవంతుగా…

“ఏమండీ, ఎక్కడికో బయలుదేరుతున్నట్లున్నారే?” ఇంట్లో నుండీ బయటకు వెళ్ళబోతున్న భర్తను అడిగింది శోభ.

“మనం నాలుగేళ్ళ క్రితం సిటీకి సరిహద్దులో ఓ ప్లాట్ కొన్నాం గుర్తుందా, అందులో ఓ ఇల్లు కట్టాలనుకుంటున్నా, ఆ పని మీదే సివిల్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్‌తో మాట్లాడడానికి వెళుతున్నా” చెప్పాడు గోపాల్.

“మంచి రేటు వస్తే ఎంతో కొంత లాభం మిగుల్చుకునేలా తిరిగి అమ్మేయడానికే ఆ స్థలాన్ని కొంటున్నట్లు అప్పట్లో చెప్పారు?” అడిగింది శోభ భర్తకు కారు తాళం చెవులు అందిస్తూ.

“అప్పటి ఆలోచన ఇప్పుడు కాస్తంత మారింది శోభా” అన్నాడు గోపాల్ భార్యతో.

“ఇప్పుడు మనం వుంటున్న ఇంటితో కలిపి సిటీలో మనకు మొత్తం మూడు ఇళ్ళు వున్నాయి కదండీ, వున్నది ఒక్కగానొక్క కొడుకు, ఇవన్నీ చాలవా వాడికి?” అడిగింది శోభ.

“ఇంకో ఇల్లు కట్టిస్తే నీ సుపుత్రుడు ఏమైనా వద్దంటాడా?” అన్నాడు గోపాల్ నవ్వుతూ.

“నా ఉద్దేశం అదికాదండీ, ఆ ఇంటికోసం ఖర్చు చేసే మొత్తాన్ని వాడి పేరు తోనే బ్యాంకులో ఫిక్సెడ్ డిపాజిట్ గా వేస్తే సరి, మళ్ళీ ఎంతో కష్టపడి ఇల్లు కట్టించడం ఎందుకు, అనవసర ఖర్చు, అధిక శ్రమ కాకుంటే” అంది శోభ.

“నేను ఇప్పుడు ఇల్లు కట్టించబోతోంది మనవాడికోసమే కాదులే”అన్నాడు గోపాల్.

“మరెవరికోసం?”భర్త వాలకం అర్థం కానట్లు అడిగింది శోభ.

“పొట్టకూటి కోసం వున్న ఊరినీ, కన్న వారిని వదిలేసి పరాయి రాష్ట్రాలకు వలస కూలీలుగా వెళ్ళి ఈ కరోనా మహమ్మారి వల్ల ఎన్నో కష్టనష్టాలకోర్చి తిరిగి సొంత వూళ్ళకు చేరుకున్న ఈ ప్రాంతంలోని పాతికమందికైనా కనీసం ఓ రెండు నెలలు నా వంతుగా ‘పని’ కల్పించడానికి” మనసులోని ఉద్దేశాన్ని వివరిస్తూ బయటకు దారితీశాడు గోపాల్ ఒకప్పుడు వేలమైళ్ళ దూరంలో వుండి రేయింబవళ్ళు తమ కుటుంబం కోసం రెక్కల ముక్కలు చేసుకుని ఎంతగానో శ్రమించిన తన వలసకూలీ తండ్రిని గుర్తు చేసుకుంటూ.

(శ్రేయోభిలాషి ధర్మవరం/కడప రాజేష్ గౌడ్ గారి కోసం).

3. పథకం

“కరెంటొచ్చినట్లుంది, సద్ది తినేసి తోటకు సల్పాగా నీల్లు పారగట్టేసిరాపోరా” ఉదయాన్నే తన ఇంటివద్దకు వచ్చిన పాలేరు ఓబులేశుకు పురమాయించాడు ప్రెసిడెంటు రవీంద్రరెడ్డి.

“చెట్లు వాడిపోలేదులేప్పా, నీల్లు రేపు కడతాగానీ” చెప్పాడు ఓబులేశు.

“రేపు కరెంట్ వస్తుందో రాదో, ఈరోజే పని పూర్తికానీరా ఓబిగా” అన్నాడు రవీంద్రరెడ్డి కొంచెం విసుగ్గా.

“ఈ దినం టౌనుకు పోతాండాప్పా, రోంత ‘లెక్క’ కావల్సింటె వస్తి” అన్నాడు ఓబులేశు గొణిగినట్లుగా.

“చెప్పిండే పని మానేసి టౌనుకు పోవల్ల అంటాండావ్, ఏం పాసిపోతాండాదిరా అంతగా టౌనులో?” చిరాకు ధ్వనించింది రవీంద్రరెడ్డి గొంతులో.

“మా ఆడదాన్ని ఆసుపత్రిలో చూపించల్ల సామీ” బదులిచ్చాడు ఓబులేశు తల గోక్కుంటూ.

“ఏమయ్యిందిరా దానికి, నిన్నగూడా బాగనే వుండెనే?” అడిగాడు రవీంద్రరెడ్డి సిగరెట్ వెలిగించుకుంటూ.

“యాగిటి మనిసి కదప్పా, ఏడోనెల్లో పడిండాది, ఒగతూరి టౌనులో ఆడ డాక్టరుకు చూపిస్తామని” బదులిచ్చాడు ఓబులేశు.

“ఇంతకూ ఎంత కావల్లరా ‘లెక్క’?” అడిగాడు రవీంద్రరెడ్డి.

“ఐదునూర్లు ఇప్పించు సామీ, రగతం పడేదానికి, బలానికి టానిక్కులు రాసిస్తే కొనుక్కోవల్ల గదా” అన్నాడు ఓబులేశు మెల్లగా.

“ఔరా ఓబిగా, నాకు తెలీక అడుగుతా, నీకు ఇప్పుటికే ముగ్గురు పిల్లోల్లుండారు, ఇంకా ఎంతమందిని కంటావురా?” అడిగాడు రవీంద్రరెడ్డి జేబులోనుండీ ఐదువందల నోటు తీసి అందిస్తూ.

“దాని ఓపిక సామీ, నాదేంలేదు” అన్నాడు ఓబులేశు ముసిముసిగా నవ్వుతూ.

“నువ్వేం పెద్ద జరుగుబాటు వున్నోనివికూడా కాదు, ఎట్ల సాకల్లనుకుంటాండావురా ఇంతమందిని కని?” ఎగతాళిగా అన్నాడు రవీంద్రరెడ్డి.

“సర్పంచితో మొదులుబెట్టి ఎమ్మెల్యే ఎలెక్సన్ల దాకా గెలిచేదానికి పోటీలుపడే అన్ని పార్టీలోల్లు మా ఓట్లకోసం దుడ్లు దండిగా కర్చుబెడతా, ఎబ్బుడూ మా మేలే కోరతాన్నెట్లుగా పసిపిల్లోని కాడినుండీ పండుముసిలోని దాకా ఏదో ఒగ ‘పథకం’ పెడతాన్నెట్లుగా చెప్పే మీయట్లా నాయకులు వున్నెంతకాలం మేం ఎంతమందిని కంటేమాత్రం ఏం దిగులు, ఏం భయం సామీ మాకు?” అంటున్న ఓబులేశు ఆ మాటల్ని అమాయకంగా అంటున్నాడో, లేక తనకే చురక పెడుతున్నాడో అర్థం కాలేదు ప్రెసిడెంటు రవీంద్రరెడ్డికి.

4. జరుగుబాటు

“మామా, ఈ మధ్య చాలా నీరసంగా కనిపిస్తున్నావు, ఒంట్లో బాగుండడం లేదా?” దారిలో ఎదురు పడిన ఎనభైఏళ్ళ రంగయ్యను అడిగాడు దూరం బంధువు సుబ్బరాయుడు.

“అదేం లేదురా, బాగానే వున్నానే” కాస్తంత ఆయాసపడుతూ జవాబిచ్చాడు రంగయ్య.

“మనిషి కూడా బాగా తగ్గినట్లున్నావు?”మళ్ళీ అడిగాడు సుబ్బరాయుడు.

“వయస్సు ఎనభై దాటింది, ఎప్పటికీ ఒకేలా ఎలా వుండగలం చెప్పు?”ఎదురు ప్రశ్నించాడు రంగయ్య.

“నువ్వు ఏమీ అనుకోనంటే ఓ చిన్న మాట అడుగుతా మామా, కొడుకూ, కోడలు నిన్ను బాగానే చూసుకుంటున్నారు కదా?” మెల్లగా అడిగాడు సుబ్బరాయుడు.

“ఒరేయ్ సుబ్బడూ, నువ్వు అనవసరంగా పెడార్థాలు తీసి నాదగ్గర తిట్లు తినకు” అన్నాడు రంగయ్య కోపంతో.

“నువ్వు నన్ను తిట్టినా ఫర్వాలేదు మామా, మనిషివి మరీ తగ్గావు, నెత్తిన చెయ్యి పెట్టి నా సాక్షిగా నిజం చెప్పు?”నిలదీసినట్లుగా అడిగాడు సుబ్బరాయుడు.

“ఈమధ్య ఒంట్లో కాస్తంత నీరసంగా వుంటోందిరా, అప్పుడప్పుడూ గుండెల్లో నొప్పి కూడా వస్తొంది” శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ చెప్పాడు రంగయ్య.

“కొడుక్కు ఆ విషయం చెబితే పట్నంలో ఎవరైనా పెద్ద డాక్టరుకు చూపిస్తాడు కదా?” సలహా ఇస్తున్నట్లుగా అన్నాడు సుబ్బరాయుడు.

“నువ్వు అంటున్నట్లుగా మా వాడికి చెబితే వాడు గాభరాపడి ఆసుపత్రివాళ్ళు ఆ పరీక్షలనీ, ఈ పరీక్షలనీ, ఆపరేషన్లు అంటే అనవసరంగా ఇబ్బంది పడడా” అన్నాడు రంగయ్య.

“ఆసుపత్రిలో చేరితే ఖర్చుల కోసం నీ కొడుకు అప్పులపాలు కావాల్సి వస్తుందేమోనని భయపడుతున్నావేమో మామా, ఆ సమస్య లేకుండా నీకు ఆరోగ్యశ్రీ కార్డు వుంది గదా, ఇంక దిగులెందుకూ?” అడిగాడు సుబ్బరాయుడు.

“ఖర్చు, అప్పు, గురించి కాదురా సుబ్బా, నేను ఆసుపత్రిలో చేరితే మావాడు నాకోసం తోడుగా కొన్నాళ్ళయినా అక్కడే వుండిపోవాలి కదా, మొగుడూ,పెళ్ళాలు ఇద్దరూ రోజూ కూలికి వెళితేగానీ జరుగుబాటుకాని పేద కుటుంబాలు మనవి.

నేను ఇంకో పదేళ్ళు బ్రతికినా, ఇప్పుడే పోయినా పెద్ద తేడా ఏంలేదు, కూటికోసం కూలికిపొయ్యి రెక్కాడిస్తే గానీ డొక్కాడని వాడిని అనవసరంగా అవస్థలపాలు చేయడం ఎందుకు?” చెప్పాడు రంగయ్య ఇంటివైపు మెల్లగా దారితీస్తూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here