వేంపల్లి రెడ్డి నాగరాజు నాలుగు మినీ కథలు-21

0
9

[dropcap]వేం[/dropcap]పల్లి రెడ్డి నాగరాజు గారు రచించిన వైవిధ్యమైన నాలుగు మినీ కథలను అందిస్తున్నాము.

1. ఉపవాసం

“శారదా, అమ్మ కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళింది?” రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఇంటికి రాగానే భార్యను అడిగాడు రంగనాథ్.

“పూజ గదిలో వుందండీ” భర్తకు బదులిచ్చింది శారద.

“ఈ సమయంలోనా?”అడిగాడు రంగనాథ్.

“ఇవాళ గురువారం కదండీ, ఈ రోజు నుండీ ఓ నలభై రోజులపాటు బాబావారి సచ్చరిత్ర పారాయణం చేసుకుంటుందట”చెప్పింది శారద.

“తను భోజనం చెసిందా?”మళ్ళీ ప్రశ్నించాడు రంగనాథ్ భార్యను.

“ఈ రోజునుండీ పారాయణం పూర్తయ్యేదాకా రాత్రివేళల్లో తనకోసం వండవద్దని సాయంత్రమే చెప్పిందండీ” భర్తకు బదులిచ్చింది శారద.

“ఈ వయసులో ఇలా ఉపవాసాలు వుండడం అవసరమా?” తల్లి తీరుపై కాస్తంత చిరాగ్గా అన్నాడు రంగనాథ్.

మరుసటి రోజున, ఉదయంవేళ పార్వతమ్మ పూజకోసం పూలు కోసుకుంటుండగా…

“పార్వతమ్మా, నిన్న రాత్రినుండీ ఉపవాసాలు వుంటూ బాబా పారాయణం మొదలుపెట్టావటనే? మీ కోడలు చెప్పింది” అడిగింది ప్రక్కింటి సుభద్రమ్మ.

“నిజమే సుభద్రా” సమాధానమిచ్చింది పార్వతమ్మ.

“నిన్ను సుమారుగా నలభై ఏళ్లుగా చూస్తున్నా, పూజల విషయంలో నీ స్వభావం బాగా తెలిసినదాన్ని, గత కొంతకాలంగా మందులు, మాత్రలు వాడుతున్న జబ్బు మనిషివి, రాత్రుళ్ళు ఏమీ తినకుంటే ఎలా? ఉపవాసాలు వుండి పారాయణం చేయడం ఈ వయస్సులో నీకు నిజంగా అవసరమా?” ప్రశ్నించింది సుభద్రమ్మ.

“నువ్వు మళ్ళీ ఎవరితో అనవనే నమ్మకంతో చెబుతున్నా సుభద్రా, ఈ కరోనా మహమ్మారి వచ్చాక లాక్‌డౌన్ వల్ల మావాడు వెళ్ళే ఫ్యాక్టరీ పనిచేయక మూసేసి జీతాలు రావడంలేదు, ఖర్చులు మాత్రం అలాగే వున్నాయి, అందుకనే కనీసం ఓ పూటయినా ఉపవాసం వుండి వాడికి నావంతుగా కాస్తంత బరువు తగ్గిద్దామని” గొంతు బాగా తగ్గించి బదులిచ్చింది పార్వతమ్మ కోసిన పూలన్నీ గిన్నెలోకి వేస్తూ.

2. పట్టుపరికిణి

“అమ్మా, ఈసారైనా నా పుట్టినరోజుకు పట్టు పరికిణీ తీసిస్తావా, లేదా?” సాయంత్రం స్కూలు నుండి ఇంటికి రాగా అడిగింది తొమ్మిదో తరగతి చదివే కుమారి తన తల్లిని.

“తప్పకుండానమ్మా” బదులిచ్చింది రత్నమ్మ తన కూతురికి.

“మూడేళ్ళుగా అడిగిన ప్రతిసారీ ఇలాగే చెబుతూనే వున్నావు తప్ప కొనడమే లేదు, మళ్ళీ వాయిదా వేస్తే మాత్రం వూరుకునేది లేదు, స్కూలుకు వెళ్ళడం మానేస్తా, పుట్టినరోజు మరోవారమే వుంది ఆపై నీ ఇష్టం” తల్లిని బెదిరిస్తున్నట్లుగా అంది కుమారి.

“నీకు పట్టుపరికిణీ కుట్టించేందుకు అవసరమైన బట్ట కూడా సిద్దంగా వుందిలే” చెప్పింది రత్నమ్మ.

“నిజంగానా, ఎలా?” అడిగింది కుమారి నమ్మలేనట్లుగా చూస్తూ.

“నేను పనిచేస్తున్న శాంతమ్మగారి దగ్గర తీసుకునే నెలజీతంలో సుమారు ఏడాదిగా ప్రతినెలా ఆవిడవద్దనే ఓ రెండువందలదాకా దాచిపెట్టా, షాపుకువెళ్ళి ఆవిడనే బట్ట కొనుక్కురమ్మని చెబితే మొన్న సాయంత్రమే తీసుకొచ్చింది, రేపు నువ్వూ నాతోపాటుగా రా, పనులన్నీ అయ్యాక అటే వెళ్ళి టైలర్ దగ్గర కొలతలు ఇచ్చివద్దాం”అంది రత్నమ్మ.

తల్లి మాటలతో ఆరోజు రాత్రంతా కంటిమీద కునుకే పట్టలేదు కుమారికి.

***

మరుసటిరోజు ఉదయం…

“రత్నా, నువ్వు ఇంటి పనులు చేయడానికి వెళ్ళే శాంతమ్మగారు ఈ తెల్లవారుజామున గుండెపోటుతో పోయారట” దారిలో ఖాళీ పాలక్యాన్లతో ఎదురైన తన ప్రక్కింటి సుబ్బమ్మ చెప్పింది కూతురితో పాటుగా వాడ నుండీ పట్నంవైపు వెళుతున్న రత్నమ్మతో.

సరిగ్గా పదినిముషాల తరువాత…

“అమ్మా, అదే కదా, నాకు పరికిణీ కుట్టించేందుకు కొనుక్కొచ్చిన కొత్త పట్టుబట్ట?” అందరి ఏడుపులు, పెడబొబ్బల మధ్య తన అనందం పూర్తిగా ఆవిరి అవుతుండగా మెల్లగా తల్లిని అడిగింది కుమారి శాంతమ్మ శవం కింద పరిచివున్న అందంగా మెరుస్తోన్న పూలడిజైన్ వున్న బట్టను చూపిస్తూ…

3. ఆకలి

“శ్యామలా, టిఫిన్ రెడీ అయివుంటే పెట్టెయ్, ఆఫీసుకు త్వరగా బయలుదేరివెళ్ళాలి” ఉదయం తొమ్మిది గంటలవేళ భార్యను తొందర చేశాడు ప్రసాద్.

“టిఫిన్ రెడీ కావడానికి కాస్తంత ఆలస్యమవుతుందండీ” చెప్పింది శ్యామల.

“అలా అయితే రాత్రి మిగిలిన అన్నం వుంటే తీసుకురా, పెరుగు, ఊరగాయతో కలుపుకుని తినేస్తా” అన్నాడు ప్రసాద్.

“వేరే పని మీద వున్నా, అన్నంగిన్నె ఫ్రిజ్‌లో వుంది, ఏమనుకోకుండా మీరే తీసుకోండి” అంది శ్యామల భర్తతో.

“అన్నంగిన్నె ఫ్రిజ్‌లో లేదే”అన్నాడు ప్రసాద్ అక్కడ వెదికిచూసి.

“అయ్యో, నా మతి మండా, రాత్రి మనం తినగా మిగిలిన అన్నం గిన్నెను ఫ్రిజ్‌లో పెట్టడం మరచి బయటే పెట్టేసినట్లున్నానండీ, వంటింట్లోనే షెల్ఫ్‌లో వుంటుంది చూడండి” చెప్పింది శ్యామల.

“ఈ అన్నం మరీ పనికిరాకుండా పూర్తిగా పాచిపోయి పాడయిపోయింది, బాగా వాసన వేస్తోంది, బయట పడెయ్, ఈ పూటకు హోటల్లో తినేస్తాలే” భార్యకు చెప్పి హడావుడిగా ఆఫీసుకు వెళ్ళిపోయాడు ప్రసాద్.

సరిగ్గా ఓ అరగంట తర్వాత….

“ఏమయ్యా, రాత్రి మిగిలిన అన్నంవుంటే పెట్టమంటున్నావు, బాగానేవుంది గానీ, ప్రహరీ లోపల వున్న మొక్కలకు పాదులుతీసి నీళ్ళు తడుపుతావా?” అడిగింది శ్యామల తన ఇంటిముందుకు వచ్చిన ఓ డెబ్భైఏళ్ళ పెద్దాయనను.

“సరేనమ్మా, అలాగే” అంటూ ఒప్పుకున్న పెద్దాయన ఓ గంటలో పని ముగించాడు.

“పెద్దాయనా, పని బాగానే చేశావుగానీ, పాడయిపోయిన అన్నాన్ని పెట్టినా ఏం మాట్లాడకుండా తినేశావే” అంది శ్యామల ఆ పనికోసం ఖర్చు చేయాల్సిన కూలిసొమ్ము ఎంత మిగిలిందో మనసులోనే లెక్కవేసుకుంటూ అతడికి త్రాగడానికి దోసిట్లోకి నీళ్ళుపోస్తూ.

“మామూలుగా అయితే బాగా పాచిపోయి కంపుకొడుతున్న ఆ అన్నం తినడానికి కుక్కలు కూడా ఇష్టపడవమ్మా, కానీ నేను తిండి తిని రెండు రోజులయ్యింది, ఆకలి రుచి ఎరుగదుకదా, అందుకే తట్టుకోలేక ఎలావున్నా తినగలిగా” సమాధానమిచ్చాడు పెద్దాయన తనదారిన బయలుదేరుతూ…

4. గిఫ్ట్

“సుగుణా, ఇలారా”సాయంత్రం ఆఫీసు నుండీ రాగానే గుమ్మంలోనుండీనే భార్యను బిగ్గరగా కేకవేశాడు రమణరావు.

“ఇంట్లోకి రాకుండానే ఎందుకండీ అంతలా గావుకేకలు పెడుతున్నారు?” అడిగింది సుగుణ భర్త ఎందుకనో చిరాగ్గా వున్నాడని గ్రహించి.

“ఈ వెధవ ఈమధ్యకాలంలో చేస్తున్న పనులవల్ల బయట తలెత్తుకోలేకపోతున్నాను, ఇంతకీ ఎక్కడికి చచ్చాడు?” పట్టరానికోపంతో రొప్పుతూ అడిగాడు రమణరావు.

“ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడుగానీ ఇంతకీ ఏం చేశాడో చెబితేగదా తెలిసేది?” అడిగింది సుగుణ.

“ఆ మధ్యన నా దగ్గర డబ్బు లేదన్నా అలిగి మొండికేసి అప్పు చేయించి వాచీ కొనిపించుకున్నాడా, వారం రోజులక్రితం దాన్ని ఏకంగా నాలుగువేల రూపాయలకు కుదువ పెట్టాడట, పైగా మా ఆఫీసులోనే పనిచేసే నా ప్రక్కసీటు కొలీగ్ చంద్రం బావమరిది వద్దే కుదువ పెట్టాడట, అతడి ముందు నాకు ఎంత నామర్దా?” ఆవేశంతో వూగిపోతూ అన్నాడు రమణరావు.

***

“రవీ, నిన్నొక సంగతి అడుగుతా, నిజం చెప్పు, నెలరోజుల క్రితం మొండికేసి మరీ నాన్న చేత కొనిపించుకున్న వాచీని కుదువ పెట్టావట, ఎందుకోసం?” భర్త నిద్రపోయాక రాత్రి చాలా ఆలశ్యంగా ఇంటికొచ్చిన కొడుకును అడిగింది సుగుణ.

“అక్కయ్య ప్రతి పుట్టినరోజుకూ క్రొత్త డ్రెస్ కొనిచ్చే నాన్న ఈసారి మాత్రం తన ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమించి పెళ్ళిచేసుకుందని కోపంతో ఇంట్లోకి రానియ్యలేదుగా, అక్కయ్య ఈసారి బర్త్ డేకి కూడా ఆ లోటు ఫీలవ్వకుండా నాన్న బదులు తమ్ముడిగా కొత్త చీర గిఫ్ట్‌గా ప్రెజెంట్ చేసేందుకు అవసరమైన డబ్బు కోసమే వాచీ కుదువపెట్టానమ్మా, ఎంతైనా తను ఈ ఇంటి ఆడబిడ్డ కదా” కొడుకు చెబుతున్న కారణం విని ఏం మాట్లాడాలో అర్థం కాలేదు సుగుణకు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here