వేంపల్లి రెడ్డి నాగరాజు నాలుగు మినీ కథలు-24

0
4

[dropcap]వేం[/dropcap]పల్లి రెడ్డి నాగరాజు గారు రచించిన వైవిధ్యమైన నాలుగు మినీ కథలను అందిస్తున్నాము.

1. జ్ఞాన తృష్ణ

28.అక్టోబరు.1991

ఉదయం ఎనిమిది గంటల వేళ…

“నమస్కారం సార్, బాగున్నారా?”మార్కెట్‌కు వెళ్ళే దారిలో ఎదురుపడిన అరవై నాలుగేళ్ళ రిటైర్డ్ ప్రొఫెసర్ కోదండపాణిని విష్ చేసి పలకరించాడు మదన్.

“బాగున్నానయ్యా” జవాబిచ్చాడాయన.

“ఆరోగ్యం బాగుంది కదా సార్, అమ్మగారు, మీ పిల్లలు ఎలా వున్నారు, ఏం చేస్తున్నారు?” అడిగాడు మదన్.

“భగవంతుడి దయవల్ల అందరూ క్షేమమే, పెద్దమ్మాయి తన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ భర్తతో పాటు అమెరికాలో వుంటోంది, రెండో అమ్మాయి తన భర్తతోపాటు చిత్తూరులో బ్యాంక్ ఉద్యోగిగా వుంటోంది” చెప్పాడు కోదండపాణి.

“చాలా సంతోషం సార్, కనీసం ఐదారేళ్ళ తర్వాతైనా మిమ్మల్ని ఇలా చూసి పలకరించినందుకు” నవ్వుతూ అన్నాడు మదన్.

“వయసు పైబడడం వల్ల నువ్వెవరో గుర్తించలేకున్నానయ్యా, ఏమనుకోకు, ఇంతకీ నువ్వెవరో చెప్పనేలేదు?” అడిగాడాయన కళ్ళద్దాలు సవరించుకుంటూ.

“మీరు యూనివర్శిటీలో సర్వీసులో వుండగా ఆరేళ్ళక్రితం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసాను సార్, అప్పట్లో మీరు పొలిటికల్ సైన్స్ పాఠాలు చెప్పేవారు, మీ టీచింగ్ చాలా బాగా అర్థమయ్యేది” చెప్పాడు మదన్.

“ఇంతకీ ఇప్పుడేం చేస్తున్నావు?” తన ఒకప్పటి శిష్యుడిని అడిగాడు కోదండపాణి.

“గత రెండేళ్ళుగా అక్కడే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నా సార్, అంతకు మునుపు రెండేళ్ళ పాటు హిస్టరీలో కూడా పి.జి. చేసా” సమాధానమిచ్చాడు మదన్.

“నిన్ను చూస్తే చాలా ముచ్చటేస్తోంది మదన్, బోటాబోటీ చదువులు చదివిన చాలామందిలా ఉద్యోగాలు అంటూ వెంపర్లాడక ‘జ్ఞాన సముపార్జనే’ ధ్యేయంగా చదువు కొనసాగిస్తున్న నువ్వు నా శిష్యుడివైనందుకు చాలా గర్వంగా కూడా వుంది” తబ్బిబ్బయి చాతీ వెడల్పు అవుతుండగా అన్నాడు పాణి.

“అయ్యో, మీరు అనుకుంటున్నట్లుగా అదేం కాదు సార్, ప్రయత్నించిన ప్రతి ఉద్యోగానికీ ఉత్తర, దక్షిణాలు సర్దుబాటు చేయడం నావల్ల కాక, స్వంతంగా వ్యాపారం చేయాలంటే పెట్టుబడి కోసం చిల్లిగవ్వ కూడా లేక కొందరు మిత్రుల ‘సహకారం’ వల్ల యూనివర్శిటీ హాస్టల్‌లో వుండి మూడుపూటలా ఆకలి వేసే ప్రశ్నలకు ‘జ్ఞాన తృష్ణ’తో సమాధానం చెప్పుకుంటున్నా” చెప్పాడు సగటు నిరుద్యోగి మదన్ లోగొంతుకతో…

2. మ్రొక్కు

“జగన్నాధం, బాగున్నావా?”సాయంత్రం ఆరుగంటల వేళ భార్యతో కలిసి దారిలో ఎదురైన మిత్రుడిని పలకరించాడు చంద్రశేఖర్.

“బాగున్నా, నువ్వెలా వున్నావు?”తనూ అడిగాడు జగన్నాధం.

“మీ ఆవిడతో పాటుగా ఎక్కడికో వెళ్ళి వస్తున్నట్లున్నావే?” కుశలప్రశ్నల అనంతరం ప్రశ్నించాడు చంద్రశేఖర్.

“తను గుడికి వెళ్ళి దేవుడికి అర్చన చేయించాలని అడిగితే వెళ్ళి వస్తున్నాం” చెప్పాడు జగన్నాధం.

“ఈ రోజు నీ పుట్టిన రోజా, లేక మీ పెళ్ళి రోజా, ఏమిటి విశేషం?” నవ్వుతూ అడిగాడు చంద్రశేఖర్.

“ఇదిగోండి అన్నయ్యా, ఈ ప్రసాదం తీసుకోండి” అంటూ జగన్నాధం భార్య మాలతి చంద్రం చేతిలో ఓ చిన్న కొబ్బరిముక్క పెట్టింది.

“ఏంటి జగన్, విషయం ఏమిటో చెప్పనేలేదు?” మరోసారి అడిగాడు చంద్రశేఖర్ చెప్పమన్నట్లుగా.

“మరేం లేదోయ్, ఈవిడగారు మా ప్రక్కింటావిడ గురించి అభిషేకం చేయిస్తానని మ్రొక్కుకుందట, అంతే” చెప్పాడు జగన్నాధం.

“రెండువారాల క్రితం వరకూ నేనూ మీ వీధిలోనే వుండేవాడిని కదా, నాలుగేళ్ళుగా వీళ్ళిద్దరూ ఉప్పు నిప్పుల్లా వుండేవారు, ఇద్దరిమధ్యా పచ్చగడ్డి వేసినా భగ్గుమనేది, అలాంటిది ఇప్పుడు ఈవిడ ఆమెకోసం అదేపనిగా అర్చన చేయించిందంటే” నమ్మలేనట్లుగా అన్నాడు చంద్రశేఖర్ ఆశ్చర్యంగా చూస్తూ.

“నువ్వు అనుకుంటున్నట్లుగా వీళ్ళిద్దరూ మళ్ళీ ఏం కలిసిపోలేదులే చంద్రం, మా ప్రక్కింటావిడ వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళి పదిరోజుల క్రితం తిరిగి వచ్చినప్పటినుండీ బాగా దగ్గుతూ, కాస్తంత జ్వరంతో బాధపడుతూ వుంటే మొన్ననే అధికారులు అనుమానం మీద క్వారంటైన్ సెంటర్‌కు తీసుకువెళ్ళారు, వాళ్ళ అబ్బాయి మా వాడితో కలిసి ఈమధ్య చాలాసార్లు ఆడుకున్నాడట, ఇప్పుడు ఆవిడకు పరీక్షలో పాజిటివ్ వస్తుందేమోనని హడలిపోతూ, నెగటివ్ రావాలని కోరుకుంటోంది” చెప్పాడు జగన్నాధం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా క్రిమి ఓ వ్యక్తి తను ఎప్పుడూ ద్వేషించే బద్దశత్రువు క్షేమాన్ని కూడా ఎలా కోరుకునేలా చేస్తోందో వివరిస్తూ…

3. అవసరం

“నమస్కారం సార్, నా పేరు కృష్ణమూర్తి, మీతో ఓ చిన్న పనిబడి వచ్చా” చెప్పాడు ‘శ్రీనివాసా రియల్ ఎస్టేట్స్ అండ్ బ్రోకరేజి’ ఆఫీసులోకి అడుగు పెట్టిన ఓ అరభైఏళ్ళ పెద్దాయన.

“చెప్పండి సార్, ఏం కావాలో?” పెద్దాయనను ప్రశ్నించాడు ఆ ఆఫీసు ఎం.డి.శ్రీనివాస్.

“ఈ సిటీకి తూర్పుదిక్కున సరిగ్గా పది కిలోమీటర్ల దూరంలో కుడివైపున వున్న ఎకరం స్థలంలో క్రొత్తగా ఎవరో వెంచర్ వేస్తున్నారండీ, ఆ స్థలం నేను కొనాలనుకుంటున్నాను, దాని ఓనర్‌తో మీరు మాట్లాడితే..” చెప్పడం ఆపాడు పెద్దాయన.

“కృష్ణమూర్తిగారూ, ఇంతకీ మీరు ఏం చేస్తారు? ఆ వెంచర్‌లో ఎన్ని ప్లాట్లు కొనాలనుకుంటునారు?” అడిగాడు ఎం.డి.

“నేను పాతికేళ్ళు అమెరికాలో సైంటిస్ట్‌గా పనిచేసి ఇక్కడే సెటిల్ కావాలని ఈ మధ్యనే వచ్చేసానండీ” జవాబిచ్చాడు పెద్దాయన.

“ఆ స్థలం మొత్తం కావాలంటున్నారు, మీరు మళ్ళీ మారు బేరానికి వ్యాపారం చేయాలనుకుంటున్నారా?” అడిగాడు ఎం.డి.

“వ్యాపారం కోసం కాదండీ, అందులోని ఓ ఐదు సెంట్ల స్థలంలో చిన్న ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను” చెప్పాడు పెద్దాయన.

“ఆ స్థలం మొత్తం సుమారు కోటి రూపాయలకు పైనే కావచ్చు, అయినా అందులోని ఓ నాలుగు ప్లాట్ల ఖరీదు ఖర్చు చేస్తే సిటీ మధ్యలోనే అన్ని సౌకర్యాలున్న ఓ మంచి రెడీమేడ్ ఇల్లే వస్తుంది కదా?” అడిగాడు ఎం.డి.

“ఖరీదు ఎంతయినా ఫర్వాలేదు సార్, వేరేచోట ఎక్కడా వద్దు, ఇల్లు అక్కడే కట్టాలనుకుంటున్నా” చెప్పాడు పెద్దాయన.

“ఊరికి దూరంగా, ప్రశాంతంగా వుంటుందనా?” అడిగాడు ఎం.డి.

“కాదండీ, కాలేజీ చదివే రోజుల్లో ఎంతో గాఢంగా ప్రేమించి, పెద్దలను ఎదిరించి నేను పెళ్లి చేసుకున్న నా శ్రీమతి పెళ్ళయిన ఏడాదిన్నరలోపే ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఆ స్థలంలోనే ఖననం చేసా, నా దురదృష్టం కొద్దీ ఆమెతో కలిసి ఎలాగూ సంసారం చేయలేకపోయా, కనీసం చివరి రోజుల్లోనయినా రోజూ ఆవిడ సమాధిని చూస్తూ నేనూ అక్కడి మట్టిలోనే కలిసిపోవాలనేది నా కోరిక, కానీ నా ఖర్మ కొద్దీ నిన్న మొన్నటివరకు శ్మశానవాటికగా వున్న ఆ స్థలాన్ని ఓ నాయకుడి అండతో ఎవరో కబ్జా చేస్తే ఎంత ఖర్చు చేసయినా కొనక తప్పదు కదా?” కళ్ళు నీటి చెలమలవుతుండగా తప్పనిసరయిన తన అవసరాన్ని గురించి చెప్పాడు పెద్దాయన.

4. సంతృప్తి

“శంకరయ్య గారూ, ఎలా వున్నారు, ఈమధ్య బొత్తిగా కనిపించడమే లేదు” పబ్లిక్ లైబ్రరీ వద్ద కనిపించిన ఒకప్పటి కొలీగ్ టీచర్‌ను పలకరించాడు రామకృష్ణ.

“బాగున్నానండీ, మీరెలా వున్నారు?” తనూ అడిగాడు శంకరయ్య.

“మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ వచ్చేశాయా? ఇంతకీ పెన్షన్ ఎంత వస్తోందండీ?” మరో ప్రశ్న వేసాడు రామకృష్ణ.

“వచ్చేశాయండీ, నలభై మూడు వేలదాకా వస్తోంది” అన్నాడు శంకరయ్య వాచీలో టైం చూసుకుంటూ.

“అలా వెళ్ళి కాఫీ త్రాగివద్దాం రండి” ఆహ్వానించాడు రామకృష్ణ.

“సారీ రామకృష్ణ గారూ, ఇప్పుడు సమయం లేదు, క్లాస్‌కు వెళ్ళాలి, మరోసారి తప్పకుండా త్రాగుదాం” అన్నాడు శంకరయ్య.

“క్లాస్ అంటున్నారు, ఇప్పుడు మళ్ళీ ఎక్కడైనా పని చేస్తున్నారా?” అడిగాడు రామకృష్ణ.

“అవునండీ, రాజు కాలేజిలో ఇంటర్మీడియెట్ పిల్లలకు ఉదయం, సాయంత్రం ఓ రెండు పీరియడ్లు చెబుతున్నా” సమాధానమిచ్చాడు శంకరయ్య.

“గవర్నమెంట్‌లో క్షణం తీరిక లేకుండా ముప్పై ఏళ్ళకు పైగానే సర్వీసు చేశారు, పెన్షన్ కూడా బాగా వస్తోంది, రిటైరయ్యాక హాయిగా విశ్రాంతి తీసుకోక ఎందుకండీ అనవసర శ్రమ” అన్నాడు రామకృష్ణ.

“మీరు అనుకుంటున్నట్లుగా నేను ఇప్పుడు పనిచేయడం డబ్బుకోసం మాత్రం కాదండీ, ఒంట్లో ఓపిక, శక్తి వున్నాయి, ఖాళీగా కూర్చునేకంటే మనకు తెలిసిన విద్య పదిమందికీ ఉపయోగపడితే మంచిదేకదా అని” చెప్పాడు శంకరయ్య.

“మరయితే డబ్బు తీసుకోవడం” సగంలో ఆపాడు రామకృష్ణ.

“కాలేజి వాళ్ళు ఇచ్చే పాతికవేల మొత్తంలో సగం ఓ చిన్నపిల్లల అనాథాశ్రమానికీ, మరో సగం ఓ వృద్ధాశ్రమానికీ ప్రతినెలా ఇస్తున్నానండీ” కళ్ళు ‘సంతృప్తి’తో మెరుస్తుండగా సమాధానమిచ్చాడు శంకరయ్య స్కూటర్ స్టార్ట్ చేస్తూ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here