వేంపల్లి రెడ్డి నాగరాజు నాలుగు మినీ కథలు-28

0
7

[dropcap]వేం[/dropcap]పల్లి రెడ్డి నాగరాజు గారు రచించిన వైవిధ్యమైన నాలుగు మినీ కథలను అందిస్తున్నాము.

1. ఆలోచన

“అయ్యా, వానాకాలం కదా సామీ, ఇంటి ముందర, చుట్టు పక్కల గడ్డి బాగా పెరిగిండాది, దోమలు, చీటీగలు రాకుండా గడ్డి చెక్కేసి సుబ్బరంగా తయారుచెయ్యమంటారా?”అడిగాడో డెబ్బై ఏళ్ళ పెద్దాయన అప్పుడే ఇంట్లో నుండీ బయటకు వచ్చిన శ్రీనివాస్‌ను.

“నువ్వు చెప్పేది నిజమే, రాత్రి వేళల్లో దోమలు కుట్టి చంపేస్తూ నిద్ర లేకుండా చేస్తున్నాయి, ఇంతకూ ఇదంతా శుభ్రం చేయడానికి ఎంత ఇవ్వాలో చెప్పు?” అడిగాడు శ్రీనివాస్.

“రొంత తక్కువలో అయినా ఒక చొక్కా, పంచె కొనుక్కోవడానికి ఇస్తే చాలు సామీ” పెద్దాయన.

“ఒక గంటసేపు పనికి ఒక రోజు కూలీ సొమ్ము అడుగుతున్నావే” చిరాగ్గా అన్నాడు శ్రీనివాస్.

“నీకు ఇష్టం వచ్చినంతే ఇవ్వు సామీ, గుడ్డల కోసం తక్కువ పడే సొమ్ము ఇంకో చోట సంపాదించుకుంటా” బ్రతిమాలాడు పెద్దాయన.

“ఒక పని చెయ్, వంద రూపాయలు ఇస్తా, బట్టలు కొనుక్కోవాలంటున్నావు, నా పాతబడ్డ చొక్కా, పంచె వున్నాయ్, కనీసం మరో రెండేళ్ళు వాడేంత గట్టిగా వున్నాయ్, ఇస్తా, తీసుకెళ్ళు” చెప్పాడు శ్రీనివాస్.

“మామూలు గుడ్డలు కాదులే సామీ, అయ్యప్ప స్వామి మాల వేసుకునే నల్ల గుడ్డలు కొనుక్కునే దానికోసం” చెప్పాడు పెద్దాయన.

“ఈ వయస్సులో ఓపిగ్గా దీక్ష వుండి అంత దూరం వెళ్ళి రాగలవా?” అడిగాడు శ్రీనివాస్.

“శబరిమలైకి పోవడం లేదు సామీ, మాల వేసుకుంటే వేరే స్వాములు ‘బిక్ష’ కు పిలుస్తారు కదా, అలాగైనా కొన్నాళ్ళపాటు కడుపుకు జరిగిపోతుందని” బదులిచ్చాడు పెద్దాయన.

“ఛీ, కూటి కోసం భగవంతుడినే మోసం చేస్తున్నావా?” చీత్కారంగా అన్నాడు శ్రీనివాస్.

“వయసుడిగి శక్తి లేదని ఎవురూ కూలి పనులకు పిల్చడం లేదు సామీ, గవర్మెంటోళ్ళు ఇచ్చే ముసిలోళ్ళ పించినీ సరిపోదు, కష్టపడి సాకి ప్రయోజకుడిని చేసిన కన్న కొడుకు వదిలేస్తే ఆ బగమంతుడే ఈ ‘ఆలోచన’ పుట్టించాడు” చెప్పాడు పెద్దాయన రెండు చేతులూ జోడించి ఆకాశం వైపు చూస్తూ.

2. కొండ నాలుకకు మందు వేస్తే…

“నమస్తే సార్” ఎమ్మార్వో గారికి విష్ చేశాడు అతడి కార్యాలయం లోకి అడుగు పెట్టిన సూర్యకిరణం స్థానిక దినపత్రిక రిపోర్టర్ రాజేశ్వర్.

“రండి రాజేశ్వర్ గారూ” తనూ విష్ చేస్తూ ఎదురుగా వున్న కుర్చీ ఆఫర్ చేశాడు ఎమ్మారో.

“ఓ చిన్న విషయం సార్, జాతీయ రహదారికి ఆనుకుని వున్న మన మండల కేంద్రానికి సరిహద్దులో సుమారుగా నాలుగు ఎకరాల ప్రభుత్వ స్థలం వుంది కదా, ఇక్కడ ఎన్నో కార్యాలయాలకు స్వంత భవనాలు లేవు, ఆ స్థలాన్ని పక్కా భవనాల నిర్మాణాల కోసం కేటాయించవచ్చు కదా సార్, అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న ఇక్కడి అనేక కార్యాలయాల్లో సరయిన వసతులు లేక ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, పైగా ఆయా భవనాలకు అద్దెల రూపంలో ప్రభుత్వం ప్రతి నెలా లక్షల మొత్తంలో అద్దెలు చెల్లించాల్సివస్తోంది, ఓ పెద్ద కాంప్లెక్స్‌గా స్వంత బిల్డింగులు నిర్మిస్తే గవర్నమెంటుకు ఖర్చు తగ్గుతుంది, పైగా ఆఫీసులు అన్ని వసతులతో వుంటాయి కదా”చెప్పాడు రాజేశ్వర్.

“నేను బదిలీపై ఇక్కడికి వచ్చి సుమారుగా మూడేళ్ళు పూర్తవుతోంది, ఇంతవరకు ఏ శాఖ వాళ్ళుగానీ తమ కార్యాలయానికి స్వంత భవన నిర్మాణం కోసం స్థలం కావాలని దరఖాస్తు చేసుకోలేదండీ, అలా చేసుకుంటే పరిశీలించి స్థలాన్ని తప్పకుండా కేటాయిస్తాం” చెప్పాడు ఎమ్మార్వో.

మరుసటి రోజున…

‘అద్దె భవనాల్లో వసతులు లేక ఉద్యోగుల ఇక్కట్లు-నిరుపయోగంగా విలువైన ప్రభుత్వ ఖాళీ స్థలం’ శీర్షికతో రిపోర్టర్ రాజేశ్వర్ సేకరించిన పూర్తి వివరాలతో జిల్లా ఎడిషన్ ఫస్ట్ పేజీలోనే ఓ పెద్ద వార్త ప్రచురితమయ్యింది.

ఆ వార్త చూసిన ఉద్యోవులు తమకు పక్కా భవనాలు రాబోతున్నాయని సంబరపడ్డారు

సరిగ్గా మరో రెండు వారాల తర్వాత….

“నేను రాసిన వార్తకు ఇంత త్వరగా స్పందన వస్తుందనుకోలేదండీ, ఎట్టకేలకు ప్రభుత్వ కార్యాలయాలకు స్వంత భవనాలు సమకూరబోతున్నాయన్న మాట” ఆనందంగా ఆన్నాడు రాజేశ్వర్ ప్రభుత్వ ఖాళీ స్థలాన్ని దగ్గరుండి జె.సి.బి.తో చదును చేయిస్తున్న ఓ కాంట్రాక్టర్‌తో.

“ఏమిటండీ, ఏదేదో మాట్లాడేస్తున్నారు, మొన్నటి వరకు పొరంబోకుగా వున్న ఈ ఖాళీ స్థలం నిన్ననే మంత్రిగారి అనుచరుడి పేరుతో పట్టా అయ్యింది, ఇప్పుడు ఆయనే ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టబోతున్నారు” కాంట్రాక్టర్ ఏం చెబుతున్నాడో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు రిపోర్టర్ రాజేశ్వర్‌కు.

3. నిరసన

“అయ్యా, నీ పేరు ఏంటి?” ఓ మారుమూల గ్రామీణ ప్రాంతంలోని చిన్న పల్లెలోకి అడుగు పెట్టిన ఓ ప్రభుత్వ అధికారి అడిగాడు అక్కడ నివసిస్తున్న గ్రామీణుడిని.

“గోపాలయ్య సార్” చెప్పాడా వ్యక్తి అధికారి వంక సందేహంగా చూస్తూ.

“ఏం పని చేస్తావ్?” మళ్ళీ ఆడిగాడు అధికారి.

“ఒక పనంటూ ఏం లేదు సార్, ఏది దొరికితే అది చేసుకోవాల్సిందే, లేకుంటే పెండ్లాం, బిడ్డలతో సహా పస్తులుండల్సిందే” సమాధానమిచ్చాడు గోపాలయ్య.

“నీకు ప్రతి రోజూ ఆదాయం ఎంత రావచ్చు?” అడిగాడు అధికారి.

“రోజూ కూలి పనులు దొరుకుతాయని గ్యారంటీ లేదు కదయ్యా, ఒక్కో రోజు దొరకొచ్చు, కొన్నిసార్లు దొరక్కపోవచ్చు, ఇప్పుడు వానాకాలం కదా, పనులు జరగక వారం దినాలాయ” చెప్పాడు గోపాలయ్య.

“ఈ సమస్యలన్నీ లేకుండా మీకు రోజూ పనులు దొరకవా?” ప్రశ్నించాడు అధికారి.

“మా పల్లె రోడ్డుకు ఆనుకునే వుంది కదా సార్, ఏదైనా చిన్న ఫ్యాక్టరీ కట్టిస్తే ఈ పల్లెలో వుండే నూరు గడపలకు రోజూ ఏదో ఒక పని దొరుకుతుంది, లేకుంటే చానా సార్లు పస్తులతో అల్లాడి సావాల్సిందే” జవాబిచ్చాడు గోపాలయ్య.

“మరి ఫ్యాక్టరీ కట్టమని మీరు గవర్నమెంటును అడగొచ్చుగా” సలహా ఇస్తున్నట్లుగా అన్నాడు అధికారి.

“ఇప్పుడు కాదు, మా తాతల కాలం నుండీ అర్జీలు ఇస్తూనే వున్నాం, ప్రతి ఐదేండ్లకు ఎలక్షన్లు వచ్చినప్పుడంతా ఓట్ల కోసం నాయకులు ఫ్యాక్టరీ వచ్చేసినట్లుగా మాట్లాడుతారు, మాకు మాత్రం కూలి పనులకు పోక తప్పదు” విసుగ్గా చెప్పాడు గోపాలయ్య.

“ఇవన్నీ సరేగానీ మీ బహిర్భూమి అవసరాలు ఎలా తీర్చుకుంటారు?”అడిగాడు అధికారి అతడికి అర్థమయ్యేలా ప్రశ్మిస్తూ.

“ఊరవతల గుట్ట చాటుకో, చెట్ల చాటుకో వెళతాం” చెప్పాడు గోపాలయ్య.

“ఆడోళ్ళతో సహా రోజూ ఇలా ఇబ్బంది పడకుండా మీకు ఇళ్ళ వద్దే అందరికీ మరుగుదొడ్లు కట్టిస్తాం, దరఖాస్తులు పెట్టుకోండి” అన్నాడు అధికారి

“మాకేం అక్కర లేదయ్యా, ముందు తినడానికి తిండి వుంటేకదా మీరు చెప్పే మరుగుదొడ్లు ఆవసరం పడేది, చాలాసార్లు పనులే దొరక్క పస్తులుండే మాకెందుకు సార్ మీరు చెప్పే మరుగుదొడ్లు”నిరసనగా జవాబిచ్చాడు గోపాలయ్య, అధికారి తెల్లమొహం వేసుకుని చూస్తుండగా.

4. సమాజసేవ

“కాబట్టి యువకులు ప్రతి ఒక్కరు రాజేష్‌ను ఆదర్శంగా తీసుకుని యువజన సంఘాలు స్థాపించడం ద్వారా గ్రామాలు ఎంతో అభివృద్ది సాధిస్తాయని తెలియజేస్తూ ఈ సందర్భంగా అతడిని అభినందిస్తున్నాను” నూతనంగా ప్రారంభించిన యువజన సంఘ సమావేశంలో తన ప్రసంగాన్ని ముగించాడు ఎమ్మెల్యే దివాకర్.

“మీలాంటి వాళ్ళ ప్రోత్సాహం, సహకారం వుంటే ఇంకా ఎన్నయినా సాధించగలం సార్”ఎమ్మెల్యే అభినందనకు పొంగిపోతూ వినయంగా అన్నాడు యువజన సంఘ నాయకుడు రాజేష్.

గ్రామంలో యువజనసంఘం ప్రారంభింపబడిన సరిగ్గా ఆరు నెలల తర్వాత….

“నమస్తే సార్, నన్ను రమ్మని కబురు పంపారు, చెప్పండి సార్?” అడిగాడు ఓ రోజు సాయంత్రం ఎమ్మెల్యేని కలిసిన రాజేష్.

“నీ యువజన సంఘం ద్వారా మీ చుట్టు ప్రక్కల పల్లెలన్నింటికీ రోడ్లు, చెరువుల్లో పూడికతీత పనులు, మురుగు కాల్వల నిర్మాణాలు చేశావట” అడిగాడు ఎమ్మెల్యే.

“ఔను సార్, పల్లె ప్రజలందరి స్వచ్ఛంద సహకారంతో ప్రభుత్వానికి ఒక్క పైసా నిధులు కూడా ఖర్చు కాకుండా పూర్తి చేశా”ఎమ్మెల్యే తనను అభినందిస్తాడనుకుని చెప్పాడు రాజేష్.

“అయితే త్వరలో ఏదో ఓ కేసులో ఇరుక్కుని జైలుకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నావన్న మాట” అన్నాడు ఎమ్మెల్యే సడెన్‌గా గొంతులో కోపం తీవ్రరూపం దాల్చుతుండగా.

“ఎందుకు సార్?” కాస్తంత జంకుతూ అడిగాడు రాజేష్ ఎమ్మెల్యే ఆగ్రహానికి కారణం అర్థం కాక.

“నువ్వు గ్రామాల్లో అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నావు కాబట్టి” కళ్ళురుముతూ మరింత కోపంగా అన్నాడు ఎమ్మెల్యే.

“ప్రజలకు ఉపయోగపడే అభివృద్ది పనులు చేయడం మంచిదే కదా సార్, పైగా ఆరోజు మీరు నన్ను ప్రశంసించారు కూడా” మెల్లగా అన్నాడు రాజేష్.

“జనం ముందు సవాలక్ష మాటలు చెబుతామయ్యా, అటువంటి పనులకు లక్షల్లో కాంట్రాక్టు పనులు ఇప్పిస్తానని నన్నే నమ్ముకుని ఎంతో కొంత సంపాదించుకోవాలనుకునే నా అనుచరుల నోట్లో మట్టి కొట్టేలా నువ్వు సమాజసేవ పేరుతో వాళ్ళకు పనుల్లేకుండా చేస్తే చూస్తూ ఎలా వూరుకుంటాననుకున్నావ్?” అన్నాడు ఎమ్మెల్యే మరింత ఉగ్రుడవుతూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here