వేంపల్లి రెడ్డి నాగరాజు నాలుగు మినీ కథలు-30

0
7

[dropcap]వేం[/dropcap]పల్లి రెడ్డి నాగరాజు గారు రచించిన వైవిధ్యమైన నాలుగు మినీ కథలను అందిస్తున్నాము.

1. స్వేచ్ఛ

“హాయ్ పిన్నీ, ఎలా వున్నావ్?” అడిగింది పధ్నాలుగేళ్ళ రమ్య ఇంటి ముందు నిలబడిన ఆటోలో నుండీ దిగి బ్యాగేజీతో పాటుగా లోపలికి వస్తున్న తన పిన్ని విజయను.

“బాగున్నారా బంగారూ, నువ్వెలా వున్నావ్?, అమ్మ కనిపించడం లేదే, ఎక్కడికి వెళ్ళింది?” ప్రశ్నించింది విజయ.

“ప్రక్కింటికి వెళ్ళింది పిన్నీ, అయినా బాబాయ్, కార్తీక్ రాలేదా?” అడిగింది రమ్య.

“ఈ మధ్యనే మా ప్రక్కింట్లో దిగిన వాళ్ళకు ఈ వూళ్ళో చుట్టాలు వున్నారటరా, ఆవిడ ఒక్కతే ఇక్కడకు వస్తున్నట్లు  చెబితే మిమ్మల్ని చూడాలనిపించి నేనూ వచ్చేసా, వాళ్ళ ఇల్లు టౌన్‌కు అటువైపు, నేనే బస్టాండ్ వద్ద దిగి ఆటోలో వచ్చేశా” బదులిచ్చ్చింది విజయ.

“కార్తీక్ ఎలా వున్నాడు పిన్నీ?” అడిగింది రమ్య.

“తను బాగానే వున్నాడు గానీ, నీ సంగతేంటి, ఈ మధ్య  కాస్తంత ఒళ్ళు చేసి లావెక్కినట్లున్నావ్, రంగు కూడా తేలావ్?”ఆంది విజయ నవ్వుతూ.

“ఈ నాలుగైదు నెలలుగా తిన్నది బాగా ఒంటికి పడుతోంది, కంటి నిండా నిద్ర పోగలుగుతున్నా కదా పిన్నీ, అందుకే” సమాధానం చెప్పింది రమ్య.

“నీకు తెలియనిదేముంది పిన్నీ, విజయవాడలో ఆ స్కూల్ హాస్టల్‌లో వుండేదాన్ని కదా, ఇరవై నాలుగ్గంటలూ చదవడమే తప్ప సరయిన తిండి, నిద్ర ఎక్కడివి” చిరాగ్గా అంది రమ్య.

“చాలా మంది  చెబితే నమ్మలేదు గానీ, కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీల్లో నిజంగానే అంత కష్టంగా వుంటుందా రమ్యా?” అడిగింది విజయ.

“నిజం పిన్నీ, నరకమే అనుకో, ఈ కరోనా మహమ్మారి వల్ల బ్రతికిపోయాను గానీ లేకుంటేనా, ఈ కరోనా ఇంకా నాలుగేళ్ళుంటే బాగుండు” అంది రమ్య.

“ఏంటే నువ్వనేది, చదువుకుంటున్న పిల్లవి, ఆలోచన లేకుండా ప్రపంచాన్ని వణికిస్తున్న ఆ భయంకర మహమ్మారిని ఇంకా వుండాలని ఎలా కోరుకుంటున్నావ్?” కోపంగా అంది విజయ.

“ఇప్పుడే నయం పిన్నీ, ఇంట్లోనే హాయిగా, స్వేచ్ఛగా ఆన్ లైన్ క్లాసులతో మేలుగా వుంది, నువ్వన్నట్లు కరోనా భయంకరమైనదే, కాదనను, కానీ మాస్కు ధరించి శానిటైజర్ తో తగిన జాగ్రత్తలు పాటిస్తే అది మనల్నేం చేయగలదు, హాస్టల్‌లో ఆ నిత్య హింస కంటే ఇదే కాస్తంత మేలు” చెప్పింది రమ్య తన అమ్మను పిలుచుకుని రావడానికి ప్రక్కింటి వైపు కదులుతూ.

2. ఇస్త్రీ

“ఏమే మంగీ, ఇట్లొస్తివి?” అడిగింది రాజేశ్వరి అప్పుడప్పుడూ తన ఇంట్లో ఏవైనా చిన్న చిన్న పనులు చేయడానికి వచ్చే మంగమ్మను.

“సంటిది ఆకలికి తట్టుకోలేక ఏడుస్తాండాదమ్మా, నాకు రొండు దినాల్నుండీ జొరం కాసి బొత్తిగా తిండి లేక రొమ్ములు ఎండిపోయినాయి, పిడస కూడు వుంటే పెట్టు తల్లీ” చంకలోని ఏడాదిన్నర వయస్సున్న కూతురిని చూపిస్తూ దీనంగా అడిగింది మంగమ్మ.

“అయ్యో, కొంచెం ముందు రాకూడదటే, ఇప్పుడే పాత్రలన్నీ కడిగేసానే, ఈ రోజు మీకోసం ఇంట్లో ఏం వండుకోలేదా?” ప్రశ్నించింది రాజేశ్వరి.

“సంగటి గెలుక్కుందామంటే చారెడు నూకలు కూడా లేవు తల్లీ, ముందు బాకీ తీరిస్తే తప్ప సరుకు ఇయ్యనన్నాడట శెట్టిగారు” చెప్పింది మంగమ్మ ఏడుస్తున్న చంకలోని బిడ్డను సముదాయిస్తూ.

“నువ్వెప్పుడూ ఇంతేనే, కనీసం ఓ గంట ముందు వచ్చివున్నా పిల్లాడి బిస్కెట్ పాకెట్ ఇచ్చివుందును కదా, అయినా రంగడు పనికి పోలేదా?” అడిగింది రాజేశ్వరి.

“మొన్నా, నిన్నా వాన కదమ్మా, పనులు జరగలేదు, ఇయ్యాల పనికి పోయినా శుక్కురోరం అని కాంట్రాక్టరు కూలీ లెక్క ఇయ్యలేదంట, అంతా రేపు ఒగేతూరి ఇచ్చేస్తా అని ఒట్టి చేతుల్తో తిప్పి పంపినాడు” బదులిచ్చింది మంగమ్మ.

“పదో, పరకో ఇద్దామనుకుంటే నా దగ్గర కూడా బొత్తిగా చిల్లర లేదు కదే” నిట్టూరుస్తున్నట్లు అంది రాజేశ్వరి.

“నాకేం దుడ్లు వద్దు గానీ తల్లీ, మీ ఇంట్లో రోజూ గంజి వారుస్తారు కదా, అదే వుంటే రోంత పొయ్ అమ్మా” బ్రతిమాలుతున్నట్లుగా అంది మంగమ్మ.

“ఇవాళ మీ అయ్యగారు పట్నం వెళుతూ మధ్యాహ్నం భోజనానికి రానంటే ఉదయం టిఫిన్ కోసం చేసిన చపాతీలు మిగిలివుంటే తినేసాను, అన్నం వండలేదు” చెప్పింది రాజేశ్వరి.

“సరేలేండమ్మ గారూ, ఇంకోచోట ఎక్కడైనా అడుగుతా” చెప్పి నిరాశగా వెనుదిరిగింది రాజేశ్వరి ఏమీ ఇవ్వదని అర్థం చేసుకున్న మంగమ్మ.

“ఏం మంగమ్మా, అమ్మ గారి దగ్గరకు వచ్చి వెల్తున్నావా?” మంగమ్మ ఓ పదడుగులు వేయగానే అడిగింది చేతిలో ఓ ఖాళీ పాత సత్తు గిన్నెతో రాజేశ్వరి ఇంటి వైపుగా వస్తున్న చాకలి సుబ్బమ్మ.

“అవును సుబ్బులూ, ఇంతకూ గిన్నెతో వెల్తున్నావ్, అన్నం కోసమేమో, అమ్మగారు ఇప్పుడే బోకులు కడిగేశారట” చెప్పింది మంగమ్మ.

“అన్నం కోసం కాదులే మంగీ, అయ్యగారు రేపు పార్టీ మీటింగుకు ఇజీవాడకు పోవాలంట, నాలుగు తెల్ల సొక్కాలు గెంజి పెట్టి ఇస్త్రీ చేపిచ్చాల్లని చెప్పి పంపింది, ఎత్తిపెట్టిండే గెంజి కోసం గిన్ని తీసుకోని రమ్మంటే అమ్మగారి దగ్గరికే పోతాండా” చెప్పింది సుబ్బులు రాజేశ్వరి మేడ వైపు అడుగులు వేస్తూ.

3. సగటు మహిళ

“ఏమ్మా, ఎలా వుంది ఇప్పుడు?” వారం రోజుల క్రితమే కడుపులోని గడ్డలకు మేజర్ ఆపరేషన్ చేయించుకుని చెకప్ కోసం వచ్చి తన ముందు కూర్చున్న మాలతిని అడిగాడు డాక్టర్ వేణు.

“నొప్పి తగ్గింది సార్” చెప్పింది మాలతి డాక్టర్‌తో.

“నేను ప్రిస్కిప్షన్ రాసిన మేరకు ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా మాత్రలు పూర్తిగా వాడు, పూర్తిగా నయమయిపోతుంది” చెప్పాడు డాక్టర్.

“సరే డాక్టర్ గారూ, ఇవాళ రాత్రికి మా వూరికి వెళ్ళిపోదామనుకుంటున్నాము, ఏం ఇబ్బంది లేదు కదా?” అడిగింది మాలతి.

“వెళ్ళవచ్చు, ఏ సమస్యా వుండదు గానీ, ఇంతకీ మీ వూరు ఇక్కడికి ఎంత దూరం అన్నావ్?” ప్రశ్నించాడు డాక్టర్.

“అయిదు వందల కిలోమీటర్ల పైమాటే సార్, రాత్రంతా ప్రయాణం చేయాలి, మీతో ఓ మాట చెప్పి రిజర్వేషన్ చేయించుకుందాం అన్నాడు మా ఆయన” చెప్పింది మాలతి.

“అదేంటి, బస్సు అంటున్నారు, మీ తిరుగు ప్రయాణం టాక్సీలో కాదా?” అడిగాడు డాక్టర్.

“కాదు సార్, తెచ్చుకున్న డబ్బులన్నీ పూర్తిగా అయిపోయాయి, బస్సు చార్జీలకు మాత్రమే మిగిలివున్నాయి, ఈ ఆపరేషన్ అంటే ప్రభుత్వ స్కీం ద్వారా జరిగింది, మళ్ళీ టాక్సీలో వెళ్ళాలంటే  కనీసం పదిహేను వేలు ఖర్చు పెట్టాలి, అంత మొత్తం మాకు అప్పు ఇచ్చేవాళ్ళు కూడా ఇక్కడ ఎవరూ లేరు” అంది మాలతి.

“మీ పరిస్థితి అర్థమయ్యింది గానీ బస్సులోనే అయినా కుదుపులు లేకుండా వెళ్లాలి, మరోసారి చెబుతున్నా, వీలయినన్ని ఎక్కువ నీళ్ళు త్రాగడం మాత్రం మరచిపోవద్దు” చెప్పాడు డాక్టర్.

“రేపటినుండీ తప్పకుండా వీలయినన్ని ఎక్కువసార్లు త్రాగుతాలే సార్. ఇవాళ ప్రయాణం వుంది కదా”చెప్పింది మాలతి.

“ప్రయాణం వుంటే మాత్రం?” అడిగాడు డాక్టర్.

“ఎక్కువ నీళ్ళు త్రాగితే ప్రయాణం మధ్యలో ఎక్కడబడితే అక్కడ ఎక్కువసార్లు బస్సు ఆపమని లఘుశంక అవసరం తీర్చుకోవాల్సివుంటుంది, ఆ సమయాల్లో బస్సు దిగి మళ్ళీ ఎక్కేటప్పుడు కొందరు మగాళ్ళు చూసే చూపులకంటే ‘ఆ’ అవసరం తీర్చుకోకుండా వూరు చేరేదాకా ఆ బాధను పంటి బిగువున భరించడమే చాలా మేలు, అందుకని” జవాబిచ్చింది మాలతి దేశంలోని ఎందరో  సగటు మహిళలకు ప్రతినిధిలా.

4. పరువు

“బాబూ, ఎలా వున్నావురా?” ఫోన్‌లో పలకరించింది పార్వతమ్మ ఢిల్లీలో ఓ మల్టీ నేషనల్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గా వుంటున్న తన పెద్ద కొడుకు శ్రీధర్‌ను.

“బాగున్నానమ్మా, ఇంతకూ నీ ఆరోగ్యం ఎలా వుంది, సమయానికి మందులు వాడుతున్నావా?”వాకబు చేశాడు శ్రీధర్.

“వాడుతున్నా గానీ, నిన్ను, కోడలిని, పిల్లలను చూసి చాలా నెలలయ్యింది, ఒక్కసారి తీరిక చేసుకుని వచ్చి వెళ్ళరా” అడిగింది పార్వతమ్మ.

“అమ్మా, ఆరు నెలలుగా కంపెనీ పనులతో క్షణం కూడా తీరిక వుండడం లేదు” చెప్పాడు శ్రీధర్ తల్లికి.

“పెద్దోడా, మీరంతా కళ్ళల్లో కనిపిస్తున్నారు, ఒక్కసారి వచ్చి వెళ్ళరా” బ్రతిమలాడుతు అంది పారతమ్మ.

“కుదిరితే కనీసం నేను ఒక్కడినే అయినా రావడానికి ప్రయత్నిస్తానమ్మా, వేరే ముఖ్యమైన కాన్ఫరెన్స్‌కు టైమవుతోంది, మళ్ళీ మాట్లాడుతా”చెప్పాడు శ్రీధర్.

“చిన్న మాట శ్రీధర్, నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి, ఫోన్‌లో చెప్పేది కాదు, దానికోసమైనా రా, మర్చిపోకుండా” చివరగా చెప్పింది పార్వతమ్మ.

మరుసటి ఆదివారం రోజున….

“బాబూ, శ్రీధర్, నీ కష్టానికి అదృష్టం కలిసివచ్చి ఎంతో గొప్ప స్థాయిలో వున్నావ్, మీ అమ్మ కోరిక ఒక్కటేనయ్యా, చిన్నప్పటి నుండీ ఏమాత్రం చదువు అబ్బక ఏ ఉద్యోగాలు రాక ఇంటి వద్దనే ఖాళీగా వున్న మీ తమ్ముడికీ మీ కంపెనీలోనే ఓ చిన్న అటెండర్‌గా అయినా ఉద్యోగం ఇప్పించమని మీ అమ్మ తను అడగలేక నన్ను అడగమందయ్యా, నువ్వు తలుచుకుంటే  అది చిటికెలో పని” చెప్పాడు పరంధామయ్య, పార్వతమ్మ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు.

“అస్సలు కుదరదు బాబాయ్” నిర్మొహమాటంగా బదులిచ్చాడు శ్రీధర్.

“ఎందుకయ్యా అంత మాట అనేసావ్?” అడిగాడు పరంధామయ్య ఆశ్చర్యంగా.

“నువ్వు చెప్పినట్లుగా వీడికి అటెండర్ పోస్ట్ ఇప్పించానే అనుకో, రేప్రొద్దున వాడిని నేను ఎవరికైనా ఎలా పరిచయం చేయాలి, పైగా వాడు తాను కంపెనీ ఎం.డి.గారి తమ్ముడిని అని పది మందికీ చెప్పుకుంటే ఈ స్థాయిలో వున్న నా పరువు, హోదా ఏం కావాలి” బదులిచ్చాడు శ్రీధర్ విసురుగా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here