వేంపల్లి రెడ్డి నాగరాజు నాలుగు మినీ కథలు-34

0
7

[dropcap]వేం[/dropcap]పల్లి రెడ్డి నాగరాజు గారు రచించిన వైవిధ్యమైన నాలుగు మినీ కథలను అందిస్తున్నాము.

1. ఇష్టం

“హాయ్ సర్, సీట్ నెంబర్ పదమూడు మీదేనా?” మరో పావుగంటలో విజయవాడ సెంట్రల్ బస్ స్టేషన్ నుండీ బయలుదేరబోతున్న సూపర్ లగ్జరీ బస్సుకు సమీపంలోనే నిల్చుని వున్న భాస్కరాన్ని ప్రశ్నించాడు ఓ నలభై ఏళ్ళున్న అపరిచిత వ్యక్తి.

“అవునండీ, మీరు?” ఆ వ్యక్తి వంక సందేహంగా చూస్తూ అడిగాడు భాస్కరం.

“నా పేరు చంద్రశేఖర్ సార్, నేను కూడా ఇదే బస్సులో కడప వరకు వస్తున్నా, నా సీట్ నెంబర్ పద్నాలుగు, మీరేమీ అనుకోనంటే ఓ చిన్న రిక్వెస్ట్ సార్”అన్నాడు వినయంగా.

“ఏమిటో చెప్పండి?” అడిగాడు భాస్కరం.

“నా సీటు కిటికి ప్రక్కనే వుంది, రాత్రి ప్రయాణాల్లో చలిగాలి అస్సలు పడదు, చివరి నిముషంలో ప్రయాణం కావడంతో వున్న ఆ ఒక్క సీటునే కంఫర్మ్ చేసుకోక తప్పలేదు, మరేం అనుకోకుంటే మీ సీటులో నాకు అవకాశం ఇస్తారేమోనని” అడిగాడు చంద్రశేఖర్.

“అలాగే సర్దుకుందాం లెండి” చెప్పాడు భాస్కరం.

“థ్యాంక్యూ సర్” కృతజ్ఞతతో అన్నాడు చంద్రశేఖర్.

“మీరు ఎంతవరకు సర్?”అడిగాడు భాస్కరం చంద్రాన్ని ఓ పావుగంట తర్వాత సీటులో సర్దుకుంటూ.

“రాయచోటి వరకునండీ” చెప్పాడు చంద్రం.

“పాతికేళ్ళ క్రితం మా నాన్నగారు అక్కడే పని చేశారండీ, అప్పట్లో కొంతకాలం నేనూ అక్కడే చదువుకున్నా, అన్నట్లు మీ స్వంత ఊరు రాయచోటేనా?” మళ్ళీ అడిగాడు భాస్కరం.

“అక్కడికి దగ్గర్లో సంబేపల్లె అని ఓ చిన్న పల్లెటూరు సార్” సమాధానమిచ్చాడు చంద్రం.

“మీరేం చేస్తారు సార్?”మళ్ళీ ప్రశ్నించాడు భాస్కరం.

“ఇక్కడే స్టేట్ సెక్రటేరియట్‌లో సెక్షన్ ఆఫీసర్‌ని”బదులిచ్చాడు చంద్రం.

“మీరు తరచుగా మీ వూరికి వెళుతుంటారా?”అడిగాడు భాస్కరం.

“లేదండీ, ఏడాదిలో ఒకటో, రెండో సార్లు మాత్రమే వెడుతుంటా, అది కూడా అక్కడ ఓ ఎకరా పొలం వుంది కాబట్టే” చెప్పాడు చంద్రం.

“ఎంత కష్టపడ్డా, ఖర్చు శ్రమ తప్ప వ్యవసాయం ఏమాత్రం గిట్టుబాటు కాదంటారు, ఎకరం పొలం సాగు కోసం అంత దూరం వెళుతుంటారా?” ఆశ్చర్యంగా అడిగాడు భాస్కరం.

“సాగు కోసం కాదు సార్, ఆ పొలం తాను ఎంతో కష్టపడి కొన్నది కాబట్టి అందులో పండిచిన కాయలో, ధాన్యమో తినడమంటే మా నాన్నగారికి ఎంతో ఇష్టం, దాన్ని కౌలుకు చేసుకుంటున్న రైతు పంట నూర్పిళ్ళు చేస్తున్నాడంటే ఆయన కోసం కొంత ధాన్యాన్ని తీసుకుని రావడానికి వెడుతున్నా” చెప్పాడు చంద్రం.

2. అవసరం

“మామయ్యా, కాఫీ తీసుకోండి” ఉదయం తొమ్మిది గంటలవేళ వరండాలో ఆ రోజు దినపత్రిక తిరగేస్తున్న రాజారావుకు వేడి వేడి పొగలు కక్కే కాఫీ కప్పు అందించింది హరిత.

“ఇవాళ కిరణ్ బయటకు వెళుతున్నాడామ్మా?” కోడలిని అడిగాడు రాజారావు చేతిలోని పేపర్ ప్రక్కన పడేస్తూ.

“వెళ్ళాలని చెప్పారు మామయ్యా” చెప్పింది హరిత.

“నాకూ ఓ చిన్న పని వుందమ్మా, వెళ్ళేటప్పుడు మరచిపోకుండా కలవమని చెప్పు వాడితో” కోడలితో చెప్పాడు రాజారావు.

“అలాగే మామయ్యా” చెప్పి ఖాళీ కాఫీ కప్పు తీసుకుని వెళ్ళిపోయింది హరిత.

ఓ పది నిముషాల తర్వాత….

“నాన్నా, బయటకు వెళ్ళేటప్పుడు కలవమని హరితతో చెప్పారట” అడిగాడు చరణ్ తన తండ్రి రాజారావును.

“అవును చరణ్, ఇవాళ నాలుగో తారీఖు కదా, నా అక్కౌంట్‌లో పెన్షన్ జమ అయివుంటుంది, చెక్కు ఇస్తాను గానీ ఓ ఐదు వేలు మార్చుకుని రావాలి” రాజారావు చెప్పాడు కొడుకు చరణ్‌తో.

“ఆ ఏరియాలో ఎవరికో మొన్ననే కరోనా పాజిటివ్ వస్తే ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా చేశారు నాన్నా, అందుకే బ్యాంక్ కూడా మూసివేశారు” చెప్పాడు చరణ్ తండ్రితో.

“మరయితే నా ఏ.టి.ఎం. కార్డు ఇస్తాగానీ మరో ఏరియాకు వెళ్ళి డబ్బు తీసుకురా” చెప్పాడు రాజారావు.

“ఇప్పుడు డబ్బుతో అంత అవసరం ఏం వచ్చింది నాన్నా?” అడిగాడు చరణ్ తండ్రిని.

“మన పల్లె వెంకటయ్య వారం క్రితం ఫోన్ చేసి ఓ ఐదు వేలు సాయం చేయమని అడిగాడు, రేపు వూరికి వెళ్ళి రావాలనుకుంటున్నా అతనికి ఇవ్వడానికి” కొడుక్కి చెప్పాడు రాజారావు.

“అతడికి ఇవ్వడం ఎందుకు నాన్నా, అనవసరంగా సొమ్ము వృథా చేసినట్లు కాదా” కాస్తంత అసంతృప్తిగా అన్నాడు చరణ్ తండ్రితో.

“మనం ప్రతిఏటా ఏమాత్రం ఇష్టం లేకున్నా వినాయక చవితి సందర్భంగా కేవలం నాలుగైదు రోజులకే నీళ్ళలో కలిపివేసే వినాయకుడి ప్రతిమ కోసం ఎవరి బలవంతం మీదనో ఐదు వేలు చందా ఇచ్చేవాళ్ళం కదా, ఈసారి కరోనా మహమ్మారి వల్ల చందా ఇచ్చే అవసరం లేకుండాపోయింది, అయినా చందా ఇచ్చామనుకునే ఆ సొమ్ము అతడికి ఇద్దాం, కుటుంబ పోషణ కోసం పాడి గేదె కొనుక్కోవాలనుకుంటున్నాడట” చెప్పాడు రాజారావు తనకున్న డబ్బు అవసరం గురించి.

3. నివారణ

“నారాయణా, బిజీగా వున్నావా?” ఉదయం ఎనిమిది గంటల సమయంలో తన ఇంటివద్దకు వచ్చిన అనుచరుడిని ప్రశ్నించాడు క్లాస్ వన్ కాంట్రాక్టర్ కం పొలిటీషీన్ రాయుడు.

“ఖాళీగానే వున్నాను, చెప్పండయ్యా”వినయంగా చెప్పాడు నారాయణ.

“పట్నం దాకా వెళ్ళి మన ఇంట్లో పెళ్ళిళ్ళు, వ్రతాలు చేసే పురోహితుడిని పిలుచుకుని రావాలి” చెప్పాడు రాయుడు.

“సరేనయ్యా, వెళ్ళి పిలుచుకుని వస్తా” చెప్పాడు నారాయణ.

మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో….

“నమస్కారం రాయుడు గారూ, అదే పనిగా మనిషిని పంపించి పిలిపించుకున్నారు, నా వల్ల ఏం కావాలో చెప్పండి?” అడిగాడు పట్నం నుండీ వచ్చిన పురోహితుడు.

“ఈ మధ్యన ఒంట్లో చాలా నలతగా వుందండీ, ఎందరు వైద్యుల చుట్టూ తిరిగినా, ఎన్ని మందులు వాడినా గుణం కనిపించడం లేదు,ఆరోగ్యం కోసం అదేదో ధన్వంతరీ హోమం చేయిస్తారటనే, అది మన ఇంట్లో మీరు కూడా జరిపించాలి” చెప్పాడు రాయుడు.

“సరేనండీ, అలాగే” అంగీకరించాడు పురోహితుడు.

రాయుడి ఇంట్లో అంగరంగ వైభవంగా ధన్వంతరీ హోమం నిర్వహించిన మూడో రోజున…..

“రాయుడూ, ఎంతో నిష్ఠతో, మరెంతో ఖర్చుతో నువ్వు నా పేరిట చేయించిన హోమానికి చాలా సంతృప్తి చెందానయ్యా, నీకేం కావాలో కోరుకో” రాయుడిని అడిగాడు తెల్లవారు జామున కలలో ప్రత్యక్షమయిన ధన్వంతరి.

“నాకు ఈమధ్య ఆరోగ్యం పూర్తిగా బాగుండడం లేదు దేవా, ముఖ్యంగా ఈమధ్య కాలంలో ఏం తిన్నా అస్సలు అరగడమే లేదు, దీనికి నివారణోపాయం చెప్పి నా ఆరోగ్యం కుదుటపడేలా చేయండి స్వామీ, అది చాలు” దీనంగా వేడుకున్నాడు రాయుడు.

“ముందురోజుల్లో నువ్వు కాంట్రాక్టర్‌గా మాత్రమే వున్నంతవరకు సగం పనుల్లో నాణ్యత లేని నకిలీ నిర్మాణాలు చేసినా చిన్నపాటి జబ్బులు మాత్రమే వచ్చేవి, ఇప్పుడలా కాక రాజకీయాల్లో చేరాక అధికారాన్ని అడ్డం పెట్టుకుని అస్సలు పనులే చేయక బిల్లులు చేయించుకుని ప్రజల సొమ్ము బొక్కేస్తున్నావు కదా, అందుకే ఇలాంటి జబ్బు వచ్చింది, దీనికి వేరే వైద్యం ఏం అవసరం లేదు, నివారణ పూర్తిగా నీ చేతుల్లోనే వుంది, అర్థం చేసుకో” అంటూ మాయమయ్యాడు ధన్వంతరి.

4. బ్రహ్మాస్త్రం

“నళినీ, బయట ఎవరో కాలింగ్ బెల్ నొక్కినట్లున్నారు, ఎవరు వచ్చారో చూడు” ఉదయం ఆరు గంటల సమయంలో బెడ్ రూంలో నుండీనే వంటింట్లో వున్న భార్యకు వినిపించేలా బిగ్గరగా కేక వేశాడు ప్రదీప్.

“మామయ్య గారికి కాఫీ కలుపుతున్నానండీ, ఏం అనుకోకుండా మీరే కాస్తంత చూడరాదా” అక్కడినుండీనే భర్తకు సమాధానమిచ్చింది నళిని.

“నువ్వు ఎప్పుడూ ఇంతే, ఏదయినా పని చెప్తే ఏదో ఒక సాకు చెప్పి మళ్ళీ తిరిగి నాకే పురమాయిస్తావ్” విసుక్కుంటూ వెళ్ళి తలుపు తీశాడు ప్రదీప్.

“నమస్తే సార్, బిల్లు కోసం వచ్చా” ప్రదీప్‌కు విష్ చేసి చెప్పాడు ఇంటి ముందు నిల్చునివున్న ఆ ఏరియా పేపర్ బాయ్.

” సాయంత్రం రారాదా” అన్నాడు ప్రదీప్ విసుగ్గా.

“సాయంత్రం మళ్ళీ అదేపనిగా రాలేను సార్, దయచేసి ఇప్పుడే ఇవ్వండి, ఇంకా కాస్సేపు వెయిట్ చేస్తా” వినయంగా అన్నాడు బాయ్.

“ఇప్పుడు కుదరదు, చెబుతుంటే నీక్కాదా. ఉదయాన్నే మంచి నిద్ర చెడగొట్టావ్” ఆ కుర్రాడిపై మరోసారి కోపగించుకున్నాడు ప్రదీప్ .

“అయితే రేపు ఉదయాన్నే వస్తాలే సార్” చెప్పి బయలుదేరబోయాడు బాయ్.

“ఈ రోజులాగే మళ్ళీ రేపు కూడా నిద్ర లేకుండా చేద్దామనా, అవునింతకీ ఈ మధ్య చాలా సార్లు పేపర్ చాలాసార్లు ఆలశ్యంగా తెస్తున్నావట, పైగా నాలుగు రోజులు అసలు పేపరే వేయలేదట, ఆ నాలుగు రోజుల డబ్బు పట్టుకుని ఇస్తా” కోపంతో వూగిపోతూ అరిచాడు ప్రదీప్.

“అలాంటిదేమీ లేదు సార్.”

“నాకే ఎదురు సమాధానం చెప్తావా, ముందు మీ ఏజెంట్ నంబర్ ఇవ్వు, అతడికి నీ మీద కంప్లయింట్ ఇవ్వాలి” బి.పి.మరింతగా పెంచుకున్నాడు ప్రదీప్.

“సర్, ప్లీజ్ అలా చేయకండి, మా ఏజెంట్ నాకు ఇవ్వాల్సిన వెయ్యి రూపాయల జీతం అస్సలు ఇవ్వడు, నేను నెల నెలా కట్టాల్సిన ట్యూషన్ ఫీజు కోసమే ఇలా పేపర్ వేస్తున్నా” బ్రతిమలాడాడు ఇంటర్మీడియట్ చదివే ఆ కుర్రాడు చేతులెత్తి దండం పెడుతూ.

సరిగ్గా పావుగంట తర్వాత…

“ప్రదీప్ గారూ, ఏంటండీ, ఉదయాన్నే పేపర్ వాడితో గొడవ?”అడిగాడు ప్రక్కింటి జనార్ధన్.

“మొన్నామధ్య పేపర్ వేయడానికి వచ్చినప్పుడు బయటకు వెళ్ళే ఓపిక లేక ఓ ప్యాకెట్ సిగరెట్లు తెమ్మని చెప్పానండీ, ఇలా ప్రతి ఒక్కరూ చెప్పే ఒకటీ, అరా పనులు చేస్తూపోతే ప్రతి ఇంటికీ పేపర్ వేయడం చాలా ఆలశ్యమవుతుందని, పైగా కాలేజీకి వెళ్ళడానికి మరీ లేటు అవుతుందని నాకే చాలా పొగరుగా సమాధానమిచ్చాడండీ వెధవ” పిచ్చుక మీద తను ఎందుకు బ్రహ్మాస్త్రం ప్రయోగించాడో చెప్పాడు ప్రదీప్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here