వేంపల్లి రెడ్డి నాగరాజు నాలుగు మినీ కథలు-35

0
4

[dropcap]వేం[/dropcap]పల్లి రెడ్డి నాగరాజు గారు రచించిన వైవిధ్యమైన నాలుగు మినీ కథలను అందిస్తున్నాము.

1. బర్త్ డే పార్టీ

“ఏరా గిరీ, ఇవాళ నీ పుట్టినరోజు కదా, ఒట్టి థ్యాంక్స్‌తో సరిపుచ్చక సాయంత్రం దాబా హోటల్లో పార్టీ ఇవ్వకుంటే ఇకపై నీతో అస్సలు మాట్లాడేదే లేదు” నగరంలోని యూనివర్శిటీ క్యాంపస్ హాస్టల్ రూంలో వుంటున్న స్నేహితుడిని అడిగాడు క్లాస్‌మేట్ శంకర్.

“మదర్ ప్రామిస్, నా దగ్గర అంత డబ్బు లేదురా” నిరాశగా బదులిచ్చాడు గిరి.

“ఇలాంటి సమాధానాలన్నీ నాకేం చెప్పకు, కాల్ చేసి ఎవరి ద్వారానైనా ఫోన్ పే లో డబ్బు పంపమని మీ నాన్నకు చెప్పు, పార్టీ కోసం అంటే పంపకపోవచ్చు, అర్జంటుగా ఇవాళే పరీక్ష ఫీజు కట్టాలని చెప్పు” సలహా ఇచ్చాడు శంకర్.

“అబద్దం చెప్పడం బాగుండదేమోరా” మిత్రుడితో అన్నాడు గిరి.

“అయితే స్నేహితుడిగా నన్ను మర్చిపో” మొండి పట్టు పట్టినట్లు పార్టీ కోసం డిమాండ్ చేశాడు శంకర్.

***

“ఏమే, అబ్బాయి ఇవాళే పరీక్ష ఫీజు రెండు వేలు కట్టాలట, పల్లెలో ఎవరిని అడిగినా లేదంటున్నారు, ముందు వాడు బాగా చదువుకుంటే చాలుగానీ, నీ చెవుల్లో వుండే కమ్మలు ఇవ్వు, శెట్టి దగ్గర కుదవ పెట్టి రేపు సాయంత్రమే పంట అమ్మగానే విడిపించి ఇస్తా” భార్య సుబ్బమ్మతో చెప్పాడు నారాయణ.

“అలాగే చెయ్యవయ్యా, పిల్లాడి చదువు కంటే ఇవన్నీ అంత ముఖ్యం కాదు” భర్తకు చెవుల్లోని కమ్మలు తీసి ఇస్తూ అంది సుబ్బమ్మ.

అదే రోజు, రాత్రి పదిన్నర గంటల సమయంలో…..

“డాక్టర్ గారూ, మీరు త్వరగా హాస్పిటల్ కు రావాలి, యమర్జెన్సీ కేసులు ఓ రెండు వచ్చాయి” ఇంట్లోని తన బెడ్ రూం పడుకోబోతున్న డాక్టర్ శ్రీనివాస్‌కు కాల్ చేసి హడావుడిగా చెప్పింది ప్రమీల నర్శింగ్ హోం స్టాఫ్ నర్స్ అంజలి.

“కంప్లయింట్ ఏంటి?”అడిగాడు డాక్టర్ ఆవులిస్తూనే.

“పొరుగున పల్లెటూరికి చెందిన రైతు ఒకాయన ఏడాది పొడవునా కష్టపడి వడ్డీలకు అప్పులు చేసి మరీ పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కలేదని పురుగుల మందు త్రాగాడట, కంట్రోల్ కాకుండా ఒకటే వాంతులు” చెప్పింది స్టాఫ్ నర్స్.

“మరి రెండో కేసు?”డ్రెస్ చేసుకుంటూ అడిగాడు డాక్టర్.

“అది కూడా కంట్రోల్ కాని వాంతుల కేసే, ఓ కాలేజీ కుర్రాడు తన బర్త్ డే సందర్భంగా ఫ్రెండ్‌కు ఇచ్చిన పార్టీలో పీకలదాకా పూటుగా తాగేసి…

2. బీదలు

“మ్మా, సందకాడ నేను ఎబ్బుడు బడి నుండీ ఇంటికొచ్చినా ఇంటితావున వుండవే?” తల్లిని అడిగాడు మూడో తరగతి చదివే ఎనిమిదేళ్ళ రంగయ్య.

“పనులకు పోవల్ల కదా నాయనా, ఇంటి కాడ వుంటే సంసారం జరుగుబాటు కావల్ల కదా” కొడుక్కు జవాబిచ్చింది సుబ్బమ్మ.

“సంసారం జరుగుబాటు అంటే ఏందిమ్మా?” మళ్ళీ అడిగాడు రంగయ్య.

“రోజూ తినేదానికి బియ్యము, బ్యాల్లు, మిగతాటివి తెచ్చుకోవల్ల, ఈ ఇంటికి బాడిగ, కరెంటు బిల్లు కట్టుకోవల్ల కదప్పా” చెప్పింది సుబ్బమ్మ.

“వాటికోసం పనులకు పోవల్సిందేనా?” అడిగాడు రంగయ్య అర్థం కానట్లుగా చూస్తూ.

“పోకుంటే దుడ్లు ఎవురిస్తారు నాయనా” అంది చేటలో వేసిన బియ్యంలో మట్టి బెడ్డలు వేరుచేస్తూ.

“అట్లయితే మా ఇస్కూల్లో నాతోపాటుగా సదువుతాండే మిగతా పిల్లోల్ల అమ్మలు ఎవురూ నీ మాదిర్తో పనులకు పోరు కదమ్మా, నువ్వు ఒక్కదానివే ఎందుకు పోతావు?”అడిగాడు రంగయ్య.

“వాళ్లందరూ మనమాదిర్తో చానా బీదోళ్ళు కాదేమో రంగా” చెప్పింది సుబ్బమ్మ.

“బీదోల్లు అంటే ఏందిమ్మా?” మరో ప్రశ్న వేశాడు రంగయ్య తల్లిని.

“బీదోల్లు అంటే దుడ్లు లేనోల్లు నాయినా, వాటికోసమే నేను వేరేవాల్ల ఇండ్లల్లో పనులు చేసేది” కొడుక్కు అర్థమయ్యేలా వివరించి చెప్పింది సుబ్బమ్మ.

“మ్మా, నువ్వు దుడ్ల కోసమే వాల్ల ఇండ్లల్లో పని చేస్తానంటాండావు గదా, దుడ్లు మనతావున వున్నా మనమూ వేరేవాల్లతో పనులు చేపించుకోవచ్చు కదా?” అడిగాడు తల్లిని రంగడు.

“చేయించుకోవచ్చు, అయినా ఎందుకు అడుగుతున్నావప్పా?” ప్రశ్నించింది సుబ్బమ్మ కొడుకు వంక సందేహంగా చూస్తూ.

“నువ్వు ఇబ్బుడు పనులు చేసే ఇండ్లల్లోని వాల్లనందరినీ మన ఇంట్లో కూడా పనులు చేసేదానికి పిల్చు మ్మా, మొన్న సుబ్బయ్య మామ వూరికి పొయ్యేటబ్బుడు నాకు ఇచ్చిండే దుడ్లు వాల్లకు ఇస్తాగానీ” జేబులో వున్న ఐదు రూపాయల నాణేన్ని చేత్తో తడుముకుంటూ తల్లికి చెప్పాడు రంగయ్య అమాయకంగా…

3. అపాత్రదానం

“సార్, ఎవరో స్వచ్ఛంద సంస్థ వాళ్ళు వచ్చారు, మీ అపాయింట్‌మెంట్ కావాలట” నగరంలోనే ప్రముఖుడిగా పేరు పొందిన పారిశ్రామికవేత్త రాజేశ్వరరావుతో చెప్పాడు అతడి పి.ఏ.శ్రీనివాస్.

“సరే రమ్మను” చెప్పాడు రాజేస్వరరావు.

“నమస్కారం సార్, మా స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి నాలుగేళ్ళు అవుతోంది, ఇప్పటిదాకా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేశాం, ఈ ఏడాది మీ సహకారంతో ఓ వృద్దాశ్రమం నిర్మించాలనుకుంటున్నాం, మీవంతుగా ఏదైనా ఆర్థిక సహకారం చేస్తారేమోనని అడగడానికొచ్చాం” చెప్పాడు వాళ్ళలో ఒకతను.

“వెరీ సారీ అండీ, మీకు నేనేం సాయం చేయలేను” ఓ నిముషం తర్వాత చెప్పాడు రాజేశ్వరరావు ఇక మీరు వెళ్ళి రండన్నట్లుగా.

“సరే సార్” నిరుత్సాహంగా చెప్పి వెనుదిరిగారు వాళ్ళంతా.

రాత్రి భోజనాల వేళ….

“ఏమండీ, దానధర్మాలు చేయడంలో, సామాజిక సేవాకార్యక్రమాలకు విరాళాలు ఇవ్వడంలో మీరు ఈ సిటీ లోనే చేతికి ఎముక లేని దాతగా పేరు పొందారు కదా, ఇవాళ ఓ స్వచ్ఛంద సంస్థ వారు వచ్చి వృద్దాశ్రమ నిర్మాణం కోసం సాయం అడిగితే ఖాళీ చేతులతో పంపేశారట?  మీ వద్దకు వచ్చినవాళ్ళలో నా క్లాస్‌మేట్ భర్త కూడా వున్నాడు, ఆవిడే ఈ సంగతి కాల్ చేసి చెప్పి బాధపడింది” అడిగింది భర్త రాజేశ్వరరావును సత్యవతి.

“నా సాయం కోసం వాళ్ళు చెప్పిన కారణం అపాత్రదానంగా భావించా కాబట్టి” భార్యకు జవాబిచ్చాడాయన.

“ముసలాళ్ళ వృద్ధాశ్రమ నిర్మాణం కోసం ఇవ్వడం అపాత్రదానం ఎలా అవుతుందండీ?”అడిగింది సత్యవతి అర్థం కానట్లుగా చూస్తూ.

“ఎవరో వృద్ధాశ్రమాలు నిర్వహిస్తున్నారు కదాని తమ తల్లిదండ్రుల్ని తమవద్దే వుంచుకుని పోషించే స్తోమత వుండికూడా ఈ మధ్య చాలా మంది కొడుకులు భార్యల చెప్పుడుమాటలు విని వాళ్ళను వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు సత్యా, ఈ ధోరణి మరింతగా పెరగకుండా వుండాలనే” అర్థం చేసుకోమన్నట్లుగా చెప్పాడు రాజేశ్వరరావు భార్యతో.

4. గ్రౌండ్

“ఏరా నవీన్, ఎలా చదువుతున్నావ్? తన మేనల్లుడిని అడిగాడు పట్నం నుండీ పల్లెలోని తన అక్క గారింటికి చుట్టపుచూపుగా వచ్చిన రమేష్.

“బాగానే చదువుతున్నా మామా” మేనమామ ప్రశ్నకు జవాబిచ్చాడు నవీన్.

“నువ్వు ఇప్పుడు పదో తరగతి కదా, పబ్లిక్ పరీక్షలు ఎప్పటినుండీ మొదలవబోతున్నాయి?”అడిగాడు రమేష్.

“మరో నెల రోజుల్లో, మార్చి రెండో వారంలో మామా” చెప్పాడు నవీన్.

“పరీక్షలకి ఎలా ప్రిపేర్ అవుతున్నావ్?” మరో ప్రశ్న వేశాడు రమేష్.

“మా స్కూల్లో టీచర్స్ అందరూ ఒక్కో రోజు ఒక్కొక్కరు రాత్రి పదింటిదాకా స్పెషల్ క్లాసులు చెబుతున్నారు” బదులిచ్చాడు నవీన్ తన మేనమామకు.

“వాళ్ళు చెప్పే పాఠాలు సరిగ్గానే అర్థమవుతున్నాయిగా” అడిగాడు రమేష్.

“అర్థమవుతున్నాయి, ఏ సందేహం అడిగినా ఒకటికి రెండుసార్లు చెబుతున్నారు” బదులిచ్చాడు నవీన్.

“ర్యాంక్ వస్తుందిగా?” కుతూహలం ధ్వనించింది రమేష్ గొంతులో.

“తప్పకుండా” ధీమాగా చెప్పాడు నవీన్.

“హైస్కూల్ స్థాయిలో ఇవి చాలా ముఖ్యమైన పరీక్షలని గుర్తుంచుకుని మరింత బాగా కష్టపడి చదువు, నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ పరీక్షలే కీలకం” సూచించాడు మేనల్లుడికి రమేష్.

“ఈ పరీక్షల్లో నువ్వు ర్యాంక్ తెచ్చుకుంటే బహుమతిగా నీకు ఏం కొనివ్వమంటావ్?”అడిగాడు రమేష్.

“ఊళ్ళో అందరికీ క్రికెట్ బ్యాట్లు వున్నాయ్, నా ఒక్కడికే లేదు, అది కొనివ్వు చాలు” ఆత్రంగా చెప్పాడు నవీన్.

“ఔరా నవీన్, నాకు తెలియక అడుగుతా, ఈ ఊళ్ళో చిన్నపాటి స్కూల్ కూడా లేదు, క్రికెట్ ఆడడానికి గ్రౌండ్ వుండాలిగా, బ్యాట్ కొనిస్తే ఏం చేస్తావ్?” అడిగాడు రమేష్ మేనల్లుడిని సందేహంగా చూస్తూ.

“స్కూల్‌తో, గ్రౌండ్‌తో ఏం పనయ్యా, గత రెండేళ్ళుగా వాన రాక, చుక్క నీరు లేక బాగా ఎండిపోయిన మా ఊరి చెరువు క్రికెట్ ఆడే పిల్లలందరికీ ఎవరికీ లేనంత పెద్ద గ్రౌండ్‌గా ఉపయోగపడుతోంటే” రమేష్‌తో చెప్పాడు అప్పుడే అక్కడికి వచ్చిన వ్యవసయం చేసే అతడి బావ శీనయ్య మాటల్లో ఆవేదన కనిపిస్తుండగా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here