వేంపల్లి రెడ్డి నాగరాజు నాలుగు మినీ కథలు-37

1
7

[dropcap]వేం[/dropcap]పల్లి రెడ్డి నాగరాజు గారు రచించిన వైవిధ్యమైన నాలుగు మినీ కథలను అందిస్తున్నాము.

1. దిగులు

“రామకృష్ణ గారూ, బాగున్నారా?” ఏదో పనిమీద పట్నానికి వచ్చి బజారులో ఎదురుపడిన ఒకప్పటి కొలీగ్, పాత స్నేహితుడిని పలకరించాడు సుబ్బరామయ్య.

“బాగున్నా సుబ్బరామయ్య గారూ, మీరెలా వున్నారు?” జవాబిచ్చి తనూ కుశలప్రశ్న వేశాడు రామకృష్ణ.

“దేవుడిదయ వల్ల అంతా క్షేమమే, అన్నట్లు మీరు నాకు తెలిసినంతలో మామూలుగా పట్నం వైపు ఎక్కువగా రారే?” అడిగాడు సుబ్బరామయ్య సందేహంగా చూస్తూ.

“మీరన్నట్లుగా ఎక్కువగా రాను గానీ, మీలాగే పెన్షన్ తీసుకుంటున్నాగా, ఏడాదికోసారి బ్యాంకులో లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలిగా, అందుకోసం వచ్చా” జవాబిచ్చాడు రామకృష్ణ.

“సరే రండి, వేడిగా ఓ గుక్క కాఫీ త్రాగుతూ మాట్లాడుకుందాం” ఆహ్వానించాడు సుబ్బరామయ్య.

“సరే పదండి” స్నేహితుడిని అనుసరించాడు రామకృష్ణ కాఫీ హోటల్ వైపు అడుగులేస్తూ.

“మీ అబ్బాయి ఇప్పుడు ఈ ఊళ్ళోనే పని చేస్తున్నాడు కదా, కాపురం ఇక్కడే పెట్టాడా?” అడిగాడు సుబ్బరామయ్య.

“పని చేసేది ఇక్కడే, కానీ ఇంకో ఎనిమిదేళ్ళు బదిలీ కూడా వుండదు కాబట్టి ఇంటివద్ద నుండీ రోజూ స్కూటర్ మీద వచ్చి వెడుతున్నాడు”చెప్పాడు సుబ్బరామయ్య.

“మీకు తాతయ్యగా ఏమైనా ప్రమోషన్ రావడం లాంటిదేమైనా…” నవ్వుతూ అడిగాడు సుబ్బరామయ్య.

“అలాంటిదేం ఇంకా లేదండీ, పెళ్ళయి ఏడాదేగా అయ్యింది” జవాబిచ్చాడు రామకృష్ణ.

“మిమ్మల్నో మాట అడుగుతాను మరేం అనుకోకండీ, ఈమధ్య గత ఆరు నెలలుగా మీ ఇంటికి నాలుగైదు సార్లు వచ్చి వెళ్ళాగా, అప్పుడు గమనించా, మీ ఆవిడ ఎప్పుడూ దిగులుగానే వుంటోంది, ఎందుకని, ఏమైనా ఆరోగ్యం బాగాలేదా?” అడిగాడు సుబ్బరామయ్య మెల్లగా గొణుగుతున్నట్లుగా.

“అదేం లేదండీ, మావాడికి ఉద్యోగం వచ్చాక పెళ్ళి చేశాంగా, కోడలు వేరు కాపురం పెట్టమని మొగుడిని పోరి తన కొడుకును తనకు కాకుండా ఎక్కడ దూరం చేస్తుందోననే భయంతోనే ఆ దిగులు, ఈ మధ్య గట్టిగా సర్దిచెబితే కుదురుకుందిలే” చెప్పాడు రామకృష్ణ ఖాళీ చేసిన కాఫీ గ్లాసు ప్రక్కన పెడుతూ.

2. సిఫార్సు

“రావయ్యా, భాస్కరం, ఏంటి ఈవేళప్పుడు వచ్చావ్?” రాత్రి తొమ్మిది గంటల సమయంలో తన ఇంటి వద్దకు వచ్చిన సబార్డినేట్ భాస్కర్‌ను అడిగాడు కంపెనీ మేనేజర్ గుర్నాధం.

“మీతో ఓ చిన్న విషయం మాట్లాడాలని వచ్చా సార్” చెప్పాడు భాస్కర్ బాస్‌కు వినయంగా.

“సాయంత్రం ఆరింటివరకు ఇరువురం ఆఫీసులోనే వున్నాంగా, అప్పుడే అక్కడే చెప్పివుండొచ్చు కదా, ఇక్కడిదాకా రావడం ఎందుకు, పైగా ఈ సమయంలో” అన్నాడు గుర్నాధం.

“ఇవాళ మీరు ఆఫీసులో చాలా బిజీగా వున్నారు సార్, అందుకని ఇక్కడే చెప్పుకుందామని వచ్చా” బదులిచ్చాడు భాస్కర్.

“అయినా దేని గురించి మాట్లాడాలి?” ప్రశ్నించాడు గుర్నాధం.

“నా ప్రమోషన్ గురించి సార్” చెప్పాడు భాస్కర్.

“నీ పేరు ఇదివరకే సిఫార్సు చేశాగా, అయినా ఇంటర్వ్యూ ఎప్పుడు?” అడిగాడు గుర్నాధం.

“ఎల్లుండే సార్, మీరు నా పేరుతో పాటు చంద్రం పేరు కూడా సిఫార్సు చేశారు” వినీవినబడనట్లు అన్నాడు భాస్కర్.

“అయితే?” అర్థం కానట్లు చూస్తూ అడిగాడు గుర్నాధం.

“మీరు ఇంటర్వ్యూ కమిటీకి, జోనల్ మేనేజర్ గారికి నా పేరు మరింత స్ట్రాంగ్‌గా రెకమెండ్ చేయాలి సార్, ఈసారి నాకు ప్రమోషన్ ఎలాగైనా వచ్చేలా సాయం చేయాలి సార్” అర్థింపు వినబడింది భాస్కర్ మాటల్లో.

“ప్రమోషన్ ఇవ్వడానికి సెలెక్షన్ కమిటీ అనేక రకాల అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటుంది కదా, వచ్చే అవకాశం వుంటే నీకే రావచ్చుఅయినా ప్రమోషన్ గురించి ఎందుకంతగా ఆరాటపడుతున్నావ్, స్వంత ఊళ్ళోనే హాయిగా వుండకుండా, పైగా పుట్టి పెరిగిన ఊళ్ళో పని చేసే అదృష్టం ఎందరికి దక్కుతుందయ్యా?” అడిగాడు గుర్నాధం.

“మా అమ్మకు, మా ఆవిడకు ఇంట్లో నిత్యం పేచీ పడుతోంది సార్, ఇద్దరికీ సర్ది చెప్పలేకున్నాను, నాకు నేనుగా వేరుకాపురం పెట్టి అందరితో అనిపించుకోలేను, నాలుగేళ్ళుగా ట్రాన్స్ఫర్ కోసం ట్రై చేస్తుంటే కుదరడం లేదు, కనీసం ప్రమోషన్ మీదనైనా వేరే వూరికి వెళ్ళే చాన్స్ వుంటుంది కదాని” సిఫార్సు ఎందుకు చేయమని అడుగుతున్నాడో చెప్పాడు భాస్కర్ తన బాస్‌తో.

3. పెద్ద దిక్కు

“అయ్యా, నీ భార్య ఇప్పుడే పురుడుపోసుకుంది, కాకుంటే నేను చెప్పబోయే విషయం విని తట్టుకోలేవేమో, పుట్టిన ఆడపిల్ల. అందరిలా మామూలుగా కాక కాళ్ళు రెండూ సన్నగా పూర్తి అంగవైకల్యంతో పుట్టింది” బాధగా చెప్పింది నర్సు యశోదమ్మ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పని చేసే రాజన్నతో.

“అలాగా, అయితే ఓ చిన్న సాయం చెయ్ నర్సమ్మా, నా భార్య స్పృహలోకి రాకనే ఆ పసిగుడ్డు ముక్కుమూసి ప్రాణాలు తీసెయ్, ఎందుకూ పనికిరాని అవిటి ఆడపిల్లను కళ్ళారా జీవితాంతం చూస్తూ నిత్యం నరకం అనుభవించలేను, ఇప్పుడయితే రెండురోజులే బాధపడి ఆపై మర్చిపోవచ్చు.” మాటల్లో విసుగు, అసహ్యం, జుగుప్స కలగలిపి చెప్పాడు రాజన్న.

“అంత నిర్దయగా మాట్లాడకయ్యా, ఆ పసిగుడ్డు ఏం పాపం చేసిందని చంపేయమంటావ్, నారు పోసినవాడే నీరుపోస్తాడని వినలేదా, అవిటిపిల్లదాన్ని పోషించడం నీకు అంతగా నరకమయితే ఎక్కడైనా హాస్టల్లో చేర్పించెయ్ తప్ప ప్రాణాలు తీసి పాపంమూటకట్టుకోకు” అర్థిస్తున్నట్లుగా చెప్పింది నర్సు.

సరిగ్గా ఇరభై ఏళ్ళ తర్వాత…

“నళినీ, మీ నాన్న రాజన్న వర్క్ చేసేటపుడు జాగ్రత్తగా వుండకపోవడంతో తన రెండు చేతులపై యాసిడ్ ఒలికి పూర్తిగా పనికిరాకుండాపోయాయమ్మా, హాస్పిటల్లో చేర్పించాం, త్వరగా రామ్మా, చూద్దువుగానీ” చెప్పాడు కంగారుగా పరుగెత్తుకుంటూ వచ్చిన రాజన్న తోటి కార్మికుడు శివయ్య.

ఓ రెండు గంటల తర్వాత…

“రాజన్నా, అవిటితనంతో ఉపాధి కోల్పోయి ఎలా బ్రతకగలనని దిగులు చెందుతున్నావేమో, నీకా భయం అవసరం లేదులే” చెప్పింది నర్సు యశోదమ్మ అప్పుడే బెడ్ మీద స్పృహలోకి వచ్చిన రాజన్నతో.

ఆ మాటలు ఏం అర్థం కానట్లు చూశాడు రాజన్న ఆమెవైపు.

“ఆరోజు ఆడపిల్ల అవిటితనంతో పుట్టిందని, జీవితాంతం తనను కళ్ళెదుట చూస్తూ నిత్యనరకం భరించలేనని కనీసమాత్రం దయ, జాలి కూడా లేకుండా, కన్న కూతురనే ప్రేమ లేకుండా కసాయి తండ్రిగా  ముక్కు మూసి ఊపిరితీసెయ్యమన్నావే, ఒకప్పుడు నువ్వు వద్దనుకున్న ఆ అవిటితనం ఆడపిల్లే ఇప్పుడు ఆ కోటాలోనే ఉద్యోగం పొంది… పెద్ద దిక్కుగా నీ అవిటితనాన్నిఆదుకోబోతోంది” చెప్పింది నర్సు యశోదమ్మ చంకలో ఊతకర్రల సాయంతో చేతిలో మాత్రలతో గదిలోకి ప్రవేశిస్తున్న నళినిని చూపిస్తూ.

4. నిజం

“అనిత గారూ, ఎందుకండీ, ఏదో పోగొట్టుకున్నట్లుగా చాలా దిగులుగా వున్నారే?” మధ్యాహ్నం లంచ్ బ్రేక్‌లో తన కొలీగ్, సోషియల్ టీచర్ అనితను అడిగింది మ్యాథ్స్ టీచర్ రాధిక.

“ఏం లేదండీ”నిర్లిప్తంగా జవాబిచ్చింది అనిత.

“ఏదో దాస్తున్నారనే సంగతి మీ మాటల్లోనే వ్యక్తమవుతోందండీ, ఫ్యామిలీ మ్యాటరా?”అడిగింది రాధిక.

“ఫ్యామిలీ మ్యాటర్ కాదండీ, స్కూల్లో పిల్లల గురించే” మెల్లగా గొంతు విప్పింది అనిత.

“ఏం జరిగిందేమిటి?” రాధిక మాటల్లో ఆసక్తి కనిపించింది.

“మా వారు క్యాంపుకు వెళ్ళారు, కూరగాయలు తెచ్చుకుందామని మార్కెట్‌కు వెళితే మన స్కూల్లో లాస్ట్ ఇయర్ తొమ్మిదో తరగతి చదివి ఇప్పుడు పదో తరగతికి ప్రమోట్ అయిన రామూ అక్కడ మూటలు మోస్తూ కనిపించాడు” చెప్పింది అనిత.

“అయ్యో, నిజమా, మీరు చెప్పింది నమ్మలేకున్నా, అయినా వాడు చాలా బ్రెయిట్ స్టూడెంటే, హాయిగా చదువుకోక ఇప్పటినుండీనే సంపాదనకు మళ్ళాడా?” చిరుకోపంతో అంది రాధిక.

“అదేనండీ నా బాధ, నాలుగు అక్షరం ముక్కలు నేర్చుకుంటే పిల్లలు బాగుపడతారని మనం వాళ్ళకోసం ఎంతో ఆరాటపడతామా, వాళ్ళు చూస్తే ఇలా” బాధగా అంది అనిత.

“అక్కడే నాలుగు తగిలించలేకపోయారా, వాడికి ఎంత పొగరు కాకుంటే “కోపంగా అంది రాధిక.

“ఆ పనే చేద్దామనుకున్నా గానీ, మళ్ళీ మనకెందుకులే అని” చెప్పింది అనిత.

“అయ్యో, అమ్మగారూ, రామూ విషయంలో మీరు ఇద్దరూ పొరపాటు పడ్డారు, వాడికి చదువంటే చాలా చాలా ఇష్టం, మార్కెట్లో మూటలు మోసే వాళ్ళ నాన్న హమాలీ గురవయ్య ఆక్సిడెంట్‌లో కాలు విరిగి మంచాన పడ్డాడు, కరోనా వ్యాధి కారణంగా ఇప్పుడు మీరు ఆన్‌లైన్ క్లాసులు చెబుతున్నారు కదా, ఆ పాఠాలు వినడానికి మొబైల్ లేక దాన్ని కొనే డబ్బు కోసమే తన తండ్రికి బదులు మార్కెట్లో మూటలు మోస్తున్నాడు, ఇవన్నీ నాకెలా తెలుసంటే వాళ్ళు వుండేది మా ఇంటికి నాలుగిళ్ళ అవతలే కాబట్టి” అటెండర్ లక్ష్మయ్య చెప్పిన మాటలతో అనిత, రాధికల మొహాలు మ్లానమయ్యాయి తాము నిజానిజాలు తెలుసుకోకుండానే రామూను అపార్థం చేసుకున్నందుకు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here