వేంపల్లి రెడ్డి నాగరాజు నాలుగు మినీ కథలు-39

0
5

[dropcap]వేం[/dropcap]పల్లి రెడ్డి నాగరాజు గారు రచించిన వైవిధ్యమైన నాలుగు మినీ కథలను అందిస్తున్నాము.

1. చురక

“వదినా, ఇవాళ ఇంటర్మీడియెట్ రిజల్ట్స్ వచ్చాయి కదా, మీ అబ్బాయి ఫలితం ఏమయ్యింది? సునందను అడిగింది ప్రక్కింటి కమల.

“ఫెయిలయ్యాడు” జవాబిచ్చింది సునంద.

“అయ్యో, ఎందుకలా, చాలా బాగా చదువుతున్నాడని చెప్పేదానివే?” మళ్ళీ అడిగింది కమల.

“మరేం లేదు సునందా, గత ఆరునెలలకు మునుపు వాళ్ళ నాన్నకు డయాబెటిస్ వచ్చిందికదా, తను ఇప్పుడు పాస్ అయి ఆ ‘తీపికబురు’ చెబితే ఆయన షుగర్ లెవెల్స్ పెరుగుతాయని ఫెయిల్ అయ్యాడు” చెప్పింది సునంద కొడుకు చేతగానితనాన్ని కవర్ చేసేలా అతితెలివి ప్రదర్శిస్తూ.

“అలా అయితే ఫర్వాలేదుగానీ వదినా, ఫెయిల్ అయినట్లు చెబితే అన్నయ్య గారికి కోపం వచ్చి బి.పి. పెరిగి మెదడులో నరాలు చిట్లడమో, గుండెపోటు రావడమో జరిగితే చాలా ప్రమాదం, జాగ్రత్త” హెచ్చరిస్తున్నట్లుగా తను కూడా మెల్లగా చురక అంటించింది కమల.

2. జవాబు

“ఏమండీ, అబ్బాయికి పాతిక రూపాయలు డబ్బు కావాలట, ఇవ్వండి” అడిగింది శైలజ భర్తను.

“దేనికోసమట?” ప్రశ్నించాడు నాగరాజు.

“స్కూల్లో ఏదో అవసరం వుందట” జవాబిచ్చింది శైలజ.

“ఏరా, పాతిక రూపాయలు కావాలన్నావట, ఎందుకోసం?” స్కూలుకు వెళ్ళబోతున్న కొడుకు మహతి కృష్ణను ప్రశ్నించాడు నాగరాజు.

“తాడు కొనుక్కోవడానికి నాన్నా” చెప్పాడు మహతి.

“వ్యాయామం చేసేందుకు స్కిప్పింగ్ రోప్ కొనుక్కోవడానికా?” మళ్ళీ ప్రశ్నించాడు నాగరాజు.

“కాదు నాన్నా, పచ్చదనం పెంపొందించేందుకు” సమాధానమిచ్చాడు మహతి.

“పచ్చదనం పెంచడానికి, తాడుతో పనేంటిరా?” అడిగాడు నాగరాజు అర్థం కానట్లుగా చూస్తూ.

“మరే, నాన్నా, కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోందని, దాన్ని నివారించడానికి విద్యార్థులమంతా మావంతుగా ప్రతి ఒక్కరూ ‘నడుం బిగించుకోవాలని’ నిన్న స్కూల్లో మా సైన్స్ మాస్టారు చెప్పారు నాన్నా, అందుకోసం” తండ్రికి అమాయకంగా బదులిచ్చాడు ఒకటో తరగతి చదివే ఏడేళ్ళ మహతి.

3. సంగీతం మాష్టారు

“జస్వంత్, ఈ అంకుల్ పేరు నాదెళ్ళ వెంకటా చలపతి, నా ఫ్రెండ్, ఈ ఊళ్ళోనే సంగీత పాఠాలు చెబుతాడు” తన వెంట వచ్చిన వ్యక్తిని కొడుక్కి పరిచయం చేశాడు మారగాని రాంబాబు.

“ఈ అంకుల్ బాగా పాడతాడా నాన్నా?” తండ్రిని అడిగాడు జస్వంత్.

“చాలా బాగా పాడతాడు, ఎస్పీ బాలు, జేసుదాసు కూడా ఈయన ముందు దిగదుడుపే, నువ్వు నమ్మవు గానీ, ఈయన పాడితే రాళ్ళు కూడా కరుగుతాయి తెలుసా” చలపతి గురించి గొప్పగా చెప్పాడు రాంబాబు.

“నిజంగానా?” ఆశ్చర్యపోతూ అడిగాడు జస్వంత్.

“చలపతీ, మావాడు నీ గురించి చెబితే నమ్మడం లేదు, ఓ పాట పాడి వినిపించు” స్నేహితుడిని అడిగాడు రాంబాబు.

“ప్లీజ్ అంకుల్, ఇక్కడ వద్దు, బయట వీధిలోకి వెళదాం, అక్కడ రోడ్డు మీద పాడుదువు” వెంటనే గాభరాగా అన్నాడు జస్వంత్ చలపతితో.

“ఎందుకు బాబూ అంతగా కంగారు పడుతున్నావ్?” జస్వంత్‌ను అడిగాడు చలపతి.

“ఏంలేదు అంకుల్, నువ్వు పాడితే రాళ్ళు కూడా కరిగిపోతాయ్ అన్నాడు కదా మా నాన్న, ఈ ఇల్లు కట్టేటప్పుడు పునాదికి రాళ్ళు ఉపయోగించారు, ఇక్కడ పాడితే అవి కరిగి మా ఇల్లు కూలిపోతుందేమోనని” భయం భయంగా చూస్తూ అన్నాడు జస్వంత్.

4. జవాబు

“‘రంగీ, తినడానికి ఏమాత్రం వీలు లేకుండా ఉప్మాలో ఎందుకింత ఉప్పు వేశావ్?” వారం రోజుల క్రితమే తమ ఇంట్లో క్రొత్తగా చేరిన వంటమనిషి కం పనిమనిషిని అడిగింది భారతమ్మ.

“అయ్యో, పొరపాటు జరిగినట్లుందమ్మగారూ” నొచ్చుకుంటున్నట్లుగా అంది పాతికేళ్ళ రంగమ్మ.

“నిన్న మధ్యాహ్నం కూడా బెండకాయ వేపుడు ఇంట్లో ఎవ్వరూ నోట్లో పెట్టుకోని విధంగా బాగా మాడగొట్టావ్” కాస్తంత కోపంగా అంది భారతమ్మ.

“నిజమా అమ్మగారూ, ఏం అనుకోకండి” అభ్యర్థనగా అంది రంగమ్మ.

“నువ్వు ఇక్కడ పనిలో చేరినప్పటినుండీ గమనిస్తున్నా, వంట పని గానీ, ఇంకేదైనా పనిగానీ చేసేటప్పుడు పనిమీద మనసు లగ్నం చేయక ఎప్పుడూ ఏదో ఓ కూనిరాగం తీస్తూనో, నడుం కులికిస్తూ డాన్స్ చేస్తూనో వుంటావెందుకు?” మందలింపుగా అడిగింది భారతమ్మ.

“అలా చేయకుంటే అక్కునేని నాగేశ్వరరావు గారు బాధపడతారని అమ్మగారూ” జవాబిచ్చింది రంగి.

“నువ్వేం చెబుతున్నావో అర్థం కావడం లేదే, కాస్తంత వివరంగా చెప్పు?” అడిగింది భారతమ్మ .

“మరేం లేదమ్మగారూ, పనిలో అలసిపోకుండా ఎప్పుడూ యాక్టివ్‌గా వుండాలని ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపు సొలుపు వుండదని తోడికోడళ్ళు సినిమాలోని పాటలో అక్కినేని చెప్పినట్లుగా చేస్తున్నా అంతే” జవాబిచ్చింది రంగి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here