వేంపల్లి రెడ్డి నాగరాజు నాలుగు మినీ కథలు-6

0
9

[dropcap]వేం[/dropcap]పల్లి రెడ్డి నాగరాజు గారు రచించిన వైవిధ్యమైన నాలుగు మినీ కథలను అందిస్తున్నాము.

1. అభ్యర్థన

“మమ్మీ, నీకు తల్లి కావడమంటే ఇష్టమా?” నీరజను అడిగింది ఆమె కడుపులోని గర్భస్థశిశువు.

“అవును బంగారం చాలా ఇష్టం” ఆనందంగా జవాబిచ్చింది నీరజ తన పొట్ట మీద చేత్తో తృప్తిగా నిమురుకుంటూ.

“కానీ నాకు మాత్రం పుట్టాలని లేదమ్మా” అంది పిండం నిర్వేదనతో.

“ఎందుకు అలా అంటున్నావు తల్లీ?” ఉలిక్కిపడుతూ ప్రశ్నించింది నీరజ.

“పుట్టినప్పటి నుండి నరకం అనుభవించలేను కాబట్టి” బదులిచ్చింది పిండం.

“నరకం అనుభవించడం ఏమిటి చిన్నారీ?” నివ్వెరపాటుతో  అంది నీరజ.

“ఇప్పుడున్నది చాలదన్నట్లుగా నాన్న, నువ్వు చేస్తున్న ఉద్యోగాలు నన్ను ఏడాది వయసు నుండీనే ‘బేబీక్రంచ్’ లకు, ఆపైన ఉజ్వల భవిష్యత్తు పేరిట ఏళ్ల తరబడి కార్పొరేట్ హాస్టల్స్ బందీఖానాల్లో ఖైదు చేయబోనని భరోసా ఇవ్వగలవా?” నిలదీసినట్లు ప్రశ్నించింది పిండం.

“అలాంటివేం ఉండవు తల్లీ, నిన్ను మా దగ్గరే పెట్టుకుని చాలా బాగా చూసుకుంటాం” చెప్పింది నీరజ.

“మీ సంగతి సరే, బయట సమాజంలో మనుషుల్లా మసలే ‘మృగాళ్ల’ నుండీ ఎలా తప్పించుకోను?, అందుకే పిండం దశలోనే నన్ను చంపి, భవిష్యత్తు గండం గట్టెక్కించమని ఆకృతి లేని చేతులతో దండం పెట్టి “అభ్యర్థిస్తున్నా” అంది గర్భస్థ శిశువు.

“నీరజా, లేచి మంచి నీళ్లు తాగు, ఏదో పీడకల వచ్చి కలవరిస్తున్నట్లున్నావ్” చెప్పాడు భర్త సిద్ధార్థ నిద్ర నుండి లేచి పిచ్చి చూపులు చూస్తున్న భార్యతో.

2. చురక

“వంశీ, ఎందుకు నాన్నా అంత దిగులుగా వున్నావు?” సాయంత్రం స్కూలు నుండి వచ్చిన ఐదేళ్ల కొడుకును అడిగింది నందిని.

“నేను నీతో మాట్లాడనుఫో” కోపంతో తల్లిని కసిరినట్లుగా అన్నాడు వంశీ.

“తినడానికి నీకోసం పాయసం సిద్ధంగా ఉంది” కొడుకును వూరిస్తున్నట్లుగా అంది నందిని.

“నేనేం తినను”అలిగినట్లుగా అన్నాడు వంశీ బుంగమూతి పెడుతూ.

“ఎందుకురా నామీద అంత కోపం?” ప్రశ్నించింది నందిని కొడుకును.

“ఉదయం నేను ఆడుకుంటూ కింద పడిపోతే లేపడానికి ఎన్నిసార్లు పిలిచినా రాలేదేం?” ఉక్రోషంగా ప్రశ్నించాడు వంశీ.

“కనీసం ఒక్క సారి కూడా పిలవకుండానే అలా అంటున్నావేం?” అడిగింది నందిని.

“మమ్మీ మమ్మీ అని కనీసం పది సార్లు పిలిచివుంటా. నువ్వు వంటింట్లోనే వుండి నా మాటలు వినబడి కూడా పలకలేదు.” నిష్ఠూరంగా అన్నాడు వంశీ.

“రెండు రోజుల క్రితం వరకు ఎప్పుడూ పిలిచినట్టుగా ‘అమ్మా’ అని పిలిచివుంటే ఒక్క సారికే వినబడి వుండేది కన్నా. కానీ నువ్వు కొత్తగా స్కూల్లో చేరి నేర్చుకొని వచ్చిన ‘మమ్మీ’ అనే పదంతో పిలిస్తే ఎలా అర్థమవుతుందో నువ్వే చెప్పు?” అంది నందిని కొడుక్కి మాతృభాష విలువ తెలియచేసేందుకు ‘చురక’ పెడుతున్నట్లుగా జవాబిస్తూ…

3. శ్రమ

“విజయా, ఈమధ్య నీకు ఒంట్లో బాగుండడంలేదా?” రాత్రి భోజనాల సమయంలో భార్యను అడిగాడు సంజీవప్రసాద్.

“అలా ఏంలేదే, అయినా ఎందుకలా అడిగారండీ?” ప్రశ్నించింది విజయ.

“మనకు పనిమనిషి అవసరం ఏమైనాఉందా?” మళ్ళీ అడిగాడు సంజీవ్

“అలా ఏంలేదే, అయినా ఎందుకలా అడిగారండీ?” ప్రశ్నించింది విజయ.

“మనకు పనిమనిషి అవసరం ఏమైనాఉందా?” మళ్ళీ అడిగాడు సంజీవ్.

“ఇంట్లో నువ్వు నేను అత్తయ్య ముగ్గురము మాత్రమే ఉన్నాం. మళ్ళీ పనిమనిషి ఎందుకు?” చెప్పింది విజయ.

“గత కొంత కాలంగా రోజువారీ నువ్వు చేయాల్సిన పనుల్లో సగం పనుల్ని మా అమ్మతో చేయిస్తున్నావట, యాభైయేళ్ళ పెద్దావిడ, విశ్రాంతి తీసుకోనివ్వచ్చుగా, ఆమెను శ్రమపెట్టడం దేనికి?” కాస్తంత కోపంగానే అన్నాడు సంజీవ్.

“నేను ఆమెను శ్రమపెట్టడమో, కష్టపెట్టడమో చేయడం లేదండీ” చెప్పింది విజయ.

“మరెందుకు హాయిగా నిద్ర పోనివ్వక పనులన్నీ ఆమెకే చెప్పడం?”అడిగాడు సంజీవ్.

“అత్తమ్మ పగలంతా ఖాళీగా ఉంటూ విధివశాత్తు రోడ్డుప్రమాదంలో దూరమైన మీ పెద్దన్నయ్యను తలచుకుని ప్రతిక్షణం కుమిలిపోతోందండీ, ఆవిడ మనసును కాస్తంతయినా మళ్ళించాలనే ఉద్దేశ్యంతోనే కూరలు తరగడం, వంటలో సాయం చేయడం వంటి చిన్నపనులు చెబుతున్నానంతే,పైగా కాస్తంత శారీరక శ్రమ వల్ల రాత్రంతా బాగా నిద్ర కూడా పడుతుందని” అసలు కారణం వివరించింది విజయ.

4. రెండంచుల కత్తి

“ఏరా రంగయ్యా, కనిపించి చాన్నాళ్ళాయనే” తన దగ్గరకొచ్చిన దిగువ పల్లి రంగయ్యను ప్రశ్నించాడు గ్రామనాయకుడు భూషణం.

“యాభైవేలు ‘లెక్క’ సాయం చేయాలి సామీ” అడిగాడు రంగయ్య అభ్యర్థనగా.

“ఇంత అర్జెంటుగా లెక్క ఎందుకురా?” ప్రశ్నించాడు భూషణం.

“నా రెండో కొడుకు పెద్ద సదువు సదివినా ఉద్యోగం రాలేదుప్పా, కోయెట్‌కు పోవల్లనుకుంటాండాడు” బదులిచ్చాడు రంగయ్య.

“మొన్ననే నలభై లక్షలుపెట్టి టౌనులో ఇల్లు కొన్నా కదా, ఇప్పుడు నాకాడ బొత్తిగా లేదుగానీ, ఇంకో ఆరునెలలు ఓపిక పట్టు ఇస్తా” చెప్పాడు భూషణం.

అదే రోజు సాయంత్రం……

“నాన్నా, మనవర్గం వాడు కాకున్నా క్రితం వారం ఎగువ పల్లి సుబ్బయ్య వచ్చి డబ్బు అడిగితే కాదనకుండా వెంటనే సాయం చేశావు, ఎన్నో ఏళ్ళుగా మనల్నే నమ్ముకొని నీ కోసం పనిచేస్తున్న దిగువ పల్లి రంగయ్య డబ్బు అడిగితే వుండి కూడా లేదని అబద్దం చెప్పావెందుకు?” ప్రశ్నించాడు భూషణం కొడుకు గ్రామ యువనాయకుడు శేఖర్.

“వాడికి సాయం చేయకున్నా మన వర్గాన్ని కాదని నన్ను వదిలి ఎక్కడకూ పోడురా, పైగా మనం సాయం చేస్తే కొడుకు కోయెట్‌కు వెళ్ళపోతాడు, మరో నెల రోజుల్లో జరగబోయే పంచాయతీ ఎలక్షన్లలో మనకు గ్యారంటీగా పడాల్సిన ఒక ఓటు కూడా తగ్గుతుంది, అందుకే ఆరు నెలలు ఆగమని చెప్పా” కొడుక్కు బదులిచ్చాడు భూషణం తన రాజకీయం ‘రెండంచులకత్తి’ అని అర్థం చేసుకోమన్నట్లుగా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here