వేంపల్లి రెడ్డి నాగరాజు నాలుగు మినీ కథలు-7

0
9

[dropcap]వేం[/dropcap]పల్లి రెడ్డి నాగరాజు గారు రచించిన వైవిధ్యమైన నాలుగు మినీ కథలను అందిస్తున్నాము.

1. ఏ విత్తు నాటితే

“నాన్నా, అమ్మను చూడాలని పదే పదే అనిపిస్తోంది, వచ్చి తీసుకెళ్ళు నాన్నా” ఫోన్ చేసిన తండ్రి చంద్రశేఖరాన్ని బతిమాలాడు కార్పొరేట్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న పదిహేనేళ్ల చరణ్.

“పరీక్షలు మరో రెండు నెలల్లోనే కదా వున్నాయి, సిలబస్ మిస్ చేసుకుని ఇప్పుడు ఇంటికి వస్తానంటున్నావేంటి, మార్కులు తగ్గిపోవా?” కొడుకును మందలిస్తున్నట్లుగా అన్నాడు చంద్రశేఖరం.

“మూడు నెలలుగా అడుగుతున్నా నాన్నా, ‘ప్లీజ్ నాన్నా'”మరొకసారి ప్రాధేయపడ్డాడు చరణ్.

“చరణ్, నిన్ను లక్షలు పోసి చదివిస్తున్నా, నీకు ర్యాంకు తగ్గితే భరించలేను, ఒకేసారి శెలవుల్లో వచ్చి తీసుకెళతాను” కఠినంగా చెప్పి కాల్ కట్ చేశాడు తండ్రి.

పాతికేళ్ల తర్వాత…..

“నిన్ను చూడాలనివుందిరా, పదే పదే కళ్లల్లో కనిపిస్తున్నావు, పెళ్ళయ్యాక వెళ్లిన వాడివి, ఒక్కసారి వచ్చి వెళ్ళు” ఫోనులో అడిగాడు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉంటున్న కొడుకు చరణ్‌ను రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాల పాలయ్యి ఆసుపత్రిలో మంచంమీద ఉన్న చంద్రశేఖరం.

“సారీ నాన్నా, పిల్లలకు మరో రెండు నెలల్లో పరీక్షలు జరగబోతున్నాయి, సిలబస్ మిస్ అయితే వాళ్ళకు ర్యాంకులు తగ్గిపోతాయి, పరీక్షల విలువ నాకంటే నీకే బాగా తెలుసు కదా, ఇప్పుడు రావడం అస్సలు కుదరదు” చెప్పి కాల్ కట్ చేశాడు చరణ్ ‘ఏ విత్తు నాటితే’ ఆ మొక్కే వస్తుందన్నట్టుగా.

2. పండుగ

“సుజీ, నీ మొబైల్‌కు సిగ్నల్ సరిగా లేవని నీ బెస్ట్ ఫ్రెండ్ స్వాతి మధ్యాహ్నం నాకు కాల్ చేసింది” ఆఫీసు నుండి రాగానే భార్యతో చెప్పాడు కిరణ్.

“అయ్యో! అలానా, ఇంతకీ స్వాతి ఏం చెప్పిందండీ?” అడిగింది సుజాత.

“మనం ఈ పండుగకు వాళ్ళ ఊరు వెళ్ళాలట” బదులిచ్చాడు కిరణ్.

“అదెలా కుదురుతుందండీ?, మనల్ని రమ్మని పిలవడానికి రేపు మా నాన్నగారు కూడా వస్తున్నారు” భర్తతో అంది సుజాత.

“మనల్ని ఖచ్చితంగా రావాల్సిందేనని పట్టుబట్టి నా దగ్గర మాట కూడా తీసుకుంది, వెళ్ళక తప్పదు” చెప్పాడు కిరణ్.

“మన పెళ్ళయ్యాక వచ్చిన తొలి పండుగ, వెళ్ళకపోతే ఊళ్ళోఅంతా అనుమానిస్తారు, మనం మా ఊరికి వెళ్ళాల్సిందే” స్థిరంగా పలికినట్లు అంది సుజాత.

“నేను స్వాతికి మాటిచ్చాను సుజాత, మీ నాన్నగారికి కావాలంటే నేను సర్దిచెబుతాలే” భార్యను ఒప్పిస్తున్నట్లుగా అన్నాడు కిరణ్.

నాలుగు రోజుల తర్వాత….

“మా పెళ్ళి చేయడానికే డబ్బు పరంగా ఎన్నో ఇబ్బందులు పడిన మా నాన్నను ఈ పండుగ పేరుతో మళ్ళీ ఇబ్బందులు పాలు చేయడం ఇష్టంలేక నా రిక్వెస్ట్ మేరకు మీ ఇంటికి ఆహ్వానించి పెద్ద సాయం చేసినందుకు థ్యాంక్స్ స్వాతీ” కళ్ళనిండా నీళ్ళతో స్నేహితురాలు స్వాతిని కావలించుకుంటూ చెప్పింది సుజాత.

3. గిరాకీ

“నమస్తే సార్, మీతో ఓ పదినిమిషాలు మాట్లాడవచ్చా?” ఓ నేషనల్ బ్యాంక్ మేనేజర్‌ని అడిగాడో నిరుద్యోగి అతడి ఛాంబర్లో కలిసి.

“కూర్చోండి, ఏం కావాలి మీకు?” ఎదురుగా వున్న కుర్చీ ఆఫర్ చేశాడు మేనేజర్.

“మీ బ్యాంకులో లోను కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నా” చెప్పాడా యువకుడు తన పేరు, విద్యార్హతల్ని పూర్తిగా వివరిస్తూ.

“పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా లోన్ కావాలంటున్నారు, ఇంతకీ ఏం యూనిట్ పెట్టాలనుకుంటున్నారు?”అడిగాడు మేనేజర్ అతడి సర్టిఫికెట్లను పరిశీలిస్తూ.

“తాళ్ళ పరిశ్రమ సార్” చెప్పాడు నిరుద్యోగి.

“వేరే ఎన్నో యూనిట్లు ఉండగా వాటిని కాదని ఆ తాళ్ల పరిశ్రమనే ఎందుకు పెట్టాలనుకుంటున్నారు” మళ్ళీ ప్రశ్నించాడు మేనేజర్.

“ఇప్పుడు గిరాకీ బాగుంది, రాబోయే రోజుల్లో మరింత బాగుంటుంది కాబట్టి” సమాధానమిచ్చాడు నిరుద్యోగి.

“ఎలా చెప్పగలుగుతున్నారు” తెలుసుకోవాలన్న ఆసక్తి కనిపించింది మేనేజర్ గొంతులో.

“ప్రభుత్వాలు ఆదుకోక, వడ్డికిచ్చిన వ్యాపారుల బాధలు తట్టుకోలేక రైతులు విరివిగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కాబట్టి” చెప్పాడు నిరుద్యోగి వారం క్రితమే పొలంగట్టున ఉరితాడుకు వ్రేలాడుతున్న తండ్రి శవం కళ్ళముందు కదలాడుతుండగా…

4. ఆకలి

“మీపేరు రంగనాధం కదండీ?” ప్రయాణంలో తన పక్క సీటులో కూర్చుని వున్న వ్యక్తిని పలకరించాడు గోపాల్.

“అవునండీ, మీకెలా తెలుసు?ఇంతకీ మీరు?” సందేహంగా చూస్తూ అడిగాడు రంగనాధం.

“ఒకప్పుడు యూనివర్సిటీలో మీ బ్యాచ్‌మేట్‌ని” చెప్పాడు గోపాలం చిరునవ్వు నవ్వుతూ.

” గుర్తుపట్టలేదండీ, సారీ, అయినా నన్నెలా కనుక్కున్నారు?” అడిగాడు రంగనాధం.

“మీ ఎడమ కంటి ప్రక్కన వున్న గాయం తాలూకూ మచ్చ వల్ల” బదులిచ్చాడు గోపాల్.

“మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు?” అడిగాడు రంగనాధం పాత జ్ఞాపకాలలోకి జారిపోతూ.

“బ్యాంకులో ఆఫీసరుగా వుంటున్నా, మరి మీరు?” ప్రశ్నించాడు గోపాల్.

“సిటీలో ఏదైనా రోజువారీ పని దొరుకుతుందేమోనని వెళుతున్నా” బదులిచ్చాడు రంగనాధం.

“మీరింకా ఉద్యోగ జీవితంలో స్థిరపడలేదా?” ఆశ్చర్యం ధ్వనించింది గోపాల్ గొంతులో.

“లేదండి, అది దొరక్కే ఈ పాట్లు” నిర్లిప్తంగా చెప్పాడు రంగనాధం.

“అన్నట్లు మీరు యూనివర్సిటీలో వుండగా దేవుడే లేడని ఫక్తు హేతువాదిగా వాదిస్తూ వేదికలమీద, హాస్టల్ రూముల్లో వాదోపవాదాలు జరిపేవాళ్ళు, ఇప్పుడు చూస్తే నుదుటన రూపాయి కాసంత బొట్టుతో?” ఎర్రగా మెరుస్తున్న కుంకుమ బొట్టు వంక చూస్తూ అడిగాడు గోపాల్.

“నమ్ముకున్న నాస్తికత్వం, చదివిన చదువు సరిగ్గా తిండి పెట్టడం లేదండీ, ఆస్తికుడిగా మారి పూట గడవనప్పుడల్లా వారంలో ఏదో ఓ దేవుడి పేరు చెప్పి ఉపవాసం వుంటా ‘ఆకలి’తో అల్లరి చేసే ఆత్మారాముడిని సముదాయించే సౌలభ్యం వుందని” చెప్పాడు తను దిగాల్సిన స్టేజీ రావడంతో సీటులో నుండీ లేస్తూ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here