వేంపల్లి రెడ్డి నాగరాజు నాలుగు మినీ కథలు-8

0
6

[dropcap]వేం[/dropcap]పల్లి రెడ్డి నాగరాజు గారు రచించిన వైవిధ్యమైన నాలుగు మినీ కథలను అందిస్తున్నాము.

1. సంపాదన

“నమస్తే హరీంద్రగారూ బాగున్నారా?”ఆదివారం ఉదయం కూరగాయల మార్కెట్ వద్ద కనిపించిన హరీంద్రను పలకరించాడు భార్గవ.

“నమస్తే భార్గవ గారూ” నవ్వుతూ విష్ చేశాడు హరీంద్ర.

“ఈ మధ్య బొత్తిగా కనిపించడమే లేదండి”అడిగాడు భార్గవ.

“మార్చి నెల కదండీ, క్లోజింగ్ పనుల ఒత్తిడి ఎక్కువగా వుంది, బ్యాంకు ఉద్యోగిని కదా” చెప్పాడు హరీంద్ర.

“అన్నట్లు అడగడం మరిచా, మీ కొలిగ్స్ హేమశేఖర్, సునందలు ఇటీవల ఉదయం సాయంత్రం వేళల్లో తమ ఇంటి వద్ద ట్యూషన్లు చెబుతున్నారట నిజమేనా?” ప్రశ్నించాడు భార్గవ.

“అవునండీ, నిజమే” బదులిచ్చాడు హరీంద్ర.

“బ్యాంకు ఉద్యోగులుగా ఉంటూ ప్రతినెలా ఇద్దరూ చెరొక లక్ష రూపాయల దాకా జీతం డ్రా చేస్తూ కూడా ఇంకా ట్యూషన్ల ద్వారా సైతం సంపాదించాలని ఎంత ఆశ హరీంద్ర గారూ, ఆ భార్యాభర్తలకిద్దరికీ, క్షణం కూడా తీరక లేకుండా సంపాదించి, అదంతా ఏం చేస్తారో” ఏవగింపుగా అంటున్నట్లు అన్నాడు భార్గవ.

“మీరు అనుకుంటున్నట్లుగా వాళ్ళు డబ్బు కోసం ట్యూషన్లు చెప్పడం లేదండీ, చేతికి ఎదిగి వచ్చి దురదృష్టవశాత్తు చనిపోయిన కొడుకుల్ని కొందరు నిరుపేద పిల్లల్లో చూసుకుంటూ తమ జీతాల్ని సైతం వాళ్ళ కోసమే ఖర్చు పెడుతున్నారు” గొంతులో కాఠిన్యం ధ్వనిస్తుండగా జవాబిచ్చాడు హరీంద్ర.

2. ఐదవ వరం

“భక్తా, నీ తపస్సుకు మెచ్చాను, నిన్ను ఇలాగే బొందితో స్వర్గానికి పంపమంటావా?” పదేళ్ల పాటు ఘోర తపస్సు చేసిన ఓ భక్తుడికి ప్రత్యక్షమై అడిగాడు దేవుడు.

“వద్దు స్వామీ, నేను ఉంటున్న ఈ భూలోకాన్నే స్వర్గంగా మార్చండి చాలు” అడిగాడు భక్తుడు.

“అదెలా సాధ్యం, తపస్సు చేసినది నువ్వొక్కడివేగా?” అన్నాడు దేవుడు.

“నిజమే స్వామీ, నేను స్వర్గంలో ఉన్నట్లుగా మాలోకంలో కూడా సుఖసంతోషాలతో బతకాలనే నేనడిగా, ఓ ఐదు వరాలిస్తే చాలు” పట్టుబడినట్లు అన్నాడు భక్తుడు.

“ఏమిటో అవి?”సందేహంగా చూస్తూ అడిగాడు దేవుడు.

“రైతులు ఏ ఇబ్బందులూ లేకుండా బతకాలి, ఏ ఒక్కరూ తమ తల్లిదండ్రులను వృధ్ధాశ్రమాలకు తరలించకుండా ఉండాలి, పసిపిల్లలు అమ్మానాన్నల అంతులేని అత్యాశలవల్ల తమ అందమైన బాల్యాన్ని కోల్పోకుండా చూడాలి” ఆయాసం తీర్చుకునేందుకు ఆగాడు భక్తుడు.

“ఇంకా” ఇవన్నీ తేలికే అన్నట్లు మొహం పెట్టి అడిగాడు దేవుడు.

“ఏ మగాడు పసిపాపతో సహా పరాయి ఆడదాన్ని కామదృష్టితో చూడనైనా చూడకూడదు, ముఖ్యంగా నా దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా కనీసం ఒక్క హామీ కూడా ఇవ్వని వాడుగా మారాలి” ఇంతే అన్నట్లుగా చెప్పాడు భక్తుడు.

“ఆ చివరి ఐదవ వరం ఇవ్వడం కుదరదు భక్తా” చెప్పాడు దేవుడు కలవరపడుతూ.

“మీకు కుదరనిదా?”నమ్మలేనట్లు అడిగాడు భక్తుడు.

“ఆ వరం ఇచ్చే ప్రయత్నం చేస్తే నువ్వు చెప్పే ఆ నాయకులే నా పీఠానికి ఎసరు పెట్టి నా పదవికే ఎసరు తెస్తారు కాబట్టి” చెప్పి ఠక్కున అంతర్ధానమయ్యాడు దేవుడు.

3. పండుగ

“పిల్లలూ, మనం ఈ పీరియడ్‌లో రోజూ మాదిరి పాఠాలు కాకుండా వేరే విషయాలు ఏవైనా మాట్లాడుకుందామా?”ఎనిమిదో తరగతి గదిలో అడుగు పెట్టగానే అడిగాడు గ్రామీణ ప్రాంతంలోని ఆ స్కూల్‌కి నెలక్రితమే బదిలీపై వచ్చిన రవి అనే టీచర్.

“అలాగే సార్” ఉత్సాహంగా కేకలు వేసి మరీ చెప్పారు పిల్లలంతా ముక్తకంఠంతో.

“దేని గురించి చెప్పుకుందామో మీరే నిర్ణయించండి” అని అవకాశాన్ని పిల్లలకే ఇచ్చారు టీచర్.

“పండుగ గురించి చెప్పుకుందాం సార్” అన్నాడు ఓ విద్యార్థి లేచి నిలబడి.

“సరే ఒక్కొక్కరే లేచి నిలబడి మీకు ఏ పండుగ, ఎందుకు ఇష్టమో చెప్పండి “అడిగాడు టీచర్.

“నాకు సంక్రాంతి పండుగ అంటే ఇష్టం సార్, మూడు రోజుల పండుగ కనుక తినుబండారాలు బాగా తినొచ్చు చెప్పాడు” హరి అనే విద్యార్థి.

“నాకు దీపావళి అంటే ఇష్టం సార్, టపాకాయలు బాగా కాల్చొచ్చు” ఉత్సాహంగా చెప్పాడు రవిచంద్ర అనే విద్యార్థి.

“నాకు దసరా ఇష్టం సార్, సెలవులు వస్తాయి కాబట్టి” అన్నాడు కిరణ్ అనే విద్యార్థి మెల్లగా.

“కుమార్, నువ్వు చెప్పు” లేవడానికి తటపటాయిస్తున్న విద్యార్థిని అడిగాడు టీచర్.

“ఓట్ల పండుగ సార్” బదులిచ్చాడు ఆ అబ్బాయి గొణుగుతున్నట్లుగా ఎవరికీ వినపడకుండా.

“ఓట్ల పండుగ అంటున్నావు, అయినా అది పండుగ కాదు కదా!” ఆశ్చర్యంగా అడిగాడు టీచర్.

“మా అమ్మా నాన్నలు, ఇద్దరు అన్నలు, ఒక అక్క, మొత్తం పెద్దలు ఐదుగురు వున్నారు సార్, ఎలక్షన్ వస్తే ఒక్కొక్కరికి రెండు వేలు చొప్పున వస్తుంది, ఆ సొమ్ముతో అందరం బట్టలు కుట్టించుకుంటాం…”

“ఎన్నికలు వచ్చేది ఐదేళ్ళ కొకసారే కదా, మరి మిగతా రోజులు ఎలా?” మధ్యలో కల్పించుకుంటూ ప్రశ్నించాడు రవి.

“ఎం.పి.టి.సి లకు, జెడ్పీటీసీ లకు, సర్పంచ్‌లకు కూడా ఎన్నికల మధ్యలో వస్తుంటాయి సార్” టక్కున బదులిచ్చాడు కుమార్ తడబడకుండా.

బడుగు రైతు కూలీ కొడుకు సమాధానం వినబడనట్లు వుండిపోయాడు టీచర్.

4. వ్యాపారం

“నమస్తే సార్, మిమ్మల్ని కలవడానికి ఉదయం కూడా వచ్చి వెళ్లాను” చెప్పాడు వాస్తు ప్లానర్స్ అండ్ కన్సల్టెన్సీ ఆఫీస్ లోకి అడుగు పెట్టిన రాజేశ్వరరావు.

“కూర్చోండి, ఏం కావాలి?”అడిగాడు చీఫ్ కన్సల్టెంట్ ఇంజనీర్ శ్రీనివాస్.

“నేను ఈ మధ్యనే గవర్నమెంట్ సర్వీస్ నుండి రిటైర్ అయ్యానండీ, ఊరవతల నాకు ఉన్న ఖాళీ జాగాలో ఓ బిల్డింగ్ నిర్మించేందుకు మీరు ఓ ప్లాన్ గీసి ఇవ్వాలి” చెప్పాడు రాజేశ్వరరావు తన వ్యక్తిగత కుటుంబ వివరాలు వెల్లడిస్తూ.

“ఆ బిల్డింగ్ ఎందుకోసం?ఎంత ఖర్చుతో నిర్మించాలనుకుంటున్నారు?” అడిగాడు శ్రీనివాస్.

“కనీసం ఓ వందమంది ఉండేలా అన్ని సౌకర్యాలతో ఆధునాతనంగా ఉండేలా ఓ వృద్ధాశ్రమాన్ని పాతిక లక్షల ఖర్చుతో కట్టాలి అనుకుంటున్నానండీ” చెప్పాడు రాజేశ్వరరావు.

“రేపు ఉదయం ఓసారి స్థలం దగ్గరికి వెళ్ళొద్దాం, పది గంటలకు రండి”అన్నాడు శ్రీనివాస్.

“అలాగే సార్, నేనే వచ్చి పికప్ చేసుకుంటాను” అన్నాడు రాజేశ్వరరావు వెళ్లడానికి లేస్తూ.

“ఒక్క మాట, ఈ వయసులో అంత పెద్ద మొత్తం ఖర్చు పెట్టి వృద్ధుల కోసం ఈ రకమైన సామాజిక సేవ చేయాలనుకోవడం నిజంగా మీ గొప్ప మనసుకు నిదర్శనమండీ” మెచ్చుకోలుగా అన్నాడు శ్రీనివాస్.

“అయ్యో, మీరు పొరబడినట్లున్నారండీ, ఆ వృద్ధాశ్రమం ఉచిత సేవల కోసం కాదు ప్రయోజకులై రెక్కలొచ్చాక విదేశాలకు వెళుతూ కొడుకులు వదిలేసిన తల్లిదండ్రుల వల్లా, భర్తలను చెప్పు చేతుల్లో పెట్టుకొని కోడళ్ళచే ఇంట్లోంచి గెంటివేయబడ్డ అత్తమామల వల్లా నేడు వృధ్దాశ్రమాల ‘వ్యాపారం’ జోరందుకుంటోంది కదా అందుకని… “

రాజేశ్వరరావు మాటలకు నిర్లిప్తుడయ్యాడు శ్రీనివాస్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here