వేములవాడ – నాంపల్లి గుట్ట దర్శన యాత్ర-3

0
16

[ఇటీవల వేములవాడ, నాంపల్లిగుట్ట దర్శించి ఆ యాత్రానుభవాలను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

[dropcap]వే[/dropcap]ములవాడ చాలా పెద్ద ఊరు. చిన్న టవున్ అని చెప్పవచ్చు. రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం ఊరి నడిబొడ్డున ఉంది. కొంచెం ఎత్తులో ఉంది. ఒక ఇరవై మెట్లు ఎక్కితే ఆలయ ప్రాంగణం లోకి ప్రవేశిస్తాము.

దేవీ నవరాత్రుల సందర్భంగా ఆలయాన్ని విద్యుద్దీపతోరణాలతో అలంకరించారు. ప్రధాన ద్వారం, రాజ గోపురం, దీపకాంతులతో మెరిసిపోతున్నాయి.

చాలా పురాతనమైన దేవళం. స్వామివారిని ప్రజలు ‘ఏములాడ రాజన్న’ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. అమ్మవారు బాలా త్రిపురసుందరి.

ధర్మదర్శనం క్యూలో ప్రవేశించాను. పావుగంటలో రాజరాజేశ్వరుని సన్నిధిని చేరుకున్నాను. లింగాకృతి లోని పరమేశ్వరుని, వెండితొడుగుతో అలంకరించారు. ఇంతింత కళ్లతో, మీసాలతో, ఏములాడ రాజన్న, భక్తవశంకరుడై, భవనాశంకరుడై దర్శనమిచ్చాడు.

‘ధన్యోస్మి పరమాత్మా!’ అనుకున్నాను. ‘నిరాడంబరుడు, స్మశాన వాసి, కపాలి, భస్మోద్ధూళిత విగ్రహుడు, రుద్రాక్షమాలా ధారి, వృషభ వాహనారూఢుడు, ఉమాధవుడు, కుమారగురువు శివుడు. హరహ రమహాదేవ! శంభో శంకర!’ అని నినదించాను. భక్తితో గుండె బరువెక్కింది. మృత్యుంజయ మహామంత్రాన్ని, ఆ పక్కనే ఉన్న అరుగు మీద కూర్చుని, పదకొండు సార్లు జపించాను.

‘ఓం త్ర్యంబకం యజామహే
సుగంధిం పుష్టివర్ధనమ్।
ఉర్వారుకమివ బంధనాన్
మృత్యోర్ముక్షీయ మామృతాత్॥’

ఇంతలో, స్వామివారికి హారతి యిస్తున్నారు. విద్యుత్తుతో నడిచే, ఒక డింఢిమము (ఢక్క), చైతన్యశీలమై, ఢమఢమ శబ్దములు చేయసాగింది లయబద్ధంగా! భక్తుడొకరు గర్భగుడి ముందు వేలాడుతున్న పెను గంటను వాయించసాగాడు.

పూజారి, ఎన్నో దీపాలు వెలుగుతున్న, హారతి స్టాండ్‌తో రాజన్న స్వామికి నీరాజనం ఇవ్వసాగాడు. ఆ దృశ్యం నిరుపమానం. శివనామ స్మరణతో దేవాలయం మారుమోగింది.

‘భవాయ చంద్రచూడాయ
నిర్గుణాయ గుణాత్మనే।
కాలకాలాయ రుద్రాయ
నీలగ్రీవాయ మంగళం॥’

అని ఆ ఆదిమధ్యాంత రహితుని ప్రార్థించాను. హారతి స్టాండ్‌ను బయటికి తెచ్చి, అందరికీ హారతిని కళ్లకద్దుకోనిచ్చాడు పూజారి. దేవాలయ ప్రాంగణంలో అనేక ఉపాలయాలున్నాయి. అందులో చెప్పుకోదగ్గది ‘అనంతపద్మనాభస్వామి వారి ఆలయం’. స్వామి పడుడుకున్న భంగిమలో, సర్వాభరణ భూషితుడై ఉన్నారు. ‘సీతాలక్ష్మణ హనుమత్సమేత శ్రీరామచంద్రపరబ్రహ్మ’ ఒక ఉపాలయంలో వేంచేసి ఉన్నారు.

‘గండా దీపం’ అన్న చిన్న ఉపాలయంలో దేవతామూర్తి తన చేతిలోని పళ్లెంలో, దీపజ్యోతిని పట్టుకుని ఉన్నది. ఏదైనా గండం వస్తే, దాన్ని దాటించడానికి, తలపైన గండా దీపం పెట్టుకుని మోస్తామని భక్తలు స్వామివారిని మొక్కుకుంటారు. ఈ సంప్రదాయం మా అహోబిళ నరసింహస్వామివారి ఆలయంలో ఉంది. మోసేముందు ‘జ్యోతి స్వరూపశ్రీలక్ష్మీనృసింహ దేవాయనమః’ అని స్వామిని ఆవాహనం చేసి, వెలుగుతున్న జ్యోతి గల పళ్లెమును శిరసున పెట్టుకొని, గుహాంతర్భాగములో కొలువైన ‘ఓలమయ్య’ దగ్గరకు మోసుకొనిపోయి, విగ్రహము ఉన్న గుహ వితర్దిక ముందు దించుతారు.

గండా దీపం మోసేవారికి క్యూ లైన్ లోని భక్తులు, దారి ఇస్తారు. ఫ్యాన్లు ఆపివేస్తారు. మోస్తున్నవారికి పోను పోను ఆ జ్యోతి పళ్లెరం బరువెక్కుతున్నట్లు అనిపిస్తుంది. స్వామివారు దగ్గర అయ్యేకొద్దీ, బరువు తగ్గుతూ ఉంటుంది. ‘జ్వాలా నృసింహుడ’ని స్వామికి పేరు. ఆయన పేరే మా మనుమనికి ‘ప్రజ్వల్’ అని పెట్టుకున్నాము.

ఈ గండా దీప గుడిని చూసి అదంతా నాకు గుర్తొచ్చింది.

గర్భాలయం నుంచి గుడి ప్రాంగణం లోకి వచ్చాను. అక్కడ ఒక పురాతన స్తంభం వద్ద కాసేపు కూర్చున్నాను. లేచి, వెళ్లబోతుంటే, ఒక భక్తుడు – “కొంచెం సేపట్ల రాజన్నకు వాహన సేవలు జరుగుతాయి. చూసి వెళ్లండి” అని చెప్పాడు. మహాభాగ్యం!

వృషభవాహనము
గరుడవాహనము

వాహన సేవ అత్యద్భుతం! ముందు కాగడాలు పట్టుకొని కొంతమంది నడుస్తూండగా, వెనక వృషభవాహనము, దాని తర్వాత గరుడవాహనము వచ్చాయి. చిన్న పల్లకీలవలె ఉన్నాయి. వాటిని నలుగురు చొప్పున మోస్తున్నారు. వృషభవాహనారూఢుడు, గరుడవాహనారుఢైన రాజరాజేశ్వరస్వామి, దేవాలయం చుట్టూ ఊరేగాడు. సాలంకృతములైన ఆ వాహనముల సౌందర్యం చూడవలసిందే.

వాహన సేవ

గుడి ప్రాంగణంలో తెలుపురంగులోని కోడెలు (వృషభములు) కనబడినాయి. అక్కడ శ్రీకృష్ణపరమాత్మ స్వయముగా శివునికి కోడెమొక్కు చెల్లించినాడని, ఐతిహ్యాం. దక్షిణ కాశిగా పేర్గాంచిన వేములవాడలో మాత్రమే ఈ సంప్రదాయం ఉంది.

కోడెలు కాటుక కన్నులతో, నూనె రాసినందువల్ల మెరుస్తున్న శృంగములతో, ఈగవాలినా జారిపోయే నునుపైన మేనితో శోభిల్లుతున్నాయి. అవి పరమసాధువులు. అంతమంది జనం ఉన్నా అవి బెదరడంలేదు. ఎంతో మంది వెళ్లి వాటికి నమస్కరిస్తున్నారు. ఎవరినీ ఏమీ అనటంలేదు. నందీశ్వర ప్రతిరూపాలవి. నిర్వికారంగా నిలబడి ఉన్నాయి. వాటిని దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేయిస్తున్నారు. మహిళలు సైతం, తాము శివునికి అర్పించడానికి తెచ్చిన కోడెను, తాడు పట్టుకొని ముందు నడుస్తూ ఉంటే, చక్కగా నడచి వస్తున్నాయి.

‘కోడెమొక్కు టికెట్ కౌంటర్’ అని ఉంది. కోడెమొక్కు చెల్లించడానికి రుసుము 250/- రూపాయలు దేవస్థానం వారికి చెల్లించాలి.

పరమశివుడు ప్రశాంతత కోసం వచ్చిన నెలవిది. సూర్యుడు ఇక్కడ పునీతుడైన దివ్యక్షేత్రం. పుష్కరిణిని ధర్మగుండం అని పిలుస్తారు.

యవ్వనంలో ఉన్న వృషభరాజులను కోడెలంటారు. వాటిని రాజన్నకు సమర్పిస్తే ఈప్సితార్థములు ఈడేరుతాయని భక్తులు నమ్ముతారు. నందీశ్వరుడు ఈశ్వరునికి నమ్మినబంటు కదా! ఈ సంప్రదాయానికి ద్వాపరయుగంలో శ్రీకృష్ణపరమాత్మ శ్రీకారం చుట్టాడని స్థలపురాణం చెబుతున్నది. శ్రీకృష్ణ, జాంబవతీ దంపతులకు రాజరాజేశ్వరస్వామి అనుగ్రహం తోనే ‘సాంబుడు’ అన్న కొడుకు పుట్టాడట. అందుకు ప్రతిగా గోపాలుడు శివునికి కోడెను మొక్కుగా సమర్పించాడట.

పాండవులు తమ దక్షిణాపథ యాత్రకు వెళ్లేముందు, వేములవాడను దర్శించుకున్నారు. ఆలయంలోని సోమేశ్వర, ఉమామహేశ్వర, బాలరాజేశ్వర, భీమేశ్వర మొదలగు లింగములు పాండవ ప్రతిష్ఠితములని అంటారు.

సమర్పించబడిన కోడెలను దేవస్థానం వారు వివిధ గోసంరక్షణ సొసైటీలకు, గోశాలలకు అప్పగిస్తారు. స్వామి వారి ఆదాయంలో ఎక్కువ భాగం కోడెమొక్కుల ద్వారానే వస్తుందట. కోడెమొక్కులు మూడు రకాలుగా ఉంటాయి.

  1. నిజకోడె : సొంతంగా ఇంట్లో పెరిగిన కోడెను
  2. గోశాలలో కొని తెచ్చే కోడెను
  3. ఇతర బంధువుల కోడెను.

ప్రతి శివరాత్రికి కోడెమొక్కుల ఆదాయం యాభై లక్షల రూపాయల వరకు (సుమారు) ఉంటుందని తెలిసింది.

ఈ క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది.

జిల్లాకు స్వామివారి పేరు పెట్టడం ఎంతో ఔచిత్యశోభితం. వేములవాడ క్షేత్రం పశ్చిమ చాళుక్యుల కాలం నుంచి ఉందని, ఇక్కడి పురాతత్త్వ ఆధారాలు తెలుపుతున్నాయి. ఈ ప్రాంతాన్ని పరిపాలించిన తొలి రాజు ‘మొదటి నరసింహుడు’. ఆయనకు ‘రాజాదిత్య’ అని బిరుదు ఉండేది. ఈయన, మొదటి వినయాదిత్య యుద్ధమల్లుని పౌత్రుడు, అంటే మనుమడు. మధ్యయుగాలలో ఈ ఊరు చాళుక్య రాజధానిగా ఉండేదంటారు.

1830లో ఏనుగుల వీరాస్వామిని వ్రాసిన తన కాశీయాత్రా గ్రంథంలో, ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. డిచ్‍పల్లి దగ్గర జగనం పల్లిలో ఆయన మజిలీ చేశారు. అదంతా దుర్గమారణ్యం. పులుల సంచారం ఎక్కువ.

‘ధర్మగండం’ పుష్కరిణిలో మనకు మూడు మండపాలు దర్శనం ఇస్తాయి. మధ్యమండపంపై ధ్యాన ముద్రలోని శివుని విగ్రహం, దాని చుట్టూ ఐదు శివలింగాలు ఉంటాయి.

ఈ క్షేత్రానికి భాస్కర క్షేత్రమనీ, హరిహర క్షేత్రమనీ పేర్లున్నాయి. దీని ప్రస్తావన భవిష్యోత్తరపురాణం లోని రాజేశ్వర ఖండంలో ఉంది. అర్జునుని మునిమనుమడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపడంవల్ల, అతనికి బ్రహ్మహత్యాపాతకం కలిగి, ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేయడం వలన అది తొలగిపోయిందని ఐతిహ్యం. ఆయన కొలను సమీపంలో రాజేశ్వరలింగాన్ని ప్రతిష్ఠించాడని స్థలపురాణం.

శైవులు, వైష్ణవులు, జైనులు, బౌద్ధులు, అందరూ ఈ క్షేత్రాన్ని దర్శిస్తారు. దేవాలయం మీద కనబడే శిల్పాలు సైతం ఆయా మతాల సంస్కృతులను ప్రతిబింబిస్తాయి.

దేవాలయ ప్రాంగణం లేనే 400 సంవత్సరాల నాటి మసీదు ఉంది. ఒక ముస్లిం స్వామివారి మూర్తిని అవమానిస్తే, భక్తులు ఆయనను చంపేశారని, ఆ ప్రాంత ముస్లింపాలకుడు అతని శవాన్ని అక్కడే ఖననం చేయించి ‘మాజార్’ కట్టించాడనీ అంటారు. దీనిని ‘హజరత్ బాబా భాజా బాగ్ సవార్ దర్గా’ అని అంటారు. హజరత్ బాబా మహాశివభక్తుడని, స్వామిని ఎల్లకాలమూ పూజిస్తూ, అక్కడి శివైక్యం చెందాడని, ఆయన పేరిటే ఈ మసీదు వెలసిందనీ కూడా అంటారు.

దేవీనవరాత్రుల సందర్భంగా అమ్మవారు బాలా త్రిపురసుందరిని కూష్మాండా దేవిగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకున్నాను.

బాలా త్రిపురసుందరి

వేములవాడ దర్శనం ఒక దివ్యానుభూతిని మిగిల్చింది నాకు. బయటకు వచ్చి మా షరీఫ్‌కు షోన్ చేశాను. బయట దుకాణాలలో పెద్ద పెద్ద బెల్లం దిమ్మలు పేర్చి ఉన్నాయి. లేత బంగారు రంగులో మెరిసిపోతున్నాయి. వాటితో తులతూగి, స్వామివారికి భక్తులు సమర్పిస్తారు.

షరీఫ్ వచ్చేశాడు. “దర్శనం బాగా జరిగిందా సార్?” అని అడిగాడు. తిరిగి కరీంనగర్‌కు బయలుదేరాం. మేం చేరేసరికి పది గంటలవుతూంది. ఒక చోట ఒక మొబైల్ క్యాంటిన్ దగ్గర ఆపాడు. ఒక వ్యాన్‌నే క్యాంటీన్‌గా రూపకల్పన చేశారు.

“ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటుంది సార్” అన్నాడు.

అక్కడ ఇడ్లీలు, వడలు, మైసూరు బజ్జీలు అన్న చిన్న సైజులో ముచ్చటగా ఉన్నాయి. ప్లేటు 30 రూపాయలు. ఆరు పీస్‌లు వస్తాయి. ఏవయినా ఆరు కలిపి తీసుకోవచ్చు.

నన్ను వాళ్లు పోస్తున్న దోసెలు ఆకర్షించాయి. లేత పింక్ కలర్‌లో ఉన్నాయవి. అవి ఎందుకలా ఉన్నాయని ‘దోసె మాస్టర్’ని అడిగాను.

“ఇవి బీట్‌రూట్ దోసెలు సార్” అన్నాడతడు.

పూరీలు కూడా సద్యోజాతంగా (fresh from the pan) వేడిగా అందిస్తున్నారు. చాలామంది వ్యాన్ చుట్టూ గుమిగూడి టిఫిన్స్ చేస్తున్నారు. పూరీలు కూడా బుల్లివే. కాని ఆరు పూరీలు ఒక ప్లేటు.

నేను పూరీ, బీట్‌రూట్ దోసె తిన్నాను. షరీఫ్ వడలు తిన్నాడు. నన్ను డబ్బు ఇవ్వనివ్వలేదు. “తెలుగు సార్ ఇచ్చిండు” అన్నది సమాధానం!

“మజ్జిగ దొరుకుతుందా అబ్బాయ్?” అని అడిగాను.

ఎక్కడికో వెళ్లి, కరీంనగర్ డెయిరీ వారి మజ్జిగ పాకెట్లు రెండు తెచ్చాడు. అందులో ఏదో మసాలా కలిపారు. బాగుంది.

పదిన్నరకు నన్ను లాడ్జి దగ్గర దింపాడు అహ్మద్ షరీఫ్. డబ్బు ఇవ్వబోతే షరా మామూలే! వాడిని అప్యాయంగా దగ్గరకు తీసుకొని “జీతే రహో బేటా” అని ఆశీర్వదించాను. వాడు రోడ్డు మీదే నా కాళ్లకు నమస్కరించి, వెళ్లిపోయాడు. ఎ వెరీ గుడ్ బాయ్!

మర్నాడు పదిగంటలకు వాగేశ్వరీ డిగ్రీ కళాశాల చేరుకొన్నాను, రూం ఖాళీ చేసి, బ్యాగ్‌తో సహా రెండు కవితాసంకలనాలు ఆవిష్కరించబడ్డాయి. ప్రముఖ సినీ, టీవీ రచయితలే వడ్డేపల్లి కృష్ణగారు ముఖ్య అతిథి. నేను విశిష్ట అతిథిని. ఆయన ‘బలగం’ సినిమాలో కాకి కథ చెప్పిన నటుడు. సి.నా.రె. గారి శిష్యుడు. తెలంగాణ లలిత గేయ సాహిత్యంపై డాక్టరీట్ చేసిన వాడు. ఆయన చేతుల మీదుగా నాకు సన్మానం చేయించాడు సోదరుడు వైరాగ్యం.

ఒక అరగంట పాటు, వచన – ఛందో బద్ధ కవిత్వాలను తులనాత్మకంగా విశ్లేషిస్తూ ప్రసంగించాను. ఆ ప్రసంగం వైరాగ్యం వారి యూట్యూబ్ ఛానెల్‌లో అందుబాటులో ఉంది. దయచేసి వినండి. ‘వాక్యం రసాత్మకం కావ్యం’ అన్న నానుడిని, ఆ సంకలనాలలోని చక్కని కవితలకు అన్వయించి, అందులోని అలంకారాలు, శబ్ద సౌకుమార్యం, లాక్షణిక సూత్రాలను వివరించాను. మీడియం ఏదైనా భావపరిపుష్టి, రసస్ఫూర్తి ముఖ్యమని చెప్పాను.

అందరికీ భోజనాలు ఏర్పాటు చేశాడు మా ప్రభాకర్. తర్వాత నన్ను ఒక సాహితీమిత్రుడు తన బండి మీద బస్టాండ్‌లో దింపాడు. సూపర్ లగ్జరీ నాన్ స్టాప్ బస్సు జె.బి.ఎస్.కు సిద్ధంగా ఉంది. ఎక్కి కూర్చున్నాను.

సికింద్రాబాదులో, లాల్ బజార్ దగ్గర దిగాను. తమ్ముడు, సంచిక సహ సంపాదకుడు శ్రీ కొల్లూరి సోమ శంకర్, తిరుగు ప్రయాణంలో తమ యింటికి రావాలనీ, అక్కడికి దగ్గరనీ ఆహ్వానించి ఉన్నాడు. ఆయన, తన బండి తీసుకొని నేను బస్ దిగేసరికి సిద్ధంగా ఉన్నాడు. వాళ్లింట్లో కాసేపు సేదతీరాను. ఆయన సతీమణి నాకు ఆలూ బజ్జీలు చేసిపెట్టి, చక్కని ‘టీ’ ఇచ్చింది. వారికిద్దరు ఆడపిల్లలు. చూడముచ్చటైన సంసారం వారిది. అక్కడి నుంచి ఊబర్ ఆటో బుక్ చేసుకొని తొమ్మిదిగంటలకు వనస్థలిపురం చేరాను. అదండీ సంగతి!

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here