వేములవాడ యాత్ర

0
13

[dropcap]మే[/dropcap]ము ఐదుగురం స్నేహితులం కలిసి అనుకోకుండా తొలి ఏకాదశి రోజున వేములవాడ వెళ్దాము అని చెప్పేసి అప్పటికప్పుడు అనుకోని ఒక అరగంటలో అందరం త్వరగా తయారయ్యి ఇంటి నుంచి బయలుదేరాము. హైదరాబాద్ నుంచి మేము బయలుదేరినప్పుడు సిద్దిపేటకి 60 కిలోమీటర్లు ఉంది. సిద్దిపేటలో ఒక హోటల్‌కి వెళ్లి అక్కడ సాయంత్రం భోజనం చేసాము. భోజనం చేసి అక్కడి నుంచి బయల్దేరి తెలంగాణ ప్రభుత్వ గెస్ట్ రూమ్‌లో పర్మిషన్ తీసుకుని అక్కడే ఉన్నాము. అది కాలేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన గెస్ట్ హౌస్. ఆ గెస్ట్ హౌస్ ఎంత చక్కగా ఉందంటే ఆ గెస్ట్ హౌస్ చుట్టూ నీళ్లు, ఒక ఐలాండ్ అనమాట! ఈ గెస్ట్ హౌస్‌ని కట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటి వరకు ఇంత అందమైన గెస్ట్ హౌస్ మేము ఎక్కడా చూడలేదు. చుట్టూ ఎటు చూసినా అత్యద్భుతం! అసలు ఎక్కడ కూడా మేము ఇబ్బంది పడలేదు. మరుసటి రోజు పొద్దున్న ఆరు గంటలకు లేచి ఆరుగంటలకే అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్లేస్ అన్నీ చూసి బోట్ ఎక్కి బోట్లో హైలో హైలే సా సా హంసకదా నా పడవ పాట పాడుకుంటూ చక్కగా ఎంజాయ్ చేసాము. అక్కడి నుంచి నీటి మధ్యలో ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు మీద  నేను శైలజ ఇద్దరం పరిగెత్తాము.

***

అంత దూరం పరిగెత్తే సరికి అలసిపోయాము కూడా. చక్కటి వీడియోస్ తీసుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుకి గుహ కూడా ఉంది. అక్కడి నుంచి మేము ఆ గుహ చూడటానికి వెళ్ళాము. ఆ గుహ ఎంత అద్భుతమైన గుహ అంటే 3 కిలోమీటర్లు పొడవు ఉంది. అంటే ఈ గుహ మూడు కిలోమీటర్ల మానవులు తొలచినది అన్నమాట. ఆ గుహలోకి వెళ్ళాము. అక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం పంపింగ్ ఎలా చేస్తున్నారు అనేది అవన్నీ చూసాము. ఒక ప్లేస్‌కి వెళ్ళేసరికి మాకు అసలు గాలి ఆడలేదు. తర్వాత గ్యాస్ వాసన కూడా బాగా వచ్చింది. ఈ లోపల ఒక్కరిద్దరికీ కళ్లు తిరిగినట్టు అనిపించింది. వెంటనే గుహ నుంచి బయటకి వచ్చి, కారు తీసుకుని వెనకకి వచ్చేసాము. నిజానికి వాటర్ పంప్స్ దగ్గర నుంచి చూడాలి అని వెళ్ళాము. కానీ ఇంకా అక్కడ మేము ఉండలేకపోయాము. అక్కడి నుంచి తిరిగి వచ్చేసాము‌. వచ్చిన తర్వాత అక్కడ పెద్ద గేటు కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పెద్ద బోర్డు ఉంది. ఆ బోర్డ్ దగ్గర మేము ఫోటోస్ దిగాము.

ఈ ప్రదేశాన్ని రంగనాయక సాగర్ ప్రాజెక్టు అంటారు. ఈ రంగనాయకుని పెద్ద బొమ్మ వద్ద అక్కడ, లోపల  గూహలో చక్కగా మేము ఫోటోలు దిగాము. దాని పక్కకే వ్యవసాయం చేస్తూ ఒక పాడిపంటలతోటి ఉన్న ఒక పెద్ద బ్యానర్‌ని చూసాము. అక్కడ కొన్ని ఫొటోస్ దిగాము‌. అక్కడి నుంచి బయల్దేరి మేము వేములవాడకి వెళ్ళాము.

***

వేములవాడ వెళ్లేసరికి ఉదయం 10.30 – 11 గంటలయింది. చక్కగా గుడిలోకి వెళ్ళాం. గుడిలో భజన చేస్తున్నారు చాలా మంది. భజన దగ్గర చాలా సేపు కూర్చొని మేము కూడా భజన చేశాము. ఈ లోపల పూజారులు మమ్మల్ని లోపలికి ఆహ్వానించారు. అక్కడ ఆ భజన దగ్గర కొన్ని ఫొటోస్ తీసుకొని మేము లోపలకి ప్రవేశించాము. మొదట చక్కటి అమ్మవారి గుడి ఉంది‌. తర్వాత స్వామి వారి గుడి ఉంది. ఇక్కడ నేను వేములవాడ గురించి ఉన్న ఓ చిన్న కథ ఉంది, అది చెప్తాను.

వేములవాడ ఆలయ కరీంనగర్‌కి 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలో పార్వతీ, రాజరాజేశ్వరీదేవి సమేతుడు అయిన శ్రీ రాజరాజేశ్వరుడు లింగ రూపంలో కొలువై ఉన్నాడు. అర్జునుని మునిమనవడు అయిన రాజరాజనరేంద్రుడు ఒక మనిషిని చంపడం వలన కలిగే బ్రహ్మహత్యా పాతకం వదిలించుకునేందుకు దేశాటన చేస్తూ వేములవాడకి వచ్చాడట. ఇక్కడ ధర్మగుండంలో స్నానం చేసి జపం చేస్తున్న నరేంద్రునకు కోనేరులో ఒక శివలింగం దొరికిందట. ఈ కోనేరు సమీపంలో దాని ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రునికి శివుడు ప్రత్యక్షమయ్యి బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి కలిగించాడట.

***

ఆ శివలింగమే ప్రస్తుతం ఉన్న మూల విరాట్టని స్థల పురాణం చెప్తుంది. ఈ మూల విరాట్టుకు కుడి పక్కన శ్రీ రాజ రాజేశ్వరీ దేవి; ఎడమ వైపు శ్రీ లక్ష్మీ సహిత సిద్ధి వినాయకుడు ఉన్నాడు. ధర్మగుండం కోనేటి పై మూడు మండపాలు ఉన్నాయి. అందులో ఈశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించి ఉంది. ధ్యానముద్రలో ఉన్న తెల్లని పెద్ద శివలింగం చుట్టూ ఐదు శివలింగాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం వెయ్యి సంవత్సరాల నాటిది అని అంటారు, దీనికి దక్షిణ కాశీ అనే పేరు కూడా ఉంది. ఈ ఆలయం ప్రసిద్ధ శైవక్షేత్రాలలో ఒకటి. ఈ ప్రాంతం ఒకప్పుడు చాళుక్య రాజుల రాజధానిగా ఉండేదని శాసనాలు తెలుపుతున్నాయి‌. నరేంద్రుడు అన్న రాజు చెరువుని త్రవ్వించగా శివలింగం బయటపడింది అని స్థల పురాణం చెబుతుంది. శ్రీ రాజరాజేశ్వర స్వామిని రాజన్న అని కూడా అంటారు. ఇక్కడ గుండంలో స్నానం చేసి ఒక కోడెని మొక్కుకుంటారు. కోడె అంటే ఆవు. ఈ కోడెకి మొక్కు ఆచారం కూడా ఉంది‌. ఇలాంటి ఆచారం ఉన్న ఏకైక దేవాలయం ఇది. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర దేవాలయం ముందు కోడెదూడను గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించి భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు. పవిత్రమైన గండ దీపాన్ని కూడా వెలిగిస్తారు భక్తులు. మేము అక్కడ ఈ గండ దీపం వెలిగించిన దగ్గర మొక్కాము. ఈ వేములవాడని పాతకాలంలో అంటే పూర్వం లేబ్బూలవాడ అనేవారు.

***

ఇది తర్వాత  వేములవాడగా మారింది. ఇది చోళ రాజామైన రాజరాజనరేంద్రునిచే నిర్మించబడినది కాబట్టి రాజరాజేశ్వర ఆలయం అని ప్రసిద్ధి కెక్కింది. ఇక్కడ దగ్గరలోనే భీమేశ్వర ఆలయం కూడా ఉంది. వేములవాడ భీమ కవిగా సుప్రసిద్ధమైన భీముని వేములవాడ భీమేశ్వరుని అంశ యని అంటారు. ఆలయం ముఖద్వారం పై గజలక్ష్మి మరియు సింహద్వారానికి ఎదురుగా అనంత పద్మనాభ స్వామి ఆలయం కూడా ఉంది‌. చుట్టూ బాల రాజేశ్వరి, బాల రాజేశ్వర, ఉమామహేశ్వర, ఈటలేశ్వర, త్రిపుర సుందరి ఆలయాలు కూడా ఉన్నాయి.‌ సమీపంలో నాగేశ్వర వేణుగోపాలస్వామి ఆలయం కూడా ఉంది. అలాగే జగన్మాత స్వరూపిణి అనే బుద్ధి పోచమ్మ ఆలయం కూడా ఉంది. సంతానం లేనివారు ఈ బుద్ధి పోచమ్మకి మనసారా మొక్కితే ఖచ్చితంగా పిల్లలు పుడతారు అని విశ్వాసం. దక్ష యజ్ఞం సమయంలో చేతులు కోల్పోయిన వారు సూర్య భగవానుడికి ఇక్కడ స్నానం చేయించగా చేతులు కూడా వచ్చాయని ఈ స్థల పురాణం చెప్తుంది‌. సంతానం లేనివారు కోడె దూడని ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేయిస్తామని మొక్కుకుంటారు. సంతానం కలిగిన పిదప ఆ పుట్టిన సంతానంతో వచ్చి తమ మొక్కులను తీర్చుకుంటారు.

***

దూడలని తెచ్చుకోలేనివారికి అక్కడ కోడెలను అద్దెకు ఇస్తారు. మహాశివరాత్రి పర్వదినాన ఈ స్వామి వైభవాన్ని చూడడానికి కన్నులు చాలవు‌. ఇక్కడ స్వామి వారికి బెల్లం సమర్పించడం ఆచారం. అయితే మేము అందరము ప్రతి ఒక్కరం అక్కడ నాగుపాము పడగతో ఉన్న వెండి చిన్ని ప్రతి రూపాన్ని తీసుకువెళ్లి హుండిలో వేసాము. ఇక్కడి ఈ రాజరాజేశ్వర స్వామి కోరికలు తీర్చే స్వామి అన్నది నమ్మకం.

తిరుగు ప్రయాణంలో మేము అక్కడ ఉన్న గెస్ట్ హౌస్‌కి వెళ్లి భోజనాలు అంటే స్వామివారి ప్రసాదాలు తిని అక్కడినుంచి బయలుదేరి జనగాంలోని మా స్నేహితురాలి ఇంటికి వెళ్లి అక్కడ రాత్రి భోజనం చేసి ఇంటికి సంతోషంగా తిరిగి వచ్చాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here