[box type=’note’ fontsize=’16’] “అన్నింటినీ ఒక్కసారి హృదినిండా నింపుకుంటే చాలు, సప్త స్వరాలతో మది కోటిరాగాలు పలికినట్టు అనిపిస్తుంది. అంతటి అద్భుతమైనంది వెనిస్ సౌందర్యం” అంటూ తమ వెనిస్, రోమ్ పర్యటనల విశేషాలు వివరిస్తున్నారు నర్మద రెడ్డి. [/box]
వెన్నెలను వర్ణించగలమా!? పోనీ సూర్యోదయాన్ని…? ఎంత వర్ణించినా తక్కువే అనిపిస్తుంది కదూ..? ఏదో మిస్ అయ్యామే అనిపిస్తుంది కదూ..? ఎంత చెప్పినా, ఎలా వర్ణించినా సంపూర్ణంగా చెప్పలేకపోయానే అనిపిస్తుంది కదా..? అచ్చం వెనిస్ నగర సౌందర్యం కూడా ఇలాగే అనిపిస్తుంది…! ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ వెళ్లాలని, చూడాలనిపిస్తుంది. అందుకే ఈ నగరాన్ని చూడటానికి రెండు సార్లు వెళ్లడం. నీటిలో తేలియాడే భవన నిర్మాణాలు, నగరంమంతా పరుచుకున్న ఊయల్లాంటి వంతెనలు. సందర్శకులను చేరవేసే పడవలు. ఆ పడవల్లోనే సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు. వీటిని తలదన్నే అక్కడి జీవన సౌందర్యం. అన్నింటినీ ఒక్కసారి హృదినిండా నింపుకుంటే చాలు, సప్త స్వరాలతో మది కోటిరాగాలు పలికినట్టు అనిపిస్తుంది. అంతటి అద్భుతమైనంది మా ఇటలీ ప్రయాణం.
ఇటలీకి మాతోపాటూ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ రామచంద్రరావు దంపతులు కూడా వస్తామంటే నలుగురం కలిసి బయలుదేరాం. హైదరాబాద్ నుండి ఇటలీకి సుదూర ప్రయాణమనే చెప్పాలి. విమాన ప్రయాణం 13 నుంచి 16 గంటల సమయం పడుతుంది. అది కొంచెం కష్టంతో కూడుకున్న పనే అనుకోవచ్చు. నేడు ఇటలీకి దేశంలోని బెంగళూరు, ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల నుంచి విమాన సౌకర్యం ఉంది. కాస్త ఇబ్బందీ అయిన ఇటలీ సందర్శన ప్రతి ఒక్కరికీ జీవితంలో మర్చిపోలేని అనుభూతిగా గుర్తుండిపోతుందని మాత్రం చెప్పవచ్చు.
అయితే ఇరవై ఏండ్ల కాలంలో రెండు సార్లు ఇటలీని సందర్శించిన మాకు కాలంతోపాటూ మారిపోయిన ఇటలీ, తనలో దాచుకున్న పాత కొత్త వింతలను, విశేషాలను అపురూపంగా చూపిస్తూ వుంటే మరిచిపోలేని అనుభూతి మిగిల్చిందనే చెప్పవచ్చు.
ఇటలీ నేర్పిన పాఠం…!
మొదటిసారి మేము 1993లో ఇటలీని సందర్శిస్తే రెండవసారి 2016లో మళ్లీ వెళ్లాము. ఈ కాలంలో నమ్మలేనంతగా మారిపోయింది. అయితే ఇటలీ అనగానే నాకు మొదటిసారి రోమ్ నగరంలో జరిగిన సంఘటన ఇప్పటికీ గుర్తుంది. ఒకరకంగా ఆ సంఘటనే మాకు అనేక ప్రయాణాల్లో ఒక పాఠంగా కూడా ఉపయోగపడిందనే చెప్పవచ్చు. మొదటిసారి ఇటలీ సందర్శనలో భాగంగా రోమ్ నగరంలో ఒక ట్రైన్ ఎక్కాము. అక్కడి నుండి మేము వెనిస్ నగరానికి వెళ్లాలి. ప్రయాణం చేసిన వాళ్లలో ఎవరికీ తెలియదు – అక్కడి నుండి వెనిస్ నగరం ఎంత దూరమో, ఎన్నో స్టేజీలో దిగాలో అనేది. ఎవరినైన అడుగుతే బాగుండూ కానీ అందరికీ ఒకరకమైన మొహమాటం. నావరకైతే విదేశాల్లో అదే మొదటిసారి ట్రైన్ ఎక్కడం. ఆ ట్రైన్ వాయువేగంతో దూసుకుపోతుంది. మాకు కొత్త కాబట్టి ప్రతి స్టేషన్లో ట్రైన్ ఆగినప్పుడల్లా దాన్ని దిగీ మళ్లీ ఎక్కుతున్నాం. ఒక స్టేజీ దగ్గర వెనిస్ లాంటి పేరు కనిపిస్తే ఇదే వెనిస్ అనుకొని నలుగురం గబగబ దిగేశాం. తీరా చూస్తే అది వెనిస్ కాదని అర్థమైంది. మేము తేరుకునే లోపూ ఆ ట్రైన్ కూడా ముందుకు కదిలింది. వెంటనే అందరం మళ్లీ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించాం. అందరూ ఎలాగో ఎక్కారు కానీ నేను మాత్రం ఎక్కలేకపోయాను. ఎక్కేందుకు ప్రయత్నించేలోపు డోర్స్ మూసుకుపోవడం, రైలు కదలడం జరిగిపోయింది. ఇక ఉహించుకోండి నా పరిస్థితి ఎలా ఉంటుందో. అసలే దేశం కాని దేశం. పైగా ఆ దేశంలో ట్రైన్ జర్నీ కొత్త. ఏం చేయాలో తెలియక అలాగే నోరు తెరిచి చూస్తూ ఉండిపోయాను. పైగా నా దగ్గర పర్సుకానీ, డబ్బులు కానీ లేవు. ఒక్క క్షణం నా పరిస్థితి ఏమైపోతుందో అన్న భయం వెంటాడింది. ట్రైన్ లోపల ఉన్న మావారు, మాతో వచ్చిన వాళ్లు అందరూ నేను ఎక్కలేదని గమనించి ట్రైన్‌లో కనిపించిన బటన్స్ అంతా నొక్కుతున్నారు. కానీ ట్రైన్ ఆగితేనా..? ఈ లోపల ఎలా గమనించాడో ఏమో ఒక టి.సి దీన్ని గమనించి ట్రైన్‌ను ఆపేశాడు. బతుకుజీవుడా అంటూ అంత దూరంలో ఆగిన ట్రైన్ దగ్గరకు పరిగెత్తుకుంటూ ఎక్కాను. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఆ వెనిస్ అనే మహానగరంలో నేను ఒక్కదాన్నే మిగిలిపోతానేమో అన్న భయంతో ట్రైన్ ఎక్కిన వెంటనే బిగుసుకుపోయాను. ఆ ఒక్క నిమిషం నాకు అంతా అల్లకల్లోలం అయిపోయి లోకం అంతా అంధకారంలా కనిపించింది. అయితే కాస్త కుదుట పడ్డాక మా వారిని అడిగాను, ‘నేను అక్కడే ఉండిపోతే ఏం చేసేవార’ని. “ఏముంది నెక్ట్ స్టేషన్లో దిగి రిటన్ వచ్చి నన్నుతీసుకువెళ్లేవారమని’ తాపీగా చెప్పారు. ఆ ట్రైన్ ఇచ్చిన షాక్‌తో ఆ రోజు అనుకున్నాము ‘ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా తప్పిపోతే నేను ఎక్కడైతే మిస్ అయ్యానో అదే ప్లేస్ మిగతావాళ్లను కలిసే వరకూ ఉండాలి’ అని నిర్ణయించుకున్నాను. అదే పాఠాన్ని ఇప్పటికీ పాటిస్తున్నాము. నేను ఎక్కడైనా మిస్ అయినా, మా వారు ఎక్కడైన మిస్ అయినా అదే ప్లేస్‌లో ఉండాలని.
నీటిపై తేలియాడే నగరం…!
వెనిస్ నగరాన్ని ఇటాలియన్‌లో Venesia లేదా Venexia అని పిలుస్తారు. నార్త్ ఈస్ట్ ఇటలీలో ఒక ప్రముఖ నగరం ఇది. 117 చిన్న చిన్న దీవుల సమాహారం. ఈ దీవులన్నీ అందమైన కాలువలు, అద్భుతమైన వంతెనలతో అనుసంధానించబడి ఉంటాయి. వెనిస్ నగరానికి అనేక పేర్లు ఉన్నాయి. ముఖ్యంగా లాడామినెంటె, సెరెనిస్సియా, అడ్రియాటిక్ క్వీన్, సిటీ ఆఫ్ వాటర్, సిటీ ఆఫ్ మాస్క్, సిటీ ఆఫ్ బ్రిడ్జెస్, ది ఫ్లోటింగ్ సిటీ, సిటీ ఆఫ్ కెనాల్స్, యూరప్ దేశపు శృంగార నగరం ఇలా అనేక పేర్లు ఉన్నాయి. దీనిని క్రీస్తు పూర్వం 10వ శతాబ్దంలో నిర్మించారు. నగరం మొత్తం యునెస్కో వారసత్వపు నగరంగా గుర్తింపు పొందింది. నగరం అంతా చిన్న చిన్న ద్వీపాలుగా ఉంటుంది. నగరం నిండా నీళ్ళతో నిండిన కాలువలే కనిపిస్తాయి. ప్రజలు ఈ కాలువల్లో చిన్న చిన్న పడవలలో ప్రయాణిస్తూ ఉంటారు. వందలాది సంవత్సరాల క్రితం నిర్మించిన భవనాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడం విశేషం.
ప్రపంచంలో అత్యంత సుందరమైన నగరాలలో ఒకటగా పేరొందిన ఈ వెనిస్ ఒకప్పుడు సిల్కు ధాన్యం, సుసుగంధ ద్రవ్యాల వర్తకానికి కేంద్రంగా ఉండేదట. అలాగే 13వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం చివరి వరకు ఇది కళలకు కేంద్రంగా వర్ధిల్లిందని ఆ దేశ చరిత్ర చెబుతోంది. ఇటలీలోని వెన్నిటో ప్రాంతానికి రాజధానైన ఈ నగరం ఎందరో కలల రాజ్యం. దీనిని సుందరాంగుల నగరమని కూడా అంటారు. ఇది మొదట్లో ఉప్పు తయారీ కేంద్రంగా, తర్వాతి రోజుల్లో పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి పొందింది. పద్నాలుగో శతాబ్దంలో అక్కడ రెండు లక్షల మంది నివాసం ఉండేవారట కానీ రోజు రోజుకు జనాభా తగ్గుకుంటు వస్తుంది. ఇలాగే తగ్గుకుంటూ పోతే 2100 నాటికి దీని ఉనికే ప్రశ్నార్థకం అవుతుందంటున్నారు పర్యావరణ వేత్తలు. దీనికి కారణం ఏంటంటే తరచుగా వచ్చే వరదలు. దీనినే ఇక్కడ ఆక్వా ఆల్ట అని పిలుస్తారు. ఆల్ట అంటే అధికనీరు. అలలు సాధారణ ఎత్తు కంటే తొమ్మిది సెంటీమీటర్లు ఎక్కువ ఎగిసినప్పుడు నీరు సిటీలోకి వస్తుందట. ఉత్తర ఆఫ్రికా నుంచి వచ్చే వేడి గాలులు, అలల మధ్య రాపిడితో ఇది సంభవిస్తుందని. ఈ ఆక్వా ఆల్ట కారణంగా వెనిస్ నగరం ఏడాదికి 1-2 మిల్లీమీటర్లు మునుగుతుందటంతో, ఈ ప్రమాదాన్ని నివారించేందుకు అక్కడి ప్రభుత్వం అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టి, ప్రజలను ఎప్పటికప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంటుంది. ఇటువంటి రీత్యా గత 50 సంవత్సరాల్లో జనాభా 1,20,000 నుంచి 60,000కు పడిపోయిందని. 2100 కల్లా దెయ్యాల నగరంగా (జన సంచారం లేని) మారే అవకాశం ఉందని అధికారుల ఆందోళన.
వెనిస్ నగరంలో పడవ ప్రయాణం…
వెనిస్‌లో ట్రైన్ దిగిన వెంటనే అందరం ఒక హోటల్ వెతికి అక్కడికి నడుచుకుంటూ వెళ్లాం. అయితే ఆ హోటల్లో మా సామాన్లు పెట్టామో లేదో మా వారు పెట్టి గబగబ బయటకు వెళుతున్నారు. నేను ఎక్కడికి వెళుతున్నారూ అని ప్రశ్నిస్తే అలా బయటకు వెళ్లి చూసి వస్తాను అంటూ ఆయన సమాధానం ఇచ్చారు. మేము మాత్రం ఇక్కడ ఉండి ఏం చేస్తాం, మేము కూడా వస్తాము అని ఆయనతో పాటూ బయటకు వెళ్లి ఆ రాత్రి సమయంలో రోటీలు తెచ్చుకొని తిని పడవలో ఎక్కాము. అయితే వెనిస్‌లో ఎక్కడికన్నా వెళ్లాలంటే మన దగ్గరిలా బస్సులు, టాక్సీల్లో ప్రయాణాలు ఉండవు. వెనిస్‍లో రవాణా అంతా పడవలపై ఆధారపడి ఉంది. ఇది శతాబ్దాలుగా ఉన్న సాంప్రదాయం. ఇక్కడి పబ్లిక్ రవాణాకు నీటి ఆధారిత బస్సులు, ప్రైవేటు వాటర్ టాక్సీలు నిత్యం అందుబాటులో ఉంటాయి. ప్రతి పడవనూ ఎనిమిది రకాల చెక్కలతో తయారు చేస్తారు. ఒక్కో పడవ సరాసరి 11 మీటర్ల పొడవుతో 600 కిలోల బరువు ఉంటాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులంతా చేయాల్సిందంతా పడవ ప్రయాణంమే. మేము కూడా ఒక పడవను చూసుకొని అందరం అందులోకి ఎక్కాం. ఎక్కిన తర్వాత మా వారిని ఎక్కడికి వెళుతున్నామని అడిగితే ఈ పడవ ఎక్కడి వరకూ వెళితే అక్కడి వరకూ వెళదాం అన్నారు. ఆ పడవ పోతూ పోతూ రాత్రి 10.30 ఒక చోట ఆగింది. అక్కడి వాళ్లు ఇదే చివరి స్టేజ్ ఇక దిగిపోండి అన్నారు. సరే అని చెప్పి అక్కడ దిగాము. దిగిన తర్వాత అసలు కథ మొదలైంది.
కాలినడకన వెనిస్ వీధుల్లో…
ఆ రాత్రి వేళల్లో మేము ఎక్కిందే చివరి చివరి ట్రిప్ అని చెప్పారు. తిరిగి వెళ్లాలన్నా ఉదయం వరకూ వేచి చూడాలని వాళ్లు చెప్పేశారు. ఈ విషయాలేవి తెలియక మేము చాలా దూరం ప్రయాణం చేశాం. మేము దిగింది. ఏ స్టేజో కూడా మాకు తెలియదు. తిరిగి వెళ్లాలంటే ఎటువంటి వాహనం అందుబాటులో లేదు. అక్కడక్కడ సైకిలు తప్ప మాకు ఏవీ కనిపించలేదు. ఇక చేసేదేమీ లేక నడక ప్రారంభించాం. అసలే రొట్టెముక్కలు తిన్నాం కాబట్టి ఆకలికి అప్పుడే గుర్తుకు వచ్చినట్లు కడుపులో గొడవ చేస్తుంది. ఎక్కడైన తిందామంటే చాలా ఖరీదుగా ఉన్నాయి. ఏదీ ముట్టుకున్న ధరలు భగ్గుమంటున్నాయి. హోటల్‌కు వెళ్లాక అన్నమే తిందాం అనేసి మళ్లీ నడక ప్రారంభించాము. రాత్రి 11 గంటల సమయం అది. వెండి వెన్నెల్లో ప్రశాంతమైన వాతావరణం బాగుంది కానీ ఒకవైపు ఆకలి దంచేస్తుంటే గమ్యం తెలియని ప్రయాణం కాస్త ఇబ్బందే అనిపించింది.
కానీ ఆ రాత్రి వేళల్లో ఆ ఊర్లో ఎక్కడ చూసినా పాటలు, డ్యాన్సులు, హాంగామ. అందరూ ముఖాలకి రకరకాల మాస్కులు వేసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఇలాంటి దృశ్యాలే. వాటిని చూస్తూ అలా కొంత దూరం వెళ్లామో లేదో నలుగురు అమ్మాయిలు మావైపు పరిగెత్తుకుంటూ వచ్చారు. మమ్ముల్ని చూస్తే ఏమనిపించిందో ఏమో మాతో ఫోటో దిగుతాము అని అడిగారు. ఆశ్చర్యపోవడం మా వంతైంది.
ఈ రాత్రి వేళల్లో మాతో ఫోటో దిగుతామంటున్నారంటే మేము వింతగా కనిపిస్తున్నామా అనే అనుమానం కూడా వచ్చింది. అయితే మేము వెళ్లినప్పుడు అక్కడ చాలా చలిగా ఉండటంతో నెత్తిన టోపీలు చేతులకు గ్లవుజులు వేసుకొని ఉన్నాము. వాళ్లు అక్కడే పుట్టి పెరిగారు కాబట్టి వాళ్లకి పెద్దగా చలివేయడం లేదనుకుంటా. అయితే వాళ్ల మాకున్న గ్లవుజ్లు, టోపీలు చూసి ఫోటోలు దిగాలి అనుకున్నారేమో అని డౌట్ వచ్చింది. ఎందుకైన అడిగి తెలుసుకుందామని ‘మాతో ఎందుకు దిగాలనుకుంటున్నారు’ అని ఒక అమ్మాయిని అడిగాను. ఆ అమ్మాయి ‘నేను ఒక ఇండియన్ అబ్బాయిని లవ్ చేశాను, నా బాయ్ ఫ్రెండ్ ఇండియన్. మీరు ఇండియన్స్ కదా మీతో ఫోటో దిగి మా బాయ్ ఫ్రెండ్ కు పంపుతాను’ అంటూ నవ్వుతూ చెప్పింది. సరే అని మేము గ్లౌజ్ అన్నీ తీయబోతుంటే ‘వద్దు, వద్దు వాటిని మీరు అలాగే ఉంచుకోండి మీతో అలాగే ఫోటో దిగుతాము’ అన్నారు. వాళ్ల కోరిక మన్నించి కొన్ని ఫోటోలకు ఫోజు ఇచ్చి, వాళ్లతో మేము కూడా ఫోటో దిగి హాపీగా నడుస్తూ వచ్చాము.
ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిలను అడిగాను “ఏంటీ ఎక్కడ చూసి ఈ దీపపు కాంతులతోటి, జిగేల్ జిగేల్ మని వెలిగిపోతుంది విశేషం ఏంటీ అని..?” నాలుగు వందల సంవత్సరాల వెనిన్ నగర ఉత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నామని చెప్పారు. అందుకే ఈ పండుగ వాతావరణం అని. మేము మాత్రం వాళ్ల పండుగ రోజు ఇలా తప్పిపోయి వీధుల వెంట అనిపించింది.
అయితే వెనిస్‌లో ప్రతి యేటా జరిగే ఈ కార్నివాల్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఏడాదంతా ఎదురుచూస్తుంటారట. సాధారణంగా జనవరి చివరలో ప్రారంభమై ఫిబ్రవరి రెండవ వారంలో ముగుస్తుందీ పండగ. 18వ శతాబ్దం నుంచీ కార్నివాల్‍లో పాల్గొనదల్చినవారు మాస్కు వేయాల్సిందేననీ, వెరైటీగా వస్త్రధారణ చేయాలని నియమం పెట్టుకున్నారట. ఇక అప్పటి నుండి ఈ అనవాయితీ కొనసాగిందని అక్కడివారు చెప్పారు. అందకేనేమో అక్కడి వీధిల పొడువున మాస్కులమ్మే షాపులు, బట్టలను అద్దెకిచ్చే దుకాణాలకు చాలా కనిపించాయి మాకు.
దారిపొడవున అవన్నీ చూస్తూ మెల్లిగా నడుచుకుంటూ మా హోటల్‌కు చేరే సరికి రాత్రి 1.30 అయ్యింది. అర్ధరాత్రి వేళల్లో ఇలా నడిపించినందుకు మావారిని అయితే మనసులో తిట్టుకున్నాను. ఆయన దారిన ఆయన ఏదో వెళుతుంటే మేము అనవసరంగా వస్తాం వస్తాం అని ఈయన వెనుకబడి పోయాం తగిన శాస్తి జరిగింది అనుకున్నాను. ఆ రాత్రికి ఆకలి దంచేస్తుంటే అన్నం వండుకొని, నెయ్యి, పచ్చడితో తినేసి పడుకున్నాము.
మరుసటి రోజు వెనిస్ నగరం అంతా చూస్తు తిరిగాము. మేము మొదటిసారి వెనిస్‌కు వెళ్లినప్పుడితో పోల్చుకుంటే వెనిస్ నగరం చాలా మారిపోయిందని ఆర్థమయింది. చాలా ఫాస్ట్ అయ్యింది. ఈ మధ్య తీస్తున్న సినిమాల్లో కూడా ఈ వెనిస్ అందాలు కనిపిస్తుంటాయి. అయితే వెనిస్ గురించి చెప్పుకుంటునప్పుడు ఇక్కడి వంతెనల గురించి తప్పకుండా గుర్తుకు తెచ్చుకోవాలి. ఈ ఒక్క వెనిస్ నగరంలోనే దాదాపు 417 వంతెనలు ఉన్నాయట. అందుకేనేమో ఈ నగరానికి ‘వంతెల నగరం’ అని పేరు కూడా వచ్చింది. అతి పురాతన వంతెన పేరు ‘రియాల్టో’ . ఇది గ్రాండ్ కెనాల్ పై ఉన్న నాలుగు వంతెనలలో ఒకటి. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ వంతెన నేటికీ చెక్కుచెదరకుండా, వినియోగంలో ఉందంటే కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆ వంతెనల మీద ఏంతో వేల మంది టూరిస్టులు ఫోటోలు దిగుతు కనిపించారు మాకు. మేము కూడా కొన్ని ఫోటోలు దిగాం. తర్వాత అక్కడ చాలా షాపులు కనిపిస్తే వాటి చుట్టూ తిరిగాము. ఇంతలో మా అమ్మాయి షాపింగ్ చేసేందుకు వెళితే మేము ఒక రెస్టారెంటు ముందు కూర్చుని మా అమ్మాయి తిరిగి వచ్చే వరకూ ఆగి అందరం కలిసి ఒక ఫోటో తీసి మా హోటల్ కు వచ్చేశాం.
మురానోలో దొంగలు…!
నెక్స్ట్ డే మేము ‘మురానో” అనే ప్లేస్‌ని చూడటానికి బయలుదేరాం. ఈ మురానో అనేది గాజు పరిశ్రమకు ప్రసిద్ది. ఇటలీ చర్చిలలో రకరకాల గ్లాసు అద్దాలు, బొమ్మలు, దీపాలు ఇక్కడ తయారైనవేనట. గాజుతో జంతువులు, పుష్పాలు, కప్పులు, దీపాలను ఎలా తయారుచేస్తారో ప్రదర్శనలు ఇచ్చి మరీ చూపిస్తుంటారు ఇక్కడ.
మురానోకు వెళుతుంటే నాకు గతంలో వచ్చినప్పుడు జరిగిన ఒక సంఘటన గుర్తుకు వచ్చింది. మురానోకు ఒక పడవలో వెళ్లాం. పడవ తప్ప ఇంకే మార్గం లేదు అక్కడ. ఈ పడవ కూడా మధ్యలో అక్కడక్కడా ఆగుతూ వెళ్లింది. ఆ ప్రయాణం ఎలాగుండింది అంటే, మనం రాజమండ్రి నుండి పాపికొండలుకు వెళుతుంటే మధ్య మధ్యలో ఆగి అక్కడి ప్రదేశాలను చూశాక ఎలాగైతే ముందుకు కలుగుతుందో ఈ మురానో ప్రయాణం కూడా అలాగే ఉంటుంది. అలా వెళుతున్నప్పుడు ఒక ప్లేస్‌లో ఆగినప్పుడు వెళ్లిన తర్వాత మాతో పాటు వచ్చిన ఒక అమ్మాయి సడన్‌గా అరుస్తూ కనిపించింది. ఏంటా అని ఆరాతీస్తే ఆమె లగేజ్ పోయిందని తెలిసింది. ఆమె సూటుకేసును ఎవరో ఎత్తుకొని పోయారు. ఆ ఎత్తుకెళ్లిన వ్యక్తిని నేను చూశాను కూడా. సహజంగా మధ్యలో దిగుతున్న వ్యక్తులు తమ లగేజీ తీసుకొని దిగుతారు కదా అలాగే అక్కడ దిగిన వ్యక్తి తన లగేజ్ తీసుకొని వెళ్లాడు అనుకున్నాను కానీ ఎత్తుకెళుతున్నాడని అనుకోలేదు. ఆ విషయం నాకు ఎలా గుర్తుంది అంటే ఆ స్టేషన్లో దిగింది. ఆయన ఒక్కడే కాబట్టి గుర్తుంది కానీ ఆయన ముఖ కవళికలు మాత్రం ఎంత ఆలోచించిన గుర్తుకు రాలేదు. ఆమె తన సామాను పోయినందుకు ఏడుస్తూ ఆ పడవ వ్యక్తితో గొడవ పడింది కానీ ఫలితం లేకపోవడంతో కంప్లైంట్ ఇచ్చింది. ఆ తర్వాత పడవ బయలుదేరింది. తర్వాత అక్కడున్న వాళ్లు కథలు కథలుగా చెప్పుకున్నారు – నా వస్తువు పోయిందీ, నీ వస్తువు పోయింది అని. ఇది 1993లో జరిగిన సంఘటన అంటే అప్పట్లో చాలా మంది దొంగలు ఉండేవారు ఇటలీలో. ఇప్పుడు అలా లేదేమో అనిపిస్తుంది పరిస్థితులను చూస్తుంటే.
మురానోలో మాకు తెలిసిన వ్యక్తి…!
భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నట్లు, మనం ఎక్కడొక్కడో తిరిగినా మనకు తెలిసిన మనుసులు కూడా అక్కడక్కడా తారసపడుతూ మనల్ని కలిసినప్పుడు మనకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. ఇలాంటప్పుడు ఈ విశాలమైన ప్రపంచం కూడా చాలా చిన్నదేమో కదా అనిపిస్తుంటుంది. అటువంటి సంఘటనే ఈ మురానో ప్రయాణం ఒకటి జరిగింది. మేము ఆ చిన్ని పడవలో మురానోకు వెళుతుంటే మేము నలుగురం కాకుండా ఇంకో నలుగురు మాతోపాటూ ప్రయాణం చేశారు. అందులో ఒక ఆయన అమెరికా నుండి వచ్చిన వ్యక్తి. అయితే అతను చూడటానికి ఇండియన్ లాగా కనిపిస్తే, ఇండియా నుండే ఇక్కడికి వచ్చారేమో అనుకున్నాను. నేను అనుకున్నట్లు అతను ఇండియనే కానీ అమెరికాలో సెటిల్ అయినట్లు చెప్పాడు. తోటి ప్రయాణికుడు కాబట్టి మాటల మధ్య మీ పేరు ఏంటీ అని అడిగితే సూద్ అని చెప్పాడు. సూద్ అంటే ఎక్కడో విన్న పేరులా అనిపించింది. అదే సూద్ అనే పేరుతో మా వారికి ఒక ఫ్రెండ్ హైదరాబాద్లో ఉన్నాడు అని చెప్పాను. అతని పేరు అశ్వని సూద్ అని చెప్పగానే, అతను మా తమ్ముడే హైదరాబాద్లో ఉంటాడు అని నవ్వుతూ చెప్పాడు. ఈయన మాకు తెలిసిన వ్యక్తి వాళ్ల అన్న అని తెలియగానే కాస్త ఆశ్చర్యం, అనందం వేసింది నాకు. ఎక్కడి ఇండియా, ఎక్కడి వెనిస్. ఇన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఒక తెలిసిన వ్యక్తి అనుకోకుండా కలవడం, పలకరించడం భలేగా అనిపించింది నాకు.
అతను ఇక్కడి నుండి తిరిగి వెళ్లేటప్పుడు తన భార్య బర్త్ డే కోసం ఒక గాజు వస్తువును గిఫ్ట్ ఇవ్వాలని ఉందనీ చెప్పాడు. మంచి ఆలోచన అని అభినందించాం. అయితే అతను ఏమనుకున్నాడో ఏమో నన్ను ఒక గిఫ్ట్ సెలక్ట్ చేసి పెట్టమని చెప్పాడు. ‘అయ్యో ఇదేంటీ’ అని అడిగితే అతను ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా ‘ఆడవాళ్ల టేస్టులు సాధారణంగా ఒకేలా ఉంటాయి’ కాబట్టి ఆవిడ కోసం ఒకటి సెలక్ట్ చేయమని. మేము అక్కడున్న వాటిలో కోడి బొమ్మలా ఉన్న ఒకదాన్ని వెతికి, ‘ఇది బాటుంటుంది తీసుకోండి’ అని చూపించాం. ఆయన కూడా దాన్ని చూసి ‘ఒకే బాగుంది’ అనేసి దాన్ని కొనుకున్నాడు. దాని రేటు ఎంత ఉందో అని కనుక్కుంటే మా నోట మాట రాలేదు. ఆ చిన్న కోడి బొమ్మ రేటు అక్షరాల రెండు లక్షల రూపాయలు…! మైండ్ బ్లాక్ అయింది మాకైతే. వామ్మో అనుకున్నాము. ఆయన చాలా ధనికుడు కావొచ్చు అంత ధర ఉన్నా మారుమాట్లాకుండా కొనేశాడు దాన్నీ.
వెనిస్ నగరానికి చేరాక మేము అందరం పడవ దిగి వస్తుంటే ఆయన మమ్మల్ని బోజనం చేద్దాం రండని ఆహ్వానించాడు. మేము వద్దులెండీ మా హోటల్‌కు వెళ్లి తింటాం అని ఎంత చెప్పినా వినిపించుకోకుండా పట్టుబట్టి ఒక హోటల్‌కు తీసుకెళ్లాడు. అది ఎగ్జాటీ వెనిస్ నగరంలోని నీటి ఒడ్డున ఉన్న ఒక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్. దాన్ని చూడగానే అమ్మో ఇందులోకి వద్దులెండీ అనేశాం. అయినా ఆయన వినకపోవడంతో, ఆయన తింటుంటే మేము కాఫీతో సరిపుచ్చుకుందాం అనే ఉద్దేశంతో ఆయనతోపాటూ నడిచాం. ఆయనతోపాటూ హోటల్ లోపలికి వెళుతున్నామో లేదో గేటు దగ్గరికి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఇది చాలా కాస్ట్‌లీ హోటల్, యు కాంట్ బేర్ ఇట్ అన్నాడు. అలా అనేసరికి ఆయనకు ఎంత ఉక్రోషం, కోపం వచ్చేసిందంటే, “నువ్వు ఎవడివిరా చెప్పడానికి, వి కాంట్ బేరిట్ అని, వాట్ డూ యు థింక్ అబౌంట్ యువర్ సెల్స్, ప్లీజ్ అరేంజ్ ద సీట్స్ ఫర్ ఫైవ్ ఆఫ్ అజ్” అని చెప్పి ఆయన ఆర్డర్ ఇచ్చాడు. ఆ వ్యక్తి కాస్త భయపడి గబగబ పరిగెత్తి సీట్లను ఆరేంజ్ చేశాడు. ఏదో రెండు మూడు ఐటమ్స్ ఆర్డర్ చేశాడు. ఆ బిల్లు వచ్చింది కదా, దాన్ని చూస్తే నా కళ్లు తిరిగిపోయాయి. తిన్న కాస్త దానికి 25 వేల రూపాయల బిల్లు వేసుకొచ్చాడు వాడు..! దాన్ని చూడగానే ‘ఓ మైగాడ్’ ఆన్నాను. నాకు చాలా భయమేసింది కూడా మాకు. వద్దని చెప్పినా ఇతను ఇక్కడకు తీసుకొచ్చాడు, ఏం చెయ్యాలి ఇప్పుడు అని ఒకరి ముఖాలు ఒకరం చూసుకొని, సరే ఇక తప్పదు అనుకొని తలా ఇంత షేర్ చేసుకోవాలనుకొని మా నలుగురికి ఎంత అవుతుందో చెబితే మేము కూడా కొంత పే చేస్తామని చెబితే ఆయన ఒప్పుకోలేదు దానికి. హోటల్‌కు ఇన్వట్ చేసింది నేను కాబట్టి మొత్తం నేను కడతానని అంతా ఆయనే కట్టేశాడు.! నాకు ఇప్పటికీ ఆశ్చర్యమేస్తుంది. ఏంటీ ఆయన. భలే విచిత్రంగా ఉన్నాడు. అంత ఖర్చు పెట్టి గిఫ్టులు కొన్నాడు, ఇంత బిల్లును కట్టేశాడు అని.
రోమ్‌లో…
మర్నాడు మేము రోమ్‌ని చూడటానికి వెళ్లాం. ఎన్నో సార్లు రోమ్ గురించి, అక్కడి చక్రవర్తుల గురించి కథలుగా వినడమే కానీ అది ఎలా ఉంటుందో చూడలేదు కాబట్టి అక్కడికి వెళుతున్నామంటే ఒకరకమైన ఆసక్తి కలిగింది. పైగా ఎన్నో సినిమాల్లో క్రమశిక్షణాయుతమైన రోమన్ సైన్యం గురించి, అక్కడి చక్రవర్తుల క్రూరత్వం గురించి చూసి ఉన్నాము కాబట్టి మరికాస్త ఆసక్తి పెరిగింది. రోమ్‌లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది అక్కడి ‘కలోసియం’.
ఇది క్రీస్తు శకం 7వ శతాబ్దంలో కట్టిన పెద్ద స్టేడియం. అది ఎంతో పెద్ద కట్టడం అయినప్పటికీ దాన్ని ఇటుకలతోనే నిర్మించారు అంటే నమ్మశక్యంగా అనిపించదు. కొన్ని చోట్ల నాలుగు/ఐదు అంతస్తులు కూడా వుంటుంది. ఇప్పుడది శిధిలమైన గోడల్లాగ కనిపిస్తున్నప్పటికీ దాన్ని నిర్మించిన పద్దతి మాత్రం అద్భుతంగా ఉంది. అక్కడే గ్లాడియేటర్ పోట్లాటలు, జంతువులతో మనుష్యుల చెలగాటాలూ జరిగేవి. ఇక్కడ పొట్లాటలు ఎలా జరిగేవో స్పార్టకస్, గ్లాడియేటర్ అనే సినిమాల్లో కళ్ళకు కట్టినట్లు చిత్రీకరించారు. ఆ కుస్తీపోటీలు జరుగుతూ ఉంటే, రాజులు రాణులూ ముఖ్య అతిథులుగా వచ్చి అవి చూసి ఆనందిస్తూ వుండే వారట. ఒకరకంగా ఇది పిల్లికి చెలగాటం, ఎలుకకి ప్రాణసంకటం అన్న మాట. ఒకవేల ఆ పోటీలో వాళ్లు విజయం సాధిస్తే వారికి స్వేచ్ఛను ప్రసాదించి విడిచిపెట్టేవాళ్లట. ఈ కలోసియం చూస్తూ తిరుగుతుంటే రోమన్ చక్రవర్తుల క్రూరత్వం కళ్ళకు కట్టినట్లు కనిపించింది. అయితే ఎన్నో కాల పరీక్షలు ఎదుర్కొని నాటి చరిత్రకు సాక్షంగా నేటికీ నిలిచిందనే చెప్పవచ్చు. మేము అక్కడ కాసేపు ఉండి, ఫోటోలు దిగి అక్కడి నుండి వెనుదిరిగాము.
క్యాథలిక్‌ల పుణ్యక్షేత్రంలో….
మర్నాడు వాటికన్‌కి వెళ్ళాం. వాటికన్ అనేది ప్రపంచంలోనే అతి చిన్న దేశం. ఒక రకంగా ఇది దేశంలోని దేశం అనుకోవచ్చు. ఇటలీ దేశంలోని ఒక స్వతంత్ర దేశం. రోమ్ అనే నగరంలో వున్న ఒక చిన్న దేశం! 1929లో ఇటలీ దేశంనించీ బయటికి వచ్చి స్వతంత్ర దేశం అయింది. క్రిస్టియన్ మతంలో పెద్ద శాఖ అయిన కాథలిక్‌లకు కేంద్రంగా ఉంది. కేవలం 109 ఎకరాల్లో, వెయ్యి లోపు మాత్రమే ఇక్కడ జనాభా ఉంటుందట. కానీ ప్రతి రోజూ ప్రపంచం నలుమూలల నించీ యాత్రీకులు కొన్ని లక్షల్లో ఇక్కడికి వచ్చిపోతూ ఉండటంతో ఆ ప్రాంతం అంతా సందడిగా ఉంది. కాథలిక్లు పుణ్యక్షేత్రంగా భావించే ఈ ప్రాంతం నుండే ప్రపంచ దేశాలను పోప్ సందేశం ఇస్తు ఉంటాడు. ప్రతి బుధవారం, ప్రొద్దున్న పదిగంటలకు పోప్ బెనెడిక్ట్ బయటికి వచ్చి, అందరి మధ్య నించీ వెడుతూ దర్శనమిస్తాడట. అయితే మేము వెళ్లిన రోజు బుధవారం కాదు కాబట్టి మాకు ఆయన దర్శనం కాలేదు.
ఇక్కడ చూడాల్సిన వాటిలో ముఖ్యమైనవి సెయింట్ పీటర్స్ బసీలికా చర్చి. దాని పక్కనే వాటికన్ మ్యూజియం, సిస్టిన్ చాపల్ వున్నాయి. ఇవన్నీ తీరిగ్గా చూడాలంటే పూర్తిగా ఒక రోజు పడుతుందనిపించింది. మాకు అంత టైం లేదు కాబట్టి గబగబా అంతా తిరిగి చూశాము. ఆ చర్చి ముందు ఉన్న శిల్పం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎంతో అద్భుతంగా ఉంది. పైనుండి కింది వరకు ఒక దుప్పటిని విసిరేస్తే అది ముడతలు ముడతలుగా కిందకు పడుతుంటే ఎలా ఉంటుందో అలా గైనైట్తో దాన్ని మలిచిన తీరు అద్భుతమనే చెప్పాలి. ప్రపంచంలోనే అతిపెద్ద చర్చిగా పేరున్న ఈ బసీలికాలో ఏకకాలంలో సుమారు 60వేల మంది ప్రార్థన చేసుకోవచ్చట. చర్చి లోపల ఎన్నో రకాల ప్రఖ్యాత చిత్రాలూ, శిల్పాలూ వున్నాయి. మైకలాంజేలో, పెరూజినో, బాట్టిచెల్లీ మొదలైన వారి కళాఖండాలు చూడవచ్చు. అవన్నీ కూడా బైబిల్ పురాణ గాథల చిత్రాలు, శిల్పాలు. ఒక దానిని మించి ఇంకొకటి ఉన్నాయి. ఆ చర్చి లోపలి ఒక పెద్ద డోమ్ ఉంది. ఆ డోమ్ ఎంత పెద్దది అంటే ఒక ఎనభై ఫీట్ల పొడవు, నలభై అడుగుల వెడల్పు ఉండవచ్చు. ఆ డోమ్ పై ఎలా చిత్రించాడు అనేది ఆశ్చర్యంగా అనిపించింది నాకు. కేవలం తల పైకెత్తి చూడటానికే మాకు మెడ నొప్పి వేస్తుంటే వాళ్లు వాటిని వేయడానికి ఎంత శ్రమపడి ఉంటారో కదా అనిపించింది.
అక్కడే కింది ప్లోర్‌లో చనిపోయిన ప్రతి పోప్ ను అక్కడే సమాధి చేసేలాగా విధంగా ఆ రోజుల్లోనే నిర్మాణాలు చేసి పెట్టారు. ఇక వాటికన్ మ్యూసియంలో 1400 గదులు వున్నాయట. ఇక్కడ కొన్ని చిత్రపటాలు 3000 సంవత్సరాల క్రితంవి కూడా వున్నాయని అక్కడి వారు చెప్పారు. సిస్టిన్ చాపల్ 1473-1481 ప్రాంతంలో కట్టారట ఇక్కడి నుండే పోప్ ఎన్నికలు నిర్వహిస్తారట. అయితే బసీలికా చర్చి దగ్గర 1506 నుండి స్విస్ కాపలాదార్లు కాపలా కాసేవారుట. కానీ ఇప్పుడు కాపాలాదారులు స్విస్ వారు కాకపోయినా, స్విస్ దుస్తులు వేసుకుని కదలకుండా అలా నిల్చుని వుంటాడటం మాకు కనిపించింది.
క్రైస్తవ పర్వదినాల్లో, పండుగల్లో అయితే జనాలతో కిక్కిరిసి మన తిరుపతి దేవాలయంలో పెద్ద క్యూలు ఉన్నట్లు ఉంటారట. కానీ మేము వెళ్లిన సమయంలో ఎటువంటి పండుగలు కానీ, పర్వదినాలు కానీ లేకపోవడంతో ప్రశాంతంగానే అన్నీ తిరిగి అక్కడి నుండి మేము వెనిస్‌కు తిరిగి వచ్చాం.
ట్రేవీ ఫౌంటెన్..
ప్రతి దేశంలో మొక్కులకు, నమ్మకాలకు ఏదో ఒక ప్రాంతం ప్రత్యేకమైనట్లే ఈ రోమ్ నగరంలోని ట్రేవీ ఫౌంటెన్ కూడా ఇలాంటిదే. ఇక్కడ నిర్మించిన శిల్పం చాలా బాగుంటుంది. దీన్ని 1762లో కట్టారుట. వచ్చిన వాళ్ళు వెనక్కి తిరిగి కూర్చుని, ఆ ఫౌంటెన్ నీటిలో నాణేల్ని పడేస్తుంటారు (అక్కడ వాటిని తీరే అంటారు). అలా చేస్తే, అనుకున్నది జరుగుతుందని ఒక నమ్మకం. అలా కోరికలతో అక్కడికి వచ్చిన వాళ్లంతా నాణేలను విసిరేయడం వల్ల ఆ ఫౌంటెన్ అంతా వేలాది నాణేలతో నిండిపోయింది. ఈ వింత ఆచారాన్ని చూశాక అక్కడి నుండి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పీసా టవర్‌ను చూడటానికి వెళ్లాం.
లీనింగ్ టవర్ ఆఫ్ పీసా…
భారత్ పేరు చెప్పగానే తాజ్ మహల్ గుర్తొచ్చినట్లే. ప్రపంచంలో ఒక్కో దేశం పేరు చెబితే అక్కడున్న ఏదో ఒక ప్రత్యేకమైన కట్టడం మన ఆలోచనల్లోకి వస్తుంది. అలాగే ఇటలీ అనగానే ‘లీనింగ్ టవర్ ఆఫ్ పీసా’ పేరు స్పురిస్తుంది. అంటే ఒకవైపునకు వంగిన టవర్ ఆకారంలో ఉండే అతి పెద్ద నిర్మాణం. చాలా సినిమాల్లో పాటల సందర్భంగా మనకు ఈ టవర్ కనిపిస్తుంది. అయితే ఈ టవర్ ఇలా ఒకవైపుకి వంగి ఉండటం వెనుక ఒక చిన్న కారణం ఉంది. ఈ టవర్ కట్టేటప్పుడు నిలువుగానే కడదామనుకున్నారుట. కానీ కడుతున్నప్పుడు నేల మరీ మెత్తగా వుండటం వల్ల, పునాది సరిగ్గా లేక, ఒక పక్కకి వంగటం మొదలు పెట్టింది. అలా వంగటం మొదలు పెట్టిన టవర్ పూర్తి ఆయే సమయానికి కొంచెం ఎక్కువగానే వంగిందట. ఇప్పటికీ అది అలాగే ఓ పక్కకు ఒరిగి ఉన్నట్లు కనిపిస్తుంది. నిజానికి పక్కకు ఒరగడం వల్లే ఈ టవర్ ప్రపంచ గుర్తింపు వచ్చిందనుకోవచ్చు. అయితే 1990 జనవరి నుంచీ 2001 వరకూ దీని దరిదాపుల్లోకి కూడా ఎవరినీ వెళ్లనివ్వలేదట. దీన్ని చూద్దామని రోజూ వచ్చే వేల మంది టూరిస్టులు దూరం నుంచే ఈ టవర్‍ని చూస్తూ, ఫొటోలు తీసుకునేవారట. కానీ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఈ నిర్మాణాన్ని సరిచేయగలమన్న నమ్మకం ఇంజినీర్లలో పెరుగడంతో 186 అడుగుల ఎత్తైన ఈ నిర్మాణాన్ని తిరిగి యథాస్థితిలో నిలబెట్టేందుకు ప్రయత్నించడమే కాకుండా టవర్లో 45 సెంటీమీటర్లు వంపును తగ్గించారట. దీనికోసం ఏకంగా 18 వందల కోట్ల రూపాయలు ఖర్చైందంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ టవర్ ప్రత్యేకత ఏంటో.
మేము మాత్రం ఆ టవర్‌ను ఎంచక్కా దగ్గరినుండే చూసి తనివితీరా ఆనందించి దాని దగ్గర ఫోటోలు కూడా దిగాం. అయితే ఈ టవర్ చూస్తున్నప్పుడు స్టీవ్ రీవ్స్ నటించిన ‘సూపర్‌మాన్’ (ఓల్డ్ సినిమా) సినిమా గుర్తుకు వచ్చి భలే నవ్వు వచ్చింది. ఆ సినిమాలో ఈ టవర్‌కు సంబంధించి ఒక హాస్య సన్నివేశం ఉంటుంది. పీసా టవర్ పక్కనే ఒకతను చిన్న చిన్న పింగాణీవి, వంగిన టవర్లు అమ్ముతుంటాడు. ఆకాశంలో ఎగురుతూ వెడుతున్న సూపర్ మాన్, హఠాత్తుగా వంగిపోయిన టవర్ని చూసి దిగి వస్తాడు. అది పడిపోతున్నదనుకుని, నిటారుగా నిలబెట్టి వెళ్ళిపోతాడు. అది చూసి షాపు అతను, ఏం చేయాలో తెలియక, షాపులోని పింగాణీ టవర్లు అన్నిటినీ విసిరి పగలగొట్టేస్తాడు. మళ్ళీ నిటారుగా నిలుచున్న టవర్లు తయారు చేయించి, అమ్మకం మొదలు పెట్టబోతుంటాడు. తన తప్పు గ్రహించిన, సూపర్‌మాన్ తిరిగి వచ్చి, టవర్ని ముందు ఎలా వంగి వుందో అలాగే వంచి, ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. షాపు అతనికి మళ్ళీ ఏం చేయాలో తెలీక, తన పింగాణీ టవర్లని కోపంతో విసిరేసి పగలకొడతాడు. ఎంతో హాస్యభరితంగా చిత్రించిన సంఘటన. అక్కడి నుండి మేము అల్బెరబెల్లో అనే ప్లేస్‌ను చూడటానికి వెళ్లాము..
అల్బెరబెల్లో
ఈ అల్బెరబెల్లో అనేది ‘బారీ’ అనే ప్రదేశానికి దగ్గరలో ఉంది. బారీకి ట్రైన్లో వెళ్లి, బారీ నుండి ఒక కారు తీసుకొని అల్బెరబెల్లో అనే ప్రదేశానికి వెళ్లాము. ఇక్కడ ఎన్నో శతాబ్దాల క్రితం వాడిన పలకల్లాగా ఉన్న వాటిని ఇంటి కప్పుకు వాడుతున్నారు. వీటిని ఎన్ని శతాబ్దాలు గడిచిన మార్చకుండానే వాడుతున్నారు. ఇలాంటి ఇండ్లు కొన్ని వందలు కనిపించాయి. యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపుపొందిన ఈ ప్రాంతానికి నిత్యం యాత్రికులు వస్తుంటారని అక్కడ చూస్తే అర్థమైంది. ఆ ప్రదేశంలో కొన్ని ఫోటోలు దిగి తిరుగు ప్రయాణం అయ్యాం మేము.
ఎన్నో ప్రత్యేకలు ఉన్న ఇటలీ దేశం అనేక అనుభూతుల్ని కలిగిస్తే ఆ దేశ పర్యటన సందర్భంగా మాకు పరిచయం అయిన ఒక ఆవిడ గురించి మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావించాలి ఇక్కడ. ఎంతో ఖర్చుతో ముగియాల్సిన మా యాత్ర, ఆవిడ పరిచయం మూలాన తక్కువ ఖర్చుతో ముగించుకొని ముగించుకొని వచ్చామనే చెప్పాలి. మనలో మంచితనం ఉంటే మనం చేసే చిన్న చిన్న సహాయాలు కూడా ఉహించని ప్రతిఫలాలను కూడా ఇస్తుందని ఈ యాత్ర మాకు మరోసారి గుర్తుచేసింది. మేము వాటికన్ నుండి ఇటలీకి వెళ్లే దారిలో ఎయిర్‌పోర్టులో ఒక ఫాం తీసుకొని దాన్ని నింపడానికి ప్రయత్నిస్తున్నాం. అక్కడికి వచ్చిన ఒక ఆవిడ కూడా అదే పనిలో ఉన్నట్లు కనిపించింది. కానీ దాన్ని ఎలా నింపాలో తెలియక కష్టపడుతున్నట్లు అనిపించింది. బహుశా ఆవిడకు ఇటాలియన్ తప్ప ఇంగ్లీష్ రాకపోవచ్చు అనిపించింది. ఆవిడ దగ్గరకు నేను, మా బాబు ఇద్దరం వెళ్లి ఆ ఫాం నింపడానికి హెల్ప్ చేసి, ఆవిడను మీరు ఇక్కడ ఉండండి క్యూ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వచ్చి మాతో కలుద్దురు కాని అని చెప్పాం. ఈ చిన్న సహాయానికి ఆవిడ సంతోషపడి మాకు థ్యాంక్స్ చెప్పడమే కాకుండా మా ఇంటికి వచ్చి అక్కడ ఉండండి అని ఆహ్వానించారు. మేము అవసరం ఉంటే చూద్దాం లే అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్లి చూస్తే హోటల్స్ చాలా ఖరీదుగా ఉన్నాయి. అప్పుడు ఆవిడ గుర్తుకు వచ్చింది. పిలిచింది కదా అనా వెళితే ఎలా ఉంటుందో అని ఆలోచించాం. ఎందుకైన ఒక సారి ఫోన్ చేసి చూద్దాం ఆవిడ మంచిగా రెస్పాండ్ అయితే వెళదాం లేదంటే వేరే ఏదో ఆలోచిద్దామని అవిడకు ఫోన్ చేసి మీ ఇంటికి రావచ్చా అంటే, ఆవిడ మాత్రం సంతోషంగా మాట్లాడుతూ రండి అని ఆహ్వానించింది. ఆమె ఇంట్లో మూడు రాత్రులు ఉన్నాము. అక్కడ ఉండే ఈ ప్లేసెస్ అన్నీ చూశాం. ఒక చిన్న సహాయానికి ఆమె ఆతిథ్యం, వసతి ఇచ్చారు. మేము తిరిగి వస్తునన్నప్పుడు ఆల్ఫ్ పర్వతంపై ఎన్నో సంవత్సరాలకు ఒకసారి పూచే ఒక అరుదైన పువ్వును డ్రై చేసి దాన్ని ఒక ఫ్రేములో పెట్టి నాకు జ్ఞాపకంగా ఇచ్చింది. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది.
నేను చేసిన ప్రయాణాల్లో నాకు పరిచయం అయిన వాళ్లను నేను కొన్ని బహుమతులు ఇచ్చాను. నాకు కొంతమంది ఇచ్చారు. కానీ ఈవిడ ఆతిథ్యం.. ఆప్యాయత. మాపట్ల ఆవిడ చూపిన ప్రేమను ఎప్పటికీ మరిచిపోలేను. ఇటలీ ప్రయాణం ఎన్నో జ్ఞాపకాల్ని మిగిల్చితే ఆవిడ పరిచయం మరిచిపోలేని అనుభూతి అని చెప్పవచ్చు.