వేణీదానం

1
11

[box type=’note’ fontsize=’16’] కన్నడంలో మధురాకర్ణమ్ గారు రచించిన ‘వేణీదాన’ అనే కథని తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు. [/box]

[dropcap]అ[/dropcap]ది త్రివేణీ సంగమం. వేణీదానం చేయడానికని గుంపులు గుంపులుగా దంపతులు చేరివున్నారు. ఆ కార్యక్రమాన్ని నిర్వహించే పురోహితుడొకాయన ఇంతకు ముందే నమోదు చేయించుకున్న వారి పేర్లను బిగ్గరగా చదువుతున్నాడు. హాజరైన వారి పేరు ఎదురుగా టిక్ పెడుతున్నాడు. “రంగనాథ్ – నాగవేణి” అని బిగ్గరగా పిలిచాడు పురోహితుడు. పిలుపుకి సమాధానం రాకపోగా తలెత్తి రంగనాథ్ ముఖాన్ని చూసి, ‘ఓహో వీళ్లు కాన్సిల్ చేసుకున్నారు కదా’ అని వాళ్ల పేర్లకి ఎదురుగా X మార్క్ చేశాడు. మండుతున్న మంటల్లోకి ఆజ్యం వేసినట్లుగా – రంగనాథ్ అట్టుడికిపోయాడు. అల్లంత దూరంలో, నీడ పట్టున ఓ రాతి మీద నింపాదిగా కూర్చుని ఉన్న భార్య నాగవేణి కేసి చూసి – “నీకు ముందుగానే తెల్సి వుండాలి కదా… పిరియడ్స్ వచ్చే దినాలని. ఇపుడు చెబుతున్నావ్. పోస్ట్‌పోన్ మాత్రలేమైనా వేసుకుని వుండొచ్చుకదా… ఆ మాత్రం తెలియని దానివా నీవు. యాత్రకని బయలుదేరాక ముందే అన్నీ ఆలోచించి వుండాలి. తుంకూర్ నుంచి ఇంత దూరం వచ్చింది దండుగ. వేణీదానానికని… ఇంత దూరం రావటానికి వీలవుతుందా… థూత్… కొట్టకోవాలి నా ఖర్మకి” నుదురు కొట్టుకుంటూ త్వరత్వరగా అడుగులేసుకుంటూ, ఆ గుంపు వున్న చోటికి చేరుకున్నాడు రంగనాథ్. నాగవేణి ముఖంలో ఎల్లాంటి వికారాలూ చోటు చేసుకోలేదు. ఇంతటి ఛాన్స్ మిస్సయిందే అనే విచారం కూడా కన్పించలేదు. తన దృష్టి అంతా త్రివేణీ సంగమం వైపే వుంచి – శాపగ్రస్తురాలైన అహల్యలా ప్రతిమలా వుండిపోయింది.

***

బదిరీ యాత్ర స్పెషల్, ట్యూరిస్టు ట్రావెలర్స్ ఒకటి ఉత్తర భారతదేశ యాత్ర, బెంగుళూరు నుంచి బయలుదేరటంతో, రంగనాథ్ – నాగవేణిలతో పాటు సుమారు ఓ ఏభైమంది బయల్దేరారు. అందులో ముప్ఫయి మంది దంపతులే. ఢిల్లీ సందర్శనానంతరం, ఆగ్రా, మధురా, ఆ తర్వాత హృశీకేష్, హరిద్వార్ తర్వాత ప్రయాగకు చేరింది ఆ యాత్రా స్పెషల్. త్రివేణి సంగమంలో వేణీదానానికి అన్ని ఏర్పాట్లు చేశారు నిర్వాహాకులు. పురోహితులు “చూడండి అయ్యలారా! అమ్మలారా! అత్యంత పవిత్రమైన స్థలాల్లో ఈ ప్రయాగ ఒకటి. దేవనదియైన గంగ తోటి యమున ఇక్కడే సంగమిస్తుంది. సరస్వతి నది గుప్తగామినిగా ఇక్కడే కలుస్తుంది. ఈ మూడు నదులు ఒకదానికొకటి జతలాగా అల్లుకుని ముందుకు ప్రవహించటం చేత ఈ సంగమానికి ‘త్రివేణీ’ సంగమమని పేరు వచ్చింది. వివాహితులైన స్త్రీలు ఇక్కడ వేణీదానం చేస్తే ఏడేడు జన్మలకీ వాళ్లే భార్యాభర్తలుగా వుంటారనే ప్రబలమైన నమ్మకం వుంది. వేణీదానానికి మీరు అన్నీ సిద్ధం చేసుకోండి. నేనింకో పది నిమిషాల్లో వచ్చేస్తాను. అందరూ సిద్ధంగా వుండండి.” అని ఆయన వెళ్లబోతూ వుండగా, ఆ పురోహితుణ్ని ఆపి “అయ్యా నేను మొదట్నుంచి ఆచారపరుణ్ణి. ఇక్కడికి ఇంత దూరం బెంగుళూరు నుంచి వచ్చి వేణీదానం చేయకుండా వెళ్ళటం నా కిష్టం లేదు. దీనికేదైనా వేరే పరిష్కారముంటే చెప్పండి,” అని అడిగాడు రంగనాథం. దానికి సమాధానంగా ఆ పురోహితుడు తల అడ్డంగా తిప్పి “హే ! భగవాన్! ఇల్లాంటి ధర్మనిష్ఠులకా ఇల్లాంటి పరీక్ష” అని అంటూ ఆకాశానికేసి చూశాడు.

ఆ పురోహితుని మాటలు విన్న వేణి కొంచం బిగ్గరగానే నవ్వుకొంది. ‘ధర్మనిష్ఠుడు’ అని. ఆమె మనసు ఆలోచనా తరంగాల తోటి ఓలలాడింది. ఆ సంగమం వైపే తేరిపార చూసింది . ఫేస్‌బుక్‌లో షార్ట్ రీల్స్ అండ్ వీడియోస్ లాగా – షీలా, సుమా, మాధవి మోదలైన వారి ముఖాలు ఆ నదీ తరంగాల మీద తేలియాడుతూ కన్పించాయి. దూరంగా అక్కడే సంగమ్మ రోదిస్తూన్నట్టు కన్పిస్తే – భారంగా కళ్లు మూసుకుంది వేణి. తన పెళ్లి అనంతరం గడచిన సంఘటనలన్నీ ఒక్కొక్కొటిగా వచ్చి నిలిచాయి తెర మీది బొమ్మల్లాగా.

***

నూనూగు మాసాల, సుందరాంగాడు, ఆరడుగుల ధృడకాయుడైన రంగనాథ్‌కి భార్య అయ్యింది తన ఇరవై ఏట నాగవేణి. ఆకర్షణీయ ముఖం, ఆడవాళ్లని ఇట్టే కట్టేయగల ముఖం. వేణి అదృష్టానికి, తన స్నేహితురాండ్రు కొంచం ఈర్ష్య పడ్డా, తను మాత్రం మురిసిపోయింది తన అదృష్టానికి. అట్లాని వేణి అందం కూడా తక్కువేమీ కాదు. తానూ అందగత్తెనే. పెళ్లయిన తొలిరోజుల్లో సంతోషంతో తొణికిసలాడింది. అత్తామామల సాధింపులు లేకపోయే. ఇంకేం స్వర్గానికి రెండే మెట్లు అని అనుకుంటూ వుండగానే, తాను తొలిబిడ్డకు జన్మనిచ్చే సమయమ్పపుడు – ఐదు నెలల గర్భిణిగా వున్నప్పుడు – ఓ గాలివార్త – నమ్మలేక నమ్మనూ వుండలేక, మనసుని కంట్రోల్‌లో వుంచుకోలేని, డోలాయమాన పరిస్థితులలో కళావళం చెందింది – భర్తగారి ప్రణయగాథ – ఆఫీస్ టైపిస్ట్ షీలాతోటి – ప్రారంభమయ్యిందని. భర్తని, ఓ రోజు సూక్షంగా అడిగేసరికి, “అన్నీ ఒట్టి పుకార్లు. వాటిని వినొద్దు. అంతగా నమ్మకం లేకపోతే, ఇప్పుడే నీ పుట్టింటికెళిపో,” అని అరిచాడు. ఆ అరుపులకి వేణి నిజంగానే భీతహరిణి అయింది. ఇక పుట్టింట్లో – ఇల్లాంటి పుకార్లకి వున్నదీ లేనిదీ చేర్చి గోరంతలు కొండంతలుగా చేసే వదిన, పెళ్లికాని ఇద్దరు చెల్లెండ్రు – తల్చుకుని మౌనంగా వుండిపోక తప్పలేదు వేణికి. మూగ వేదన అనుభవించింది. మగడు వదిలేసిన ఆడదిగా పుట్టినిల్లు చేరితే, తన చెల్లెండ్ర గతి ఏంకాను – అందుకే మౌనంగా వుండిపోయింది. అయితే వీళ్లద్దరి విచ్చలవిడి ప్రేమను ఓ పార్కులో తాను కళ్లారా చూసిం తర్వాత, తన ఎడద బీటలు వారింది. ఇంట్లో ఓ వారోసీన్, కొడుకు ప్రవర్తనకి అడ్డచెప్పని అత్తమామలు.

నెలలు గడిచాయి. ముద్దులొలికే పాప ఒడి చేరినా, వేణి మనసు మాత్రం తీవ్ర తాపానికి గురి అవుతూనే వుంది. పురుడు పోసుకోవడానికి, పుట్టింటికెళ్లినప్పుడు – ‘పతియే ప్రత్యక్షదైవం’ అని భోధిస్తూ తన నిస్సహాయతని వ్యక్తం చేసి, తనకు పురుడు పోసి, తన ధర్మం నెరవేర్చి తనను అత్తగారింటికి పంపింది అమ్మ. బెరుకు బెరుకుగానే అత్తగారింటికి తరలి వచ్చినపుడు ఇంటి వాతావరణం కొంచం నెమ్మదివున్నట్టుగానే కన్పించింది. బదిలీ అయ్యి వేరే చోటకి వెళ్లింది షీలా అని కబురు అందింది వేణికి. బిడ్డనెత్తుకొని ముద్దాడి మురిసిపోయాడు రంగనాథం. వేణి తోటి కూడా సంతోషంగా గడిపాడు. అదొక పాడు కల అని తెలిసి వేణి కూడా నెమ్మదించింది. ఓ రెండేళ్లు గడిచిపోయాయి. ఇంకో పాప చేరింది వేణి ఒడిలోకి. అయితే, విరిగిపోయిన భర్తగారి ప్రేమగొలుసుకి ఇంకో లింక్ తగులుకొంది. ఆ లిక్ పేరు సుమ. రిసెప్షనిష్ట్‌గా పని చేస్తున్న సుమ తన తళుకు బెళుకులతోటి రంగనాథ్‌ని తన వైపుకు తిప్పుకొంది. మళ్లా మొదటికి వచ్చింది కథ, కంచికి చేరకుండా. అన్నీ తెల్సినా మౌనంగా వుండిపోయింది వేణి. రెండోసారి ఆడపిల్లే కావడం వల్ల, వేణికి మరింత బాధ్యత పెరిగిందే కాని, రంగనాథ్‌కి కాదు. తన గోడు ఎవరితో చెప్పకోలేదు వేణి. పుట్టింట సహకారం లేకపోయే, అత్తమామల సపోర్ట్ లేకపోయే. ఇద్దరు ఆడపిల్లల తోటి, సమాజాన్ని ఒంటరిగా ఎదుర్కొనే శక్తి, సామర్థ్యాలూ తనకి లేవు. తన పాలిటకి మిగిలింది మౌనమే. క్రమేపీ రంగనాథ్‌కి వేణి ఓ ఆటంకమయ్యింది. బిడ్డల పాలిట తల్లి, తండ్రి అంతా తానే అయ్యింది వేణి.

రంగనాథ్ ప్రేమగొలుసులో రెండొవ లింక్ సుమ తొలగిపోయింది. శ్రీమంతుడైన ఓ బిజినెస్‌మ్యాన్‌కి భార్యగా దుబాయ్‍కి ఎగిరిపోయింది. ‘అభావో విర్తకిః’ అన్న రీతిగా వైరాగ్యం ఆవరించింది రంగనాథ్‌ని కొన్ని రోజులు. ఆ సమయంలో దావణగెర్‌కి బదిలీ అయ్యింది. రోజూ రైలులోనో లేదా బస్సులోనో తిరిగాల్సి వచ్చింది…. అప్పుడే… మాధవి అనే నర్తకితో పరిచయం ఏర్పడింది రంగనాథ్‌కి. ప్రేమాయణం కొనసాగింది యథావిధిగా రెండు సంవత్సరాల పాటు. అయితే రంగనాథ్ ఓ సంసారి అని తెలియకపోయింది మాధవికి. తెల్సిన రోజే ఇంటికి వచ్చి, వేణీని, ఇద్దరు బిడ్డల్ని, రంగనాథ్‌ని చూసి నిశ్చేష్టురాలయ్యింది. నల్లని మేఘంలా వచ్చి, గర్జించి, మెరుపులతోటి వర్షించి మాయమయ్యింది. ఆత్మహత్యకి ప్రయత్నించిందట. రంగనాథం ప్రేమాయణపు గొలుసులో ఆ లింక్ కూడా విరిగిపోయింది.

కాలచక్రం తన పని చేసుకుంటూ పోతున్నది. పిల్లిద్దరూ పెద్దవాళ్లవుతున్నారు. భర్తలోని ఏ లోపాన్నీ గమనించని దానట్లే మౌనగిరిలా వుండిపోయింది వేణి. తుంకూర్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యింది రంగనాథ్‌కి. అక్కడో సైటు కొని ఇల్లు కట్టనారభించాడు రంగనాథ్. అప్పుడే సంగమ్మ వంతు వచ్చింది. పేద కూలీ అంజినప్ప కూతురు సంగమ్మ. నల్లటి రంగైనా, యవ్వనపు మదంలో మాగిపోతూ వుండేది. తెగిపోయిన, రంగనాథ్ ప్రేమగొలుసులో ఇంకో లింక్ చేరుకుంది. మరో ప్రేమ పురాణ సీరియల్ ప్రారంభమయ్యింది. ఇంటి పని పూర్తి కావచ్చినపుడు, రంగనాథ్ సంగమ్మతోటి సంబంధాన్ని కట్ చేశాడు. మేస్త్రీ చేతిని వెచ్చగా చేసి, సంగమ్మను వేరే చోటికి ఏంపించే ఏర్పాటు చేశారు. అప్పుడు ఓ పెద్ద గలాభాయే జరిగిపోయింది. అక్కడ పని చేస్తున్న కూలీ జనానికి వీళ్ల విషయం తెలియడానికి ఏ మాత్రం ఆలస్యం కాలేదు. ప్రసవం కష్టమై, బిడ్డను కని సంగమ్మ ప్రాణాలు విడిచింది. మగ బిడ్డ – అచ్చం పోతపోసిన రంగనాథంలా. అత్తమామలతో చర్చించి ఆ పుట్టిన బడుగుజీవిని ఇంటికి తీసుకురావాలని ఆలోచించింది వేణి. అయితే వాళ్లు ఆంగీకరిస్తారా! సంఘానికి భయపడాలి కదా! సంగమ్మ చావు కబురుతోటి, రంగనాథంతో ఆమెకున్న సంబంధాన్ని తెల్సుకున్న ఆ కూలీ జనం, రంగనాథ్‌కి దేహశుద్ధి చేయటానికని ఇంటి ముంగిట చేరి గలాభా చేశారు. మంచం క్రింద దాక్కొని బిక్కు బిక్కుమని చూస్తున్న భర్తను చూసి, ఇంటి తలుపులు బిగించి వచ్చిన వేణికి భర్త చేష్టకి ‘ఛీ’ అనిపించింది

కూలీ జనం పోలీసులకి రిపోర్ట్ చేయడం వల్ల, రెండు రాత్రుళ్లు లాకప్‌లో పోలీసుల అతిథిగా వుండాల్సి వచ్చింది రంగనాథ్‌కి‌. అందరి చేతులు తడిపి పోలీసుల నుండి విడిపించుకొని వచ్చేసరికి తల ప్రాణం తోకకి వచ్చినట్లు అయ్యింది. ఇరుగుపొరుగు వారి దృష్టిలోనూ, ఆఫీసు వారి దృష్టిలోనూ రంగనాథ్ మర్యాద మట్టి పాలయ్యింది. ఇంకో చోటికి బదిలీ చేశారు ఆఫీస్ వాళ్లు రంగనాథ్‌ని. నిట్టూరుస్తూ వేరే చోటికి వచ్చి చేరాడు. పిల్లలడిగే ప్రశ్నలకి జవాబు చెప్పలేక తల్లడిల్లిపోయింది వేణి. ఈ గాయాల మచ్చ తన మనసులోనే వేళ్లూని, చెరిపివేయలేని ఓ పుట్టుమచ్చగా తయారయ్యింది.

లాకప్ భయమో, అవమానపు భయమో – తరువాత తరువాత రంగనాథ్ ప్రవర్తనలో నిజంగానే మార్పు చోటు చేసుకొంది. పిల్లలపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ వచ్చాడు. వాళ్లకి పాఠాలు చెప్పడం, వాళ్ల బాగోగులు చూడటం లాంటి పనులు నిర్వహిస్తూ తండ్రి స్థానానికి తగిన వాడయ్యాడు. ప్రాయముడిగి మధ్యవయస్సులోకి అడుగు పెట్టాడు. ఆఫీస్ వర్క్‌లో శ్రద్ధ కనబరుస్తూ, దక్షుడు అని పేరు తెచ్చుకున్నాడు…. ఆఫీసర్ స్థానానికెదిగాడు. గతాన్నంతా మరచి గౌరవంగా మసలటం ప్రారంభించాడు. వేణి కూడా అన్నింటినీ మరచిపోయిందనే భావించాడు. ఎప్పుడూ తన ప్రవర్తనని తప్పు పట్టలేదు, ఎదురు చెప్పలేదు కూడా. అసహయక అబల, అంతకంటే తానేమి చేయగలదు. తనని ఓ పరదైవంగా భావిస్తున్నదని నమ్మి లోలోనే ఉబ్బితబ్బియ్యాడు. క్రొత్త ఊరు క్రొత్త ఇరుగు పొరుగు. ఆ చపల చిత్త రంగనాథుడు మర్యాద రామన్న అయ్యాడు. మగాడన్నాక, తన యవ్వనావస్థలో తనకి చాంచల్యం కలగటం సహజం. పోనీ, ఇప్పటికైనా సరైనాడుగా! అని తల్లిదండ్రులు, వేణి బంధువులు రంగనాథ్ గత చరిత్రను మరచిపోయారు. మరవనిది వేణి ఒక్కతే. శివుడు హాలాహలాన్ని తన కంఠంలోనే వుంచేసుకున్నట్టు, దహించి వేసిన కటు సత్యాన్ని తన హృదయంలోనే బంధించేసుకుంది వేణి. భర్తని ఎదురేసుకొని, పోట్లాడి వీధి పాలు కాక, తన సంసారాన్ని ఛిద్రం చేసుకునే పరిస్థితికి దిగజారకూడదనే ధృఢసంకల్పంతో తనలో తానే పోరాటం సల్పుకుని దాన్ని బయటకు రానీకుండా చేసుకుంది. ఆడపిల్లల భవిష్యత్తు కట్టెదుట నిల్చే ప్రశ్న. అది అగ్ని పర్వతమైతే, దాన్ని తాను అణచగలదా! ఆ బాడభాగ్నిని ఘనీభవింప జేసి, తన ఎదలోనే నిక్షిప్తం చేసి అంతర్ముఖియై, దాని పైన సంతోష ప్రవాహాన్ని ప్రవహింప చేసి, అది మరలా తలెత్తకుండా జాగ్రత్త వహించి సరస్వతీ నదిలాగా గుప్తగామిని అయ్యింది. కాల ప్రవాహంతో పాటే ప్రయాణం చేసి, పిల్లల్ని పెద్ద చేసి, ఉద్యోగస్తురాళ్లుగా చేసి, వివాహాలు కూడా జరిపించి తన బాధ్యతను తీర్చుకుంది.

***

కాలి అడుగుల సవ్వడి విని తలెత్తి చూచింది వేణి. ప్రక్కనే నిలబడి వున్నాడు భర్త. కొంచం మెత్తబడినట్టున్నాడు. కోపం తగ్గిట్లుంది. వేణి ప్రక్కనే ఇంకో రాతి మీద కూర్చున్నాడు. అక్కడ అప్పటికప్పుడే ‘వేణీ దాన’ కార్యక్రమం ప్రారంభమయ్యింది. దండలు మార్చుకున్నారు దంపతులు. భర్త తొడపైన భార్యను కూర్చోబెట్టుకుని, జడ అల్లమంటున్నారు పురోహితులు. మంత్రోచ్ఛారణతో ఆ జడను పూజించగా, బంగారు పూవును జడలో తురిమి కేశాన్ని కత్తిరించి సంగమంలో విడిచి పెట్టారు. దాన్నే తదేకంగా చూస్తున్న వేణిని చూచి, “పోనీలే వేణి, దీని కోసం ఇంకోసారి వద్దాంలే, సాధ్యమైతే వచ్చే ఏడాదే… అప్పుడు నీ డేట్స్ చూసుకుని వస్తే సరి” అన్నాడు, వేణిని సముదాయించే ధోరణిలో. ఆ వైపే దృష్టి సారిస్తూ వేణి నింపాదిగా, “నే నిప్పుడు బహిష్టు అవలేదు” అంది.

“హ్వాట్!” అదిరిపడ్డాడు రంగనాథ్. లేచి నుంచుని “మరి… మరి అబద్ధం ఎందుకు చెప్పావ్ వేణి…? వేణీదానంపై నమ్మకం లేదా… ?” అడిగాడు తీవ్రంగా. “సంపూర్ణమైన నమ్మకం వుంది… అందుకే వద్దన్నాను” అంటూ భర్త కేసి చూసింది తీక్షణంగా. ఆ ముఖ భావాలే వేరుగా వున్నాయి. రంగనాథ్ అపరాధ చిట్టాను విప్పినట్టుగా వుంది ఆ చూపు. నోరు తెర్చుకుని చూస్తుండగా, వేణి సంగమం వైపు అడుగులు వేసింది. ఆమె పిరుదులకు తగలుతూ అటూ ఇటూ వూగిసలాడుతోంది ఆమె వేణి. ఆ నదీ సంగమం కొత్త రూపాన్ని సంతరించుకొంది. గుప్తగామిని, సరస్వతి ఒక్కసారిగా పైకుబికి వచ్చినట్టనిపించి – అక్కడే కూలబడ్డాడు రంగనాథ్.

కన్నడ మూలం: మధురాకర్ణమ్

అనువాదం: కల్లూరు జానకిరామరావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here