వెన్నెల్లో రంగవల్లి

0
13

[అనుకృతి గారు రచించిన ‘వెన్నెల్లో రంగవల్లి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]త్రి[/dropcap]నాధ్ హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నాడు. జాలీ తలుపు బయట నుంచి కాలింగ్ బెల్ మోగిన చప్పుడు విని, వెళ్లి చూసాడు. బయట సన్నగా, తెల్లగా. పొడవుగా వున్న ఒక అమ్మాయి నించుని వుంది. జాలీ తలుపు తెరిచి, “రాధా” అన్నాడు కొంచెం సంశయంగా.

“అత్తయ్య లేదాండీ”

శ్రీనాధ్ నవ్వి, “లోపలి రా, రాధా మనోహరీ, ఈ అండీ గిండీలు ఎప్పట్నించి?”

ఆమె సిగ్గుపడి తలవంచుకొని నిలబడి, “అప్పుడంటే చిన్నతనం” అంది మెల్లగా.

“ఓహో, పెద్దయితే వరసలు మారిపోతాయన్నమాట”

రాధ జవాబు చెప్పలేదు, “ఈ పూలు అత్తయ్యకివ్వండి” అన్నది స్టీల్ డబ్బాలోంచి అందంగా అల్లిన విరజాజి మాల, మూడు రంగుల డిసెంబర్ పూల మాల అతని కివ్వబోయింది.

“డబ్బాలో వుంచు, కూర్చో రాధీ, చాలా రోజులైంది నిన్ను చూసి” అన్నాడు.

త్రినాధ్ తల్లి శారదకి రాధ తండ్రి మాధవ రావు వరుసకు తమ్ముడవుతాడు. రాధ తల్లి, ఆమెకు పదేళ్ళప్పుడు హార్ట్ అటాక్‍తో పోయింది. సంవత్సరం లోపే అతను ధనలక్ష్మిని చేసుకొన్నాడు. ఆమెకు ఇద్దరు మగపిల్లలు. పదేళ్ల పిల్లకు తల్లిననిపించుకోవటం ఆమెకు అస్సలు ఇష్టం ఉండేదికాదు. కానీ ధనలక్ష్మి తెలివిగలది. బయటపడేది కాదు. ఇంటిపని అంతా ఆ పిల్ల నెత్తిన వేసేది. రాధ ఏమి మాట్లాడేదికాదు. మాధవ రావు లోలోపల బాధపడేవాడు.

మాధవ రావు రెండో భార్య తీరు శారదకు నచ్చేది కాదు. క్రమంగా రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగింది, ధనలక్ష్మికి అంత తొందరగా స్థితిమంతులైన త్రినాధ్ కుటుంబంతో పరిచయం వదులుకోవడం ఇష్టం లేక ఇలా రాధతో పూలు పంపిస్తుటుంది.

“ఇంటర్‌తో చదువాపేసావా?”

“మానేసి కూడానాలుగేళ్లయింది” అంది.

“ఏం, మీ నాన్న డిగ్రీ కూడా చదివించలేకపోయాడా? రోజంతా ఏం చేస్తావు?”

జవాబు చెప్పలేదు రాధ. ఏదైనా చెబితే తండ్రి అసమర్థతని బయట పెట్టినట్టవుతుంది.

“ఓపెన్‍గా BA చేసాను. అత్తయ్య మంచి, మంచి ఇంగ్లీష్ నావెల్స్ ఇస్తుంది, జనరల్ లైబ్రరీ నుంచి కూడా తెచ్చుకొంటాను.”

ఆ నావెల్స్ మంచి క్లాసిక్స్ అని, ఎవరైనా అడిగితే ఇవ్వమని తానే చెప్పానని అతను రాధతో అనలేదు.

“మ్యాచెస్ చూస్తున్నారా నీకు”

“ఇంకా లేదు”

“అయినా ఆ వచ్చేవాడు ఎవరో గానీ అదృష్టవంతుడు, చక్కగా ‘రాధా, మనో, హరీ’ అని మూడు పేర్లతో పిలుచుకోవచ్చు, ఏమంటావు?” చిన్నప్పటి చనువుతో కొంటెతనం చూపించాడు.

రాధ నవ్వింది, “మూడు పేర్లు ఉన్నాయని ఎవరు చేసుకొంటారు బావా, కట్నం, ఆస్తి, అంతస్తు, చదువు చూసి చేసుకుంటారుగానీ” అంది.

“వస్తా బావా, బాక్స్ ఫ్రిజ్‌లో పెట్టటం మర్చిపోకండి” అంటూ వెళ్ళిపోతున్న ఆమెకేసి చూస్తుండిపోయాడు.

***

మర్నాడు తెల్లావారుఝాముననే జాగింగ్‍కి బయలుదేరాడు. 15 రోజుల లీవ్ మీద వచ్చాడతను. అమెజాన్ కంపెనీలో మంచి పొజిషన్‍లో ఉన్నాడతను. మంచి మ్యాచెస్ వస్తున్నాయని తల్లి రమ్మని పోరుతుంటే వచ్చాడు.. రెండు వీధులవతల ఉన్న రాధ ఇంటి వైపు వెళ్ళాడు. రాధ వంగి ముగ్గు వేస్తోంది. అల్లాగే ఇంకొంతమంది లేడీస్ కూడా వేస్తున్నారు. వెన్నల వాకిట్లో పరుచుకొన్నట్టు, ఆ ప్రభాత సమయంలో చుక్కల ముగ్గు అందంగా వేస్తోంది, అతన్ని గమనించలేదు. అలా రోజూ అటువైపు వెళ్ళేవాడు. ఏ రోజూ అతన్ని ఆ పిల్ల గమనించలేదు.

ఓ రోజు రాధ ఇంటికి లంచ్ టైంలో వెళ్ళాడు. ధనలక్ష్మి ఇంట్లో లేదు, ఆమె తమ్ముళ్లు సెలవు కావటంతో ఇంట్లోనే టీవీ చూస్తున్నారు. రాధ అతన్ని చూసి లేనిపోని సిగ్గునేమి ప్రదర్శించకుండా “కూర్చోండి” అంటూ మంచినీళ్లు తెచ్చింది.

“మీ పిన్నీ, నాన్న లేరా ఇంట్లో?”

“పిన్ని దౌరా కెళ్ళింది, నాన్న బజారు కెళ్ళారు” అంది నవ్వుతూ.

“దౌరా అంటే?”

“అంటే ఏమీ లేదు, మా పిన్ని ఎవరు పిలిచినా షాపింగ్‌కి వెళుతుంది, పాపం తన కోసం కాదులెండి, అదో సరదా ఆమెకి, వచ్చేస్తుంది, ఆకలికి ఆగలేదు” అంది నవ్వుతూనే. మాటలోనే వచ్చింది ధనలక్ష్మి, శ్రీనాధ్‌ని చూసి ఉబ్బితబ్బిబ్బయ్యింది.

“చూడత్తయ్యా, మంచినీళ్లు ఇచ్చింది మీ అమ్మాయి, అంతే, లంచ్ టైమ్‍కి వచ్చాను కదా, భోంచేయమని కూడా అనలేదు” బిత్తరపోయి నించుంది రాధ ఆ అభియోగానికి.

“ఈ తింగరమేళంతో చస్తున్నాను బాబు, అత్తెసరు మార్కులతో ఇంటర్ పాస్ అయ్యింది, డిగ్రీ చదవ్వే అంటే చదవలేనని మొండికేసింది, ఇదిగో ఇలా ఇంట్లో పనీ, పాటా లేకుండా ఉంటుంది.”

అన్నీ అబద్దాలే అని అరవాలనిపించింది రాధకు. ఫస్ట్ క్లాస్ వచ్చింది తనకు, పనిమనిషి కూడా పెట్టకుండా పనంతా తనతోనే చేయిస్తుంది. జంకూ, గొంకూ లేకుండా ఎన్ని అబద్దాలు ఆడుతున్నదో! కోపం దిగమింగి మౌనంగా లోపలికీ వెళ్లి, అందరికీ భోజనాలకి ఏర్పాటు చేయసాగింది.

పెరట్లోకి వెళ్ళి చేతులు కడుక్కోవటానికి నీళ్లందిస్తున్న ఆమెతో “కోపమా మనో?” అన్నాడు.

ఆమె మాట్లాడలేదు. “హరీ, నాప్‌కిన్ ఇవ్వు” అన్నాడు.

“పెద్ద వుద్యోగం చేస్తున్నావు, ఇదేమి అల్లరి బావా” అంటూ లోపలికి వెళ్ళిపోయింది.

ధనలక్ష్మి, పిల్లలు ఒక వైపు, త్రినాధ్ ఒకవైపు కూర్చున్నారు.

సాధారణ పసుపు పూల సిల్క్ చీర, జాకెట్ కట్టుకున్నా, ఎంతో అందంగా వుంది రాధ. వంట ఎంతో శ్రద్దగా చేస్తే తప్ప అంత బాగా కుదరవని త్రినాధ్‌కి తెలుసు. ఈలోపు మాధవ రావు వచ్చాడు. “చాలా రోజులయింది త్రినాధ్ నిన్ను చూసి, రావటమే మానేసావు” అంటూ నిష్ఠూరమాడాడు.

త్రినాధ్ నవ్వి “కుదరటం లేదు మామయ్యా, ప్రమోషన్ వచ్చింది, పని ఎక్కువయ్యింది, అందుకే 15 రోజులు లీవ్ పెట్టి వచ్చాను.” అన్నాడు.

“మ్యాచెస్ ఏవన్నా చూస్తున్నారా, నీకేం తక్కువ త్రినాధ్, మీ నాన్నకు ఫంక్షన్ హాల్, రెండు మిల్లులు, పైగా 20 ఎకరాల పొలం, దీనికి తోడు నీ వుద్యోగం”

త్రినాధ్ నవ్వి, “వస్తాను మామయ్యా” అంటూ సెలవు తీసుకున్నాడు.

వెళ్లిపోతున్న త్రినాధ్‌ని చూస్తూ “భలే వచ్చి, అడిగి మరీ భోజనం చేసాడు. మీ ముద్దుల కూతురు ముంగిలా మాట్లాడదు. ఊరంతా తింగరమేళం అని వూరికే అంటున్నారా?” అంది ధనలక్ష్మి.

మాధవరావుకి కోపం నషాళానికి అంటింది. “వాళ్ళెక్కడ, మనమెక్కడ, ఇంగితం ఉన్న పిల్ల కాబట్టి, దాని హద్దుల్లో అది ఉంటోంది, నిన్నే ఊరంతా తింగరమేళం అని నీ వెనక నవ్వుతున్నారు” అన్నాడు కోపంగా.

“నాన్నా, భోజనానికి రా” ఇద్దర్నీ శాంతపరిచే ధోరణిలో అన్నది రాధ.

***

శారద రోజూ మ్యాచెస్ గురించి చెబుతూ ఫోటోలు చూపిస్తోంది. వింటున్నాడు కానీ ఎటూ చెప్పని కొడుకుని భర్త ముందు నిలదీసింది శారద.

“ఎవరైనా ఉన్నారా నీ మనసులో త్రినాధ్?” సౌమ్యంగా కొడుకుని అడిగాడు సాంబశివరావు. ఆయనకు పెద్దకొడుకు శ్రీకాంత్ పూర్తిగా ఇల్లరికపు అల్లుడిగా మారిపోయాడని బాధ. ఊళ్ళోనే వున్నా ఎప్పుడో వస్తాడు. భార్యాభర్తలిద్దరికీ ఆ విషయం బాధాకరమే.

“సరే, నేను చెప్పాక కాదనకూడదు మరి. రాధా మనోహరిని చేసుకొందామనుకొంటున్నా” చెప్పాడు త్రినాధ్.

తెల్లబోయారిద్దరు. “ఆ పిల్లనా? వాళ్ళకీ, మనకెలా కుదురుతుందిరా?” అంది శారద.

“ఏం అమ్మా, ఆ అమ్మాయికి ఏం తక్కువ?”

“చాల్లే ఊరుకో, ఆ ధనలక్ష్మి అంటేనే కంపరం నాకు” అంది కోపంగా శారద.

“వదిన వాళ్ళు మనకెంత గౌరవ౦ ఇస్తున్నారమ్మా? ఊళ్ళోనే ఉంటూ కూడా అన్నయ్య మిమ్మలసలు లెక్క చేస్తున్నాడా? మనకింత వుంది, నా సంపాదన కూడా ఎక్కువే. ఇంకా పెళ్లి ద్వారా వచ్చే ఆస్తి, డబ్బు మీద నాకు ఆశ లేదమ్మా, వాళ్ళని పిలిచి మాట్లాడండి” కొడుకు గొంతులో ధ్వనించిన దృఢ నిశ్చయం సాంబశివరావుని ఆలోచింపజేసింది. భార్యకు నచ్చచెప్పాడు, ధనలక్ష్మి, మాధవరావు కయితే ఇది పెద్దషాక్. అతిగా మాట్లాడవద్దని ముందే హెచ్చరించాడు మాధవ రావు.

***

మొదటి రాత్రి క్విజ్ తో మొదలయ్యింది రాధకు. “నా పేరుకు అర్థం తెలుసా” అడిగాడు త్రినాధ్.

“తెలుసు, విల్ పవర్ వున్నవాడు, ధృడ నిశ్చయం కలవాడు” అని చెప్పింది రాధ.

“బావా ఒకటి చెప్పు, ముందునుండే నన్ను చేసుకోవాలని అనుకున్నావా?”

“ముందే చెప్పాననుకో, ఇంక హేమరింగ్ మొదలవుతుంది, స్ట్రైక్ ది రాడ్ వెన్ ఇట్ ఈజ్ హాట్” అన్నాడు నవ్వుతూ.

“వచ్చినప్పుడల్లా నీ గురించి తెలుసుకొనేవాడ్ని. నాకేం కావాలో నాకు తెలుసు. డబ్బు, ఆస్తులు వీటి వెనుక పడి, జీవితంలో సున్నితత్వం కోల్పోదలుచుకోలేదు. అన్నా, వదిన లాగా అమ్మా, నాన్నని నిర్లక్ష్యం చేయదలచుకోలేదు. వెన్నెల్లో మెరిసే అందమైన రంగవల్లి లాంటి దానివి, నిన్ను వదులుకోదలచలేదు. అయినా ‘మూడు పేర్లున్నాయని చేసుకుంటారా ఎవరైనా’ అని క్లూ ఇచ్చావుగా, ఈ మూడు పేర్ల అమ్మాయికి అంటే ‘త్రి’నాధుడిని నేనేగా”.

“అబ్బా, ఏం లాజిక్ బావా” అంటూ నవ్వేసింది రాధ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here