వేసవి శిబిరం

7
14

[శ్రీ కొండూరి కాశీ విశ్వేశ్వరరావు రచించిన ‘వేసవి శిబిరం’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

స్కూలు పిల్లలందరూ పరీక్షలు వ్రాసేశారు. ఆ తరువాత రాబోయే మార్కులు, ర్యాంకులపై కూడా అంచనాలు కూడా వేసుకున్నారు. అలా పరీక్షలు అయ్యాయోలేవో ఇలా ‘స్పెషల్‌ కోచింగ్‌’ క్లాసులంటూ మొదలపెట్టడంతో పిల్లల ఆటపాటలకు మళ్లీ బడులే అడ్డంకిగా తయారయ్యాయి.

ఉరుకుల పరుగుల చదువులూ, ఉద్యోగాలతో కీ ఇచ్చిన బొమ్మల్లా తిరుగుతున్నామేకానీ, హాయిగా వేసవి శెలవుల్లో ఏదైనా విహారయాత్రకు వెళితే బాగుంటుంది కదా! అన్న తన ఆలోచనను భార్య విమలతో పంచుకున్నాడు మురళీకృష్ణ. “ఇంతకీ ఎక్కడికెళ్ళాలనుకుంటున్నారు మీరు?” అంటూ సూటిగా ప్రశ్నించింది విమల.

“అదే! మా ఊరు గొల్లపాలెం ఇంటికి వెళితే బాగుంటుంది విమల” అని అతను అనగానే ఆమెకు కోపం చిర్రెత్తుకొచ్చింది. “అది మీ ఒక్కరి ఇల్లే కాదు స్వామి, అది మన అందరి ఇల్లు తెలిసిందా? మొత్తానికి మన ఇంటికి వెళదామంటున్నారన్న మాట! మరి మన పిల్లలిద్దరికీ స్పెషల్‌ కోచింగ్‌ క్లాసులు ఉన్నాయి కదా! మరి వాటి మాటమిటి? అంటూ గట్టిగానే ప్రశ్నించింది.

“చూడు విమలా, ప్రతీ సంవత్సరం ఇలాగే వాదించుకుంటున్నాంకానీ, పిల్లల కిచ్చిన నెలరోజుల వేసవి కాలం శెలవులను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. ఎందుకైనా మంచిది మన అరవింద్‌నీ, అర్చననీ కూడా అడిగి చూద్దాం!” అని వాళ్లిద్దరినీ పిలిచి వాళ్ల అభిప్రాయాన్ని అడిగారు. పిల్లల్ని ఎవరైనా హాయిగా ఊరు వెళ్లివద్దాం అంటే వద్దంటారా?

అందులోనూ అది తాతయ్యగారి ఊరు చిన్నగొల్లపాలెం అని చెప్పగానే ఎగిరి గంతేశాడు అరవింద్‌. వాడు అక్కడ ఇంచక్కా ఆడుకోవచ్చనని. కానీ అమ్మాయి అర్చన మాత్రం ససేమిరా ఒద్దనే చెప్పేసింది. ఎందుకంటే తన బ్యాచ్‌మేట్స్‌ అందరూ పై చదువుల కోసం కోచింగ్‌ తీసుకొని ఈజీగా సి.ఏలూ, యం.బి.ఏ.లూ, మేనేజర్లూ అవటానికి ఫౌండేషన్‌ వేసుకుంటున్నారు. కానీ తాను మాత్రం చదువులో వెనుకబడిపోతానన్న అర్చన మాటల్లో కూడా నిజం లేకపోలేదు. ఏమిటో అంతా గందరగోళంగా ఉంది. అమూల్యమైన కాలం వృథా అయిపోతుందనే తపన, ఇటు పిల్లల్లోను, అటు తల్లిదండ్రుల్లోను ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయింది.

“ఇదిగో పిల్లలు జాగ్రత్తగా వినండి. మీరిద్దరూ ఈ వేసవి శెలవుల్లో తాతయ్యగారింట్లో హాయిగా ఆడుతూ పాడుతూ రోజూ రెండుగంటలపాటు చదువుకోవచ్చు” అని తేల్చి చెప్పేశారు. “అలాగే మీ పుస్తకాలన్నీ కూడా తెచ్చుకోండి, అర్థమయ్యిందా?” అని అనగానే అర్చనకు మాత్రం కోపం వచ్చేసింది. అయినా అమ్మానాన్నలే ప్రోగ్రాం వేశారు కాబట్టి, ఇరవై రోజులకు కావలసిన పుస్తకాలు, బట్టలు సర్దుకొని రడీ అయిపోయారు పిల్లలు. తీరా రైలుకి మాత్రం ఏ.సి. క్లాస్‌కి రిజర్వేషన్‌ మటుకూ దొరకలేదు. అంతదూరం బస్సులో వెళ్ళటం ఈ మండువేసవిలో కష్టమైన పనే! అని సరిపెట్టుకొని రైల్లోనే సెకెండ్‌క్లాసులో ప్రయాణానికి సిద్ధమయ్యారు. రైల్లో ఫ్యాన్‌ గాలి కూడా వేడిగా సెగలు కక్కుతోంది. ఇది చాలదన్నట్లు రిజర్వేషన్‌ లేని ప్రయాణీకులు గుంపులు గుంపులుగా లోపలికి చొరబడ్డారు. అసలే ఉక్కగా ఉండటంతో మధ్యలో చంటి పిల్లలు గుక్కపట్టి ఏడుస్తున్నారు.

ప్లానింగ్‌ లేకుండా ప్రయాణాలు చేస్తే ఇలాగే ఉంటుంది. హాయిగా, చల్లగా ఏసీలో వెళ్లేవాళ్ళం కదా! అన్న భార్య నిష్టూరాలతో వేడి తీవ్రత ఇంగా పెరిగిపోతున్నా, చల్లని చమటతో కోపాన్ని చల్లబర్చుకున్నాడు పాపం మురళీకృష్ణ.

మొత్తానికి చిన్నగొల్లపాలెం గ్రామం చేరుకున్నారంతా. సమయానికి ఆటోలు కానీ, కనీసం కూలీ కూడా దొరకలేదు. ఇక లాభం లేదని ఎవరి సామాన్లు వాళ్లు మోసుకుంటూ, ఊరు చివరున్న కొబ్బరి తోటలో తాతయ్యగారింటికి చేరుకోవటం, హిమాలయాలెక్కిన సాహస  యాత్రలా ఉంది అని మనసులో అనుకున్నాడు మురళీకృష్ణ. ఇంకా నయం, ఆ మాటలు పైకి చెప్పలేదు. ఆవిడగారు అగ్గిమీద గుగ్గిలం అయ్యేది.

చెప్పా పెట్టకుండా కొడుకూ, కోడలూ పిల్లలతో సహా ఇంటికొచ్చేసరికి ఏనుగు నెక్కినంతా సంబరపడిపోయారు బామ్మ తాతయ్యలు. తోటలో ఇల్లు కాబట్టి అసలు వేసవి తాపమే తెలియటంలేదు. భోజనాలైన తరువాత ఇక పిచ్చాపాటీ ముచ్చట్లు మొదలయ్యాయి. అవి అర్ధరాత్రి వరకూ నడిచాయి. బామ్మ చెప్పిన కమ్మని నీతికథలతో ప్రయాణ బడలిక కూడా మరచిపోయి వింటూ ఆదమరచి నిద్రపోయారు పిల్లలు.

మరుసటి రోజు ఉదయాన్నే లేచి సముద్రస్నానం చేసి వచ్చారందరూ. “ఎంతో సహజ సిద్ధంగా ఉంది నాన్నా మన తాతయ్యగారి ఊరు!” అని పిల్లలు చెప్పిన మాటలకు మురళీకృష్ణ కళ్లు చమర్చాయి. “ఔనురా ఇది మన అదృష్టం, పూర్వజన్మ సుకృతం కూడా” అన్నాడు.

ఇక తాతయ్య రోజూ ఏదో ఒక కొత్త విషయం గూర్చి చెప్పేవాడు. ఎందుకంటే ఆయన అనుభవ పాఠాలన్నీ మనవడికీ, మనవరాలికీ ఎంతో ఉపయోగపడాలన్నదే ఆయన ధ్యేయం. వేసవిలో సేదతీర్చే తాటిముంజలను ఇష్టంగా తిన్నారు పిల్లలు.

ఒకరోజు మురళీకృష్ణ స్నేహితులు జయదేవ్‌, బులుస్వామి, చలం, చక్రవర్తి ఇంటికొచ్చారు. వారిలో చక్రవర్తి ఓషనోగ్రఫీ అంటే సముద్రాలపై పరిశోధనలు చేస్తున్నాడట. వాళ్లందరినీ తిరిగి కలుసుకున్నందుకు మురళీకృష్ణ ఎంతో ఆనందించాడు. అర్చన అతను చేస్తున్న పరిశోధన గురించి ఎంతో ఆసక్తితో తెలుసుకొంది. ఇక అందరూ బాగా చదువుకున్నవారే కాబట్టి అరవింద్‌కీ, అర్చనకి ముఖ్యమైన సిలబస్‌లో ఇచ్చిన స్పెషల్‌ కోచింగ్‌ పాఠాలను క్షున్నంగా చెప్పారు. ఒకరోజు వాళ్లందరితో కలిసి మడ అడవులను చూడడానికి వెళ్లారు. మడ అడవులను ప్రత్యేక్షంగా చూడడంతో ఎంతగానో సంబరపడి పోయింది అర్చన. ఎందుకంటే, పర్యావరణ పరిరక్షణలో మడ అడవుల పాత్ర చాలా విశేషమైనది. నదులలోని ఆటుపోటు నీటి ప్రవాహానికి కరకట్టలు కుట్టుకుపోకుండా, గండిపడకుండా కాపాడేవి మడ అడవులే. అలాగే ఉధృతంగా ప్రవహించే సముద్ర ప్రవాహానికి అడ్డుగా నిలిచి గ్రామాలను, పట్టణాలను మరియు నగరాలను రక్షిస్తున్నాయి ఈ మడ అడవులు.

అక్కడ దొరికిన, ఎండిపోయిన వెదురుకర్రను సేకరించాడు అరవింద్‌. దీనిని మురళిగా తయారుచేస్తానన్నాడు.

“ఓరేయ్‌! ఫ్లూట్‌ తయారుచేయడమే కాదు, సాయంత్రం సంగీత కచేరీ కూడా ఇవ్వాలి” అని అనగానే అందరూ ఒక్కసారిగా ఘొల్లున నవ్వేశారు.

ఆ తరువాత కొల్లేరు సరస్సు ముంపు గ్రామాలకు వెళ్లారు. అక్కడ ప్రజలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. ముఖ్యంగా  మత్స్యకారులు ఎదురుకుంటున్న పలు సమస్యలను విని ప్రత్యేక్షంగా చూచి చలించిపోయారు.

“ఇప్పటికైనా అర్థమైందా! చదువుతోపాటు ఇలాంటి విహారయాత్రలు కూడా ఎంతో అవసరం” అని మురళీకృష్ణ చెప్పటంతో భార్య విమల… “అవునండీ! అపుడపుడు మీరు కూడా కొన్ని మంచి పనులు చేస్తున్నారు” అంది కొంటెగా.

ఆ గ్రామంలో శబ్దకాలుష్యం, వాహన కాలుష్యం కూడా లేదు కాబట్టి వేసవికాలంలో కూడా చల్లగా గడిచిపోయింది. మళ్లీ తిరుగు ప్రయాణానికి వచ్చేరోజు అందరికీ చాలా బాధగా తోచింది. ఇరవై రోజులూ నాలుగురోజుల్లా హాయిగా గడిచిపోయాయి.

అందర్నీ రైలు ఎక్కించటానికి వచ్చిన తాతయ్య గుండె బరువెక్కిపోయింది. అయినా తమాయించుకున్నాడు. “అర్చనా, అరవింద్‌ ఇది కూడా ‘వేసవి శిబిరమే’. మీరు పాఠ్య పుస్తకాలలో చదువుకున్నవి ప్రత్యక్షంగా చూడడానికి ఇలాంటి వేసవి శిబిరాలు చాలా అవసరం. అందుకనే ప్రతి సంవత్సరం వేసవి శెలవులకి ఇలాగే తప్పకుండా మీరు రావాలి” అని తాతయ్య చెప్పిన ఆత్మీయ వచనాలను గుర్తు చేసుకుంటూ రైల్లో ఆదమరచి నిద్రలోకి జారుకున్నారందరూ.

శుభం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here