వేట

0
7

[dropcap]ఆ[/dropcap]దివారం కాదు గాని, ఆరోజు అమావాస్యే. ప్రపంచాన్ని చీకటి దుప్పట్లో చుట్టి దాచిపెట్టినట్లుంది. అందుకే కాబోలు గాలికి కూడా ఊపిరాడట్లేదు. తెల్లవారుఝామున మూడున్నరయ్యి ఉంటుంది. పిశాచాలు కూడా కునుకు తీసే సమయం. ధనోవా మాత్రం పిశాచాలకే పిశాచిలా మేల్కొని ఉన్నాడు. విప్పచెట్టు కొమ్మల మధ్య కట్టిన చిన్న మంచెపై కూర్చుని ఉన్నాడు.

చీకటి రంగంటే ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుందని అందరూ అనుకుంటారు. చదువుకున్నోళ్ళైతే, కాంతి లేకపోవడమే చీకటి, అదే నలుపు అంటారు. కానీ, చీకటి రంగులా ఉండే నలుపెలా ఉంటుందో తెలిసిన వ్యక్తి ధనోవా. కళ్ళు మూసినా, తెరచినా కనిపించే నలుపులో ఏమాత్రం తేడా ఉండదో, అదే చీకటి నలుపు. మరి ధనోవా చదువుకున్నోడా కాదా అంటే మాత్రం ఎప్పుడూ జవాబు చెప్పడు. కానీ, అతనికి ఆ అవసరమెప్పుడూ రాలేదు. ఎందుకంటే ఇప్పటి వరకూ అతన్ని ఎవ్వరూ అలాటి ప్రశ్న వేయలేదు, ఆఖరికి అతను మిలట్రీలో చేరడానికి వెళ్లినప్పుడు కూడా.

మీకు నచ్చే పనిని మీ వృత్తిగా ఎంచుకుంటే మీ వృత్తి పరమైన జీవితం సుఖంగా కాకపోయినా సంతోషంగా ఉంటుందని ఒక మేనేజిమెంటు సిద్ధాంతం. కానీ, తను ఏ పని చేసినా కొంత కాలానికి ఆ పనిని ప్రేమించడం ధనోవా ప్రత్యేకత. మిలట్రీలో చేరాక అప్పటివరకూ అడవుల్లో పక్షులను, కుందేళ్ళను, పండక్కి ఏదుపందిని వేటాడి పొట్టనింపుకుంటూ బ్రతికిన ధనోవాకు మిలట్రీ జీవితం అద్భుతంగా అనిపించింది. రోజూ ముప్పొద్దులా తిండి పెడుతుంటే తెల్లారుఝామున లేచి పరిగెట్టడానికి కష్టపడేవారిని చూస్తే అతనికి అసహ్యం వేసేది. ‘వీళ్ళకి జీవితం విలువ తెలీదు’, ఇదీ బద్ధకస్థులపై అతని అభిప్రాయం. తిండితో బాటుగా అతనికి మిలట్రీ రమ్ము కూడా బాగా నచ్చింది. ఎంత బాగా నచ్చిందంటే, తన సహోద్యోగుల రమ్ము దొంగిలించి తాగేంత వరకూ. అంటే అతను తాగుబోతేమీ కాదు. తాగకుండా ఎన్ని రోజులేమిటి, నెలలైనా ఉండగలడు. కానీ అదేంటో, బల్లపై ఒంటరితనం అనుభవిస్తున్న రమ్ము సీసాను చూస్తే అతనికి జాలేసింది. తనలో చేర్చుకోమని ఆ సీసా ప్రాధేయపడుతున్నట్లనిపించింది. అలా చాలా సీసాలపై అతను జాలిపడడంతో చివరికి అతనికి ఎంతో ఇష్టమైన మిలట్రీ ఉద్యోగం పోయింది.

ఉద్యోగం పోవడంతో బలార్షా దగ్గరున్న తన స్వగ్రామానికి తిరిగి వచ్చాడు ధనోవా. అప్పటికే అతని తల్లి చనిపోయింది. అతనికంటూ ఎవరూ లేరు. కూడేసిన డబ్బుతో ఒక గది అద్దెకు తీసుకున్నాడు. మిలట్రీ నుంచి తరిమేసినా అతనికి యూనిఫాంపై మమకారం పోలేదు. ఎప్పుడూ ఆలివ్ గ్రీన్ డ్రస్సుల్లోనే ఉంటాడు. ఊరికొచ్చాక మళ్ళీ తన పాత పద్ధతిలో చిన్న జంతువులను వేటాడటం మొదలెట్టాడు. అలా ఓరోజు అడవిలో తిరుగుతుంటే చిరుత పిల్లలు రెండు దొరికాయి. ఇంటికి తెచ్చుకుని పెంచసాగాడు. రెండు నెలలలో అతని దగ్గరకు ఒక నేపాలీ స్మగ్లర్ వచ్చి చిరుత పిల్లలకు బేరమాడాడు. అమ్మడానికి ఇష్టం లేక ఒక్కోటి లక్షరూపాయలంటే మారు మాట్లాడకుండా డబ్బులిచ్చాడు నేపాలీ. తక్కువడిగానని అర్థమైంది ధనోవాకు. ఒక తుపాకి కూడా కావాలన్నాడు. తన దగ్గర తుపాకులుంటే వ్యాపారం చేయడం ఇంకా సులభమౌతుందని చెప్పాడు. అతన్ని పరిశీలనగా చూసిన నేపాలీ ఒక రైఫిల్, ఒక పిస్తోలు ఇచ్చాడు. తరువాత మూడేళ్ళలో నాలుగు చిరుతలూ, ఆరు ఎలుగుబంట్లూ, ఒక పులి తమ ప్రాణాలు త్యాగం చేసి, ధనోవా పక్కా ఇల్లు కట్టుకోడానికి కారణమయ్యాయి. మూడు నెలల క్రితం నుంచి ఒక వయసైన పులి ఊళ్ళమీద పడిందని వార్తలు రావడంతో ఈ పులి తర్వాత తను పెళ్ళి చేసుకుని స్థిరపడవచ్చని అనిపించింది ధనోవాకి.

అడవుల్లో ఉన్న చిన్న పల్లెటూళ్ళు, తండాలలో ఆ పులి ఎక్కడెక్కడ ఆవులు, మేకలపై దాడి చేసిందో పరిశీలించాడు. ఒకే ఊళ్ళో రెండు నెలలలో మూడు సార్లు దాడి జరిగింది. ప్రతిసారీ పులి ఉత్తరం నుంచే వచ్చినట్లుంది. ఊరికి ఉత్తరాన ఉన్న చిట్టడవిలోకి వెళ్ళి తను మాటు వేయడానికి తగిన స్థలం కోసం చూశాడు.

ఊరినుంచి ఒక మైలు దూరంలో మట్టి రోడ్డు నుంచి రెండు ఫర్లాంగులు లోనకెళితే చిన్న చెఱువు, దాని పక్కన ఇంకా చిన్న మైదానం ఉన్నాయి. చెఱువుకు దక్షిణంగా వెదురు తుప్పలున్నాయి. తుప్పలనుంచి పాతిక గజాల దూరంలో చిన్న విప్ప చెట్టు ఉంది. ఆ పైన ఇంకా చాలా పెద్ద చెట్లు ఉన్నాయి. ఖచ్చితంగా నీళ్ళకోసం పులి ఇక్కడికి ఎప్పుడో ఒకప్పుడు రావచ్చనిపించింది ధనోవాకి. అడవి వైపు నుంచి పులి వస్తే విప్పచెట్టు, వెదురు తుప్పలు దాటే చెఱువు దగ్గరకెళ్ళాలి. చెఱువు దాటి వెళితే గానీ పులి ఊళ్ళోకి వెళ్ళలేదు. కానీ, అక్కడ ఉండటం కష్టం. అడవి పలచగా ఉంది. పగలు చాలా ఎండగా ఉంటుంది. రాత్రి ఎముకలు కొరికేట్లు చలి వేస్తుంది. కానీ, రాత్రి మాత్రం తప్పదు. పులి కావాలంటే చలిని అనుభవించాల్సిందే. అతను ఇంకా అడవిలోకెళ్ళి బాగా దట్టంగా ఉన్న చెట్ల మధ్యనున్న పెద్ద మర్రి చెట్టును ఎంచుకున్నాడు. అక్కడ తన స్థావరం ఏర్పాటు చేయడం మొదలెట్టాడు.

ఇంటికెళ్ళి తన జీపులో కావాల్సిన సామానంతా తెచ్చుకున్నాడు. తాళ్ళు పేని మర్రిచెట్టు కొమ్మల మధ్య ఉయ్యాలలా కట్టాడు. కొమ్మలకు నాలుగు కొక్కాలు వేలాడదీశాడు. ప్రతి కొక్కానికీ ఒక నైలాను సంచీ వ్రేలాడదీశాడు. ఒకదాంట్లో పెనం, గిన్నెలు, కంచం, గ్లాసు లాటివి. రెండో దాంట్లో పాతిక కిలోల గోధుమ పిండి, మూడు కిలోల కందిపప్పు, నాలుగు కిలోల ఆలుగడ్డలు, ఉల్లిపాయలు, మిరపకాయలు, ఉప్పు లాటివి. మూడో దానిలో కంబళ్ళు, దుప్పట్లు, రెండు జతల బట్టలు, తువ్వాళ్ళు, మఫ్లర్లు, గ్లౌస్, సాక్సులు లాటివి. నాలుగోదాంట్లో డజను రమ్ము సీసాలు. సాయంత్రం చీకటి పడుతుండగా దగ్గరున్న పల్లెటూరికి వెళ్ళి ఒక ముసలి మేకను కొనుక్కొచ్చాడు. మేక మెడలో ఒక పెద్ద కర్ర కట్టి వదిలేశాడు. అది అక్కడున్న పచ్చిక తినసాగింది. ధనోవా పప్పులో ఆలుగడ్డలు వేసి ఉడకేసాడు. రెండు పెద్ద రొట్టెలు చేసుకుని తిన్నాడు. దాదాపు తొమ్మది కావస్తుండగా తుపాకులు తగిలించుకుని, మేకను తీసుకుని బయలుదేరాడు. మేకను వెదురు తోపు దగ్గర కట్టేసాడు. తను విప్పచెట్టెక్కి కూర్చున్నాడు. నిరీక్షణ మొదలయ్యింది.

***

అప్పటికి ధనోవా పులికోసం మాటు వేయడం మొదలెట్టి చాలా రోజులైంది. ఇంకెవరైనా సాధారణ మనిషైతే ఎన్ని రోజులైందీ లెక్క పెట్టుకుంటాడు. కానీ, చిన్నప్పటి నుంచీ మెదడును అనవసరంగా చదువులాటి వృథా విషయాలకు వాడనందువల్ల అతడికి రోజులూ, వారాలు లాటి పనికిమాలిన వాటితో సంబంధం లేదు. ‘అమాయకుడే ఆత్మజ్ఞాని’ అన్న అద్వైతసారాన్ని మానవరూపంలో చూడాలనుకుంటే ధనోవాను చూస్తే చాలు.

విక్రమార్కుడి కథలలోలా భేతాళుడిలా రోజూలానే ఆరోజూ రాత్రి తొమ్మిదిన్నరకే విప్పచెట్టెక్కాడు ధనోవా. అమావాస్య కావడం వల్ల చీకటిగా ఉంది. జనావాసాలకు దూరంగా దట్టమైన అడవుల మధ్య ఉండటం వల్లా, నల్ల మబ్బులు కమ్మడం వల్లా, కళ్ళు తెరచినా మూసినా ఏమీ కనిపించడం లేదు. మూసుకుంటే నిద్రపోవచ్చని అతను బలవంతంగా కళ్ళు తెరచుకుని కూర్చున్నాడు. ఎప్పుడో ఒకరోజు రాత్రిళ్ళు క్రూరజంతువులు వేటాడుతుంటే ఆ శబ్దాలు మాత్రం కాస్సేపు వినిపిస్తాయి. లేకుంటే ఎండిన ఆకుల మధ్య చిమటలు నడవడం, పాములు పాకడం లాటి శబ్దాలు మాత్రమే వినిపిస్తాయి. గత మూడున్నర వారాలలో ధనోవా కళ్ళూ, చెవులూ బాగా పదును తేరాయి. నడురాత్రి తరువాత అతనికి తన ఉచ్ఛ్వాస, నిశ్వాస శబ్దాలు కూడా వినిపించసాగాయి. ఆరోజు మరీ నిశ్శబ్దంగా ఉంది. వాన రాబోతుందని సాయంత్రం నుంచీ కమ్మిన కారుమేఘాలు తెలియజేస్తే తడవకుండా ఉండడానికని గాలి కూడా వీచడం మానేసింది. వాతావరణంలో తేమ శాతం బాగా పెరిగింది.

ఈ రాత్రి ధనోవా పులికోసం మాటు వేయడం మొదలెట్టి ఇరవైఏడు రోజులైంది. మేక పగలంతా తిని రాత్రి నిద్రపోయేది. ఈ మధ్య కొంచెం ఒళ్ళు చేసింది. రోజూ రాత్రి విప్పచెట్టుపై జాగారం చేసి ప్రొద్దున్నే మర్రిచెట్టు దగ్గరకెళ్ళి రాత్రి చేసిన రొట్టెలుతిని పైన కొమ్మల మధ్య కట్టిన ఉయ్యాలలో పడి నిద్ర పోయేవాడు. అడవి దట్టంగా ఉండడం వల్లనో లేక మర్రిచెట్టు చాలా పెద్దది కావడం వల్లనో అతనికి నిద్ర మాత్రం బాగా పట్టేది. రెండు మూడు రోజులకొసారి ఏ కుందేలో, ముంగిసో దొరికితే ఆ రాత్రికి దాన్ని వండేవాడు. నిజం చెప్పాలంటే అతనికి ఈ జీవితమే బాగుంది. కాంక్రీటు ఇంటిలో చికెనో, మటనో తిని పరుపుపై పడుకున్నా రాని నిద్ర, కుందేళ్ళు కాల్చుకుని తిని కొమ్మల మధ్య పడుకుంటే వస్తుంది.

దాదాపు అర్ధరాత్రప్పుడు ఎక్కడో దూరంగా నక్కల ఊళలు వినిపించాయి. ఆ తరువాత మళ్ళీ నిశ్శబ్దం. సాలెపురుగు గూడల్లుతున్న శబ్దం కూడా వినిపించేంత నిశ్శబ్దం. ప్రపంచంలోని దీపాలన్నీ ఆర్పేస్తే ఎలా ఉంటుందో ఆ రాత్రి అలా ఉంది. బొమ్మలా కూర్చుని ఉన్నాడు ధనోవా.

ధనోవా ఈ పాతిక రోజుల్లో ఎంత నేర్చుకున్నా అది స్వతఃసిద్ధమైన గ్రహణ శక్తి కంటే తక్కువేనని ఋజువు చేసింది ముసలి మేక. నిద్రలో కూడా పులిగబ్బుని పసికట్టి చటుక్కున నిద్ర లేచి భయంతో అరవసాగింది. పక్కనే పెట్టిన తుపాకీని చటుక్కున ఎత్తి పట్టుకుని ట్రిగ్గరుపై వేలు పెట్టాడు ధనోవా. చీకట్లో మేక కనబడడం లేదు. అసలు కొంచెం తెల్ల మచ్చలున్న దాన్నైనా తేవలసింది. ఈ చీకట్లో నల్ల మేక అస్సలు కనబడి చావట్లేదు. కానీ ప్రాణభీతితో అది చేసే ఆర్తనాదాలు వినిపించసాగాయి. రోజూ రాత్రి మేక నిద్రపోయాక దానివైపు తిరిగి టార్చిలైటు వెలుతురులో తుపాకి గురిపెట్టి చీకట్లో కూడా సరిగ్గా గురిపెట్టేంత వరకూ సాధన చేసేవాడు ధనోవా. తరువాత టార్చి ఆపివేసినా, గంటకోసారి తుపాకిని నిద్రపోతున్న మేకపై గురిపెట్టేవాడు. అందుకే అతను తయారుగా ఉన్నాడు. అతను కూర్చున్న చోటునుంచి మేక నిద్రించే చోటుకు దాదాపు యాభై గజాల దూరం ఉంటుంది. మేక అరుపులు పెద్దవి కాసాగాయి. మేగ గెంతులూ పెద్దవయ్యాయి. ప్రాణభయంతో తనను కట్టేసిన తాటినుంచి విడిపించుకోడానికి గింజుకుంటూ అరుస్తూ అది విఫలయత్నం చేస్తూంది. అంటే పులి దానికి దగ్గరౌతుండాలి. ధనోవా చెవులు రిక్కించి వినడానికి ప్రయత్నించసాగాడు. భయంతో అరుస్తున్న మేక అరుపుల బ్యాక్ గ్రౌండు మ్యూజిక్కులో పులి అడుగులు వినడానికి ప్రయత్నించి ఉపయోగం లేదని అతనికి అర్థమైంది. కానీ చెవులు రిక్కించడం వల్ల ఓ ఉపయోగం ఉంది. మేక అరుపులలో తేడాని గమనించవచ్చు. మేక అరుపులలో భయం ఎక్కువౌతుండటం అతనికి బాగా అర్థమైంది. చూపుడు వేలు ట్రిగ్గరుపై సిద్ధంగా ఉంది. అంతలో మేక గిట్టల శబ్దం ఆగిపోయింది. అంటే పులికి వ్యతిరేకంగా తాడు లాగి కాళ్ళను నేలపై బలంగా ఆనించి తాటినుంచి విడిపించుకోడానికి ప్రయత్నిస్తుంది. కానీ అరుపులు ఆగలేదు.

ఒక్కసారిగా పెద్ద చప్పుడైంది. పులి మేకపైకి దూకినట్లుంది. మేక కేకలు తారాస్థాయికి చేరుకున్నాయి. అంతలోనే ఆ కేకలలో భయానికి బదులుగా బాధవ్యక్తమవసాగింది. మేక పీక పులి నోట్లో చిక్కి ఉంటుంది. లేకుంటే దాని శరీరంపై బలమైన పంజా దెబ్బ పడి, వాడి గోళ్ళతో పులి దాని డొక్క చింపి ప్రేగులు బయటకు లాగేసి ఉంటుంది. ధనోవా ట్రిగ్గర్ నొక్కాడు. తుపాకిని చాలా కొంచెంగా ప్రక్కకి తిప్పి ఇంకోసారి నొక్కాడు. ఆ చీకట్లో కళ్ళముందు తుపాకి మందు పేలడంతో అతనికి కళ్ళముందు అంతా తెల్లగా కనిపించింది. కళ్ళు మూసుకున్నాడు. అయినా చాలా కాంతివంతమైన దీపం కనబడుతుంది. పులి గర్జన వినబడింది. కనీసం ఒక్క తూటాయైనా పులికి తగిలి ఉండాలి. పులి గెంతి పారిపోయిన చప్పుడు వినిపించింది. మేక కేకలు ఆగిపోయాయి.

తుపాకిని పక్కన బెట్టి రెండు చేతులతో కళ్ళు మూసుకున్నాడు ధనోవా. రెండు నిముషాల తరువాత తెరిచాడు. జేబులోంచి టార్చిలైటు తీసి మేక వైపు వేశాడు. మేక ఒక పక్కన పడి ఉంది. దాని కడుపు బాగా చీరి ఉంది. ఒక తూటా దాని తలకు తగిలినట్లుంది. తల పూర్తిగా చితికి పోయి ఉంది. పులి ఎంత దూరం పోయి ఉంటుంది? బాగా దూరం పోయి ఉంటుందా? తూటా ఎక్కడ తగిలి ఉంటుంది? ప్రాణం పోయే చోట తగిలి ఉంటుందా? లేక కాలికో, తోకకో తగిలి ఉంటుందా? బాగా రక్తం కారి ఉంటుందా? అసలు ఈ పులి చస్తుందా? చావదా? అతని సాధారణ మనస్సులో ఎన్నో ప్రశ్నలు. ఒక్కదానికీ అతని దగ్గర సమాధానం లేదు.

పక్కనున్న సీసాలోంచి రెండు గ్రుక్కలు రమ్ తాగి చెట్టు దిగాడు ధనోవా. అప్పటికే పులి భయం తగ్గిందేమో, నిశ్శబ్దం మళ్ళీ తిరిగి వచ్చింది. మెల్లగా నడుచుకుంటూ మేక దగ్గరకు వచ్చాడు ధనోవా. మేక విగత శరీరాన్ని చూస్తే ముందు జాలేసింది. తరువాత ఆకలేసింది. లోపల్లోపలే నవ్వుకున్నాడు ధనోవా. కనీసం వారం తినొచ్చు. ఈమధ్య బాగా బలిసింది మేక.

పులి ఎటువైపు వెళ్ళి ఉంటుందో అంచనా వేయడానికి ప్రయత్నించాడు. ముందు అసలు ఏమీ అర్థం కాలేదు. తరువాత వెదురు పొదల అంచులలో రెండు వైపులా గడ్డి నలిగి ఉండటం గమనించాడు. అంటే పులి వచ్చిన దారినే పారిపోలేదు. ఒకవైపు నుంచి వచ్చి ఇంకోవైపు పారిపోయింది. కానీ ఎటువైపు నుంచి వచ్చింది? ఎటు వెళ్ళింది? ఇది అతనికి అర్థం కాలేదు. మేక పక్కన నిలబడి టార్చిలైటు నుంచి వచ్చే కాంతి పుంజాన్ని అన్ని వైపులా తిప్పాడు. పులి చెఱువు వైపు నుంచి వచ్చి అడవివైపు వెళ్ళి ఉండొచ్చు. లేకుంటే, అడవి వైపు నుంచి వచ్చి చెఱువు వైపు వెళ్ళి ఉండొచ్చు. చెఱువు వైపు వెళితే అది గట్టు వెంపటే వెళ్ళాలి. అంటే, ఒకవైపు చెఱువు, ఇంకోవైపు వెదురు పొదలు. అతనికి ఎందుకో పులి చెఱువు వైపు పారిపోయిందని అనిపించలేదు. కానీ, పులి అడవి నుంచి వచ్చి ఉంటే ఖచ్చితంగా చెఱువు వైపే వెళ్ళి ఉండాలి. అడవి నుంచి పులి వస్తే తాను కూర్చున్న విప్పచెట్టు దాటి మేక దగ్గరకు వచ్చి ఉండాలి. మరి తనకేమీ అనిపించలేదే. చెఱువు వైపు వెళ్ళంది అంటే అది ఎంతో దూరం వెళ్ళి ఉండకపోవచ్చు. అలా కాదు అనుకుంటే, చెఱువు వైపు నుంచి వచ్చి అడవిలోకి వెళ్ళి ఉండాలి. పులి ఎందుకని చెఱువు వైపు నుంచి వస్తుంది? సాధారణంగా అడవి వైపు నుంచి కదా రావాలి. తన జీవితంలో ఒక విషయం గురించి ఇంతసేపు ఆలోచించడం అదే మొదటిసారి. అందుకే అతను ఇష్టం లేకపోయినా పులి చెఱువు వైపే వెళ్ళిందని అని నిశ్చయించుకున్నాడు. మేకను తీసి తను పడుకున్న కొమ్మపై వేశాడు. లేకుంటే తను మళ్ళీ వచ్చేసరికి నక్కలు పీక్కు తింటాయి.

మెల్లగా చెఱువు వైపు అడుగులేశాడు ధనోవా. అతనేమీ శిక్షణ పొందిన వేటగాడు కాదు. చిన్నప్పుడు ఆకలి అతనికి చిన్న చిన్న జంతువులను వేటాడే అవసరం కల్పించింది. నేపాలీ ఇచ్చిన తుపాకీ పెద్ద జంతువులను వేటాడగలిగే శక్తిని ఇచ్చింది. కానీ అవసరం, శక్తికి పైన ఒక నిష్ణాతుడైన వేటగాడికి కావలసిన నిపుణత అతడిలో లేదు. కాకుంటే, పులి ఎక్కడికి వస్తుందో లెక్కేసి, అది ఎరపై ఎగిరే సమయానికి తుపాకి కాల్చి పులిని గాయపరుచ గలిగినందుకు అతడు అప్పటికే తనని తాను ప్రపంచంలోని గొప్ప వేటగాళ్ళలో ఒకడిగా భావించుకోసాగాడు. అడవిలో చప్పుడు చేయకుండా నడువగలగడం ఒక విద్యే. ధనోవా మళ్ళీ తుపాకీలోకి తూటాలెక్కించి చెఱువు గట్టున నడిచాడు.

***

జ్యోతి వెదురు తుప్పలకు అవతల నిలబడి అక్కడున్న పెద్ద గుబురు వెనుక దాగి ధనోవానే చూస్తుంది. మనుషులను చూడడం జ్యోతికి కొత్తేమీ గాదు. తన పదహేడేళ్ళ వయసులో చాలాసార్లు మనుషులను చూసింది. కాకపోతే దూరం నుంచే. ఇప్పటి వరకూ వాళ్ళను దగ్గరనుంచి చూడాల్సిన అవసరం పడలేదు. ఎటూ మనుషుల కంపు తనకు నచ్చేది కాదు కాబట్టి ఎప్పుడూ మనుషులను వేటాడాల్సిన అవసరం కూడా రాలేదు. కానీ, ప్రస్తుత పరిస్థితి మాత్రం వేరు. అసలే మూడురోజులుగా తిండి లేదు. ఈమధ్య వయసెక్కువవడం వల్ల అడవి జంతువులను వేటాడ లేకపోతుంది. ఇంతకు ముందులాగా మాటువేసి జింకలను పట్టే ఓపికా, శక్తీ రెండూ పోయాయి. అందుకే ఇలా ఊళ్ళమీద పడి దూడపిల్లలను తినడం.

అన్నట్లు జ్యోతి ఒక పులి పేరు. అటవీశాఖ వారు నిర్వహించే సర్వేలో ఈ పులికి సంవత్సరం వయసప్పుడే రేడియో కాలర్ కట్టారు. ఆరోజే దానికి జ్యోతి అని నామకరణం కూడా చేశారు. ఈ మధ్య కాలంలో ఇన్ని సంవత్సరాలు జీవించిన పులి జ్యోతి ఒక్కటే. దానితో బాటు పుట్టి ఒక మగపులి, ఒక ఆడపులి చచ్చి అప్పటికే నాలుగేళ్ళౌతుంది. మగపులైతే తొమ్మిదేళ్ళకే చచ్చింది. మరి చావకేం చేస్తుంది? తనకంటే బలమైన ఇంకో పులితో పోట్లాడితే. ఆడపులి మాత్రం వేటగాళ్ళ తూటాలకే చచ్చింది. కానీ ఈ విషయాలన్నీ జ్యోతికి తెలీవు. జ్యోతికి తన సంతానమే ఒక డజను ఉండాలి. ఏడు మగపులులకూ, అయిదు ఆడ పులులకూ జన్మనిచ్చింది జ్యోతి. కానీ, ప్రస్తుతం ఒంటరి జీవితం గడుపుతుంది.

ధనోవా చెఱువు గట్టు వైపు వెళ్ళడం గమనించిన జ్యోతి మెల్లగా అతనిని అనుసరించడం మొదలెట్టింది. విప్పచెట్టు కొమ్మల మధ్యనుంచి మేక మాంసం వాసన వస్తుంది. కానీ ఎక్కడుందో కనిపించడం లేదు. కొమ్మ కనీసం పదిహేను అడుగుల ఎత్తు ఉంది. అంత ఎత్తు ఎక్కే ఓపిక లేదు. నిట్టూర్చుతూ సహజ సిద్ధమైన గాంభీర్యంతో ధనోవా వాసన వెనుకే నడువసాగింది. జ్యోతికి కుడి చెవి దగ్గర చాలా నొప్పిగా ఉంది. మెల్లగా రక్తం కారుతుంది. కానీ ఆ విషయం దానికి తెలీదు. ధనోవా పేల్చిన మొదటి తూటా జ్యోతి చెవిని చీల్చుకుని వెళ్ళి మేకను తాకింది. అప్పటికే జ్యోతి దాని డొక్క చించి ఉండడంతో మేకకు ధనోవా సుఖ మరణాన్ని ప్రసాదించిన వాడైనాడు.

***

తెల్లారే వరకూ గాయపడ్డ పులికోసం తిరిగాడు ధనోవా. అతడికి అలసటగా ఉంది. సన్నగా చినుకులు పడుతున్నాయి. అంతా అడవి వాసనే. ఎక్కడా పులి వాసన తట్టలేదు. ఆకలేస్తుంది. వెనుతిరిగాడు. ధనోవా తిరిగి రావడం గమనించిన జ్యోతి చప్పున పక్కనున్న తుప్పలలోకి దూరిపోయింది. పులి గబ్బును పసిగట్టిన అడవిపిల్లొకటి ఆ తుప్పల మధ్యనుంచి అరచుకుంటూ ధనోవాకు ఎదురెళ్ళింది. తుపాకితో సిద్ధంగా ఉన్న ధనోవా దాన్ని వెంటనే తన ఖాతాలో వేసుకున్నాడు. అడవిపిల్లిని కూడా తీసుకెళుతున్న ధనోవాను చూసి కడుపు రగిలిపోయింది జ్యోతికి. వీడున్నంత కాలం తన కడుపు కొడుతూనే ఉంటాడులావుంది.

ధనోవా విప్పచెట్టు దగ్గరకొచ్చి మేకను కిందకు దించాడు. తరువాత తన బ్యాగులో మేకను, అడవి పిల్లిని వేసుకుని భుజానికి తగిలించుకున్నాడు. ధనోవా తన స్థావరం వైపు వెళుతుంటే, వెనుక నుంచి అతని భుజానికి వ్రేలాడుతున్న తుపాకినే చూస్తూ ఉంది జ్యోతి. అలా అతని వెన్నంటి అతని స్థావరం వరకూ వెన్నాడింది. ధనోవా స్థావరం చేరగానే దూరంగా తుప్పలలోంచి అతన్ని గమనించసాగింది.

ధనోవా నిప్పు రాజేసి అడవి పిల్లి తోలు వలచి కాల్చడం మొదలెట్టాడు. మేకను అలాగే చెట్టుపైకి తీసుకెళ్ళి కొమ్మల మధ్య ఉంచాడు. బయటుంచితే పక్షులు వచ్చి పీక్కుతినే ప్రమాదం ఉంది. బ్యాగులో ఉంచితే కుళ్ళిపోతుంది. కానీ తాను పగలంతా అక్కడే ఉంటాడు కాబట్టి పక్షులు రావేమోనని అనుకున్నాడు ధనోవా. అడవి పిల్లిని సగం తిన్నాక మెల్లగా చెట్టెక్కి ఇంకో రెండు పెగ్గులు పట్టించి నిద్రకు ఉపక్కమించాడు. అతన్నే చూస్తూ దూరంగా తుప్పలలో ఉండిపోయింది జ్యోతి. ధనోవాకి తెలియకపోయినా పులిగబ్బును గ్రహించిన జంతువులేవీ ఆ చుట్టుపక్కలకు రాలేదు. పక్షులు కూడా నిద్రిస్తున్న మనిషి దగ్గరకు రావడానికి సాహసించలేదు. ఒక గ్రద్ద మాత్రం ధైర్యం చేసి మర్రిచెట్టు కొమ్మపై వాలింది. కానీ నిద్రలో ధనోవా కదలడంతో, అప్పటికే తుపాకి మందు వాసన పసిగట్టిన గ్రద్ద వెంటనే ఎగిరిపోయింది.

సూర్యాస్తమయానికి ఇంకో గంట ఉందనగా నిద్ర లేచాడు ధనోవా. నోరు పుక్కిలించి రెండు రొట్టెలు కాల్చుకుని మిగిలిన పిల్లి మాంసం తిని మేకను చెట్టు దించాడు ధనోవా. దాన్ని మళ్ళీ బ్యాగులో కుక్కి మళ్ళీ చెఱువు దగ్గరకు బయల్దేరాడు. అతను కొంచెం దూరం వెళ్ళగానే పిల్లిని కాల్చిన చోటికొచ్చి తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని చూసింది జ్యోతి. తోలు తప్ప ఏమీ లేదక్కడ. కోపంగా ధనోవా అడుగుజాడలను అనుసరించింది జ్యోతి.

ధనోవా నేరుగా చెఱువు దగ్గరకెళ్ళి మేకను కట్టేసిన చోట దాని శరీరాన్ని పడేశాడు. తినడానికి ఏమీ దొరకకపోతే మళ్ళీ మేకను వెతుక్కుంటూ పులి రావచ్చు. ఒకవేళ పగలు వచ్చిపోతే మాత్రం తాను ఏమీ చేయలేడు. అంతే కాదు, మాంసం వాసనకు నక్కలూ, కుక్కలూ కూడా రావచ్చు. కానీ, అతనికి ఇంతకంటే గత్యంతరం లేదు. ఇంకేమీ ప్రత్యామ్నాయం లేదు. భేతాళుడిలా మళ్ళీ విప్పచెట్టెక్కాడు ధనోవా. అడవి అంచునే కూర్చుని అతనికి కాపలా కాసింది జ్యోతి. మేక శరీరం దగ్గరకు పోవడానికి ఏ ప్రయత్నమూ చేయలేదు. చేస్తే ఏం జరుగుతుందో ఇంకా మండుతున్న కుడి చెవి గుర్తు చేస్తూనే ఉంది. జ్యోతి ఉండటంతో ఇంకే జంతువూ అటువైపు రాలేదు. అర్థరాత్రి దాటింతర్వాత జ్యోతి మళ్ళీ వెనక్కి బయలు దేరింది. ధనోవా స్థావరమైన మర్రిచెట్టు వద్దకు వచ్చి చుట్టూ తిరిగి చూసింది. చెట్టు బాగా ఎత్తుగా ఉంది. తాను ఎక్కలేదు. చెట్టుపై మాంసం ఏదైనా ఉండి ఉండవచ్చు. కానీ ఈ చెట్టు ఎక్కడం చాలా కష్టం. అయిదేళ్ళ క్రిందైతే కొంచెం కష్టపడి ఎక్కి ఉండేది. కానీ, ఈ వయసులో? క్రింద తిరుగుతున్న జ్యోతిని పసిగట్టిన పక్షులన్నీ అరవడం మొదలెట్టాయి. కానీ ఒక అరగంట తరువాత ఈ ముసలి పులి వల్ల తమకేమీ ప్రమాదం లేదని గ్రహించి అవీ నిదరోయాయి. జ్యోతి మాత్రం మర్రిచెట్టు చుట్టూ గుండ్రంగా తిరుగుతూ మాటు వేయడానికి అనువైన చోటు కోసం వెతుకుతుంది. తెల్లారుఝాముకు జ్యోతికి ఒక అనువైన ప్రదేశం కనిపించింది. ధనోవా స్థావరానికి వచ్చే త్రోవలో ఒక పడిపోయిన చెట్టు చుట్టూ బాగా పొదలు పెరిగి ఉన్నాయి. వాటి మధ్యలోనున్న ఆ చెట్టుపైకెక్కి కూర్చుంది. అక్కడ కూర్చుంటే జ్యోతికి పొదలకు అవతల నడిచే ధనోవా కనిపించడు. కానీ చూస్తే గాని తెలియకపోవడానికి జ్యోతి ఏమీ మనిషి కాదుగా. మనిషి వాసనను ఇట్టే పట్టేస్తుంది. ఆకలితో నకనకలాడుతున్న కడుపుతో అలాగే అక్కడ కూర్చుంది.

తెల్లారగానే మేకను మళ్ళీ బ్యాగులో వేసుకుని స్థావరానికి బయలుదేరాడు ధనోవా. ఇక బహుశా పులి ఈ ప్రాంతానికి రాకపోవచ్చు. ఇంకోచోట మాటు వేసి చూద్దామనుకుంటూ మెల్లగా నడుస్తున్నాడు.

అడవంతా పక్షుల కిలకిలారావాలతో, విచ్చుకుంటున్న అడవి పూల సువాసనలతో ఆహ్లాదంగా ఉంది. స్వచ్ఛమైన గాలిని గుండెల నిండా పీల్చుకుంటూ నిత్యవసంతమైన ఆ రమణీయ ప్రకృతిని ఆస్వాదిస్తూ అడుగులేస్తున్నాడు. అతను యాభై అడుగుల దూరంలో ఉండగానే జ్యోతి అతని వాసన పసిగట్టింది. ముక్కు చుట్టూ ఉన్న రోమాలూ, ఎడమ చెవీ నిక్కబొడుచుకున్నాయి. మెల్లగా నడ్డి వెనక్కి జరిపి, ముందు కాళ్ళు సాగతీసి ఎగరడానికి సిద్దంగా ఉంది. ధనోవా అడుగుల చప్పుడు దగ్గర నుంచి వినబడసాగింది. ఆ చప్పుడును బట్టి అతడున్న ప్రదేశాన్ని గుర్తించి ఒక్కసారిగా పొదలపైనుంచి ఎగిరింది జ్యోతి. ఏం జరుగుతుందో ధనోవాకు అర్థమయ్యేలోపే నూటముఫ్ఫైనాలుగు కిలోల బరువున్న జ్యోతి అతనిపై పడింది. ఒక భుజానికి తుపాకీ, రెండో భుజానికి మేక, రమ్ము ఉన్న బ్యాగు తగిలించుకుని ఉండటంతో అతనికి ఏమీ చేసే అవకాశమే లేదు. ఉన్నా కూడా అతనేమీ చేయలేడు. జ్యోతి అతనిపై పడి, అతని శరీరం నేలను తాకగానే మళ్ళీ ఎగిరి దూకింది. పదడుగుల దూరంలో నిలబడి వెనుతిరిగింది జ్యోతి. తుపాకి తగిలించుకున్న కుడిచేతిపైనే తన బరువంతా వేసి పడ్డాడు ధనోవా. భుజం బాగా నొప్పి పెడుతుంది. పులిని గమనించగానే మెల్లగా ఎడమ భుజానికున్న బ్యాగును జారవిడిచాడు ధనోవా. ఎడమచేత్తో బెల్టుకున్న కత్తిని బయటకు తీయబోయాడు. అతను బ్యాగు జార్చగానే అతనిపై దూకిన జ్యోతి ముందు కాలి కుడి పంజా అతని ఎడమ భుజాన్ని చీరేసింది. ఎడమ పంజా గోళ్ళు అతని ఛాతీపై కుడివైపు దిగాయి. బాధతో అరిచాడు ధనోవా. తనదే పైచేయని గ్రహించిన జ్యోతి ఇంక ఆలస్యం చేయలేదు. అతని ముఖం వాసన చూసి తన నాలుకతో ముఖాన్ని నాకింది. దాని నోటినుంచి కారిన ఉమ్మితో ధనోవా ముఖం మొత్తం తడిసిపోయింది. గరుగ్గా ఉన్న ఆ నాలుక అతని నెత్తిపై గుచ్చుకుంటున్నట్లు అనిపించింది. అప్పటికే భయంతో గుండె కొట్టుకుంటుందో లేదో కూడా తెలియడం లేదు అతనికి. తన తలతో ధనోవా తలను వెనక్కు నెట్టి అతని గొంతుపై తన కోరలానించింది జ్యోతి అని కళ్ళలోకే చూస్తూ. ధనోవాకు చావు భయమంటే ఏమిటో అప్పుడు తెలిసింది. జ్యోతి కోరలు గొంతులో దిగబడటం అతనికి తెలుస్తూంది. వెచ్చగా తన రక్తమే బయటకొచ్చి వీపు కింద చేరి చొక్కాను తడిపేయడం తెలిసింది. అప్రయత్నంగా చేతులూ, కాళ్ళూ కొట్టుకోసాగాయి. అతని గొంతును గట్టిగా పట్టుకుని జ్యోతి పొదల వెనుకకు ఈడ్చుకెళ్ళడం మాత్రం అతనికి తెలియలేదు. పొదల మధ్య అతని శరీరాన్ని దాచి మళ్ళీ వెనక్కి వచ్చి అతని బ్యాగు నోటితో పట్టుకుని దాన్నీ పొదల వెనుకకు తీసుకెళ్ళింది జ్యోతి. ధనోవా పైనున్న కోపమంతా ఆ బ్యాగుపైనా, అతని దుస్తులపైనా చూపించింది. మెత్తగా ఉన్న అతని కడుపుపై ముందు దాడి చేసింది. రమ్ముతో నిండి ఉన్న అతని ఉదర భాగాలు తిని అతని పక్కనే పడుకుని సేదదీరసాగింది. ధనోవా శరీరం నుంచి బాగా తెగి తల వేలాడుతుంది. నడుము కింది భాగం మాత్రమే చెక్కు చెదరకుండా ఉంది. కానీ ఛాతీ క్రిందనుంచి నడుము వరకూ ఏమీ మిగల్లేదు.

అప్పటికే నాలుగు రోజులుగా ఏమీ తిననందు వల్ల భుక్తాయాసంతో నిద్రపట్టింది జ్యోతికి. అందుకే తేనెకోసం వచ్చిన గిరిజ దూరం నుంచే కింద పడి ఉన్న తుపాకిని చూసి వెనక్కి పరిగెత్తిన విషయం దానికి తెలియలేదు. దాదపు పదకొండు కావస్తుండగా అక్కడికి వచ్చిన గార్డు దూరం నుంచే అక్కడ పడి ఉన్న తుపాకిని చూసి తన తుపాకిని ఎక్కుపెట్టి మెల్లగా తనను సమీపించడం జ్యోతికి తెలియలేదు. క్రింద పడి ఉన్న తుపాకికి పదడుగుల దూరంలో ఉన్నప్పుడు ఆ గార్డుకు ఏదో తేడాగా అనిపించింది. వెంటనే ఇంకో ఇరవై అడుగులు వెనక్కెళ్ళి పొదల చుట్టు తిరిగి వెళ్ళాడు. పొదల మధ్యనున్న కాస్త సందులోంచి అతనికి రక్తంతో తడిసి ఉన్న మిలట్రీ యూనిఫాం, దాని పక్కన పడుకున్న పులినీ చూశాడు. అతనికి ఆవులను వేటాడే పులి గురించి అప్పటికే తెలుసు. తుపాకిని గురిపెట్టి, ట్రిగ్గరుపై వేలు పెట్టి తుపాకి కొనతో కొమ్మలను మెల్లగా పక్కకు జరిపాడు. కనిపించిన దృశ్యం చూడగానే అతని గుండె జారింది. సగమే మిగిలి ఉన్న ధనోవా శరీరం చూస్తే సాధారణ మానవులు తట్టుకోలేరు. పక్కనే ఆదమరచి నిద్రపోతున్న జ్యోతిని చూశాడు ఆ గార్డు. దాని తలకు గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కాడు.

భయంతో బ్రతికుండగానే చనిపోయిన ధనోవా కళ్ళలో చావు భయాన్ని చూసిన జ్యోతి మాత్రం తనకు అసలేమీ తెలియకుండానే ప్రాణాలు వదిలింది.

– రష్యాలో జరిగిన ఒక యథార్థ ఘటన ఆధారంగా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here