వెతికి చూడండి. ఎవడైనా దొరక్క పోడు!

    1
    5

    [box type=’note’ fontsize=’16’]నమ్మిన వాడికే మోసపు అమ్మకం చేయచ్చన్న నిజాన్ని హాస్యంగా ప్రకటించిన కథ “వెతికి చూడండి. ఎవడైనా దొరక్కపోడు”.[/box]

    “ఇలా అయితే ఎలాగండీ ? కొంప కొల్లేరై పోతోంది. సుఖాన వున్న ప్రాణాన్ని కష్ట పెట్టుకుంటున్నాం. “ఆక్రోశించింది సరస్వతి .
    “అదే నేనూ బాధపడుతున్నాను” ప్రసాదరావు.
    “ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం? ఈ తెలివి ముందే వుండాల్సింది. అయినా ఏదో కొంపలంటుకు పోతున్నట్లూ కంగారు పడిపోయారు . నేనొచ్చేదాకా ఆగచ్చు కదా?”
    ” ఈ మాట ఇప్పటికి వంద సార్లు అన్నావు.”
    “ఇంకో వెయ్యిసార్లు అంటాను . ”
    కాలింగ్ బెల్ మోగింది . తలుపుతీస్తే మెకానిక్ . ” సార్ కారు తెచ్చాను .” అన్నాడు .
    ” ఓరి నిన్ను తగలెయ్యా . రెడీ అవగానే ఫోన్ చెయ్యమన్నానుగా. ఇంటికెందుకొచ్చావ్ ” మనసులోనే తిట్టుకున్నాడు ప్రసాద రావ్ .
    “అక్కడపెట్టి పో” అంది సరస్వతి
    “పెట్టానండీ .బిల్ ఇదుగో .” అన్నాడు
    అందుకుని కెవ్వుమంది .” ఏవిటీ నాలుగువేలా ?కారు కడగటానికి నాలుగువేలా ? నెలంతా కారు తుడిచి వారానికోసారి కడిగితే నెలకి అయిదొందలిస్తాం . మా పనబ్బాయికి .?
    ” కడగటం ఏమిటండీ? సొట్ట పడితే బాగు చేసాం కదా ? అందుకు ” అన్నాడు
    “సోట్టా? మళ్ళీ నా? ”
    “అవునండీ మొన్న సారూ గోడకి తగిలించారుట . సొట్ట పడింది .” చెప్పాడు.
    కోర కోరా చూసింది భర్త వంక . “నేను జాగర్తగానే వున్నాను కానీ ” తలొంచుకుని సంజాయిషీ ఇవ్వ బోయాడు ప్రసాద రావ్
    డబ్బులిచ్చి మెకానిక్ ని పంపించి మొగుడి ని దులిపేయటం ప్రారంభించింది .
    నిజమే ఆతనుతొందరపడి చాలా తెలివి తక్కువ పని చేసాడు .
    రెండు నెలల క్రిందట సరస్వతి రెండు వారాలకు టూర్ వెళ్ళింది. భర్తనీ రమ్మంది . . మీ మేనమామ వేసిన టూర్లు అనుభవమే . అంతా మీవాళ్లు. కూతుళ్లని పొగడటం
    అల్లుళ్ళని తిట్టటం అదే పని . నేన్రాను అన్నాడు.
    ఆవిడ అలా వెళ్లిన మర్నాడే ప్రసాదరావు పాత ఫ్రెండ్ నారాయణ వీళ్ళింటికి వచ్చాడు .
    నేను నా కారు అమ్మేస్తున్నాను . కొత్తమోడల్ ది కొందామనుకుంటున్నా . పెట్టి అవునూ నువ్వే తీసుకోరాదా ? అనేసరికి ఆశ్చర్య పోయాడు ప్రసాదరావు .
    “నాకా? నాకెందుకూ కారు ?” అన్నాడు
    “అందరికీ ఎందుకో నీకూ అందుకే .కారుంటే ఆదర్జా వేరు. ట్రాన్స్ఫర్ చేశారని రెండేళ్లు ముందరే వాలంటరీ రిటైర్ మెంటు తీసుకున్నావు. డబ్బుకేమీ కొదవలేదు. బోలెడంత పెన్షను . ?చక్కగా కారు కొనుక్కో నీ కైతే మరో పదివేలు తగ్గించి ఇస్తాను . ” అని తెగ బలవంత పెట్టేశాడు .
    కాస్త మెత్తపడ్డాడు ప్రసాదరావు. మా ఆవిడ ఊరెళ్ళింది. రాగానే తననీ అడిగి.” అంటే కొట్టి పారేసాడు నారాయణ .
    “నువ్వేమైనా అప్పు చేస్తున్నావా ఆవిడని అడగడానికి? ఇలా హఠాత్తుగా కొంటె ఆవిడ సరదా పడిపోతుంది . .పైకి చెప్పరుగానీ ఆడవాళ్ళకి ఇలాటివన్నీ సంతోషాన్ని కలిగిస్తాయి . ఓ సారి కారు చూడు “అని తీసికెళ్ళి చూపించాడు.
    బంగారం రంగులో ఇంత పొడవున పడవలా వుంది మెరిసిపోతోంది.
    “చెప్తే తప్ప పాత కారు అనుకోరు ఎవరూ . చాలా తక్కువ తిరిగింది . నామాట విని తీసుకో . నీకు అంతో ఇంతో డ్రైవింగ్ వచ్చు కదా . మీ ఆవిడ వచ్చేలోగా ఇంకా బాగా నేర్చేసుకుని ఆవిడ రాగానే ఓ రోజు శిల్పారామం , మరోరోజు రామోజీ ఫిలిం సిటీ . ఆతర్వాత శ్రీశైలం . నాగార్జున సాగరూ ,ఝామ్మంటూ తిరిగేయ్యటమే . మన చిన్నతనం లో డబ్బుల్లేక ఏ సరదాలూ తీర్చుకో లేక పోయాం . ఇప్పుడు కూడా ఎంజాయ్ చెయ్యకపోతే ఎలా ? అని ఊరిస్తుంటే కాదన లేకపోయాడు
    కారు కొనేసాడు . నారాయణ ప్రతిరోజూ తెల్లారకుండానే ఊరి బయటికి తీసుకెళ్లి డ్రైవింగ్ ప్రాక్టీస్ చేయించాడు . మా ఇంట్లోనే ఉంచి మీ ఆవిడ వచ్చే రోజున తీసుకొస్తాను అన్నాడు.
    అన్నట్లే వీళ్ళు ఆటో దిగుతుండగా కారొచ్చి ఆగింది
    అది తమ కారే అని తెలుసుకుని నోరావలించింది సరస్వతి . తాళాలు ఇచ్చి నారాయణ వెళ్ళేదాకా ఊరుకుని అప్పుడు నోరిప్పింది .
    “ఇప్పుడు అర్జంటుగా కారెందుకూ? నేనొచ్చేదాకా ఆగచ్చుగా. కనీసం ఫోన్ చేసినప్పుడు చెప్పచ్చుగా ? ఏనాడూ ఇటువైపురాని మనిషి హఠాత్తుగా ఊడిపడి అంతప్రేమగా కారు ఎందుకు అమ్ముతున్నాడూ అని .అనుమానం రాలేదా ? “అని క్లాస్ తీసుకుంది .
    ప్రసాదరావుకు అప్పుడు బుర్ర పని చెయ్యటం మొదలెట్టింది ” ఏమో . నువ్వు సరదా పడతావు అంటే విని కొనేసాను ” అన్నాడు దీనంగా .
    జాలేసింది సరస్వతికి . పోన్లే పాపం కొనకపోయినా ఏడ్చి కొన్నా ఏడ్చి మొత్తుకుంటే ఏమైపోతాడు అనుకుని  “పోనీ లెండీ మనకూ కారు వుంది” అంది ఆనందం తెచ్చి పెట్టుకుని .
    “గుడికివెళ్ళి పూజ చేయించుకొద్దామా ? “అన్నాడు.
    “పూజ చేయించుకొచ్చి ఎక్కడ పెడదాం? పార్కింగ్ లేదుగా మనకు . కారుని అనాధలా రోడ్డు మీద వదిలెయ్యలేము. ముందు పార్కింగ్ వెతుకుదాం పదండి” . అంది . ..
    ఇద్దరూ ఇల్లిల్లూ తిరిగారు. భలేవారే పార్కింగ్ ప్లేస్ ఉంటే మేమె కొనుక్కునేవాళ్ళం .అన్నారు కొందరు. బాబ్బాబు మీ తో బాటు మాకూ ఓ పార్కింగ్ వెతికి పెట్టండి అన్నారు మరికొందరు. సాయంత్రానికి ఓ పార్కింగ్ దొరికింది . .అమ్మయ్య సమస్య తీరింది అనుకున్నారు. కానీ సవాలక్ష సమస్యలకు అది నాందీ అని అప్పుడు ఊహించలేదు .
    ఈ రోజుల్లో హైద్రాబాద్ రోడ్లమీద డ్రైవింగ్ అంటే సర్కస్ ఫీట్ చెయ్యటమే . మొదట్లో సరదాగా ఏ ఫ్రెండ్ ఇంటికో డ్రైవ్ అని బయలుదేరి చావుతప్పి కన్ను లొట్ట పోయినట్లూ గమ్యం చేరటం . అక్కడినించీ ఏడ్చుకుంటూ ఇంటికి చేరటం .
    దగ్గర ఏ షాపింగ్ కో వెళ్లినా సుఖం లేదు. ఎక్కడా పార్కింగ్ దొరకదు . ఎక్కడెక్కడికో పోయి కారు ఆపుకుని వచ్చేసరికి ఈవిడ షాపింగ్ అయిపోయి ఎదురుచూస్తూ ఉంటుంది .”
    “మళ్ళీ వెళ్లి కారు తెచ్చేసరికి తెల్లారుతుంది . పదండి నడిచి పోదాం” అని విసుక్కుంటుంది . సంచులు మోసుకుని కారు దాకా నడవటం . . అదివరకు హాయిగా ఆటోలో గుమ్మం ముందు దిగేవాళ్ళం . ఈ పీడాకారం వచ్చాక చస్తున్నాం . . అనుకోటం .
    దానికి సాయం ఊరంతా డివైడర్లు.. ఈ పెద్దకారుతో యూ టర్న్ తీసుకోవటం చాలా కష్టం . అక్కడ ఆగితే జనం తిట్టిపొయ్యటం . ఎక్కడో ఏదో తగలటం కారుకి సొట్ట పడటం. రిపేరు .
    అవన్నీ ఒకెత్తు అయితే పోలీసుల చెలానులు మరొక ఎత్తు . కాస్త అటూ ఇటూ అయితే వెయ్యి రూపాయలు కట్ట మని ఇంటికే శ్రీ ముఖం వస్తుంది .
    ” నేను గ్రీన్ లోనే వెళ్లాను. పది మంది పాదచారులు అడ్డం వస్తే బ్రేకు వేసాను. ఈ లోగా రెడ్ వచ్చేసింది . నా తప్పు లేదు మొర్రో అన్నా ఎవరు వింటారు ? . బ్యాంకు ముందు ఓ రెండు నిముషాలు ఆపి ఏ టి యం లో డబ్బు తీసుకొచ్చేసరికి ఫోటో తీసి ఫైను వేశారు. . అని నెత్తీ నోరూ బాదుకున్నా ఎవరు పట్టించుకుంటారు . ?
    ఏవిటో డబ్బు పోయి శని పట్టినట్లూ అయింది అని బాధ పడుతున్నారు .
    అటువంటి తరుణం లోఓ రోజు పొద్దున్నే సరస్వతి కి దూరపు బంధువు అయిన సూర్య నారాయణ వచ్చాడు . మూళ్ళ మీద కూచున్నట్లూ కూచున్నాడు ప్రసాదరావు . అత్తా వారి వైపు వాళ్లంటే గిట్టదు ఆయనకీ. ఎప్పుడు చూసిన ఎగతాళీ వెటకారం చేస్తుంటారు .
    వచ్చీ రాగానే ఏవిటే అమ్మాయ్ కబుర్లు ? అన్నాడు. ఏమీ లేకపోతేనే బోలెడన్ని కష్టాలున్నట్లూ చెప్తుంది . అలాటి అవకాశం వస్తే వదుల్తుందా?
    కారు కష్టాలు ఏకరువు పెట్టటం మొదలెట్టింది . అన్నీ విని జాలిగా చూశాడాయన
    “ఇన్నాళ్లూ లేనిది ఇప్పుడు కారు కొనుక్కోవటం ఏమిటి బావగారూ ? వున్న వాళ్ళే అమ్మేస్తుంటేనూ? ఇప్పుడు మన లాంటి మధ్య తరగతి వాళ్లకు కారెందుకండీ. ఎంచక్కా ఫోను చేస్తే ఓలా , ఉబర్ వచ్చి వాలిపోతాయి కదా ? ” అన్నాడు
    “ఏదో నా ఇష్టం కొన్నాను.” అన్నాడు ప్రసాదరావు చిరాగ్గా
    “అవునులెండి . మీ ఇష్టమే . లారీలో ఇసక తీసుకెళ్లి రాజాస్థాన్ లో అమ్ముతాను అంటే ఏం చెప్తాము?”
    అన్నాడు సూర్యం .
    మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ ట్లూ అప్పుడే పోస్ట్ అంటూ వచ్చి ఓ లేతాకు పచ్చ రంగు కవరు చేతులో పెట్టి పోయాడు పోస్టుమాన్ .
    అది దాచాలని విశ్వ ప్రయత్నం చేసాడు ప్రసాదరావు . కానీ ఫలించలేదు . చూడనే చూసింది సరస్వతి . “చచ్చాం మళ్ళీ చలానోచ్చిందా ? మళ్ళీ ఏం నిర్వాకం చేశారు?” అంది
    “నేనేం చెయ్యలేదు కావలిస్తే చూడు. పోలీసు వాన్ వెనకనే ఆపాను. నో పార్కింగ్ ఏరియా లో కారు ఆపేవు అని రాసాడు . ” అని ఆవేశ పడ్డాడు .
    “భలేవారే బావగారూ పోలీసులు ఆపెరని మనమూ ఆపుతామా? వాళ్లకున్న అధికారం మనకుంటుందా ?” అన్నాడు సూర్యం
    ” ఇదెక్కడి శని మెడకు చుట్టుకుంది మాకు ?చెలానూ , సోట్టా . చెలానూ సొట్టా చస్తున్నాం “అని వాపోయింది సరస్వతి
    “ఇప్పుడేం ముంచుకు పోయింది ? కారు అమ్మి పారే స్తాను అన్నాడు ప్రసాదరావు ఆవేశంగా .
    ” కొనేవాడు దొరకద్దూ? అందులోనూ ఈ ఆరునెలల్లో సొట్టలు పడ్డ ఇత్తడి బిందె లా తయారు చేసి పెట్టారు ” అంది సరస్వతి .
    “ప్రయత్నిస్తే దొరక్కపోడు అవసరం మనదీ . .ఎవడో ఒకడిని వెతికి కాస్త తక్కువకైనా వదిలించుకోండి . ఆ మధ్యన మా మూడో తోడల్లుడి రెండో బావమరిది అతని పేరు నారాయణ కారుతో వేగలేక ఎవడో బకరా గాడిని పట్టుకుని కారు అమ్మేశాడుట . ”
    అన్నాడు సూర్యం
    – పొత్తూరి విజయలక్ష్మి

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here