వేయి స్తంభాల గుడి సందర్శనం

0
16

[ఇటీవల వేయిస్తంభాల గుడిని సందర్శించి ఆ యాత్రానుభవాలను వివరిస్తున్నారు శ్రీమతి షామీర్ జానకీదేవి.]

[dropcap]ఈ[/dropcap] మధ్య ఒక వివాహానికి వరంగల్ వెళ్లాము. అంత దూరం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కొన్ని పర్యాటక ప్రదేశాలు చూడాలి అనుకుంటాము. అలా మేము చూసిన  చారిత్రాత్మక కట్టడం వేయి స్తంభాల గుడి. ఎన్నో సార్లు వరంగల్ వెళ్ళినా చూడటం కుదరలేదు. ఇంత కాలానికి ఆ కోరిక కార్యరూపం దాల్చింది.

1000 మంది వేద పండితులతో, వేయి స్తంభాల గుడి, వెయ్యి సంవత్సరాల క్రితం శివకేశవులకు భేదం లేదని తెలియజేసే విధంగా నిర్మించిన దేవాలయం. ఆ రోజుల్లో శివకేశవులకు భేదం ఉండకూడదని ఏ రకమైన విభేదం ఉండరాదని ఈ ఆలయం నిర్మించారు. శివుడు, విష్ణువు, సూర్య దేవుని ఆలయాలను కలిపి ఒకటే దేవాలయంగా నిర్మించారు.

తూర్పుకు అభిముఖంగా అద్భుతమైన వాస్తుకళతో వెలుగొందుతూ చూసేవారిని ఆశ్చర్యచకితులను చేస్తుంది.  ముగ్గురికి ఒకటే వాహనంగా ఇక్కడ నందీశ్వరుని ప్రతిష్ఠిచారు. నందీశ్వరుని విగ్రహం నల్లరాతితో  మలచబడినది.  కళ్యాణ మంటపానికి, ప్రధాన ఆలయానికి మధ్యలో ఠీవిగా దర్శనమిస్తుంది. విష్ణువాలయం ముందు నందిని ప్రతిష్ఠించడం ఇక్కడ ప్రత్యేకత.

12వ శతాబ్దంలో కాకతీయ రాజు రుద్ర దేవుడు, ఈ ఆలయాన్ని, చాళుక్యుల శైలిలో, నిర్మించాడు. ప్రధానంగా శివునికి అంకితం చేయబడిన ఈ ఆలయాన్ని శ్రీ రుద్రేశ్వరస్వామి దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో ముగ్గురు దేవతలు శివుడు, విష్ణువు మరియు సూర్యుడు పూజింపబడుతారు. అలా దానిని త్రికూటాలయం అంటారు. ఆనాటి రాజు పేరు మీదుగా ఇక్కడ ఆలయాన్ని రుద్రేశ్వరాలయంగా పేర్కొంటారు.

600 సంవత్సరాల తర్వాత ప్రతాపరుద్రుడు ఇక్కడ రాజుగా పరిపాలించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ మహమ్మద్ హిందూ మత ద్వేషి. ఆయన 3000 హిందూ దేవాలయాలను ధ్వంసం చేశాడు. సూర్యుడు, విష్ణువుల విగ్రహాలు పంచలోహాలు.  అవి చాలా విలువైనవి. కానీ ప్రస్తుతం ఆ దేవాలయాలు ఖాళీగా ఉన్నాయి.  నాట్య మండపంపై అష్టదిక్పాలకులను చెక్కారు.  ఇది చాలా అరుదుగా ఉంటుంది. ఇలా మనకు ఏ దేవాలయంలో కనిపించదు.

కాకతీయులు శివారాధకులు. ఆనాటి భయానక జీవనం వలన స్వేచ్ఛగా ఉండలేక పోయారట. అందుకని  వారు  సొరంగ మార్గం ద్వారా వచ్చి పూజలు చేసేవారట.  ఈశాన్య భాగంలో కోనేరు ఉంది.

మనం ఏ శివాలయంలో  లింగం చూసినా గుండ్రంగా ఉంటుంది.  కానీ ఇక్కడ లింగాకృతి బల్ల పరుపుగా ఉంటుంది. ఎదురుగా కళ్యాణ మండపం ఉంది. ఇక్కడ రామ చిలకలు వేదం చదివాయట. కాకతీయ రాజులు ప్రజల కోసం 1672 దేవాలయాలని నిర్మించినట్లుగా చరిత్ర తెలుపుతున్నది.

ఈ క్షేత్రానికి ఆంజనేయస్వామి క్షేత్ర పాలకుడిగా ఉంటాడు. ఇసుక, ఇటుక పొడి, కరక్కాయి, నల్ల బెల్లం, సున్నం ఐదు పంచమిళితాలతో  ఇక్కడ కట్టడం నిర్మించారు. ఎటువంటి సిమెంటుగానీ ఇనుముగానీ వాడలేదు.

ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ ఆలయం, ప్రస్తుతం దేవాదాయ శాఖ, పురావస్తు శాఖల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నది. రుద్రేశ్వరాలయం తెలంగాణ టూరిజం పర్యవేక్షణలో ఉంది. ఎంతో విలువైన సంపదను కాపాడుకోవటం మన బాధ్యత.

మన ప్రభుత్వం కొంత శ్రద్ధ తీసుకుని ఇక్కడ చుట్టూ బండలు  వేయించడం, నాచుతో నిండిన కోనేరు శుభ్రపరచడం వంటివి చేస్తే బాగుంటుందని అనిపించింది. వేల సంవత్సరాల సంపదను రాబోయే తరాల కోసం అందంగా తీర్చిదిద్ది ఒక అద్భుత పర్యాటక కేంద్రంగా మారిస్తే బాగుంటుంది. చాలా మంది పర్యాటకులు ఈ ప్రదేశాన్ని దర్శించడానికి వస్తున్నారు. పర్యాటక శాఖ అంత శ్రద్ధ తీసుకుంటున్నట్లుగా అనిపించలేదు‌. ఇటువంటి గొప్ప చారిత్రక కట్టడాలు వేరే రాష్ట్రాలలో వుంటే వారు ఎంత శ్రద్ధ తీసుకునేవారో. చరిత్రకు సంబంధించిన  పుస్తకాలు అందుబాటులో ఉండాలి. అందరూ గూగుల్ లో చదవలేరు  కదా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here