వేయిపడగలు ఎందుకు చదవాలి?

    1
    1

    [box type=’note’ fontsize=’16’] “ఈ నవల బాహిర రూపాన్ని బట్టి అదేమిటో గుర్తించటం సులభసాధ్యం కాలేదు. ఇది నవలే కాదన్న వాళ్ల దగ్గర నుంచి దీని కంటే గొప్ప నవల లేదనే దాకా, విమర్శకులు వైవిధ్యంతో ముక్తకంఠంతో గొంతెత్తి పలికారు” అని వివరిస్తున్నారు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యవేయిపడగలు ఎందుకు చదవాలి?” అనే ఈ వ్యాసంలో. [/box]

    [dropcap]వే[/dropcap]యిపడగలు 80 ఏళ్ల క్రితం రచింపబడినా, ఈనాటికీ బహుళంగా చదువబడుతూ చర్చింపబడుతున్నది. వ్యాఖ్యానింపబడుతున్నది. అనేక క్లిష్ట వివాదాలకు కారణమవుతున్నది. సజీవంగా, సాహిత్యరంగంలో నిలబడి ఉన్నది. ఇన్నేళ్లలో లక్ష పైగా ప్రతులు వెలువడటం, అవిచ్ఛిన్నంగా పాఠకులు ఆసక్తి చూపుతూ ఉండటం, మరే నవల విషయంలోనూ ఉన్నట్టుగా కనపడదు. ఈ నవల ఒక విస్తృతమైన మానుష ప్రపంచాన్ని ప్రకృతిని, చరాచర జగత్తును తనలో సంలీనం చేసుకున్నది. ఋతువులు తమ పరిక్రమణంలో వైషద్యాన్ని కథాగమనంలో భాగం పంచుకుంటూ ఒక మహాభారతం తప్ప భారతీయ ఇతిహాసంలో ఇంతగా అమితాఖ్యానక శాఖలు కలిగిన గ్రంథం మరొకటి కనిపించదు. నన్నయ్యభట్టు ధర్మతత్త్వజ్ఞులు అన్న పద్యంలో భారతాన్ని గూర్చిన విశ్వముఖీనమైన అంశాన్ని వెల్లడి చేసిన విధం దీనికీ అన్వయిస్తుంది… మహాభారతం జనమేజయుడి సభలో, తరువాత నైమిశారణ్యంలో ప్రపంచింపబడి విస్తృత రూపాన్ని పొందింది. మౌఖిక సంప్రదాయం నుంచి లేఖన సంప్రదాయంలోకి మారుతూ వచ్చింది. వేయి పడగలు కూడా రచయిత చెప్పినప్పుడు మౌఖిక మార్గంలో తరువాత నాలుగేళ్లకు ఆంధ్రపత్రికలో ధారావాహికగా వెలువడినప్పుడు లేఖన సంప్రదాయంలోకి పరిణమించింది. జాగ్రత్తగా పరిశీలిస్తే రచనలో మౌఖిక సంప్రదాయ లక్షణాలు, జానపద ముద్రణలు పురాగాథల అవశేషాలు ఎన్నో మనం గుర్తు పట్టవచ్చు. ఇతర నవలల కంటే ఈ నవలను ఈ ఎఱుకతో పరిశీలించాలి. ఒక ఏకవీర లాగా ఈ నవలను చూస్తే ఒక కాళిదాసు కావ్యాన్ని మహాభారతంతో పోల్చిచూసినట్టవుతుంది. మన విమర్శకులు చాలామంది ఇక్కడ సరైన పరిప్రేక్ష్య ధోరణిలో ఆలోచించక నిర్ణయాలు చేయటంలో పొరబడ్డారు. వేయిపడగలను విమర్శించిన సందర్భంలో తెలుగు విమర్శలో అధునిక ఇతిహాసం లేదా నవలేతిహాసం అన్న మాటలు పుట్టాయి. నవలను ఒక ప్రక్రియగానే కాకుండా నవలా ప్రపంచాన్ని అనేక ప్రక్రియల సమాహారంగా చూడవలసిన అవసరం 60, 70 లలో విమర్శకులు పుట్టించారు. నవలలలో కావ్యాలు, ఇతిహాసాలు, కథాగుచ్ఛాలు సంవాద వైఖరులు గల రచనలు, అత్మకథాత్మకాలు, శాస్త్ర గర్భితాలు, శిల్ప వైవిధ్య ప్రయోగాలు, చైతన్య స్రవంతి రూపాలు ఇలా అనేకమైన ప్రక్రియా వైవిధ్యం మనకు గోచరిస్తుంది. ఇది కాక కేవలం వస్తు దృష్టితో చూసినప్పుడు సంప్రదాయమనీ, స్త్రీవాదమనీ, మార్క్సిజమనీ, చరిత్రాత్మకమనీ, జాతీయమనీ, ఇలా అనేక ధోరణులు ఉన్నాయి. 60ల తరువాత వచ్చిన విమర్శలో వస్తునిష్ట ప్రధానంగా కనిపిస్తుంది. వస్తు చిత్రణ సహజ జీవన సంవేదనల డాక్యుమెంటరీస్ అని ఈ అంశాలు ఈ 20, 30 ఏళ్ల విమర్శలో ప్రాధాన్యం వహించాయి. సామాన్యంగా ఏ కళారూపమైనా పికాసో బొమ్మలాగా వాస్తవాన్ని స్వప్నరూపంలోకి, ప్రతీక రూపంలోకి పరివర్తింపజేస్తుంది. ఈ పరివర్తనాక్రమంలోనే కుమ్మరిపురుగు సీతాకోకచిలుక అవుతుంది. కుమ్మరిపురుగు వాస్తవం. సీతాకోకచిలుక కళాభివ్యక్తి. అవి మనస్సులో జరిగే పరివర్తనలో వస్తువు తన్నుతాను కళారూపంగా పరిణమించటానికి అతని అవచేతనం సమష్టి అవచేతనం ప్రాధాన్యం వహిస్తాయి. కేవలం జాగ్రదావస్థలో ఉన్నప్పుడు ఈ పరిణామం జరగదు. కవి రచనావేళ ఒకానొక వ్యక్తావ్యక్త స్థితిలో సంధి దశలో విశ్వచైతన్య గర్భం నుంచి ఎన్నుకున్న అంశాలు ప్రతీకలై బింబాలై ఉపమాది అలంకారాలై శిల్పమార్గాన పయనించి లౌకిక స్థితిని అలౌకిక స్థితిగా పరిణమింపజేస్తాయి. అందువల్లే రచయిత ఆ తాదాత్మస్థితిలో నుంచే ‘వేయిపడగల పాము విప్పారుకొని వచ్చి కాటందుకున్నదీ కలలోన రాజునూ’ అని ప్రారంభిస్తాడు. ఈ గీత ప్రారంభం అవచేతనలోంచి వెలువడిందే. ఈ అవచేతనలోంచి వెలువడిన గీతం ప్రవహిస్తూ, ప్రవహిస్తూ సాగిపోయి కథానాయకుడు అన్నీ కోల్పోయిన స్థితిలో పోలిక సరిపోదు కానీ, స్వర్గారోహణ పర్వంలో ధర్మరాజులాగా మిగిలిపోయి ‘నీవు మిగిలితివి, నా జాతి శక్తివి’ అనడంతో పూర్తవుతుంది. కథాకథన దశలో ఈ మొత్తం నవలలోనూ రచయిత ఒక పారవశ్య దశలో ఉంటాడు. ఈ పారవశ్యంలోంచి అప్పుడప్పుడూ జాగ్రద్దశలోకి వచ్చినట్లు కనిపించినా మళ్లీ పారవశ్యస్థితికి, స్వప్నస్థితికీ తిరిగి ప్రయాణం చేస్తుంటాడు. ఈ భూమిక మీద ఈ నవలలో రచయిత సూత్రధారుడవుతాడు, కథానాయకుడవుతాడు.. కథ చెప్పుతూ చెప్పుతూ తన ఆత్మకథలోకి వెళ్లిపోతాడు. ఆత్మకథలోనుంచి సాగి, జగత్కథను ఇహపర లోకాల అనుబంధాన్ని వాడి అవినాభావ స్థితినీ వ్యాఖ్యానిస్తాడు. ప్రాయిడ్ మనస్తత్వ శాస్త్రాన్ని బట్టి సర్పము దమితమైన వాంఛలకు ప్రతీక. భారతీయ యోగ శాస్త్రంలో సర్పము ఈశ్వరాభిముఖ చైతన్య క్రమణానికి ప్రతీక. ఈ నవలలో ఈ రెండు అంశాలు కలిసిపోయినట్లు గోచరిస్తుంది. మరొక అంశం పసరిక వృత్తాంతం. పసరిక పామే. పసరిక వ్యవసాయానికి పంటలకు పృథ్విలోని జీవపోషక లక్షణానికి ప్రాతినిథ్యం వహిస్తుంది. మన సమాజ జీవనం మీద గ్రామీణ వ్యవస్థమీద, గ్రామ స్వరాజ్యస్థితి మీద, నాగరిక సమాజం పరాయి పరిపాలన దాడి చేసిన సందర్భంలో పసరిక మరణించే పరిస్థితి వచ్చింది. దాడి జరిగింది. ఈ దాడి దేశం యొక్క సహజమైన ఉనికిని ప్రశ్నార్థకం చేసింది. ఈ ప్రశ్న పందొమ్మిదో శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభంలో వచ్చింది. ఆరోజుల్లో లాలా లజపతిరాయ్, రమేశ్చంద్రదత్, బాలగంగాధర్ తిలక్, మహాత్మాగాంధీ ఈ నలుగురూ గ్రామ శైథిల్యం వల్ల నలుడు బాహుకుడైనట్టు భారతదేశం మారిపోవడాన్ని ప్రశ్నించారు. గాంధీజీ గ్రామస్వరాజ్ భావాన్ని ఈ సందర్బంలో పుట్టిందే. ఈ గ్రామశైథిల్యం వెనుక వృత్తులు పోయినవి. బ్రతుకుతెరువు పోయింది. వాణిజ్యపంటలు పెరిగినవి. మెట్టపొలాలు పోయినవి. ప్రజలు మూలాల నుంచి పెటీకివేయబడి, అప్పుడే ఏర్పడుతున్న నగరాల్లోకి పొట్ట చేత పట్టుకుని విసిరివేయబడ్డారు. ఈ మూలచ్చేదనలో గ్రామ పరిపాలన అక్కడి నుంచి మహానగరాలకు ఎగిరిపోయింది. గ్రామపరిపాలకుడు నిస్తేజుడు కాగా, రెండవ జమీందారు చెన్నై నుంచి పరిపాలన సాగించడం.. పరిపాలన పరాయీకరణకు ప్రకటరూపమైంది. డబ్బు గ్రామం నుంచి మహానగరం నుంచి ఇంగ్లండు దాకా ప్రవహించటం ప్రారంభమైంది. మొదటి జమీందారు కాలంలో జమీందారు గ్రామ చైతన్యానికి ప్రతీకగా మమైక్యమై పాలనంతా గ్రామ స్వాయత్తత కేంద్రంగా నిర్వహించగా, రెండవ జమీందారు దాన్ని విచ్ఛేదం చేశాడు. గ్రామస్వాయత్తతకు ప్రతీకయైన ప్రభువు గ్రామానికి ఆత్మ, అతడు చేసిన మేలును గూర్చి చెప్పితే తెలుగు విమర్శకులు జమీందారీ దోపిడీ వ్యవస్థను సమర్థించడంగా విశ్లేషించారు.

    వేయిపడగలు ఇతిహాసం తాళం తెరిచేందుకు ముఖ్యంగా కావలసింది జానపదగాధా విజ్ఞానం. జానపద కథల్లో స్థావర, జంగమ, జలచర, భూచర, గగన చర, భౌమ, దివ్య, జీవిత, ప్రేత ఇత్యాది అనేక ప్రాణ ప్రకటనలు (లైఫ్ మానిఫెస్టేషన్) కలిసి ఉంటాయి. వీటిలో నదులూ, పర్వతాలూ భాగమే అవుతాయి. అందువల్ల ఈ నవలలో అరుంధతికీ, సుబ్రహ్మణ్యస్వామి దర్శనమిచ్చినా, వృషన్నిధి అదివటముల వృత్తాంతమైనా, గిరిక చరిత్రలోని కొన్ని సన్నివేశాలైనా, ఒక అలౌకిక స్పర్శను కలిగి ఉంటాయి. భౌతిక వాస్తవిక ధోరణితో చూస్తే ఇది వ్యాఖ్యాన గమ్యం కాకుండాపోదు. ఈ జానపద గాథా ప్రవృత్తిని ప్రవేశపెట్టడంతో ఈ ఇతిహాసం భూమ్యాకాశాల మధ్య సేతువుగా నిలువబడ్డది. ఒక గణాచారి పాత్ర నిర్మాణంలో విశ్వజీవనంలోని భూతభవిష్యదంశాలు మన చుట్టూ ఉన్న అంతరిక్షంలో వ్యాపించి ఉన్న ప్రాచీన విశ్వాసాలను ప్రతిఫలింపజేస్తాయి.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here